Monday, 23 July 2018

తిల్లై కూతన్, తిరునీలకంఠర్

అది నటరాజస్వామి కొలువైన చిదంబరపుణ్యక్షేత్రంలో పవిత్రమైన శివగంగ కోనేరు.
స్థానికులు తమభాషలో స్వామిని తిల్లై కూతన్ అని పిలుచుకుంటారు. తిల్లై అనేది అక్కడి సముద్రతీరప్రాంతాలలో విరివిగా పెరిగే ఒకానొక చెట్టు. కూతన్ అంటే నృత్యాధిపతి. (తిల్లై నటరాజు అని అర్థం అన్నమాట)
ఆయన కొలువైన స్థానాన్ని వారు చిత్రాంబళం అంటారు. అంబళం అంటే రంగస్థలం లేదా దేవాలయం. చిత్ర అనే పదానికి విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. అద్భుతమైనది, దివ్యమైనది, వర్ణమయమైనది, శోభస్కరమైనది, శుభంకరమైనది... ఇలా.
చిదంబళం అనేవారు కూడా ఉన్నారు. చిత్ + అంబళం అన్నమాట. చిత్ అంటే చైతన్యం అని అర్థం. సత్ + చిత్ + ఆనందం = సచ్చిదానందం అనే పదాల కలయికలో చిత్ ఇదే. చిదంబళం అంటే చైతన్యదేవాలయం అని అర్థం
స్వామివారి సహధర్మచారిణి పేరు శివగామి సుందరి. ఆమె ఆలయానికి ఎదురుగా ఉన్నదే ఈ శివగంగ కోనేరు.
***
పూర్వం చిదంబరంలో తిరునీలకంఠర్ అని ఒకాయన ఉండేవారు. ఆయన గొప్ప శివభక్తుడు. అంతటి ఆయన కూడా జితేంద్రియుడు కానందువల్ల, ఒకసారి ఒకానొక తప్పు చేశాడు. ఆ తప్పును అతని భార్య సహించలేకపోయింది. అతడు తన భార్యను అనునయించే ప్రయత్నం చేశాడు.
ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేయబోతే ఆమె "మీరు మమ్మల్ని అంటరాదు, తిల్లై కూతన్ స్వామి పేరిట ప్రమాణం" అనేసింది.
ఆమె నన్ను అంటరాదు అని ఏకవచనప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది కాబట్టి, అతడు స్త్రీలెవరినీ తాకరాదు అని నిశ్చయించుకున్నాడు. నిండు యౌవనంలో ఉన్నపుడే అతడు బ్రహ్మచర్యదీక్షను స్వీకరించాడు. తన వృత్తిని తన శివుని తప్ప వేరెవరినీ మనసులో ఉంచుకోకుండా జీవితం గడిపాడు. అలాగని, భార్యను పోషించే తన ధర్మాన్ని మాత్రం అతడు విడిచిపెట్టలేదు. ఆమె కూడా శివభక్తితన్మయురాలైంది. క్రమంగా వారు ఇరువురూ వృద్ధులయ్యారు. శరీరంలో శక్తి క్షీణించింది.
శివగామీనటరాజులకు వారిపట్ల కరుణ కలిగింది. వారికి ఇహపరసౌఖ్యాలు కలుగజేయవలసిందిగా శివగామి నటరాజును కోరింది. సరేనన్నాడు ఆయన. 
ఒక శివయోగి వేషం ధరించి తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడు. అతని ఆతిథ్యం స్వీకరించిన తరువాత ఒక బంగారు భిక్షాపాత్రను అతని చేతికి ఇచ్చి, ఓయి నీలకంఠా, ఈ తీర్థయాత్రలకు పోతున్నాను, తిరిగి వచ్చిన తరువాత ఈ పాత్రను నీ దగ్గరనుండి తీసుకుంటాను, అంతవరకు నీవద్ద భద్రంగా దాచిపెట్టవలసింది" అని కోరాడు. సరేనన్నాడు నీలకంఠర్.
కొంతకాలం గడిచాక ఆ మాయాశివయోగి తిరిగివచ్చి, "ఏదీ, నీకిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇచ్చేసెయ్" అన్నాడు. నీలకంఠర్ తన ఇల్లంతా వెతికినా ఆ పాత్ర దొరకలేదు. అతడు శివయోగి కాళ్లమీద పడి, క్షమాపణ కోరాడు. ఆ పాత్రకు బదులుగా మరొక బంగారు పాత్రను ఇస్తానన్నాడు. కానీ, మాయాశివయోగి శాంతించాడు కాడు. నీవు శివభక్తుని వేషంలో ఉన్న ఒక దొంగవు అంటూ నిందించాడు.
నిజమైన శివభక్తుడు ఎన్నడూ దొంగ కాజాలడు అన్నాడు నీలకంఠర్. నీవు నిర్దోషివి అయితే శివుని సాక్షిగా ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు మాయాశివయోగి. అలాగే, ఏమని ప్రమాణం చేయమంటారు అని నీలకంఠర్ అడిగాడు.
"నీవు నీ భార్య చేతిని పట్టుకుని తిల్లై కూతన్ శివగామి సుందరిల సమక్షంలో, శివగంగ కోనేరులో మునిగి బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పండి చూదాం" అన్నాడు మాయాశివయోగి.
ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది నీలకంఠర్ కు. పూర్వం తిల్లై కూతన్ పేరిట తన భార్య చేసిన శపథం వల్ల తాను ఆమెను తాకరాదు. తాకితే స్వామివారిపట్ల ఘోరమైన అపరాధం చేసినట్లవుతుంది. కానీ, ఇపుడు ఆమె చేతిని పట్టుకుని తాను బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పి కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే శివభక్తుడు దొంగ అనే అపవాదం వచ్చి పడుతుంది. ఏమి చేయాలో తెలియని విషాదంలో మునిగి కన్నీరు కార్చాడు నీలకంఠర్.
మాయాశివయోగి చిదంబరంలో పెద్దలందరినీ పిలిచి పెద్ద రచ్చ చేశాడు. వారందరూ వచ్చి, ఆ శివయోగి చెప్పినట్లే నీలకంఠర్ తన భార్య చేతిని పట్టుకుని ప్రమాణం చేయవలసిందేనని తీర్పు చెప్పారు. లేదంటే గ్రామబహిష్కరణ శిక్ష తప్పదని హెచ్చరించారు.
అపుడు ఇక మరణమే శరణం అని భావించిన అతనితో ఆయన భార్య ఒక ఉపాయం తెలిపింది. ఆ ఉపాయం ప్రకారం భార్యాభర్తలు ఇరువురు ఒక కఱ్ఱను ఇరువైపులా పట్టుకుని, మాయాశివయోగి చెప్పిన ప్రకారమే ప్రమాణం చేసి కోనేటిలో మునిగారు. వారు లేచి చూసేసరికి...
***
***
ఆశ్చర్యం!
దంపతులు ఇరువురూ నవయౌవనవంతులు అయ్యారు.
వారి వృద్ధత్వం ఎటుపోయిందో ఎవరూ ఎరుగరు. అక్కడ ఉన్న చిదంబరక్షేత్రప్రజలందరూ అది తమ తిల్లై కూతన్ చేసిన మాయ అని తెలుసుకున్నారు. హర హర మహాదేవ శంభో అనే వారి భక్తితన్మయధ్వనులతో క్షేత్రమంతా ప్రతిధ్వనించిపోయింది.
***
కాలక్రమేణా ఆ నీలకంఠర్ అరవై ముగ్గురు నాయన్మారులలో ప్రథముడిగా ఘనత వహించాడు. నాయన్మారులంటే ద్రవిడదేశానికి చెందిన పరమశివభక్తులు. ఇంద్రియలోలుడైన తన భక్తునికి ఇంద్రియవిజయం ప్రసాదించి అనుగ్రహించిన కూతన్ కథ ఇది.
***
ఇదిగో మిస్టర్ I Lie Yeah,
ఈ తిరునీలకంఠ నాయనారు బ్రాహ్మడు కాదు, కోమటోడు అంతకంటే కాదు, అచ్చమైన శూద్రుడు. అతడు కుంభకారుడు అంటే మొదట అర్థం కాక ఏడుస్తావు. అర్థమైతే అది సంస్కృతం అని ఏడుస్తావు. అందుకే అతడు కుమ్మరి కులంలో పుట్టినవాడు అని స్పష్టంగా చెబుతున్నాను.
ఈ కథ తెలుసుకున్న తరువాతనైనా,
"హిందూ దేవుళ్ళు తక్కువజాతి భక్తులను దూరంగా పెడతారు, యేసుక్రీస్తు, బుద్ధుడు మాత్రమే శూద్రులను చేరదీస్తారు" - అనే నీ వెధవ వాగుడు ఇక ఆపు.
హిందూ దేవుళ్ళు పరమ సెక్యులర్ దేవుళ్ళు. తమను తిట్టినవారికి కూడా మోక్షం ప్రసాదిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, శిశుపాలుడు వంటివారిని ఎరుగుదువా? వాళ్ళు ఎన్ని తిట్టినా సహించి తన చెంతకు చేర్చుకున్నవారు. వారిది కూడా భక్తేనని హిందూ దేవుళ్ళు భావిస్తారు. వాళ్ళది వైరభక్తి అట.
అలాగే, నీవు ద్వేషంతో వాగుతున్నా, అజ్ఞానంతో వాగుతున్నా, మొత్తానికి హిందూ దేవుళ్లను స్మరిస్తున్నావు. నీకు కూడా పుణ్యం వస్తుంది పో. అదీ మా మతపు గొప్పదనం.

