Monday, 27 April 2020

అత్రిఅనసూయామహర్షిదంపతులు




#భారతీయఋషులు 3



అత్రిమహర్షి వృత్తాంతం భౌతికమైనది కాదని, కొంతవరకు సాంకేతికమైనదని తోస్తుంది.  కాని, సీతారామలక్ష్మణులు తమ వనవాసకాలంలో ఆయనను ప్రత్యక్షంగా సందర్శించి సేవించుకున్నట్లు రామాయణం సాక్ష్యమిస్తుంది.

అత్రి కూడా బ్రహ్మమానసపుత్రుడే.  ఈయన ఋఙ్మంత్రద్రష్టగా వేదాలలో ఉదాహరింపబడ్డాడు.  (ఋగ్వేదం, పంచమమండలం)   బృహదారణ్యకోపనిషత్తు అతనిని వాక్కుగా వర్ణిస్తుంది.  వాగేవ అత్రిఃఈ సందర్భంలో వాక్కు అంటే రసనేంద్రియమే (నాలుక) అని కొందరి వ్యాఖ్యానం.     

ఉపనిషత్తులో తరువాత చెప్పిబడిన వాక్యాలు ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపించేలా చేస్తాయి.  వాచాహ్యన్మద్యతే – (వాక్కు చేతనే అన్నం భుజింపబడుతుంది.)  అత్తిర్హ వై నామైతద్ యదత్రిరితి – భుజిస్తుంది (అత్తి) కాబట్టి దీని పేరు అత్రి.  సర్వస్యాత్తా భవతి, సర్వమస్యాన్నం భవతి య ఏవం వేద (ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో అతడు సమస్తాన్నీ భుజింపగలిగినవాడౌతాడు.  సర్వమూ అతడికి అన్నమౌతుంది.) {బృహదారణ్యకం 2.2.4}

దేవహూతీకర్దముల పుత్రిక అయిన అనసూయ ఇతడి భార్య.  ఆ అనసూయ దయాస్వరూపిణి.  ఒకసారి వరుసగా పదిసంవత్సరాలపాటు అనావృష్టి ఏర్పడి తిండి నీరు లేక ప్రపంచమంతా అల్లాడిపోయిందట.  అపుడు అనసూయ తన తపఃప్రభావం చేత ప్రజలకోసం మూలాలను (దుంపలను) ఫలాలను సృష్టించిందట.  నీటిని కూడా సృష్టించిందట.  

యయా మూలఫలే సృష్టే
జాహ్నవీ చ ప్రవర్తితా
(రామాయణం.2.117.9)

అనసూయమ్మకు సాక్షాత్తుగా గంగ ప్రత్యక్షమైందని,  తన తపఃఫలాన్ని పతిసేవాధర్మపుణ్యాన్ని ధారపోసి అనసూయమ్మ గంగమ్మను నిలిపిందని శివపురాణంలో కోటిరుద్రసంహిత తెలుపుతుంది.

(తపస్సు అంటే తపించడం.  ఒక విషయాన్ని గూర్చి తీవ్రమైన శోధన చేయడం కూడా తపస్సే.  అంటే రిసెర్చ్ అన్నమాట.  బహుశః అనసూయమ్మ పరిశోధించి అతి తక్కువ నీటితో పండే మూలఫలాదులను కనిపెట్టింది అనుకోవచ్చు.  అలాగే, నీటివనరులను కాపాడుకొనడం, భూగర్భంలోని నీటిని పైకి తీయడం వంటివి ప్రజలకు నేర్పింది అనుకోవచ్చు.  ఈ విధంగా అనసూయమ్మ అతి ప్రాచీనకాలపు సైంటిస్టు, సంఘసేవికురాలున్నూ.  ఆమెను కేవలం ఒక పతివ్రతగా మాత్రమే గుర్తించడం అన్యాయం.) 

ఆ పుణ్యదంపతుల కోరిక మేరకు శివుడు గంగ నిలిచిన తావున అత్రీశ్వరుడనే పేరిట నిలిచిపోయాడు.

ఈ దంపతులిద్దరూ అతి గొప్ప తపస్సును చేశారు.  త్రిమూర్తులు వారి తపస్సుకు మెచ్చి ఏమి కావాలో కోరుకొమ్మని అడిగారు.  మీరు మాకు పుత్రులై జన్మించాలి అని వారు వరం కోరారు.  వారి కోరిక మేరకు బ్రహ్మ సోమునిగా, విష్ణువు దత్తాత్రేయునిగా, పరమేశ్వరుడు దూర్వాసునిగా వారి కుమారులై జన్మించి వారి ముచ్చటను తీర్చారు. 

ఈ విషయంలో మరొక కథ కూడా ఉన్నది.  ఒకసారి సూర్యచంద్రోదయాలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడిందిట.  దాంతో త్రిమూర్తులు ఈ విషయంలో సహాయం చేయమని అనసూయను అడిగారట.  అపుడు ఆమె పదిరాత్రులను ఒక్క రాత్రిగా మార్చివేసి, సూర్యచంద్రోదయాలు జరిగేందుకు వీలు కలుగజేసింది. 

