Showing posts with label Sage. Show all posts
Showing posts with label Sage. Show all posts

Monday, 27 April 2020

అత్రిఅనసూయామహర్షిదంపతులు




#భారతీయఋషులు 3



అత్రిమహర్షి వృత్తాంతం భౌతికమైనది కాదని, కొంతవరకు సాంకేతికమైనదని తోస్తుంది.  కాని, సీతారామలక్ష్మణులు తమ వనవాసకాలంలో ఆయనను ప్రత్యక్షంగా సందర్శించి సేవించుకున్నట్లు రామాయణం సాక్ష్యమిస్తుంది.

అత్రి కూడా బ్రహ్మమానసపుత్రుడే.  ఈయన ఋఙ్మంత్రద్రష్టగా వేదాలలో ఉదాహరింపబడ్డాడు.  (ఋగ్వేదం, పంచమమండలం)   బృహదారణ్యకోపనిషత్తు అతనిని వాక్కుగా వర్ణిస్తుంది.  “వాగేవ అత్రిః।” ఈ సందర్భంలో వాక్కు అంటే రసనేంద్రియమే (నాలుక) అని కొందరి వ్యాఖ్యానం.     

ఉపనిషత్తులో తరువాత చెప్పిబడిన వాక్యాలు ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపించేలా చేస్తాయి.  “వాచాహ్యన్నమద్యతే” – (వాక్కు చేతనే అన్నం భుజింపబడుతుంది.)  “అత్తిర్హ వై నామైతద్ యదత్రిరితి” – భుజిస్తుంది (అత్తి) కాబట్టి దీని పేరు అత్రి.  “సర్వస్యాత్తా భవతి, సర్వమస్యాన్నం భవతి య ఏవం వేద” – (ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో అతడు సమస్తాన్నీ భుజింపగలిగినవాడౌతాడు.  సర్వమూ అతడికి అన్నమౌతుంది.) {బృహదారణ్యకం 2.2.4}

దేవహూతీకర్దముల పుత్రిక అయిన అనసూయ ఇతడి భార్య.  ఆ అనసూయ దయాస్వరూపిణి.  ఒకసారి వరుసగా పదిసంవత్సరాలపాటు అనావృష్టి ఏర్పడి తిండి నీరు లేక ప్రపంచమంతా అల్లాడిపోయిందట.  అపుడు అనసూయ తన తపఃప్రభావం చేత ప్రజలకోసం మూలాలను (దుంపలను) ఫలాలను సృష్టించిందట.  నీటిని కూడా సృష్టించిందట.  

యయా మూలఫలే సృష్టే
జాహ్నవీ చ ప్రవర్తితా।
(రామాయణం.2.117.9)

అనసూయమ్మకు సాక్షాత్తుగా గంగ ప్రత్యక్షమైందని,  తన తపఃఫలాన్ని పతిసేవాధర్మపుణ్యాన్ని ధారపోసి అనసూయమ్మ గంగమ్మను నిలిపిందని శివపురాణంలో కోటిరుద్రసంహిత తెలుపుతుంది.

(తపస్సు అంటే తపించడం.  ఒక విషయాన్ని గూర్చి తీవ్రమైన శోధన చేయడం కూడా తపస్సే.  అంటే రిసెర్చ్ అన్నమాట.  బహుశః అనసూయమ్మ పరిశోధించి అతి తక్కువ నీటితో పండే మూలఫలాదులను కనిపెట్టింది అనుకోవచ్చు.  అలాగే, నీటివనరులను కాపాడుకొనడం, భూగర్భంలోని నీటిని పైకి తీయడం వంటివి ప్రజలకు నేర్పింది అనుకోవచ్చు.  ఈ విధంగా అనసూయమ్మ అతి ప్రాచీనకాలపు సైంటిస్టు, సంఘసేవికురాలున్నూ.  ఆమెను కేవలం ఒక పతివ్రతగా మాత్రమే గుర్తించడం అన్యాయం.) 

ఆ పుణ్యదంపతుల కోరిక మేరకు శివుడు గంగ నిలిచిన తావున అత్రీశ్వరుడనే పేరిట నిలిచిపోయాడు.