సర్వః సగంధేషు విశ్వసితి

ఫలకాలు చెప్పే పాఠాలు – 4
కాళిదాసమహాకవి శకుంతల నోట పలికించిన మాట...
“సగంధ” అనే పదానికి జ్ఞాతి అనే అర్థం చెబుతుంది వాచస్పత్యం.
“ప్రతి ఒక్కరూ తమవారినే విశ్వసిస్తారు.”
నిజమే కదా, అది సహజం.

It is an animal’s instinct.
Birds of the same feather flock together.
Like likes Like.

అది సరే, “తమవారు” అని ఎవరైనా సరే, కొందరిని ఎలా గుర్తుపడతారు?

ప్రాథమికంగా - తాము తినేటటువంటి తిండినే తినే వారిని తమవారని గుర్తుపడతారు...

అర్థం చేసుకొనేందుకు ఆధునికశిక్షణ పొందిన మన మనసు నిరాకరించినా అది చాలవరకు నిజం. 

విస్తారమైన ఆఫ్రికా అడవుల్లో నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ వాళ్ళు జంతువుల మీద తీసిన డాక్యుమెంటరీలు చూడండి...

చిన్నపాటి జింకలు ఒక చోట గడ్డిమేస్తూ ఉంటాయి. వాటికి పక్కనే మరింత పెద్ద కొమ్ముల జింకలు కూడా గడ్డిమేస్తూ ఉంటాయి. ఈ పక్క జీబ్రాలు మేస్తుంటాయి. ఆపక్క అడవి బర్రెలు, దున్నలు మేస్తుంటాయి. ఇవన్నీ వేరు వేరు జాతుల జంతువులు. అయినా ఒకదానిని చూసి మరొకటి భయపడవు. ఇంతలో అక్కడికి వీటన్నింటికన్నా బలమైన ఏనుగుల మంద వస్తుంది. వాటిని చూసి కూడా ఇవేవీ భయపడవు. మరికాసేపట్లో వీటన్నింటికన్నా పొడవైన జిరాఫీలు వస్తాయి. అప్పుడు కూడా ఇవేవీ భయపడవు. ఎందుకంటే, వీటన్నిటికీ ఆహారం సమానమైనదే. గడ్డి, ఆకులు, కొమ్మలు. 

ఇంతలో అక్కడికి ఒక చిన్న నక్క వచ్చిందనుకోండి...
అది కనబడకున్నా పొదలమాటున దాక్కున్నప్పటికీ దాని వాసన తగిలిన వెంటనే జింకలలో అలజడి ప్రారంభమౌతుంది. అవి ప్రశాంతంగా తినలేవు. కంగారుగా దిక్కులు చూస్తాయి. అటూ ఇటూ పరుగెడతాయి. అది సగంధమైనది (సమానమైన వాసన కలిగినది) కాదన్న మాట. సగంధ అనే పదాన్ని మనం ఇక్కడ ఇలా అర్థం చేసుకోవచ్చు.

సరే, ఎందుకు వాటికా భయం అంటే, ఆ నక్క ఆహారం గడ్డి కాదు, వాటికి ఉడతలు తొండేబిక్కలు దొరికితే సరే సరి, లేకుంటే తమలో ఒకదాన్ని ఆ నక్క లాక్కుపోయి పీక్కు తింటుందని ఆ జింకల భయం. ఏ చిరుతపులో వచ్చిందంటే ఇక జీబ్రాలకు బర్రెలకు కూడా భయమే. ఇక సింహాలమంద వచ్చిందంటే ఏకంగా జిరాఫీలు అడవిదున్నలు ఏనుగులలో కూడా భయం కలుగుతుంది. అవి గుంపులు గుంపులుగా దాడి చేస్తూ మొదట తమ చిన్నారులను, తమలోని బలహీనులను ఎత్తుకుపోతాయని వాటికి తెలుసు. సాధ్యమైనంతవరకు పారిపోయి తప్పుకునేందుకే అవి ప్రయత్నిస్తాయి. కొన్ని నిస్సహాయంగా వాటికి దొరికిపోతాయి. కొన్ని రోషంతో ఎదురు తిరిగి, వాటినే చంపేసిన సంఘటనలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. 

సరే – ఈవిధంగా - ప్రాథమికంగా - తమకంటే భిన్నమైన ఆహారం కలిగినవాటిపై నమ్మకం కలిగి ఉండడం జంతువులలో కుదరదు. మనుషులలో కూడా పూర్వం ఇటువంటి మనస్తత్వం ఉండేదేమో. కాని, రాన్రాను అటువంటి జంతులక్షణాలు తగ్గి ఉంటాయి. 

కాని, ఇప్పటికి కూడా - తాము చేసేటటువంటి పనినే చేసేవారిని, తాము ధరించే దుస్తులవంటి దుస్తులనే ధరించేటటువంటివారిని, తమవంటి అలవాట్లే కలిగినవారిని, తాము పాటించేటటువంటి ఆచారాలనే పాటించేవారిని తమవారిగా మనుషులు సులువుగా నమ్మేస్తారు. వారిని తమ కులస్థులుగా, తమ మతస్థులుగా పరిగణించి వారితో సన్నిహితంగా మెలగడం చూస్తూనే ఉన్నాం. విద్య సార్వజనీనమై ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకొనగలిగే స్థాయికి వచ్చాక మానవులందరూ సమానులేనన్న భావన బలపడింది. 