దశరాత్రం కృతా రాత్రిః (రామాయణం.2.117.11)

(ఈ కథ సాంకేతికంగా జ్యోతిషసంబద్ధమైన కాలగణనం.  జ్యోతిస్సులంటే సూర్యచంద్రగ్రహనక్షత్రాదులు. నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఫిబ్రవరిలో ఒక్క రోజు అధికంగా ఎలా వస్తుందో  మనకు తెలుసు.  అలాగే, చాంద్రమానాన్ని అనుసరించి, అధికమాసాలు, లేదా క్షయమాసాలు వస్తూ ఉంటాయి.  రెండు అమావాస్యల నడుమలో సంక్రాంతి ఎప్పుడైతే రాదో దానిని అధికమాసం అంటారు.  ఆ సంవత్సరంలో 13 నెలలు వస్తాయి. ఇటువంటి పరిస్థితి దాదాపు రెండున్నరసంవత్సరాలకు చొప్పున ఏర్పడుతుంది.  అలాగే, ఒకొక్కసారి రెండు అమావాస్యల నడుమ రెండు సంక్రాంతులు వస్తాయి.  ఆ కాలాన్ని క్షయమాసంగా లేదా లుప్తమాసంగా పరిగణిస్తారు.  అంటే ఆ సంవత్సరంలో ఒక  నెల లోపించి కేవలం 11 మాసాలు మాత్రమే ఉంటాయన్న మాట.  ఇది చాల అరుదైన ఘటన.  బహుశః, ఆనాడు అనసూయ కూడా ఇటువంటి కాలగణనం చేసి, ఒక తిథి (date) తరువాత మరుసటి రోజు 11వ తిథిని ఆనాటి క్యాలండర్లో పొందుపరచి ఉండవచ్చు.  దానినే పదిరాత్రులను ఒక్కరాత్రిగా మార్చడంగా సాంకేతికంగా పేర్కొని ఉంటారు.  ఈ విషయాన్ని అర్థం చేసుకొనడం చేతగాని దద్దమ్మలు పతివ్రతలంట, గ్రహగతులను మార్చివేశారంట అని వెక్కిరిస్తూ తమలో తాము ఆనందపడిపోతూ ఉంటారు.)

అనసూయ చేసిన ఘనకార్యానికి ఆనందపడిన త్రిమూర్తులు ఆమెను వరం కోరుకొమ్మంటే ఆమె వారిని తన బిడ్డలుగా జన్మించమని వరం కోరిందని, వారు తథాస్తు అని అంగీకరించారని ఆ మరొక కథ.  ఇంకొక కథలో త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షింపగోరితే ఆమె వారిని పసిబిడ్డలుగా మార్చివేసిందని, త్రిమూర్తుల పత్నులు ఆమెను వేడుకుంటే వారు తనకు బిడ్డలుగా జన్మించాలని వరం కోరుకున్నదని చెబుతారు.  కథలు ఏమైనా, అనసూయమ్మ త్రిమూర్తులతో సమానమైన బిడ్డలను కన్న మహాతపస్విని అనే మాట నిజం.   

అతడు సోమమహారాజు చేసిన రాజసూయయాగానికి ప్రధానఋత్విక్కుగా ఉన్నాడు.  ఈనాడు ఉన్నట్టే ఆనాడు కూడా కొందరు రాక్షసులు ఉండేవారు.  వారు అత్రిమహర్షిని శతద్వారమనే పీడాగృహంలో చిత్రహింసలు పెట్టారు.  అతనిని చంపివేసేలోగా దేవవైద్యులైన అశ్వినీదేవతలు ఆ గృహంలోని అగ్నిని శమింపజేసి, బలప్రదమైన అన్నం పెట్టి కాపాడారు.

యువమత్రయేవనీతాయ
తప్తమూర్జమోమానమశ్వినావధత్తమ్
(ఋగ్వేదం, ప్రథమమండలం, 118 వ సూక్తం, 7వ ఋక్కు)

ఆ తరువాత సమస్తరాక్షసజాతిని అంతమొందించడానికి పరాశరమహర్షిని నాయకునిగా చేసుకుని ఇతరమునులు చేసిన మహాప్రయత్నాలను వద్దని అత్రి మహర్షి వారిని వారించాడు.  అంతటి కరుణాసముద్రుడు అతడు.  కౌరవపాండవుల నడుమ యుద్ధం జరగకుండా కూడా ఉండాలని ప్రయత్నించిన శాంతిప్రియుడు అత్రి.

చిత్రకూటం విడిచి దండకారణ్యానికి పోతున్నపుడు తనను సందర్శించుకున్న రామునితో అత్రి, సేయం మాతేవ తేనఘ (రామాయణం.2.117.11) ఇదిగో నాయనా, ఈమె నీ తల్లివంటిదే అని అనసూయమ్మను పరిచయం చేశాడు.  నిజానికి కూడా దత్తాత్రేయరూపంలో రాముడు అనసూయాపుత్రుడే కదా.  ఆ అనసూయమ్మ సీతామహాసాధ్వికి కూడా సుద్దులు చెప్పిన దొడ్డ ఇల్లాలు. 

సీతారామలక్ష్మణులు ఇక వెళ్లివస్తామని పలికినపుడు అత్రి చెప్పిన హెచ్చరిక నిత్యస్మరణీయం.

రక్షాంసి పురుషాదాని
నానారూపాణి రాఘవ
వసన్త్యస్మిన్ మహారణ్యే
వ్యాళాశ్చ రుధిరాశనాః।।
ఉచ్చిష్టం వా ప్రమత్తం వా
తాపసం ధర్మచారిణమ్
అదన్యస్మిన్ మహారణ్యే
తాన్ నివారయ రాఘవ।।
(రామాయణం 2.119.18-19)

నాయనా రాఘవా! ఈ మహారణ్యంలో క్రూరమృగాలతో పాటు రక్తపిపాసులూ నరమాంసభక్షకులూ అయిన రాక్షసులు వివిధరూపాలలో సంచరిస్తూ ఉంటారు.  తాపసులు భోజనం చేసిన తరువాత గాని, అజాగ్రత్తగా ఉండే సమయాలలో గాని హఠాత్తుగా వారిమీద దాడి చేసి చంపి తినేస్తూ ఉంటారు.  ఈ ఘోరాలన్నిటినీ నివారించు నాయనా!”

#పాల్ఘర్
#Palghar

Saturday, 25 April 2020

మరీచిమహర్షి

#భారతీయఋషులు 2




మరీచిమహర్షి స్వాయంభువమన్వంతరకాలం నాటి సప్తర్షులలో ఒకరు.  సనకసనందనాదుల వలనే ఈయన కూడా బ్రహ్మమానసపుత్రుడు.  కాని, వారివలె నివృత్తిమార్గాన్ని కాక, ప్రవృత్తిమార్గాన్ని అనుసరించి గృహస్థుడైనాడు. 

