Showing posts with label Devotee. Show all posts
Showing posts with label Devotee. Show all posts

Sunday, 11 November 2018

బొంబాయి మెయిలు - సొరకాయల స్వామి

1902 వ సంవత్సరం.
ఖచ్చితంగా చెప్పాలంటే 06/08/1902 తేదీ.
మద్రాసు రైల్వే స్టేషన్.
ఉదయం 5:20 సమయం.

ఒకటవ నంబరు ప్లాట్‌ఫాం మీద బొంబాయి మెయిల్ ఉంది. అరక్కోణం, పుత్తూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్లుల మీదుగా బొబాయికి బయలు దేరడానికి ఇంకా అర్ధగంటకుపైగా సమయముంది. స్టీమ్ ఇంజన్ పక్కనుండి తెల్లని ఆవిరిపొగలు కక్కుతోంది.

జనాలు తండోపతండాలుగా ప్లాట్‌ఫాం మీద ఉన్నారు. వారెవరూ ప్రయాణీకులు కారు. అందరూ తమిళంలోనూ తెలుగులోనూ రెండుభాషలను మిశ్రం చేసి మాటాడేసుకుంటున్నారు. స్టేషన్‌మాస్టర్ అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జనాల చేతుల్లో పూలదండలున్నాయి. పండ్లున్నాయి. ఎవరో ప్రముఖులు ఈరోజు ఈరైల్లో ప్రయాణం చేయబోతున్నారని అతనికి అర్థమైంది. ఎవరైయుంటారు? ఎవరికి వీడ్కోలు పలకటానికి వచ్చారు ఇంతమంది నేటివ్సు?

రైలు గార్డుకు టెన్షన్ వచ్చింది. ఆ ప్రముఖుడెవరో త్వరగా వచ్చేస్తే సమయానికి బయలుదేరొచ్చు. ఆయన సమయానికి రాకుండా, రైలు ఎక్కకుండా, రైలును బయలుదేరదీస్తే ఆ ప్రముఖుని ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుంది! అలా చేస్తే పై అధికారులు తనను చీవాట్లు పెడతారు. ఆ ప్రముఖుని స్థాయి ఎంత గొప్పదైతే తనకు అంత దండన తప్పదు. ఆయన ఆంగ్లేయ అధికారి ఐతే ఉద్యోగం ఊడినా ఊడవచ్చు. ఆలస్యమైతే ఆయన వచ్చేంతవరకు రైలును ఇక్కడే నిలపవలసిందేనా?.... తన ఉద్యోగం మీద తనకే చిరాకు వేసింది గార్డుకు. ఇంజన్ డ్రైవర్ ఉద్యోగం చాల నయం! సిగ్నల్ ఇచ్చి, ఈల వేసి, పచ్చ జెండా ఊపితే నడుపుకు పోవడమే అతని వంతు. ఎందుకు నిలపలేదయ్యా అంటే గార్డ్ పొమ్మన్నాక బండి నడపాల్సిందే కదా అని నెపం అతడి మీద వేసి తప్పుకోవచ్చు. మరి గార్డు? ఇంతలో గార్డుకు తటాలున ఇంకొక ఆలోచన వచ్చింది. రైలు స్టేషన్‌లో ఉన్నంతకాలం స్టేషన్‌మాస్టర్‌దే బాధ్యత! ఆయన పొమ్మన్న తక్షణం నేను డ్రైవరును పొమ్మంటాను. నాదేం తప్పు ఉండదు అనుకున్నాడు.

స్టేషన్‌మాస్టరు కూడా ఆందోళనలోనే ఉన్నాడు. డ్రైవరు ఉద్యోగం గార్డు ఉద్యోగం ఎంతో నయమనుకుంటున్నాడు. కాకపోతే అతడి ఆందోళన కాస్త విభిన్నమైనది. అతడు జాతిరీత్యా తెల్లవాడు. అధికారులకోసం రైలును ఆపవచ్చునని అతడికి సూచనలున్నాయి. భారతీయుల్లో ఎంతటి ప్రముఖుడైనా రైలును ఒక్క క్షణం కూడా ఆపనవసరం లేదు... అందువల్ల ఆ విషయంలో భయం లేదు. కాని, అటువంటి అధికారి ఎవరూ ఆరోజు వస్తున్నట్టు తనకు ముందస్తు సమాచారం లేదు. అయినా, అతడొస్తాడని తెలిస్తే తన విచక్షణాధికారంతో ఆపేయవచ్చు. కాని తీరా ఆ వచ్చేది ఎవడో నల్లజాతి ప్రముఖుడైతే మాత్రం తాను తమవారందరిలోనూ నగుబాట్ల‌పాలు కావడం తథ్యం. ఆ మాట అటుంచితే, తన పై అధికారులు తనను డిస్మిస్ చేసిపారేస్తారు!

ఆందోళనలో ఉన్న స్టేషన్‌మాస్టరుకు క్రమంగా బుర్ర చురుకుగా మారింది. ఈరోజుకు అంత ప్రమాదం జరగకపోవచ్చు... వచ్చిన జనమందరూ నల్లవాళ్లు. నేటివ్సు. అందులో ధనవంతులే కాక చాలమంది సామాన్యజనం కూడా ఉన్నారు. ఇలాంటి వారెవరూ తెల్ల అధికారులకు వీడ్కోలు పలకడానికి రారు. కాబట్టి, రైలును సరైన సమయానికే బయలుదేరమనవచ్చు. గట్టిగా మాట్లాడితే ఐదు నిమిషాలు ముందుగా పంపేసినా అడిగేవారెవరూ ఉండరు. థాంక్ గాడ్! అతనిలో ఆందోళన కాస్త తగ్గింది. ఆసక్తి పెరిగింది.

మరి, ఇప్పుడెవరి కోసం వచ్చినట్టు ఇందరు జనాలు? కాస్త చిరాకు కూడా కలిగింది. ఆఫ్టరాల్, ఓ నల్లోడి కోసం ఇందరు జనాలా? మహారాష్ట్రంలో బాలగంగాధర తిలక్ లాంటి బ్లాక్ లీడర్ వస్తే ఇలా అపుడపుడు ఇలా జరుగుతూ ఉంటుందని విన్నాడు. అయినా రైల్వే అధికారులు ఆయనగూర్చి పట్టించుకోకుండా సిగ్నల్ ఇస్తారని, రైలును సరైన సమయానికి పంపి తమ డిగ్నిటీని కాపాడుకుంటారని వారి వీరోచితకృత్యాలు విన్నాడు. తనకు కూడా ఈరోజు అటువంటి వీరుల లిస్టులో చేరే సువర్ణావకాశం వచ్చినట్టుంది! అతడికి కాస్త ఆశ కలిగింది. అటువంటి డిగ్నిఫైడ్ మెరిట్ లిస్టులో ఉండేవారికి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చిన దాఖలాలున్నాయి. కాస్త హుషారు కూడా పెరిగింది.

