Showing posts with label God. Show all posts
Showing posts with label God. Show all posts

Wednesday, 6 February 2019

దేవుడు ఎందుకు కనబడటం లేదు?


దేవుడు ఎందుకు కనబడటం లేదు?

శ్రీకాంతుడు పదకొండు ఏండ్ల పిల్లవాడు. ఆరవతరగతి చదువుతున్నాడు. బడికి సంక్రాంతి సెలవులు ఇస్తే స్వగ్రామానికి వెళ్ళాడు. రెండు మూడు రోజుల పాటు తన తోటి పిల్లలతో కలసి గ్రామం చుట్టుపక్కల ఉండే కొండలు, కోనలు, తోటలు తిరిగాడు. పండుగ మూడు రోజులు ఎంతో హాయిగా సంతోషంగా హుషారుగా గడిపేశాడు. సెలవులు మరికొద్ది రోజులు ఉన్నాయి. అపుడు కుటుంబం అంతా కొంత దూరంలో ఉన్న తమ ఇలవేల్పు గుడికి ఎద్దులబండిలో వెడదామని అనుకున్నారు.

కాని, శ్రీకాంతుడు మాత్రం “నేను రాను” అన్నాడు.

“ఎందుకు?” అని అడిగితే, ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం అందరినీ నిర్ఘాంతపరచింది.

“నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడు లేడు”

శ్రీకాంతుడి తాతగారు నవ్వేశారు. “సరే, ముందు మీరు వెళ్లండి! మేము నెమ్మదిగా నడుచుకుని వస్తాము” అని మిగిలిన అందరినీ పంపేశారు.

“రారా కాంతూ, మనం కూడా నెమ్మదిగా నడుచుకుంటూ పోదాం అక్కడికి” అన్నారు.

కాని, మళ్లీ అదే సమాధానం చెప్పాడు శ్రీకాంతుడు.

“సరే, అడవిలో ఏటి ఒడ్డున ఆ గుడి ఉంది. హాయిగా ఇసుకలో ఆడుకోవచ్చు కదా! అందుకైనా పోదాం పద” అన్నారు తాతగారు.

మొత్తానికి తాతామనుమళ్లు నడుచుకుంటూ బయలుదేరారు.

“దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నావు కాంతూ?” అని అడిగారు తాతగారు.

పిల్లవాడు వెంటనే బదులు చెప్పాడు – “ఉంటే కనబడాలి కదా, అదిగో – ఆ రాయిలాగా, ఆ చెట్టు లాగా, ఆ కొండలాగా? అవి ఉన్నాయి కాబట్టి కనబడుతున్నాయి. దేవుడు లేడు కాబట్టి కనబడటం లేదు” అనేశాడు.

“ఏదైనా కనబడకుంటే లేనట్టేనా? నీకు ఇపుడు అమ్మా నాన్నా కనబడటం లేదు, మనకంటే ముందే బండిలో వెళ్లిపోయారు. దూరంగా ఉండటం వలన కనబడటం లేదు. అందువల్ల వారు లేరంటావా మరి?”

“వారిని ఇప్పుడు చూడలేకపోతున్నా. కాని, రోజూ చూస్తూనే ఉన్నాను కదా?”

“ఎవరెస్టు శిఖరాన్ని ఒక్కసారి కూడా నువు చూడలేదు కదా? మరి అది కూడా లేదంటావా?”

“నేను చూడలేదు, నిజమే, కాని, దానిని చూసినవారు, ఫోటోలతో సహా అందరికీ చూపించారు కదా?”

తాత నవ్వాడు. “కాంతూ, నువు మీ నాన్నను చూశావు. మీ నాన్నకు నాన్న అయిన నన్ను చూస్తున్నావు. కాని, నాకు నాన్న అయిన మీ ముత్తాతను చూశావా? లేదు కదా? మరి ఆయన కూడా లేరు అనగలవా?”

“ముత్తాత కాలంలో ముత్తాత ఉన్నాడు తాతగారూ, నేను కాదనటం లేదు. కాని, ఇప్పుడు లేడు కాబట్టి, కనబడటం లేదు. కాని, దేవుడు అలా కాదు కదా, ఆయన అంతటా ఉన్నాడు అంటారు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు అంటారు. మరి కనబడాలి కదా?”

తన మనుమడు తాను ఊహించిన దానికన్నా తెలివైనవాడు అని తాతగారికి అర్థమైంది. ఆయనకు సంతోషం కూడా కలిగింది. చిన్నతనంలోనే దేవుడి అస్తిత్వాన్ని గూర్చి తర్కంతో కూడిన ఆలోచన చేస్తున్నాడు. సరైన మార్గదర్శనం చేసేవారు ఉంటే ఇటువంటివారు భారతీయతను, సంస్కృతిని తరతరాలుగా చాటగలరు, నిలబెట్టగలరు.

“నాయనా, ఉన్న వస్తువు కూడా కనబడకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. మన పెద్దవాళ్లు చెప్పారు. వింటావా మరి?”

“సరే తాతగారూ!”

“అతిదూరాత్ సామీప్యాత్
ఇంద్రియఘాతాత్ మనోऽనవస్థాత్।
సౌక్ష్మ్యాత్ వ్యవధానాభిభవాత్
సమానాభిహారాచ్చ।।”

“అంటే ఏమిటి తాతగారూ?”

“అదేమంటే, కంటికి బాగా దూరంగా ఉండటం వల్ల, ఉన్న వస్తువు కూడా మనకు కనిపించదు. మన వూరికి తిరుపతి దూరంగా ఉన్నది కదా, అందువల్ల కనిపించదు. అలాగే, కంటికి మరీ దగ్గరగా ఉన్న వస్తువు కూడా కనిపించదు. నీ ముఖం నీకే కనబడదు, అద్దంలో చూసుకుంటే తప్ప! అవునా?”

“అవును తాతగారూ!”

“అలాగే, కంటికి ఏదైనా దెబ్బ తగిలినపుడు, కంటి రోగం ఉన్నపుడు కూడా, ఉన్న వస్తువు కనిపించదు. చూడు, మీ అవ్వ కండ్లద్దాలు పెట్టుకుంటే తప్ప పుస్తకం చదవలేదు.”

“అవును తాతగారూ!”

“సరే, మనం ఇప్పటికి చెరువు కట్ట మీద ఇంత దూరం నడుచుకుని చివరకు వచ్చేశాము కదా, కట్టకు ఇటువైపున వేప చెట్లు, చింత చెట్లు బోలెడు ఉన్నాయి కదా? ఏవి ఎన్ని ఉన్నాయో చెప్పగలవా?”

“చెప్పలేను తాతగారూ!”

“అంటే, నువు వాటిని చూడలేదా?”

“చూశాను తాతగారూ!”

“మరి ఎందుకు చెప్పలేవు?”

“ఎందుకంటే, నేను వాటిని చూస్తూనే ఉన్నప్పటికీ, మీ మాటలను శ్రద్ధగా వింటున్నాను తప్ప, అవి ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనే శ్రద్ధ నాకు కలగలేదు కాబట్టి”

“అవును కదా? అలాగే, దేవుడు ఉన్నప్పటికీ, మనకు శ్రద్ధాసక్తులు లేకుంటే మనం ఆ దేవుని నిజస్వరూపాన్ని గ్రహించలేము. ఒప్పుకుంటావా?”

శ్రీకాంతుడు కాసేపు ఆలోచించాడు. “మీరు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది తాతగారూ!”

తాతగారు నవ్వారు. “ఇంకా చెబుతాను చూడు. ఒక వస్తువు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా ఉంటే చూడలేము. నువ్వు సైన్సు విద్యార్థివే కదా, మన చుట్టూ ఉన్న వాతావరణంలో సూక్ష్మజీవులు ఉన్నాయి అని తెలిసినవాడివే కదా, మనకు అవి కనబడటం లేదు కదా?”

“నిజమే తాతగారూ, అవి మన కంటికి కనబడనంత చిన్నవి కాబట్టి కనబడటం లేదు.”

“కాంతూ, మన శరీరంలో గుండె ఉంది కదా? అది నీకు కనబడుతుందా?”

“కనబడటం లేదు తాతగారూ!”

“ఎందువల్ల కనబడటం లేదు?”

“చర్మం వెనుక ఉంది కదా, అందువల్ల కనబడటం లేదు.”

“అంటే, ఏదైనా అడ్డం ఉంటే కనబడదు. కదా?”

“అవును!”

“నక్షత్రాలు ఉన్నాయి కదా?”

“ఉన్నాయి.”

“మరి, అవి ఇప్పుడు ఎందుకు కనబడటం లేదు?”

“పగలు కాబట్టి.”

“అదేమిటి? రాత్రి పూట కంటే, పగటి పూట మనం మరింత బాగా చూడగలం కదా?”

“అంటే, సూర్యుడు నక్షత్రాలకంటే ఎక్కువ కాంతితో ప్రకాశిస్తాడు. అందువల్ల, ఆయన కాంతి ముందు ఇంకేవీ కనబడవు.”

“పోనీ, సూర్యుణ్ణి అయినా నేరుగా చూడగలవా?”

“ఎలా సాధ్యం? అంత కాంతిని చూస్తే మన కళ్లు తట్టుకోలేవు!”

“కాంతూ! నువ్వెప్పుడైనా గురివింద గింజలను చూశావా?”

“చూశాను తాతగారూ!”

“ఇదుగో! ఈ చెట్టుకు కాశాయి చూడు!” అంటూ తాతగారు, దారిలో ఒక పొదలో ఉన్న గురువింద చెట్టుకు ఉన్న కొన్ని కాయలను కోసి దానిలోనుండి ఎరుపు నలుపు రంగులలో ఉన్న గురివింద గింజలను అరచేతిలో పెట్టుకున్నాడు.

“కాంతూ, ఇందులో ఒక గింజను తీసుకో!”

శ్రీకాంతుడు ఒకదానిని తీసుకున్నాడు. “ఎంత నునుపుగా ఉందో!” అన్నాడు.

“సరే, చూశావుగా! ఇక ఆ గింజను మళ్లీ నా అరచేతిలో పెట్టు!”

శ్రీకాంతుడు అలాగే చేశాడు. తాతగారు తన రెండు అరచేతులనూ దగ్గరగా చేర్చి లోపల ఉన్న గింజలను కాసేపు అల్లాడించి మళ్లీ తెరిచి ఆ గింజలను చూపించాడు.

“ఏదీ? నువ్వు ఇంతకు ముందు ఒక గింజను చేతిలో పట్టుకుని చూశావే? మళ్లీ అదే గింజను బయటకు తీసి చూపించు?” అని అడిగాడు.

శ్రీకాంతుడు ఆశ్చర్యపోయాడు. “అదెలా సాధ్యం తాతగారూ? అన్నీ ఒకేవిధంగా ఉన్నాయి కదా? ‘నేను చేతిలోకి తీసుకుని చూసింది ఇదే’ అని ఎలా గుర్తు పట్టగలను?” అని అడిగాడు.

తాతగారు నవ్వారు. “చూశావా నాయనా! మన కండ్లు ఎంతో గొప్పవి అనుకుంటాం. కాని, వీటికి ఎన్నెన్ని పరిమితులు అంటే లిమిటేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకున్నావా? అందువల్ల ఇటువంటి అల్పమైన శక్తి కలిగిన కండ్లతో అపరిమితమైన శక్తి కలిగిన దేవుడిని చూడడం సాధ్యమా?” అని అడిగాడు.

శ్రీకాంతుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత, “తాతగారూ, మీరు ఇపుడు చెప్పింది అంతా బాగా అర్థమైంది” అని చెప్పాడు చిరునవ్వులు చిందిస్తూ.

గుడికి వచ్చి, శ్రద్ధగా పూజలో పాల్గొంటున్న శ్రీకాంతుడిని చూసి, “నడచి వచ్చేటపుడు తాతగారు ఏమి మంత్రం వేశారో” అని అందరూ ఆశ్చర్యపడినప్పటికీ, చాల సంతోషపడ్డారు.
***



యథార్థభారతి (జనవరి, 2019) సంచికలో ప్రచురింపబడిన నా కథ.