కళ అనే భార్య వలన అతడు కశ్యపుడనే సంతానాన్ని పొందాడు.  ఆ కశ్యపుడు అతడు అనేక వంశాలకు మూల పురుషుడు. 

శ్రీమహావిష్ణువుయొక్క పాలనశక్తి మరీచిమహర్షిగా అవతారం దాల్చిందని పురాణాలు చెబుతాయి.  అతడి ప్రవర్తన అతి నిర్మలమైనది.  అతడి తపోజీవనం అతిప్రశాంతమైనది, నిరాడంబరమైనది.  అతని సుగుణాలకు బ్రహ్మదేవుడు ఎంతగానో ఆనందించాడు.  ఒకసారి తాను పుష్కరతీర్థంలో చేసిన యజ్ఞానికిగాను ప్రధానఋత్విక్కుగా నియమించుకున్నాడు.  10 వేల శ్లోకాలు కలిగిన బ్రహ్మపురాణాన్ని మరీచికి బహుమానంగా ప్రసాదించాడు. 

ఆనందసంహిత మొదలైన గ్రంథాలకు మరీచిమహర్షి కర్త.  కాని, ఆ మరీచి ఈ మరీచి భిన్నులని, అతడు విఖనోమహర్షిశిష్యుడని కొందరు అంటారు.  కాదు, ఇద్దరూ ఒకరేనని మరికొందరు అంటారు.

నారదునిద్వారా ద్వాదశాక్షరీమంత్రాన్ని పొంది తపస్సు చేయదలచిన బాలధ్రువునికి మరీచి తపోవిధానాన్ని ఉపదేశించాడు.  కురుక్షేత్రయుద్ధభూమిలో బాణశయ్యపై విశ్రమించిన భీష్ముని సందర్శించాడు.

కాళిదాసమహాకవి వ్రాసిన అభిజ్ఞానశాకుంతలనాటకాంతంలో మారీచ అనే పేరిట ఒక మహర్షి కనిపిస్తాడు.  అతడెవరో కాదు, మరీచిపుత్రుడైన కశ్యపమహర్షియే.

స్వాయంభువాన్మరీచేర్యః
ప్రబభూవ ప్రజాపతిః।
సురాసురగురుః సోఽత్ర
సపత్నీకస్తపస్యతి॥

అని కాళిదాసు మాతలి చేత పలికించాడు.  మరీచేః ప్రబభూవ (అంటే - మరీచికి సంతానంగా జన్మించాడు) "ప్రజాపతి", "సురాసురగురుః" (అంటే అదితినుండి సురులను, దితినుండి అసురులను కన్నవాడు) "సపత్నీకుడై (అంటే అదితిసహితుడై) తపస్సును చేస్తున్నాడు'' అనే మాటల ద్వారా ఆ మారీచుడు కశ్యపమహర్షి అని స్పష్టంగా తెలుస్తుంది.  కాబట్టి, రామాయణంలో మాయామృగంగా కనిపించి సీతారాములను వంచించిన మారీచుడు ఇతడేనేమో అని పొరపాటు పడరాదు.

దుష్యంతతిరస్కృతయైన తన కుమార్తె శకుంతలను మేనక మారీచమహర్షి ఆశ్రమంలోనే విడిచిపెట్టింది.  ఆ ఆశ్రమంలోనే భరతుడు జన్మించాడు.  శకుంతలాదుష్యంతుల పునఃసమాగమం ఆయన ఆశ్రమంలోనే జరిగి, వారి కథ మంగళాంతమైంది.

మరీచిమహర్షికి ధర్మవ్రత అని మరొక భార్య కూడా ఉన్నది.  ఒకసారి అతడు ఆమెపై నిష్కారణంగా ఆగ్రహించి ఆమెను శిలగా మారిపొమ్మని శపించాడు.  తరువాత కోపాన్ని నిగ్రహించుకొనలేని తన అసమర్థత వలన నిరపరాధిని అయిన ఆమె దండింపబడింది కదా అని ఎంతగానో పరితపించాడు.  అప్పుడు అతనికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, “నాయనా! నా సంకల్పం వల్లనే నీకు కోపం వచ్చింది అని ఓదార్చాడు. 

ధర్మవ్రత ఆపై దేవశిలగా పిలువబడుతుందని, ఆమెలో త్రిమూర్తులతో సహా సకలదేవతలు నివసిస్తారని, వారి సాన్నిధ్యం దేవశిలలో మంత్రపూర్వకంగా ప్రతిష్ఠింపబడుతుందని వరమిచ్చాడు.  ఈ నాటికి కూడా మనం దేవశిలలో నెలకొన్న దేవతామూర్తులకు నమస్కరిస్తూనే ఉంటాము.


#పాల్ఘర్
#Palghar

Friday, 24 April 2020

సనక-సనందన-సనత్కుమార-సనత్సుజాతులు






సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు - వీరు బ్రహ్మ మానసపుత్రులు. వీరు సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు. వీరి మనసులు చాల పరిశుద్ధమైనవి. వారు ఆకారంలో ఎన్నటికీ ఐదు సంవత్సరాల పిల్లల వలె ఉంటారు. వారికి భౌతికసంపదల పట్ల, సుఖాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు.

వివాహం చేసుకొని సృష్టిని ప్రారంభించండి అని బ్రహ్మ వారిని ఆదేశించినప్పటికీ, వారు అందుకు నిరాకరించి, తపస్సు చేసేందుకు సంకల్పించుకున్నారు. ప్రవృత్తిమార్గాన్ని కాక నివృత్తిమార్గాన్ని అవలంబించారు.

వారి ఉచ్ఛ్వాసనిఃశ్వాసలలో పూర్తిగా భగవన్నామం నిండిపోయింది. వారు మనసా వాచా కర్మణా హరిశరణాగతులు అయినారు. మృత్యువు వారిని సమీపించ లేకపోయింది. భగవన్నామస్మరణ చేస్తూ వారు విశ్వమంతటా స్వేచ్ఛగా సంచరించేవారు.