అయినప్పటికీ సమానమైన ఆలోచనలు కలిగినవారు, సమానమైన వ్యవహారాలు నడిపేవారు, సమానమైన కష్టనష్టాలు కలిగినవారు కులమతాల తేడా లేకుండా కలిసి ఒక సమూహంగా ఉండటం ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇక్కడ కూడా మరొక అర్థంలో సగంధత కనిపిస్తోంది. ఇక్కడ గంధము అంటే – వాసన – అంటే - ఈ జన్మలోనో పూర్వజన్మలోనో అబ్బిన సంస్కారాలు కొందరిని పరస్పరం మిత్రులను చేస్తాయి అన్నమాట. 

మృగా మృగైః సంగమనువ్రజంతి.
గావశ్చ గోభిః తురగాస్తురంగైః।
మూర్ఖాశ్చ మూర్ఖైః సుధియః సుధీభిః
సమానశీలవ్యసనేన సఖ్యమ్।। 

జింకలు జింకల తోనే కలిసి తిరుగుతాయి. గోవులు గోవులతోనే కలిసి తిరుగుతాయి, గుఱ్ఱాలు గుఱ్ఱాలతోనే కలిసి తిరుగుతాయి. మూర్ఖులు మూర్ఖులతోనే కలిసి తిరుగుతారు. పండితులు పండితులతోనే కలిసి తిరుగుతారు. సమానశీలము, సమానమైన వ్యసనాలు (అంటే కష్టాలు, బాధలు కూడా) కలిగినవారి నడుమ స్నేహం ఏర్పడుతుంది అని పెద్దల మాట. 

“స వానరేంద్రో హృతరాజ్యదారః స రాఘవేంద్రో హృతరాజ్యదారః।
ఏవం తయోరధ్వని దైవయోగాత్ సమానశీలవ్యసనేషు సఖ్యమ్।।“


“ఆ వానరేంద్రుడికి ఆ రాఘవేంద్రుడికి నడుమ స్నేహం కలిసిందన్నా కారణం ఒకటే – వారిరువురి కష్టాలు సమానమైనవి కాబట్టే!” - అని ఒక కవి చమత్కరించాడు. ఇరువురూ రాజ్యం కోల్పోయారు, ఇరువురి భార్యలూ అపహరింపబడ్డారు కదా అంటాడాయన.

ఏదేమైనా, అప్పటికీ, ఇప్పటికీ మనవారు అనేవారిని మనం విశ్వసిస్తాం. 

భారతదేశంలో ఉంటున్నాడనే ఒకే ఒక్క కారణంగా పాకిస్తాన్ని పొగుడుతూ భారత్ ను సవాలు చేస్తున్నా ఓ ఫరూక్ అబ్దుల్లా గాడిని చూసీ చూడనట్టు వాడి మాటలు వినీ విన్నట్టు ఉంటున్నాం కదా. 

ఒట్టు!

అందుకే #చందమామ కథలు చదవమని చెప్పేది!

అనగనగా ఓ రాజు. తగూపడేవారందరికీ తీర్పు చెప్పేకి ఆయనకి సమయం సరిపోవట్లేదు. "ఎలారా బగువంతుడా" అనుకుంటాంటే ఒక మహర్షి వచ్చి ఒక పెద్ద గండ కత్తెర ఇచ్చినాడు.

"ఏమిటికిది మహర్షీ?" అంటే
"తగూపడేవాళ్లని కత్తెర మద్దెలో సేతులు పెట్టి పెమాణం సెయ్యమనండి, ఎవడు అబద్దమాడితే వాడి సెయ్యిని ఇది కత్తిరించేస్తాది" అన్న్యాడు.

దాని సంగతి జనాలకి తెలిసి అసెత్త పెమాణాలు సేసేకి బయపడినారు. అట్లా అదొచ్చినంక తగూలన్నీ ఆగిపొయినై. రాజు హాయిగా కంటినిండా నిద్రపోతుణ్ణ్యాడు.

అయినా ఒగు దినుము ఒగు తగువొచ్చ. 

"నేనీయప్పకి అప్పు ఇచ్చినా. తిరిగీమంటే ఇచ్చేసినా గదా అంటాడీయప్ప" అని మొదుటి పార్టీ అంటాడు.

"అవును, ఆయప్పకీయాల్సింది ఆయప్పకిచ్చేసినా" అంటాడు రెండో పార్టీ.

"ఇంగ లాబం లేదు కత్తిరి నడుమన సెయ్యి పెట్టి పెమాణం సెయ్యండిద్దరూ" అని రాజు ఆదేశమిచ్చినాడు.

ఒగుటోవాడు పెమాణం చేశ. సెయ్యి తెగక పాయ. 

ఇంకేమి, 
"ఉరే ‌రెండో పార్టీ! నువు చెప్పింది అబద్దము గదా? ఆయప్ప నుంచి తీసుకున్న అప్పు ఆయప్పకిస్తావా లేదా?" అని రాజు బెదిరిచ్చ.

"నేనిచ్చేసినా రాజా" అని రెండోపార్టీ మొత్తుకొన్న్యాడు.

"అట్లైతే నువు గూడా పెమాణం సేస్తావా మడి?"

"సేస్తా రాజా!"

"ఉరే రెండో పార్టీ! అన్నాయెంగా నీ సేతులు నరికిచ్చుకుంటావురా!" అనె రాజు జాలిపడి.

"నేనబద్దమాడితే గద రాజా నా సేతులు పొయ్యేది!" అనుకుంటా రెండోపార్టీ లేశ.

"రోంత ఈ కట్టి పట్టుకోప్పా" అని తన సేతికట్టిని మొదటి పార్టీకిచ్చి, కత్తిరి మద్దెలో సేతులు బెట్టి పెమాణం జేశ. "నేను ఈ మొదటిపార్టీకి బాకీ తీర్చేసినాను" అంజెప్ప్య. 

అయినా గాని కత్తిరి ఊరికే ఉండ్య. ఆయప్ప సేతులు కత్తిరీకప్యా. అందురూ ఆచ్చెర్యపాయిరి. 

"రెండు పార్టీలలో ఏదోక పార్టీ అబద్దమాడినట్లే గదా? మడి ఆ కత్తిరి మహిమ కలిగుంటే ఎవరో ఒకరి సేతుల్ని కత్తిరీయల్ల గదా? అట్లా గాలేదంటే ఈ 
కత్తిరిలో మహిమ లేకున్నెట్లే గదా?" అని రాజుకి మంత్రికి జనాలకీ అందరికీ అనుమానమొచ్చ. "మహర్షీ లేదు, మహిమా లేదు తీ, అంతా సుళ్లు" అనబట్రి.

ఈ సంగతి మహర్షికి తెలిశి దడాన వొచ్చిడిశ. రెండు పార్టీలని మళ్లీ పెమాణం చెయ్యమనె. వాళ్లు మళ్లీ అట్లే సేసిరి. అప్పుడా మహర్షి రెండో పార్టీ ఆయప్ప మొదటి పార్టీకిచ్చిన సేతికట్టి తీసుకుని ఇరగ్గొట్టమన్య. రాజబటులు యిరగ్గొట్రి. 

ఆ సేతికట్టి నడమన డొల్ల ఉండ్య. దాంట్లోంచి రెండోపార్టీ మొదటిపార్టీకీయాల్సిన బాకీ దుడ్లు కింద పడ్య. రాజూ మంత్రీ జనాలూ ఆచ్చెర్యపోయిరి. రెండోపార్టీ సిగ్గుతో తలకాయ వొంచుకొనె. 

"ఏమపా ఇప్పుడు మళ్లీ చేస్తావా పెమాణం?" అని అడిగినాడు మహర్షి రెండో పార్టీని. వాడు బయపడి మహర్షి కాళ్లమింద పడె.