Sunday, 2 September 2018

హే కృష్ణా! గోవులకు మాత్రమే శుభమస్తా? గేదెలకు వద్దా? (1)



“కృష్ణం వందే జగద్గురుమ్”

“.....”

“వందే వాసుదేవం శ్రీహరిమ్”

“.....”

“స్వామిన్”

“ఆ?”

“స్వామిన్!  నమో నమః. పరధ్యానంలో ఉన్నట్టున్నారు?”

{అందమైన చిరునవ్వు} “నాకు పరధ్యానం ఆత్మధ్యానం అంటూ రెండు లేవు.” 

“అవును స్వామిన్!  మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ (7.7)  – అని మీరే సెలవిచ్చారు.”

“సరే!  ఏమిటి విశేషం?”

“మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదామని వచ్చాను స్వామిన్!”

{మళ్లీ చిరునవ్వు}

“క్షమించండి స్వామిన్!”

 “దేనికి?”

“మీరు అనాదిమధ్యాంతులు (11.19) సనాతనులు (11.18) అని తెలిసి కూడా మీకు పుట్టినరోజు అంటూ శుభాకాంక్షలు చెప్పబోయాను కదా, అందుకు!”

{మళ్లీ చిరునవ్వు}

“అర్థమైంది స్వామిన్!  మాకు ఇలా కాస్త తెలివిని కలుగజేసేదీ మీరే, మళ్లీ మమ్మల్ని మోహంలో ముంచేది కూడా మీరే కదా!  మీరేగా ‘మమ మాయా దురత్యయా’ (7.14) అని సెలవిచ్చింది?

“నేను అందుకే నవ్వానంటావా?  అన్నీ నీకు నువ్వే అనేసుకుంటున్నావు గదా?”

“మరెందుకు నవ్వినట్టు స్వామీ?”

“గత సంవత్సరం కృష్ణాష్టమి నాడు తలచుకున్నావు.  మళ్లీ ఈ సంవత్సరం కృష్ణాష్టమి నాటికి గాని మళ్లీ నేను నీకు గుర్తుకు రాలేదు చూడు?  అందుకు నవ్వాను!”

“.....”

“సరేలే!  ముఖమెందుకు ముడుచుకుంటావ్?  నేను నవ్వానే గాని తిట్టలేదుగా?”

“వెక్కిరింతగా నవ్వారు! అంతేగా స్వామిన్?”

“అవును!  సరే, వెక్కిరింపు వద్దు, మెచ్చుకోమంటావా చెప్పు?”

“మీ ఇష్టం స్వామిన్!  మీరు నన్ను ఏమి చేసినా నాకు ఇష్టమే!”

{మళ్లీ చిరునవ్వు}

“స్వామిన్!  మీ భక్తులు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు.  మీరే ఎలాగైనా కాపాడాలి అని అడిగేందుకు వచ్చాను”.

“నా భక్తులా?”

“మీరే స్వయంగా చెప్పారు కదా స్వామిన్? –నా భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు –‘ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ’ (7.16) అని?  పైగా, ప్రపంచంలో ఎవరెవరు ఎవరెవరిని ఏయే పద్ధతులలో ఆరాధించినా, వారికి ఆయా పద్ధతులలో శ్రద్ధను కలిగించేది నేనే అని కూడా చెప్పారుగా? (7.21) పైగా ‘సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి’ – ఏ దేవుడికి నమస్కారం చేసినా అది తిరిగి తిరిగి మీకే కదా చెందేది?  అందుకే, ఈ సృష్టిలో ఎక్కడ ఎటువంటి ఆరాధన జరిగినా, అది మీకే జరిగినట్టు.  అందువల్ల, వారికీ వీరికీ ఎందుకు, ఏకంగా మీకే ఫిర్యాదు చేద్దామని వచ్చాను”.

“సరే అయితే!  ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా భక్తులే కాబట్టి, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా నన్నే బాధ్యత వహించమంటావ్!  అలాగే కానీ, నీ ఫిర్యాదు ఏమిటో చెప్పు!”

“స్వామీ, ప్రపంచం నాశనం అయిపోతోంది!  కొండలను తవ్వేస్తున్నారు!  అడవులను నరికేస్తున్నారు!  నదులను మురికినీటిప్రవాహలుగా మార్చేస్తున్నారు!  భూగర్భాలను దోచేస్తున్నారు!  పీల్చే గాలిని కూడా విషమయంగా చేస్తున్నారు!”

“.....”

“మౌనంగా ఉన్నారేమి స్వామిన్?”

“నువ్వు ఇంకా ఏమైనా చెబుతావేమోనని!”

“ముందు ఈ అకృత్యాలను ఎలా ఆపాలో చెప్పండి స్వామిన్!”

“నాయనా!  నాలుగురకాల భక్తులలో ‘అర్థార్థీ’ అన్నావే – అలాంటివారు – కేవలం ధనం మాత్రమే కోరే భక్తులు చేస్తున్న పనులు ఇవి.  వారికి ప్రపంచశ్రేయస్సు పట్టదు.  నిజం చెప్పాలంటే ప్రపంచశ్రేయస్సు అంటే ఏమిటో వారికి తెలియదు.  తాము కూడా ప్రపంచంలో ఒక భాగమని, తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నామని  తెలుసుకోలేని అజ్ఞానులు వారు. 
‘నష్టాత్మనోల్పబుద్ధయః...
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోహితాః।।’ (16.9)  -
‘నాస్తికులు, అల్పబుద్ధులు, ఉగ్రవాదులు, క్రూరమైన పనులతో అందరికీ అపకారం చేసేవారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉద్భవిస్తారు’ అని ఎప్పుడో చెప్పాను కదా.  వారే వీరు.

“అయ్యో!  మీ భక్తులను మీరే తిడుతున్నారుగా స్వామిన్!  అసలు మీ భక్తులు నాస్తికులు ఎలా అవుతారు?”

“నువ్వు కూడా మనిషివేగా?  ఉన్నది ఉన్నట్టు చెబితే అది తిట్టు అనుకునే స్వభావం కలవాడివి.  నువ్వు చెప్పిన పద్ధతుల్లో ప్రపంచవినాశనానికి కారణం అవుతున్నవాళ్ల లక్షణాలు ఇవి అని అర్జునుడికి ఎప్పుడో చెప్పాను.  మీ మనుషులకోసం మళ్ళీ చెబుతున్నా విను!

“కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః
మోహాద్ గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతేశుచివ్రతాః।। (16.10)

[వారిలో కొందరుదంభము (hypocrisy) దురభిమానము, మదము కలిగి, ఎన్నటికీ సంతృప్తి చెందని కోరికలు కలిగి, అజ్ఞానం కొద్దీ కొన్ని మిథ్యాసిద్ధాంతాలను ప్రవచిస్తూ, ప్రపంచశ్రేయస్సు మా సిద్ధాంతాలవల్లనే, మా పనులవల్లనే కలుగుతుంది అనే భ్రమలో ప్రవర్తిస్తూ ఉంటారు.]

ఆశాపాశశతైర్బద్దాః కామక్రోధపరాయణాః
ఈహన్తే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ (16.12)

[వారిలో మరికొందరువందలాది ఆశాపాశాలతో బంధింపబడి ఉంటారు.  కోరికలు, కోపము వారిని పట్టి వదలవు.  వారి భోగభాగ్యాలకోసం నువ్వు చెప్పిన అనేక పద్ధతులలో అన్యాయంగా ధనార్జనకు పాల్పడుతూ ఉంటారు.]

ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః।। (16.15)

[మరి కొందరు నేను ధనవంతుడను, నేను గొప్పజాతిలో  పుట్టినవాడను, నాకు సాటి ఇంకెవరూ లేరు,  నేను మహాత్కార్యాలను చేస్తున్నాను, ఎందరికో బ్రతుకుతెరువును ఇస్తున్నాను, అందువలన నేను కూడా సుఖపడతాను అంటూ అజ్ఞానమోహాంధకారంలో పడి కొట్టుకుంటున్నారు.]”

“స్వామీ!  ఆగ్రహించకండి,  అనుగ్రహించండి.  మీకు ఇంతటి కోపం తగదు.”

“నాయనా!  నాకు ఎవరిమీదా కోపం లేదు.  న మే ద్వేష్యోస్తి కశ్చన (9.29)  ముందే చెప్పాను కదా, నువ్వు మానవమాత్రుడివి కాబట్టి, నేను నిజం చెబితే నేను ఎవరినో తిడుతున్నట్టు, నేను ఎవరిమీదనో కోప్పడుతున్నట్టు నీకు అనిపిస్తుంది అంతే.”

“ధన్యులం స్వామిన్!  అయినా ఇలాంటి వినాశకరమైన దుర్మార్గపు పనులు చేసేవారు మీ భక్తులు ఎలా అవుతారు?”

“నాయనా, నా భక్తులు మరో విధంగా మూడు రకాలు.  సాత్త్వికులు, రాజసికులు, తామసికులు.  ఎవరి బ్రతుకువల్ల మిగిలిన ఏ ప్రాణులకూ హాని కలుగదో, ఎవరివల్ల అందరికీ సుఖం కలుగుతుందో - వారు సాత్త్వికులు.

ఎవరు ఉత్సాహంగా పని చేస్తూ అందరినుండి సత్కారాన్ని,గౌరవాన్ని ఆశిస్తూ ఉంటారో వారు రాజసికులు.  

ఎవరి పనుల వలన పర్యావరణానికి, తద్వారా ఇతరప్రాణులకు హాని కలుగుతుందో వారు తామసికులు.  వీరందరూ కూడా నా భక్తులే.”

“మిమ్మల్ని తిట్టేవారు కూడా మీ భక్తులు ఎలా అవుతారు స్వామిన్?”

“నాస్తికులు అనేవారు అసలు ఎక్కడైనా ఉన్నారంటావా?  ప్రతి ఒక్కరికీ నేను అనే భావన ఉంది.  ఆ నేనులో నేను ఉన్నాను కదా?”

“స్వామీ!  'త్వమేవాహం' అంటున్నారా?”

“ఆ ‘నేను’ అనే పదార్థాన్ని సరైన విధంగా అర్థం చేసుకున్నవారికి 'త్వమేవాహం' అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఉంటుందా?  కాబట్టి, నన్ను పొగిడేవారందరూ ఆస్తికోత్తములూ కారు, నేను అర్థం కానివారందరూ నాస్తికాధములూ కారు.  ఏమయ్యా, హిరణ్యాక్షహిరణ్యకశిపులు, రావణకుంభకర్ణులు మాత్రం నన్ను తిట్టలేదా?  అయినా వారిని నేను అనుగ్రహించలేదా?  దానిని వైరభక్తి అంటారు.”

“మీ అనుగ్రహం అపారమైనది స్వామిన్!”

{చిరునవ్వు}

“స్వామిన్!  మీ తామసభక్తులు చేస్తున్న వినాశకరమైన పనులతో ప్రపంచం అంతమైపోయేట్టు ఉన్నది స్వామిన్!  మీరు పూనుకుని రక్షించాలి.”

“నేను రక్షించాలా?  ఏమయ్యా?  మీ మనుషులేమైనా పశువులా?  నేను ఇపుడు కర్ర చేతబుచ్చుకుని పశుపాలకుడిలా మీకోసం రావాలంటావా?”

“అర్థమైంది స్వామిన్!”

“ఏమిటర్థమైంది?”

“న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్
యం తు రక్షితుమిచ్ఛంతి బుద్ధ్యా సంయోజయంతి తమ్।।

“అంటే అర్థమేమిటి?”

“కర్ర పట్టుకుని పశువులను కాపాడినట్టు కాపాడడానికి దేవతలు ప్రతిసారీ రానక్కరలేదు, వారు ఎవరిని కాపాడదామని అనుకుంటారో వారికి బుద్ధిని ప్రసాదిస్తారు అని అర్థం.”  ''అందరికీ అటువంటి మంచి బుద్ధిని ప్రసాదించండి స్వామిన్!”

