Showing posts with label Goddess. Show all posts
Showing posts with label Goddess. Show all posts

Saturday, 14 April 2018

తనదాకా వస్తే కానీ


సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు.  సీతను అపహరించజూచిన విరాధుని రామలక్ష్మణులు సంహరించారు.  శరభంగమహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు.  అక్కడ వానప్రస్థులైన వైఖానస-వాలఖిల్యాది మునులు అనేకులు రాముని సందర్శించారు.
शरभङ्गाश्रमे रामम् अभिजग्मुश्च तापसाः। (రామాయణం.3.6.6)
నాయనా, మేము దుంపలను ఫలాలను మాత్రమే భుజిస్తూ మా ధర్మాలను మేము నిర్వర్తిస్తూ ఉన్నాము.  శాస్త్రం ప్రకారం మా ధర్మఫలంలో నాల్గవభాగం మమ్మల్ని రక్షించే ప్రభువుకు చెందుతుంది.     
तत्र राज्ञश्चतुर्भागः प्रजा धर्मेण रक्षतः। (రామాయణం.3.6.14)
“కాబట్టి మా తపోధనంలో నాల్గవభాగం (25%)  మేము మీకు పన్ను కడుతున్నట్టే లెక్క.   ప్రజల ఆదాయం నుండి కనీసం ఆరవభాగం (17%) పన్నుగా స్వీకరించి కూడా ఆ ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడని ప్రభువుకు గొప్ప అధర్మం కలుగుతుంది”.
अधर्मस्तु महांस्तात भवेत्तस्य महीपतेः।
यो हरेद्बलिषड्भागं न च रक्षति पुत्रवत्।।  (రామాయణం.3.6.11)
అంటూ స్పష్టం చేశారు.  ముందరి కాళ్ళకు బంధం వేశారు.  అప్పుడు తమ బాధలను చెప్పుకున్నారు –
“రామా!  రాక్షసులు చాలామంది మునులను నిష్కారణంగా చంపేశారు.  ఇదుగో, వారి శరీరాలు దగ్గరలోనే పడి ఉన్నాయి.  వచ్చి చూడు”.
एहि पश्य शरीराणि मुनीनां भावितात्मनाम्।
हतानां राक्षसैर्घोरैः बहूनां बहुधा वने।। (రామాయణం.3.6.16)
“మేము నిన్ను శరణు కోరుతున్నాము.  ఓ వీరుడా!  నీవు తప్ప మాకు మరో దిక్కు లేదు.  మమ్మల్ని ఆ రాక్షసుల బారినుండి కాపాడు”.
రాముడు ఆ మాటలను విని ఆవేదన చెందాడు.
“అయ్యలారా!  మీరు నన్ను ఈ విధంగా వేడుకొనడం తగదు.  మీ మాటలు నాకు ఆజ్ఞగా భావిస్తాను.  మీ మాటపై ఎవరి జోలికీ పోని తపస్వులకు శత్రువులైన రాక్షసులను యుద్ధంలో చంపదలచుకున్నాను” అని మాట ఇచ్చాడు.
नैवमर्हथ मां वक्तुम् आज्ञप्तोऽहं तपस्विनाम्। (రామాయణం.3.6.21)
तपस्विनां रणे शत्रून् हन्तुमिच्छामि राक्षसान्।  (రామాయణం.3.6.25)
తరువాత సీతారామలక్ష్మణులు మరలా అరణ్యంలో సంచారం ప్రారంభించారు.  ఆ సందర్భంలో సీతమ్మ రాముని ఒక మాట అడిగింది.
“ఓ రాఘవా!  వినా వైరం రౌద్రతా (ఎటువంటి వ్యక్తిగతశత్రుత్వం లేకపోయినప్పటికీ వేరొకరిని చంపబూనడం) ఎంతవరకు సమంజసం?  దండకారణ్యంలో ఉన్న రాక్షసులతో ఎటువంటి శత్రుత్వమూ నీకు లేదు.  వారిని నీవు నిష్కారణంగా సంహరించడం నాకు ఇష్టం లేదు.
बुद्धिर्वैरं विना हन्तुं राक्षसान् दण्डकाश्रितान्।
अपराधं विना हन्तुं लोकान् वीर न कामये।।(రామాయణం.3.9.25)
“మనం ఇప్పుడు వనవాసం చేస్తున్నాం.  కాబట్టి తపస్సు మాత్రమే చేసుకోవాలి.  మళ్ళీ అయోధ్యకు వెళ్లి మీరు రాజు ఐన తరువాత మరలా క్షత్రియధర్మం పాటించుదురు గాని.
देशधर्मस्तु पूज्यताम्। (రామాయణం.3.9.28) 
भवेस्त्वं निरतो मुनिः। (రామాయణం.3.9.28)
पुनर्गत्वा त्वयोध्यायां क्षत्त्रधर्मं चरिष्यसि। (రామాయణం.3.9.28)
{అంతవరకు రాక్షసులతో యుద్ధం గిద్ధం అనే మాటలు పక్కన పెట్టండి}”
అని స్పష్టంగా చెప్పింది.
రాముడు సీతమ్మకు తగిన సమాధానమే చెప్పాడు –
हितमुक्तं त्वया देवि त्वयैवोक्तमिदं वचः।
क्षत्त्रियैर्धार्यते चापो नार्तशब्दो भवेदिति।। (రామాయణం.3.10.3/4)
“ఓ దేవీ!  ఇంతకు మునుపు నువ్వే నాతో ఒకసారి ఒక మంచి మాట చెప్పావు గుర్తుందా?  ఆర్త శబ్దం వినబడకుండా ఉండేందుకే క్షత్రియులు ధనుస్సును (ఆయుధాన్ని) ధరిస్తారు అని?” అన్నాడు.
