Thursday 2 April 2020

ఒక శిష్యుని కథ – ఒక భక్తుని వ్యథ




′′గురువు గారూ, దేవుడు ఎక్కడ ఉన్నాడు?′′
గురుకులంలో చేరిన మొదటి రోజునే ఇటువంటి ప్రశ్నను వేసిన శిష్యుని చూసి ముచ్చట పడ్డారు గురువు గారు. ′′నాయనా! దేవుడు అంతటా ఉన్నాడు′′ అని సమాధానం చెప్పాడు.
′′గురువు గారూ, అంతటా అంటే ఎక్కడ?′′ అని మరుసటి రోజు ప్రశ్న.
′′అంతటా అంటే ఈ సమస్తచరాచరజగత్తులోనూ ఆయనే నిండి ఉన్నాడు.′′
′′గురువు గారూ, చరాచర అంటే?” అని మరుసటి రోజు ప్రశ్న.
“చరము అంటే కదిలేది. అచరము అంటే కదలనిది.”
“చీమ నుండి ఏనుగు దాకా అన్నీ కదులుతున్నాయి కదా గురువు గారూ, అది దేవుడేనా?” మరుసటి రోజు ప్రశ్న.
“అవును నాయనా!”
“ఈ కర్ర ముక్క కదలటం లేదు. ఆ రాతి బొమ్మ కూడా కదలటం లేదు కదా గురువు గారూ, అది దేవుడేనా?′′ మరుసటి రోజు ప్రశ్న.
′′అవును నాయనా! ′′
′′దేవుడు ఎలాంటి వాడు గురువు గారూ?′′ మరుసటి రోజు ప్రశ్న.
′′మన తల్లిదండ్రులలాంటి వాడు, మనలను రక్షించే రాజులాంటి వాడు నాయనా!′′
ఆ మరుసటి రోజు ఆ శిష్యుడు ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు.
పూజ ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా, దేవాలయపు ఏనుగు వశం తప్పింది. దారిలో నున్న ప్రతి అంగడినీ, వస్తువునూ అటూ ఇటూ విసిరివేస్తూ పరుగులెత్తడం మొదలుపెట్టింది. జనాలందరూ భయపడిపోయి దూరంగా పరుగెత్తి తప్పించుకుంటున్నారు. ఏనుగు మీద కూర్చున్న మావటివాడు చేతిలోని అంకుశంతో దానిని అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
ఇది చూసేసరికి శిష్యునికి కోపం వచ్చింది.
′′ఓయ్, మావటీ, ఆ ఏనుగును హింసించడం ఆపు. ఆ ఏనుగులో దేవుడు ఉన్నాడు′′ అంటూ దారికి అడ్డంగా నిలుచుని ఉపదేశం చేయసాగాడు.
అడ్డంగా నిలుచున్న శిష్యుని చూసేసరికి మావటివానికి తిక్క పట్టింది. ′′ఏమయ్యోవ్, తప్పుకో, పక్కకు తప్పుకో, నీకేమైనా పిచ్చా?′′ అని అరిచాడు.
′′ఏనుగులో దేవుడు ఉన్నాడు. దిగిపో. దాన్ని హింసించకు, క్షమాపణలు వేడుకో. నా మాట విను′′ అంటున్నాడు ఈ శిష్యుడు పక్కకు తప్పుకోకుండా.
′′అయ్యోవ్ సామీ, ముందు పక్కకు తప్పుకోవయ్యా. ఏనుగు అదుపులోనికి వచ్చాక అట్లే క్షమాపణలు వేడుకుంటాడులే′′ అని జనాలు కంగారు కంగారుగా అరుస్తూ చెబుతూనే ఉన్నారు.
శిష్యుడు విననే లేదు. తప్పుకోనే లేదు. దిగు, దిగు అంటూనే ఉన్నాడు.
ఏనుగు దూసుకొచ్చేసింది.
మరుసటి రోజు ఒంటినిండా వైద్యుడు కట్టిన కట్లతో ఆ శిష్యుడు ఏడ్చుకుంటూ గురువు గారి దగ్గరకు వచ్చాడు.
′′గురువు గారూ, మీరు చెప్పినదంతా అబద్ధం′′ అన్నాడు వచ్చీ రాగానే.
′′అయ్యో, ఒంటినిండా ఆ కట్లేమిటి? ఏమైంది నాయనా?′′