“ఇచ్చాను గదయ్యా!  చాల కాలం క్రితమే మంచి బుద్ధిని అందరికీ ప్రసాదించాను.  కాని, దానిని ఇపుడు అందరూ అపార్థం చేసుకుంటున్నారు.”

“ఏమిటి ఆ బుద్ధి స్వామీ?”

“గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యమ్.”

“.....”

“ఏమి నాయనా ముఖం విచిత్రంగా పెట్టావు?”

“అది కాదు స్వామిన్, గోవులు బ్రాహ్మణులకు మాత్రం శుభం కలిగితే చాలా? గేదెలకు మేకలకు శుభం వద్దా?  క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా మిగిలినవారికి శుభం కలుగవద్దా?  చాల అన్యాయం స్వామిన్!”

(ఈ విషయమై స్వామివారికి నాకు జరిగిన సంవాదం రెండవభాగంలో వివరిస్తాను)

Saturday, 28 July 2018

శ్రీకృష్ణుడితో ఇంటర్వ్యూ - 2

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((రెండవ భాగం))

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
ఎందుకు ఉండదూ? ఎలాగో కష్టపడి యుద్ధాన్నంతా ఓ కొలిక్కి తెచ్చామా? దాదాపు దుర్యోధనుడొక్కడే మిగిలిపోయాడు. మడుగులో దాక్కున్నాడు. అతడిని యుక్తిగా ఏదో ఒక రకంగా బయటకు రప్పించాము. ఈలోగా ధర్మరాజు - "ఓయ్ దుర్యోధనా! మా పాండవులు ఐదుగురిలో ఎవరో ఒకరిని ఎంచుకో. వారితో నీకు నచ్చిన ఆయుధంతో యుద్ధం చేసి గెలు చూద్దాం. ఏ ఒక్కర్ని గెలిచినా మొత్తం రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తాను" అనేశాడు. అపుడు నాకు ఎంత కోపం వచ్చిందో!

ప్రశ్న 14
అయినా, దుర్యోధనుడు మంచివాడు, నిజాయితీపరుడు కదా! అందుకే ఏ సహదేవుడినో ఎంచుకుని ఓడించకుండా తనకు తగిన జోడీ అని భీముడిని ఎంచుకున్నాడు! లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది?

కృష్ణుడు:
దుర్యోధనుడికి నిజాయితీనా? ఆ మాత్రం నిజాయితీ ఉంటే పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన వెంటనే వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి ఉండాల్సింది.

సరే, ప్రస్తుతానికి వస్తే, ధర్మరాజు సవాలును స్వీకరించి మీరన్నట్టు ఏ సహదేవుడినో ఎంచుకొని గదతో పడగొట్టి రాజ్యాన్ని సంపాదించేవాడే. కానీ, అతడు అలా చేయకపోవడానికి కారణం నిజాయితీ కాదు, మంచితనం కూడా కాదు, అలా చేస్తే అతడి పిరికితనానికి, కక్కుర్తితనానికి జనాలు నవ్వుకొనేవారు. వెక్కిరించేవారు. అభిమానధనుడని పేరుపొందిన దుర్యోధనుడికి అటువంటి అవహేళన చావుకంటే దుర్భరం. జనాల మాటలు వినలేక గుండెలు పగిలి చచ్చుండేవాడు.

అలాగని అతడు భీముడిని కూడా తన ప్రత్యర్థిగా ఎంచుకోలేదు. "మీలోనే ఎవరైనా రండి, మీలోనే ఎవరైనా రండి, మట్టి కరిపించేస్తా, సవాల్!" అంటూ ప్రగల్భాలు పలికాడు. ఆ మాటల్లో ఏ నకులుడో సహదేవుడో రాకపోతారా అనే ఆశ కూడా ఉంది. వారంతట వారే వచ్చి తన చేతిలో చస్తే అది తన తప్పుగా ఎవరూ భావించలేరు కదా? తనకు అటు రాజ్యమూ వస్తుంది, ఇటు అవహేళన చేసేవారు కూడా ఎవరూ ఉండరు అనే దురాశ అతడిది. కానీ పాపం, అతడి ఆశ చెల్లలేదు. అతడు చేసిన సవాలును భీముడే స్వీకరించి ముందుకొచ్చి అతడిని మట్టికరిపించాడు.

ప్రశ్న 15
అసలు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మీరే అని చాలమంది అంటారు?

కృష్ణుడు:
దుర్యోధనుడు భీముడికి విషం పెట్టినపుడు, ఆ భీముడికి కాళ్ళు చేతులు కట్టేసి నీటిలోని తోసి చంపదలచినపుడు నేను చాల చిన్నపిల్లవాడిని.

అప్పటికి నేను ఇంకా యశోదానందుల బిడ్డడిననే అనుకుంటూ ఉన్నాను. అప్పటికి కుంతి మా అత్త అని తెలియదు. పాండవులు మా బావలు అని తెలియదు. మధురానగరిలో రాజకీయాలు కూడా తెలియవు, కంసుడు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా తెలియదు. ఏదో అమాయికంగా ఆవులు కాచుకుంటూ, మిగిలిన పిల్లలతో ఆడుకుంటూ, మా జోలికి వచ్చిన చిన్న చిన్న పాములను కాలితో తొక్కేసి తరిమేస్తూ - ఇలా బయటి ప్రపంచం తెలియకుండా కాలం గడిపేవాడిని. అలాంటి నేను ఆ సమయంలో హస్తినాపురానికి వచ్చి భీముడికి విషం పెట్టమని దుర్యోధనుడికి చెప్పానా?

ఏమయ్యా, ఇది శకునిని అడగవలసిన ప్రశ్న కదా, నన్ను అడుగుతున్నారేమిటి?

ప్రశ్న 16
అలా కాదు, మీరు తలచుకుని ఉంటే అసలు యుద్ధానికి కారణమైన జూదమే జరగకుండా ఆపగలిగి ఉండేవారు కదా?

కృష్ణుడు:
ఆ సమయంలో మా యాదవులమీద కక్షగట్టిన సాళ్వరాజు, సౌభరి అనే విమానాన్ని ఎక్కి వచ్చి ద్వారకమీద దాడి చేశాడు. నేను మా వారితో కలసి వాడితో యుద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాను. అదే సమయంలో ఇక్కడ జూదం జరిగింది. లేకుంటే నేను పిలవకున్నా ఈ జూదానికి వచ్చేవాడినే, జూదం జరగకుండా చూసేవాడినే.

ప్రశ్న 17
కాదు, కౌరవులు పాండవులు జూదమాడుతూ ఉండగా మీరు ద్వారకలో 'విన్నావా యశోదమ్మా' అనే ఒక నృత్యరూపకాన్ని చూస్తూ మైమరచి ఉన్నారు కదా?

కృష్ణుడు:
ఏమయ్యా? మాయాబజార్ సినిమాకు నువ్వు వీరాభిమానివిలా ఉన్నావే? మాయాబజార్ ఒక కల్పితకథ. అసలు మా అన్న బలరామునికి శశిరేఖ అనే కూతురే లేదు. పాండవుల వనవాసకాలంలో సుభద్రాభిమన్యులు పూర్తిగా
ద్వారకలోనే నివసించారు. దేవకాంత, అతిసౌమ్యురాలూ అయిన మా వదిన రేవతిగారిని తుచ్ఛమైన డబ్బుకు ఆశపడే సామాన్యస్త్రీగా చిత్రీకరించారే? సరే, లోకం ఇలా ఉంటుంది సుమా అని జానపదులకు అర్థమయేలా చెప్పేందుకు ఈరకమైన సినిమా తీశారులే అని జాలిపడి మేము ఊరుకున్నాము.

ప్రశ్న 18
కానీ, మీరు ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ, ద్రౌపదికి పరాభవం కలుగకుండా కాపాడారు కదా? అంత చేసిన వారు అదే చేత్తో దూరం నుండే జూదాన్ని ఎందుకు ఆపలేకపోయారు?

కృష్ణుడు:
ఎందుకు ఆపలేదు? ధృతరాష్ట్రుడి మనసులో భయం పుట్టించాను. ద్రౌపదికి వరాలు ఇచ్చే మిషతో జూదంలో పాండవులు ఓడిపోయినదంతా తిరిగి వారికి ఇప్పించాను. అంతా సవ్యంగానే ఉండింది.

ఈలోగా రెండోసారి కూడా జూదానికి పిలుపు వచ్చింది. ధర్మరాజు తగుదునమ్మా అని మళ్ళీ వెళ్ళాడు. రెండోసారి పన్నెండేళ్ల వనవాసము, ఒక యేడు అజ్ఞాతవాసము అనే నియమంతో మళ్ళీ పందెంలో ఓడిపోయాడు.

ఇలా ఎన్ని సార్లు భక్తులను దేవుడు కాపాడాలి? కష్టం అనుభవిస్తేనే గాని సుఖం విలువ తెలియదు. అందుకని రెండోసారి నేను కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా రెండో సారి కూడా అడ్డం తగిలి ఉంటే "తప్పులు చేసిన ప్రతిసారీ దేవుడొచ్చి కాపాడతాడు" అనే మానసికదౌర్బల్యం జనాలందరికీ కలిగేది. అది ప్రమాదకరం. "అసలు తప్పులే చేయకుండా ఉండాలి" అనే ఆదర్శం ప్రచారం కావాలి. అందుకే రెండో సారి ఊరుకున్నాను.

ప్రశ్న 19
కానీ మీకు తరువాతనైనా పాండవులను గట్టెక్కించే శ్రమ తప్పలేదు కదా?

కృష్ణుడు:
నిజమే. కానీ, ఎంత శక్తిమంతులు అయినా పొరపాట్లు చేస్తే కష్టపడవలసి ఉంటుంది సుమా అనే భయం అందరికీ ఉండాలంటే ఆ మాత్రం శ్రమ పడక తప్పదు.

ప్రశ్న 20
కానీ, మీరు ఆనాడు అలా ఊరుకొనడం వల్లనే కదా, యుద్ధం సంభవించింది?

కృష్ణుడు:
దీనికి నేను ముందే సమాధానం చెప్పాను. క్షత్రియుడు కోరుకునేది ఇటువంటి మరణాన్నే. తెలిసి కూడా అధర్మంవైపు నిలబడిన వారు మరణించారు. ధర్మం కోసం ప్రాణాలర్పించినవారు ధన్యులయ్యారు.

ప్రశ్న 21
క్షత్రియులు అలా మరణిస్తే మంచిదని మీరంటున్నారు. కాని, ఆ మరణించిన వీరుల కుటుంబాలలో ఎంతటి సంక్షోభం కలిగి ఉంటుందో కదా!

కృష్ణుడు:
మీ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ఈ విషయం దగ్గరకే వచ్చి ఆగుతున్నాయి. ఆవు వ్యాసంలాగా. (నవ్వులు) అసలు భగవద్గీతలో అర్జునుడి విషాదం కూడా ఇదే కదా!

క్షత్రియులు అంటేనే ప్రాణాలకు తెగించి ఉండే జాతి అని ఇంతకు ముందే చెప్పాను. అసలు ఏ వృత్తికి చెందినవాడైనా, ఇంటి బయటకు వెళ్లినవాడు మరలా ఇంటికి క్షేమంగా తిరిగి రాగలడని ఎవరైనా హామీ ఇవ్వగలరా? క్షత్రియవృత్తిని అవలంబించిన వారిలో ఈ ప్రమాదశాతం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వారు చిన్నతనం నుండి ఆ సంక్షోభానికి సిద్ధపడి బ్రతికేలా మానసికమైన సన్నద్ధత ఉంటుంది.

నాటి సమాజం నేటి సమాజం వంటిది కాదు, వారి కుటుంబానికి మంచి గౌరవమర్యాదలు ఉంటాయి. ఆ యోధుల కుటుంబాలకు రాజుల అండదండలు ఉంటాయి. వారికి ఆర్థికసంక్షోభం ఉండే సమస్య లేదు. అయితే మనిషి లేకపోవడం అనే కొరతను ఎవరూ తీర్చలేరు. కానీ, క్షత్రియజాతికి గుండెనిబ్బరం జన్మతః సిద్ధిస్తుంది.