“నీవు తప్ప మాకు వేరే దిక్కు ఎవరూ లేరు అని ఆ మునులు నాతో మొర పెట్టుకున్నారు.  వారి ఆర్తిని క్షత్రియుడనైన నేను దూరం చేయకుండా ఎలా ఉండగలను?  అందువల్లనే వారిని కాపాడతానని మాట ఇచ్చాను.  ఇపుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎలా ఉండను?  నా ప్రాణాన్నైనా వదులుకుంటాను.  నిన్నూ, లక్ష్మణుడిని కూడా  వదులుకుంటాను గాని, ఇచ్చిన మాటను మాత్రం వదులుకోలేను”.
अप्यहं जीवितं जह्यां
त्वां वा सीते सलक्ष्मणाम्
न तु प्रतिज्ञां संश्रुत्य। (రామాయణం.3.10.19)
“అసలు వారు నన్ను అడగకున్నా వారిని కాపాడటం నా కర్తవ్యం.  ఇక మాట ఇచ్చిన తరువాత మరొకవిధంగా నేను చేయలేను” అంటూ స్పష్టంగా చెప్పాడు.
||
తనదాకా వస్తే కానీ
||
అనంతరకాలంలో శూర్పణఖ సీతమీద దాడికి దిగబోయింది.  లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపించాడు.  ఆమె తన సోదరులైన ఖరదూషణత్రిశిరులను రామలక్ష్మణుల మీదికి ఉసిగొలిపింది.  రాముడు వారిని వారి పద్నాలుగు వేలమంది అనుచరులతో సహా చంపేశాడు.  అపుడు సీత భయం తొలగి ఆనందించింది.
बभूव हृष्टा जनकात्मजा। (రామాయణం.3.30.41)
ధర్మాధర్మాలు ఎలాగున్నా, తన అనుచరులను చంపినందుకు రావణుడు రామునిపై ప్రతీకారం తీర్చుకోదలిచాడు. 
కాని, “ఓ రావణా!  నువు రాముని యుద్ధంలో జయించలేవు”
न हि रामो दशग्रीव शक्यो जेतुं त्वया युधि।  (రామాయణం.3.31.27)
అని అకంపనుడు స్పష్టంగా చెప్పిన మీదట, రామునితో నేరుగా తలపడే దమ్ము రావణుడికి లేకపోయింది.  కాని, అదే అకంపనుడు రావణుడికి మరో ఉపాయం చెప్పాడు.
तस्यापहर भार्यां त्वं प्रमथ्य तु महावने।
सीतया रहितः कामी रामो हास्यति जीवितम्।। (రామాయణం.3.31.31)
“రావణా!  రాముని ఎలాగైనా మోసం చేసి, అతని భార్య ఐన సీతను ఎత్తుకొచ్చేయ్.  కామాత్ముడైన రాముడు సీత లేకపోయేసరికి ప్రాణాలు వదిలేస్తాడు’’ అని చెప్పాడు.
రావణుడికి ఆ మాట నచ్చింది. 
अरोचयत तद्वाक्यं रावणो राक्षसाधिपः। (రామాయణం.3.31.32)
చివరకు రావణుడు అలాగే చేశాడు. మారీచుడితో కలసి మాయను పన్ని, సీతను ఎత్తుకొచ్చేశాడు.  వారి పన్నాగం దాదాపు ఫలించినట్టే అనిపించింది.  సీత కనబడకపోయేసరికి రాముడికి మతి పోయినంత పనైంది.  పాపం ఏడిచాడు.  సీత ఏదీ ఏదీ అని కనిపించిన చెట్టు పుట్టలను అడిగాడు.  పక్షులను జంతువులను అడిగాడు.  ఆమె ఎటువంటి బాధలు పడుతోందో అని వగచాడు.  కానీ, ఆ బాధ త్వరలోనే కోపంగా మారింది.
సీతను ఎత్తుకుపోయింది వీరే అని ఎవరిమీదనైనా అనుమానం వస్తే వారిమీదకు కోపంతో ఉరకబోయాడు.  నన్ను చేతగానివాడని భావిస్తున్నారేమో!
निर्वीर्य इति मन्यन्ते नूनं माम्। (రామాయణం.3.64.57)
“సీత క్షేమంగా ఉండకపోతే నా బాణాలతో ముల్లోకాలకూ మర్యాదలు లేకుండా చేస్తాను.  (సరిహద్దులనేవి లేకుండా ధ్వంసం చేసి పారేస్తాను.)” అనేంతవరకూ పోయాడు.
निर्मर्यादान् इमान् लोकान् करिष्याम्यद्य सायकैः। (రామాయణం.3.64.71)
చివరకు తన కోపాన్ని సక్రమమైన మార్గంలోనికి మలిచాడు.  సుగ్రీవునితో స్నేహం చేశాడు.  అతడు పోగొట్టుకున్న రాజ్యం అతనికి వచ్చేలా చేశాడు.  హనుమంతుడు సీతమ్మ ఎక్కడ ఉన్నదో వెతుకుతూ లంకకు చేరుకున్నాడు.  అశోకవనంలో ఆమెను చూశాడు.  “తల్లీ, నువు నాతో వస్తే నిన్ను రాముని వద్దకు చేరుస్తాను” అన్నాడు.
కాని, సీతమ్మ అందుకు ఒప్పుకోలేదు.  “అలా కాదు” అన్నది.
यदि रामो दशग्रीवम् इह हत्वा सबान्धवम्।
मामितो गृह्य  गच्छेत तत् तस्य सदृशं भवेत्।। (రామాయణం.3.37.64)
“రాముడు స్వయంగా వచ్చి, ఈ రావణాసురుడిని అతడి బంధువులందరితో సహా చంపి, నన్ను సగౌరవంగా ఇక్కడినుండి తీసుకుని పోతే అది అతని బలపరాక్రమాలకు తగిన విధంగా ఉంటుంది” అన్నది.

