Wednesday, 13 February 2019

రురుడు - ప్రమద్వర (1)

“సౌర్యాయణీ, పూర్వాహ్నికాలు ముగిశాయా? వస్తావా నాతో పాటు?”
“ముగిశాయి, ఎక్కడికి రమ్మంటున్నావు రురూ?”
“తాతపాదులవారు స్థూలకేశమహర్షివారి చెంతకు పోయి వారి ఆశీర్వాదాన్ని గైకొని రమ్మన్నారు.”
“ఆహా! మహతాం దర్శనం పుణ్యం, తత్పాదస్పర్శనం పాపనాశకం కదా? తప్పక వస్తాను.”
“పాపనాశనం ఏమిటోయ్? నువ్వేమి పాపాలు చేశావని?”
“ఇంతకాలం వారిని చూడకపోవడమే నేను చేసిన పాపం.”
రురువు నవ్వాడు. “సరే, పద.”
<><><>
ఆ ఋషికుమారులిరువురూ స్థూలకేశమహర్షి ఆశ్రమానికి వెళ్లారు, ఆయన ఆశీర్వాదం గైకొని, తమ ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. ఎత్తైన చెట్లనడుమ కాలిబాటలో వారి ప్రయాణం సాగుతోంది.
“ఆహా! సౌర్యాయణా! ఈ ఆరణ్యకసౌందర్యం చూడు! ఎన్నెన్ని వర్ణాల పూవులో!”
“అవును రురూ!”
“ఎంతటి ఘ్రాణప్రమోదకాలైన ఘనపరీమాళాలను ఇవి వెదజల్లుతున్నాయో!”
“అవును!”
“ఎంతటి ఆహ్లాదకరమైన చిరుగాలులు మేనును తాకుతున్నాయో చూడు! మందాకినీతరంగాలపై నుండి వస్తున్న ఈ గాలులు అనుష్ణాలు, నాతి శీతలాలు, తగిలిన వెంటనే రోమాంచం కలిగించుతున్నాయి కదా?”
సౌర్యాయణి ఆశ్చర్యంగా చూశాడు. “రురూ! ఏమిటీ వివశత్వం? ఏమైంది ఈ రోజు నీకు?”
“ఏమో! చూడు! మందపవనాలు అల్లలాడిస్తూ ఉంటే పూలనుండి మకరందపు బిందువులు వచ్చి ముఖం మీద పడుతున్నాయి. వాటి మాధుర్యం వల్ల కలిగిన మత్తులో నా మాటలు తడబడుతున్నాయి అంటావా?”
“రురూ! జితేంద్రియుడవని గురువులందరూ నిను గూర్చి గొప్పగా చెప్పుకుంటారే? చ్యవనమహర్షులవారి ప్రపౌత్రుడవు, ప్రమతిమహాత్ముల కుమారుడవు, స్వయంగా మహాతపస్వివి, నీకు ఈ వికారభావాలు పుడుతున్నాయేమయా?”
“ఏమో, తెలియడం లేదు, నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. నాహమస్మి వశే మమ. ఈ ప్రాంతంలో అజేయమైన ఏదో మాయ లేదు కదా?”
“ఏమో! నీ పరిస్థితి చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. బహుధా శ్రేయసే, మనం ఈ క్రొత్త మార్గంలో కాకుండా, మునుపు మనకు తెలిసిన మార్గంలోనే పోదాం పద!”
“అరె! సౌర్యాయణీ, విను! ఆ మధురకలకలనాదాలు! ఏ పక్షులు ఎటువంటి మధురఫలాలు తిన్నాయో, ఆ మహిమతోనే అవి అంతటి శ్రవణపర్వాలైన శబ్దాలను చేస్తున్నాయి సుమా! పద! ఒక్కసారి ఆ పక్షులు ఎలా ఉంటాయో చూసి వద్దాం!”
“రురూ! నువ్వు పూర్తిగా పరవశుడవైపోతున్నావు. నువు ధరించిన కృష్ణాజినమే నిను శబ్దలోలుడిని చేస్తోందా ఏమి? క్షణకాలం నీవెవరవో, నీ ప్రవృత్తి ఎలా ఉండాలో గుర్తుంచుకో! పద! వెనుదిరిగుదాం!”
“ఒక్కసారి ఆ పక్షులను చూస్తాను సౌర్యాయణీ! వాటి పలుకులను మరొక్కమారు తనివితీరా వింటాను!”