ఈ దంపతులిద్దరూ అతి గొప్ప తపస్సును చేశారు.  త్రిమూర్తులు వారి తపస్సుకు మెచ్చి ఏమి కావాలో కోరుకొమ్మని అడిగారు.  మీరు మాకు పుత్రులై జన్మించాలి అని వారు వరం కోరారు.  వారి కోరిక మేరకు బ్రహ్మ సోమునిగా, విష్ణువు దత్తాత్రేయునిగా, పరమేశ్వరుడు దూర్వాసునిగా వారి కుమారులై జన్మించి వారి ముచ్చటను తీర్చారు. 

ఈ విషయంలో మరొక కథ కూడా ఉన్నది.  ఒకసారి సూర్యచంద్రోదయాలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడిందిట.  దాంతో త్రిమూర్తులు ఈ విషయంలో సహాయం చేయమని అనసూయను అడిగారట.  అపుడు ఆమె పదిరాత్రులను ఒక్క రాత్రిగా మార్చివేసి, సూర్యచంద్రోదయాలు జరిగేందుకు వీలు కలుగజేసింది. 

దశరాత్రం కృతా రాత్రిః (రామాయణం.2.117.11)

(ఈ కథ సాంకేతికంగా జ్యోతిషసంబద్ధమైన కాలగణనం.  జ్యోతిస్సులంటే సూర్యచంద్రగ్రహనక్షత్రాదులు. నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఫిబ్రవరిలో ఒక్క రోజు అధికంగా ఎలా వస్తుందో  మనకు తెలుసు.  అలాగే, చాంద్రమానాన్ని అనుసరించి, అధికమాసాలు, లేదా క్షయమాసాలు వస్తూ ఉంటాయి.  రెండు అమావాస్యల నడుమలో సంక్రాంతి ఎప్పుడైతే రాదో దానిని అధికమాసం అంటారు.  ఆ సంవత్సరంలో 13 నెలలు వస్తాయి. ఇటువంటి పరిస్థితి దాదాపు రెండున్నరసంవత్సరాలకు చొప్పున ఏర్పడుతుంది.  అలాగే, ఒకొక్కసారి రెండు అమావాస్యల నడుమ రెండు సంక్రాంతులు వస్తాయి.  ఆ కాలాన్ని క్షయమాసంగా లేదా లుప్తమాసంగా పరిగణిస్తారు.  అంటే ఆ సంవత్సరంలో ఒక  నెల లోపించి కేవలం 11 మాసాలు మాత్రమే ఉంటాయన్న మాట.  ఇది చాల అరుదైన ఘటన.  బహుశః, ఆనాడు అనసూయ కూడా ఇటువంటి కాలగణనం చేసి, ఒక తిథి (date) తరువాత మరుసటి రోజు 11వ తిథిని ఆనాటి క్యాలండర్లో పొందుపరచి ఉండవచ్చు.  దానినే పదిరాత్రులను ఒక్కరాత్రిగా మార్చడంగా సాంకేతికంగా పేర్కొని ఉంటారు.  ఈ విషయాన్ని అర్థం చేసుకొనడం చేతగాని దద్దమ్మలు పతివ్రతలంట, గ్రహగతులను మార్చివేశారంట అని వెక్కిరిస్తూ తమలో తాము ఆనందపడిపోతూ ఉంటారు.)

అనసూయ చేసిన ఘనకార్యానికి ఆనందపడిన త్రిమూర్తులు ఆమెను వరం కోరుకొమ్మంటే ఆమె వారిని తన బిడ్డలుగా జన్మించమని వరం కోరిందని, వారు తథాస్తు అని అంగీకరించారని ఆ మరొక కథ.  ఇంకొక కథలో త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షింపగోరితే ఆమె వారిని పసిబిడ్డలుగా మార్చివేసిందని, త్రిమూర్తుల పత్నులు ఆమెను వేడుకుంటే వారు తనకు బిడ్డలుగా జన్మించాలని వరం కోరుకున్నదని చెబుతారు.  కథలు ఏమైనా, అనసూయమ్మ త్రిమూర్తులతో సమానమైన బిడ్డలను కన్న మహాతపస్విని అనే మాట నిజం.   