"హూ'జ్ కమింగ్? హూ ఆర్ దె వెయిటింగ్ ఫా?' అని తన అసిస్టెంట్‌లను దర్పంగా అడిగాడు. "స్వామి వస్తున్నాడని ఆ జనాలు మాటాడుకుంటున్నారు" అని చెప్పారు వారు.

"ష్వామీ? ఈజ్ ఇట్ వివేకానందష్వామీ? నో. నో. హీ ఈజ్ నో మో. దిస్ మస్ట్ బీ సమదా ష్వామీ. హూ కుడిట్ బీ?"

స్టేషన్ మాస్టర్‌కు అంతకు ముందుండిన భయమంతా క్షణంలో పోయింది. అంతే కాదు, కాస్త నిరాశ కూడా కలిగింది. నల్ల రాజకీయనాయకులను ఎదిరించి, తిరస్కరించి, అవమానిస్తే తమ వర్గంలో వచ్చేంతటి కీర్తిప్రతిష్ఠలు ఎవరో ఓ నల్లస్వామిని అవమానిస్తే రాదు. ఇలాంటి స్వాములను ఏం చేసినా తనకు ప్రమోషన్ రాదు! తన నోటి ముందరి కూడును ఎవరో తటాలున లాక్కున్నంత కోపం వచ్చింది అతనికి.

ఇంతలో - "స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు" అనే కలకలం వినిపించింది. ప్లాట్‌ఫాం మీద చెదురుమదురుగా ఉన్న జనాలందరూ ఆ స్వామి స్టేషన్‌లో అడుగుపెట్టినవైపు పరుగుతీశారు.

స్టేషన్‌మాస్టర్‌కు ఇదంతా మరింత చిరాకును తెప్పించింది. "దీజ్ బ్లడీ ష్వామీజా స్పాయిలింగ్ ద క్రౌడ్స్. దీజ్ బెగ్గర్సారాఫ్ నో యూజ్. దెయారెండార్సింగే డర్టీ రెలీజియన్ అండ్ మేకింగ్ ఆలాఫ్ యు షేమ్‌లెస్ బెగ్గార్స్" అంటూ తన అసిస్టెంట్లమీద గట్టిగా అరిచేశాడు. వారు నివ్వెరపోయారు. ఏమిటి ఈయనకు ఇంత అసహనం అనుకున్నారు. పాపం, వారికేం తెలుసు ఆయనలో జరిగిన అంతర్మథనం?

వారందరూ తనను తేరిపారచూస్తూండగా, "లెట్ ద ట్రైన్ స్టార్ట్ ఇమ్మీడియేట్లీ. లెట్ ద సిగ్నల్ బీ గివెన్. వైయార్యూ డిలేయింగ్? టైమీజ్ టైమ్. ఇట్ డజన్ట్ వెయిట్ ఫా ఎనిబడీ, హూ ఎవా ఎట్ మే బీ" అని గట్టిగా అరిచాడు స్టే. మా.

"సర్, షెడ్యూల్ ప్రకారం ఇంకా ఇరవైనిమిషాలుంది" అని చెప్పారు వారు విస్తుపోయి. స్టే. మా. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, " ఇట్సోకే, ఫాలో ద టైమ్" అన్నాడు.

"యెస్ సర్".

స్టేషన్ మాస్టర్ తన గదిలోనికి వెళ్లిపోయాడు. తన కుర్చీలో కూర్చున్నాడు. తన మానసికస్థితికి అతడికి భయం వేసింది. ఎందుకు తన నల్ల అనుచరులముందు తాను ఇలా అదుపు తప్పి ప్రవర్తించాడు? తన మాతృదేశమైన ఇంగ్లండుకు దూరంగా, ఈ నల్లదరిద్రుల దేశంలో బ్రతకడం తనకు ఇష్టంలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఇలా బయటపడిందా? ఈదేశంలో మంచి జీతం వస్తుంది. అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఉంది. తన పిల్లలకు మంచి విద్యనందించే బ్రిటిష్ స్కూళ్లు కూడా ఉన్నాయి. ఎదురు తిరగకుండా నమ్మకంగా పనిచేసిపెట్టే సేవకులున్నారు. రాజాలాంటి జీవితం. అయినా తనకెందుకు ఈ అసంతృప్తి? తాను తెల్లవాడినన్న అహంకారమే తన మానసికస్థితికి మూలబీజమా?

అతని గది తలుపులు మూసివున్నా, ప్లాట్‌ఫాం మీద జనాల కోలాహలం వినిపిస్తోంది. ఇంతలో రైలు కూత గట్టిగా వినిపించింది. గడియారం చూశాడు. సరిగ్గా ఆరు గంటలు. అతడు తనను చూసిన మరుక్షణం ఆ గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. నిట్టూర్చాడు.

పది నిమిషాలు గడిచింది. అతని అసిస్టెంట్ తలుపు తట్టి లోనికి వచ్చాడు. "సర్! ఇంజన్ పాడయింది. రైలు కదలటం లేదు." అని చెప్పాడు.

"వాట్?" అని లేచాడు స్టే.మా. గబ గబా ఇంజన్ దగ్గరకు పోయాడు. "వాట్స్ ద ప్రాబ్లం?" అని డ్రైవర్లను అడిగాడు. తెలియటం లేదన్నారు వారు.

"ట్రయగైన్. టేకవే ద ట్రైన్ వాటెవా మే బీ ద కండిషనాఫ్ ద ఇంజన్"

ఆ మాట చెప్పాల్సివస్తే చెప్పాల్సింది ఇంజనీరే కాని, అతడు కాదు. ఆ మాట అన్నందుకు స్టే. మా.ని అరెస్టు చేసి కోర్టులో విచారించవచ్చు.

"నో నో" అన్నాడు ఇంజనీర్. "ఆఫీసర్! ఇంజన్ మారుద్దాం. ట్రైన్ హాజ్ టు రన్ ఎ వెరీ లాంంగ్ డిస్టెన్స్. ఇ'ట్ల్ బీ డేంజరస్ ఇఫ్ ఇట్స్ రాంగ్ విద్దిసింజన్".

"ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్"

మరొక ఇంజన్ వచ్చింది. పాత ఇంజన్‌ను పక్కకు లాగేశారు. కొత్త ఇంజన్‌ను తగిలించారు. అప్పటికే అర్ధగంట ఆలస్యమైంది. స్టేషన్ మాస్టర్ పచ్చ జెండా ఊపాడు. గార్డ్ కూడా విజిలేసి జెండా ఊపాడు. ప్లాట్‌ఫాం మీద జనాలు వెనక్కు జరిగి నిలుచున్నారు. రైలు కూత వేసింది. ఇంజన్ తెల్లని ఆవిర్లు చిమ్మింది. కాని, మళ్లీ అదే సమస్య వచ్చింది! ఇంజన్ కదలలేదు. డ్రైవర్లు గట్టి ప్రయత్నం చేశారు. ఇంజన్ ఒక్క లిప్తకాలం పైకి లేచి మళ్లీ పట్టాల మీద కూర్చుంది. ఆ క్షణకాలంలో పిస్టన్ కు అనుసంధానించబడివున్న చక్రాలు గిరగిరగిర తిరిగాయి. కాని, మొత్తానికి రైలు మాత్రం కదలలేదు.

