Monday 27 April 2020

అత్రిఅనసూయామహర్షిదంపతులు




#భారతీయఋషులు 3



అత్రిమహర్షి వృత్తాంతం భౌతికమైనది కాదని, కొంతవరకు సాంకేతికమైనదని తోస్తుంది.  కాని, సీతారామలక్ష్మణులు తమ వనవాసకాలంలో ఆయనను ప్రత్యక్షంగా సందర్శించి సేవించుకున్నట్లు రామాయణం సాక్ష్యమిస్తుంది.

అత్రి కూడా బ్రహ్మమానసపుత్రుడే.  ఈయన ఋఙ్మంత్రద్రష్టగా వేదాలలో ఉదాహరింపబడ్డాడు.  (ఋగ్వేదం, పంచమమండలం)   బృహదారణ్యకోపనిషత్తు అతనిని వాక్కుగా వర్ణిస్తుంది.  వాగేవ అత్రిఃఈ సందర్భంలో వాక్కు అంటే రసనేంద్రియమే (నాలుక) అని కొందరి వ్యాఖ్యానం.     

ఉపనిషత్తులో తరువాత చెప్పిబడిన వాక్యాలు ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపించేలా చేస్తాయి.  వాచాహ్యన్మద్యతే – (వాక్కు చేతనే అన్నం భుజింపబడుతుంది.)  అత్తిర్హ వై నామైతద్ యదత్రిరితి – భుజిస్తుంది (అత్తి) కాబట్టి దీని పేరు అత్రి.  సర్వస్యాత్తా భవతి, సర్వమస్యాన్నం భవతి య ఏవం వేద (ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో అతడు సమస్తాన్నీ భుజింపగలిగినవాడౌతాడు.  సర్వమూ అతడికి అన్నమౌతుంది.) {బృహదారణ్యకం 2.2.4}

దేవహూతీకర్దముల పుత్రిక అయిన అనసూయ ఇతడి భార్య.  ఆ అనసూయ దయాస్వరూపిణి.  ఒకసారి వరుసగా పదిసంవత్సరాలపాటు అనావృష్టి ఏర్పడి తిండి నీరు లేక ప్రపంచమంతా అల్లాడిపోయిందట.  అపుడు అనసూయ తన తపఃప్రభావం చేత ప్రజలకోసం మూలాలను (దుంపలను) ఫలాలను సృష్టించిందట.  నీటిని కూడా సృష్టించిందట.  

యయా మూలఫలే సృష్టే
జాహ్నవీ చ ప్రవర్తితా
(రామాయణం.2.117.9)

అనసూయమ్మకు సాక్షాత్తుగా గంగ ప్రత్యక్షమైందని,  తన తపఃఫలాన్ని పతిసేవాధర్మపుణ్యాన్ని ధారపోసి అనసూయమ్మ గంగమ్మను నిలిపిందని శివపురాణంలో కోటిరుద్రసంహిత తెలుపుతుంది.

(తపస్సు అంటే తపించడం.  ఒక విషయాన్ని గూర్చి తీవ్రమైన శోధన చేయడం కూడా తపస్సే.  అంటే రిసెర్చ్ అన్నమాట.  బహుశః అనసూయమ్మ పరిశోధించి అతి తక్కువ నీటితో పండే మూలఫలాదులను కనిపెట్టింది అనుకోవచ్చు.  అలాగే, నీటివనరులను కాపాడుకొనడం, భూగర్భంలోని నీటిని పైకి తీయడం వంటివి ప్రజలకు నేర్పింది అనుకోవచ్చు.  ఈ విధంగా అనసూయమ్మ అతి ప్రాచీనకాలపు సైంటిస్టు, సంఘసేవికురాలున్నూ.  ఆమెను కేవలం ఒక పతివ్రతగా మాత్రమే గుర్తించడం అన్యాయం.) 

ఆ పుణ్యదంపతుల కోరిక మేరకు శివుడు గంగ నిలిచిన తావున అత్రీశ్వరుడనే పేరిట నిలిచిపోయాడు.

ఈ దంపతులిద్దరూ అతి గొప్ప తపస్సును చేశారు.  త్రిమూర్తులు వారి తపస్సుకు మెచ్చి ఏమి కావాలో కోరుకొమ్మని అడిగారు.  మీరు మాకు పుత్రులై జన్మించాలి అని వారు వరం కోరారు.  వారి కోరిక మేరకు బ్రహ్మ సోమునిగా, విష్ణువు దత్తాత్రేయునిగా, పరమేశ్వరుడు దూర్వాసునిగా వారి కుమారులై జన్మించి వారి ముచ్చటను తీర్చారు. 

ఈ విషయంలో మరొక కథ కూడా ఉన్నది.  ఒకసారి సూర్యచంద్రోదయాలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడిందిట.  దాంతో త్రిమూర్తులు ఈ విషయంలో సహాయం చేయమని అనసూయను అడిగారట.  అపుడు ఆమె పదిరాత్రులను ఒక్క రాత్రిగా మార్చివేసి, సూర్యచంద్రోదయాలు జరిగేందుకు వీలు కలుగజేసింది. 

