Wednesday, 6 February 2019

దేవుడు ఎందుకు కనబడటం లేదు?


దేవుడు ఎందుకు కనబడటం లేదు?

శ్రీకాంతుడు పదకొండు ఏండ్ల పిల్లవాడు. ఆరవతరగతి చదువుతున్నాడు. బడికి సంక్రాంతి సెలవులు ఇస్తే స్వగ్రామానికి వెళ్ళాడు. రెండు మూడు రోజుల పాటు తన తోటి పిల్లలతో కలసి గ్రామం చుట్టుపక్కల ఉండే కొండలు, కోనలు, తోటలు తిరిగాడు. పండుగ మూడు రోజులు ఎంతో హాయిగా సంతోషంగా హుషారుగా గడిపేశాడు. సెలవులు మరికొద్ది రోజులు ఉన్నాయి. అపుడు కుటుంబం అంతా కొంత దూరంలో ఉన్న తమ ఇలవేల్పు గుడికి ఎద్దులబండిలో వెడదామని అనుకున్నారు.

కాని, శ్రీకాంతుడు మాత్రం “నేను రాను” అన్నాడు.

“ఎందుకు?” అని అడిగితే, ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం అందరినీ నిర్ఘాంతపరచింది.

“నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడు లేడు”

శ్రీకాంతుడి తాతగారు నవ్వేశారు. “సరే, ముందు మీరు వెళ్లండి! మేము నెమ్మదిగా నడుచుకుని వస్తాము” అని మిగిలిన అందరినీ పంపేశారు.

“రారా కాంతూ, మనం కూడా నెమ్మదిగా నడుచుకుంటూ పోదాం అక్కడికి” అన్నారు.

కాని, మళ్లీ అదే సమాధానం చెప్పాడు శ్రీకాంతుడు.

“సరే, అడవిలో ఏటి ఒడ్డున ఆ గుడి ఉంది. హాయిగా ఇసుకలో ఆడుకోవచ్చు కదా! అందుకైనా పోదాం పద” అన్నారు తాతగారు.

మొత్తానికి తాతామనుమళ్లు నడుచుకుంటూ బయలుదేరారు.

“దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నావు కాంతూ?” అని అడిగారు తాతగారు.

పిల్లవాడు వెంటనే బదులు చెప్పాడు – “ఉంటే కనబడాలి కదా, అదిగో – ఆ రాయిలాగా, ఆ చెట్టు లాగా, ఆ కొండలాగా? అవి ఉన్నాయి కాబట్టి కనబడుతున్నాయి. దేవుడు లేడు కాబట్టి కనబడటం లేదు” అనేశాడు.

“ఏదైనా కనబడకుంటే లేనట్టేనా? నీకు ఇపుడు అమ్మా నాన్నా కనబడటం లేదు, మనకంటే ముందే బండిలో వెళ్లిపోయారు. దూరంగా ఉండటం వలన కనబడటం లేదు. అందువల్ల వారు లేరంటావా మరి?”

“వారిని ఇప్పుడు చూడలేకపోతున్నా. కాని, రోజూ చూస్తూనే ఉన్నాను కదా?”

“ఎవరెస్టు శిఖరాన్ని ఒక్కసారి కూడా నువు చూడలేదు కదా? మరి అది కూడా లేదంటావా?”

“నేను చూడలేదు, నిజమే, కాని, దానిని చూసినవారు, ఫోటోలతో సహా అందరికీ చూపించారు కదా?”

తాత నవ్వాడు. “కాంతూ, నువు మీ నాన్నను చూశావు. మీ నాన్నకు నాన్న అయిన నన్ను చూస్తున్నావు. కాని, నాకు నాన్న అయిన మీ ముత్తాతను చూశావా? లేదు కదా? మరి ఆయన కూడా లేరు అనగలవా?”

“ముత్తాత కాలంలో ముత్తాత ఉన్నాడు తాతగారూ, నేను కాదనటం లేదు. కాని, ఇప్పుడు లేడు కాబట్టి, కనబడటం లేదు. కాని, దేవుడు అలా కాదు కదా, ఆయన అంతటా ఉన్నాడు అంటారు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు అంటారు. మరి కనబడాలి కదా?”

