Tuesday 6 December 2016

రామాయణం చదవండి. రామాయణం చదివించండి

ఏం? ఎందుకు చదవాలి? ఏమిటి ప్రయోజనం అని అడుగుతారా? 

సరే - ఓపికగా ఈ పోస్టునైనా చదవండి.
నచ్చిందనుకోండి - తప్పక చదవండి.

నచ్చలేదనుకోండి -
ఈ బచ్చా మనకు చెప్పేదేమిటి, 

మనమే స్వయంగా చదువుదాం అని చదవండి.

కాని, చదవటం, చదివించటం మాత్రం మానకండి. 

వాల్మీకి రామాయణం చదివితే - 


ఈ లోకంలో ఎలా ఉండాలి - ఎలా ఉండకూడదు అని తెలుస్తుంది. 

విజేతల లక్షణాలు - పరాజితుల పొరబాట్లు తెలుస్తాయి. 

అనుకున్నది నేరవేరనంత మాత్రాన నిరాశతో ప్రాణాలు తీసుకునే బలహీనత తొలగి పోతుంది. 

ఏ విధంగా మంచి మిత్రులను సంపాదించాలో, శత్రువులను ఏ విధంగా జయించాలో తెలుస్తుంది. 

వెనుకంజ వేయడమంటే విరమించుకొనడం కాదని తెలుస్తుంది. 

తల్లిదండ్రులు, కుమారులు, సోదరులు, భార్యాభర్తలు, రాజులు, అధికారులు, ప్రజలు, మేధావులు, శాస్త్రవేత్తలు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో తెలియజేస్తుంది. 

అబ్బో, నేను చెప్పలేనన్ని లాభాలు ఉన్నాయి. 

మచ్చుకు ఒక ఉదాహరణ -
ఈ లోకంలో విజేత లక్షణాలు ఇలా ఉంటాయి - 
(కోSన్వస్మిన్ సాంప్రతం లోకే?)

<><><><><><>

1 గుణవంతుడు

ఆదర్శగుణాలంటే ఇవీ అని వాల్మీకి మహర్షులవారు 16 గుణాలను ఎంచుకున్నారు. అంతటి గుణవంతువడెవరైనా మన కాలంలో ఉన్నాడా చెప్పండి స్వామీ అనగానే నారదమహర్షి పులకరించిపోయి లేకేమయ్యా? 
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః 
అని మొదలు పెట్టి అంతకంటే మరిన్ని శుభగుణాలు కూడా రామునిలో ఉన్నాయని నిరూపించాడు.

2 వీరుడు 
రావణుడూ వీరుడే. 
కాని అతని వీరత్వం పరపీడకు ఉపయోగపడింది.
పరశురాముడు వీరుడే.
కాని ఆయనకు ఆత్మసంయమనం లేకపోయింది. 
విశ్వామిత్రుడూ వీరుడే. 
కాని ఆయన వశిష్ఠుని ఆవును లాక్కునేందుకు ప్రయత్నించాడు. 
కాని వీరత్వం సఫలమైనది లోకకంటకులనుండి దుష్టులనుండి ప్రజలను కాపాడిన రామునిలోనే.

3 ధర్మాత్ముడు
తండ్రి మాటకేనా నువు విలువ ఇచ్చేది? 
తల్లిని నేను చెబుతున్నాను. 
నువు అడవికి పోవద్దు. 
అయోధ్యలోనే ఉండు అని కౌసల్యమ్మ రాముడితో గట్టిగానే చెప్పింది. 
రాముడి స్థానంలో ఇంకొకరు ఉంటే ఏమి జరిగి ఉండేదో అనూహ్యం. 
కాని తల్లికి కూడా ధర్మాన్ని వివరించి అడవిని బయలుదేరాడు మా రాముడు!

రాముడంటే ఏమనుకున్నావయ్యా! 
అతడు రూపు దాల్చిన ధర్మం తెలుసా? 
అని మారీచుడు రావణాసురుణ్ణి హెచ్చరించాడు.
మొదట్లో రాముని నిందించిన వాలి కూడా చివరకు - 
న దోషం రాఘవేంద్ర దధ్యౌ - రాముడు దోషరహితుడని తెలుసుకున్నాడు. నిందించడం పొరబాటే అని ఒప్పుకొని, నువు దృష్టార్థతత్త్వజ్ఞుడవు అని ప్రశంసించాడు.

