Friday 3 April 2020

నీతో విభేదిస్తున్నాను తిరుమలా




నీతో విభేదిస్తున్నాను తిరుమలా.

కొవ్వొత్తులు వెలిగించమని మోదీ చెబితే తప్పేముందో నాకు అర్థం కాలేదు.

దేశంలోని ప్రజలందరూ సుదీర్ఘమైన లాక్ డౌన్ ఆవశ్యకతను అర్థం చేసుకున్న మాట నిజమే. కాని, అది ఆలస్యంగా ప్రకటించారని కొందరు, అది తమ మతానికి విరుద్ధమంటూ కొందరు రకరకాల అభిప్రాయాలను నిరసన వ్యక్తం చేశారు. ట్రోల్ చేశారు. నిరసనలు చేశారు. తిట్టారు.

అవును. మూర్ఖభక్తులు ఉన్నారు. చప్పట్లు కొట్టమంటే అత్యుత్సాహంతో రోడ్డెక్కి గందరగోళం సృష్టించారు. ఫలితంగా తిట్లు తిన్నారు. ఏం చేస్తాం? అనాదిగా ఇటువంటి కణ్ణప్పలు మన సమాజంలో సహజంగానే ఒక భాగం. మనం వారి మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఆయన కొవ్వొత్తులు వెలిగించమన్నారు. మునుపు తిట్లు తిన్న అనుభవంతో ఇప్పుడు ఎలా చేస్తారో చూడవలసి ఉంది.

మరి కొందరు మేధావులు ఊహించినట్లు మోదీ కొవ్వొత్తులు వెలిగించమంటే ఆయన కరోనాపై పోరాటంలో అలసిపోయి ఇక నాకు చేతకాదని చేతులెత్తేసి రాజీనామా చేస్తున్నట్లు కానే కాదు.

క్రింద ఒక ఫోటో ఇస్తున్నాను చూడు. ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ ప్రజలకు కరోనా సోకిన కేసులు సరాసరి 146 ఉన్నాయి. కాని, 138 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యంత జనసమ్మర్దం కలిగిన మన దేశంలో 1 మిలియన్ ప్రజలలో సరాసరి కేసుల సంఖ్య కేవలం 1.82 గా ఉన్నదంటే అది ఎంతటి గొప్ప Crisis/Disaster Management ఊహించు. అదే ఫోటోలో మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలలో కేసుల సరాసరిని గమనించు. దేశమంతటా ఆపత్కాలంలో తనకు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయంతో మోదీ చేస్తున్న పోరాటంలోని సమర్థత అర్థమౌతుంది. చూశారా నా ఘనత అని మోదీ చెప్పుకోలేదు. దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు.

మన ప్రజలకు సహనం చాల ఎక్కువ. కాని, ఆలోచన తక్కువ. ఇంతటి కష్టకాలంలో కూడా నిత్యావసరాలకు కొఱత లేదు. కొందరికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనా వెంటనే తగిన చర్యలు తీసుకొనడం జరిగింది. కాని, పనిగట్టుకుని వ్యాధిని వ్యాపింపజేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలియడంతో ఏదో తెలియని ఆందోళనలో భయగ్రస్తులై ఉన్నారు. ఆ శక్తులను నిందిస్తే ప్రపంచప్రళయం వచ్చి సర్వనాశనం జరుగుతుంది కాబట్టి, ఎవరిని తిడితే బాగుంటుందని ప్రత్యామ్నాయం కోసం గాఢంగా ఎదురు చూస్తున్నారు. మోదీ దొరికాడు.

రామభక్తులు భారతీయులు కాజాలరు అని వివాదం రాజేయడానికి ఒక ఒవైసీ ప్రయత్నించాడు. కానీ జనాలు అతనిని చూసీ చూడనట్లు వదిలేశారు. మోదీ కొవ్వొత్తులు వెలిగించమన్నా మీద పడి తిడుతున్నారు. కొవ్వొత్తులే కదా వెలిగించమన్నది? కాని ఆయనేదో కత్తులు తీసుకుని ఎవరినో నరకమన్నంత ఘోరమైన ప్రసంగం చేసినట్లుగా భావించి ఎందుకు ఆయన మీద విరుచుకుపడుతున్నారు? ఎవడికి వాడు మహాకథకుడైై రకరకాల పిచ్చి ఊహలను సృష్టించి, అదే మోదీ ఉద్దేశమని ఆయనకు అంటగడుతున్నారు.

భారతీయత పట్ల మనసు నిండా ద్వేషం ఉంటే దాని గొప్పతనం పట్ల అసూయ ఉంటే ఎవరు ఏమన్నా దానిని ద్వేషించడం వెక్కిరించడం మనకు అలవాటైంది.

స్వచ్ఛభారత్ అంటే నవ్వారు. పరిశుభ్రత గొప్పతనం తెలుసుకోలేని లేదా చెప్పలేని మేధావులు దేశానికి ఎందుకు పనికొస్తారు?

యోగం అంటే నవ్వారు. ప్రపంచంలో ఉండే ప్రతివస్తువూ తన ఇంట్లో ఉండవలసిందే అని భావించే ఆశపోతుజనాలకు దాని గొప్పతనం ఎలా అర్థమౌతుంది?

ఇప్పుడు తన ప్రసంగంలో ఆయన ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశమంతా నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ కారణంగా ఒక వర్గంపట్ల ద్వేషాన్ని పెంటుకుంటూ ఉంటే ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి, ప్రజలలో కాస్త శాంతియుతభావాన్ని పెపొందించడానికి (కనీసం తన మాటను మన్నించేవారిలోనైనా) ఆయన అలా చెప్పినట్లు నాకు అనిపించింది.

భారతదేశానికి ఆర్థికమాంద్యం వస్తుందనే నీ ఆందోళన అర్ధం చేసుకొనదగిందే. కాని, ప్రజలంటూ క్షేమంగా ఉంటే ఆ తరువాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.

కొవ్వొత్తులు వెలిగించడం పాపకార్యమని, అది వెనుకబాటుతనానికి నిదర్శనమని, అలా చేస్తే నవ్వులపాలౌతామని ఎవరైనా భావిస్తే వారు నిరభ్యంతరంగా మానేయవచ్చు. పోలీసులు తలుపు తట్టి అరే నువ్వు ఎందుకు వెలిగించలేదురా అని వారిని బెదిరిస్తారు అనుకోను.

ఎవరి ఇంట్లోనైనా కొవ్వొత్తులు లేకుంటే వెలిగించడం మానేయండి. దానికోసం బయటకు వెళ్లి ప్రమాదంలో ఇరుక్కోకండి అని మాత్రం చెబుదాం. 

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...