Friday, 20 March 2020

తెలుగు మీడియం - ఇంగ్లీషు మీడియం


ఈ క్రింది పళ్లెంలో ఏదో ఒక రకమైన దానిని మాత్రమే మీరు తీసుకోవాలి అని షరతు పెడితే మీరు దేనిని తీసుకుంటారు? 😊

ఒక భాష యొక్క అభివృద్ధి సాధారణంగా ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది.

1 ఒక భావాన్ని ఇతరులకు స్పష్టంగా తెలియజేయ గలగడం.

2 నిత్య జీవనంలో దైనందినవ్యవహారాలకు ఆటంకం కలిగించక పోవటం.

3 ఒకవైపు ఇతరభాషలకు చెందిన పదాలను స్వాయత్తీకరించుకుంటూనే మరొకవైపు తన ప్రత్యేకతను నిలుపుకొనడం.

4 వినేవారు, పలికేవారు ఉండటం.

5 వ్రాసేవారు, చదివేవారు ఉండటం.

6 తనకంటూ ఒక భూభాగాన్ని కలిగి ఉంటూ అందరిచేత ఆదరింపబడటం.

ఇందులో తెలుగుకు వచ్చిన కొరత ఏమిటి? అన్నీ పుష్కలంగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటి? తెలుగును దోషిగా నిరూపించేందుకు వారు చేస్తున్న ఆరోపణలు ఏమిటి?

ఆరోపణ 1
ఉద్యోగాలు చేసేవారికి తెలుగు పనికిరాదు.

సమాధానం -
ఎంత మంది ఉద్యోగులు ప్రతిరోజు తమ కార్యకలాపాలలో ఇంగ్లీషును వినియోగిస్తున్నారు? ఏ ప్రభుత్వ సంస్థకు వెళ్లిన ఏ ప్రైవేటు సంస్థకు వెళ్లిన అక్కడ అ ఉద్యోగులు పరస్పరం తెలుగు మాట్లాడుకుంటూ ఉండటం వినిపిస్తుంది. వారి చెంతకు వచ్చిన వినియోగదారులు కూడా తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. వారితో ఆయా సంస్థల ఉద్యోగులు కూడా తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. విశాఖపట్నం విజయవాడ వంటి నగరాలలోనే గాక శ్రీకాకుళం చిత్తూరు వంటి పట్టణాల్లోనే గాక, మండలాలలోను గ్రామాలలోను కూడా తెలుగు నిత్యం మాట్లాడబడుతుంది. తెలుగు అవసరం ఉన్నచోట తెలుగు పనికిరాదు అనడం ఋజువులు లేని ఆరోపణ.

ఆరోపణ 2
విదేశీ కంపెనీలలోను, కార్పొరేట్ సంస్థలలోను, ఇంగ్లీషు తప్పనిసరి. కాబట్టి తెలుగు అవసరం అక్కడ ఉండదు.

సమాధానం -
సాధారణంగా ప్రతి పెద్ద సంస్థలోనూ పై స్థాయి, మధ్య స్థాయి, క్రింది స్థాయి ఉద్యోగులు ఉంటారు. పైస్థాయి వారు సాధారణంగా పెట్టుబడిదారులై ఉంటారు. వారు మన రాష్ట్రానికే చెందిన తెలుగువారై ఉంటే ఇటువంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు మన ప్రభుత్వాలు ఎర్ర తివాచీ పరచడం వల్ల వచ్చిన ఇతర రాష్ట్రాల వారు లేదా ఇతర దేశాలవారు అయి ఉంటే వారికి తెలుగు రాదు కాబట్టి వారు ఇంగ్లీషులో మాట్లాడతారు. వారితో మధ్యస్థాయి వారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. అయితే క్రింది స్థాయి వారికి ఇంగ్లీషుతో పనేమీ ఉండదు. మధ్యస్థాయి వారు క్రింది స్థాయి వారితో మాట్లాడేది తెలుగే. పైస్థాయి వారి సంఖ్య, మధ్యస్థాయి వారి సంఖ్య కలిపినప్పటికీ క్రింది స్థాయి ఉద్యోగుల సంఖ్యలో సాధారణంగా 25 శాతం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎంతటి విదేశీ సంస్థ అయిన ఎంతటి కార్పొరేట్ సంస్థ అయిన తెలుగు మాట్లాడే ఉద్యోగులకు పనులలో చక్కటి నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ భాష అవసరం లేదు.

ఆరోపణ 3
అయితే మమ్మల్ని ఎప్పటికీ క్రింది స్థాయి ఉద్యోగులుగానే ఉండమంటారా? మధ్యస్థాయి ఉద్యోగులుగా, పై స్థాయి ఉద్యోగులుగా ఎదగవద్దు అంటారా?

సమాధానం -
ఇది ఒక సెంటిమెంటు. ఇది ఒక ఎమోషనల్ స్థాయిభావం. ప్రభుత్వాధిపతి తన ప్రత్యర్థుల నోరు మూయించడానికి కూడా ఇదే పాయింటును వాడుకున్నాడు. ఇదొక బ్రహ్మాస్త్రం. దీనిమీద ఏ విధంగా సమాధానం చెప్పినా అది తమకు వ్యతిరేకం అని ప్రజలు భావించే ప్రమాదం ఉన్నది.

అయ్యా, ఎన్ని యుగాలు మారినా, యంత్రాలు చేయలేని పనిని మనిషి చేయవలసిందే. ఆ పనులు ఈరోజు మీరు చేయవచ్చు రేపు నేను చేయవచ్చు మర్నాడు మరొకడు చేయవచ్చు. మనుషులు మారుతారు తప్ప, ఆ చేసే పనులు లేకుంటే మాత్రం సమాజం నడవదు.

అందరూ ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే ఇంగ్లీషు దేశాలలో కూడా ఈ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా పైస్థాయి మధ్యస్థాయి క్రింది స్థాయి అనే విభజన ఉన్నది. ఒక్కొక్కప్పుడు పైస్థాయి వాడికంటే అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడగలిగిన వారు క్రింది స్థాయిలో కూడా ఉంటారు కానీ వారు క్రింది స్థాయి మనుషులు చేయవలసిన పనులు చేస్తారు. ఇటువంటి తేడాలు కేవలం మన దేశంలో మాత్రమే ఉన్నట్లు ఇతర దేశాలలో మనుషులంతా సుఖపడి పోతున్నారని భావించవద్దు.

అందువల్ల, ఇక్కడ సమస్య డబ్బు ఉండడం లేదా డబ్బు లేకపోవడం మాత్రమే గాని, భాషాసమస్య కాదు.

డబ్బు ఉన్న వారందరూ కూడా పెట్టుబడిదారులు కాలేరు. వారికి భాష కంటే కూడా ముఖ్యంగా కావలసింది ధైర్యము చొరవ అనుభవము. అవి లేని వాడు అంత ఇంగ్లీషు నేర్చినా ఉపయోగం లేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఆ ధైర్యము చొరవ అనుభవము వస్తాయన్నది భ్రమ. నిజానికి అటువంటి ధైర్యము చొరవ అనుభవము ఉన్నవారికి ఇంగ్లీష్ తనంతట తానుగా వచ్చి ఊడిగం చేస్తుంది.

ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని విఫలమైనవారు ఉన్నారు. తెలుగు మీడియంలో చదువుకొని ఘనవిజయాలను సాధించిన వారు కూడా ఉన్నారు.

ఇంగ్లీషు నేర్చిన వారందరూ ఉన్నతస్థాయికి చేరుకుంటారు అనుకుంటే ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పుకుంటూ దీనంగా బ్రతుకుతున్న ఇంగ్లీషుపంతులు గార్లు మన ముందే కనబడుతున్నారు. మరి వారిని ఇంగ్లీషు ఎందుకు ఉన్నత స్థాయికి చేర్చలేకపోయింది?

"ఎవరు ఎటువంటి పనిని చేసినా అందరినీ సమానంగా గౌరవించాలి" అంటూ "డిగ్నిటీ ఆఫ్ లేబర్" పేరిట ఒకప్పుడు వినిపిస్తూ ఉండిన మాటలు ఇప్పుడు వినబడటం లేదు.

అయినప్పటికీ, మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న కొద్దీ, ముందు చెప్పినట్లుగానే మీకు అవసరమైన ఇంగ్లీష్ తనంతట తానుగా వచ్చి మీకు సేవ చేసుకుంటుంది. చిన్నతనం నుండి ఆయా భాషలతో పరిచయం లేకపోయినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్న వారికి ఆయా ప్రాంతీయ భాషలు చాలా సులువుగా రావడం మనం చూస్తూనే ఉన్నాం కదా ఇంగ్లీష్ కూడా దీనికి మినహాయింపు కాదు. అదేమీ పిస్తా కాదు. అందువల్ల మనం మన మాతృభాషను వదిలి చిన్నతనం నుండే మనది కాని ఇంగ్లీషును నేర్చుకుంటూ నములుతూ మింగుతూ జీర్ణం చేసుకొనవలసిన అవసరం లేదు.

ఈ విషయం మన అభినవ మెకాలే అయిన ముఖ్యమంత్రి గారితో సహా మహా మహా మేధావులైన వారికి అందరికీ తెలుసు. కానీ ఏవో రహస్య ప్రయోజనాలను ఆశించి వారు అతి దుర్మార్గమైన చర్యకు పూనుకుంటున్నారు.

(నాగాలాండ్ లో నాగాప్రజల మాతృభాషను చంపేసి ఇంగ్లీషును ప్రవేశపెట్టి, ఇంగ్లీషును బోధించేందుకు క్రిస్టియన్ మిషనరీలను అనుమతించి, దాదాపు నాగ ప్రజలందరినీ క్రిస్టియన్లుగా మార్చి వేశారు. ఇప్పుడు నాగాలాండ్ భారతదేశం నుండి విడిపోవాలని, ప్రత్యేకదేశం కావాలని కోరుతున్నారు. ఇక్కడ కూడా అలా జరగదని నమ్మకం ఏమిటి?)

అపోహ -
ఇంగ్లీషు పెద్ద పిస్తా.