సుఖదుఃఖాలు శాశ్వతాలు కావు. "ధర్మ ఏకో హి నిశ్చలః." ధర్మం ఒకటే శాశ్వతమైనది. కాబట్టి, నేటి మనుషులను, నేటి సమాజాన్ని చూసిన కళ్ళతో నాటి మనుషులను, నాటి సమాజాన్ని అంచనా వేయకండి. మళ్ళీ ఇటువంటి ప్రశ్నను వేస్తే మీదగ్గర అడగడానికి మరే ప్రశ్నలూ లేవనుకుని ఇంటర్వ్యూ ను ఇంతటితో ముగిద్దాము.

ప్రశ్న 22
స్వామీ, స్వామీ, కోప్పడకండి. మరో రెండు మూడు ప్రశ్నలున్నాయి.
మరి యుద్ధంలో అబద్ధమాడమని మీరు ధర్మరాజుకు చెప్పారా లేదా? అది తప్పు కాదా? గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టమని భీముడికి చెప్పారా లేదా? అది తప్పు కదా?

కృష్ణుడు:
అవునయ్యా. అవును ధర్మరాజుకు, భీముడికి నేను అలా చెప్పిన మాట నిజమే. అసలు నా అవతారరహస్యాలలో అది ఒకటి.

కలియుగంలో దురాచారులెందరెందరో భారతానికి వస్తారు. వారు చేసే ప్రతి వెధవ పనిని కప్పిపుచ్చుకుంటూ భారతీయులు చేసే ప్రతిపనినీ తప్పు పడుతూ ఉంటారు. వారు చంపితే వీరత్వం అంటారు. వారికి ఎదురుతిరిగి భారతీయులు చంపితే క్రూరత్వం అంటారు. ఈరకంగా వారు తప్పు చేస్తే ఆనాటి అవసరం అలా చేయించింది అంటారు. భారతీయులు తప్పనిసరై అలా చేయబోతే నానా యాగీ చేస్తారు. భారతీయులు ఏమి చేయాలో తెలియని ధర్మసంకటంలో ఇరుక్కుని నిస్సహాయులౌతారు. వారికి నేను కర్తవ్యం బోధించదలచాను.

మాయాచారో మాయయా బాధితవ్యః.
సాధ్వాచారో సాధునా ప్రత్యుపేయః..

మాయగాళ్లని మాయతోనే కొట్టాలి.
మంచివారితో మంచిగానే వ్యవహరించాలి.

ఇలా స్వయంగా నేను చెప్పినప్పటికీ నిజంగా అలా మాయ చేసి దెబ్బ కొట్టవచ్చునా అని వెనుకంజ వేస్తూ పిరికివాళ్ళనిపించుకొనేంత వెర్రి వాజమ్మలు కలియుగభారతీయులు. అందుకే వారికి ఆదర్శంగా స్వయంగా నేనే కురుక్షేత్రయుద్ధంలో అలా చేసి చూపించవలసి వచ్చింది. ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం అబద్ధమాడినా పరవాలేదు. నియమం తప్పినా పరవాలేదు. అటువంటి సందర్భాలలో తప్పొప్పులు ఏమి చేసినా నాకు వదిలిపెట్టండి, కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించండి అని చెప్పదలిచాను.

ప్రశ్న 23
ధన్యులం స్వామీ, ధన్యులం. మీ ఉపదేశాన్ని భారతీయులందరూ సక్రమంగా గ్రహిస్తే వారికి ఇక తిరుగు ఉండదు. కాని, మీకు పక్షపాతం దేనికి స్వామీ, ఒకవైపు "సర్వత్ర సమదర్శనః" అంటారు. కానీ అంత గొప్ప భగవద్గీతను అర్జునుడికి మాత్రమే బోధించారు.

కృష్ణుడు:
అయ్యో పిచ్చోడా, నేను వేరు, అర్జునుడు వేరు అనుకుంటున్నావా?

यो2हं तमर्जुनं विद्धि, यो2र्जुनः सोहमेव तु।
నేనెవరిననుకుంటున్నావో ఆ నన్ను అర్జునుడనే తెలుసుకో.
ఇతడు అర్జునుడు అని ఎవరిని గూర్చి అనుకుంటున్నావో అతడు నేనేనని తెలుసుకో.

భగవద్గీతను నాకు నేనే బోధించుకున్నా. అది నా ఆత్మప్రబోధం.

ప్రశ్న 24
శ్రీకృష్ణా, నమో నమః. నమో నమః. పరమానందం. పరమానందం.
కానీ, మేము మీరన్నట్టే సామాన్యులం కదా స్వామీ, మీరు ఆ భగవద్గీతను దుర్యోధనుడికి చెప్పి ఉంటే యుద్ధం ఉండేది కాదేమోనని మా ఆశ.

"भक्तो2सि मे सखा चेति रहस्यम् एतदुत्तमम्"

అంటూ అర్జునుడికి మాత్రమే చెప్పారు కదా.

కృష్ణుడు:
(నవ్వులు) ఏమయ్యా తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా?

రాయబారానికి వెళ్ళినపుడు నేను మంచి మాటలు చెప్పనే లేదంటావా? దుర్యోధనుడు కాస్త ఓపికగా విని ఉంటే ఆ భగవద్గీతను అప్పుడే చెప్పి ఉండేవాడినేమో? కానీ, నా మాటలు వినే ఓపిక ఆయనకెక్కడిది? ఆయన నా మాటలు వినకుండా తన మిత్రుల మాటలు విన్నాడు. నన్నే బంధించే ప్రయత్నం చేశాడు.

అప్పుడు కూడా సభామధ్యంలో నా విశ్వరూపం ప్రదర్శించాను. భయపడ్డాడు కానీ అర్థం చేసుకోలేకపోయాడు. తరువాత నన్ను ఇంద్రజాలం చేసే గారడీ వాడినంటూ హేళన చేశాడు.

"యద్భావం తద్భవతి" అని వినలేదా?
"యే యథా మామ్ ప్రపద్యన్తే తాన్ తథైవ భజామ్యహమ్"
(భగవద్గీత 4.11)

నన్ను గూర్చి ఎవరు ఏమనుకుంటే నేను వారికి అలాగే కనిపిస్తాను. అనిపిస్తాను. నువ్వేమనుకుంటావో నీ యిష్టం.

ప్రశ్న 25
స్వామీ, మీ మాటలు నాకు అయోమయం కలిగిస్తున్నాయి. ఒకవైపు అన్నీ చేసే భగవంతుడిని నేనే అంటారు. మరో వైపు నీ భావన ఎలా ఉందో అలాగే జరుగుతుంది అంటారు.  అందుకనే అర్జునుడిలా నేను నిన్ను అదే విధంగా ఆశ్రయిస్తున్నాను.

కార్పణ్యదోషోప హతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః.
యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్.

కృష్ణుడు:
ఇది ప్రశ్నలా లేదే?

*****
ఉపసంహారం:
******
అలా ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఇంటర్వ్యూ చేసేటపుడు ఎదుట ఉన్నవారు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అయితే అతడిని అయోమయంలో పడేస్తూ అతడి చేత వివాదాస్పదవ్యాఖ్యలు చేయిస్తూ అతడికి తెలియకుండా అతడి మాటల మీద ప్రజాభిప్రాయం కోరుతూ, రాచి రంపాన పెట్టడమే ఇంటర్వ్యూ అని కదా ఈరోజుల్లో భావం?

కానీ, అలా చేస్తూ చేస్తూ అతని మాటలు బలేగా నచ్చేసి అతనికి భక్తుడైపోయి నువ్వే నాకు దిక్కంటే ఆ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పటికీ కట్ చెప్పాల్సిందే కదా?

అలా నేను చేస్తున్న/చేసిన ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోవలసి వచ్చిందన్న మాట. అయినప్పటికీ ఆయననుండి సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలను రాబట్టాననే భావిస్తున్నాను.

ఈ ఇంటర్వ్యూ చదివినవారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ నిశ్చితమైన శ్రేయస్సు కలుగుగాక!

ఇంటర్వ్యూ రెండవ భాగం కూడా శ్రీకృష్ణార్పణమస్తు.

శ్రీకృష్ణునితో ఇంటర్వ్యూ 1

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((మొదటి భాగం)) 

ప్రస్తావన:
అరిందమనుడి బుఱ్ఱ నిండా ప్రశ్నలే ప్రశ్నలు. 
ఒకోసారి అర్ధరాత్రి పూట కూడా నిద్రనుండి లేపి మరీ ప్రశ్నలు వేస్తుంటాడు. వాడికి అందరు దేవుళ్లకంటే కృష్ణుడంటేనే ఎక్కువ ఇష్టం. రేపటి దినాన కృష్ణాష్టమికి హరే రామ హరే కృష్ణ గుడికి పోదాం అని చెబుతూ చెబుతూ వాడు నన్ను నిన్న సాయంత్రం అడిగిన ప్రశ్న ఇదీ -

"అప్పన్నా, కృష్ణుడికి ఎవరంటే అందరికంటే ఇష్టం?"

వెంటనే సమాధానం చెప్పాను: "అర్జునుడంటే ఇష్టం."

"మరి".. అని మొదలుపెట్టాడు వాడు. (పాచికలు జూదం అనే పదాలు వాడికి ఇంకా అలవాటు పడలేదు. చేతితో వాటిని వేస్తున్నట్టు అభినయిస్తూ) "ఇలా ఇలా వేసి ఆడుతాడే... వాడు ఇష్టమని ఆ సినిమాలో చెప్పాడు కదా?" అని అడిగాడు.

మాయాబజార్ సినిమాలో శకుని ఇష్టమని చెప్పించిన విషయం గూర్చి అడుగుతున్నాడని కాసేపటికి అర్థమైంది.

"సినిమాలో తీసి చూపించేవన్నీ నిజం కావు" అని చెప్పాను. ఈలోగా వాడి నేస్తం ఎవడో పిలిచేసరికి ఆడుకోవాలంటూ పారిపోయాడు.

లాభం లేదు,
కొన్ని కొన్ని విషయాలు నేరుగా కృష్ణుడినే అడిగి కన్ ఫామ్ చేసుకోవాలని నిశ్చయించుకుని

"కృష్ణా ఇంటర్వ్యూ ఇస్తావా" అని అడిగాను.

ఓ వైపు ప్రపంచమంతా ఈరోజు ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నా, నా కోరికను మన్నించి ఆయన "సరే" అని అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఈ ఇంటర్వ్యూ ను ఈ రోజు మీముందుకు తేగలిగాను.

***
ఇంటర్వ్యూ మొదలు:
***

ప్రశ్న 1
స్వామీ, కృష్ణా, మీకు సూటిగా ఒక ప్రశ్న. మీకు అందరికంటే ఎవరు ఇష్టం?

కృష్ణుడు:
నువ్వే చెప్పావు గదయ్యా అరిందమనుడికి. మళ్ళీ సందేహం ఎందుకు? నాకు అర్జునుడంటేనే అందరికంటే ఇష్టం.

ప్రశ్న 2
అర్జునుడిలో ఏమి చూసి అంతగా ఇష్టపడ్డారు?

కృష్ణుడు:
అర్జునుడిలో ఉండే సుగుణాలు ఒకటా రెండా?

అర్జునుడి ఆత్మవిశ్వాసం మొదటి కారణం. "నేను కోరిన గురుదక్షిణ ఎవరు ఇస్తారు?" అని గురువు అడిగితే చిన్నతనంకొద్దీ మిగిలిన రాజకుమారులు అందరూ అదేమిటో అని భయపడిన క్షణాన అర్జునుడు ఒక్కడే "నేనిస్తాను" అని ధైర్యంగా చేయి ఎత్తాడు.

క్షత్రియుడిగా పరాక్రమవంతుడు కావడం తన లక్ష్యంగా భావించి అందుకు అహర్నిశలు శ్రమించే అతడి దీక్ష అనితరసాధ్యం. చిన్నతనంలో రాత్రులు చీకట్లో కూడా బాణాలు వేస్తూ అభ్యాసం చేసినా, గొప్ప తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించినా అతడికతడే సాటి.