"వాట్ ద హెల్లీజ్ హ్యాపెనింగ్?" స్టేషన్ మాస్టర్ కోపంగా అరిచాడు.

"డో'న్నో ఆఫీసర్!" అన్నాడు ఇంజనీర్. రైలు పెట్టెలకు అనుసంధానించేంతవరకు చక్కగా నడిచివచ్చిన ఇంజన్ హఠాత్తుగా ఇప్పుడెందుకు మొరాయిస్తోందో అతడికి అర్థం కావటంలేదు.

రైలుకు దూరం జరిగిన జనాలు మళ్లీ దగ్గరకు వచ్చారు. "దీజా ద మోస్ట్ ఇన్‌డిసిప్లిన్డ్ క్రౌడ్జాంద అర్త్! ఆస్క్ దెమ్ ఫస్ట్ టూ మూవవే ఫ్రం ద స్టేజ్షన్!" అని పెద్దగా గొంతెత్తి మళ్లీ అరిచాడు స్టే.మా.

జనాలెవరికీ అతడి అరుపులు పట్టలేదు. తమ ధోరణిలో తామున్నారు. ఇంతలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ తన పై ఆఫీసరు దగ్గరకు వచ్చాడు. "సర్! ట్రైన్‌లో సొరకాయల స్వామి ఉన్నారు. ఆయన శిష్యుడెవరో ఇంకా రాలేదట. అతడొచ్చేవరకు రైలు కదలదని శాసనం చేసి, తన చేతికర్రను రైలుకు నిలువుగా ఆనించి నొక్కిపట్టాడట! అందువల్ల రైలు కదలటం లేదని జనాలు అనుకుంటున్నారు" అని చెప్పాడు.

"యూ డర్టీ మైండ్! హవీజిట్ పాజిబుల్? డోం'టాక్ రబ్బిష్" అని కసురుకున్నాడు స్టే. మా.

ఇంజనీరు మరికాసేపు ప్రయత్నం చేసి చేతులెత్తేశాడు. " ఆఫీసర్! ఇంజన్‌లో ఎక్కడా ఏలోపమూ కనబడటం లేదు. చక్రాలు చక్కగా తిరగడం మీరు కూడా చూశారు. అయినా ఇంజన్ కదలటం లేదు. ఇంజన్ లాగలేనంత భారం వెనుకనున్న పెట్టెల్లో ఉండి ఉండాలి. అదే నిజమైన పక్షంలో ఎన్ని ఇంజన్లు మార్చినా ఇదే సమస్య మళ్లీ మళ్లీ వస్తుంది" అని చెప్పాడు.

స్టేషన్ మాస్టర్ నమ్మలేకపోయాడు. నాలుగువేల హార్స్‌పవర్‌తో కూడిన ఇంజన్ కేవలం మనుషులు మాత్రమే ఎక్కిన పది పెట్టెలను లాగలేకపోవటమా? పెట్టెలనుండి విడదీసి ఇంజన్‌ మాత్రం నడుస్తుందో లేదో నడిపిచూడమన్నాడు. అలాగే చేశారు. ఇంజన్ చక్కగా నడిచింది. స్టే. మా. దిగ్భ్రాంతి చెందాడు. ఒక్కసారి తన అసిస్టెంట్‌వైపు తేరిపారచూశాడు.

"వేరీజ్ ద ష్వామీ?"

తలకు రెండింతలున్న తలపాగా. తెల్లటి గడ్డం, మీసాలు. నుదుటన, గుండెల మీద, చేతులమీద వెడల్పాటి వైష్ణవనామాలు. భుజం మీద పాత బొంత, మొలకు ఓ గోచి గుడ్డ, చంకలో ఒక సొరకాయ డొప్ప, కన్నుల్లోనూ పెదవుల్లోనూ చల్లని మందహాసం. ప్రశాంతమైన వదనం. బక్కచిక్కి ఉన్నప్పటికీ, అమితమైన తేజస్సుతో వెలిగిపోతూ, రైలులో కూర్చుని, చేతిలో కఱ్ఱను నిలువుగా ఆనించి పట్టుకుని, జనాలతో మాట్లాడుతున్నాడు సొరకాయల స్వామి.

స్టేషన్‌మాస్టర్‌ రాగానే జనాలు ఆయనకు దారి ఇచ్చారు. స్వామికి అతడు భారతీయుల పద్ధతిలో నమస్కారం చేశాడు.

స్వామి చిరునవ్వు నవ్వాడు. "రా! రా! నీ కోసమే ఎదురు చూస్తున్నా" అన్నాడు. స్వామితో కోపంగా ఏమేమో మాట్లాడాలనుకున్న అతడు మళ్లీ నమస్కారం మాత్రం పెట్టి ఊరుకున్నాడు. "మరేం భయం లేదు, నీ చింతలన్నీ తీరిపోతాయి" అన్నాడు స్వామి. ఆ మాటలను ఎవరో అనువదించి చెప్పారు అతనికి. అతడు తలాడించి మళ్లీ నమస్కారం చేశాడు.

"ఏదో అడగాలని వచ్చావు. ఏమిటది?"

"ష్వామిజీ, ఆలార్ సేయింగ్ దట్ యు హావ్ స్టాప్డ్ ద ట్రైన్ ఫ్రం మూవింగ్. ప్లీజ్ రిలీవిట్ ష్వామిజీ".

"రైలును నేనే ఆపానని నిజంగా నువ్వనుకుంటున్నావా?"

"యెస్, ష్వామిజీ!"

సొరకాయలస్వామి చిరునవ్వు నవ్వాడు. నిలువుగా పట్టుకున్న కఱ్ఱను అడ్డంగా తిప్పి, సీటు మీద పెట్టాడు. "ఇప్పుడు కదులుతుంది పో!" అన్నాడు.

"థాంక్యూ ష్వామిజీ! పెర్మిట్ మి టు డు మై డ్యూటీ!" అని స్టేషన్‌మాస్టర్ మరొకసారి నమస్కారం చేసి గబ గబ రైలు దిగి ఇంజన్‌ దగ్గరకు వెళ్లాడు. జండా వూపి రైలును తీసుకుపొమ్మని డ్రైవర్లతో చెప్పాడు. గార్డ్ కూడా జండా వూపాడు. రైలు కదిలింది. అందరూ ఆశ్చర్యపోయారు. రైల్లో వెళ్లిపోతున్న స్వామికి మరోమారు నమస్కరించాడు స్టేషన్‌మాస్టర్.