చివరకు రామునికి అంతపని చేయక తప్పలేదు.  అందుకే, తనదాకా వస్తే గాని, ఒక ఆదర్శంలో ఔచిత్యం తెలియదని పెద్దలు అంటారు.
{భక్తులకు గమనిక – ఈ సందర్భంలో సీతమ్మ వారిని సాధారణ మానవస్త్రీ గా మాత్రమే పరిగణించి ఈ వ్యాసము వ్రాయడమైనది.) 


Monday, 26 December 2016

చెప్పండయ్యా చెప్పండి సమాజాన్ని ఉద్ధరించండి (6)

చెప్పండయ్యా చెప్పండి
సమాజాన్ని ఉద్ధరించండి
(6)


"ఆబ్రహ్మకీటజననీ"
లలితాసహస్రనామాలలో నాకు అన్నిటికంటె బాగా నచ్చిన పేరు ఇదే!
బ్రహ్మ మొదలుకొని ఓ కీటకం వరకు అందరూ ఆమె సంతానమట! 
<><><><><><>

భారతీయుల విగ్రహారాధన ప్రతీకాత్మకమైనదని, ఊహాతీతమైన దైవానికి నామరూపాలనాపాదించి కొలవడం భారతీయుల ఆరాధనపద్ధతుల్లో ఒకటని ఈ పేరు నిశ్చప్రచంగా మనకు సూచిస్తుంది.