సమాధానం -
😆😂🤣
అలాగే అనుకుందాం. కానీ పిస్తా వల్ల అదనపు లాభం ఏమిటి? పిస్తాను రుచి చూసిన వారందరికీ దాని గూర్చి బాగా తెలుసు. దానికంటే గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు పువ్వు గింజలే మంచి రుచిగా ఉంటాయి. మన చెనిక్కాయలతో పోలిస్తే రంగు రుచి పోషక పదార్థాలలో కూడా పిస్తా దిగదుడుపే. అమ్మ చేసిపెట్టే శనగ గుగ్గిళ్ళ ముందు ఈ పిస్తా బలాదూర్ కాదా? మన రాయదుర్గం కొండలమీద విరివిగా దొరికే తీయని సీతాఫలాలు తిన్న తరువాత ఒక పిస్తా గింజను నోట్లో పెట్టి కొరికితే, దానంత చేదుగా మరే ఇతర పదార్థమూ ఉండదు. మన చక్కరకేళి మన అమృతపాణి తిన్న తరువాత పిస్తా గింజను చూస్తేనే రోత పుడుతుంది. మామిడి పండ్లను, జామ పండ్లను నేరేడు పండ్లను తిన్న తరువాత మళ్లీ పిస్తా అవసరమా? పనసతొనలను పనస గింజలను తిన్నంత ఆనందంగా మనం పిస్తా గింజలను తినగలమా?

పిస్తాను తినడం హోదాకు చిహ్నంగా ఎవరైనా భావిస్తే దాన్ని మన భాషలో వగలు పోవడం అంటారు. అసలు పైన చెప్పినవేమీ తినకుండా, కేవలం పిస్తా గింజలను మాత్రమే తిని బ్రతుకుతున్నవారు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?


తెలుగు మీడియం తప్పేముంది?



అయ్యా ముఖ్యమంత్రి గారూ,

మొదట్లో నిర్బంధపు ఇంగ్లీషు మీడియం నిర్ణయాన్ని ప్రశ్నించేవారు ఎవరైనా సరే, వారందరినీ పేదవారికి శత్రువులుగా చిత్రీకరించారు.

ఇపుడు ప్రశ్నించేవారిని సాక్షాత్తు మీకు (ముఖ్యమంత్రికి) శత్రువులుగా కూడా ప్రకటించేశారా?

అయ్యా, అంతటి ఆగ్రహం ఎందుకు? మేము మీకు వోటు వేసిన వాళ్లము. ఆంధ్రప్రదేశ్ పౌరులము. మీ ప్రజలము. మేము ముఖ్యమంత్రి అభ్యర్థులము కాము. మీకు పోటీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని పార్టీ పెట్టుకుని కూర్చున్నవాళ్లము కాము.

తెలుగు మా మాతృభాష. మీరు మాకు పరిచయం కాకముందే ఈ భాషతో చక్కని పరిచయాన్ని మేము కలిగి ఉన్నాము. అందువలన, మా భాషకు తగిన స్థానం కోసం మేము అడుగుతాము. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. దేశద్రోహం కాదు, రాజద్రోహం కూడా కాదు కదా?

100% ప్రభుత్వ ఉద్యోగాలన్నిటినీ తెలుగులో నాలుగు ప్రావీణ్యాలను (1 వినడం, 2 మాట్లాడటం 3 చదవటం 4 వ్రాయడం) కలిగిన వారికే ఇస్తామని మొదట వాగ్దానం చేయండి. మేము మీ ప్రయోగానికి కొంతకాలం సహకరిస్తాము. అంగీకరిస్తాము.

మీ నిర్బంధపు ఇంగ్లీషు మీడియం ప్రయోగం 100% సఫలమౌతుంది అనే నమ్మకం మీకు ఉన్నదా? అది ఆవిధంగా సఫలమౌతుంది అని నిరూపించేందుకు మీకు ఎంతకాలం కావాలి?

తెలుగు ఒక సబ్జెక్టుగా కొనసాగుతుంది కాబట్టి తెలుగు అందరికీ వస్తుంది అంటున్నారు.

లెక్కలు కూడా ఒక సబ్జెక్టుగా కొనసాగుతుంది కదా? మరి అందరూ లెక్కలలో శ్రీనివాస రామానుజన్ లంతటివారైపోతున్నారా?

సోషల్ స్టడీస్ కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? మరి అందరూ తలపండిన రాజకీయవేత్తలు గాని, ఆర్థికవేత్తలుగాని అయిపోతున్నారా?

సైన్సు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? మరి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నారా?

ఇంగ్లీషు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? వారందరూ షేక్స్‌పియర్లు ఎందుకు కారు?

ఎవరికి ఏ సబ్జెక్టులో అభిరుచి కలుగుతుందో వారు ఆ సబ్జెక్టులో భాషాతీతంగా ఎదగగలరు. అది మీకు తెలియని విషయమా?

మీరు చిన్నతనం నుండి పాలిటిక్స్ అనే సబ్జెక్టు చదవడం వల్లనే ఈ రోజు ముఖ్యమంత్రి కాగలిగారా?

పోనీ, మీరు ఈ రాష్ట్రంలోని అత్యున్నతస్థానమైన ముఖ్యమంత్రి పదవిని అలంకరించారంటే అందుకు కారణం మీకు ఇంగ్లీషు రావడం మాత్రమేనా?

రావాలి జగన్ కావాలి జగన్ అనే పాటను జనాలు ఇంగ్లీషులో విన్నారా?

మీరు చేసిన సుదీర్ఘ పాదయాత్రలో మీరు ప్రజలతో ఇంగ్లీషులో మాట్లాడారా?

మీరు చేసిన ఉపన్యాసాలన్నీ ఇంగ్లీషులోనే చేశారా?

మీరు ముఖ్యమంత్రి అనే అత్యున్నత స్థానానికి ఎదగడానికి మీకు తోడ్పడింది మీ శ్రమ, మీ పట్టుదల, మీ ఓర్పు, మీ దీక్ష. మీ తపన.

మేము వీటిని చూసి మీకు వోట్లు వేశామే గాని, మీరు ఇంగ్లీషు భాషలో ఆయా ఛానెళ్లవారికి ఇచ్చిన ఇంటర్వ్యూలను చూసి కాదు.

అటువంటి శ్రమ, పట్టుదల, ఓర్పు, దీక్ష, తపన ఒక విద్యార్థికి నిజంగా ఉంటే అతడు ఒక గొప్ప డాక్టర్ కావడానికి గాని, ఒక గొప్ప ఇంజనీరు కావడానికి గాని, ఒక గొప్ప మేనేజర్ కావడానికి గాని, ఒక గొప్ప ఆఫీసర్ కావడానికి గాని, ఇంగ్లీషు భాష అనేది నిజంగా ఒక అడ్డంకి అవుతుందా? శ్రమించని వాడికి అసలు ఉన్నత స్థానం పొందే హక్కు ఉందా?

విద్యార్థుల వెనుకబాటుతనానికి చాలా కారణాలున్నాయి.

1.1 అలసత్వం.
సోమరితనం. రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అంటూ వాయిదాలు వేస్తూ పోవడం. ఇలాంటి విద్యార్థులు చదువులో రాణించకపోతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పా?

1.2 గర్వం.
నేను చాల తెలివైనవాడిని, ఒకటి రెండు క్లాసులకు హాజరు కాకపోయినా స్వంతంగా చదువుకోగలను, పరీక్షలకు నెలరోజుల ముందు చదివితే పికప్ చేయగలను వంటి అతివిశ్వాసం. ఇలాంటి విద్యార్థులు విఫలమైతే అది చిన్నప్పుడు చదివిన తెలుగు మీడియం తప్పా?

1.3 వ్యామోహం.
కొందరికి సినిమా వ్యామోహం. కొందరికి సినిమా నటులమీద వ్యామోహం. కొందరికి రాజకీయనాయకుల పట్ల వ్యామోహం. కొందరికి క్రికెట్ వ్యామోహం. కొందరికి ప్రేమ వ్యామోహం. కొందరికి సోషల్ మీడియా వ్యామోహం. ఇలాంటి విద్యార్థులు విఫలమైతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పా?

1.4 చపలత్వం.
కొందరు విద్యార్థులకు ఏకాగ్రత ఉండదు. కాసేపు చదువుకుంటారు. కాసేపు టీవీ చూస్తారు. కాసేపు రోడ్డు మీద పడి తిరుగుతారు. కాసేపు మిత్రులతో ముచ్చట్లు వేస్తారు. కాసేపు ఇంటి పనులు చేస్తారు. వీరు చదువులో రాణించకపోతే అది చిన్నప్పుడు చదివిన తెలుగు మీడియం తప్పా?

1.5 అనాసక్తి.
ప్రతి విద్యార్థి కేవలం సాంకేతికమైన చదువుల కోసమే పుట్టలేదు. కేవలం ఉద్యోగాలు చేయడానికి మాత్రమే పుట్టలేదు. అతడు మంచి సంగీతకారుడు కావచ్చు. గొప్ప ఆటగాడు కావచ్చు. గొప్ప కవి కావచ్చు. రచయిత కావచ్చు. గొప్ప చిత్రకారుడు కావచ్చు. వాళ్ల మనసు తమకు ఇష్టమైన రంగాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వారిని తీసుకొచ్చి డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేస్తామంటూ కాలేజీలలో పడేస్తే, వారికి ఉండే అనాసక్తి వల్ల చదువులో రాణించలేక పోవచ్చు. అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

1.6 స్వార్థం.
ఒకప్పుడు చక్కగా చదువుకునే ఒక విద్యార్థి, అంత గొప్పగా చదవలేని తన తోటి విద్యార్థులకు ఒక సబ్జెక్టును గురించి వివరించి చెప్పడం, వాటిని గూర్చి చర్చించడం, వారి సందేహాలకు సమాధానం చెప్పడం చేసేవాడు. ఇటువంటివన్నీ మునుపు జరిగేవి. కానీ, ప్రస్తుతం అనారోగ్యకరమైన పోటీ ఉంది. ర్యాంకుల పేరిట రూపొందించబడిన విద్యావిధానం, విద్యార్థులలో వేలం వెర్రిని పెంచడం వలన, ఆ విద్యార్థులు తమ జ్ఞానాన్ని తోటి విద్యార్థులతో పంచుకొనలేకపోతున్నారు. ఇది కూడా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

1.7 తప్పుడు మార్గదర్శనం
"ఫలానా సబ్జెక్టు చాలా సులువు, ఒక్కరోజులో, ఓవర్ నైట్ దానిని చదివేసి పరీక్ష పాస్ అయిపోవచ్చు అని కొందరు సీనియర్లు చెబుతుంటారు. మరొక సబ్జెక్టు భూతం. దానిని రాత్రింబగళ్లు ఎంత చదివినా అది అర్థం అయి చావదు. దాంట్లో యావరేజ్ మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోతే చాలు". ఇటువంటి మాటల వల్ల జూనియర్ విద్యార్థి ప్రభావితం అవుతూ ఉంటాడు. ఒక్కసారి ఆమాటలు మనసులోకి ఎక్కితే అవి ఒక పట్టాన వదలవు. ఇది కూడా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం వలన వచ్చే సమస్య కాదు.