దశరాత్రం కృతా రాత్రిః (రామాయణం.2.117.11)

(ఈ కథ సాంకేతికంగా జ్యోతిషసంబద్ధమైన కాలగణనం.  జ్యోతిస్సులంటే సూర్యచంద్రగ్రహనక్షత్రాదులు. నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఫిబ్రవరిలో ఒక్క రోజు అధికంగా ఎలా వస్తుందో  మనకు తెలుసు.  అలాగే, చాంద్రమానాన్ని అనుసరించి, అధికమాసాలు, లేదా క్షయమాసాలు వస్తూ ఉంటాయి.  రెండు అమావాస్యల నడుమలో సంక్రాంతి ఎప్పుడైతే రాదో దానిని అధికమాసం అంటారు.  ఆ సంవత్సరంలో 13 నెలలు వస్తాయి. ఇటువంటి పరిస్థితి దాదాపు రెండున్నరసంవత్సరాలకు చొప్పున ఏర్పడుతుంది.  అలాగే, ఒకొక్కసారి రెండు అమావాస్యల నడుమ రెండు సంక్రాంతులు వస్తాయి.  ఆ కాలాన్ని క్షయమాసంగా లేదా లుప్తమాసంగా పరిగణిస్తారు.  అంటే ఆ సంవత్సరంలో ఒక  నెల లోపించి కేవలం 11 మాసాలు మాత్రమే ఉంటాయన్న మాట.  ఇది చాల అరుదైన ఘటన.  బహుశః, ఆనాడు అనసూయ కూడా ఇటువంటి కాలగణనం చేసి, ఒక తిథి (date) తరువాత మరుసటి రోజు 11వ తిథిని ఆనాటి క్యాలండర్లో పొందుపరచి ఉండవచ్చు.  దానినే పదిరాత్రులను ఒక్కరాత్రిగా మార్చడంగా సాంకేతికంగా పేర్కొని ఉంటారు.  ఈ విషయాన్ని అర్థం చేసుకొనడం చేతగాని దద్దమ్మలు పతివ్రతలంట, గ్రహగతులను మార్చివేశారంట అని వెక్కిరిస్తూ తమలో తాము ఆనందపడిపోతూ ఉంటారు.)

అనసూయ చేసిన ఘనకార్యానికి ఆనందపడిన త్రిమూర్తులు ఆమెను వరం కోరుకొమ్మంటే ఆమె వారిని తన బిడ్డలుగా జన్మించమని వరం కోరిందని, వారు తథాస్తు అని అంగీకరించారని ఆ మరొక కథ.  ఇంకొక కథలో త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షింపగోరితే ఆమె వారిని పసిబిడ్డలుగా మార్చివేసిందని, త్రిమూర్తుల పత్నులు ఆమెను వేడుకుంటే వారు తనకు బిడ్డలుగా జన్మించాలని వరం కోరుకున్నదని చెబుతారు.  కథలు ఏమైనా, అనసూయమ్మ త్రిమూర్తులతో సమానమైన బిడ్డలను కన్న మహాతపస్విని అనే మాట నిజం.   

అతడు సోమమహారాజు చేసిన రాజసూయయాగానికి ప్రధానఋత్విక్కుగా ఉన్నాడు.  ఈనాడు ఉన్నట్టే ఆనాడు కూడా కొందరు రాక్షసులు ఉండేవారు.  వారు అత్రిమహర్షిని శతద్వారమనే పీడాగృహంలో చిత్రహింసలు పెట్టారు.  అతనిని చంపివేసేలోగా దేవవైద్యులైన అశ్వినీదేవతలు ఆ గృహంలోని అగ్నిని శమింపజేసి, బలప్రదమైన అన్నం పెట్టి కాపాడారు.

యువమత్రయేవనీతాయ
తప్తమూర్జమోమానమశ్వినావధత్తమ్
(ఋగ్వేదం, ప్రథమమండలం, 118 వ సూక్తం, 7వ ఋక్కు)

ఆ తరువాత సమస్తరాక్షసజాతిని అంతమొందించడానికి పరాశరమహర్షిని నాయకునిగా చేసుకుని ఇతరమునులు చేసిన మహాప్రయత్నాలను వద్దని అత్రి మహర్షి వారిని వారించాడు.  అంతటి కరుణాసముద్రుడు అతడు.  కౌరవపాండవుల నడుమ యుద్ధం జరగకుండా కూడా ఉండాలని ప్రయత్నించిన శాంతిప్రియుడు అత్రి.

చిత్రకూటం విడిచి దండకారణ్యానికి పోతున్నపుడు తనను సందర్శించుకున్న రామునితో అత్రి, సేయం మాతేవ తేనఘ (రామాయణం.2.117.11) ఇదిగో నాయనా, ఈమె నీ తల్లివంటిదే అని అనసూయమ్మను పరిచయం చేశాడు.  నిజానికి కూడా దత్తాత్రేయరూపంలో రాముడు అనసూయాపుత్రుడే కదా.  ఆ అనసూయమ్మ సీతామహాసాధ్వికి కూడా సుద్దులు చెప్పిన దొడ్డ ఇల్లాలు. 

సీతారామలక్ష్మణులు ఇక వెళ్లివస్తామని పలికినపుడు అత్రి చెప్పిన హెచ్చరిక నిత్యస్మరణీయం.

రక్షాంసి పురుషాదాని
నానారూపాణి రాఘవ
వసన్త్యస్మిన్ మహారణ్యే
వ్యాళాశ్చ రుధిరాశనాః।।
ఉచ్చిష్టం వా ప్రమత్తం వా
తాపసం ధర్మచారిణమ్
అదన్యస్మిన్ మహారణ్యే
తాన్ నివారయ రాఘవ।।
(రామాయణం 2.119.18-19)

నాయనా రాఘవా! ఈ మహారణ్యంలో క్రూరమృగాలతో పాటు రక్తపిపాసులూ నరమాంసభక్షకులూ అయిన రాక్షసులు వివిధరూపాలలో సంచరిస్తూ ఉంటారు.  తాపసులు భోజనం చేసిన తరువాత గాని, అజాగ్రత్తగా ఉండే సమయాలలో గాని హఠాత్తుగా వారిమీద దాడి చేసి చంపి తినేస్తూ ఉంటారు.  ఈ ఘోరాలన్నిటినీ నివారించు నాయనా!”

#పాల్ఘర్
#Palghar

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...