తన మనుమడు తాను ఊహించిన దానికన్నా తెలివైనవాడు అని తాతగారికి అర్థమైంది. ఆయనకు సంతోషం కూడా కలిగింది. చిన్నతనంలోనే దేవుడి అస్తిత్వాన్ని గూర్చి తర్కంతో కూడిన ఆలోచన చేస్తున్నాడు. సరైన మార్గదర్శనం చేసేవారు ఉంటే ఇటువంటివారు భారతీయతను, సంస్కృతిని తరతరాలుగా చాటగలరు, నిలబెట్టగలరు.

“నాయనా, ఉన్న వస్తువు కూడా కనబడకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. మన పెద్దవాళ్లు చెప్పారు. వింటావా మరి?”

“సరే తాతగారూ!”

“అతిదూరాత్ సామీప్యాత్
ఇంద్రియఘాతాత్ మనోऽనవస్థాత్।
సౌక్ష్మ్యాత్ వ్యవధానాభిభవాత్
సమానాభిహారాచ్చ।।”

“అంటే ఏమిటి తాతగారూ?”

“అదేమంటే, కంటికి బాగా దూరంగా ఉండటం వల్ల, ఉన్న వస్తువు కూడా మనకు కనిపించదు. మన వూరికి తిరుపతి దూరంగా ఉన్నది కదా, అందువల్ల కనిపించదు. అలాగే, కంటికి మరీ దగ్గరగా ఉన్న వస్తువు కూడా కనిపించదు. నీ ముఖం నీకే కనబడదు, అద్దంలో చూసుకుంటే తప్ప! అవునా?”

“అవును తాతగారూ!”

“అలాగే, కంటికి ఏదైనా దెబ్బ తగిలినపుడు, కంటి రోగం ఉన్నపుడు కూడా, ఉన్న వస్తువు కనిపించదు. చూడు, మీ అవ్వ కండ్లద్దాలు పెట్టుకుంటే తప్ప పుస్తకం చదవలేదు.”

“అవును తాతగారూ!”

“సరే, మనం ఇప్పటికి చెరువు కట్ట మీద ఇంత దూరం నడుచుకుని చివరకు వచ్చేశాము కదా, కట్టకు ఇటువైపున వేప చెట్లు, చింత చెట్లు బోలెడు ఉన్నాయి కదా? ఏవి ఎన్ని ఉన్నాయో చెప్పగలవా?”

“చెప్పలేను తాతగారూ!”

“అంటే, నువు వాటిని చూడలేదా?”

“చూశాను తాతగారూ!”

“మరి ఎందుకు చెప్పలేవు?”

“ఎందుకంటే, నేను వాటిని చూస్తూనే ఉన్నప్పటికీ, మీ మాటలను శ్రద్ధగా వింటున్నాను తప్ప, అవి ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనే శ్రద్ధ నాకు కలగలేదు కాబట్టి”

“అవును కదా? అలాగే, దేవుడు ఉన్నప్పటికీ, మనకు శ్రద్ధాసక్తులు లేకుంటే మనం ఆ దేవుని నిజస్వరూపాన్ని గ్రహించలేము. ఒప్పుకుంటావా?”

శ్రీకాంతుడు కాసేపు ఆలోచించాడు. “మీరు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది తాతగారూ!”

తాతగారు నవ్వారు. “ఇంకా చెబుతాను చూడు. ఒక వస్తువు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా ఉంటే చూడలేము. నువ్వు సైన్సు విద్యార్థివే కదా, మన చుట్టూ ఉన్న వాతావరణంలో సూక్ష్మజీవులు ఉన్నాయి అని తెలిసినవాడివే కదా, మనకు అవి కనబడటం లేదు కదా?”

“నిజమే తాతగారూ, అవి మన కంటికి కనబడనంత చిన్నవి కాబట్టి కనబడటం లేదు.”

“కాంతూ, మన శరీరంలో గుండె ఉంది కదా? అది నీకు కనబడుతుందా?”

“కనబడటం లేదు తాతగారూ!”