వారు ఒకసారి వైకుంఠానికి వెళ్లినపుడు అక్కడి ద్వారపాలకులైన జయవిజయులు వారిని పిల్లవారుగా భావించి వారి ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఎన్నడూ కోపించి ఎరుగని వారికి ఆనాడు చాల కోపం వచ్చింది.  వారిని పునర్జన్మ ఎత్తమని శపించివేశారు.

వెంటనే విష్ణువు ప్రత్యక్షమై, వారిని శాంతింపజేశాడు. తాము నిగ్రహం తప్పినందుకు వారు ఎంతో సిగ్గుపడ్డారు. పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విష్ణువు వారిని ఓదార్చి వారు కోపించడం కూడా తన సంకల్పం ప్రకారమే జరిగిందన్నాడు.

శాపం పొందిన జయవిజయులు తమ మొదటి పునర్జన్మలో హిరణ్యాక్షహిరణ్యకశిపులు గాను, రెండవ పునర్జన్మలో రావణకుంభకర్ణులు గాను మూడవ పునర్జన్మలో శిశుపాలదంతవక్త్రులు గాను జన్మించారు. విష్ణువు కూడా వరాహనరసింహులు గాను, రాముడి గాను కృష్ణుడి గాను అవతారమెత్తి వారిని మరల తన చెంతకు చేర్చుకున్నాడు.

ఒకసారి ఈ కుమారులు పృథుచక్రవర్తి చెంతకు వెళ్లారు. ఆయన వీరిని ఎంతగానో సత్కరించి, "మహాత్ములారా! మానవాళికి అత్యంత శ్రేయస్కరం అయినది ఏమిటి?" అని ప్రశ్నించాడు.

దానికి సనత్కుమారుడు సమాధానం చెప్పాడు.

1 ఆత్మానందం. అంటే దేవుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండటం.

2 ప్రపంచంలో దేని పట్లనైనా ఆసక్తిని కలిగి ఉండకపోవటం.  అహంకారమే అజ్ఞానానికి, అన్ని కష్టాలకు మూలం.  అహంకారం ఉపశమించినపుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. సుఖదుఃఖాలతో కూడి ఉన్న సర్వప్రపంచమూ ఒక కల వలె అదృశ్యమైపోతుంది. అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది.  ఆ ఆత్మయే పరమానందస్వరూపమైన పరబ్రహ్మం.

అప్పటి నుంచి ఆ ఉపదేశచింతనమే భారతీయ ఆధ్యాత్మికప్రపంచానికి మూలస్రోతస్సై నిలిచింది.

ఒకసారి విదురుని ఆహ్వానం మేరకు వచ్చిన సనత్సుజాతుని మృత్యురహస్యం ఏమిటని ధృతరాష్ట్రుడు అడిగాడు.

"ప్రమాదమే మృత్యువు" అని సనత్సుజాతుడు జవాబు చెప్పాడు. ప్రమాదము అంటే పొరబాటు. ఒక వస్తువును వేరొక వస్తువు గా భ్రమించడమే ఆ పొరపాటు.  శంకరాచార్యులవారు ఆ బోధనను ఎంతో విలువైనదిగా పరిగణించారు. సనత్సుజాతీయసంవాదము అనే పేరిట ఉన్న వారి సంభాషణకు వారు అమూల్యమైన వ్యాఖ్యానాన్ని వ్రాశారు.

నారదమహర్షికి సమస్తజ్ఞానము కరతలామలకంగా ఉండేది. అయినప్పటికీ ఆయనకు మనశ్శాంతి కరువయ్యింది. అప్పుడు ఆయన కుమారుల చెంతకు వెళ్లారు. పరమానందాన్ని పొందే రహస్యాన్ని వారినుండి తెలుసుకొనగోరాడు.

ఆత్మజ్ఞానం తప్ప మిగిలిన జ్ఞానమంతా పరిమితమైనదని, అల్పమైనదని వారు అతనికి బోధించారు. నారదునికి వారు బోధించిన విద్యను భూమవిద్య అంటారు. అది అద్వైత వేదాంతంలో చాలా గొప్ప విద్య.  ఛాందోగ్యోపనిషత్తులో ఆ ప్రస్తావన కనిపిస్తుంది.

"యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి".

"అనంతంలోనే ఆనందం ఉన్నది. అంతమయ్యేదానిలో ఆనందం లేదు."

ఈ కుమారులు అప్పుడప్పుడు భూమిపై సంచరిస్తూ కొందరు ఉత్తములను నివృత్తిమార్గమైన సన్న్యాసానికి మళ్లిస్తూ ఉంటారని ఒక విశ్వాసం.

Friday, 3 April 2020

నీతో విభేదిస్తున్నాను తిరుమలా




నీతో విభేదిస్తున్నాను తిరుమలా.

కొవ్వొత్తులు వెలిగించమని మోదీ చెబితే తప్పేముందో నాకు అర్థం కాలేదు.

దేశంలోని ప్రజలందరూ సుదీర్ఘమైన లాక్ డౌన్ ఆవశ్యకతను అర్థం చేసుకున్న మాట నిజమే. కాని, అది ఆలస్యంగా ప్రకటించారని కొందరు, అది తమ మతానికి విరుద్ధమంటూ కొందరు రకరకాల అభిప్రాయాలను నిరసన వ్యక్తం చేశారు. ట్రోల్ చేశారు. నిరసనలు చేశారు. తిట్టారు.

అవును. మూర్ఖభక్తులు ఉన్నారు. చప్పట్లు కొట్టమంటే అత్యుత్సాహంతో రోడ్డెక్కి గందరగోళం సృష్టించారు. ఫలితంగా తిట్లు తిన్నారు. ఏం చేస్తాం? అనాదిగా ఇటువంటి కణ్ణప్పలు మన సమాజంలో సహజంగానే ఒక భాగం. మనం వారి మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఆయన కొవ్వొత్తులు వెలిగించమన్నారు. మునుపు తిట్లు తిన్న అనుభవంతో ఇప్పుడు ఎలా చేస్తారో చూడవలసి ఉంది.