“పక్షులు మన ఆశ్రమం నిండా ఉన్నాయి కదా రురూ! అక్కడకు వెళ్లిన తరువాత విందువు గానిలే!”
“నిజమే, అనేకమైన పక్షులు ఉన్నాయి. కాని, ఇంతటి మనోహరమైన శబ్దాలు మాత్రం అశ్రుతపూర్వాలు. ఆ పక్షులు ఎలా ఉంటాయో చూద్దాం పద” అంటూ సౌర్యాయణి కోసం ఎదురుచూడకుండా ఆ శబ్దాలు వినిపించినవైపు నడిచాడు రురువు.
సౌర్యాయణి విధి లేక అనుసరించాడు.
కాసేపు గడిచాక తన కన్నులను తానే నమ్మలేకపోయాడు రురువు. అవి పక్షుల శబ్దాలు కావు, అక్కడ ఒక పుష్పవనం ఉన్నది. అక్కడ ఒక జగదేకసుందరి తన స్నేహితురాండ్రతో కలసి పుష్పాపచయనం చేస్తూ మాటాడుతోంది. ఆమెను చూసి రురువు విభ్రాంతచిత్తుడై పోయాడు. అనిమేషుడైపోయాడు. స్తంభీభూతశరీరుడైపోయాడు.
సౌర్యాయణి మిత్రుని అవస్థ చూసి కంగారు పడి, “రురూ, రురూ!” అంటూ భుజంపై చేయి వేసి కదిపాడు.
ఆ శబ్దానికి ఆ యువతులందరూ తమ దృష్టిని మళ్లించి ఆ ఇద్దరు ఋషికుమారులను చూశారు. అందులో ఒక ఋషికుమారుడు నిర్నిమేషంగా తమలో ఒకరిని చూస్తూ ఉండటం గమనించారు.  ఇంతలో వారిలో ఒక యువతి ముందుకు వచ్చింది.
“ఋషికుమారులారా! స్వాగతం. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి” అంటూ పలికింది.
రురువు ముందుకు అడుగు వేశాడు. సౌర్యాయణి అతడి చేతిని పట్టుకుని ఆపివేశాడు.
“అమ్మా, క్షమించండి! మీరున్న ప్రాంతానికి తెలియక వచ్చాము. మీ అందరికీ నమస్కారాలు. ఇక వెళ్లి వస్తాము” అన్నాడు.
రురువు చేతిని పట్టుకుని లాగుకుంటూ వెళ్లిపోతున్నాడు. రురువు మాటిమాటికీ వెనుదిరిగి తన మనసును అమాంతం ఆకర్షించిన ఆ యువతిని చూస్తున్నాడు.
“రురూ! నువు నీ వంశానికి తగని పని చేస్తున్నావయ్యా! గురువులు చెప్పిన పాఠాలను స్మరించుకో! ఈ మోహం నీకు తగదు! ఆనందమనే అలలపైన తేలియాడవలసిన నీ మనోనౌకకు ప్రేమ అనే చిల్లు పడితే దుఃఖమనే గభీరమైన సముద్రంలో మునిగిపోతుందయ్యా! దానితో పాటు నువు కూడా మునిగి పోతావు. త్వరగా మన ఆశ్రమానికి మనం పోదాం పద! సర్వమనోవికారాలకూ అది భైషజ్యస్థానం!” అంటూ సౌర్యాయణి మిత్రుడికి నచ్చజెపుతూ లాగుకొని పోతున్నాడు.
ఇంతలో ఒక యువతి పరుగుపరుగున తమ చెంతకు రావడం గమనించాడు రురువు. 
“వారికి మన సహాయం అవసరమైనట్టు ఉంది. ఒక్క క్షణం ఆగు మిత్రమా!” అన్నాడు.
ఆమాట విని సౌర్యాయణి ఆగాడు.
పరుగెత్తుకు వచ్చిన ఆ యువతి రురువు చేతిలో ఒక కెందామారను ఉంచింది. “స్వామీ, మీకు మా చెలి ప్రమద్వర ప్రేమపూర్వకంగా ఈ కానుకను ఇచ్చి రమ్మంది” అని చెప్పింది. సౌర్యాయణి చేతిలో కొన్ని ఫలాలను ఉంచి, “స్వామీ, సోదరసమానులైన మీకు మా చెలి ప్రమద్వర భక్తిపూర్వకంగా ఈ కానుకను ఇవ్వమని కోరింది” అంటూ చెప్పింది.