పైన చెప్పినవన్నీ విద్యార్థుల యొక్క దోషాలు. ఇప్పుడు అధ్యాపకుల దోషాలను చూడండి.

2.1 ప్రిపరేషన్ లేకపోవడం.
ఒక విషయం ఒక అధ్యాపకునికి చాలా అలా అభిమానపాత్రమైన విషయమై ఉంటుంది. ఈ సబ్జెక్టును మా సారు కళ్ళు మూసుకుని చెప్పగలరు అని విద్యార్థులలో పేరు ఉంటుంది అటువంటి మాటలకు పొంగిపోయి అధ్యాపకుడు ఆ విషయంపై మరింత పరిశోధన చేయడం గాని మరిన్ని కొత్త విషయాలు చెబుదామని గాని ప్రయత్నం చేయడు. ఇది కూడా విద్యార్థి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం దోషం కాదు.

2.2 విషయం దాటవేయడం
కొందరు మంచి తెలివైన విద్యార్థులు ఉంటారు. వారు ప్రశ్నించడం మొదలు పెడితే కొందరు అధ్యాపకులు భయపడతారు కూడా. అందువల్ల వారు అటువంటి విద్యార్థులకు తమ క్లాసులో మాట్లాడే అవకాశం ఇవ్వరు. "ఈ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు పాఠం కొనసాగనివ్వు" అని అని సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తారు. ఆ తర్వాత అంటే ఏ తర్వాత? ఆ సందర్భం మళ్లీ రాకపోవచ్చు. ఇది కూడా విద్యార్థి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

2.3 పాఠానికి సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం.
కొందరు అధ్యాపకులకు కేవలం విద్యార్హత ఉంటుంది. కాని, వారికి సబ్జెక్టుపై అవగాహన ఉండదు. క్లాసుకు వచ్చి పాఠానికి అవసరమైన విషయాలు చెప్పడం మాని విద్యార్థులతో పోసుకోలు కబుర్లు చెబుతూ వారిని కవ్విస్తూ నవ్విస్తూ ఆ రోజు క్లాసు అయిపోయింది అనిపిస్తారు. ఇటువంటి వారికి విద్యార్థులలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. మేనేజ్‌మెంటుకు ఆ విషయం తెలిసి కూడా, అటువంటి వారు మరుసటి సంవత్సరం తమ సంస్థలోనికి అడ్మిషన్లు తీసుకురాగలిగిన సమర్థులుగా భావించి వారిని కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి వారి క్లాసులలో విద్యార్థులకు సబ్జెక్టు రాకపోతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

2.4 అధ్యాపకవృత్తిపై ప్రేమ లేకపోవడం.
కొందరు అధ్యాపకులు తాము తమ తోటి విద్యార్థుల వలె ఇంజనీర్లుగా డాక్టర్లుగా జీవితంలో "సెటిల్" కాలేక పోయామని నిత్యం చింతిస్తూనే ఉంటారు. వారు కేవలం మొక్కుబడిగా మాత్రమే పాఠాలు చెబుతారు. అది అర్థం అయిన వారికి అర్థమైనంత. అర్థం కాకపోతే విద్యార్థులు తమ చిన్నతనంలో చదివిన తెలుగు మీడియం తప్పు కాదు.

2.5 విద్యార్థులకు ఆదర్శంగా నిలబడలేక పోవడం.
ఒక అధ్యాపకుడు తన ప్రవర్తనలో గాని చదువుపై ప్రేమలో గాని తన విద్యార్థులకు ఆదర్శంగా ఉండవలసిన అవసరం ఉన్నది. అతడు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడైతే విద్యార్థులు అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. అతడికి సబ్జెక్టుపై ఎంత అవగాహన, ఎంత ప్రేమ ఉంటుందో, అదంతా అతడి పాఠాలలో ప్రతిఫలిస్తుంది. అప్పుడు విద్యార్థులకు కూడా ఆ సబ్జెక్టుపై అంతటి ప్రేమాభిమానాలు, అంతటి ఆసక్తి కలుగుతాయి. అధ్యాపకుడు ఆ విధంగా లేకపోతే, విద్యార్థికి నిజంగా నష్టమే. అది చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకొనడం వల్ల జరిగిన తప్పు కాదు.

ఇంకా, దోషాలు కేవలం విద్యార్థులలో అధ్యాపకులలో మాత్రమే కాదు, ఆయా విద్యాసంస్థల యొక్క యజమానులలో కూడా ఉంటాయి.

3.1 తల్లిదండ్రుల మెప్పు కోసం ప్రయత్నించడం.
సంస్థల యొక్క మనుగడ విద్యార్థుల చేరికపై ఉంటుంది. అది తల్లిదండ్రుల యొక్క చేతిలో ఉంటుంది. ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందటం ఆ సంస్థలకు చాలా అవసరం. అందువల్ల తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికలు అన్నిటినీ వారు చేతనైనంత వరకు ఆమోదించవలసి ఉంటుంది. వారి కోరికలను సంతృప్తి పరిచేందుకు వీరు అధికప్రాధాన్యతను ఇస్తూ, విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పాలి అనేదానిపై స్వతంత్ర నిర్ణయాలను తీసుకొనలేకపోతున్నారు. చివరగా నష్టం కలిగేది విద్యార్థులకే. ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.2 అధ్యాపకులను నియంత్రించడం.
మేము మీ పిల్లలను "ఇంత" చక్కగా చూసుకుంటాము అని తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన తరువాత ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అధ్యాపకులకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి. ఆలస్యంగా వచ్చినా వారిని ఏమీ అనకండి. హోంవర్క్ చేయకపోయినా రేపు చేసి తీసుకురమ్మని చెప్పండి కానీ కోపపడవద్దు. క్లాసులో ఎవరైనా అల్లరి చేసినా మాట్లాడిన మాకు చెప్పండి గాని, వారిని క్లాసులో నిలబెట్టడం వంటి చిన్న చిన్న శిక్షలు కూడా వేయకండి - ఇలా. ఇలా ఐతే ఎలా? ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.3 అధ్యాపకులను ఇతర పనులకు వినియోగించుకోవడం.
కొన్ని యాజమాన్యాలు తమ అధ్యాపకులను అడ్మిషన్లు తీసుకువచ్చేందుకు పంపిస్తూ ఉంటారు. మరికొందరు అధ్యాపకులను మీడియాతో మాట్లాడేందుకు వినియోగిస్తూ ఉంటారు. మరికొందరు అధ్యాపకులను తమ వాణిజ్య ప్రకటనలను రూపొందించవలసినదిగా కోరుతుంటారు. ఇటువంటి పనులు నిత్యం చేస్తూ ఉంటే చివరకు తమ అసలు పని అయిన విద్యాబోధన కంటే ఈ పనులే ముఖ్యమని వారు భావించేలా చేస్తారు. అందువలన విద్యార్థులకే నష్టం. ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.4 కొందరు అధ్యాపకులను వదులుకోలేకపోవడం.
ముందు చెప్పినట్లుగా కొందరు అధ్యాపకులు క్లాసులో పిల్లలను నవ్వించడం కవ్వించడం చేస్తే వారికి చాల అభిమానపాత్రులైన అధ్యాపకులుగా మారుతారు. (!). వారి వలన మన సంస్థకు ఆకర్షణ పెరిగే మాట నిజమే. అయినప్పటికీ వారు సక్రమంగా పాఠాలు చెప్పలేక పోవడం వలన విద్యలో నాణ్యత లోపిస్తుంది. కానీ అటువంటివారికి విద్యార్థులను ఆకర్షించే శక్తి ఉండటం వలన విద్యాసంస్థలు వారిని వదులుకోలేవు. అందువల్ల విద్యార్థులకు నష్టం. ఇది తెలుగు మీడియం వల్ల జరిగే తప్పు కాదు.

ఈ విధంగా విద్యావ్యవస్థలలో ఎన్నెన్నో లోపాలు ఉన్నాయి. ఎందరెందరిలోనూ ఉన్నాయి. వాటినన్నింటినీ పక్కన పడేసి, వారందరూ నిర్దోషులని, అమాయికులని భావిస్తూ, విద్యార్థులు చదువులో రాణించలేక పోవడానికి ఏకైక కారణం తెలుగు మీడియం మాత్రమే అని, దానిని బలిపశువుగా మార్చి, దానిని గిలెటిన్ యంత్రంలో పెట్టి తల నరికే శిక్ష వేయడం దారుణం.

అయ్యా ముఖ్యమంత్రివర్యా,

విద్యార్థులందరూ తమ తప్పులను తెలుసుకొని, వాటిని సరిదిద్దుకొని, నాలా శ్రమించండి, నాలా ఉన్నత స్థానాన్ని పొందండి అని మీరు విద్యార్థులకు సందేశం ఇవ్వండి.