“ఎందువల్ల కనబడటం లేదు?”

“చర్మం వెనుక ఉంది కదా, అందువల్ల కనబడటం లేదు.”

“అంటే, ఏదైనా అడ్డం ఉంటే కనబడదు. కదా?”

“అవును!”

“నక్షత్రాలు ఉన్నాయి కదా?”

“ఉన్నాయి.”

“మరి, అవి ఇప్పుడు ఎందుకు కనబడటం లేదు?”

“పగలు కాబట్టి.”

“అదేమిటి? రాత్రి పూట కంటే, పగటి పూట మనం మరింత బాగా చూడగలం కదా?”

“అంటే, సూర్యుడు నక్షత్రాలకంటే ఎక్కువ కాంతితో ప్రకాశిస్తాడు. అందువల్ల, ఆయన కాంతి ముందు ఇంకేవీ కనబడవు.”

“పోనీ, సూర్యుణ్ణి అయినా నేరుగా చూడగలవా?”

“ఎలా సాధ్యం? అంత కాంతిని చూస్తే మన కళ్లు తట్టుకోలేవు!”

“కాంతూ! నువ్వెప్పుడైనా గురివింద గింజలను చూశావా?”

“చూశాను తాతగారూ!”

“ఇదుగో! ఈ చెట్టుకు కాశాయి చూడు!” అంటూ తాతగారు, దారిలో ఒక పొదలో ఉన్న గురువింద చెట్టుకు ఉన్న కొన్ని కాయలను కోసి దానిలోనుండి ఎరుపు నలుపు రంగులలో ఉన్న గురివింద గింజలను అరచేతిలో పెట్టుకున్నాడు.

“కాంతూ, ఇందులో ఒక గింజను తీసుకో!”

శ్రీకాంతుడు ఒకదానిని తీసుకున్నాడు. “ఎంత నునుపుగా ఉందో!” అన్నాడు.

“సరే, చూశావుగా! ఇక ఆ గింజను మళ్లీ నా అరచేతిలో పెట్టు!”

శ్రీకాంతుడు అలాగే చేశాడు. తాతగారు తన రెండు అరచేతులనూ దగ్గరగా చేర్చి లోపల ఉన్న గింజలను కాసేపు అల్లాడించి మళ్లీ తెరిచి ఆ గింజలను చూపించాడు.

“ఏదీ? నువ్వు ఇంతకు ముందు ఒక గింజను చేతిలో పట్టుకుని చూశావే? మళ్లీ అదే గింజను బయటకు తీసి చూపించు?” అని అడిగాడు.

శ్రీకాంతుడు ఆశ్చర్యపోయాడు. “అదెలా సాధ్యం తాతగారూ? అన్నీ ఒకేవిధంగా ఉన్నాయి కదా? ‘నేను చేతిలోకి తీసుకుని చూసింది ఇదే’ అని ఎలా గుర్తు పట్టగలను?” అని అడిగాడు.

తాతగారు నవ్వారు. “చూశావా నాయనా! మన కండ్లు ఎంతో గొప్పవి అనుకుంటాం. కాని, వీటికి ఎన్నెన్ని పరిమితులు అంటే లిమిటేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకున్నావా? అందువల్ల ఇటువంటి అల్పమైన శక్తి కలిగిన కండ్లతో అపరిమితమైన శక్తి కలిగిన దేవుడిని చూడడం సాధ్యమా?” అని అడిగాడు.

శ్రీకాంతుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత, “తాతగారూ, మీరు ఇపుడు చెప్పింది అంతా బాగా అర్థమైంది” అని చెప్పాడు చిరునవ్వులు చిందిస్తూ.

గుడికి వచ్చి, శ్రద్ధగా పూజలో పాల్గొంటున్న శ్రీకాంతుడిని చూసి, “నడచి వచ్చేటపుడు తాతగారు ఏమి మంత్రం వేశారో” అని అందరూ ఆశ్చర్యపడినప్పటికీ, చాల సంతోషపడ్డారు.
***



యథార్థభారతి (జనవరి, 2019) సంచికలో ప్రచురింపబడిన నా కథ.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...