“ప్రమద్వర ఎవరు?” అని అడిగాడు సౌర్యాయణి.
అది తాను కూడా స్వయంగా అడుగుదామనుకున్న ప్రశ్న కాబట్టి, రురువు కూడా సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
“స్వామీ, మీ మిత్రులు అనిమిషులై ఎవరిని చూస్తున్నారో, ఆమెయే ప్రమద్వర. స్థూలకేశమహర్షులవారి కుమార్తె.”
తన మిత్రుని చాంచల్యం వారికి కూడా విదితమైనందుకు సౌర్యాయణి సిగ్గుపడ్డాడు. “మా అపరాధానికి మన్నించండి. ఈవైపున మీరు ఉంటారని తెలియక ప్రమాదవశాత్తు వచ్చేశాము.”
“లేదు స్వామీ, మీ దర్శనం మాకు భాగ్యవశాత్తు కలిగిందని భావిస్తున్నాము. మీరు దయతో మా ఆతిథ్యాన్ని అంగీకరిస్తే మేము మరింత భాగ్యవంతులమని భావిస్తాము.”
“అమ్మా, మీకు మేము ఆదరపాత్రులమైనందుకు మిక్కిలి ధన్యులమైనాము. మీ స్నేహితురాలి తండ్రిగారి ఆశీస్సులను, వారి ఆతిథ్యాన్ని కూడా పొంది, మేము మా ఆశ్రమానికి మరలిపోతున్నాము. ఆలస్యమైతే సాయాహ్నికాలకు ఆటంకాలు కలుగవచ్చు. మన్నించండి.” అంటూ సౌర్యాయణి రురువు భుజం తట్టాడు, కదలమని సూచిస్తూ.
అప్పటికీ రురువు దూరంగా ఉన్న ప్రమద్వరవైపు పదే పదే చూస్తూ, అనిష్టంగానే కదిలాడు.
ఇంతలో ఆ యువతి చొరవ చేసి, “స్వామీ, కనీసం మీ పరిచయభాగ్యమైనా మాకు కలుగనివ్వండి” అని అడిగింది.
అయితే, అంతవరకూ ఎంతో సహనంతో మాట్లాడిన సౌర్యాయణికి చప్పున కోపం వచ్చింది. పెదవులు కంపించిపోతూ ఉండగా, “ఏమమ్మా? మా మిత్రుడిని ఇంతటితో వదిలిపెట్టదా మీ ప్రమద్వర? మా అపరాధానికి మేము క్షమాపణలు చెప్పాము కదా? అయినా ఎందుకు ఇలా మమ్మల్ని వేధిస్తారు?” అన్నాడు.
ఋషికుమారుని కోపానికి ఆ యువతి చిగురుటాకులా వణికిపోయింది. మరొక్క మాట కూడా అధికంగా మాట్లాడకుండా తలవంచి, నమస్కరించి, చప్పుడు చేయకుండా వెనుదిరిగిపోయింది.
ఇంత జరిగినప్పటికీ, ఆవైపే చూస్తున్న రురువును చూసి సౌర్యాయణికి మరింత కోపం వచ్చింది.
“ఏమయ్యా రురూ? నువు చదువుకున్న శాస్త్రాలను నువే అవమానపరుస్తున్నావు. నువు చేసిన తపస్సునంతా నువే వ్యర్థం చేసుకుంటున్నావు. నీ కఠోరనియమాలకూ వ్రతాలకూ నువే చెల్లుచీటీ వ్రాస్తున్నావు. నీ బ్రహ్మచర్యానికి నువే నిప్పు పెట్టుకుంటున్నావు. నీతో పాటు బయలుదేరినపుడు మా రురువు బాగానే ఉన్నాడే? మరి ఇపుడు ఎందుకు ఇలా మారిపోయాడు? నువు పక్కనే ఉండి కూడా ఎందుకు అలా జరగనిచ్చావు?” అని మీ తండ్రి అడిగితే నన్నేమి సమాధానం చెప్పమంటావు? పద పద. ఇక వెనుదిరిగి చూడకు. చూశావో, నువు నన్ను హత్య చేసినట్టే భావిస్తాను” అంటూ సౌర్యాయణి రురువును గద్దిస్తూ చర చరా అక్కడినుండి లాగుకుని పోయాడు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...