మహా ప్రతాపవంతుడిని అనే గర్వం మనసులో లేకుండా తన చేత ఓడిన వారి పట్ల కూడా అతడు ప్రదర్శించే సౌమ్యత చాలదూ అతడిని మహానుభావుడు అనడానికి? ఆ మాటలకు ముగ్ధుడైపోయి కాదూ, ద్రుపదుడు అర్జునుడికి ఇవ్వడానికి తనకో కూతురు ఉంటే బాగుండుననుకున్నది?

విజయం సాధించాక ఒళ్ళు మరచి విశృంఖలంగా ప్రవర్తించేవారిని చూస్తాం కానీ, అటువంటి ఆనందంలో కూడా సదాచారాన్ని మరువని అతడి నడవడికను పొగడకుండా ఎలా ఉండగలం? "అర్జునా! ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నావు కాబట్టి, ఆమెను నువ్వు పెళ్లాడు” అని ధర్మరాజు అంటే, ఎగిరి గంతేసి పెళ్లి చేసుకోకుండా, "అన్నా, నాకంటే పెద్దవారు మీరు భీమన్న ఉన్నారు కదా, మీ ఇద్దరికీ అయిన తరువాతే నా పెళ్లి" అని చెప్పడం అందరికీ సాధ్యమా? చివరకు తల్లి అయిన కుంతి మాటపై ద్రౌపదిని అన్నదమ్ములందరూ పెళ్ళాడడం వేరే విషయం.

ప్రపంచం తల్లక్రిందులైనా ఒక నియమానికి కట్టుబడి ఉండటం అతనిలో తప్ప వేరెవరిలో చూడగలం? మిగిలిన పాండవులందరూ ఇంద్రప్రస్థంలో హాయిగా రాజభోగాలు అనుభవిస్తూ ఉండగా నియమానికి స్వచ్ఛందంగా కట్టుబడి అతడు పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు చేయడం సామాన్యమైన విషయమా?

అర్జునుడికి ఉన్నంతటి ఆత్మనిగ్రహశక్తి వేరెవరికీ లేదు. అంతటి అప్సరస, సాక్షాత్తు ఊర్వశి అతడిపై మరులుగొని వస్తే, "అమ్మా నీవు నాకు తల్లివంటి దానివి" అని పాదాభివందనం చేశాడు కదా?

ఇలా ఇంకా ఇంకా చాలా చెప్పగలను. కానీ ప్రస్తుతానికి ఇవి చాలు.

ప్రశ్న 3
మరి అర్జునుడు అంతటి గుణవంతుడే అయితే - తన గురువు గారైన ద్రోణుడికి ద్రుపదుడు శత్రువు కదా? అటువంటి ఆయన కూతురును పెళ్ళాడి ఎందుకు అతనికి ఎందుకు బంధువు అయ్యాడు?

కృష్ణుడు:
ద్రోణుడు ద్రుపదునితో సంధి కుదుర్చుకున్నాడు కదా. ద్రుపదుడికి దక్షిణపాంచాలరాజ్యం ఇచ్చి, ఉత్తరాన ఉన్న అహిచ్ఛత్రనగరం తన స్వాధీనంలో ఉండేట్టు ఒప్పందం చేసుకున్నారు కదా? ఇక శత్రుత్వం లేదని ద్రోణుడే స్వయంగా ద్రుపదుడితో అన్నాడు కదా? ద్రుపదుడితో బంధుత్వం పెట్టుకుంటే అతడి మనసులో తన గురువుపై ఉన్న ఏ కొద్ది ద్వేషమైనా సమసిపోతుందని భావించాడు. తప్పేముంది?

ప్రశ్న 4
మరి అర్జునుడు గురువుగారి మీదనే బాణాలు వేసిన మాట అబద్ధమా?

కృష్ణుడు:
మీలాంటి వారు భవిష్యత్తులో ఇలా ఆక్షేపిస్తారనే కాబోలు, సభలో పెద్దలందరి ఎదుటా ద్రోణుడు అర్జునుడిని ఒక ప్రత్యేకమైన గురుదక్షిణ కోరాడు. యుద్ధరంగంలో స్వయంగా గురువైన తానే ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా యుద్ధం చేయమని అడిగాడు.

आचार्यदक्षिणां देहि ज्ञातिग्रामस्य पश्यतः।
युद्धे2हं प्रतियोद्धव्यो युध्यमानस्त्वयानघ।।
(మహాభారతం.1.138.13&14)

అందుకని అర్జునుడు గురువుగారిమీద బాణాలు వేసి గురుదక్షిణ చెల్లించవలసి వచ్చింది. సరేనా?

ప్రశ్న 5
మరి తాతగారైన భీష్ముడిమీద బాణాలు వేయడం తప్పు కాదా?

కృష్ణుడు:
అయ్యా, మీరు మామూలు మనుషులు. అందువల్ల మామూలుగానే ఆలోచిస్తున్నారు. కాని, భీష్ముడు అర్జునుడు క్షత్రియులు. వారికి సంబంధించి యుద్ధం అనేది పెళ్ళివంటి శుభకార్యం. బాణాలు తగిలి పడిపోయిన భీష్ముడు తన వద్దకు దుర్యోధనుడు పంపగా వచ్చిన శస్త్రవైద్యులను వద్దని రాజులందరితోనూ ఏమన్నాడో తెలుసునా?

"క్షత్రియుడు మంచాన పడి రోగాలతో చనిపోవడం అనుచితం. యుద్ధరంగాన అస్త్రవిద్ధుడై చనిపోవడమే క్షత్రియునికి అత్యుత్తమమరణం".

అలా అర్జునుడు తన తాతగారి కోరికను నెరవేర్చినవాడయ్యాడు సుమా.

ప్రశ్న 6
పక్షపాతం లేకుండా చెప్పండి - కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా?

కృష్ణుడు:
వారిద్దరినీ పోల్చి చూడాలనే బుద్ధి జనాలకు ఎందుకు పుట్టింది? వారిద్దరూ యుద్ధంలో పరస్పర ప్రత్యర్థులు కాబట్టి. కాబట్టి, గెలిచినవాడే గొప్ప. అర్జునుడు కర్ణుడిని ఉత్తరగోగ్రహణసమయంలో ఓడించాడు. రెండోసారి నేరుగా కురుక్షేత్రంలో ఓడించాడు.

అసలు అర్జునుడిదాకా ఎందుకు? కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు. సాత్యకి చేతిలో ఓడిపోయాడు. కానీ, వారందరూ "ఈ కర్ణుడు అర్జునుడిచేతిలోనే చావాలి తప్ప మా చేతిలో కాదు" అని వదిలేయబట్టి బ్రతికిపోయాడు.

అటువంటి మొహమాటాలేమీ లేని ఘటోత్కచుడు దాదాపు కర్ణుని చంపేసేవాడే.
అందుకని ఆ ఆపత్సమయంలో కర్ణుడు అర్జునుడిని చంపడం కోసం దాచుకున్న ఇంద్రుడిచ్చిన మహాశక్తిని ఘటోత్కచుడిపై విసిరేసి మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బ్రతికి బయటపడ్డాడు.

ప్రశ్న 7
కానీ, ఇంద్రుడు కర్ణుని కవచం లాగేసి శక్తిహీనుణ్ణి చేసేసిన తరువాత కదా, వీరందరి చేతిలో కర్ణుడు ఓడింది?

కృష్ణుడు:
సరే, కాసేపు అలాగే అనుకుందాం.

కానీ, ఘోషయాత్ర సమయంలో కర్ణుడు అర్జునుని శిష్యుడైన చిత్రసేనుని చేతిలో చిత్తుగా ఓడిపోయి జాడ కూడా తెలియకుండా పారిపోయాడు కదా. దానికేమంటారు?

ఈ కర్ణుడు తన నూత్న యౌవనసమయంలోనే తనతో ద్వంద్వయుద్ధం చేయమని అర్జునుడిని సవాలు చేశాడు కదా, కానీ, ఆ మరుసటి రోజే దుర్యోధనుడితోనూ, మిగిలిన కౌరవులతోనూ కలసి ద్రుపదుడి మీద యుద్ధానికి పోయి చిత్తుగా తన్నులు తిని పారిపోలేదా?

ఈ రెండు సందర్భాలలోనూ అతడి ఒంటి మీద సహజకవచకుండలాలు ఉన్నాయి కదా? అవి ఉండడం వల్ల అతడు ఏమాత్రం గెలిచాడేమిటి?

ప్రశ్న 8
మరి కర్ణుడికి గురుశాపం ఉంది కదా?

కృష్ణుడు:
అది అతడు చేతులారా చేసుకున్న పని. దానికి ఎవడు ఏం చేయగలడు? ఈ విషయంలో అర్జునుడికి ఏమి సంబంధం ఉంది? అర్జునుడు స్వయంగా పరశురాముడి చెంతకు వెళ్లి "అయ్యా, దయచేసి కర్ణుడికి శాపం ఇవ్వండి" అని కోరి ఉంటే మీరు తప్పు పట్టవచ్చు.

"సచిన్ టెండూల్కర్ రన్ అవుట్ కాకుండా ఉంటే అతడు సెంచరీ చేసేవాడు, మ్యాచ్ గెలిపించేవాడు" అని మీరు బాధపడితే ఎంత అసంబద్ధమో, ఇపుడు ఈ గురుశాపప్రస్తావన వంటివి అంతే అసంబద్ధం.

ప్రశ్న 9
యుద్ధంలో రథం క్రుంగి పోయి నేల మీద ఉన్న కర్ణుడి మీదకు బాణం వేయమని మీరు అర్జునుడిని ప్రోత్సహించలేదా? అది ధర్మమేనా?

కృష్ణుడు:
ఇప్పుడు మీరే కాదు, సాక్షాత్తు కర్ణుడు కూడా నన్ను ఆ సమయంలో ఇదే మాట అడిగాడు. అపుడు నేను కూడా ఆ కర్ణుడిని అడిగాను -

ఏమయ్యా కర్ణా? "పాండవులు వానవాసాన్ని అజ్ఞాతవాసాన్ని నియమం ప్రకారం ముగించారు కాబట్టి, వారి రాజ్యం వారికి ఇచ్చేయడం ధర్మం" అని నువు దుర్యోధనుడికి ఆ సమయంలో ధర్మాన్ని ఎందుకు గుర్తు చేయలేదు?

భీముడికి విషం పెట్టినపుడు అది అధర్మం అని నీ మిత్రుడికి ఎందుకు చెప్పలేదు?

పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చివేసే ప్రయత్నం అధర్మం అని ఎందుకు చెప్పలేదు?

ద్రౌపదిని నిండుసభలో దుశ్శాసనుడు, మీ ప్రాణమిత్రుడైన దుర్యోధనుడు పరాభవించినపుడు, నువ్వు ఆనందంతో కేరింతలు కొట్టినప్పుడు ఈ ధర్మం ఎందుకు గుర్తుకురాలేదు?

అభిమన్యుడు ఒంటరిగా యుద్ధం చేస్తూ నీలాగే నేలమీద ఉన్నపుడు, అయ్యో అతడు బాలుడు కదా, నిరాయుధుడై ఉన్నాడు కదా అనే కనికరం కూడా లేకుండా ఆరుగురు అతిరథులు అతడిపై విరుచుకుపడి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా?  ఆ ఆరుగురిలో నువ్వు కూడా ఒకడివి కదా? ఆ సమయంలో అది అధర్మం అని ఎందుకు గుర్తుకు రాలేదు తమరికి?" అని అడిగాను.

ఆవిధంగా నేనడిగిన ప్రశ్నలలో కర్ణుడు ఏ ఒక్కదానికైనా సరైన సమాధానం చెప్పి ఉంటే, "అర్జునా! కాసేపు ఆగు, కర్ణుడు యుద్ధానికి సిద్ధమైన తరువాత బాణాలు వేద్దువు గాని" అని అర్జునుడిని ఆపి ఉండేవాడిని. మీకు ఈ ప్రశ్న వేసే శ్రమ తప్పి ఉండేది.