అతడు సోమమహారాజు చేసిన రాజసూయయాగానికి ప్రధానఋత్విక్కుగా ఉన్నాడు.  ఈనాడు ఉన్నట్టే ఆనాడు కూడా కొందరు రాక్షసులు ఉండేవారు.  వారు అత్రిమహర్షిని శతద్వారమనే పీడాగృహంలో చిత్రహింసలు పెట్టారు.  అతనిని చంపివేసేలోగా దేవవైద్యులైన అశ్వినీదేవతలు ఆ గృహంలోని అగ్నిని శమింపజేసి, బలప్రదమైన అన్నం పెట్టి కాపాడారు.

యువమత్రయేఽవనీతాయ
తప్తమూర్జమోమానమశ్వినావధత్తమ్।
(ఋగ్వేదం, ప్రథమమండలం, 118 వ సూక్తం, 7వ ఋక్కు)

ఆ తరువాత సమస్తరాక్షసజాతిని అంతమొందించడానికి పరాశరమహర్షిని నాయకునిగా చేసుకుని ఇతరమునులు చేసిన మహాప్రయత్నాలను వద్దని అత్రి మహర్షి వారిని వారించాడు.  అంతటి కరుణాసముద్రుడు అతడు.  కౌరవపాండవుల నడుమ యుద్ధం జరగకుండా కూడా ఉండాలని ప్రయత్నించిన శాంతిప్రియుడు అత్రి.

చిత్రకూటం విడిచి దండకారణ్యానికి పోతున్నపుడు తనను సందర్శించుకున్న రామునితో అత్రి, సేయం మాతేవ తేఽనఘ (రామాయణం.2.117.11) ఇదిగో నాయనా, ఈమె నీ తల్లివంటిదే అని అనసూయమ్మను పరిచయం చేశాడు.  నిజానికి కూడా దత్తాత్రేయరూపంలో రాముడు అనసూయాపుత్రుడే కదా.  ఆ అనసూయమ్మ సీతామహాసాధ్వికి కూడా సుద్దులు చెప్పిన దొడ్డ ఇల్లాలు. 

సీతారామలక్ష్మణులు ఇక వెళ్లివస్తామని పలికినపుడు అత్రి చెప్పిన హెచ్చరిక నిత్యస్మరణీయం.

రక్షాంసి పురుషాదాని
నానారూపాణి రాఘవ।
వసన్త్యస్మిన్ మహారణ్యే
వ్యాళాశ్చ రుధిరాశనాః।।
ఉచ్చిష్టం వా ప్రమత్తం వా
తాపసం ధర్మచారిణమ్।
అదన్యస్మిన్ మహారణ్యే
తాన్ నివారయ రాఘవ।।
(రామాయణం 2.119.18-19)

“నాయనా రాఘవా! ఈ మహారణ్యంలో క్రూరమృగాలతో పాటు రక్తపిపాసులూ నరమాంసభక్షకులూ అయిన రాక్షసులు వివిధరూపాలలో సంచరిస్తూ ఉంటారు.  తాపసులు భోజనం చేసిన తరువాత గాని, అజాగ్రత్తగా ఉండే సమయాలలో గాని హఠాత్తుగా వారిమీద దాడి చేసి చంపి తినేస్తూ ఉంటారు.  ఈ ఘోరాలన్నిటినీ నివారించు నాయనా!”

#పాల్ఘర్
#Palghar

Friday, 24 April 2020

సనక-సనందన-సనత్కుమార-సనత్సుజాతులు






సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు - వీరు బ్రహ్మ మానసపుత్రులు. వీరు సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు. వీరి మనసులు చాల పరిశుద్ధమైనవి. వారు ఆకారంలో ఎన్నటికీ ఐదు సంవత్సరాల పిల్లల వలె ఉంటారు. వారికి భౌతికసంపదల పట్ల, సుఖాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు.

వివాహం చేసుకొని సృష్టిని ప్రారంభించండి అని బ్రహ్మ వారిని ఆదేశించినప్పటికీ, వారు అందుకు నిరాకరించి, తపస్సు చేసేందుకు సంకల్పించుకున్నారు. ప్రవృత్తిమార్గాన్ని కాక నివృత్తిమార్గాన్ని అవలంబించారు.