ఆ విధంగా శ్రమించే విద్యార్థులకు తగిన సమస్త సౌకర్యాలను ఇవ్వండి. అధ్యాపకుల కోసం తరచు సెమినార్లనునిర్వహించండి. సక్రమంగా పాఠాలను చెప్పమని వారికి ప్రబోధించండి. వారి సమస్యలను తీర్చండి. యాజమాన్యాలకు ఏమైనా చిక్కులు ఉంటే వాటిని పరిష్కరించండి. అపుడు అందరూ హర్షిస్తారు. అందరూ సహకరిస్తారు.

అంతే గాని, తప్పులన్నిటినీ కేవలం తెలుగు మీడియం వల్ల జరుగుతున్న తప్పులుగా చిత్రీకరించడం మీ స్థాయిలో ఉన్నవారికి తగదు.

మీరు తెలుగు మీడియాన్ని రద్దు చేయడంపై ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని మీకు శత్రువులుగా భావించడం మీకు మీ ప్రజలకు కూడా శ్రేయస్కరం కాదు.

21 నవంబరునెల, 2019 సంవత్సరం నాటి  లేఖ

నారదుని భూలోకయాత్ర




స్వర్గలోకంలో కూడా అందరూ జగనన్న పరిపాలన జగనన్న పరిపాలన అని మాట్లాడుకుంటే విని నారద మహర్షి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకోవాలని భూలోకానికి వచ్చాడు.

తిరుపతి దగ్గర ఓ పల్లెటూర్లో ఆవులు మేపు కుంటున్న ఒక పల్లెటూరి తల్లి కనిపించింది. ఆమెను ఆప్యాయంగా పలకరించాడు.

తల్లీ, బాగున్నావమ్మా?

బాగున్నానన్నా.

నారాయణ, నారాయణ, అమ్మా, ఎలా ఉందమ్మా మీ జగనన్న పరిపాలన?

జగన్ అన్నకి మా మీద ఎంతో ప్రేమన్నా. మా పిల్లోళ్లని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తాడంట. మా పిల్లోడు టై కట్టుకోని కార్లో పోయి డాక్టరు ఇంజనీరు కలెక్టరు ఉద్యోగం చేసేలా చేస్తాడు మా జగనన్న.

అప్పుడు మీరేం చేస్తారమ్మా?

అప్పుడు ఈడ నేనేం చేయాల? మా కొడుకుతో పాటు నేను కూడా సిటీకి పోతా.

నారాయణ, నారాయణ!  అట్లైతే ఆవుల్ని సాకేది ఇడిసిపెట్టి పోతారామ్మా?

పోవాల్సిందే. ఏముంది ఈ పల్లెల్లోన?

నారాయణ, నారాయణ!  సిటీల్లో పాలు అవసరం లేదమ్మా?

అవసరం గాకుండా ఎట్లుంటాయి?  మా పిల్లోడికి పొద్దున రెండు గ్లాసులు పచ్చి పాలు, రాత్రి రెండు గ్లాసులు కాచిన పాలు తాగితే గాని తనివి తీరదే?

మరెట్లా పాలొస్తాయి సిటీలో?

యేముందిలే.  మా రాములమ్మ పాలంపిస్తాది.  లేదా యెంగటమ్మ పాలంపిస్తాది.  లేకుంటే లచ్చుమ్మ సుబ్బమ్మ, తిమ్మమ్మ ఎవరో ఒగురు పాలంపిస్తారు.

అదెట్టా? మీ పిల్లోడితో పాటు మీ రాములమ్మ, మీ యెంగటమ్మ, మీ లచ్చుమ్మ, మీ సుబ్బమ్మ, మీ తిమ్మమ్మ - వీళ్ల కొడుకులు కూడా అందురూ ఇంగ్లీషు సదివి టై కట్టుకొని కార్లెక్కి ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు ఐతారు. వాళ్లు కూడా సిటీ చేరుతారు. వాళ్లు గూడా ఆవుల్ని సాకేది యిడిసిపెడతారు. ఇంకెవురంపిస్తారమ్మా పాలని?

నిజమే కదా. అట్లైతే ఇంకేముంది?  పాల ఫ్యాక్టరీలు ఉంటాయి కదా?  ఆడ తయారు చేసి అంపిస్తారే, ఆ ప్యాకెట్ల పాలే కొనుక్కోవల్ల.

వాటిగ్గాని పాలెవురు పోస్తారు? మీరే గదా పోసేది? మీరందురూ సిటీకి పోతే ఆ ఫ్యాక్టరీలకు పాలు ఎవరు పోస్తారు?

మా ఊరిలోనేనా ఆవులు సాకేది? మాయాకట్లే ఆవుల్ని సాకే వేరే వూరోళ్లు పోస్తారులే.

అమ్మా, వచ్చే వచ్చే - మళ్లీ ఇంకో సందేహం వచ్చే. జగనన్న రాష్ట్రంలో అన్ని ఊర్లల్లో పిల్లోళ్లను కూడా ఇంగ్లీషు సదివిస్తాడు కదా? వారు కూడా టై కట్టుకొని కార్లలో పోయి డాక్టరు ఇంజనీరు కలెక్టరు ఉద్యోగాలు చేస్తారు కదా?  ఇంక అన్ని ఊర్లల్లో వాళ్ళ తల్లులు కూడా ఆవుల్ని సాకేది యిడిచిపెట్టి సిటీలకి చేరతారు కదా? ఇంకా ఆవుల్ని సాకేది ఎవురు?  పాలు ఇడిపిచ్చేది ఎవరు?  ఫ్యాక్టరీలకి పోసేది ఎవురు?  ఎవరో ఒకరు లేకుంటే పాలు ఎట్లా వస్తాయి?

మా జగనన్నకు ఆమాత్రం తెలివి లేదా ఏమిటి?  పక్క రాష్ట్రం నుంచి తెప్పిస్తాడు. లేదంటే పై దేశం నుండి తెప్పిస్తాడు. ప్రతి అమ్మకి ప్రతి రోజూ కనీసం రెండు లీటర్ల ఉచిత పాల పథకం ప్రవేశపెడతాడు.

కానీ, ఉచిత పాల పథకం ఒకటే సరిపోతుందా అమ్మా?  మీ పిల్లాడు కలెక్టర్ అయ్యాక ప్రయాణించే కారులో ఉచిత పెట్రోలు పథకం కావాలని అడగండి. పల్లెటూరు లో ఉంటే మీ సొంత ఇల్లు ఉండేది. సిటీలో మీ సొంత ఇల్లు లేదు కాబట్టి, ఉచిత బంగ్లా పథకం కావాలని అడగండి, మీరు ఉండబోయే ఇంట్లో ఉచిత కరెంటు పథకం కావాలని అడగండి. పల్లెటూరులో ఉంటే మీ భోజనం మీరే పండించుకునే వారు. సిటీలో ఆ సదుపాయం లేదు కాబట్టి ఉచిత నిత్యభోజన పథకం కావాలని అడగండి.

మంచి ఆలోచన చెప్పారన్నా. మనం నోరు తెరిచి అడగాలే గాని జగనన్న ఏమైనా ఉచితంగా ఇచ్చేస్తాడు.

అవునామ్మా? ఇంకా ఏమేమి అడుగుదాం అనుకుంటున్నావ్ తల్లీ?

ఉచిత చీరల పథకం, ఉచిత సినిమా పథకం, ఉచిత టీవీ ఫ్రిజ్జుల పథకం, ఉచిత బంగారు నగల పథకం, అమ్మాయి పెళ్ళికి ఉచిత కట్నం పథకం, ఉచిత పెళ్లి భోజనాల పథకం, ఉచిత సీమంతం పథకం, ఉచిత పురుడు పథకం, ఉచిత బారసాల పథకం, ఉచిత నామకరణం పథకం, గుండు కొట్టించేందుకు ఉచిత తిరుపతి ప్రయాణం పథకం, ఉచిత స్కూలు పథకం ఎలాగూ ఉంది కాబట్టి, ఉచిత ట్యూషన్ పథకం, స్కూలుకు ట్యూషనుకు వెళ్లి రావడానికి ఉచిత ఆటో పథకం...

నారాయణ, నారాయణ! అన్నీ ఉచిత పథకాలు అయితే ఎలా అమ్మా? అన్నీ ఉచితంగా ఇవ్వడానికి జగనన్నకి డబ్బులు ఎలా వస్తాయి?

చాల్లేవయ్యా, చెప్పొచ్చావు. మా పిల్లోళ్లు అందురూ పల్లెటూర్లో ఉన్నప్పుడే ఉచితపథకాలు ఇచ్చాడు. మొత్తం రాష్ట్రంలో ఉండే పిల్లోళ్లంతా డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అయినప్పుడు దేశం ఇంకా అభివృద్ధి చెందినట్లే కదా? అంటే, ఇంకా బాగా డబ్బు వస్తాది కదా? అప్పుడు మరి కొన్ని ఉచిత పథకాలు పెడతాడు మా జగనన్న.

అద్భుతమైన ఆలోచన అమ్మా. కాని, మీ ఆలోచనలు ఆయనకు తెలియాలి కదా?  ఆయన మళ్లీ పాదయాత్ర చేయడు, మీ మాటలు వినడానికి రాడు.

ఎందుకు రాడు?

ముఖ్యమంత్రి అయినాడు కదామ్మా?  తాను పెట్టిన పథకాలన్నిటికీ డబ్బులు ఎలా తేవాలా అని బిజీ బిజీగా ఆలోచిస్తూ ఉంటాడు.

నేనంత తెలివితక్కువదాన్ననుకుంటున్నావాన్నా? గ్రామ సచివాలయాలు ఉంటాయి కదా? గ్రామవలంటీర్లు కూడా ఉంటారు కదా? వాళ్లని పట్టుకుంటా. పనులు ఎందుక్కావో చూస్తా.

