Monday 26 December 2016

చెప్పండయ్యా చెప్పండి సమాజాన్ని ఉద్ధరించండి (6)

చెప్పండయ్యా చెప్పండి
సమాజాన్ని ఉద్ధరించండి
(6)


"ఆబ్రహ్మకీటజననీ"
లలితాసహస్రనామాలలో నాకు అన్నిటికంటె బాగా నచ్చిన పేరు ఇదే!
బ్రహ్మ మొదలుకొని ఓ కీటకం వరకు అందరూ ఆమె సంతానమట! 
<><><><><><>

భారతీయుల విగ్రహారాధన ప్రతీకాత్మకమైనదని, ఊహాతీతమైన దైవానికి నామరూపాలనాపాదించి కొలవడం భారతీయుల ఆరాధనపద్ధతుల్లో ఒకటని ఈ పేరు నిశ్చప్రచంగా మనకు సూచిస్తుంది.

అందరికీ తల్లి అయిన ఆ దేవతకు మనుషుల్లాగ ఒక ముఖము ఒక నోరు రెండు కళ్లు రెండు చేతులు రెండు కాళ్లు పెట్టి ఒక ఆకారాన్ని ఒక పేరును కల్పించి కొలవడం ఎటువంటిదంటే, ఒక మ్యాపును చూపించి ఇదే భారతదేశం అని బోధించడం వంటిది. 

ఆ మ్యాపును బాగా అర్థం చేసుకున్నవాడు దేశంలో ఎక్కడనుండి ఎక్కడకైనా సులువుగా ప్రయాణించగలడు. 

ఆ మ్యాపును దగ్గరగా పెట్టుకుంటే పొరపాటున దారి తప్పినా మరలా సరైన దారిని కనుక్కోవచ్చు. 

దిక్కులు దూరం etc. తెలుసుకొనేందుకు ఉపయోగపడే దిక్సూచి టెలిస్కోపు వంటి సాధనాలే భక్తి ధ్యానం పూజలు మొదలైనవి. ఆయా instruments దగ్గరున్నా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనివారికి అవి కేవలం బరువు దండగనిపించవచ్చు. వాటిని పారేసి పోదామనుకుంటారు. వాటి ప్రయోజనము ఉపయోగము ఒక్కసారైనా తెలుసుకున్నవారికి వాటి విలువ మరింతగా తెలుస్తుంది.

దేశమంతా ప్రత్యక్షంగా తెలిసినవారికి మరిక మ్యాపులు వంటివి అవసరం లేవు. అందుకే సన్న్యాసులకు సంధ్యావందనాదులు అవసరం లేదని శాస్త్రము చెప్పాయి కూడా. కాని క్రొత్తగా explore చేద్దామని బయలుదేరిన వారికి రకరకాల సాధనకు (సాధనాలు) అవసరపడతాయి. 

రాత్రి ఓ బస్సో రైలో ఎక్కి హాయిగా కళ్లు మూసుకుని నిద్ర పోయి, పొద్దున మళ్లీ కళ్లు తెరిచేసరికి గమ్యస్థానంలో ఉంటాం కదా మరెందుకిక మ్యాపులూ గీపులూ అనేవారున్నారు. వారు ధన్యులనే సమాధానం. ఆశ్రయించిన శిష్యులను అనుగ్రహించి సాక్షాత్తుగా దైవానుభూతిని కలిగించే సద్గురువులను గూర్చి వింటూ ఉంటాం కదా? ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అలాంటివారే అనుకుందాం. :-) 

కాని ఆ సద్గురువులైనా ఆ డ్రైవర్లైనా తమకు తెలియని క్రొత్త తత్త్వానికో క్రొత్త గమ్యానికో చేర్చాలంటే మరలా ఈ మ్యాపులను, మైలురాళ్లను, ఊరి పేర్లు దిక్కులను సూచించే బోర్డులను జాగ్రత్తగా చూసుకుంటూ అవి సూచిస్తున్నట్లు పోవలసిందే! 

క్రొత్త కారులో జోరుజోరుగా వెళ్లేవారు కూడా ఈ మధ్య GPRS చెప్పినట్టు పోతున్నారు కదా! విమానాల్లోనూ విలాసనౌకల్లోనూ ఖండాంతరాలు దాటిపోయేవారికి ఇటువంటి సాధనాలు మరింత మరింత అవసరం.
<><><><><><>

కాబట్టి భారతీయుల విగ్రహారాధన అనేది సులువుగా దైవతత్త్వాన్ని అవగాహన చేసుకొని ఆ పరమార్థాన్ని త్వరగా అందుకొనేందుకు చేసే ప్రయత్నమే గాని మూర్ఖత్వం కాదు. విగ్రహాలను ధ్వంసం చేసి దేవుని ధ్వంసం చేశామని అహంకరించినవారు ~ మ్యాపును చింపేసి దేశాన్ని నాశనం చేశామనుకొనేవారికంటే పెద్ద తెలివైనవారు కారు. ఒక మ్యాపును చింపేస్తే మరో వంద మ్యాపులను తయారుచేసుకోవచ్చు.