వారి ఉచ్ఛ్వాసనిఃశ్వాసలలో పూర్తిగా భగవన్నామం నిండిపోయింది. వారు మనసా వాచా కర్మణా హరిశరణాగతులు అయినారు. మృత్యువు వారిని సమీపించ లేకపోయింది. భగవన్నామస్మరణ చేస్తూ వారు విశ్వమంతటా స్వేచ్ఛగా సంచరించేవారు.

వారు ఒకసారి వైకుంఠానికి వెళ్లినపుడు అక్కడి ద్వారపాలకులైన జయవిజయులు వారిని పిల్లవారుగా భావించి వారి ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఎన్నడూ కోపించి ఎరుగని వారికి ఆనాడు చాల కోపం వచ్చింది.  వారిని పునర్జన్మ ఎత్తమని శపించివేశారు.

వెంటనే విష్ణువు ప్రత్యక్షమై, వారిని శాంతింపజేశాడు. తాము నిగ్రహం తప్పినందుకు వారు ఎంతో సిగ్గుపడ్డారు. పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విష్ణువు వారిని ఓదార్చి వారు కోపించడం కూడా తన సంకల్పం ప్రకారమే జరిగిందన్నాడు.

శాపం పొందిన జయవిజయులు తమ మొదటి పునర్జన్మలో హిరణ్యాక్షహిరణ్యకశిపులు గాను, రెండవ పునర్జన్మలో రావణకుంభకర్ణులు గాను మూడవ పునర్జన్మలో శిశుపాలదంతవక్త్రులు గాను జన్మించారు. విష్ణువు కూడా వరాహనరసింహులు గాను, రాముడి గాను కృష్ణుడి గాను అవతారమెత్తి వారిని మరల తన చెంతకు చేర్చుకున్నాడు.

ఒకసారి ఈ కుమారులు పృథుచక్రవర్తి చెంతకు వెళ్లారు. ఆయన వీరిని ఎంతగానో సత్కరించి, "మహాత్ములారా! మానవాళికి అత్యంత శ్రేయస్కరం అయినది ఏమిటి?" అని ప్రశ్నించాడు.

దానికి సనత్కుమారుడు సమాధానం చెప్పాడు.

1 ఆత్మానందం. అంటే దేవుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండటం.

2 ప్రపంచంలో దేని పట్లనైనా ఆసక్తిని కలిగి ఉండకపోవటం.  అహంకారమే అజ్ఞానానికి, అన్ని కష్టాలకు మూలం.  అహంకారం ఉపశమించినపుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. సుఖదుఃఖాలతో కూడి ఉన్న సర్వప్రపంచమూ ఒక కల వలె అదృశ్యమైపోతుంది. అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది.  ఆ ఆత్మయే పరమానందస్వరూపమైన పరబ్రహ్మం.

అప్పటి నుంచి ఆ ఉపదేశచింతనమే భారతీయ ఆధ్యాత్మికప్రపంచానికి మూలస్రోతస్సై నిలిచింది.

ఒకసారి విదురుని ఆహ్వానం మేరకు వచ్చిన సనత్సుజాతుని మృత్యురహస్యం ఏమిటని ధృతరాష్ట్రుడు అడిగాడు.

"ప్రమాదమే మృత్యువు" అని సనత్సుజాతుడు జవాబు చెప్పాడు. ప్రమాదము అంటే పొరబాటు. ఒక వస్తువును వేరొక వస్తువు గా భ్రమించడమే ఆ పొరపాటు.  శంకరాచార్యులవారు ఆ బోధనను ఎంతో విలువైనదిగా పరిగణించారు. సనత్సుజాతీయసంవాదము అనే పేరిట ఉన్న వారి సంభాషణకు వారు అమూల్యమైన వ్యాఖ్యానాన్ని వ్రాశారు.

నారదమహర్షికి సమస్తజ్ఞానము కరతలామలకంగా ఉండేది. అయినప్పటికీ ఆయనకు మనశ్శాంతి కరువయ్యింది. అప్పుడు ఆయన కుమారుల చెంతకు వెళ్లారు. పరమానందాన్ని పొందే రహస్యాన్ని వారినుండి తెలుసుకొనగోరాడు.