నారాయణ, నారాయణ! (కడుపు నిమురుకుంటూ) అద్భుతం అమ్మా. మీరు పల్లెటూర్లో ఉన్నారన్న మాటేగాని బాగా చదువుకున్న ఏ మేధావులూ మీకు సాటి రారు. అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే, నాయకులు సక్రమంగా పద్ధతిగా అదుపులో ఉంటారు. మీలాంటివారు లేకుంటే ఉచిత పథకాలు పెట్టకుండా ఎగ్గొట్టేస్తారు. మీ లాంటి వారి వల్లే వారి పేరు స్వర్గలోకంలో కూడా మార్మోగిపోతోంది. సరేనమ్మా, నేను వెళ్లొస్తాను మరి.

కాస్త తిని పోదురు గాని, మా ఇంటికి రండి అన్నా.

వద్దమ్మా, నేను వచ్చిన పని పూర్తయింది. దాంతో నా కడుపు నిండిపోయింది. ఆకలేసినప్పుడు మళ్లీ ఎప్పుడైనా వస్తా.

సరేనా. బద్రంగా పొయిరాన్నా.

నారాయణ! నారాయణ!

అరగొండ సత్రం


మన పూర్వుల స్మృతులు మనకు ఎంతో అమూల్యమైనవి. వాటిని రక్షించుకొనడం మన బాధ్యత కూడా.
అరగొండ గ్రామంలో, శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి అనతి దూరంలో ఈ ప్రాచీననిర్మాణం ఉన్నది.
చక్కని దేవతామూర్తులు చెక్కి ఉన్న గట్టి రాతి స్తంభాలతో, ఇప్పటికీ బాగానే ఉన్నది. గోడలు కట్టిన ఇటుకలు కూడా చాలా పాత కాలానికి చెందినవి. అయితే చంద్రగిరి నిర్మాణంలో వాడిన ఇటుకల కంటె కొంత లావుపాటి ఇటుకలు ఇవి. అవి మాత్రం కొంతవరకు శిథిలమై కనిపిస్తున్నాయి.

ఇది ఏదో పురాతన కాలపు దేవాలయం కాబోలు అనిపించింది. కానీ ఆ గ్రామస్థులను అడిగితే ఇది ఒకనాటి బాటసారుల సత్రం అని చెప్పారు. సత్రాన్ని కూడా ఇంత అందంగా ఇంత గొప్పగా కళాత్మకహృదయంతో కట్టిన అజ్ఞాతపూర్వీకులకు మనసులోనే నమస్కారాలు సమర్పించాము.

అయితే సత్రం అని చెప్పబడుతున్న ఈ నిర్మాణంలో శిథిలమైన పాతకాలపు దారురథం కూడా కనిపించింది. పూర్వకాలంలో గ్రామవీధులలో దేవతామూర్తుల ఊరేగింపుకు ఆ రథం ఉపయోగపడి ఉండవచ్చును. అందువల్ల ఇది సత్రం కాకపోవచ్చును అని మరల అనుమానం కలిగింది.

ఇది ఏ కాలానికి చెందినది? ఎవరు కట్టించారు? అనే ప్రశ్నలకు గ్రామస్థుల వద్ద సరైన సమాధానం లేదు.
ఎవరో పండ్ల దుకాణాదారులు తమకు అవసరం లేని అట్టపెట్టెలను పడవేసే ఒక చెత్త బుట్టలా అది ప్రస్తుతం ఉపయోగపడుతున్నది.

అది పాతకాలపు సత్రం కావచ్చును, లేదా పురాతన దేవాలయం కావచ్చు, అది మన చరిత్రకు మన సంస్కృతికి ఆనవాలు. దానిని సంరక్షించవలసిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉన్నది. లేదా పురావస్తుశాఖ దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.
కొంతకాలం దానిని పట్టించుకోకుండా ఆగితే, దానిని పడగొట్టి అక్కడ ఒక దుకాణం వెలిసే అవకాశం లేకపోలేదు.
ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని నీతులు చెప్పినా బలవంతుడిదే రాజ్యం. పాత దానిని నిర్మూలిస్తే గాని కొత్తది పైకి రాలేదు అనే పోకడలు ఈ ఆధునిక యుగంలో మన కండ్ల ముందు చోటు చేసుకుంటూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాము.

అలిపిరిలో ఫణిమర్దనుడు




కశ్యపమహర్షికి ప్రియమైన భార్యలు ఇద్దరు. కద్రువ, వినత. ఇద్దరికీ పరస్పరమాత్సర్యం ఎక్కువ. ఒకసారి కద్రువ ఒకానొక పందెంలో తన కుమారులైన సర్పాల సహాయంతో వినతను మోసం చేసి తనకు దాసిగా చేసుకుంది. వైనతేయుడు కూడా (వినత కుమారుడైన గరుత్మంతుడు కూడా) ఆ కద్రువకు, కాద్రవేయులకు (కద్రువ కుమారులైన సర్పాలకు) దాసుడై వారు చెప్పిన ప్రతి పని చేయవలసి వచ్చేది.

ఇలా కాదు, మమ్మల్ని దాస్యం నుండి విడిచిపెట్టాలంటే మీకేం కావాలో చెప్పండి అన్నాడు గరుత్మంతుడు.

అమృతం తీసుకురా వదిలి పెడతాం అన్నారు సర్పాలు. గరుత్మంతుడు ఇంద్రుని ఓడించి వారికి అమృతం తెచ్చి ఇచ్చాడు. తనను, తన తల్లిని దాస్యం నుండి విడిపించుకున్నాడు. అయితే సర్పాలు అమృతం త్రాగకముందే ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. తనకు సహకరించినందుకు వరమిస్తానన్నాడు. అయితే నన్ను ఇంతకాలం ఏడిపించిన సర్పాలే నాకు ఆహారం కావాలన్నాడు గరుత్మంతుడు. తథాస్తు అన్నాడు ఇంద్రుడు.

ఆ విషయం తెలిసి సర్పాలన్నీ భయపడి రమణకద్వీపానికి పారిపోయాయి. అయినా గరుత్మంతుడు వాటిని వదలలేదు. అపుడు సర్పాలు గరుత్మంతుని వేడుకున్నాయి. తమ్ముడూ, మీ సోదరులమైన మమ్మల్ని చంపకు. మానవులు మాకు భయపడి మేము వారిని ఏమీ చేయకుండా ఉండేందుకు గాను ఆహారం సమర్పిస్తూ ఉంటారు. అందులో నీకు కూడా భాగమిస్తాం. అది స్వీకరించి మమ్మల్ని వదిలి పెట్టు అన్నారు. గొడవ ఎందుకులెమ్మని గరుత్మంతుడు సరేనన్నాడు.

అయితే సర్పాలన్నిటిలో కాళియునికి కాస్త బలగర్వం ఎక్కువ. ఒకరోజు గరుత్మంతునికి భాగం పెట్టకుండా తానే మొత్తం ఆహారం భుజించేశాడు. దాంతో గరుత్మంతుడు కోపగించి "వీని తలలు చీరి చెండాడి భోగంబు చించి వైచి ప్రాణములఁ బాపి వచ్చెద" అని విజృంభించాడు. కాళియుడు ధైర్యంగానే ఎదిరించాడు గాని, అప్పటికి గాని తన బలం గరుత్మంతుని ముందు ఎందుకూ కొరగానిది అని తెలిసిరాలేదు.

వెంటనే పాకిపోయి కాళింది మడుగు చేరాడు. ఆపత్కాలంలో వాలినుండి ఆత్మరక్షణకోసం సుగ్రీవునికి ఋశ్యమూకం దొరికినట్టు కాళియుడికి కాళింది మడుగు దొరికింది. కాళింది మడుగులోని జీవాలకు హాని చేస్తే గరుత్మంతుడు మరణిస్తాడు అని సౌభరి ముని శాపం ఉన్నది. ఆ విధంగా కాళియుడు యుక్తితో చావు తప్పించుకున్నాడు. గరుత్మంతుడు ఊరకున్నాడు.

ఆ తరువాత కాళియుడు కాళింది మడుగులో విజృంభించాడు. మడుగులోని సమస్తజలాన్ని విషమయం చేశాడు. దానిపైనుండి పక్షులు ఎగిరితే అందులో పడి చచ్చేవి. దాని మీదనుండి వచ్చిన గాలి సోకితే గట్టున దూరంగా ఉండే జీవులు కూడా చచ్చిపడవలసిందే! ఈ వ్యవహారం తమ పశువులకు, తమ మిత్రులకు ప్రమాదకరంగా పరిణమించే సరికి కృష్ణుడు ఈ సంగతేమిటో తేల్చేయాలనుకున్నాడు.

కటి చేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దోస్తటసంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి తత్కుటశాఖాగ్రముమీఁదనుండి యురికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగన్.

కాళియుడికి కోపం వచ్చింది.
"బాలుండొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలఁగం జరించె నిట నే లోనుంటఁ జూడండు మత్కీలాభీలవిశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలంజేసెద నేడు నా కోపంబు దీపింపగన్"
అనుకున్నాడట.

చూడండి.
అదే పొగరంటే.
అది మామూలు పొగరు కాదు.
దానిని తల పొగరు అంటారు.

బలవంతుడైన శత్రువుకు భయపడి తలదాచుకొనేందుకు వచ్చినవాడు, ఆ మడుగు చొచ్చిన వాడు, ఆ మడుగులో మొదటినుండి ఉన్న మిగిలిన ప్రాణులతో స్నేహంగా ఉండక, అన్నిటినీ హతమార్చి, దురాక్రమణ చేసి, ఇపుడు నా మడుఁగు నా మడుఁగు అని రక్షకుడైన కృష్ణునిపైనే దౌర్జన్యం చేయబూనుకున్నాడు. ఆ తలపొగరు ఒక్క తలది కాదు. అది నూరు తలల పొగరు!

కాళియుడు నూరుతలలతోనూ బాలకృష్ణుని కరిచాడు. పెనవేసుకున్నాడు. ఒడ్డున చూస్తున్న వారందరూ భయభ్రాంతులైనారు. అయ్యయ్యో అని ఆర్తనాదాలు చేశారు.

ఆపై కృష్ణుని విజృంభణం మొదలైంది. కాళియుని తలలపై నృత్యం చేశాడు. కాళింది కెరటాల ఘోషలు మృదంగరావాలైనాయి. "మహితకాళియఫణిఫణామండపమున నళినలోచనవిఖ్యాతనర్తకుండు నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె" నట!