మరి కొందరు మేధావులు ఊహించినట్లు మోదీ కొవ్వొత్తులు వెలిగించమంటే ఆయన కరోనాపై పోరాటంలో అలసిపోయి ఇక నాకు చేతకాదని చేతులెత్తేసి రాజీనామా చేస్తున్నట్లు కానే కాదు.

క్రింద ఒక ఫోటో ఇస్తున్నాను చూడు. ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ ప్రజలకు కరోనా సోకిన కేసులు సరాసరి 146 ఉన్నాయి. కాని, 138 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యంత జనసమ్మర్దం కలిగిన మన దేశంలో 1 మిలియన్ ప్రజలలో సరాసరి కేసుల సంఖ్య కేవలం 1.82 గా ఉన్నదంటే అది ఎంతటి గొప్ప Crisis/Disaster Management ఊహించు. అదే ఫోటోలో మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలలో కేసుల సరాసరిని గమనించు. దేశమంతటా ఆపత్కాలంలో తనకు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయంతో మోదీ చేస్తున్న పోరాటంలోని సమర్థత అర్థమౌతుంది. చూశారా నా ఘనత అని మోదీ చెప్పుకోలేదు. దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు.

మన ప్రజలకు సహనం చాల ఎక్కువ. కాని, ఆలోచన తక్కువ. ఇంతటి కష్టకాలంలో కూడా నిత్యావసరాలకు కొఱత లేదు. కొందరికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనా వెంటనే తగిన చర్యలు తీసుకొనడం జరిగింది. కాని, పనిగట్టుకుని వ్యాధిని వ్యాపింపజేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలియడంతో ఏదో తెలియని ఆందోళనలో భయగ్రస్తులై ఉన్నారు. ఆ శక్తులను నిందిస్తే ప్రపంచప్రళయం వచ్చి సర్వనాశనం జరుగుతుంది కాబట్టి, ఎవరిని తిడితే బాగుంటుందని ప్రత్యామ్నాయం కోసం గాఢంగా ఎదురు చూస్తున్నారు. మోదీ దొరికాడు.

రామభక్తులు భారతీయులు కాజాలరు అని వివాదం రాజేయడానికి ఒక ఒవైసీ ప్రయత్నించాడు. కానీ జనాలు అతనిని చూసీ చూడనట్లు వదిలేశారు. మోదీ కొవ్వొత్తులు వెలిగించమన్నా మీద పడి తిడుతున్నారు. కొవ్వొత్తులే కదా వెలిగించమన్నది? కాని ఆయనేదో కత్తులు తీసుకుని ఎవరినో నరకమన్నంత ఘోరమైన ప్రసంగం చేసినట్లుగా భావించి ఎందుకు ఆయన మీద విరుచుకుపడుతున్నారు? ఎవడికి వాడు మహాకథకుడైై రకరకాల పిచ్చి ఊహలను సృష్టించి, అదే మోదీ ఉద్దేశమని ఆయనకు అంటగడుతున్నారు.

భారతీయత పట్ల మనసు నిండా ద్వేషం ఉంటే దాని గొప్పతనం పట్ల అసూయ ఉంటే ఎవరు ఏమన్నా దానిని ద్వేషించడం వెక్కిరించడం మనకు అలవాటైంది.

స్వచ్ఛభారత్ అంటే నవ్వారు. పరిశుభ్రత గొప్పతనం తెలుసుకోలేని లేదా చెప్పలేని మేధావులు దేశానికి ఎందుకు పనికొస్తారు?

యోగం అంటే నవ్వారు. ప్రపంచంలో ఉండే ప్రతివస్తువూ తన ఇంట్లో ఉండవలసిందే అని భావించే ఆశపోతుజనాలకు దాని గొప్పతనం ఎలా అర్థమౌతుంది?

ఇప్పుడు తన ప్రసంగంలో ఆయన ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశమంతా నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ కారణంగా ఒక వర్గంపట్ల ద్వేషాన్ని పెంటుకుంటూ ఉంటే ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి, ప్రజలలో కాస్త శాంతియుతభావాన్ని పెపొందించడానికి (కనీసం తన మాటను మన్నించేవారిలోనైనా) ఆయన అలా చెప్పినట్లు నాకు అనిపించింది.

భారతదేశానికి ఆర్థికమాంద్యం వస్తుందనే నీ ఆందోళన అర్ధం చేసుకొనదగిందే. కాని, ప్రజలంటూ క్షేమంగా ఉంటే ఆ తరువాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.

కొవ్వొత్తులు వెలిగించడం పాపకార్యమని, అది వెనుకబాటుతనానికి నిదర్శనమని, అలా చేస్తే నవ్వులపాలౌతామని ఎవరైనా భావిస్తే వారు నిరభ్యంతరంగా మానేయవచ్చు. పోలీసులు తలుపు తట్టి అరే నువ్వు ఎందుకు వెలిగించలేదురా అని వారిని బెదిరిస్తారు అనుకోను.

ఎవరి ఇంట్లోనైనా కొవ్వొత్తులు లేకుంటే వెలిగించడం మానేయండి. దానికోసం బయటకు వెళ్లి ప్రమాదంలో ఇరుక్కోకండి అని మాత్రం చెబుదాం. 