′′గురువు గారూ, మీరు సకలచరాచరజీవులన్నిటిలోనూ దేవుడు ఉన్నారని చెప్పారు. ′′
′′అవును. ′′
′′అది అబద్ధం. ′′
′′ఏమైంది నాయనా? ′′
′′ఏనుగు తొండంతో పట్టి విసిరేసింది′′ అంటూ శిష్యుడు జరిగిన కథ మొత్తం వివరించి చెప్పాడు. ′′ఇప్పుడు చెప్పండి గురువు గారూ, దేవుడు అనేవాడు లేడు. కనీసం ఆ ఒక్క ఏనుగులో లేడు′′ అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ.
గురువు గారికి జాలి వేసింది. ′′అయ్యో, తిక్కయ్యా, నీవు ఒక కారులో స్టీరింగు ఇది, బ్రేకు ఇది, ఆక్సిలరేటర్ ఇది, గేర్లు ఇవి అని పూర్తిగా కారు స్వరూపం తెలుసుకోకుండా, కారును సరిగా నడపలేవు. కారును సరిగా నడపడం నేర్చుకోకుండా, అసలు నీకు కారు నడపడం వచ్చునో రాదో పరీక్షించి లైసెన్సు ఇచ్చే అధికారులు కొందరు ఉంటారనే జ్ఞానం కూడా లేకుండా, నేరుగా హైవే మీదనే నడపడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరగదా? ఇప్పుడు నువు చేసిన పని కూడా అలాగే ఉంది. దేవుడు సకలచరాచరజగత్తులోనూ ఉన్నాడు అని చెప్పించుకుని, చరాచరాలు అంటే ఏమిటి అని అడిగావు కాని, సకల జగత్తు అనే రెండు పదార్థాలకు దాని అర్ధం మాత్రం నాకు తెలుసులే అనుకున్నావు. మిడిమిడిజ్ఞానంతో సాహసాలు చేశావు. అందుకే ఇలా జరిగింది.′′
′′పోనీ నేను అడగలేదు, కనీసం మీరైనా చెప్పవచ్చు గదా గురువు గారూ?′′
′′కారు లైసెన్స్ ఇవ్వడానికి కూడా కొన్ని రోజులు పడుతుంది. నువు వచ్చి వారం రోజులు కాకముందే నీకు సమస్తవేదాంతజ్ఞానం సమకూర్చాలంటే ఎలా నాయనా?′′
′′అసలు ఏమైంది? నేనేం తప్పు చేశాను గురువు గారూ?
చీమనుండి ఏనుగు వరకూ అన్నిటిలోనూ దేవుడు ఉన్నాడని మీరే చెప్పారు కదా?′′
′′అవును! చెప్పాను నాయనా! మరి ఆ చీమనుండి-ఏనుగువరకు అనే జాబితాలో నువు మావటి వాడిని ఎందుకు కలుపుకోలేదు? ఆ మిగిలిన జనాలను ఎందుకు కలుపుకోలేదు? మావటివాడిలో కూడా ఉన్న దేవుడు నిన్ను తప్పుకోమని హెచ్చరించాడా లేదా? జనాలందరిలోనూ కూడా ఉన్న దేవుడు నిన్ను తప్పుకోమని పదే పదే హెచ్చరించాడా లేదా? మరి నువ్వు ఆ దేవుని హెచ్చరికలను ఎందుకు ఖాతరు చేయలేదు?′′
శిష్యుడికి కళ్లు తెరుచుకున్నాయి. ′′నిజమే గురువు గారూ!′′
′′కర్ర ముక్కనుంచి రాతి బొమ్మవరకూ అన్నిటిలోనూ దేవుడు ఉన్నాడంటివి. మరి మావటి చేతిలోని అంకుశంలో లేడని ఎందుకు అనుకున్నావు?′′
′′నిజమే గురువు గారూ!′′ అన్నాడు శిష్యుడు బిక్కమొహం వేసి.
′′కాబట్టి నాయనా, సకలచరాచరజగత్తును నువు అర్థం చేసుకుంటే దేవుని కూడా నువు తప్పక అర్థం చేసుకోగలవు. అంతవరకూ మరీ ఇంతటి సాహసాలు చేయకురా′′ అన్నారు గురువు గారు శిష్యుని తలను నిమురుతూ.
′′అలాగే గురువు గారూ′′ అన్నాడు విధేయుడైన ఆ శిష్యుడు.
ఇది పాత కథ. ఒక శిష్యుని కథ.