మహర్షి సరేలెమ్మని "రాజా నా కత్తిరి నాకిస్తే నే కొండబోతా"ననె. 

"ఏమిటికి మహర్షీ అది మహిమ కలిగిందే కదా" అనె రాజు.

"దానికి మహిమ ఉణ్ణ్యాగాని ఏమి లాబం? మీ మనసుల్లో దానిమింద రోంతన్నా యిశ్వాసం లేకపాయ. ఇంక మీదగ్గర అది వుండేది పూరా దండగ" అంజెప్పి మహర్షి ఆ కత్తిరిని అట్లే కొండబాయ.

***
అదీ కథ!
***

కలియుగంలో కూడా రెండోపార్టీ లాంటి మనుషులు పుడతారు. అక్రమంగా తరతరాలకు సరిపడేంత సంపాదిస్తారు. కాని, రూపాయి కూడా మేము అక్రమంగా సంపాదించలేదు అని నిర్భయంగా దీపాలాపి "పెమాణాలు" సేస్తారు. వాళ్లకేమీ కాదా అని అమాయికులు ఆశ్చర్యపోరాదు.

వాళ్లు సంపాదిచ్చుకున్న భూములు బంగ్లాలు కానుకలు రకరకాల ప్రతిఫలాలు టెక్నికల్‌గా రూపాయి కాదు. మణుగుల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా కూడా అంతే. ఒకవేళ భవిష్యత్తులో కోర్టులో న్యాయమూర్తులు వీటిని కూడా రూపాయలక్రిందే లెక్కేయాలి అని తీర్పు ఇచ్చినా అది అసత్యప్రమాణం కాబోదు. ఎందుకంటే అవన్నీ వారి బినామీల పేరిట ఉంటాయి గాని పెమాణం చేసినవారి పేరిట ఉండవు కాబట్టి.

ఈ నిజాలు నిరూపించడానికి ఇప్పుడు మహర్షులు లేరు. రెండోపార్టీ మనుషులకు అండగా మీడియా అధిపతులు మాత్రం ఉంటారు.

పిచ్చుకలు



ఈ పిచ్చుకలకు అద్దాలంటే ఎంత మోజో!

అద్దంలో కనబడేది ముద్దు ముద్దుగా తమ ప్రతిబింబాలలేనని తెలుసుకొని తమను తాము ముద్దుపెట్టుకొనేందుకే అద్దాలను టక టకామంటూ ముక్కులతో పొడుస్తుంటాయనుకుంటాను.

కాదేమో, అద్దంలో కనిపించేది శత్రువు అనుకొని దాన్ని చీల్చి చెండాడాలనే కసితో అద్దాన్ని అలా పొడుస్తుంటాయి అనిపిస్తూ ఉంటుంది ఇంకోసారి. అలా కాదులే, ఈ పిచికలు మరీ బావిలోకి దూకిన సింహమంత మూర్ఖమైనవి కాదు, బొత్తిగా అమాయికప్ప్రాణులు.

సందు కనిపిస్తే చాలు, వాసాల్లో గోడల్లో గూళ్లు కట్టేసి సంతానం కనేస్తాయి. ఏమిటీ గడ్డీ గాదం, రెట్టలూ అని ఏమాత్రం విసుక్కోని పల్లెటూరి జనాలే వీటికి మిత్రులు, రక్షకులు.

ఇంటిముందు కాళ్లు కడుక్కునే బండల ఎగుడుదిగుళ్లలో నిలిచిన నీటిలోనే మునకలేస్తూ రెక్కలతో నీటిని విదిలిస్తూ మొయ్యి కడుకునే శుచిగల ప్రాణులు. మొక్కలకు నీళ్లు పోస్తే అవి భూమిలోనికి ఇంకిపోకముందే ఆత్రంగా వచ్చి ఆ నీటిని గ్రోలే అల్ప ప్రాణులు. ఇంటి ముందర కట్ట మీద కుసోని పిల్లోళ్లు బొరుగులూ పప్పూ బెల్లాలూ తింటూంటే మరి మాకో అన్నట్టు వారి దగ్గరకొచ్చి వారు పెట్టేదంతా నున్నగా ఆరగించే బాల్యమిత్రులు.

ఇవి ఎప్పుడూ పార్లమెంటు సభ్యుల్లాగా గోలగోలగా అరుస్తాయి కాని, వీటి కిచకిచ శబ్దాలు ఆ పార్లమెంటు సభ్యుల అరుపుల్లా విద్వేషపూరితాలు, అసభ్యాలు, అసూయాసహితాలు, అర్థరహితాలు ఎంతమాత్రం కావు. ఇవి వెల్‌లోకి చొరబడి పనికిమాలిన నినాదాలు చేయకుండా కరెంటు తీగలమీద బుద్ధిగా వరుసగా కూర్చుని తమ సంఖ్యాబలాన్ని ప్రదర్శిస్తాయి కూడా. అందుకే ఎక్కడైనా ప్రయోజనరహితమైన ధ్యేయరహితమైన అల్లరి జరిగితే #కాకిగోల అంటారే గాని, పిచ్చికల గోల అని ఎవ్వరూ అనరు.

పల్లెటూరి ఇండ్లలో నిలువుటద్దాలుండగా మనుషులున్నారనే భయం కూడా లేకుండా గుంపులు గుంపులుగా వచ్చి ఆ అద్దాలముందు అవి చేస్తూ ఉండిన రకరకాల విన్యాసాలు నాకు ఆనందకరమైన జ్ఞాపకాలు.

ఏ ఊరిలో పిచ్చుకలు ఉన్నాయో, ఆ వూరిలో ధాన్యసంపదకు కొదవ లేదు అని అర్థం. దేశంలో ప్రతి గ్రామంలోనూ పిచ్చుకలు మందలు మందలుగా ఉండాలని కోరుకుందాం.

వేసవి రాబోతోంది.
ఇంటి బయటనో, మేడ మీదనో ఒక మట్టి పాత్రనో లేదా మరో అల్యూమినియం పాత్రనో పెట్టి ప్రతిరోజూ ఆ పాత్రలో నీళ్లు పోస్తూ ఈ పక్షిజాతుల పట్ల మన మైత్రీభావాన్ని ప్రకటిద్దాం.

పిల్లలు కాకమ్మ పిచికమ్మ కథలను తరతరాలుగా వింటూనే ఉండాలి!

రసికుడు - నీరసికుడు

“హనుమంతుడు రసికుడు” అన్నారు మిత్రుడు ఒకాయన తన ఫేస్ బుక్ గోడపై.

కొందరు మెచ్చుకున్నారు – కొందరు నొచ్చుకున్నారు – ఆ మిత్రుని మాటల్లో చెప్పాలంటే – కొందరు తిట్టిపోశారు.

వారి వారి ప్రతిస్పందనలు వారు “రసిక” అనే పదాన్ని అర్థం చేసుకున్న పద్ధతిని బట్టి ఉన్నాయి. 


“రసికుడు” అనే పదం తప్పుడు పదం ఏమీ కాదు. రసాస్వాదన చేయగలిగినవాడు అని అర్థం. కాని, తెలుగు సినిమాలు చాలా పదాలను దుర్వినియోగం చేసినట్టుగానే “రసికుడు” అనే పదాన్ని కూడా దుర్వినియోగం చేశాయి. శృంగారలోలుడు అనే అర్థాన్ని ప్రేక్షకుల మెదళ్లలో కూరి కూరి వదిలాయి.