Thursday, 2 April 2020

ఒక శిష్యుని కథ – ఒక భక్తుని వ్యథ




′′గురువు గారూ, దేవుడు ఎక్కడ ఉన్నాడు?′′
గురుకులంలో చేరిన మొదటి రోజునే ఇటువంటి ప్రశ్నను వేసిన శిష్యుని చూసి ముచ్చట పడ్డారు గురువు గారు. ′′నాయనా! దేవుడు అంతటా ఉన్నాడు′′ అని సమాధానం చెప్పాడు.
′′గురువు గారూ, అంతటా అంటే ఎక్కడ?′′ అని మరుసటి రోజు ప్రశ్న.
′′అంతటా అంటే ఈ సమస్తచరాచరజగత్తులోనూ ఆయనే నిండి ఉన్నాడు.′′
′′గురువు గారూ, చరాచర అంటే?” అని మరుసటి రోజు ప్రశ్న.
“చరము అంటే కదిలేది. అచరము అంటే కదలనిది.”
“చీమ నుండి ఏనుగు దాకా అన్నీ కదులుతున్నాయి కదా గురువు గారూ, అది దేవుడేనా?” మరుసటి రోజు ప్రశ్న.
“అవును నాయనా!”
“ఈ కర్ర ముక్క కదలటం లేదు. ఆ రాతి బొమ్మ కూడా కదలటం లేదు కదా గురువు గారూ, అది దేవుడేనా?′′ మరుసటి రోజు ప్రశ్న.
′′అవును నాయనా! ′′
′′దేవుడు ఎలాంటి వాడు గురువు గారూ?′′ మరుసటి రోజు ప్రశ్న.
′′మన తల్లిదండ్రులలాంటి వాడు, మనలను రక్షించే రాజులాంటి వాడు నాయనా!′′
ఆ మరుసటి రోజు ఆ శిష్యుడు ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు.
పూజ ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా, దేవాలయపు ఏనుగు వశం తప్పింది. దారిలో నున్న ప్రతి అంగడినీ, వస్తువునూ అటూ ఇటూ విసిరివేస్తూ పరుగులెత్తడం మొదలుపెట్టింది. జనాలందరూ భయపడిపోయి దూరంగా పరుగెత్తి తప్పించుకుంటున్నారు. ఏనుగు మీద కూర్చున్న మావటివాడు చేతిలోని అంకుశంతో దానిని అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
ఇది చూసేసరికి శిష్యునికి కోపం వచ్చింది.
′′ఓయ్, మావటీ, ఆ ఏనుగును హింసించడం ఆపు. ఆ ఏనుగులో దేవుడు ఉన్నాడు′′ అంటూ దారికి అడ్డంగా నిలుచుని ఉపదేశం చేయసాగాడు.
అడ్డంగా నిలుచున్న శిష్యుని చూసేసరికి మావటివానికి తిక్క పట్టింది. ′′ఏమయ్యోవ్, తప్పుకో, పక్కకు తప్పుకో, నీకేమైనా పిచ్చా?′′ అని అరిచాడు.
′′ఏనుగులో దేవుడు ఉన్నాడు. దిగిపో. దాన్ని హింసించకు, క్షమాపణలు వేడుకో. నా మాట విను′′ అంటున్నాడు ఈ శిష్యుడు పక్కకు తప్పుకోకుండా.
′′అయ్యోవ్ సామీ, ముందు పక్కకు తప్పుకోవయ్యా. ఏనుగు అదుపులోనికి వచ్చాక అట్లే క్షమాపణలు వేడుకుంటాడులే′′ అని జనాలు కంగారు కంగారుగా అరుస్తూ చెబుతూనే ఉన్నారు.
శిష్యుడు విననే లేదు. తప్పుకోనే లేదు. దిగు, దిగు అంటూనే ఉన్నాడు.
ఏనుగు దూసుకొచ్చేసింది.
మరుసటి రోజు ఒంటినిండా వైద్యుడు కట్టిన కట్లతో ఆ శిష్యుడు ఏడ్చుకుంటూ గురువు గారి దగ్గరకు వచ్చాడు.
′′గురువు గారూ, మీరు చెప్పినదంతా అబద్ధం′′ అన్నాడు వచ్చీ రాగానే.
′′అయ్యో, ఒంటినిండా ఆ కట్లేమిటి? ఏమైంది నాయనా?′′
′′గురువు గారూ, మీరు సకలచరాచరజీవులన్నిటిలోనూ దేవుడు ఉన్నారని చెప్పారు. ′′
′′అవును. ′′
′′అది అబద్ధం. ′′
′′ఏమైంది నాయనా? ′′
′′ఏనుగు తొండంతో పట్టి విసిరేసింది′′ అంటూ శిష్యుడు జరిగిన కథ మొత్తం వివరించి చెప్పాడు. ′′ఇప్పుడు చెప్పండి గురువు గారూ, దేవుడు అనేవాడు లేడు. కనీసం ఆ ఒక్క ఏనుగులో లేడు′′ అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ.
గురువు గారికి జాలి వేసింది. ′′అయ్యో, తిక్కయ్యా, నీవు ఒక కారులో స్టీరింగు ఇది, బ్రేకు ఇది, ఆక్సిలరేటర్ ఇది, గేర్లు ఇవి అని పూర్తిగా కారు స్వరూపం తెలుసుకోకుండా, కారును సరిగా నడపలేవు. కారును సరిగా నడపడం నేర్చుకోకుండా, అసలు నీకు కారు నడపడం వచ్చునో రాదో పరీక్షించి లైసెన్సు ఇచ్చే అధికారులు కొందరు ఉంటారనే జ్ఞానం కూడా లేకుండా, నేరుగా హైవే మీదనే నడపడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరగదా? ఇప్పుడు నువు చేసిన పని కూడా అలాగే ఉంది. దేవుడు సకలచరాచరజగత్తులోనూ ఉన్నాడు అని చెప్పించుకుని, చరాచరాలు అంటే ఏమిటి అని అడిగావు కాని, సకల జగత్తు అనే రెండు పదార్థాలకు దాని అర్ధం మాత్రం నాకు తెలుసులే అనుకున్నావు. మిడిమిడిజ్ఞానంతో సాహసాలు చేశావు. అందుకే ఇలా జరిగింది.′′
′′పోనీ నేను అడగలేదు, కనీసం మీరైనా చెప్పవచ్చు గదా గురువు గారూ?′′
′′కారు లైసెన్స్ ఇవ్వడానికి కూడా కొన్ని రోజులు పడుతుంది. నువు వచ్చి వారం రోజులు కాకముందే నీకు సమస్తవేదాంతజ్ఞానం సమకూర్చాలంటే ఎలా నాయనా?′′
′′అసలు ఏమైంది? నేనేం తప్పు చేశాను గురువు గారూ?
చీమనుండి ఏనుగు వరకూ అన్నిటిలోనూ దేవుడు ఉన్నాడని మీరే చెప్పారు కదా?′′
′′అవును! చెప్పాను నాయనా! మరి ఆ చీమనుండి-ఏనుగువరకు అనే జాబితాలో నువు మావటి వాడిని ఎందుకు కలుపుకోలేదు? ఆ మిగిలిన జనాలను ఎందుకు కలుపుకోలేదు? మావటివాడిలో కూడా ఉన్న దేవుడు నిన్ను తప్పుకోమని హెచ్చరించాడా లేదా? జనాలందరిలోనూ కూడా ఉన్న దేవుడు నిన్ను తప్పుకోమని పదే పదే హెచ్చరించాడా లేదా? మరి నువ్వు ఆ దేవుని హెచ్చరికలను ఎందుకు ఖాతరు చేయలేదు?′′
శిష్యుడికి కళ్లు తెరుచుకున్నాయి. ′′నిజమే గురువు గారూ!′′
′′కర్ర ముక్కనుంచి రాతి బొమ్మవరకూ అన్నిటిలోనూ దేవుడు ఉన్నాడంటివి. మరి మావటి చేతిలోని అంకుశంలో లేడని ఎందుకు అనుకున్నావు?′′
′′నిజమే గురువు గారూ!′′ అన్నాడు శిష్యుడు బిక్కమొహం వేసి.
′′కాబట్టి నాయనా, సకలచరాచరజగత్తును నువు అర్థం చేసుకుంటే దేవుని కూడా నువు తప్పక అర్థం చేసుకోగలవు. అంతవరకూ మరీ ఇంతటి సాహసాలు చేయకురా′′ అన్నారు గురువు గారు శిష్యుని తలను నిమురుతూ.
′′అలాగే గురువు గారూ′′ అన్నాడు విధేయుడైన ఆ శిష్యుడు.
ఇది పాత కథ. ఒక శిష్యుని కథ.