కాని విగ్రహంలో మాత్రమే దేవుడున్నాడని కొలిచేవారు కూడా దేశాన్ని గాలికొదిలి మ్యాపుకు దండాలు పెట్టేవారికంటె పెద్ద గొప్పవాళ్లేం కాదు.
<><><><><><>

దేశం ఎక్కడ ఉంది? అని విచికిత్స చేస్తామా? 
మన ఇంట్లో దేశం ఉంది.
మన వీధిలో దేశం ఉంది.
మన కాలనీలో దేశముంది. 
మన ఊరిలో దేశముంది.
మన నియోజకవర్గంలో దేశముంది.
మన జిల్లాలో దేశముంది.
మన రాష్ట్రంలో దేశముంది.
......
ఇలా అనుకొనడం పిచ్చి కదా?
వీటిలో దేశముండడమేమిటి?
దేశంలోనే కదా ఇవన్నీ ఉన్నాయి?
......
దేశం దేశమంతటా ఉంది.
కదా?
......
అలాగే 
దేవుడెక్కడున్నాడు అని విచికిత్స చేసినా ఇదే పద్ధతి.
ఆ దేవుడు చెట్టులోనూ ఉన్నాడు.
పుట్టలోనూ ఉన్నాడు.
కొండలోనూ ఉన్నాడు.
విగ్రహంగా మారిన బండలోనూ ఉన్నాడు.
ప్రతి మనిషిలోనూ ఉన్నాడు 
అని ఏదో అర్థం చేసుకోలేని చిన్న పిల్లలకు చెప్పాలి.
కాని,
అసలు ఆ దేవునిలోనే ఈ చరాచరప్రపంచం ఉందనేది అసలు నిజం.
......
అనుభవైకవేద్యమని శాస్త్రాలు ఘోషించే అంతు తెలియని ఆ అవ్యయతత్త్వానికి ఈ విధంగా దేవుడు అని లింగవచనవిభక్తులు చేర్చడం, రూపాదులు కల్పించడం ఎటువంటిదంటే - గణితశాస్త్రంలో తెలుసుకొనవలసిన విషయాన్ని మొదటగా - X అనుకొనుము అంటూ చెప్పే పద్ధతి వంటిది మాత్రమే.
.......
1 నుండి మొదలు పెట్టి అనంతంగా ఎన్ని సంఖ్యలు చెప్పినా ప్రతి సంఖ్యలోనూ 1 అనే సంఖ్య ఉండి తీరుతుంది. ఎన్ని 1 లు కలిస్తే అంత పెద్దసంఖ్యగా మనం పరిగణిస్తాం కదా? కాబట్టి సంఖ్యాశాస్త్రంలో 1 సర్వాంతర్యామి.

అలాగే ఈ అంతు తెలియని విశ్వంలో "దేవ" అనే తత్త్వం సర్వాంతర్యామి.

ఆ దేవతత్త్వంలో అమ్మతనం కూడా ఒక అంశం.
అమ్మతనం మనను కడుపున మోసి కన్నతల్లిలో ఉంది. జత చేసిన ఫోటోలో చూపినట్లు - ఆ గాడిదలోనూ ఉంది, కోతిలోనూ ఉంది, ఆవులోనూ ఉంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే అని తెలుసుగా? అటువంటి అమ్మతనం సర్వాంతర్యామిగా ఉంది. అందుకే అమ్మతనాన్ని దేవతానామాల్లో చేర్చారు పెద్దలు. 

ఆబ్రహ్మకీటజననీ - బ్రహ్మ మొదలుకొని కీటకం వరకూ అందరికీ - మనందరికీ - తల్లి అయిన - ఆమెకు నమస్కారాలు.

<><><><><><>
కాబట్టి, 
ఊసుపోని కబుర్లాపి
నిజతత్త్వాన్ని ప్రజలకు బోధించండి స్వాములూ! 
మన సంస్కృతి మీద సరైన అవగాహనను కల్పించండి! 
మన సదాచారాలను జనాలు సగర్వంగా పాటించేలా కువిమర్శలు చేసే వారి నోళ్లను జనాలే స్వయంగా మూయించగలిగేలా జ్ఞానబోధ చేయండి.

చెప్పండయ్యా చెప్పండి.
సమాజాన్ని ఉద్ధరించండి.
<><><><><><>

అందరికీ Mothers Day సందర్భంగా శుభాకాంక్షలు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...