శృంగారంలో మాత్రం తప్పు ఏముంది? 
నవరసాలను పేర్కొనే శ్లోకంలో శృంగారానికే మొదటి స్థానం ఇచ్చారు.

శృంగారహాస్యకరుణరౌద్రవీరభయానకాః.
బీభత్సాద్భుతశాంతాశ్చ నవ నాట్యే రసాః స్మృతాః. – అన్నారు.

మహాకావ్యాలలో అంగిరసాలుగా ఉండదగినవి - శృంగారము లేదా వీరము. మిగిలినవి అంగరసాలు మాత్రమే అనేశారు పెద్ద పెద్ద సాహిత్యశాస్త్రవేత్తలు కూడా. కాబట్టి, శృంగారపురుషుడై ఉండటం తప్పేమీ కాదు.

కాని, అదే సాహిత్యశాస్త్రవేత్తలు రసాభాసలను కూడా పేర్కొన్నారు. అంటే అవి రసం లాగా అనిపిస్తాయేమో కాని, నిజానికి రసాలు కావు అని అర్థం. 

వీరరసం ప్రధానమైనదే – కాని పడకగదిలో కూర్చుని “ఆ శత్రువును ఇలా ఎదుర్కోవాలి, ఈ శత్రువును ఇలా దునుమాడాలి” అని వీరాలాపాలు చేస్తే అది రసాభాస. 

అలాగే శృంగారరసం కూడా ప్రధానమైనదే – కాని, యుద్ధరంగంలో విజృంభించవలసిన వేళ ప్రియురాలి చెంతకు చేరి సరససల్లాపాలు ఆడాలనిపిస్తే మాత్రం అది రసాభాస.

శత్రువును పరాభవిస్తే – అది వీరరసం. కాని, గౌరవింపదగిన పెద్దలను పరాభవిస్తే అక్కడ వీరరసాభాస మాత్రమే. అక్కడ ఆ పని చేసినవాడిమీద జుగుప్స కలుగుతుంది. అంటే అది బీభత్సరసం ఔతుంది.

సీతారాముల మధ్యనో రాధాకృష్ణుల మధ్యనో ఉన్న అనురాగాన్ని వర్ణిస్తే అది శృంగారరసం అవుతుంది. ఆ శృంగారం కూడా రెండు రకాలు. విప్రలంభశృంగారం అని, సంయోగశృంగారం అని. ఎడబాటులో ఉన్నపుడు – విప్రలంభం, పరస్పరసముఖత ఉన్నపుడు సంయోగం అన్నమాట. 

భవభూతి వ్రాసిన ఉత్తరరామచరితంలో సీతారాముల నడుమ విప్రలంభశృంగారం దేదీప్యమానమైనది.

సంయోగశృంగారవర్ణనలు కలిగిన కావ్యాలకు కూడా కొదవ లేదు. 

ఇట్లా కేవలం శృంగారాన్ని మాత్రమే కాదు, నవరసాలను చక్కగా పండించిన కావ్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. 

రసాభాస కాకుండా వాటిని సర్వజనమనోరంజకంగా నడిపిన కవులను భర్తృహరి ప్రశంసించాడు కూడా.

“జయంతి తే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాః,
నాస్తి యేషాం యశఃకాయే
జరామరణజంభయమ్” - అన్నాడు. 

ఈ నవరసాలన్నీ యథాయోగ్యంగా భారతీయులచేత ఆదరింపబడ్డాయి. కాబట్టి, భారతీయులు రసహృదయులే (రసికులే) కాని నీరసహృదయులు కారు. అందులో సందేహం అక్కరలేదు, అసహ్యించుకొనదగినది కూడా ఏమీ లేదు.

కాని, 
రసికత్వం ఉండవలసింది కేవలం కవులలోనే కాదు, చదివే పాఠకులలో కూడా ఉండాలి. అప్పుడే ఆ కవిత్వానికి రాణింపు. అప్పుడే ఆ కవిత్వానికి మెప్పుకోలు. 

“ఓ చతురాననుడా! మిగిలిన కష్టాలను వందలకు వందలుగా, యథేష్టంగా, మా నుదుటన వ్రాసుకో, సహిస్తాము. కాని, సమయసంగతిసందర్భాలను పట్టించుకోకుండా మా కవిత్వాన్ని అపార్థం చేసుకొనేవారికి, లేదా ఏమాత్రం అర్థం చేసుకోలేని నీరసహృదయులకు మా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం మాత్రం మా నుదుటన వ్రాయబోకయ్యా" – అని కవులు బ్రహ్మను పరిపరివిధాల వేడుకున్నారట.

"ఇతరతాపశతాని యదృచ్ఛయా విలిఖ
తాని సహే చతురానన.
అరసికేషు కవిత్వనివేదనం శిరసి
మా లిఖ మా లిఖ మా లిఖ."

ఇలా ఎందుకు వేడుకొనడం అంటే – 
ఈ నీరసహృదయులు చక్కని కవిత్వానికి కూడా వంకలు పెడతారు. అపహాస్యం చేస్తారు. విపరీతార్థాలను కల్పిస్తారు. అలా చేసి, ఆయా కవుల పట్ల, కవిత్వం పట్ల విముఖత్వం కలిగించినా పరవాలేదు. 

కాని, 
ఈ అరసికులు ఆయా కావ్యాలలో ఉన్నతాదర్శాలకు ప్రతీకగా తాము నిలిపిన పాత్రల పట్ల కూడా వైముఖ్యం కలిగిస్తారు. అందుకని.

భారతీయకావ్యశాస్త్రసంప్రదాయంలో అందరి చేత ఎంతగానో గౌరవింపబడే అభినవగుప్తాచార్యులు అని ఒకానొక మహాపండితుడు (క్రీస్తుశకం 950 సం.) ఉన్నారు. ఆయన సహృదయుడు అనే పదం వాడారు. సహృదయుడు అంటే కవితో సమానమైన హృదయం కలిగినవాడు – అంటే – కవి హృదయాన్ని అర్థం చేసుకొనగలిగిన వాడు అని అర్థం. అతడే రసికుడు. అంటే - కవిహృదయాన్ని అర్థం చేసుకొనలేని వాడు నీరసికుడు అన్నమాట!

"సీతను వెదుకుతూ రావణుని అంతఃపురానికి వెళ్లిన హనుమంతుడు అక్కడ నిద్రావస్థలో ఉన్నటువంటి, చెదిరిన వస్త్రాభరణాలతో ఉన్నటువంటి యువతులను చూశాడు" అన్నంతవరకు ఏ ఇబ్బంది లేదు. అందులో అసహజం అయినది ఏమీ లేదు. 

కాని, 
అక్కడ హనుమంతుని కూడా అతి సామాన్యుడైన ఒక చంచలహృదయునిగా భావించి “ఆహా! ఎంతటి లక్కీ ఫెలో రా!” “ఆహా ఎంతటి రసికుడురా!” అని పాఠకులు కామెంట్లు చేస్తే మాత్రం నిస్సందేహంగా అది వారి నీరసికత్వమే.

ఆ సమయంలో రాముని కార్యం పూర్తి చేయాలి అనే సుస్థిరమైన ధ్యేయం తప్ప మరేమీ హనుమంతుని మనసులో లేదు. 