}}}{{{



ఇప్పుడు ఇదో కొత్త కథ - భక్తుని వ్యథ

గజేంద్రమోక్షం కథ విన్న ఒక భక్తుడు కరోనా అంటే మొసలి, గజేంద్రుడంటే నేనే అని లాక్ డౌన్ రోజులలో కూడా విచ్చలవిడిగా తిరిగాడు.
ఫలితంగా అతడికి భూలోకంతో ఋణం తీరిపోయి పైలోకానికి పోయాడు. అక్కడ దేవుడు కనిపించాడు.
′′స్వామీ, మీరు వచ్చి నన్ను రక్షిస్తారనుకున్నాను. ఎందుకు రాలేదు?′′ అని అడిగాడు.
నారాయణుడు చిరునవ్వు నవ్వి,
′′భక్తా! నువు గజేంద్రమోక్షం చదివావు, కుయ్యాలించి సంరంభియై, గజప్రాణావనోత్సాహియై అనే పద్యాలు నీకు బాగా నచ్చాయి.
కాని నీవు కుయ్యి ఎప్పుడు చేశావు నేను ఆలించడానికి? ఆ గజం మొసలి నోట్లో లాక్ డౌన్ అయింది కాబట్టి నేను రక్షించాను. కాని, నువు స్వచ్ఛంద లాక్ డౌన్ ఎప్పుడు పాటించావు నిన్ను రక్షించడానికి?
నువు భక్తప్రహ్లాద కథ కూడా చదివావు కదా? ఇందు గలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు అనే పద్యభావాన్ని నీవు ఎందుకు స్మరించి ఆచరించలేకపోయావు?′′
′′అసలు నేను నిన్ను రక్షించడం కోసం ఎన్ని చిన్న చిన్న అవతారాలెత్తి ఎన్నెన్ని పాట్లు పడ్డాననుకున్నావ్?
ప్రధానమంత్రి రూపంలో మొదట జనతా కర్ఫ్యూ పెట్టించాను. తరువాత లాక్ డౌన్ ప్రకటించాను. కోట్లాది రూపాయల ధనాన్ని నీవంటి వారి రక్షణకోసమే కేటాయించాను.
ముఖ్యమంత్రుల రూపంలో సాధ్యమైన ప్రతి రక్షణచర్యను చేపట్టాను.
నువు బయటకు పోయే అవసరం లేకుండా వలంటీర్ల రూపంలో నీ చెంతకు నిత్యావసరవస్తువులు చేరవేశాను.
పారిశుద్ధ్యకార్మికుల రూపంలో నీవు నివసించే పరిసరాలన్నిటినీ శుభ్రం చేశాను.
నువు ప్రమాదకూపంలో పడకుండా పోలీసుల రూపంలో కాపలా ఉన్నాను.
వైద్యులరూపంలో నీకు స్వయంగా సేవ చేశాను.
ఇన్ని చేసినా సరే, నువు మాత్రం విచ్చలవిడిగా తిరిగి కోరి మరణం తెచ్చుకున్నావు′′ అని ఆ భక్తుడు చేసిన తప్పులను వివరించి చెప్పాడు.
ఇంతలో అక్కడకు యమభటులు వచ్చారు. నారాయణునికి నమస్కరించి, ′′స్వామీ, ఇతడు మీ భక్తుడు కాబట్టి, చివరిసారిగా మీ దర్శనం ఇప్పించి నరకానికి తీసుకురమ్మని యమధర్మరాజు ఆదేశం. మీరు అనుమతి ఇస్తే ఇతడిని తీసుకుపోతాం′′ అన్నారు.
భక్తుడు లబలబలాడాడు. ′′వద్దని చెప్పండి స్వామీ, వద్దని చెప్పండి స్వామీ.′′
నారాయణుడు చిరునవ్వు నవ్వి,
′′భయపడకు భక్తా! నరకమంటే మరేదో కాదు. నువు చేసిన పాపాలకు క్వారంటైన్ సెంటర్. అక్కడ నుంచి నువు హెల్త్ సర్టిఫికేట్ తెచ్చుకోకుండా నీకు వచ్చే జన్మలో సకలశ్రేయస్సులను ప్రసాదించడం నాకు సాధ్యం కాదు. అక్కడ యమధర్మరాజు రూపంలో ఉన్నది కూడా నేనే. దైర్యంగా వెళ్లిరా′′ అని చెప్పాడు.