రైలు ప్లాట్‌ఫాం వీడేదాకా ఆగి, తన అసిస్టెంటుతో, "హౌ అండ్ వై ద ష్వామీజీ ఫైనలీ అలౌడ్ ద ట్రైన్ టు మూవ్ వితౌట్ హిజ్ డిజైపుల్? "మరి ష్వామి తన శిష్యుడు రాకుండానే రైలును ఎలా, ఎందుకు కదలనిచ్చాడు?" అని అడిగాడు స్టే.మా.

"మీరే ఆ అజ్ఞాత శిష్యుడై ఉంటారు సర్. మీరు వచ్చిన తరువాతనేగా స్వామీజీ కఱ్ఱను తీసి పక్కన పెట్టారు?" అన్నాడు అసిస్టెంట్.

స్టేషన్‌మాస్టర్ దిగ్భ్రాంతి చెందాడు. తల తిప్పి చూశాడు. రైలు దూరంగా కూతవేస్తూ, పొగను ఎగజిమ్ముతూ పోతూవుంది. మరోసారి భక్తితో ఆ రైలువైపు తలవంచి నమస్కరించాడు.

Tuesday, 4 September 2018

హే కృష్ణా! గోవులకు మాత్రమే శుభమస్తా? గేదెలకు వద్దా? (2)




“నాయనా, చాల కాలం క్రితమే మంచి బుద్ధిని అందరికీ ప్రసాదించాను.  కాని, దానిని ఇపుడు అందరూ అపార్థం చేసుకుంటున్నారు.”

“ఏమిటి ఆ బుద్ధి స్వామీ?”

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యమ్.

“.....”

“ఏమి నాయనా ముఖం విచిత్రంగా పెట్టావు?”

“అది కాదు స్వామిన్, గోవులు బ్రాహ్మణులకు మాత్రం శుభం కలిగితే చాలా? గేదెలకు మేకలకు శుభం వద్దా?  క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా మిగిలినవారికి శుభం కలుగవద్దా?  చాల అన్యాయం స్వామిన్!”

“నాయనా!  ఎంత బుద్ధిహీనమైన మాట పలికావు!  ఆ సుభాషితం నీకు అర్థం కావాలంటే నీకు మరి కాస్త బుద్ధిని ప్రసాదించాల్సిందే!”

“అయ్యో!  స్వామిన్!  అపరాధాన్ని క్షమించండి.  శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్.”

“గోవు అనేది ఇక్కడ ఒక జాతి కాదు, మానవేతరసర్వప్రాణులకూ అది సంకేతాత్మకంగా వాడబడింది.  అంతే.   గోవులకు శుభం కలగాలి అంటే – గేదెలు, మేకలు, గొర్రెలు, చెవులపిల్లులు, చీమలు చెదలతో సహా అన్ని ప్రాణులకూ శుభం కలగాలి అని అర్థం.  అలాగే బ్రాహ్మణులు అనే పదం సమస్తమానవజాతులకూ శుభాన్ని కోరేవారికి సంకేతాత్మకంగా వాడబడిన పదం.”

“స్వామీ అర్థం కాలేదు.”

“సరే, అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు?”

“చతుర్వర్ణాలలోనూ ప్రథముడు.  అగ్రజన్ముడు.” 

“అగ్రజన్ముడు అంటే?”

“అగ్రే జన్మ యస్య సః.  అందరికంటే ముందు పుట్టినవాడు.”

“అందరికంటె ముందు తాను ఎందుకు జన్మించాడో అర్థం చేసుకున్నవాడు కాదా?”

“అవును స్వామీ, అలా కూడా అర్థం చేసుకోవచ్చు.”

“వచ్చు కాదయ్యా, చేసుకో.”

“సరే స్వామీ!”

“బ్రాహ్మణుల ప్రాథమికవిధులు ఏమిటి?” 

“అధ్యయన-అధ్యాపనాలు, యజన-యాజనాలూ, దానాదానాలు”.

“వాటిలో ప్రధానమైనవి ఏమిటి?”

“అధ్యయన-అధ్యాపనాలు”

“వాటిని చేసేవారు బ్రాహ్మణులే కదా?”

“అవును స్వామిన్!”

“అటువంటి బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారు?”

“అదేమిటి స్వామీ?  మునుపు ఉన్నంతమంది ఉన్నారో లేదో కాని, ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా?”

“నా మాటను వ్యతిరేకార్థంలో గ్రహించకు. అలాంటివారు  లేరు అని నేను చెప్పడం లేదయ్యా!   వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నాను.”

“దేశమంతా ఉన్నారు స్వామిన్!”

“ప్రపంచమంతా ఉన్నారు అని అంటాను నేను.”

“అవును స్వామీ, ‘సముద్రం దాటి వెళ్లరాదు’ అనే చాదస్తపుభావాన్ని దాటుకుని బ్రాహ్మణులు ప్రపంచమంతా వ్యాపించి స్థిరపడ్డారు.”

“నాయనా!  చాదస్తమా కాదా అనేది కాదు, ఇక్కడనుండి వెళ్లినవారిలో కొందరు మాత్రమే కాదు, ప్రపంచంలో చాల చోట్ల బ్రాహ్మణులు నా అనుగ్రహంతో ఉద్భవించారు.”

“అదేమిటి స్వామీ?”

“అధ్యయన-అధ్యాపనాలు చేసేవారు ప్రపంచమంతా జన్మించారు అంటున్నాను.”

“అంటే సైంటిస్టులు, టీచర్లా స్వామీ?”

“అవును!”

“అదేమిటి స్వామీ? అధ్యయనం అంటే ఇక్కడ వేదాధ్యయనం అని అర్థం కదా?”

“నాయనా, తెగేవరకూ లాగుతావా?  వేదం అంటే అర్థం ఏమిటి?”

వేదయతీతి వేదః – తెలియజేస్తుంది కాబట్టి వేదం.  అది అపౌరుషేయశాస్త్రజ్ఞానం.”

“కదా? వేదాలు ఎన్ని?”

“నాలుగు.”

“మరి ‘అనంతా వై వేదాః’ (తైత్తిరీయబ్రాహ్మణం 3.10)  అనే వేదవాక్కుకు అర్థం ఏమిటి?

“వేదాలు అనంతాలు అని అర్థం.” 

“మరి వేదాలు నాలుగే అంటున్నావేమిటి?”

“స్వామిన్!  పరీక్షిస్తున్నారా?  వేదాలు నాలుగే అంటే – వేదశబ్దంతో వ్యవహరింపబడే గ్రంథసమూహాలు నాలుగే అని అర్థం.  అనంతా వై వేదాః’ అనే చోట జ్ఞానం అనంతం అనే అర్థం వస్తుంది.”

“బాగా చెప్పావయ్యా!  మరి ఆ అనంతజ్ఞానమూ నాలుగు వేదాలలో ఉందా?”