సీతకోసం బయలుదేరిన హనుమంతునికి దారిలో మైనాకుడు ఎదురై విశ్రాంతి తీసుకోమన్నాడు. హనుమంతుడు నిరాకరించాడు. నాగమాత సరమ తన నోటిలోనికి ప్రవేశించకుండా హనుమంతుడు ముందుకు పోలేడని సవాలు చేసింది. హనుమంతుడు చాకచక్యంగా ఆమె నోటిలోనికి ప్రవేశించి కూడా సురక్షితంగా బయటకు వచ్చాడు. తనను ఆహారంగా చేసుకోదలచిన సింహికను భుజబలంతో నిర్జించాడు. లంకిణిని ఒక్క పిడికిటిపోటుతో పడగొట్టాడు. లంకలో ఎవరి కంటనైనా పడితే పని చెడిపోతుందని భావించి అంగుష్ఠమాత్రుడై సంచరిస్తూ సీతను వెదుకుతున్నాడు. అదే ప్రయత్నంలో రావణుని అంతఃపురంలో కూడా వెదికాడు. అక్కడ పైన చెప్పినట్లు వివిధ అవస్థలలో నిద్రిస్తున్న స్త్రీలను చూశాడు. అయినా అతని మనస్సులో ఎటువంటి వికారమూ కలుగలేదు. వీరెవరూ సీత కాదు అని నిశ్చయించుకుని తన అన్వేషణను కొనసాగించాడు. ఇన్ని పనులు చేస్తూ కూడా అతడు తన అలసటను, ఆకలిదప్పులను ఏమాత్రం లెక్కచేయలేదు. 

ఇంతవరకు, ఈ విధంగా హనుమంతుని కార్యసాధకత్వాన్ని పాఠకుల మనసులో ముద్రవేయడానికి వాల్మీకిమహర్షి సుందరకాండలో 11 సర్గలను, 621 శ్లోకాలను వెచ్చించి, గొప్ప ప్రయత్నం చేశాడు.

కాని, ఆ మహాకవి ప్రయత్నాలకు చెదగొడుతూ, ఆ ప్రయత్నాలను చెడగొడుతూ, ఆయన ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా “రావణాంతఃపురంలో ఆ విధంగా ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుడు రసికుడే (శృంగారపురుషుడే) సుమా” అని వ్యాఖ్యానిస్తే మాత్రం వెగటు పుడుతుంది. 

మహోన్నతమైన హనుమంతుని వ్యక్తిత్వాన్ని విస్మరించి, అతనికి లేని దోషాన్ని ఆపాదించడంవల్ల హాస్యరసం పుట్టదు. జుగుప్స అనేది స్థాయిభావంగా కలిగిన బీభత్సరసం పుడుతుంది.

ఆహా, అలాగేం కాదు, కవి హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను, అక్కడ ప్రతిపాదింపబడింది శృంగారరసమే తప్ప వీరరసం కాదు అని దబాయించే అవకాశం కూడా ఉంది. 

కాని, ఏ రసాన్నైనా వ్యక్తపరిచే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని అనుభావాలు అంటారు. “అనుభావో వికారస్తు భావసంసూచనాత్మకః” – అని దశరూపకం అనే గ్రంథంలో ధనంజయాచార్యులు (క్రీస్తుశకం 975 సం.) చెప్పారు. 

తాత్కాలికమైన నిశ్చేష్టత, తాను ఉన్న పరిసరాలను విస్మరించడం, పులకింతలు, స్వేదం, ముఖకవళికలలో మార్పు, దొంగచూపులు, మాటల్లో తడబాటు – ఇటువంటివి అన్నమాట. 

సుందరకాండలో ఆ స్త్రీలను చూసిన హనుమంతుడిలో ఇటువంటి వికారభావాలు ఏమీ కలుగలేదు. అలాగే, శృంగారరసాన్ని సూచించే కొన్ని సంచారి భావాలు – హర్షము, ఈర్ష్య, మోహము – వంటివి కూడా హనుమంతునిలో ఈషణ్మాత్రం కలుగలేదు. అందువల్ల అక్కడ హనుమంతుడు శృంగారపురుషుడు అని చెప్పడం సమంజసం కాదు. 

వీరిలో సీత లేదు అని నిశ్చయించుకుని, మరెక్కడ ఉందో వెతకాలి అని భావిస్తూ తక్షణమే అక్కడనుండి వెడలిపోయాడు. కాబట్టి, ఇక్కడ కూడా హనుమంతుని కార్యసాధకత్వమే – ఎటువంటి ఆటంకాలకూ లొంగని ఉత్సాహమే – కవి చేత ప్రతిపాదించబడింది. అదే వీరరసం. 

ఇలా కవిహృదయాన్ని అర్థం చేసుకోకుండా, మాకు తెలిసిందే రసం అంటే - మా ఇంట్లో, కిటికీలు మూసిన గదిలో వెలుతురు లేకపోవడానికి కారణం ఆ సూర్యుడే అని నిందించినట్లు ఉంటుంది.

అందుకే ఇలాంటివారికి కవిత్వం వినిపించే దౌర్భాగ్యం మా నుదుటన వ్రాయకు దేవుడోయ్ అని ఆ కవులు మొత్తుకున్నది.

మనకుడబ్బు అవసరమే, అలాగే చెప్పులు కూడా అవసరమే. కాని, దేనిని ఎక్కడ పెట్టాలో దానిని అక్కడే పెట్టాలి. ఇంటి బయట చెప్పుల స్టాండులో డబ్బూ నగలూ పెట్టం. అలాగే, బ్యాంకులో లాకర్ తీసుకొని అందులో మన చెప్పులు దాచుకోం. నాకు ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అని వీధిలో ఎగ్జిబిషన్ పెట్టం. అలాగే చెప్పులను జేబులో పెట్టుకుని తిరగం. 

ఈ విధంగా ప్రతిదానికి నిర్దేశింపబడిన లోకరీతి ఒకటి ఉంటుంది. దానినే ఔచిత్యం అంటారు. దానినే మర్యాద (హద్దు) అంటారు. ఔచిత్యంపాటించకుంటే లోకంలో నవ్వులపాలు అవుతారు. మర్యాద పాటించకుంటే లోకం ఆ మనిషిని దూరంగా పెట్టే ప్రమాదం ఉంది.

కాబట్టి, శృంగారరసాన్ని ఆస్వాదించేందుకు తగిన కావ్యాలు బోలెడున్నాయి. అక్కడ నిరభ్యంతరంగా ఆస్వాదించుకోవచ్చు.  కృష్ణుడు నాయకుడుగా కలిగిన ఒక శృంగారకావ్యాన్ని చూపి చూశారా కృష్ణుడు ఎంతటి రసికుడో? అంటే ఏ గొడవా ఉండదు. కాని, యుద్ధరంగంలో అర్జునునికి భగవద్గీతను బోధించే కృష్ణునిలో శృంగారపురుషత్వం చూస్తే అది రసాభాస.  అలా చూసేవాడు తింగరివాడు. 

అలాగే, సుందరకాండలో హనుమంతుని లోకోత్తర-ఉత్సాహాన్ని – అంటే వీరరసాన్ని – కవి ప్రతిపాదిస్తూ ఉండగా అక్కడ ఆ వీరరసాన్ని ఆస్వాదించకుండా హనుమంతుడిని శృంగారపురుషుడని కామెంటు చేయడం వల్ల రసాభాస జరగక మానదు. అదే జరిగింది కూడా.

కాబట్టి మనం కవిహృదయాన్ని తెలుసుకుని రసికులం అవుదాం – కవి హృదయాన్ని పెడదారి పట్టించి నీరసికులం కాకుండా ఉందాం. 

ఇదంతా మా మిత్రుని పోస్టులో, కామెంట్లలో పెట్టదగినంత చిన్న విషయం కాదు కాబట్టి, నా గోడ మీద ప్రత్యేకమైన పోస్టుగా వ్రాయవలసి వచ్చింది.

