Friday 24 April 2020

సనక-సనందన-సనత్కుమార-సనత్సుజాతులు






సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు - వీరు బ్రహ్మ మానసపుత్రులు. వీరు సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు. వీరి మనసులు చాల పరిశుద్ధమైనవి. వారు ఆకారంలో ఎన్నటికీ ఐదు సంవత్సరాల పిల్లల వలె ఉంటారు. వారికి భౌతికసంపదల పట్ల, సుఖాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు.

వివాహం చేసుకొని సృష్టిని ప్రారంభించండి అని బ్రహ్మ వారిని ఆదేశించినప్పటికీ, వారు అందుకు నిరాకరించి, తపస్సు చేసేందుకు సంకల్పించుకున్నారు. ప్రవృత్తిమార్గాన్ని కాక నివృత్తిమార్గాన్ని అవలంబించారు.

వారి ఉచ్ఛ్వాసనిఃశ్వాసలలో పూర్తిగా భగవన్నామం నిండిపోయింది. వారు మనసా వాచా కర్మణా హరిశరణాగతులు అయినారు. మృత్యువు వారిని సమీపించ లేకపోయింది. భగవన్నామస్మరణ చేస్తూ వారు విశ్వమంతటా స్వేచ్ఛగా సంచరించేవారు.

వారు ఒకసారి వైకుంఠానికి వెళ్లినపుడు అక్కడి ద్వారపాలకులైన జయవిజయులు వారిని పిల్లవారుగా భావించి వారి ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఎన్నడూ కోపించి ఎరుగని వారికి ఆనాడు చాల కోపం వచ్చింది.  వారిని పునర్జన్మ ఎత్తమని శపించివేశారు.

వెంటనే విష్ణువు ప్రత్యక్షమై, వారిని శాంతింపజేశాడు. తాము నిగ్రహం తప్పినందుకు వారు ఎంతో సిగ్గుపడ్డారు. పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విష్ణువు వారిని ఓదార్చి వారు కోపించడం కూడా తన సంకల్పం ప్రకారమే జరిగిందన్నాడు.

శాపం పొందిన జయవిజయులు తమ మొదటి పునర్జన్మలో హిరణ్యాక్షహిరణ్యకశిపులు గాను, రెండవ పునర్జన్మలో రావణకుంభకర్ణులు గాను మూడవ పునర్జన్మలో శిశుపాలదంతవక్త్రులు గాను జన్మించారు. విష్ణువు కూడా వరాహనరసింహులు గాను, రాముడి గాను కృష్ణుడి గాను అవతారమెత్తి వారిని మరల తన చెంతకు చేర్చుకున్నాడు.

ఒకసారి ఈ కుమారులు పృథుచక్రవర్తి చెంతకు వెళ్లారు. ఆయన వీరిని ఎంతగానో సత్కరించి, "మహాత్ములారా! మానవాళికి అత్యంత శ్రేయస్కరం అయినది ఏమిటి?" అని ప్రశ్నించాడు.

దానికి సనత్కుమారుడు సమాధానం చెప్పాడు.

1 ఆత్మానందం. అంటే దేవుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండటం.

2 ప్రపంచంలో దేని పట్లనైనా ఆసక్తిని కలిగి ఉండకపోవటం.  అహంకారమే అజ్ఞానానికి, అన్ని కష్టాలకు మూలం.  అహంకారం ఉపశమించినపుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. సుఖదుఃఖాలతో కూడి ఉన్న సర్వప్రపంచమూ ఒక కల వలె అదృశ్యమైపోతుంది. అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది.  ఆ ఆత్మయే పరమానందస్వరూపమైన పరబ్రహ్మం.

అప్పటి నుంచి ఆ ఉపదేశచింతనమే భారతీయ ఆధ్యాత్మికప్రపంచానికి మూలస్రోతస్సై నిలిచింది.

ఒకసారి విదురుని ఆహ్వానం మేరకు వచ్చిన సనత్సుజాతుని మృత్యురహస్యం ఏమిటని ధృతరాష్ట్రుడు అడిగాడు.

"ప్రమాదమే మృత్యువు" అని సనత్సుజాతుడు జవాబు చెప్పాడు. ప్రమాదము అంటే పొరబాటు. ఒక వస్తువును వేరొక వస్తువు గా భ్రమించడమే ఆ పొరపాటు.  శంకరాచార్యులవారు ఆ బోధనను ఎంతో విలువైనదిగా పరిగణించారు. సనత్సుజాతీయసంవాదము అనే పేరిట ఉన్న వారి సంభాషణకు వారు అమూల్యమైన వ్యాఖ్యానాన్ని వ్రాశారు.

నారదమహర్షికి సమస్తజ్ఞానము కరతలామలకంగా ఉండేది. అయినప్పటికీ ఆయనకు మనశ్శాంతి కరువయ్యింది. అప్పుడు ఆయన కుమారుల చెంతకు వెళ్లారు. పరమానందాన్ని పొందే రహస్యాన్ని వారినుండి తెలుసుకొనగోరాడు.

ఆత్మజ్ఞానం తప్ప మిగిలిన జ్ఞానమంతా పరిమితమైనదని, అల్పమైనదని వారు అతనికి బోధించారు. నారదునికి వారు బోధించిన విద్యను భూమవిద్య అంటారు. అది అద్వైత వేదాంతంలో చాలా గొప్ప విద్య.  ఛాందోగ్యోపనిషత్తులో ఆ ప్రస్తావన కనిపిస్తుంది.

"యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి".

"అనంతంలోనే ఆనందం ఉన్నది. అంతమయ్యేదానిలో ఆనందం లేదు."

ఈ కుమారులు అప్పుడప్పుడు భూమిపై సంచరిస్తూ కొందరు ఉత్తములను నివృత్తిమార్గమైన సన్న్యాసానికి మళ్లిస్తూ ఉంటారని ఒక విశ్వాసం.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...