Wednesday, 1 April 2020

రాముని మనసులోని కోరిక


1 శ్రీరాముడు విజయం సాధించాడు.


రావణసంహారం జరిగింది.
దిక్కులన్నీ ప్రసన్నమైనాయి.
లోకాలన్నీ హర్షించాయి.
మహేంద్రుని ఆనందానికి మేర లేకుండా పోయింది.
′′రామా! లోకోపకారివైన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీకు మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు. *ప్రీతియుక్తాః స్మ తేన త్వం బ్రూహి యన్మనసేచ్ఛతి. దానిని తీరుస్తాను′′ అన్నాడు.
రాముడు అందుకు చాల ఆనందపడి,
′′సురేశ్వరా! నీకు నా పట్ల ప్రీతి కలిగితే నేనడిగిన దానిని తప్పక చేయాలి. *తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠంతు వానరాః - యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఈ వానరులందరినీ తిరిగి బ్రతకాలి. కేవలం బ్రతకడమే కాదు, *నీరుజో నిర్వ్రణాంశ్చైవ సంపన్నబలపౌరుషాన్ - వీరికి గాయాలన్నీ నయమై పోవాలి. పూర్వం వలె బలపరాక్రమసంపన్నులై, ఆరోగ్యవంతులుగా వర్ధిల్లాలి. అంతే కాదు, *అకాలే చాఽపి ముఖ్యాని మూలాని చ ఫలాని చ నద్యశ్చ విమలాస్తత్ర తిష్ఠేయుర్యత్ర వానరాః – ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ వీరికి ముఖ్యాహారమైన దుంపలు, పండ్లు పుష్కలంగా లభించాలి. వీరున్న చోట నదులలో నిర్మలమైన నీరు ప్రవహించాలి′′ అని కోరుకున్నాడు.
మహేంద్రుడు చాల సంతోషించి, ′*మహానయం వరస్తాత! తస్మాదేతద్భవిష్యతి - నాయనా! నీవు చాల గొప్ప వరం అడిగావు. నీవు కోరినది తప్పకుండా జరుగుతుంది′′ అని వరం ఇచ్చేశాడు.
అపుడు మరణించిన వానరులందరూ నిద్రనుండి లేచినట్లు లేచారట. *తతః సముత్థితాః సర్వే సుప్త్వేవ హరిపుంగవాః। అందరూ ఎంతో ఆనందించారు.
2 శ్రీరాముడు అయోధ్యకు వేంచేసే దారిలో ఉన్నాడు.
ఈ విషయం ఎక్కడో ప్రయాగదగ్గర ఉన్న భరద్వాజమహర్షికి కూడా తెలిసిపోయింది. ′′అయ్యో! బలే తిక్క రాముడులే ఈయన! అంతటి మహేంద్రుడే దిగివచ్చి వరమిస్తా కోరుకోమంటే తనకోసం కాక తనవారికోసం కోరుకున్నాడే! సరే, రాముడు అయోధ్యకు తిరిగిపోయే దారిలో నా ఆశ్రమం మీదుగానే కదా పోవలసింది! అప్పుడు ఆయనకు నేను ఇంకో వరమిస్తాను′′ అని భావించాడు.
అనుకున్నట్టుగానే తన ఆశ్రమం దగ్గరకు రాముడు రాగానే, అతడిని నిలేసి ఆపేశాడు. ′′ఏమయ్యా రామా! లోకసంరక్షకుడవైన నీకు దేవతలంతటివారే వరాలిచ్చారటనే, *అహమప్యత్ర తే దద్మి వరం శస్త్రభృతాం వర - మరి నా వంతుగా నేను కూడా ఇస్తాను. కోరుకో మరి!′′ అన్నాడు.
రాముడు ఆనందించి, ′′మహాప్రసాదం స్వామీ!′′ అన్నాడు.
′′*అకాలే ఫలినో వృక్షాః సర్వే చాఽపి మధుస్రవాః।
ఫలాన్యమృతకల్పాని బహూని వివిధాని చ।।′′
′′మహామునీ, కాలం కాకపోయినప్పటికీ (సమస్త ఋతువులలోనూ) రకరకాల వృక్షాలు బాగా ఫలించాలి. వాటి పండ్లన్నీ తేనెలూరుతూ అమృతంతో సమానంగా ఉండాలి′′ అని కోరుకున్నాడు.
ఆ మాటలు విని, భరద్వాజమహర్షి ఎంతో సంతోషపడ్డాడు. ′′అయ్యో తిక్క రామా! రెండవసారి కూడా అలాగే అడిగావా? నీకోసం నీవు ఏమీ కోరుకోవుగదయ్యా! అన్నీ నిన్ను నమ్మినవారి కోసమే కోరుకుంటావు గదయ్యా! అయినా, మా పిచ్చి కాకుంటే, మా ముచ్చటను తీర్చడానికి నువు వరాలను కోరుకున్నావు గాని, నీకు మేము వరాలిచ్చేంతటివారమా?′′ అని రాముని పలు విధాల స్తుతించాడు.
అంతటి నిరాడంబరుడైన ఆశ్రితమహావత్సలుడైన రాముని అనుగ్రహం మనపై నిత్యం వర్షించుగాక!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ।
దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణాః సన్తు నిర్భయాః।।

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...