}}}{{{



ఇప్పుడు ఇదో కొత్త కథ - భక్తుని వ్యథ

గజేంద్రమోక్షం కథ విన్న ఒక భక్తుడు కరోనా అంటే మొసలి, గజేంద్రుడంటే నేనే అని లాక్ డౌన్ రోజులలో కూడా విచ్చలవిడిగా తిరిగాడు.
ఫలితంగా అతడికి భూలోకంతో ఋణం తీరిపోయి పైలోకానికి పోయాడు. అక్కడ దేవుడు కనిపించాడు.
′′స్వామీ, మీరు వచ్చి నన్ను రక్షిస్తారనుకున్నాను. ఎందుకు రాలేదు?′′ అని అడిగాడు.
నారాయణుడు చిరునవ్వు నవ్వి,
′′భక్తా! నువు గజేంద్రమోక్షం చదివావు, కుయ్యాలించి సంరంభియై, గజప్రాణావనోత్సాహియై అనే పద్యాలు నీకు బాగా నచ్చాయి.
కాని నీవు కుయ్యి ఎప్పుడు చేశావు నేను ఆలించడానికి? ఆ గజం మొసలి నోట్లో లాక్ డౌన్ అయింది కాబట్టి నేను రక్షించాను. కాని, నువు స్వచ్ఛంద లాక్ డౌన్ ఎప్పుడు పాటించావు నిన్ను రక్షించడానికి?
నువు భక్తప్రహ్లాద కథ కూడా చదివావు కదా? ఇందు గలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు అనే పద్యభావాన్ని నీవు ఎందుకు స్మరించి ఆచరించలేకపోయావు?′′
′′అసలు నేను నిన్ను రక్షించడం కోసం ఎన్ని చిన్న చిన్న అవతారాలెత్తి ఎన్నెన్ని పాట్లు పడ్డాననుకున్నావ్?
ప్రధానమంత్రి రూపంలో మొదట జనతా కర్ఫ్యూ పెట్టించాను. తరువాత లాక్ డౌన్ ప్రకటించాను. కోట్లాది రూపాయల ధనాన్ని నీవంటి వారి రక్షణకోసమే కేటాయించాను.
ముఖ్యమంత్రుల రూపంలో సాధ్యమైన ప్రతి రక్షణచర్యను చేపట్టాను.
నువు బయటకు పోయే అవసరం లేకుండా వలంటీర్ల రూపంలో నీ చెంతకు నిత్యావసరవస్తువులు చేరవేశాను.
పారిశుద్ధ్యకార్మికుల రూపంలో నీవు నివసించే పరిసరాలన్నిటినీ శుభ్రం చేశాను.
నువు ప్రమాదకూపంలో పడకుండా పోలీసుల రూపంలో కాపలా ఉన్నాను.
వైద్యులరూపంలో నీకు స్వయంగా సేవ చేశాను.
ఇన్ని చేసినా సరే, నువు మాత్రం విచ్చలవిడిగా తిరిగి కోరి మరణం తెచ్చుకున్నావు′′ అని ఆ భక్తుడు చేసిన తప్పులను వివరించి చెప్పాడు.
ఇంతలో అక్కడకు యమభటులు వచ్చారు. నారాయణునికి నమస్కరించి, ′′స్వామీ, ఇతడు మీ భక్తుడు కాబట్టి, చివరిసారిగా మీ దర్శనం ఇప్పించి నరకానికి తీసుకురమ్మని యమధర్మరాజు ఆదేశం. మీరు అనుమతి ఇస్తే ఇతడిని తీసుకుపోతాం′′ అన్నారు.
భక్తుడు లబలబలాడాడు. ′′వద్దని చెప్పండి స్వామీ, వద్దని చెప్పండి స్వామీ.′′
నారాయణుడు చిరునవ్వు నవ్వి,
′′భయపడకు భక్తా! నరకమంటే మరేదో కాదు. నువు చేసిన పాపాలకు క్వారంటైన్ సెంటర్. అక్కడ నుంచి నువు హెల్త్ సర్టిఫికేట్ తెచ్చుకోకుండా నీకు వచ్చే జన్మలో సకలశ్రేయస్సులను ప్రసాదించడం నాకు సాధ్యం కాదు. అక్కడ యమధర్మరాజు రూపంలో ఉన్నది కూడా నేనే. దైర్యంగా వెళ్లిరా′′ అని చెప్పాడు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...