ప్రశ్న 10
శల్యుడు కర్ణుడిని నిరుత్సాహపరిచాడు కదా?

కృష్ణుడు:
అసలు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వస్తున్న శల్యుడిని మాయలతో వశపరచుకుని తన పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పించుకున్న దుర్యోధనుడిని అడగండి ఈ మాట. శత్రువు వేలుతో శత్రువు కంటినే పొడవాలని దుర్యోధనుడు అలాంటి ఎత్తు వేశాడు. అదే యుక్తిని ధర్మరాజు అమలు పరిస్తే తప్పు పడతారెందుకు?

ప్రశ్న 11
మీరు కూడా కర్ణుడిని పాండవపక్షానికి రప్పించేందుకు ప్రయత్నించారు కదా?

కృష్ణుడు:
కర్ణుడు పాండవపక్షంలో చేరి ఉంటే యుద్ధం జరుగదు కదా అనే ఆశతో అలా చేశాను. అయినా, ప్రయత్నించడంలో తప్పేమిటి? దుర్యోధనుడు ఏకంగా నన్నే తన పక్షాన యుద్ధం చేయమని కోరేందుకు రాలేదా?

ప్రశ్న 12
అలా ప్రయత్నించినపుడు ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా స్వీకరిస్తుందని ఆశ పెట్టారట కదా?

కృష్ణుడు:
ఎవరు అలా చెప్పిన నీచుడు? మీ తెలుగువాళ్లు పరమచెత్త సినిమాలు తీసి అందులో నా పాత్రధారి చేత అటువంటి నీచపు మాటలు పలికించారని విన్నాను. నిజానికి కర్ణుడు పాండవుల పక్షానికి వస్తే అతడు రాజు అవుతాడని 
నేను చెప్పానే కానీ, ద్రౌపది గురించి అలా మాట్లాడే అధికారం నాకెక్కడిది? ఆ సమయంలో జరిగింది జూదమూ కాదు, ద్రౌపదిని తాకట్టు పెట్టేందుకు నేను ధర్మరాజునూ కాదు.

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
(అందుకు సమాధానంగా ఏమని ఉంటాడు ఊహించగలరా? ఇంకా కృష్ణుని ఎలాగైనా ఇరికిద్దామని, ఎన్నో సందేహాస్పదమైన విషయాలకు ఆయన నోటిమీదుగానే సమాధానాలను రాబడదామని ప్రయత్నించాను. ఆ మిగిలిన ఇంటర్వ్యూ ను ఈరోజే రెండో భాగంలో చదవండి)

ఇంటర్వ్యూ మొదటి భాగం శ్రీకృష్ణార్పణమస్తు.

కులము - పౌరుషము


తన కుమారుడు యుద్ధరంగంలో చనిపోయాడని మాట యుధిష్ఠిరుని నోట విన్నవెంటనే ద్రోణాచార్యులకు జీవితేచ్ఛ పోయింది. యుద్ధమధ్యంలో శస్త్రత్యాగం చేసి యోగాసనంలో కూర్చున్నాడు. ఇదే అదనుగా భావించి ధృష్టద్యుమ్నుడు ఆయన రథం మీదకు కుప్పించి దూకి అతని శిరోజాలను పట్టుకుని ఒక్క కత్తివేటుతో తలను మొండెం నుండి వేరు చేశాడు.

పాండవకౌరవపక్షాలు రెండూ ఈ చర్యను చూసి దిగ్భ్రాంతి చెందాయి. ఆచార్యుని మరణానికి ఎంతో ఖేదం చెందాయి. ఒక్క కర్ణుడే మిగిలిన అందరికంటె భిన్నంగా ఆలోచించాడు. 

"నా మిత్రుడైన దుర్యోధనుడు ఎంతో నమ్మకంతో ఈ ద్రోణాచార్యుని తన సమస్తసైన్యానికి నాయకుడిగా నియమిస్తే అతడు తన మహారాజుకు విజయం కలిగేలా యుద్ధం చేయవలసింది పోయి, తన కొడుకు చనిపోయాడనేసరికి యుద్ధం మానేసి చేతులారా చావు కొనితెచ్చుకున్నాడు. ఈ విధంగా అతడు స్వామిద్రోహి" అని అతడు మనసారా నమ్మాడు. 

మరోవైపు ఆ ఘోరం జరిగిన సమయానికి అక్కడ లేని అశ్వత్థామకు ఈ విషయం తెలిసింది. ప్రాణప్రదుడైన తండ్రిని కోల్పోయిన తీరని దుఃఖం ఒకవైపు, తండ్రిని అన్యాయంగా చంపిన ఆ దుర్మార్గుడైన ధృష్టద్యుమ్నుని మట్టుపెట్టాలన్న తీవ్రప్రతీకారేచ్ఛ మరొకవైపు. తన తండ్రి గారు అవమానకరమైన రీతిలో మరణించడానికి కారణమైన పాండవ మత్స్య పాంచాల మాగధాది క్షత్రియాపసదుల పాలిటి పరశురాముడయ్యేందుకు పరమ క్రోధంతో ఉద్యుక్తుడయ్యాడు. 

అటువంటి తన మేనల్లునికి దుర్యోధనుడు కౌరవసేనాధిపత్యం ప్రసాదించగలడని కృపాచార్యులు ఆశించారు. కానీ, భీష్మద్రోణుల తరువాత కౌరవసేనాధిపత్యానికి మరొక పోటీదారుడు కర్ణుడు ఉన్నాడు. 

అతడు మహారాజైన దుర్యోధనుడికి ప్రియమిత్రుడు. పైగా రాజసమక్షంలో ద్రోణాచార్యుని మీద లేని పోని నిందలు వేస్తూ ఉన్నాడు. ద్రోణుడి బుద్ధి మంచిది కాదని, ఆసంగతిని బాల్యంలోనే కనుగొన్న ద్రుపదుడు అతనిని తన చెంత ఉంచుకోకుండా తరిమేశాడని ఇలా ఏమేమో చెబుతూ అతని మనసు విరిచేసి, అతనికి ద్రోణుడి పట్ల కృతజ్ఞతాభావం కానీ, గౌరవభావం కానీ లేకుండా చేశాడు. 

ఆ దుర్యోధనుడి సమక్షంలోనే కర్ణాశ్వత్థామల సంవాదం ఇలా జరిగింది:

అశ్వత్థామ) 
రాజా ఇక నిశ్చింతగా నిద్రపోదువు గాని. ఈ రోజు భూమి కృష్ణుడు, పాండవులు లేకుండా అయిపోతుంది.

కర్ణుడు) 
చెప్పడం సులువే. చేయడమే కష్టం. నువ్వు చెప్పిన పనిని చేయగలిగినవారు కౌరవసైన్యంలో చాలామంది ఉన్నారులే. (నీకంత శ్రమవద్దు.) 

అశ్వత్థామ) 
అంగరాజా, తండ్రి పోయిన దుఃఖంలో అలా అన్నానే గాని, ఇతరవీరులను అవమానించడం నా ఉద్దేశం కాదు.

కర్ణుడు) 
ఓయీ మూఢా! దుఃఖంతో ఉంటే కన్నీరు వదలాలి, కోపం వస్తే యుద్ధరంగంలోకి ఉరకాలి. అంతే గాని, ఇటువంటి ప్రగల్భాలు పలుకరాదు.

అశ్వత్థామ) 
ఒరే రాధాగర్భభారభూతుడా! సూతాపసదుడా! నువ్వా నాకు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్పేది? నీలా నేనెప్పుడూ యుద్ధరంగంనుండి పారిపోయి రాలేదే? నా ఆయుధం నీ ఆయుధంలా గురుశాపం పొంది నిర్వీర్యం కాలేదే? నీలా స్తోత్రపాఠాలు పలికే సూతకులంలో నేను పుట్టలేదే? కాబట్టి, నా క్షుద్రశత్రువులు నాకు చేసిన అపకారానికి నేను ప్రతీకారాన్ని అశ్రువులతో కాదు, అస్త్రంతోనే చేస్తాను.

కర్ణుడు) 
ఒరే వాచాలుడా! నా ఆయుధం నిర్వీర్యమో, సవీర్యమో గాని, నేనెప్పుడూ నీ తండ్రిలా ఆయుధాన్ని యుద్ధరంగంలో పక్కన పెట్టలేదు సుమా. 

మరొకటి కూడా చెబుతున్నాను. నేను సూతుడినా సూతపుత్రుడినా, ఎవరైతే నేమయ్యా? दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्। ఒరే, నేను ఏ కులంలో పుడితేనేమిరా, పుట్టించింది ఆ భగవంతుడు. అందువల్ల నా పుట్టుకకు అతడే బాధ్యుడు. కానీ, పౌరుషం ఉన్నదే, అది మాత్రం నేను సంపాదించుకున్నది. అది నాకు పుష్కలంగా ఉన్నదిరా"
***
***

ఇలా ఎవరైనా (సకారణంగానో లేక నిష్కారణంగానో) ఒక వ్యక్తిని ఆక్షేపిస్తే ఆ వ్యక్తి కోపగించుకుని తనను ఆక్షేపించిన వ్యక్తిని కులం పేరుతో తూలనాడడం ఈనాటి మాట కాదు. 

ఈ వాగ్వాదం జరిగింది భట్టనారాయణమహాకవి వ్రాసిన వేణీసంహారం అనే నాటకంలో. ఆయన మనకు దాదాపు పదకొండువందల సంవత్సరాల పూర్వీకుడు. ఆనాటికే ఇటువంటి ఆక్షేపణలు తూలనాడడాలు ఉన్నాయన్న మాటేగా?
***

కానీ ఆ తిట్లు కాసేపు పక్కన పెడితే చూడండి, అశ్వత్థామ వినయం: 

"నేను దుఃఖంలో ఏదో అన్నానే గాని, ఇతరవీరులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు" అన్నాడు. 

అంటే, "నేనొక్కడే వీరుడిని కాను, నావంటి వీరులు ఇంకా చాలామంది ఉన్నారు." అని స్వయంగా అంతటి మహావీరుడై ఉండి కూడా వినమ్రతను కనబరిచాడు. 
***

కాని, ఈనాడు ముఖానికి రంగులు పూసుకుని కెమెరా ముందు తైతక్కలాడే ఒక మనిషి కూడా, 

మా పుట్టుకే వేరు, మా బ్రీడే వారు, మా వంటి వంశం లేదు, మాకు సాటి పోటీ ఎవరూ రాలేరు 

అని వాగుతుంటే భరించవలసి ఖర్మ పట్టింది మనకు. 

అలాంటి వారికి కర్ణుడు ఆనాడే ఒక జవాబు చెప్పాడు:


" - దైవాయత్తం కులే జన్మ మదాయత్తం తు పౌరుషమ్ -
నేను ఫలానా కులంలో పుట్టడం అనేది దైవం చేతిలో ఉంది. 
కానీ, 
పౌరుషం నిరూపించుకొనడం మాత్రం ఖచ్చితంగా నా చేతిలో ఉంది." 
***

అలాగే జరుగుతుంది. 
అలా జరిగిందని ఇతిహాసమూ చెప్పింది, 
చరిత్ర కూడా అలా జరగడాన్ని చాలాసార్లు ప్రత్యక్షసాక్షిగా చూసింది.

- ఎవ్వరూ తక్కువ వాళ్లు కారు -


బ్రహ్మవంశసముద్భూతుడైన ఉత్తానపాదుడు అనే ఒకానొక మహారాజు ఉండేవాడు. ఆయనకు సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు.

ఉత్తానపాదునికి తన చిన్న భార్య అయిన సురుచి అంటే ప్రీతి ఎక్కువ. ఓ రోజు ఆయన ఉత్తముని ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలిస్తున్నాడు. ఇంతలో అక్కడికి ధ్రువుడు వచ్చాడు. తాను కూడా తండ్రి ఒడిలో ఎక్కాలని ఆశ పడ్డాడు. కాని, సునీతి అడ్డుపడింది.