“సాంకేతికంగా దాగి ఉంది స్వామీ!” 

“నువ్వు కూడా వేదంలో ఉన్నావా?”

“నేను అంటే ఏమిటో వేదంలో వివరింపబడి ఉంది స్వామీ!”

“నువ్వు ఏమిటో వేదంలో వివరింపబడి ఉంది.  కాని, నువ్వుగా వ్యవహరింపబడుతున్న నువ్వు ఇపుడు వేదంలో ఉన్నావా, లేక నా ఎదుట ఉన్నావా?”

“అర్థం కాలేదు స్వామీ!”

{చిరునవ్వు} “మరి?  మరీ తెలివికి పోయి సమాధానాలు చెబితే సంధింపబడే ప్రతిప్రశ్నకు సమాధానం చెప్పే సామర్థ్యం కూడా ఉండాలి మరి!”

“తప్పైంది స్వామీ!”

“చెబుతా విను!  సృష్టిరహస్యాలను అధ్యయనం చేసే ప్రతివాడూ, వాటిని సక్రమవినియోగం చేసేందుకు ఇతరులను ప్రేరేపించే ప్రతివాడూ బ్రాహ్మణుడే!  


వారు భారతదేశంలోనూ ఉన్నారు, ప్రాక్పాశ్చాత్యప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నారు.  
వినాశనాన్ని ఏ విధంగా ఆపవచ్చునో అందరూ అధ్యయనం చేస్తున్నారు.  ప్రపంచానికి తెలియజేస్తున్నారు.  
వారి కార్యకలాపాలను కూడా భారతీయులు అధ్యయన-అధ్యాపనాలుగా ఆదరించి  ఆచరించాల్సిన అవసరం ఉంది.”




“అది కాదు స్వామిన్, మీరు ఇపుడు ఇచ్చిన ఆదేశం ఉందే?  అది 

ఏతద్దేశప్రసూతస్య
సకాశాదగ్రజన్మనః
స్వం స్వం చరిత్రం శిక్షేరన్
పృథివ్యాం సర్వమానవాః।। 

అని చెప్పే  స్మృతివాక్యానికి విరుద్ధంగా ఉన్నది కదా మరి?”

“ఏమయ్యా?  నువు ఇపుడు చేసింది దాంభికమైన వాదన (hypocritical argument) అని నీకు అనిపించటం లేదా?”

“అదేమిటి స్వామీ, అంత మాట అనేశారు?”

“కాదా మరి?  ఆ పాశ్చాత్యులు ఇచ్చిన విద్యను అనుసరించి బస్సులు, కార్లు, నౌకలు, విమానాలు తయారుచేసుకుని వాటిమీద మీరు ప్రయాణం చేయటం లేదా?  వారి విద్యను గ్రహించి, మీ స్మార్ట్ ఫోన్లనూ కంప్యూటర్లనూ వాడుకొనటం లేదా?  ఇలా ఒకపక్క వారి అధ్యయనఫలితాలనుండి ఆవిష్కరింపబడిన ఎన్నెన్నో విద్యలను, వాటి ప్రయోజనాలను నిస్సంకోచంగా గ్రహించి, నిరభ్యంతరంగా వాడుకుంటున్నారే?  అప్పుడు అడ్డు రాలేదా, నువ్వు చెప్పిన ఈ స్మృతివాక్యం?  వాటిని ఎలా స్వీకరించారో, అలాగే ఇపుడు నువు నివేదించిన ప్రపంచవినాశకసమస్యల విషయంలో కూడా వారి అధ్యయనాల ఫలితాలను గ్రహించి  తత్ప్రకారంగా నడుచుకోండి అని నేను చెప్పినపుడు మాత్రం మీ ఆభిజాత్యం కొద్దీ చటుక్కున గుర్తొచ్చిందేం ఆ స్మృతివాక్యం?”

“చిత్తం స్వామీ!”

“చిత్తం గిత్తం కాదు!  
భారతీయేతరులు అనగానే, మీలో చాలామందికి ఒకరకమైన వైమనస్యం ఉండటం గమనించాను.  
అలాగే మరి కొందరిలో భారతీయేతరులు ఏమి చెప్పినా గొప్పే, ప్రపంచంలో కెల్లా పనికిమాలినవారు మాత్రం భారతీయులే అనే భయంకరమైన ఆత్మన్యూనతాభావం కూడా ఉంది.   
నాయనా!  గొప్పవారు భారతీయులలోనూ ఉన్నారు, ఇతరులలో కూడా ఉన్నారు.  అందరూ నావారే!  వారి పట్ల వైముఖ్యం తగ్గించుకోండి.  అలాగే, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోండి.  
వసుధైకకుటుంబకమ్’ అనే భావన అందరిలోనూ వర్ధిల్లాలి!

“స్వామీ, మీ ఆదేశం శిరోధార్యం!”

“నేను చెప్పానని కాదు, నువ్వు స్వయంగా ఉదాహరించిన స్మృతిలోనే మరొకచోట ఉన్న ఉదాత్తమైన మరొక విషయాన్ని విస్మరించావు.  నీ ఆవేశంవల్ల వివేకాన్ని కోల్పోతున్నావు.  

విషాదప్యమృతం గ్రాహ్యం
బాలాదపి సుభాషితమ్
అమిత్రాదపి సద్వృత్తం
అమేధ్యాదాపి కాంచనమ్।।

దొరికితే, విషం నుండి కూడా అమృతం గ్రహించు.  పిల్లవాడు చెప్పినా మంచిమాటను గ్రహించు.  శత్రువులోనైనా మంచిగుణం ఉంటే గ్రహించు. అమేధ్యంలో ఉన్నప్పటికీ, బంగారాన్ని గ్రహించు అని ఎంతో స్పష్టంగా చెప్పారు కదా మన స్మృతికారులు?

మరి, వారి ఆదేశాలప్రకారం మనదేశపు బ్రాహ్మణులలాగానే లోకసంక్షేమం కోరి సదుపదేశం చేసే భారతీయేతరబ్రాహ్మణుల మాటలను మీరు ఎందుకు ఆదరించరు?  వారి మాటలను నిర్లక్ష్యం చేయడం మీ అహంకారం కాదా? 

ప్రపంచంలో ఎవరో ఎవరిపట్లనో జాతివివక్ష (Racism) చూపుతారని విమర్శిస్తూ ఉంటారే?  మరి ఈవిధమైన మీ ప్రవర్తన మాట ఏమిటి?  ఇది మాత్రం Racism కాదా?”  

“నిజమే స్వామీ!  కళ్లు తెరిపిస్తున్నారు.”   

“గత నలబై సంవత్సరాలలో ప్రపంచంలోని అడవుల్లో నలబై శాతం నాశనమయ్యాయి.  తెలుసా?”

“విన్నాను, చదివాను స్వామీ!”

“ఆ విషయం భారతీయేతరబ్రాహ్మణుల అధ్యయనం వల్ల తెలిసినదే!”