ఆ దెబ్బకు ఆ ఫణి (పాము) పడగలు బెండుపడిపోయాయి. యొండొండ ముఖంబుల రక్తమాంసంబులుమియ వచ్చాయి. కన్నుల విషంబు వెలిగ్రక్కబడింది. పాము ఉక్కు చెడింది. చిక్కింది. దిక్కులు చూచింది. కంఠగతప్రాణమైంది.

"బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కియాడెడిన్" అని భావించాడు.

అంతలోనే తటాలున కాస్త తెలివి తళుక్కుమంది.
మామూలు బాలుడు ఇంతటి పని చేయగలడా?

"ఈతడు సర్వచరాచరభూతేశుండైన పరమపురుషుండు" అని తెలుసుకున్నాడు.

ఇంతలో కాళియుని భార్యలు ఏడుస్తున్న తమ పిల్లలను వెంటేసుకుని వచ్చారు.

"క్రూరాత్ముని దండించుట క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా" అని కృష్ణుని ప్రశంసించారు.

చివరకు తమ భర్తను క్షమించమన్నారు. "చాలున్ నీ పదతాండవంబు పతిభిక్షంబెట్టి రక్షింపవే!" అని వేడుకున్నారు.

కాళియుడు కూడా శరణువేడాడు. "మనిచెదేనియు మన్నించి మనుపు నన్ను నిగ్రహించెదవేనియు నిగ్రహింపుమింక సర్వేశ్వరా" నన్నేమి చేసినా నీ యిష్టము" అనేశాడు.

"చూడు నాయనా! గోవులు, మనుషులు ఈ మడుగులో నీరు త్రాగుతూ ఉంటారు. ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు, నీ బంధువులు, మీ మీ భార్యాబిడ్డలతో సహా, ఈ మడుగును వదిలి సముద్రానికి పొండి. నీవును నీ బాంధవులును, నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁడంబుధికిన్" అని ఆజ్ఞాపించాడు.

అపుడు కాళియునికి తాను చేసిన పాత తప్పులు గుర్తుకొచ్చాయి. కాళింది మడుగులోనే తన ప్రతాపమంతా. బయటకు అడుగు పెడితే తక్షణమే గరుత్మంతుడు చీల్చి చెండాడేస్తాడు. ఇక్కడే ఉంటానంటే కృష్ణుడు దండిస్తాడు. తన మూర్ఖత్వం వల్ల, నూరు తలకాయలనిండా ఉన్న పొగరుల వల్ల, తాను సర్వస్థలభ్రష్టుడనైనానని తెలిసివచ్చింది పాపం.

కృష్ణుడు అతడి ఆలోచనను గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు. "భయపడకు కాళియా, నీ పడగలపై నా పాదముద్రలను చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు పో - మత్పదాబ్జలాంఛనములు నీ తలనుంటఁ జూచి యా పక్షిరాజు నిన్నుఁ బట్టఁడింక" అని వరమిచ్చాడు.

కాళియుడు సంతోషించి పుత్రమిత్రకళత్రసమేతంగా కృష్ణునికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి సముద్రానికి తరలిపోయాడు.

కాళింది మరలా సుధావారిం బొలు పారె నెల్లవారికిఁ బ్రియమై.

అదీ కథ.
)()()()()(

ఈ ఫోటో చూశారా?
ఫణిందమనుడు. ఫణిమర్దనుడు. "ఫొణి"ని సముద్రంలోనికి తరిమిన జగన్నాథుడు.

ఈ బాలుడు మత్ఫణాశతమును భగ్నము చేయుచున్నాడని కాళియుడు భావించాడు కదా? మరి నూరు పడగలేవీ? ఒకటే పడగను శిల్పి చిత్రీకరించాడు.

కృష్ణుడెపుడూ అంతేనని ఆ శిల్పి భావించాడో ఏమో.

మరోసారి "కరసహస్రంబుల కండూతి వాయు నుపాయంబును లేద యీ భరము నెట్లోర్తున్నుమానాయకా? యుద్ధం చేయాలనే నా వేయిచేతుల తీట ఎపుడు తీరుతుందో అని సరదాపడిన బాణాసురుని వేయిచేతులలో ఓ నాలుగింటిని వదిలేసి మిగిలిన తొమ్మిన్నూట తొంబైయారు చేతులు నరకలేదా అదే కృష్ణుడు?

అట్లే, కాళియుని నూరు తలకాయల పొగరు దించేసి, ఒక తలకాయను అట్లే వదిలేసి ఉంటాడని ఆ శిల్పిగారి ఉద్దేశమేమో.
)()()()(

ఈ కథలు సాంకేతికమనిపిస్తూ ఉంటాయి. కశ్యపుడు అంటే ఒక paternal gene పేరు, కద్రువ వినత అనేవి maternal genes పేర్లు కావచ్చు. రామాయణభారతాలలో ఈ కశ్యపుడు సమస్తజీవజాలనికీ (జంతువులకు, పక్షలకు, చెట్లకు, మనుషులకు కూడా) మూలబీజమనే సిద్ధాంతం కనిపిస్తుంది.

కశ్యపునికి ఇంకా చాలమంది భార్యలున్నారు. ఉదాహరణకు దితి, అదితి. వారి నడుమ కూడా మాత్సర్యమున్నదట. వారి సంతానమే దైత్యులు (రాక్షసులు), అదైత్యులు (దేవతలు) అంటారు. రాక్షసులు దేవతలు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే మూలపదార్థాలు అయ్యుండవచ్చు. క్షీరసాగరమంటే మనస్సు అని, చెడుతలంపులు విషమని, మంచి తలంపులు అమృతమని చెప్పడం తెలిసిన విషయమే. కాబట్టి, దేవతలు రాక్షసులు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే వివిధ హార్మోన్లకు పెట్టిన సాంకేతికనామాలు అయ్యుండవచ్చు. దితి అదితి అనేవి ఆ హార్మోన్లను ఉత్పాదన చేసే glands అయ్యుండవచ్చేమో!

కాబట్టి, సమస్తప్రాణులన్నిటికీ paternal gene సమానమే అయినా maternal gene మాత్రం భిన్నమనిపిస్తుంది. కాబట్టి, కశ్యప దితి అదితి కద్రువ వినత అనేవి సాంకేతిక నామాలే తప్ప మనుషుల పేర్లు కాకపోవచ్చును. ఒక సిద్ధాంతాన్ని కథలా చెబితే కలకాలం గుర్తుంచుకుంటారని ఇలా చెప్పారేమో అనిపిస్తుంది.

అలాగే కాళియుని కథ, అది విషపూరితమైన జలావరణాన్ని మనిషి కాపాడుకున్న కథ కావచ్చును.

ఎన్ని వేలయేండ్లనాటివో ఈ కథలు! ఉన్నతమైన చదువు కొందరికే పరిమితం కావడం, వారు కూడా కాలక్రమేణా ఇతరసంస్కృతుల సమ్మేళనంతో ఆనువంశికమైన చదువులను, విజ్ఞానాన్ని కోల్పోవడం, ఈ కథలను మతానికి అంటగట్టడం, పుక్కిటి పురాణాలు అని గేలి చేయడం, విదేశీయుల చేతిలో మనకు కలిగిన పరాజయానికి మనం వివశులమై, ఆత్మన్యూనతాభావంచేత నిలువెల్లా ఆక్రమింపబడి మన కథలను, మన పురాణాలను మనమే వెక్కిరించుకొనడం ప్రారంభమైంది. ఈ పతనం ఇప్పటికి మరింత వేగమౌతోందే తప్ప ఆగటం లేదు.

చిటారు కొమ్మన మిఠాయిపొట్లమంటే తేనె గూడు కాదు. ఇటువంటి జ్ఞానఫలమే! చూడనివారికి అది దక్కదు. ప్రయత్నం చేయనివారికి అది దక్కదు. ప్రయత్నం చేసినా పొట్టిచేతులవారికి దక్కదు. శాఖాగ్రానికి చేరుకున్నా, అందుకోలేక అక్కడనుండి పతనం చెందేవారికి అది దక్కదు. కష్టించి పైకెక్కగలిగి, చాల జాగ్రత్తలు కలిగిన వారికే అది దక్కేది!

అందని ద్రాక్షలు పుల్లన అని వెక్కిరించే గుంటనక్కలకు వాటి అనుచరులకు ఈ లోకంలో కొదవ లేదు.
)()()()(

ఈ శిల్పం అలిపిరిలో గరుడవిగ్రహానికి అనతి దూరంలో ఉన్న లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలోనిది.

ప్లాస్టిక్ సంచులు వద్దు అని ఎందుకు చెప్పాలి?



ప్లాస్టిక్ సంచులు వద్దు అని ఎందుకు చెప్పాలి?
*శిలాజ ఇంధనాల నుండి తయారవుతుంది.
*పర్యావరణ కాలుష్యానికి కారణమౌతుంది.
*పర్యావరణంలో కలిసిపోయి సమస్యాత్మకంగా తయారౌతుంది.
*వన్యప్రాణులను చంపుతుంది.
*మనుషుల ఆరోగ్యానికి హానికరం.
*రీసైకిల్ చేయడం అంత సులభం కాదు.
*శుభ్రపరచడానికి అధిక ఖర్చులు.
*మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
ప్లాస్టిక్ సంచులు మనకు మరియు పర్యావరణానికి ఎందుకు చెడ్డవి?
*ప్లాస్టిక్ సంచులు మన భూమిని, నీటిని కలుషితం చేస్తాయి. ప్లాస్టిక్ సంచులు ప్రతిచోటా ఉన్నాయి. చుట్టూ చూడండి. ప్లాస్టిక్ సంచులు చాలా సాధారణమైన చెత్త అని మీరు గమనించవచ్చు. రోడ్ల వెంట చెట్లు మరియు కంచెలలో చిక్కుకొని, నీటిలో తేలుతూ, పార్కుల్లో, అడవుల్లో కూడా నేలమీద పడి ఉంటుంది. చెత్త డబ్బాల చుట్టూ, ఉంటుంది. చాలా తేలికైనవి కాబట్టి, ప్లాస్టిక్ సంచులు గాలిలో తేలికగా కొట్టుకుపోతాయి. గాలి ద్వారా నీటి ద్వారా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ప్రకృతిని కలుషితం చేస్తాయి.  