“ఒరే అబ్బాయీ, నువు రాజపుత్రుడవే కావచ్చు. కాని, నువు నా కడుపున పుట్టలేదు, కాబట్టి, తండ్రి ఒడిలో కూర్చోవాలనే నీకోరిక దుర్లభం పొమ్మం”ది.

న వత్స నృపతేర్ధిష్ణ్యం భవానారోఢుమర్హసి।
న గృహీతో మయా యత్త్వం కుక్షావపి నృపాత్మజః।।
నూనం వేద భవాన్ యస్య దుర్లభేऽర్థే మనోరథః।।
(శ్రీమద్భాగవతం.4.8.11-12)

“అంతగా తండ్రి ఒడిలో కూర్చోవాలని ఉన్నా, రాజసింహాసనం కోరుకుంటున్నా, నువు ఒక పని చెయ్. నువు పురుషోత్తముని ఆరాధించు, అతని అనుగ్రహంతోనే మరలా నువు నా కడుపున పుట్టు.” అని అహంకారంతో పలికింది.

పసివాడైన ధ్రువుడు కఱ్ఱదెబ్బ తిన్న పాములా రోషంతో బుసలు కొట్టాడు. తరువాత తన నిస్సహాయత తెలుసుకొని పెద్దగా రోదించాడు. సునీత కూడా ఈ విషయం తెలుసుకుని చాల బాధపడింది. కుఱ్ఱవానికి కర్తవ్యం బోధించింది.

ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వమ్, ఉక్తం సమాత్రాపి యదవ్యలీకమ్।
(శ్రీమద్భాగవతం.4.8.19)

“నాయనా, ఆమె నీకు సవతి తల్లి అయినప్పటికీ, పురుషోత్తముని ఆరాధించమని నీకు సరైన మార్గనిర్దేశనమే చేసింది. కాబట్టి, ఆమెపై ద్వేషం పెట్టుకోక, ఆ పనిని చెయ్.” అన్నది.

ధ్రువుడు అలాగే చేశాడు. దయాళువైన నారదమహర్షి చెప్పిన ప్రకారం అద్భుతమైన తపస్సు చేశాడు. భగవంతుడు ఆ తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఆ ధ్రువుడు మనసులో కోరుకున్నదానిని మాత్రమే కాక, అంతకంటె ఉన్నతమైన స్థానాన్ని కూడా ప్రసాదించాడు.

ధ్రువుడు తండ్రి ఒడిని, సింహాసనాన్ని మాత్రమే పొందడం కాకుండా ద్రువమైన (స్థిరమైన) నక్షత్రమై నిలిచాడు.

ఇది, అందరికీ తెలిసిన ఒక సుప్రసిద్ధమైన కథ. ధ్రువుడు ఒక బాలభక్తుడని, పిల్లలందరూ అటువంటి భక్తిని కలిగి ఉండాలని బోధించి ఊరుకొనడంతో ఈ కథను పెద్దలందరూ కంచికి పంపేస్తారు. కాని ఆమాత్రంతో వదలిపెట్దదగిన కథా ఇది?
*

ఆనాడు ఉత్తానపాదుడికి ధ్రువుడు, ఉత్తముడు ఇద్దరూ సమానులే. ఐనప్పటికీ, తన మీద ఉత్తానపాదుడికి ఉన్న ప్రీతిని గ్రహించిన సురుచి న్యాయమైన ధ్రువుని కోరికను తిరస్కరించింది.

భగవంతుని దృష్టిలో బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు అనబడే వారందరూ సమానులే. (నేడు దళితులు అని పిలువబడుతున్నవారు కూడా శూద్రులే.)

కాని, కొందరు పైన చెప్పిన కథలో సురుచిలా అహంకరించి, “నువు మా ఇంట పుట్టలేదు కాబట్టి, నీకు ఫలానా పని చేసే అర్హత లేదు పో, ఫలానా మోక్షం వచ్చే దారి లేదు పో” అని అన్నారనుకోండి.

ప్రస్తుతసమాజంలో అలా అనిపించుకుంటే ఇతరులకు రోషం రావడం సహజమే - పసివాడైన ధ్రువుడికి సవతి తల్లి మాటలకు రోషం వచ్చినట్టు.

కాని, అలా అన్నంతమాత్రాన ధ్రువుడు రాజకుమారుడు కాకుండా పోలేదు. అలాగే, కూడా అటువంటి మాటను అనిపించుకున్నంత మాత్రాన ఇతరుల దివ్యత్వానికి వచ్చే లోటేమీ లేదు. అన్నవారు కూడా అలా అనేసి లేని గొప్పతనాన్ని తెచ్చుకున్నదీ లేదు.

నీకు అర్హత లేదు అని ధ్రువుడితో పలికిన సురుచిది ఎంతటి అజ్ఞానమో నీకు జ్ఞానార్హత లేదు, మోక్షార్హత లేదు అని బోధించేవారిది కూడా అంతే అజ్ఞానం.

“నీ పట్ల కఠినమైన మాటలు మాట్లాడిన ఆమె పట్ల ద్వేషం పెంచుకోకు” అన్న సునీతి ఉపదేశం ధ్రువునికి మాత్రమే కాదు, నేడు తిరస్కరణకు గురి అవుతున్నవారికి కూడా అంతే అవసరం.

పూర్వకాలంలో కూడా మాంసాన్ని అమ్మి జీవించే కులంలో కూడా ధర్మవ్యాధుడు అనే అసామాన్య జ్ఞాని ఉన్నాడని మహాభారతం చెప్పింది. బోయవాడై పుట్టిన కణ్ణప్ప కూడా భక్తావతంసుడయ్యాడని సాక్షాత్తు శంకరాచార్యులంతటి వారే శివానందలహరిలో సాక్ష్యం చెప్పారు.

కాబట్టి, “మనిషి పుట్టుక ఎక్కడ జరిగినా, అది అతడి జ్ఞానసాధనకు గాని, ఉన్నతస్థానసాధనకు గాని ఎటువంటి అడ్డంకి కాబోదు” అని ధ్రువుని కథ ద్వారా తెలిపి శ్రీమద్భాగవతపురాణం మనకు స్ఫూర్తిని ఇస్తుంది.

నేడు మన రాజ్యాంగం అందరూ సమానులే అంటుంది. ఉన్నతస్థానానికి చేరేందుకు అందరికీ అవకాశాలను ఇస్తోంది. ధ్రువునిలా పట్టుదల కలిగినవారు ఎవరైనా తమ అద్భుతకృషితో తాము కోరిన స్థానాన్ని పొందవచ్చు అనడంలో సందేహం లేదు.

జన్మ చేత గాని, బలం చేత గాని, ధనం చేత గాని, అహంకారాన్ని పొంది ఇతరులను తిరస్కరించేవారికి మన పురాణాలు ఇటువంటి గుణపాఠాలను చెబుతూ ఉంటాయి. ఇలా మనకు ఆత్మవిశ్వాసం కలిగించడం మన మతం గొప్పదనం!

Monday, 23 July 2018

నక్క ఉపవాసము

అనగా అనగా ఒక నక్క.
రోంత వయసు ముదురు నక్క.

ఆ నక్క ఒగు దినుము దినాముకట్లే ఆకలి తీర్చుకొనేకి తొండేబిక్కిల్ని, ఉడతలని యెదుకులాడుకుంటా బయలుదేర. దానికంటె ముందరే చిన్న నక్కలు వుషారు వుషారుగా వేటాడేసి కడుపు నింపుకుంటా కానొచ్చె. దీనికిమాత్రం తొండేబిక్కలు, ఉడతలు దొరక్కుండా తప్పిసుకుంటుండాయి. తన కండ్లముందురే కళ్లిచెట్టు బుడుముతాన బొక్కలోకి దూరి దాపెట్టుకున్న తొండేబిక్కిని ఎట్లైనా బయటికి యెల్లబీకల్లని మొన్ను తోగి తోగి దానికి మిగిలిన గోళ్లు కూడా సమిసిపాయ. తన చాటుమాల్నుండి చటుక్కున చెట్టుమిందికెగిరిన ఉడతని పండ్ల మధ్యన యిరికించుకోవల్లని దుంకితే దాని కోరలన్నీ మానులోకి ఇరుక్కుని అర్ధము యిరిగిపాయ.

ఇంత గోరుము జరిగినంక దాని బలమేమో దానికే అర్థమైపాయ. ఇంగ నాకి వయసైపాయరా, అందరితానా యేట్లాడి యేట్లాడి సంపాదిచ్చేది ఇంగ నాకి శాతకాదు అని తెలిసిపాయ. అది యిచారంగా బోయి అడివిలోన గుడికాడ కూకొనిడిశ. ఆ గుడితాన మనుషులు అపుడపుడు కోళ్లూ మేకలూ బలిచ్చి కోసుకుతింటాంటారు. అపుడు ఆడాడ యేమన్నా నేలబడింటే యేరుకుతినొచ్చు అని దాని ఆశ. కానీ, ఆ ఆశ కూడా నిరాశ ఐపాయ.

దావన బొయ్యే ఇంకో నక్క “ఏమిరా అల్లుడూ ఈడ ఇట్ల్నే మొగుము యేలాడదీసుకుని కూకునుండావు? ఈ పొద్దు తొలి ఏకాదశి, అందుకే ఈ పొద్దు ఎవరూ బలిచ్చేది లేదు, నీకు కడుపు నిండేదీ లేదు” అని జెప్పి దాని దోవకి అది బాయ.

కడుపాకలి తట్టుకోలాపుక ఆ నక్క ఇంగ బాగ ఏడిశిడిశ. ఇట్లా టైములో ఏమి చేయాల్నో నేను చదివిన రెండులక్షల పుస్తుకాలలో ఏ వొక్క పుస్తుకంలోనైనా ఉండునా అని బాగ ఆలోచన చేశ. అప్పుడుసగం చిరిగిన యెర్రట్ట పుస్తకంలో తాను చదివిన ఒగు విషయం దానికి నెప్పికొచ్చ.

ఏకాదశీ ఉపవాసవ్రతమాహాత్మ్యము! ఆ పొద్దు పూర్తిగా ఉపాసముంటే దండిగా పున్నెము వస్తాదంట. పున్నెము అంటే ఏమిడిదో దానికి రోంత రోంత తెలుసు. పిట్ట మాంసము, పుంజు మాంసము, మేక మాంసము – ఇవన్నీ కలిపి తింటే - అదీ పున్నెము అంటే! అంతకంటే గొప్ప పున్నెము ప్రపంచంలో యాడ్యాడా ఉండుదని ఆ పుస్తుకములాన ఘోస ఘోస పెట్టి ఉన్న్యారు. దానికి అవకాసము వచ్చింది గదాని, నక్కకి ఆ పొద్దు ఉపాసము ఉండాల్నని బుద్ది పుట్టిడిశ. యెట్లోగట్ల నెలకు రెండు దినాలు ఇట్ల ఉపాసముంటే ఇంక మిగిలిన దినాలన్నీ పున్న్యాలంటే పున్న్యాలు!

ఉపాసమున్నపుడు నీళ్లు దాగినా యేమీ వ్రతభంగం కాదని దానికి తెలుసును. దానికే దగ్గర్లో వుండిన యేటితాకి యెట్లో కాళ్లీడ్సుకుంటాబాయ. యేటి వొడ్డున అనుకోకుండా ఒక దృశ్యం చూసేతలికే దాని కండ్లు మిల మిల మెరిసిపాయ.

సన్న మేకపిల్ల వొగిటి ఆడ మే మే అని అర్సుకుంటా తిరుగుతాండాది. ఎట్ల్నో తప్పిపయినట్లుండాది. రాజుగారి తోటలోన మేతకు బోయి, రాణిగారి పూలచెట్లు మేత మేస్తూ, తోటమాలి కొట్టవస్తే తుర్రుమని కానొచ్చిన దిక్కులో పారి పారి వచ్చిన బుజ్జి మేక అదే! అట్లా దూరుం దూరుం పారి పారొచ్చి వాళ్లమ్మను కానకపాయ. అబుడు శాన బయమేసి నోటిలో ఉన్నశక్తినంతా ఉపయోగిచ్చి గొంతు వూడొచ్చేలా పిలుస్తాంటే అయ్యో పాపుమని యెవురికన్నా కనికరము బుట్టాల్సిందే!