“అవునా స్వామిన్!”

“అవును!  ప్రపంచమంతా అలా అడవులను నరికి ఏమి చేస్తున్నారో తెలుసునా?”

“తెలియదు స్వామిన్!”

“ఆ నశించిన అరణ్యప్రాంతంలో అత్యధికశాతాన్ని పంటపొలాలుగా మార్చుతున్నారు.”

“పెరుగుతున్న ప్రపంచజనాభా ఆహార-అవసరాలను తీర్చటానికా స్వామీ?

“కాదు, అక్కడ సోయాబీన్ పంటను పండిస్తున్నారు.  లక్షలాది సంఖ్యలో ఉన్న గోవులకు మేతగా వాటిని ఉపయోగిస్తున్నారు.’’

“ఓ!  గోజాతి అభివృద్ధికి అడవులను నరుకుతున్నారా?  వారి పిచ్చితనం కాకపోతే, అలా ఎందుకు స్వామీ?  అడవుల్లోనే వాటిని స్వేచ్చగా తిరగనిస్తే వాటి తిండిని అవే తింటాయి కదా?  ఆ మనుషులకు పంటలు పండించడం, కోసి ఆవులకు మేతగా వెయ్యడం - ఇంత  శ్రమ ఎందుకు?”

“నాయనా!  ఆ గోవులు వారు ప్రేమతోనో భూతదయతోనో పెంచుకుంటున్నవి ఏమీ కాదు.  వారు వేసిన మేత మేసి ఆ గోవులు బలంగా ఎదిగాక, వాటిని నరికి, తమ ఆహారంగా మార్చుకుంటున్నారు.”

“.....”

“నాయనా!  దిగ్భ్రాంతి చెందావా?”

“అ... అవును స్వామిన్!”

“ఎందుకు దిగ్భ్రాంతి?”

“అదేమిటి స్వామీ?  భారతీయులు భక్తితో పూజించుకుంటున్న గోజాతికి అక్కడ అంతటి దురవస్థ కలిగిందని తెలిస్తే దిగ్భ్రాంతి కలుగదా?”

“ఓహో!  వారు గోవుల బదులు మేకలనో గొర్రెలనో పందులనో అలా పోషించి వాటిని చంపి తింటూ ఉంటె  నీకు అంతటి దిగ్భ్రాంతి కలిగేది కాదన్నమాటేగా?”

“నా ఉద్దేశం అది కాదు స్వామీ!”

“మరేది?”

“ఇప్పుడేగా అధ్యయనం అధ్యాపనం చేస్తున్న ఆ భారతీయేతరులు కూడా బ్రాహ్మణులే అని మెచ్చుకున్నారు?  మరి ఇంతటి క్రూరకర్మలు చేసేవారికి అటువంటి మెప్పుకోలు ఏమిటని?”

“నాయనా!  బ్రాహ్మణులు అనేది మెప్పుకోలు పదమూ కాదు, శూద్రుడు చండాలుడు అనేవి తిట్లూ శాపనార్థాలు కూడా కావు.  ఆయా జనాలు చేసే ఆయా వృత్తులను బట్టి, వారి గుణాలను బట్టి ఆ పదాలు ఒకప్పుడు వాడబడ్డాయి.  అన్ని రకాల వృత్తులవారూ ఈ ప్రపంచానికి అవసరమే!  కాని, మీరు మీమీ అభిరుచులకొద్దీ  కొన్ని వృత్తులను ఉత్తమమైనవాటిగానూ, కొన్నిటిని నీచమైనవాటిగానూ పరిగణించి, ఆయా పదాలను ప్రశంసార్థకంగానూ నిందార్థకంగానూ వాడుతున్నారు.  చివరకు ఆ పదాలను నేను వాడినా, మీరు భావిస్తున్న అర్థంలోనే నేను కూడా వాడుతున్నట్లు అనుకుంటున్నారు.  ఇది ఏమీ బాగులేదు.”

“క్షమించండి స్వామిన్!”

“సరే, నాయనా! నువ్వన్నట్టు ఆ క్రూరకర్మలు చేస్తున్నవారు, నేను చెప్పిన ఆ పాశ్చాత్యబ్రాహ్మణులు ఒక్కరే కారు!  వారూ వీరూ వేరు వేరు.”

“కొంత కొంత అర్థం అవుతోంది స్వామిన్!”

“ఏమి అర్థమైందో చెప్పు?”

“బ్రాహ్మణ – అనే పదం సంకుచితార్థంలో వాడబడలేదు.  విద్యావంతులు జ్ఞానులు అనే అర్థంలో వాడబడింది.  విద్యావంతులు జ్ఞానులు ఎవరైనా బ్రాహ్మణులే!”

“కొంతవరకు బాగానే ఉంది.  కాని, విద్య అంటే కేవలం పుస్తకజ్ఞానం కాదు, అది అనుభవసిద్ధమైన జ్ఞానం.  నిత్యసత్యం.  విద్యావంతులంటే చదువుకున్నామని సర్టిఫికేట్ కలిగినవారు కాదు, తాము నేర్చిన జ్ఞానం ఏ విధంగా అవసరమో, ఎంతవరకు ఆచరణయోగ్యమో తెలిసినవారు.  అలాగే, ప్రపంచశ్రేయస్సును కలిగించే తమ జ్ఞానాన్ని తరువాతతరాలవారికి నిస్స్వార్థంగా అందజేసేవారు వారు.  వారు బ్రాహ్మణులు అంటే!  కాబట్టి బ్రాహ్మణ అనే పదం జన్మవాచకంగా కాదు, గుణవాచకంగా వాడబడింది అని అర్థం చేసుకో.  అలాంటివారు ఇపుడు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు.”

“అవును.  అర్థమైంది స్వామీ, అటువంటి గుణసంపన్నులైన బ్రాహ్మణులకు శుభం కలగాలి అని కోరడంలో తప్పు లేదు.  అలా కోరుకుంటే మిగిలినవారికి శుభం కలగకూడదు అనే దురర్థం లేదు.   ఎందుకంటే, వారికి శుభం కలిగితే అది సమస్తలోకానికి కూడా వారు శుభం కలిగించే పనులనే చేస్తారు.”

“బాగుంది.  మరి గోవులకు మాత్రమే శుభమా?  మిగిలిన జంతువులకు శుభం వద్దా అని కూడా వగచినట్టున్నావు?”

“క్షమించండి స్వామీ!  అది కూడా ఇప్పుడు అర్థం అయింది!”

“ఏమిటి అర్థమైంది?”