ప్లాస్టిక్ చెత్త అన్ని ప్రాంతాల్లో కూడా గొప్ప సమస్యలను కలిగిస్తుంది. పారవేసిన లక్షలాది ప్లాస్టిక్ సంచులు పట్టణ ప్రాంతాల్లో నీటి పారుదల మార్గాలు మరియు మురుగునీటిని మూసివేస్తాయి. వర్షాలు ప్రారంభమైనప్పుడు, మొదటి కొన్ని నిమిషాల తర్వాత వీధులు నీటితో నిండిపోతాయి. ఎందుకంటే ప్లాస్టిక్ అడ్డు తగలడం వల్ల నీరు మురుగునీటి పైపుల గుండా వెళ్ళదు.
నదులన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయి,
ప్రపంచంలోని కొన్ని నదులపై దాదాపు మీ పాదాలు తడి కాకుండా మీరు నడవగలరు.
ప్లాస్టిక్ సంచులు సహజవాతావరణాన్ని మార్చివేయగల స్థితికి చేరుకున్నాయి.
మనం ప్రతిచోటా ప్లాస్టిక్ బ్యాగులు అవసరం లేదని చెప్పవలసి ఉంది. ఇది మన పర్యావరణానికి, మన ఆరోగ్యానికి, ప్రపంచవాతావరణానికి మంచిది. స్టోర్ చెక్ అవుట్ వద్ద ప్రతిసారీ మనము ప్లాస్టిక్ కిరాణా సంచులు వద్దని చెప్పేందుకు ప్రయత్నం చేద్దాం.
ముడి చమురును శుద్ధి చేసేటప్పుడు బయటపడే పదార్థంతోను, సహజ వాయువు ప్రాసెసింగ్ నుండి తీసుకోబడిన పాలిథిలిన్ అనే పదార్ధంతో ఎక్కువ భాగం ప్లాస్టిక్ సంచులను తయారు చేస్తారు. వాటి వెలికితీసేటపుడు అవి గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తాయి, ఇవి ప్రపంచంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులకు కారణమౌతాయి.
ఈ సంచుల ఉత్పత్తికి చాలా శక్తి (energy) అవసరం. ప్రపంచవ్యాప్తంగా, మన ప్రస్తుత చమురు సరఫరాలో 8 నుండి 10 శాతం ప్లాస్టిక్ బ్యాగ్ తయారీకి వెళుతుంది. కేవలం అమెరికాలో మాత్రమే, ప్రతి సంవత్సరం 12 మిలియన్ బారెల్స్ చమురును ప్లాస్టిక్ ఉత్పత్తికి వినియోగిస్తారు. ఖచ్చితంగా చెప్పాలంటే అమెరికాలో ప్రతి సంవత్సరం 100 బిలియన్ల ప్లాస్టిక్ సంచులు తయారవుతున్నాయి. ఇంతటి శక్తిని వెచ్చించి తయారు చేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా, ప్లాస్టిక్ సంచిని కేవలం 12 నిమిషాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఒక అంచనా.
ప్రపంచ చమురు నిల్వలు 2050 వరకు మాత్రమే మన అవసరాలను తీర్చడానికి తగినంతగా ఉన్నాయి.
ప్లాస్టిక్ సంచులు ఎప్పుడూ విచ్ఛిన్నం కావు. పెట్రోలియం నుండి ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ సంచులు సింథటిక్ పాలిమర్‌లతో కూడి ఉంటాయి, ఇవి ప్రకృతిలో కలిసిపోయేందుకు 1,000 సంవత్సరాల వరకు పట్టవచ్చు. చాలా సందర్భాలలో ఏమి జరుగుతుందంటే, వాతావరణంలో ఉన్నప్పుడు, అ ప్లాస్టిక్ చిన్న మైక్రోస్కోపిక్ ముక్కలుగా విడిపోతుంది, అవి నేలల్లో నిక్షిప్తం అవుతాయి. మనం ఆహారంలో కలిసి మన శరీరంలో ప్రవేశిస్తాయి. లేదా నీటిలో కలిసి కలుషితం చేస్తాయి.



ఈ ముక్కలు చాలా చిన్నవిగా ఉంటాయి, అవి మన కంటికి కనిపించవు.
ఆసియాఖండ దేశాలు, యుఎస్ తీరప్రాంతాలు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేస్తాయి.
పర్యావరణంలో ఎప్పుడూ విచ్ఛిన్నం కాని కాలుష్య కారకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మన అంచనాలకు మించి చిక్కులు ఉంటాయి.
ఒక అధ్యయనం ప్రకారం, సముద్రతాబేలు మరణాలలో 35 శాతం వరకు ప్లాస్టిక్ తినడం వల్ల సంభవించాయి. ఒక చనిపోయిన పెలికాన్ కడుపు 17 ప్లాస్టిక్ సంచులతో నిండి ఉంది. 25 ప్లాస్టిక్ సంచులు కడుపు నింపడంతో ఆస్ట్రేలియాలో ఒక మొసలి మరణించింది. కడుపులో 8 ప్లాస్టిక్ సంచులు జీర్ణం కాకపోవడం వల్ల ఒక ఆవుదూడ బలవన్మరణానికి గురికావలసి వచ్చింది. ప్లాస్టిక్ ఉత్పత్తిని మానకపోతే, ప్లాస్టిక్ వినియోగాన్ని మానకపోతే, ప్రతిరోజు ఇటువంటి అనారోగ్యకరమైన సమాచారాన్ని మనం మరింత ఎక్కువగా వినవలసి ఉంటుంది.



ఇవన్నీ మనిషికి ముందస్తు సూచనలు. మనిషి తొందరపడి మేల్కొనకపోతే మనిషి కంచం నిండా కూడా తినడానికి ప్లాస్టిక్ వస్తువులే మిగులుతాయి.
మనం వినియోగించే ప్లాస్టిక్ ఈ జంతువుల జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. పేగులలో చిక్కుబడుతుంది. ఊపిరి ఆడకుండా చేస్తుంది. హృదయవిదారకమైన విషయం ఏమిటంటే, ఆ జంతువులకు ఈ ప్లాస్టిక్ అంటరాని వస్తువని తెలియదు. తినకూడని పదార్ధమని తెలియదు.
ఈ ప్లాస్టిక్ వ్యర్థంలో జంతువులు కూడా సులభంగా చిక్కుకుపోతాయి. ప్లాస్టిక్ సంచులలో పక్షులు పట్టుబడి, ఎగరడానికి చేతకాక, ఆహారం తినలేక చివరికి గొంతు కోసుకుని పోయి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
డాల్ఫిన్లు, సీల్స్, పిల్లులు, కుక్కలు, జింకలు, ఇంకా అనేక ఇతర జంతువులను ప్లాస్టిక్ చంపేస్తోంది.
ఈ జంతువుల బాధలను ఊహించుకోండి.
ఆసియా-పసిఫిక్‌లోని పగడపు దిబ్బలపై ఒక అధ్యయనం జరిగింది. పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం పగడపు దిబ్బలను క్రమంగా నాశనం చేసే అంటువ్యాధుల వ్యాప్తిని ప్రోత్సహిస్తాయని నిర్ధారించింది.
ఈ విధంగా, ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపై అపారమైన జీవవైవిధ్యం కలిగిన పర్యావరణ వ్యవస్థల నాశనాన్ని వేగవంతం చేస్తాయి.
కోకాకోలా వంటి శీతల పానీయాలలో, పంపు నీటిలో, సీఫుడ్‌లో కూడా మైక్రోప్లాస్టిక్స్ కనుగొనబడ్డాయి.
ఇది మన ఆహారపు గొలుసును (food chain) కలుషితం చేసింది, కనుక ఇది మన శరీరంలో కూడా చేరుకుంటోంది. మన శరీరంలోని ప్లాస్టిక్ కణాలు పెరిగిన సాంద్రతకు మన జీవక్రియ గతి తప్పుతోంది. సహజమైన రోగనిరోధక శక్తి క్షీణించి పోతోంది.
మన శరీరంలో వ్యాధికారక కణాలను ప్రవేశపెట్టడం ద్వారా ఇది కాలేయంపై ఒత్తిడిని పెంచుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. దీనికితోడు, మన జీర్ణవ్యవస్థలోని ప్లాస్టిక్‌లు సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన ట్రేస్ ఎలిమెంట్స్ (ఇనుము వంటివి) గ్రహించడాన్ని ప్రభావితం చేస్తాయి.
ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ ఉత్పత్తులు మొత్తంగా మన ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి.
ప్లాస్టిక్ సంచుల రంగును మార్చడానికి జోడించే రంగులు కూడా మన ఆరోగ్యాన్ని దొంగిలిస్తాయి. ఈ రంగులు స్వయంగా విషాన్ని విడుదల చేస్తాయి. సీసం లేదా కాడ్మియం వంటి భారీ లోహాల కణాలతో కలుషితం చేస్తాయి, రెండూ మూత్రపిండాల ఆరోగ్యాన్ని, ఇతర అవయవాల పనితీరును దారుణంగా ప్రభావితం చేస్తాయి.