ఇతి శమ్.

No offending Comments Please...

రాజ్యబహిష్కారశిక్ష


జానపదుల కథ లెండి. ఎంతటివారినైనా ఎలాగైనా తమ కథలోనికి ఒక పాత్రగా లాగేస్తారు. ఎప్పటి కృష్ణరాయలు, మరెప్పటి రామలింగడు! పాత్రలు చాల ప్రాచీనమైనవే! పాఠం మాత్రమే నిత్యనూతనం!

ఓ సారి సభ జరిగింది.
సభలో ఎవరు గొప్పవారనే చర్చ వచ్చింది.

కొందరు అమ్మ గొప్పదన్నారు.
కొందరు తల్లిదండ్రులిరువురూ గొప్పవారన్నారు.
కొందరు గురువు గొప్పవాడన్నారు.
కొందరు రైతు గొప్పవాడన్నారు.
కొందరు భూదేవి గొప్పదన్నారు.
కొందరు సూర్యుడు గొప్పవాడన్నారు.
కొందరు దేవుడు గొప్పవాడన్నారు.

వాదోపవాదాలు జరిగాయి.
చివరకు దేవుడు గొప్పవాడనే పక్షం వాళ్లది పైచేయి అయింది. ఇంత జరుగుతున్నా తెనాలి రామలింగడు నోరు విప్పితే ఒట్టు! అందరికీ అది వింతల్లోకెల్లా వింతగా ఉంది. చేప నేలమీద బతికినంత, చీమ సముద్రాన్ని ఈదినంత వింతగానే ఉంది అందరికీ.

చివరకు కృష్ణరాయలే అడిగేశాడు - "ఏమంటావ్ రామలింగా, నిశ్శబ్దంగా ఉన్నావేం? అంటే దేవుడే అందరికంటె గొప్పవాడని నువు కూడా ఒప్పకున్నట్టే కదా?" అన్నాడు.

ఈ అవకాశంకోసమే ఎదురుచూస్తున్నాడేమో మనిషి, "ఒప్పుకోనుగాక ఒప్పుకోను మహారాజా!" అనేశాడు.

దేవుడిగొప్ప పక్షం వాళ్లు తక్షణమేవిరుచుకుపడ్డారు.
ఎవరు?
ఎవరది?
ఎక్కడున్నారు?
నువు చూసొచ్చావా?
అని ప్రశ్నలపరంపర మొదలైంది.

"అవును.
నేను చూశా.
చూస్తూనే ఉన్నా.
ఇక్కడే ఉన్నారు.
మీరు కూడా చూస్తూనే ఉన్నారు."
అన్నాడు రామలింగడు తాపీగా.

ఎవరో?
అదెవరో?
ఎవరికీ ఊహకు కూడా అందలేదు.

కాసేపయ్యాక,
మళ్లీ మాటలు మొదలు.
"ఎవరది?
చెప్పు.
పేరు చెప్పు.
చూపించు."

"ఇంకెవరనుకున్నారు?"
👀👀👀👀👀👀
అందరి కళ్లూ రామలింగడినే చూస్తున్నాయి.
👂👂👂👂👂👂👂
అందరి చెవులూ రామలింగడి మాటలనే వింటున్నాయి.

"అదెవరో కాదు,
సాక్షాత్తు మన మహారాజులవారే!
వారే దెవుడికంటె గొప్పవారు!"
అన్నాడు రామలింగడు.

😶 😶 😶
అంతే! కాసేపు భయంకరమైన నిశ్శబ్దం తాండవనృత్యం చేసింది. ఏ ఒక్కడూ కిక్కురుమనలేదు. లేదు, మహారాజు కంటె దేవుడే గొప్పవాడు అనేంత సాహసం ఏ ఒక్కడూ చేయలేకపోయాడు. రామలింగడు రాజుగారిని అందరిముందు ఇంతగా కాకా పట్టగలడని ఒక్కరంటే ఒక్కరు కూడా ఊహించలేకపోయారు. చివరకు ఏకంగా రాజుగారు కూడా. ఇలా విజయవంతంగా రామలింగడు అందరినోర్లూ మూయించేశాడు.

కాసేపయ్యాక కొందరు చప్పట్లు కొట్టారు. వారిని చూసి మరికొందరు కొట్టారు. చివరికి అందరూ కొట్టారు. దేవుడిగొప్పపక్షంవాళ్లు కూడా విధిలేక చప్పట్లు కొట్టవలసి వచ్చింది.

👏👏👏

ఇప్పుడు విజేతకు బహుమతినివ్వాలి!
రాజుగారు తన చేతులమీదుగానే ఇవ్వాలి!
రామలింగడు చిరునవ్వుతో రాజుగారిని చూస్తున్నాడు.

కాని,
కాని,

రాజుగారికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి!
తనను దేవుడికంటె గొప్పవాడని పొగిడించుకుని, అందుకు బహుమతిని ఇస్తున్నట్టుంది! తనకు ఇంతటి ఇబ్బందిని కలిగించిన రామలింగడిమీద రాజుగారికి పట్టలేనంత కోపం వచ్చింది.

"చూడు రామలింగా!" అన్నాడు.

"చూడు,
దేవుడి కంటే మహారాజే గొప్ప అని ఊరికే అనడం కాదు, ఏ విధంగా గొప్పో సహేతుకంగా చెప్పి అవునంటూ సభలో అందరినీ ఒప్పించాలి. లేెదంటే ముందు నీకు, ఆ తరువాత ఇపుడు చప్పట్లు కొట్టినవారందరికీ కొరడా దెబ్బలు తప్పవు"

అందరికీ భయమేసింది.
మళ్లీ అందరి కళ్లూ అందరి చెవులూ రామలింగడివైపు జాలిగా తిరిగాయి. రామలింగడే మమ్మల్ని కాపాడాలి! రామలింగడే గెలవాలి! అని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. చేయక చస్తారా? తమచేత కూడా చప్పట్లు కొట్టించి ఇరికించేశాడుగా మరి! రాలింగడిమీద పీకలదాకా కోపం ఉన్నవాళ్లు కూడా రామలింగడే గెలవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

"సహేతుకంగానే చెబుతాను మహారాజా!" అన్నాడు రామలింగడు. "నా అంతటి హేతువాది, మునుపు లేడు, ఇపుడు లేడు, ఇకమీదట రాబోడు" అన్నాడు.

"సరే, చెప్పు మరి!"

"మీరు చేయగలిగిన ఒక పనిని దేవుడు కూడా చేయలేడని నిరూపిస్తా. ఆ లెక్కన మీరు దేవుడి కంటె గొప్పవారని నిరూపించబడినట్లేగా?"

శ్రీకృష్ణదేవరాయలతో సహా సభాసదులందరూ ఆశ్చర్యపోయారు.

ఏమిటది?
ఏమిటా పని?
రాజు చేయగలిగి, దేవుడు మాత్రం చేయలేని పని అంటూ ఒకటి ఉంటుందా?

కొందరు 😱😱😱 ఇలా చూస్తున్నారు.

కొందరు 😵😵😵 ఇలా చూస్తున్నారు.

ఇంకొందరు 🤔🤔🤔 ఇలా చూస్తున్నారు.

"అదేమిటో చెప్పవయ్యా, ఆలోచిద్దాం, దేవుడు చేయగలడో లేడో?" అన్నారు మహారాజావారు.