అందరికీ తల్లి అయిన ఆ దేవతకు మనుషుల్లాగ ఒక ముఖము ఒక నోరు రెండు కళ్లు రెండు చేతులు రెండు కాళ్లు పెట్టి ఒక ఆకారాన్ని ఒక పేరును కల్పించి కొలవడం ఎటువంటిదంటే, ఒక మ్యాపును చూపించి ఇదే భారతదేశం అని బోధించడం వంటిది. 

ఆ మ్యాపును బాగా అర్థం చేసుకున్నవాడు దేశంలో ఎక్కడనుండి ఎక్కడకైనా సులువుగా ప్రయాణించగలడు. 

ఆ మ్యాపును దగ్గరగా పెట్టుకుంటే పొరపాటున దారి తప్పినా మరలా సరైన దారిని కనుక్కోవచ్చు. 

దిక్కులు దూరం etc. తెలుసుకొనేందుకు ఉపయోగపడే దిక్సూచి టెలిస్కోపు వంటి సాధనాలే భక్తి ధ్యానం పూజలు మొదలైనవి. ఆయా instruments దగ్గరున్నా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనివారికి అవి కేవలం బరువు దండగనిపించవచ్చు. వాటిని పారేసి పోదామనుకుంటారు. వాటి ప్రయోజనము ఉపయోగము ఒక్కసారైనా తెలుసుకున్నవారికి వాటి విలువ మరింతగా తెలుస్తుంది.

దేశమంతా ప్రత్యక్షంగా తెలిసినవారికి మరిక మ్యాపులు వంటివి అవసరం లేవు. అందుకే సన్న్యాసులకు సంధ్యావందనాదులు అవసరం లేదని శాస్త్రము చెప్పాయి కూడా. కాని క్రొత్తగా explore చేద్దామని బయలుదేరిన వారికి రకరకాల సాధనకు (సాధనాలు) అవసరపడతాయి. 

రాత్రి ఓ బస్సో రైలో ఎక్కి హాయిగా కళ్లు మూసుకుని నిద్ర పోయి, పొద్దున మళ్లీ కళ్లు తెరిచేసరికి గమ్యస్థానంలో ఉంటాం కదా మరెందుకిక మ్యాపులూ గీపులూ అనేవారున్నారు. వారు ధన్యులనే సమాధానం. ఆశ్రయించిన శిష్యులను అనుగ్రహించి సాక్షాత్తుగా దైవానుభూతిని కలిగించే సద్గురువులను గూర్చి వింటూ ఉంటాం కదా? ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అలాంటివారే అనుకుందాం. :-) 

కాని ఆ సద్గురువులైనా ఆ డ్రైవర్లైనా తమకు తెలియని క్రొత్త తత్త్వానికో క్రొత్త గమ్యానికో చేర్చాలంటే మరలా ఈ మ్యాపులను, మైలురాళ్లను, ఊరి పేర్లు దిక్కులను సూచించే బోర్డులను జాగ్రత్తగా చూసుకుంటూ అవి సూచిస్తున్నట్లు పోవలసిందే! 

క్రొత్త కారులో జోరుజోరుగా వెళ్లేవారు కూడా ఈ మధ్య GPRS చెప్పినట్టు పోతున్నారు కదా! విమానాల్లోనూ విలాసనౌకల్లోనూ ఖండాంతరాలు దాటిపోయేవారికి ఇటువంటి సాధనాలు మరింత మరింత అవసరం.
<><><><><><>

కాబట్టి భారతీయుల విగ్రహారాధన అనేది సులువుగా దైవతత్త్వాన్ని అవగాహన చేసుకొని ఆ పరమార్థాన్ని త్వరగా అందుకొనేందుకు చేసే ప్రయత్నమే గాని మూర్ఖత్వం కాదు. విగ్రహాలను ధ్వంసం చేసి దేవుని ధ్వంసం చేశామని అహంకరించినవారు ~ మ్యాపును చింపేసి దేశాన్ని నాశనం చేశామనుకొనేవారికంటే పెద్ద తెలివైనవారు కారు. ఒక మ్యాపును చింపేస్తే మరో వంద మ్యాపులను తయారుచేసుకోవచ్చు.