“గేదెలు, మేకలు, గొర్రెలు, లాగానే గోవులు కూడా సాధుజంతువులే కదా స్వామిన్!  వీటన్నిటిలోనూ సులభంగా మచ్చికయ్యేవి గోవులే!  అవి తమ యజమానులను ఎంతగానో ప్రేమిస్తాయి.  తమ యజమానులకు ఇష్టమైనవారిని కూడా అవి గ్రహిస్తాయి.  గేదెలు దారితప్పిపోతే మళ్లీ తమ యజమానిని వెతుక్కుంటూ రావడం జరుగుతుందో లేదో!  గోవులు మాత్రం యజమానితో తమ వేరుబాటును సహించలేక వెనక్కు వస్తాయి.  మేకలు గొర్రెలు కూడా దారి తప్పితే వెనక్కు రాకపోవచ్చు.  అందుకే కాపరులు వాటిని వెనక్కు మళ్లించుకొనడం కోసం కుక్కలను పెంచుతారని అందరికీ తెలిసిన విషయమే.  ఈరకంగా యజమానులకు అత్యంతసన్నిహితంగా ప్రేమాస్పదంగా ఉండే గోవులను  సకలమానవేతరప్రాణులకూ ప్రతినిధులుగా పరిగణించి వాటికి శుభం కలగాలని కోరుకొనడంలో తప్పేమీ లేదు!

{చిరునవ్వు}

“ఏమి స్వామీ, తప్పు చెప్పానా?”

“నువ్వు జంతుప్రవర్తనశాస్త్రంలో ఏమైనా పరిశోధన చేసి ఉంటావా అని ఆలోచిస్తున్నాను!” 

“అయ్యో, అదేమీ లేదు స్వామిన్!”

“పోనీ, నువ్వంటున్నట్టు, యజమానులను ప్రేమించడం, ఎక్కడా తప్పిపోకుండా వెనక్కు తిరిగిరావడమే మంచి జంతువుకు ఉండాల్సిన ప్రధానలక్షణం అనుకుందాం.  అప్పుడు రక్షణార్హమైనదని నువు సిఫారసు చేస్తున్న గోవు కంటే ఒక కుక్కకు ఆ లక్షణాలు మరింత అధికంగా ఉన్నాయి కదా?”

“అయ్యో, నేను సిఫారసు చేయడమేమిటి స్వామీ?”

“అయితే సిఫారసు చేయటం లేదా?”

“స్వామీ, గోవు ఏ విధంగా రక్షణార్హమైనదో, మిగిలిన జంతువులు కూడా అలాగే రక్షణార్హమైనవి అని నా అభిప్రాయం.”

“మరి, ఇంతసేపు గోవు మిగిలిన జంతువుల కంటె ఏ విధంగా గొప్పది అనే విషయంలో నాకు బోలెడంత వివరణ ఇచ్చావే?”

“అంటే, అప్పటివారు ఎందుకు ఆవుకు అంత ప్రాధాన్యతను ఇచ్చారో ఊహించే ప్రయత్నం చేశాను స్వామిన్!”

“ఆవు కాదు నాయనా!  గోవు!  గోవు!”

“ఆవు కాదు, గోవు?  అదేమిటి స్వామిన్?”

“నువు చేస్తున్న చిన్నపొరబాటును సరిదిద్దాను.”

“ఓ!  అర్థమైంది స్వామీ!  మీరు చిన్న చిన్న మాటలతో నాకు మరింత మరింత చక్కగా సరైన అర్థం స్ఫురించేలా చేస్తున్నారు!”

“ఇపుడు కొత్తగా అర్థమైంది ఏముంది?”

“నిఘంటువు ప్రకారం గోవు అంటే ఆవు మాత్రమే కాదు, ఎద్దు కూడా!”

“అయితే ఏమిటి?”

“అంటే, గోవు మనుషులకు బహుళార్థకంగా ఉపయోగపడుతుంది.  ఆవు రూపంలో మంచి పోషకాహారమైన పాలను ఇస్తుంది.  ఎద్దు రూపంలో పొలం దున్ని పంటలు పండించుకునేందుకు ఉపయోగపడుతుంది.  ఆ రోజుల్లో మనుషులు ఎవరి మీదా ఆధారపడకుండా హాయిగా స్వతంత్రంగా బ్రతికేందుకు కొన్నిఆవులు, కొన్ని ఎద్దులు ఉంటే చాలు.  కాబట్టి, ఆ రెండింటినీ గోవు అనే శబ్దంలో ఇమిడ్చి, వాటికి శుభం కలగాలని అన్నారు.  అవి చక్కగా ఉంటే సమస్తమానవాళి వాటి తోడ్పాటుతో సుఖంగా బ్రతకవచ్చునని దాని అంతరార్థం!”

{చిరునవ్వు}

గోభిస్తుల్యం న పశ్యామి
ధనం కించిదిహాచ్యుత
గావో లక్ష్మ్యాః సదా మూలం
గోషు పాప్మా న విద్యతే।।

[గోవులతో సమానమైన ధనం వేరే ఏమీ లేదు, గోవులు సంపదలకు మూలం] అని మహర్షులు అందుకే అన్నారు కదా స్వామిన్!”

“నువ్వు ఉటంకించిన శ్లోకంలో ఆ చివరిపాదానికి అర్థం చెప్పలేదేమి నాయనా?”

“గోవులయందు పాపము లేదు అని అర్థం!”

“అంటే?”

“గోవులు పవిత్రమైనవి.”

“నీ ముఖం!  ఈరోజుల్లో సంపదను సృష్టిస్తాం అంటూ మీ మానవులు ఏమి చేస్తున్నారో తెలుసు కదా? సృష్టించడానికి వారేమైనా బ్రహ్మదేవుడితో సమానులా?  వారుచేస్తున్నది సృష్టి కానే కాదు, తమ చర్యలతో వారు సృష్టివినాశనం చేస్తున్నారు. నువ్వే చెప్పావుగా?  వారు దారుణాతిదారుణంగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ సమస్తజీవావరణాన్ని కూడా సమూలంగా నాశనం చేస్తున్నారు.  అది మహాపాపం.  కాని, గోవులను తోడుగా చేసుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతూ బ్రతకడం వలన అటువంటి పాపం చేయవలసిన అవసరం ఉండదు.  అదీ ఆ చివరిపాదానికి వివరణ!”

“అంటే?  మానవులు తమ మేధాసంపత్తితో సృష్టించిన సమస్తవిజ్ఞానమయప్రపంచాన్నీ వదులుకుని, మరలా చరిత్రపూర్వయుగాలకు పోయి గోవులను పెంచుకుంటూ పొలం దున్నుకుంటూ బ్రతకమంటున్నారా స్వామీ?”

“ఎందుకు నాయనా అంత ఆవేశం?”

“మరేమిటి స్వామీ, మీరు అభివృద్ధినిరోధకుల్లా, ప్రాతచాదస్తపు భావాలకు సరిక్రొత్త ప్రతినిధులకు మల్లే మాట్లాడుతున్నారే?

“నాయనా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు?  నువ్వేమన్నావ్ మొదట?  మేకలు గొర్రెలు, గేదెలు ఆవులు అన్నీ సాధుజంతువులే అని అన్నావు కదా?”