"ఏముంది మహారాజా?
మీకు ఎవరిమీదనైనా కోపం వస్తే దేశబహిష్కారశిక్ష వేయగలరు. చెప్పండి, దేవుడు ఆ శిక్షను వేయగలడా? వేసినా అమలు జరిపించుకోగలడా?"

సభ దద్దరిల్లిపోయింది.
👏👏👏👏👏👏👏
చప్పట్లే చప్పట్లు.

రాజుగారి రాజ్యానికి హద్దులున్నాయి. కాబట్టి రాజ్యబహిష్కారశిక్ష వేస్తే మెడబట్టి సరిహద్దుల బయటకు గెంటేస్తారు. మరి దేవుని రాజ్యానికి హద్దులేవీ? సమస్తవిశ్వమూ ఆయన రాజ్యమే కదా? మరి ఎక్కడకు గెంటివేయగలడు, పాపం?

రామలింగని యుక్తికి చప్పట్లు. రామలింగడు తమకు శిక్ష తప్పించినందుకు చప్పట్లు. దేవుడే గొప్ప పక్షంవాళ్లు తమ దేవుడిని రామలింగడు తక్కువ చేయనందుకు చప్పట్లు.

శ్రీకృష్ణదేవమహారాయల పెదవులమీద దరహాసం కనిపించింది. రామలింగడు మరీ మతిమీరి మితిమీరిన పొగడ్తలతో తనను ఇబ్బంది పెట్టనందుకు.

విజేతగా నిలిచిన రామలింగనికి మహారాజులవారే స్వయంగా బహుమతిని అందజేశారు.

💮శుభం💮

శ్రీరాముని వనవిహారం

ఆహా సీతా!
विचित्रपुलिनां रम्यां हंससारससेविताम्।
कमलैरुपसम्पन्नां पश्य मन्दाकिनीं नदीम्।।
రంగురంగుల ఇసుకతిన్నెలతోనూ రమ్యమైనది, హంసలు సారసపక్షులకు ఆశ్రయం ఇస్తున్నదీ, మిక్కిలి కమలాలతో శోభిస్తున్నదీ అయిన ఈ మందాకినీ నదిని చూడు!
ఈ నదీతీరంలో ఎన్నెన్ని చెట్లు పెరిగాయో చూడు! అవి పూవులతోనూ పండ్లతోనూ ఎలా కళకళలాడుతున్నాయో చూడు!
జింకలు గుంపులు గుంపులుగా వచ్చి నీటిని బురదరంగులోనికి ఎలా మార్చేస్తున్నాయో చూడు! ఆహా ఈ రమణీయతీర్థాలు నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి!
కొండమీద చెట్లు గాలికి ఎలా ఊగిపోతూ పూవులను ఆకులను ఎలా వెదజల్లుతున్నాయో చూడు! నదికి అటూ ఇటూ ఉన్న ఈ కొండలు తమ చేతులను ఊపుతూ నాట్యం చేస్తున్నట్లు లేవూ?
दर्शनं चित्रकूटस्य मन्दाकिन्याश्च शोभने।
अधिकं पुरवासाच्च मन्ये च तव दर्शनात्।।
ఓ సీతా!
నిన్ను, ఈ చిత్రకూటాన్ని, మందాకినీనదిని చూస్తుంటే అయోధ్యాపురంలో నివాసం దీనికంటె సుఖప్రదం కాదనిపిస్తోంది!
హాయిగా మూడుపూటలా స్నానం చేస్తూ, తేనెలను, దుంపలను, పండ్లను ఆరగిస్తూ ఉంటే అయోధ్య కాని, కోసలరాజ్యం కాని అసలు గుర్తుకే రావటం లేదు.
అంటూ చిత్రకూటం చెంత మందాకినీ తీరంలో -
ఓ లక్ష్మణా!
విన్నావా! నెమళ్ల క్రేంకారనాదాలు! ఆ కొండగుహలను చూడు, ఎన్నెన్ని ఉన్నాయో! ఎంతెంత పెద్దవో! చూడు!
ఆ కొండల మీద బంగారు, వెండి, రాగి రంగులలో మిల మిల మెరుస్తున్న ధాతువులను చూడు!
సాల వృక్షాలు, తాళవృక్షాలు, తమాలవృక్షాలు, ఖర్జూరాలు, పనసలు, ఆమ్రాలు, చంపకాలు, కేతకులు, చందనాలు, నీపాలు, లికుచాలు, ధవాశ్వాలు, శమీకింశుకపాటలాలు! ఆహా! ఎన్నెన్ని రకాలతో వృక్షసంపద ఇక్కడ నిండుగా వర్ధిల్లుతున్నదోో చూడు!
అంటూ గోదావరీతీరాన పంచవటిలో -
ఆహా లక్ష్మణా!
పంపానదీజలాలలో తేలాడుతూ వాటి అలలపై ఊగాడుతున్న వందలు వందల పక్షిసమూహాలను చూడు! నెమళ్లు, క్రౌన్చాల మధురధ్వానాలను విను!
లక్ష్మణా!
వర్షాకాలం వచ్చిందిగా! మేఘాలు మనం ఉంటున్న గుహకు ఎంత చేరువగా వచ్చాయో చూడు, ఈ మేఘాలను మెట్లుగా చేసుకుని, కొండపైకి పోయి, కొండమల్లెలు, గన్నేరులు కోసుకుని, మాలలల్లి, సూర్యునికి మనం సమర్పించుకోవచ్చును!
मेघोदरविनिर्मुक्ताः कल्हारसुखशीतलाः।
शक्यम् अञ्जलिभिः पातुं वाताः केतकिगन्धिनः।।
కలువల చల్లదనాన్ని, మొగలిపూల సువాసనలను మోసుకొస్తూ మేఘాలనే తెరల నడుమనుండి గాలి మనవైపే సూటిగా వీస్తున్నది చూడు! ఆహా! ఈ చల్లని పిల్లగాలులను దోసిళ్ళతో పట్టి తాగేయవచ్చుననిపిస్తోంది కదా లక్ష్మణా!
వర్షాకాలం ముగిసి శరదృతువు ఆరంభం కాబోతోంది. మేఘాలు కుంభవృష్టిని మానేసి ఉరుముతున్నాయి. సెలయేళ్ళ శబ్దం నెమళ్ళ అరుపులను తలపిస్తోంది. మేఘాలను శిఖరాలపై దాల్చిన పర్వతాలు మదపుటేనుగుల్లా ఉన్నాయి చూడు లక్ష్మణా!
అంటూ కిష్కింధ చెంత ప్రస్రవణగిరిపై -
ఇలా - వాల్మీకి మహర్షులవారి రాముడు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరచిపోయేవాడు.
కాని, రంగనాయకమ్మ గారు తన రాముడు అందాలను ఆస్వాదించలేని జడబుద్ధి మందబుద్ధి, అంటూ తిట్టి తిట్టి పోసుకుంది.
అందుకే,
వాల్మీకి రాముడితో రంగనాయకమ్మ గారి రాముడిని పోల్చకండి.
ఈ రాముళ్లు ఇద్దరూ పూర్తిగా వేరు వేరు.
వాల్మీకి రాముడిని ప్రపంచమంతా మెచ్చింది.
రంగనాయకమ్మ గారి రాముడు స్వయంగా కన్నతల్లి అయిన రంగనాయకమ్మకే నచ్చలేదు!
రంగనాయకమ్మగారు ఇద్దరు రాముళ్ళూ ఒకటేనని అందరికీ నచ్చజెప్పేందుకు విషవృక్షం ఎక్కి అరుస్తోంది. నమ్మకండి. తన నీళ్లను పాలలో పోసి కలిపేసి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యాపారి ఈవిడ!

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...