పాపం ఆ బుజ్జి మేకపిల్ల రొంత సేపు ఆ యాకునీ ఈ యాకునీ వాసన జూస్తాది, అర్సతాది. రొంత ముందరకి పొయ్యి జూస్తాది, మళ్లీ యెనిక్కొచ్చి అర్సతాది. పొడుగాటి చెవుల్ని అట్లా ఇట్లా అల్లాడిచ్చుకుంటా తలకాయ తిప్పుతాది, అర్సతాది. రోంత సేపు వంకర టింకరగా అడ్డడ్డుము ఎగర్లాడతాది, అర్సతాది. రెండు గడ్డిపరకలు నముల్తాది, తలెత్తి మళ్లీ అర్సతాది. ఆడ ఒగ యెత్తైన రాయుంటే దాని మింద ముందరికాళ్లు పెట్టి నిలబడి తలకాయ అట్లా ఇట్లా తిప్పుకుంటా అమ్మ కనిపిస్తాదేమో అని దిక్కులు చూస్తాది, అర్సతాది. కాళ్లు నొచ్చుతాయేమో, రోంతసేపు నేలమీద పండుకుని ముకుము డొక్కలా పెట్టుకుంటాది. అంతలోనే, మళ్లీ పండుకుంటే పనులు జరగవని అంతరాత్మ ప్రబోధం జరిగినట్టు లేచి మళ్లీ అర్సతాది. పాపుము అది అట్లా అరిసేతప్పుడు సూడల్ల, నోట్లోంచి నాలుక రొవంత బయటకివచ్చి కానొస్తాది. మెడ ఎంత దూరుము సాచి అరిస్తే అంత దూరుము యినిపిస్తాది, అబుడుమా అమ్మ యాడున్నా పారి పారి నాతాకి వస్తాది అన్నట్ల ఆ సన్న మెడని ఇంత పొడుగు నీలిగిచ్చి నీలిగిచ్చి అర్సతాది. కండ్ల నిండా బయం బయం నింపుకుని అర్సతాది.

నక్క ఆ మేకపిల్లని చాటునుంచి దూరం నుంచి శానా సేపు సూసుకుంటా అట్ల్నే నిలబడినాది. వాళ్లమ్మ ఆడ్నే యాడ్నో వుంటాది, నేను తొందరపడి దాన్ని పట్టుకునేకి పోతే వాళ్లమ్మ వచ్చి నన్ను డొక్కలో కుమ్మి పారేస్తాది అని నక్క భయం నక్కది.
కాని, ఆ మేకపిల్ల యెంతసేపు అర్సినా వాళ్లమ్మ రాకపాయ. ఆర్సీ ఆర్సీ ఆ మేకపిల్ల అలిసిపాయ. నేలమింద పండుకుని ముకుము కడుపులాకి దూర్సుకునిడిశ.

శానాసేపైనా అది మళ్లీ లెయ్యకోకుండేది సూసి నక్క ఇదే మంచి అవకాశమురా దీన్ని పట్టుకునేకి అనుకునింది. మెల్లగా సప్పుడు కాకుండా దానిపక్క పొదల పక్కనే నక్కుకుంటా పాయ. వచ్చ, వచ్చ, దగ్గరకు వచ్చిడిశ! ఇంకా ఆడ్నే వుంది మేకపిల్ల. అమ్మే యెట్లోగట్ల నన్ని యెతుక్కుంటా వస్తాదిలే అనుకునిందో యేమో! అడివిలో గండాలు ఇట్లిట్లా వుంటాయని దానికి యేమి తెలుసు పాపుము?

నక్క ఊపిరి బిగబట్టుకున్య. రెండడుగులు ముందుకేసి ఒక్క దూకు దూకితే, ఇంగ ఆమేకపిల్ల తనదే! విందు భోజనమే! దేముడుండే స్వర్గానికి పోయినా కూడా అంత మంచి భోజనం యెవురూ పెట్టలాపురు అనిపించింది. ఒకటో అడుగు వేసింది. ఇంతలో గాలి వీచి, ఆకులు గలగలలాడినాయి. మేకపిల్ల తల యెత్తింది. నక్క చప్పున వంగి తలను భూమికి ఆనిచ్చిడిశ. పొద యెనుకనున్న ఆ నక్కను మేకపిల్ల కానక పాయ. కాని, యేమో అనుమానమొచ్చి అది అట్ల్నే లేసి నిలబడ. కాని, యాటికీ కదలకపాయ. అది తన దిక్కు చూడలేదని నక్క గమనిచ్చుకుని రెండో అడుగు ముందుకేశ. దాని దురదృష్టము, ఆడ గాలికి కొట్టుకొచ్చిన రెండు ఎండుటాకులు ఉండ్య. నక్క అడుగు పడగానే అవి కరకరమని శబ్దం చేసుకుంట యిరిగిపాయ. మేకపిల్ల చప్పున తలదిప్పి చూసిందీ, నక్కయెగిరి దానిమిందికి దుంకిందీ ఒకేసారి జరిగిపాయ.

కానీ, నక్క మేకపిల్ల మీద పడల్యా. నేలమీదనే పడింది. యేమిటికంటే, మేకపిల్ల దానికంటె ముందరే యెగిరి బండమీదకి దుంకింది. నక్కకి ఆశాభంగమైపాయ. మేకపిల్ల గూడా నక్కను కండ్లారా చూసిడిశ. అంతే! ఒక్కు క్షణుము గూడా ఆడ నిల్సుకోకుండా అట్ల్నే దుంకుకుంటా దుంకుకుంటా యేటిపక్కకి పార్య. నక్క ఆశ యిడిసిపెట్టలాపుక దాన్ని యెంటదరుముకుంట పాయ. యెదురుగ్గా పెద్ద సప్పుడు సేసుకుంటా జోరు జోరున పారుతున్న యేరుని చూసి మేకపిల్లకి బయమేసి పాయ. యెనిక్కి తిరిగేతలికే తనని పట్టుకునేకి పారి పారి వస్తుండిన నక్క కనబడ్య. అంతే! మేకపిల్ల ఇంకేమీ ఆలోచన చేయకుండా యెగిరి యేట్లోకి దుంకిడిశ.

అంతదంకన్నా పారి పారొచ్చిన నక్కకి దానెనికినే యేట్లోకి దుంకేకి దమ్ము లేకపాయ. అట్ల్నే దాన్ని తేరిపారజూసుకుంటా నిలబడుకొనిడిశ. బుజ్జి మేక యేట్లో బడి కొట్టుకుపోతా, అట్లా ఇట్లా కాళ్ళు అల్లాడిచ్చుకుంటా యెట్ల్నో మొత్తానికి అవతలి గడ్డకి పడ్య.

గడ్డకి పడినంక కడుపును అట్లా ఇట్లా అల్లాడిస్తే దాని బొచ్చునుండి నీళ్లన్నీ వానచినుకులా కట్ల టప టప రాలి పడ్య. అప్పుడది యెనిక్కి తిరిగి అవతలి గట్టున నిలబడిన నక్కను చూశ. నక్క గూడా దాన్ని సూసుకుంటానే ఉణ్ణింది. అప్పుడు బుజ్జిమేక ఒకసారి మెడ ముందుకు చాచి నాలుక కొంచెం బయటకు కనబడేలా మే మే అంటూ అరిచింది. ఆనెంక నక్క దిక్క తిరిగి చూడకుండా అరుసుకుంటా అట్ల్నే నడుసుకుంటా ఆదిక్క అట్లే పాయ.

నక్కకి మళ్లీ యేడుపొచ్చ. ఆ వొక్క క్షణం గాలి వీచకుండా ఉండివుంటే – ఆ వొక్క అడుగు తాను యెండిపోయిన ఆకుల మీద వేయకపోయి వుండివుంటే - ఈ పాటికి ఆ బుజ్జిమేక తన కడుపులో చేరి ఆకలి తీర్చి వుండేది! దేవుడు తనకు ఆ అవకాశం ఇవ్వలేదు!

దేవుడు అనుకునేతాలికే నక్కకు బిరీన నెప్పికొచ్చ... – తను సంకల్పించిన ఏకాదశీ ఉపవాసం గురించి. అరెరే! అనుకొన్య.

అవును సుమా! నేను దాని గూర్చి నేను మరిచే పోయినాను! ఈ పొద్దు నేను ఉపాసం ఉండాల్నని అనుకుంటి గదా! మరి ఈ మేక నాకు చిక్కింటే నాకు వ్రతభంగం అయితాండ కదా? అనుకుంది. పశ్చాత్తాపపడింది. నేను చేసింది తప్పే! అనుకునింది. లెంపలేసుకుంది. దేవుడికి క్షమాపణ చెప్పుకుంది. నువ్వే నాకు మేకను చిక్కకుండా చేసి నన్ను మహాపాపం నుండి కాపాడావని మెచ్చుకుంది. గుంజీలు తీసింది. నా బుద్ధిని యెప్పుడూ ఇట్లే సక్రమమార్గంలో నడిపిచ్చు తండ్రీ అనుకుంది. దాని మనసు తేలికపడింది. యెట్లో యేట్లో కాసిని నీళ్ళు గతికి, నెమ్మదిగా గుడి దగ్గరకు బయలుదేరింది.

ఇంతలో మళ్ళీ మే మే అని అరుపులు వినిపించాయి. వెంటనే గబా గబా పక్కనున్న గుట్టెక్కి చూసింది. మేకలమంద! అందులో ఒక మేక కంగారు కంగారుగా అటూ ఇటూ వెదుకుతోంది. బుజ్జిమేకవాళ్ల అమ్మ కాబోలు! నక్కకి నోట్లో నీళ్లు ఊరాయి. ఎన్ని మేకలు! ఎన్నెని మేకలురా దేవుడా! ఇన్ని మేకల్లో ఒక్కటైనా నాకు దొరక్కపోతుందా అనుకుంది. ఉపాసముంటానని దేముడికిచ్చిన మాట దానికి మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది, పక్కనుండే పొదలో ముండ్లు మళ్లీ మళ్లీ గుచ్చుకుంటున్నాయి. హే, అంటూ ఆ ముండ్లను విదిలిచ్చుకుంటూ ఒక్కమేకనైనా ఎట్లా పట్టేది అని ఆలోచనలో పడింది.

దేవుడా, ఏకాదశి ఉపవాసం వదిలి రేపు ద్వాదశినాడు ఉపాసముంటాలే – ఎప్పుడు చేస్తే ఏముంది, ఉపాసం ఉపాసమే కదా! అని దేముడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది.

ఇంతలో హే హే అంటూ మనిషి గొంతు వినిపించింది. మెడ నిక్కించి చూసింది. మంద వెనుక చాలమంది కాపర్లు ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఇంతింతలేసి దుడ్డుకఱ్ఱలు ఉన్నాయి. ఇంక నక్క అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేదు. దేముడా! ఇంక పోస్టుపోనుమెంట్లు లేవు. ఈపొద్దే నా ఏకాదశి ఉపవాసం కన్ఫాం చేసుకో అంటూ గుడిదిక్క పరుగులు తీశ.
***

((DISCLAIMER – ఈ కథ చదువుతున్నపుడు గాని, చదివిన తరువాత గాని, బుజ్జి మేకపిల్ల అంటే “రాజ్యసభ సీటు” అని ఎవరికైనా అనిపిస్తే నా బాధ్యత లేదు. ఏకాదశీ ఉపవాసం చేయడం అంటే “పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడం” అనిపించినా సరే, నా తప్పు లేదు. నక్క ఎవరు అంటూ ఎవరూ నన్ను ప్రశ్నలు వేయవద్దు, మీ ఊహలకు నేను బాధ్యుడిని కాజాలను.))

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...