సముద్రంలో ప్లాస్టిక్ ముక్కలు, పిసిబిలు (పాలిక్లోరినేటెడ్ బైఫెనిల్స్) మరియు పిహెచ్ (పాలిసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్లు) వంటి కాలుష్య కారకాలను సులభంగా గ్రహించగలవు. ఇవి హార్మోన్లను-భంగపరిచే రసాయనాలు.
ప్లాస్టిక్ సంచులను రీసైకిల్ చేయడం అంత సులభం కాదు.
ప్లాస్టిక్ సంచులు రీసైక్లింగ్ యంత్రాలలో చిక్కుకునే అవకాశం ఉన్నందున, ప్లాస్టిక్ సంచులను పూర్తిగా రీసైకిల్ చేసే సామర్థ్యం యంత్రాలకు లేదు. అందువల్ల అన్నిచోట్ల వాటిని అంగీకరించటం లేదు. వాటిని రీసైక్లింగ్ ప్రవాహం నుండి తొలగించడం వల్ల మునిసిపాలిటీలకు సంవత్సరానికి 1 మిలియన్లు ఖర్చవుతాయి.
ప్లాస్టిక్ బ్యాగ్ రీసైక్లింగ్‌కు ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసి కొత్త ఉత్పత్తిగా మార్చగల ప్రత్యేక పరికరాలు అవసరం. కాని, చాలా మునిసిపాలిటీలకు వారి రీసైక్లింగ్‌ను తమ వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమంలో చేర్చడానికి బడ్జెట్ లేదు.



కాబట్టి, ప్లాస్టిక్ బ్యాగ్ రీసైక్లింగ్ సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. రవాణా కూడా బాగా ఖరీదైనది.
ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ సంచుల యొక్క వాస్తవ రీసైక్లింగ్ రేటు 5% నుండి 15% శాతం మధ్య ఉంటుంది. #ఇంగ్లీష్‌మీడియం ఉన్నదనే కారణంగా గొప్పగా అభివృద్ధి చెందిన దేశంగా మనం భావిస్తున్న అమెరికాలో ఇది సంవత్సరానికి కేవలం 1% మాత్రమే.
{మూలం - జీరో ప్లాస్టిక్ కమ్యూనిటీ}

పరిమళించిన దానవత్వం

1
కాళిదాసు నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినవచ్చింది. ఎవరై ఉంటారు ఈ రాత్రి పూట అనుకుంటూ అతడు వచ్చి తలుపు తెరిచాడు. బయట ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా ఉన్నాడు.

ఆ వచ్చిన వాడు అతిథి అయి ఉంటాడు అని గ్రహించిన కాళిదాసు, అతడికి అతడి కుటుంబానికి అంత రాత్రిపూట కూడా మంచి భోజనం ఏర్పాటు చేశాడు.
ఆ తరువాత అతడిని "ఎవరయ్యా మీరు? ఇంత రాత్రిపూట నగరంలో ప్రవేశించారు?" అని అడిగాడు.
ఆ బ్రాహ్మణుడు దాదాపు కాళిదాసు పాదాల మీద పడినంత పని చేసి, "అయ్యా, నేను పేరుకు బ్రాహ్మణుడినే గాని, సంస్కృతం చదువుకున్నవాడిని కాను. ఇంతవరకు ఈనాడు పేపర్ లో ప్రూఫ్ దిద్దుతూ ఉండేవాడిని. ఈనాడు పేపర్ ను అందరూ నమ్మడం మానివేశాక, నా ఉద్యోగం పోయింది. దాంతో బ్రతుకుతెరువుకోసం దేశం మీద పడ్డాను. ధారానగరంలో భోజమహారాజు గొప్ప దాత అని విన్నాను. ఆశతో వచ్చాను. కానీ కవిత్వం రానివారిని, పాండిత్యం లేనివారిని అతడు ఆదరించడని తెలిసి వచ్చింది. అతడి రాజ్యంలో ఒక నేతగాడు, ఒక కూలి పని వాడు కూడా కవిత్వం చెప్పగలరని విన్నాను. అటువంటిది, భాష మీద ఎటువంటి పట్టులేని దూరదేశస్థుడనైన నన్ను అతడు ఆదరిస్తాడనే నమ్మకం లేదు. అందువల్ల అందరూ రాజదర్శనం కావాలంటే రాజానుగ్రహం పొందాలంటే కాళిదాసును ఆశ్రయించమని చెప్పారు. అందువల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. కనికరించండి" అని ప్రాధేయపడ్డాడు.
"సరేనయ్యా, నీకు సంస్కృతం రాకపోవచ్చును, కనీసం రామాయణ భారతాలైనా తెలుసునా?"
"ఆ! తెలుసునండి! రామాయణం అంటే రాముడు, భారతం అంటే భీముడు! అంతే కదండీ?"
"అంతే! అంతే!" అన్నాడు కాళిదాసు. "నేను మిమ్మల్ని రేపు రాజసభకు తీసుకొనిపోతాను. అక్కడ మిమ్మల్ని మహాపండితుడిగా పరిచయం చేస్తాను. మీరేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి. రాజుగారు ఇచ్చింది పుచ్చుకుని వచ్చేయండి" అని చెప్పాడు.
సరేనన్నాడు ఆ బ్రాహ్మణుడు.
ఆ మరుసటి రోజు కాళిదాసు అతడిని సభలో మహాపండితుడుగా పరిచయం చేశాడు. కాళిదాసు మాట మీద ఉండే గౌరవం చేత అందరూ అతను నిజంగానే మహాపండితుడు అని భావించారు.
భోజరాజు వినయంగా ఆ పండితుని ఒక చిన్న ప్రశ్న వేశారు.
"పండితవర్యా! మా దేశంలో లంకాధిపతిని కొందరు "రావణుడు" అంటున్నారు కొంతమంది "రావనుడు" అంటున్నారు. ఏది సరైన పదమో చెప్పగలరా?" అని అడిగాడు.
కాళిదాసు ఆ దొంగపండితుని మౌనంగా ఉండమని సైగ చేశాడు. అయినా తన పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చేసరికి ఆ పండితుడు ఆగలేకపోయాడు. తన పాండిత్యాన్ని రాజుగారు గుర్తిస్తే తన స్థానం గల్లంతు అవుతుందేమోనని కాళిదాసు అసూయపడుతున్నాడని భావించాడు. అందువల్ల నోరుమూసుకొని ఉండలేక -
"రాభణుడు కదా?" అన్నాడు.
సభ అంతా అల్లకల్లోలం అయిపోయింది. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. "రావణ" అనేది సరైన పదమా లేక "రావన" అనేది సరైన పదమా అని తేల్చుకోలేక పోతుంటే, మధ్యలో ఈ కొత్త పండితుడు వచ్చి "రాభణ" అనే కొత్త పదాన్ని పరిచయం చేశాడు!
భోజరాజుగారు కంగారుపడుతూ కాళిదాసు కేసి చూశాడు. కాళిదాసు ఇరుకులో పడ్డాడు. అతడు మహాపండితుడు అని చెప్పింది తానే కదా? ఇప్పుడు అతడు ఏమి వాగినా తానే సమర్థించాలి!
అందువల్ల తప్పనిసరిగా అతడిని సమర్థిస్తూ కాళిదాసు ఈ క్రింది శ్లోకం చదివాడు -
"భకారః కుంభకర్ణేఽస్తి భకారోఽస్తి విభీషణే।
కులశ్రేష్ఠే కులజ్యేష్ఠే భకారః కిం న విద్యతే॥

పెద్ద తమ్ముడైన కుంభకర్ణుని పేరులో భ అనే అక్షరం ఉన్నది. చిన్న తమ్ముడు అయిన విభీషణుని పేరులో కూడా భ అనే అక్షరం ఉన్నది. మరి కులశ్రేష్ఠుడు కులజ్యేష్ఠుడు అయిన అన్నకు రాభణుడు అని, పేరులో భ అనే అక్షరం ఎందుకు ఉండదు?" అన్నాడు.
దాంతో అంతటా హర్షధ్వానాలు చెలరేగాయి. భోజరాజు సంతోషించాడు. ఆ దొంగపండితునికి గొప్ప గొప్ప కానుకలు సమర్పించాడు.
***

2
దాంతో అతడు సంతోషం పట్టలేకపోయాడు. "మహారాజా! మీలో "దానవత్వం" పరిమళిస్తోంది" అన్నాడు.

ఆ మాట వినగానే మహారాజు నివ్వెరపోయాడు. సభ దిగ్భ్రాంతి చెందింది. కాళిదాసు చిరునవ్వు నవ్వాడు.
కాళిదాసు నవ్వాడు అంటే అందులో ఏదో పరమార్థం ఉందని అందరూ భావించారు. కాళిదాసా! ఈ మహా పండితుని మాటకు అర్థం ఏమిటి? అని అందరూ అడిగారు.
అప్పుడు కాళిదాసు ఈ క్రింది శ్లోకం చదివాడు.
బలినా దానవేంద్రేణ త్రైలోక్యమర్పితం పురా।
దాతృత్వం దానవత్వం చ సమార్థమభవత్తదా॥

"మహారాజా! పూర్వం బలి అనే పేరు గలిగిన దానవ శ్రేష్ఠుడైన మహారాజు ఉండేవాడు కదా? అతడు గొప్ప దానశీలుడు కదా? అతడు తన వీరత్వంతో ముల్లోకాలను జయించాడు కదా? మళ్లీ ఆ ముల్లోకాలనూ శ్రీ మహావిష్ణువుకు ఒక్క మాటతో అలవోకగా దానం చేసిన మహాదానవీరుడు కదా?
పూర్వం వేరు వేరు అర్థాలు కలిగిన దాతృత్వము, దానవత్వము అనే రెండు మాటలు అతడి గొప్పదనం వలన సమానార్థకాలు అయినాయి. మీరు కూడా ఆ దానవవీరుడైన బలి చక్రవర్తి అంతటి వీరులు, మహాదానశీలురు అని ఆ పండితుడు మీకు నిగూఢంగా చెప్పదలిచాడు. అంతే!" అని వివరించాడు.

యావత్సభ కరతాడనధ్వనులతో మారుమ్రోగిపోయింది. పండితుడికి మరిన్ని విలువైన కానుకలు లభించాయి.
***

ఈ క్రింది పేపర్ కటింగ్ మిత్రులు Naresh Kandula వారి పోస్టులోనిది. ఆయన మిత్రులు శ్రీ Raja Rao Vadrevu గారు సంపాదించినది. ఇద్దరికీ ధన్యవాదాలు.

ఇందులో ఒకటవ కథ (రాభణుడు) భోజప్రబంధంలోనిది. రెండవ కథ (దానవత్వం పరిమళించిన కథ) నేను కల్పించినది.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...