ఆత్మజ్ఞానం తప్ప మిగిలిన జ్ఞానమంతా పరిమితమైనదని, అల్పమైనదని వారు అతనికి బోధించారు. నారదునికి వారు బోధించిన విద్యను భూమవిద్య అంటారు. అది అద్వైత వేదాంతంలో చాలా గొప్ప విద్య.  ఛాందోగ్యోపనిషత్తులో ఆ ప్రస్తావన కనిపిస్తుంది.

"యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి".

"అనంతంలోనే ఆనందం ఉన్నది. అంతమయ్యేదానిలో ఆనందం లేదు."

ఈ కుమారులు అప్పుడప్పుడు భూమిపై సంచరిస్తూ కొందరు ఉత్తములను నివృత్తిమార్గమైన సన్న్యాసానికి మళ్లిస్తూ ఉంటారని ఒక విశ్వాసం.

Monday, 23 July 2018

ఒట్టు!

అందుకే #చందమామ కథలు చదవమని చెప్పేది!

అనగనగా ఓ రాజు. తగూపడేవారందరికీ తీర్పు చెప్పేకి ఆయనకి సమయం సరిపోవట్లేదు. "ఎలారా బగువంతుడా" అనుకుంటాంటే ఒక మహర్షి వచ్చి ఒక పెద్ద గండ కత్తెర ఇచ్చినాడు.

"ఏమిటికిది మహర్షీ?" అంటే
"తగూపడేవాళ్లని కత్తెర మద్దెలో సేతులు పెట్టి పెమాణం సెయ్యమనండి, ఎవడు అబద్దమాడితే వాడి సెయ్యిని ఇది కత్తిరించేస్తాది" అన్న్యాడు.

దాని సంగతి జనాలకి తెలిసి అసెత్త పెమాణాలు సేసేకి బయపడినారు. అట్లా అదొచ్చినంక తగూలన్నీ ఆగిపొయినై. రాజు హాయిగా కంటినిండా నిద్రపోతుణ్ణ్యాడు.

అయినా ఒగు దినుము ఒగు తగువొచ్చ. 

"నేనీయప్పకి అప్పు ఇచ్చినా. తిరిగీమంటే ఇచ్చేసినా గదా అంటాడీయప్ప" అని మొదుటి పార్టీ అంటాడు.

"అవును, ఆయప్పకీయాల్సింది ఆయప్పకిచ్చేసినా" అంటాడు రెండో పార్టీ.

"ఇంగ లాబం లేదు కత్తిరి నడుమన సెయ్యి పెట్టి పెమాణం సెయ్యండిద్దరూ" అని రాజు ఆదేశమిచ్చినాడు.

ఒగుటోవాడు పెమాణం చేశ. సెయ్యి తెగక పాయ. 

ఇంకేమి, 
"ఉరే ‌రెండో పార్టీ! నువు చెప్పింది అబద్దము గదా? ఆయప్ప నుంచి తీసుకున్న అప్పు ఆయప్పకిస్తావా లేదా?" అని రాజు బెదిరిచ్చ.

"నేనిచ్చేసినా రాజా" అని రెండోపార్టీ మొత్తుకొన్న్యాడు.

"అట్లైతే నువు గూడా పెమాణం సేస్తావా మడి?"

"సేస్తా రాజా!"

"ఉరే రెండో పార్టీ! అన్నాయెంగా నీ సేతులు నరికిచ్చుకుంటావురా!" అనె రాజు జాలిపడి.

"నేనబద్దమాడితే గద రాజా నా సేతులు పొయ్యేది!" అనుకుంటా రెండోపార్టీ లేశ.

"రోంత ఈ కట్టి పట్టుకోప్పా" అని తన సేతికట్టిని మొదటి పార్టీకిచ్చి, కత్తిరి మద్దెలో సేతులు బెట్టి పెమాణం జేశ. "నేను ఈ మొదటిపార్టీకి బాకీ తీర్చేసినాను" అంజెప్ప్య. 

అయినా గాని కత్తిరి ఊరికే ఉండ్య. ఆయప్ప సేతులు కత్తిరీకప్యా. అందురూ ఆచ్చెర్యపాయిరి. 