“అవును స్వామీ, అన్నాను!  అందులో తప్పేముంది?”

“మరి జింకలు, చిలుకలు కోతులు క్రూరజంతువులా?”

“అయ్యో, నా భావం అది కాదు స్వామీ!”

“మరి ఆ జంతువులు మీ పొలాలమీద పడితే మీరు ఎందుకు తరిమేస్తారు?”

“.....”

“చెప్పవయ్యా?  మొగమాటమెందుకు?”

“... అంటే,  స్వామీ... అవన్నీ మా పంటలను తినేస్తే మేము తినడానికి ఇంకేముంటుంది?  మేము కూడా బ్రతకాలి కదా?”

“వాటిని అదుపుచేయడానికి పులులున్నాయి, గ్రద్దలున్నాయి, పాములున్నాయి కదా?  మీరెందుకు వాటి జోలికి పోతున్నారు?”

“అవి అడవిలో ఉండకుండా మా పొలాల్లోనికి వస్తున్నాయి కదా స్వామీ?”

“అవి అడవి జంతువులా?”

“అంతేగదా స్వామీ?”

“అవి అడవుల్లో బ్రతకడానికి ఏమున్నాయ్?”

“గడ్డి ఉంటుంది, పండ్ల చెట్లు ఉంటాయి.”

“అడవులంటూ ఉంటే నువ్వు చెప్పినవన్నీ ఉంటాయి.  అసలు అడవులనేవే లేకుండా మీరు తుడిచిపెట్టేస్తున్నారు గదయ్యా?”

“.....”

“ఇప్పుడు చెప్పు!  మేకలు, గొర్రెలు, గేదెలకు శుభమస్తు వద్దా అని గోల గోల చేశావే?  మరి ఆ జింకలకు, చిలుకలకు, కోతులకు మాత్రం శుభమస్తు వద్దా? ఎందుకు ఇంతటి పక్షపాతం?  అని నేను మీ మనుషులను అడుగుతున్నాను.”

“తప్పే స్వామీ!”

“మీకు ఉపయోగపడేవి ఏవి ఉన్నా, వాటికి శుభమస్తు, మీకు అవసరం లేదు అనుకున్నవాటికి వాటి ఖర్మ అస్తు! – ఇదేగా మీ మానవుల స్వభావం?”

“మా ఆలోచనలలోని తప్పును గ్రహించాను స్వామీ!”

“నాయనా!  ప్రాచీనభారతీయమహర్షులు ఇప్పటివారిలా సంకుచితభావాలు కలిగినవారు కారు. మేము మాత్రమే బాగుండాలి, మిగిలినవాళ్లు ఏమైపోయినా మాకు అనవసరం’ అని భావించలేదు.  

స్వస్తి ప్రజాభ్యః’ [ప్రజలందరకూ శుభం కలగాలి] – అనేది వారి అసలైన ఆకాంక్ష.  ఆ ఆకాంక్ష నెరవేరడానికి మార్గాన్ని సూచిస్తూ – ‘పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః’ [రాజులు భూమిని న్యాయమైన మార్గంలో పరిపాలింతురుగాక!] అని చెప్పారు.  

తరువాత - ‘లోకాః సమస్తాః సుఖినో భవంతు’ [సమస్తచరాచరప్రాణులూ సుఖాన్ని అనుభవించాలి] అని ఆకాంక్షించారు.  ఆ ఆకాంక్ష నెరవేరాలంటే మార్గం ఏమిటి?  దాన్ని సూచిస్తూ ‘గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం’ అని చెప్పారు. 

అలా అనడంలోని అంతరార్థం ఏమిటో మనం ఇంతసేపు మాట్లాడుకున్న మాటలను బట్టి నీకు అర్థం  అయ్యుంటుంది.  

“అర్థమైంది స్వామీ!”

“అదే సందర్భంలో – ‘కాలే వర్షతు పర్జన్యః’ [మేఘాలు సకాలంలో సక్రమంగా వర్షించాలి] ‘పృథివీ సస్యశాలినీ’ [భూమి అంతటా వృక్షజాతులు, ధాన్యజాతులు వర్ధిల్లాలి]  దేశోయం క్షోభరహితః' [దేశము ఏ రకమైన సంక్షోభాలకూ లోనుకాకుండా ఉండాలి]  'సజ్జనాః సంతు నిర్భయాః' [మంచివారికి భయం కలుగకుండా ఉండాలి]  అనే ఆకాంక్షలు కూడా చెప్పబడ్డాయి కదా?  

ఇలా అందరికీ శుభం, అందరికీ సుఖం కలగాలని జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఆమాత్రం ఈమాత్రం చదువుకున్న ప్రతి ఒక్కరికీ కూడా అర్థమయ్యేంత సులువుగా ఈ వాక్యాలు ఉంటే, గోవులకేనా శుభం? గేదెలకు శుభం వద్దా?  బ్రాహ్మణులకేనా శుభం?  బ్రాహ్మణేతరులకు శుభం వద్దా? అంటూ అల్లరి చేస్తావేమయ్యా?”

“తప్పు తెలుసుకున్నాను స్వామిన్!”

“శుభమస్తు.”

“మరొక్క సందేహం ఉండిపోయింది స్వామిన్!”

"ఏమిటది?"

“మానవాళి ఆర్జించిన ఈ అపారసాంకేతికవిజ్ఞానం ఉందే? దీన్ని వదిలేసుకుని, గోవులను వెంటేసుకుని వ్యవసాయం చేసుకొనడం మాత్రమేనా ప్రపంచవినాశనం జరగకుండా ఉండేందుకు ఉన్న ఏకైక మార్గం?”

“నాయనా!  ఇంతసేపు నేను చెప్పింది ఏమిటి?  

ఉత్తిష్ఠత.  జాగ్రత.  ప్రాప్య వరాన్ నిబోధత.  
[లే.  మేలుకో.  ఉత్తములైన ఆచార్యులను చేరుకో.  తెలుసుకో.]  

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వదర్శినః।। 

[జ్ఞానులు, తత్త్వం తెలిసిన వారు అయిన గురువులకోసం అన్వేషించు.  వారిని గౌరవించు.  వారితో చర్చలు చేయి.  వారికి సహకరించు.  వారు నీకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు.  ఆ విధంగా తెలుసుకో.]”

“మీకన్నా జ్ఞానులు, తత్త్వం తెలిసినవారు ఇంకెవరున్నారు స్వామీ?”

“సంవత్సరానికి ఓ కృష్ణాష్టమి నాడు తప్ప మరెప్పుడూ నేను గుర్తుకురాను కదా నీకు?  ఇంకేమిటయ్యా నువ్వు నాతో చర్చలు చేసేది?”

“అంతమాట అనకండి స్వామిన్!”

“సరే, మార్గాంతరం మరోమారు చూద్దాంలే.  
లోకాః సమస్తాః సుఖినో భవంతు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...