కాని విగ్రహంలో మాత్రమే దేవుడున్నాడని కొలిచేవారు కూడా దేశాన్ని గాలికొదిలి మ్యాపుకు దండాలు పెట్టేవారికంటె పెద్ద గొప్పవాళ్లేం కాదు.
<><><><><><>

దేశం ఎక్కడ ఉంది? అని విచికిత్స చేస్తామా? 
మన ఇంట్లో దేశం ఉంది.
మన వీధిలో దేశం ఉంది.
మన కాలనీలో దేశముంది. 
మన ఊరిలో దేశముంది.
మన నియోజకవర్గంలో దేశముంది.
మన జిల్లాలో దేశముంది.
మన రాష్ట్రంలో దేశముంది.
......
ఇలా అనుకొనడం పిచ్చి కదా?
వీటిలో దేశముండడమేమిటి?
దేశంలోనే కదా ఇవన్నీ ఉన్నాయి?
......
దేశం దేశమంతటా ఉంది.
కదా?
......
అలాగే 
దేవుడెక్కడున్నాడు అని విచికిత్స చేసినా ఇదే పద్ధతి.
ఆ దేవుడు చెట్టులోనూ ఉన్నాడు.
పుట్టలోనూ ఉన్నాడు.
కొండలోనూ ఉన్నాడు.
విగ్రహంగా మారిన బండలోనూ ఉన్నాడు.
ప్రతి మనిషిలోనూ ఉన్నాడు 
అని ఏదో అర్థం చేసుకోలేని చిన్న పిల్లలకు చెప్పాలి.
కాని,
అసలు ఆ దేవునిలోనే ఈ చరాచరప్రపంచం ఉందనేది అసలు నిజం.
......
అనుభవైకవేద్యమని శాస్త్రాలు ఘోషించే అంతు తెలియని ఆ అవ్యయతత్త్వానికి ఈ విధంగా దేవుడు అని లింగవచనవిభక్తులు చేర్చడం, రూపాదులు కల్పించడం ఎటువంటిదంటే - గణితశాస్త్రంలో తెలుసుకొనవలసిన విషయాన్ని మొదటగా - X అనుకొనుము అంటూ చెప్పే పద్ధతి వంటిది మాత్రమే.
.......
1 నుండి మొదలు పెట్టి అనంతంగా ఎన్ని సంఖ్యలు చెప్పినా ప్రతి సంఖ్యలోనూ 1 అనే సంఖ్య ఉండి తీరుతుంది. ఎన్ని 1 లు కలిస్తే అంత పెద్దసంఖ్యగా మనం పరిగణిస్తాం కదా? కాబట్టి సంఖ్యాశాస్త్రంలో 1 సర్వాంతర్యామి.

అలాగే ఈ అంతు తెలియని విశ్వంలో "దేవ" అనే తత్త్వం సర్వాంతర్యామి.

ఆ దేవతత్త్వంలో అమ్మతనం కూడా ఒక అంశం.
అమ్మతనం మనను కడుపున మోసి కన్నతల్లిలో ఉంది. జత చేసిన ఫోటోలో చూపినట్లు - ఆ గాడిదలోనూ ఉంది, కోతిలోనూ ఉంది, ఆవులోనూ ఉంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే అని తెలుసుగా? అటువంటి అమ్మతనం సర్వాంతర్యామిగా ఉంది. అందుకే అమ్మతనాన్ని దేవతానామాల్లో చేర్చారు పెద్దలు. 

ఆబ్రహ్మకీటజననీ - బ్రహ్మ మొదలుకొని కీటకం వరకూ అందరికీ - మనందరికీ - తల్లి అయిన - ఆమెకు నమస్కారాలు.

<><><><><><>
కాబట్టి, 
ఊసుపోని కబుర్లాపి
నిజతత్త్వాన్ని ప్రజలకు బోధించండి స్వాములూ! 
మన సంస్కృతి మీద సరైన అవగాహనను కల్పించండి! 
మన సదాచారాలను జనాలు సగర్వంగా పాటించేలా కువిమర్శలు చేసే వారి నోళ్లను జనాలే స్వయంగా మూయించగలిగేలా జ్ఞానబోధ చేయండి.

చెప్పండయ్యా చెప్పండి.
సమాజాన్ని ఉద్ధరించండి.
<><><><><><>

అందరికీ Mothers Day సందర్భంగా శుభాకాంక్షలు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...