"రెండు పార్టీలలో ఏదోక పార్టీ అబద్దమాడినట్లే గదా? మడి ఆ కత్తిరి మహిమ కలిగుంటే ఎవరో ఒకరి సేతుల్ని కత్తిరీయల్ల గదా? అట్లా గాలేదంటే ఈ 
కత్తిరిలో మహిమ లేకున్నెట్లే గదా?" అని రాజుకి మంత్రికి జనాలకీ అందరికీ అనుమానమొచ్చ. "మహర్షీ లేదు, మహిమా లేదు తీ, అంతా సుళ్లు" అనబట్రి.

ఈ సంగతి మహర్షికి తెలిశి దడాన వొచ్చిడిశ. రెండు పార్టీలని మళ్లీ పెమాణం చెయ్యమనె. వాళ్లు మళ్లీ అట్లే సేసిరి. అప్పుడా మహర్షి రెండో పార్టీ ఆయప్ప మొదటి పార్టీకిచ్చిన సేతికట్టి తీసుకుని ఇరగ్గొట్టమన్య. రాజబటులు యిరగ్గొట్రి. 

ఆ సేతికట్టి నడమన డొల్ల ఉండ్య. దాంట్లోంచి రెండోపార్టీ మొదటిపార్టీకీయాల్సిన బాకీ దుడ్లు కింద పడ్య. రాజూ మంత్రీ జనాలూ ఆచ్చెర్యపోయిరి. రెండోపార్టీ సిగ్గుతో తలకాయ వొంచుకొనె. 

"ఏమపా ఇప్పుడు మళ్లీ చేస్తావా పెమాణం?" అని అడిగినాడు మహర్షి రెండో పార్టీని. వాడు బయపడి మహర్షి కాళ్లమింద పడె.

మహర్షి సరేలెమ్మని "రాజా నా కత్తిరి నాకిస్తే నే కొండబోతా"ననె. 

"ఏమిటికి మహర్షీ అది మహిమ కలిగిందే కదా" అనె రాజు.

"దానికి మహిమ ఉణ్ణ్యాగాని ఏమి లాబం? మీ మనసుల్లో దానిమింద రోంతన్నా యిశ్వాసం లేకపాయ. ఇంక మీదగ్గర అది వుండేది పూరా దండగ" అంజెప్పి మహర్షి ఆ కత్తిరిని అట్లే కొండబాయ.

***
అదీ కథ!
***

కలియుగంలో కూడా రెండోపార్టీ లాంటి మనుషులు పుడతారు. అక్రమంగా తరతరాలకు సరిపడేంత సంపాదిస్తారు. కాని, రూపాయి కూడా మేము అక్రమంగా సంపాదించలేదు అని నిర్భయంగా దీపాలాపి "పెమాణాలు" సేస్తారు. వాళ్లకేమీ కాదా అని అమాయికులు ఆశ్చర్యపోరాదు.

వాళ్లు సంపాదిచ్చుకున్న భూములు బంగ్లాలు కానుకలు రకరకాల ప్రతిఫలాలు టెక్నికల్‌గా రూపాయి కాదు. మణుగుల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా కూడా అంతే. ఒకవేళ భవిష్యత్తులో కోర్టులో న్యాయమూర్తులు వీటిని కూడా రూపాయలక్రిందే లెక్కేయాలి అని తీర్పు ఇచ్చినా అది అసత్యప్రమాణం కాబోదు. ఎందుకంటే అవన్నీ వారి బినామీల పేరిట ఉంటాయి గాని పెమాణం చేసినవారి పేరిట ఉండవు కాబట్టి.

ఈ నిజాలు నిరూపించడానికి ఇప్పుడు మహర్షులు లేరు. రెండోపార్టీ మనుషులకు అండగా మీడియా అధిపతులు మాత్రం ఉంటారు.

హంసోదకం

స్థలం - తిరుపతి, తత్పరిసరాలు.   ఇద్దరు మిత్రులు సంభాషించుకుంటూ ఉన్నారు.   ఒకడు -  అయ్యో, దుర్దినాలు సంప్రాప్తించాయి గదరా.   రెండవవాడు -   ...