4 కృతజ్ఞుడు

రావణాసురుని పీడను వదిలించినందుకు ఏమి వరం కావాలో కోరుకో 
అని భరద్వాజమహర్షి అంటే 
తనకు ఎంతో సహాయం చేసిన వానరులు ఎక్కడ ఉన్నా 
అక్కడ వారికి మధురసపూర్ణాలైన ఫలాలు లభించేలా అనుగ్రహించమని కోరుకున్నాడా రాముడు.

5 సత్యవాక్కు
కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే - 
"ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. 
నేను చెప్పింది చేసి తీరుతాను.
రాముడు రెండు రకాల మాటలాడడు" 
అని రాముడే స్వయంగా ఉద్ఘోషించాడు.
ఆడిన మాట తప్పటం అనేది ఆయన జాతకంలోనే లేదు.

6 దృఢసంకల్పుడు 
తండ్రికిచ్చిన మాట ప్రకారం పద్నాలుగేళ్లు అడవుల్లోనే ఉంటాను అని రాముని సంకల్పం.
తరువాత భరతుడు వచ్చి బ్రతిమలాడినా, 
కైకేయి నేను చేసింది తప్పే నాయనా అన్నా, 
వశిష్ఠాదిపురోహితులు మరలా వెనుకకు వచ్చి పట్టాభిషేకం చేసుకోనడంలో తప్పు లేదన్నా, 
తల్లి తన కన్నీళ్ళతో మనసును కరిగించే ప్రయత్నం చేసినా, 
అతని సంకల్పం చెక్కు చెదరలేదు!
పద్నాలుగు సంవత్సరాల తరువాతనే తిరిగి అయోధ్యకు వచ్చాడు! 

7 సచ్చరిత్రుడు
సదాచారాన్ని పాటించడమే సచ్చరిత్రం. 
సత్యంతో లోకాలను, 
దీనులను దానంతోను, 
వినయంతో గురువులను, 
శత్రువులను ఆయుధంతోను 
మెప్పించినవాడు జయించినవాడు శ్రీరాముడు.

8 సర్వభూతహితైషి (లోకాన్ని ప్రేమించే తత్త్వం) 
రావణుడి పీడకు గురి కానివారు లేరు, 
రాముని ప్రేమకు సంతోషించనివారు లేరు. 
"మా రాముడు మాకు కష్టం కలిగితే తనకు కలిగినట్లే బాధపడతాడు. 
మేము ఉత్సవం చేసుకుంటే పిల్లవాని ఉత్సాహం చూసి సంతోషపడే తండ్రిలా ఉంటాడు" అని అయోధ్యప్రజల ఫీడ్ బ్యాక్ రిపోర్టు.

9 విద్వాంసుడు
వశిష్ఠుని శిష్యరికంలో వేదశాస్త్రాలను రాజనీతిని ధనుర్వేదంతో సహా అధ్యయనం చేశాడు రాముడు. 
విశ్వామిత్రుని శిష్యరికంలో సకలదివ్యాస్త్రసంపన్నుడైనాడు.

10 కార్యసాధకుడు 
విశ్వామిత్రుని యాగాన్ని రక్షించాడు. 
సుగ్రీవునికి రాజ్యాన్ని సాధించి పెట్టాడు. 
సముద్రంపై సేతువును కట్టించాడు. 
దేవదుస్సాధ్యుడైన రావణుడిని కూడా జయించివేశాడు శ్రీరాముడు.

11 ప్రియదర్శనుడు
రావణుడు భయదర్శనుడు. 
రాముడు ప్రియదర్శనుడు. 
నిండు చంద్రునిలా తన దర్శనమాత్రం చేతనే అందరిలోనూ ఆనందం కలుగజేసేవాడు. అందుకే శ్రీరామచంద్రుడు. 
ఆ రాముడు రాజమార్గాన వెడుతుంటే 
ఆయనను చూడాలని ప్రజలు తహతహలాడేవారట. 
అతడు తమను చూస్తే చాలు ధన్యులయ్యామని పొంగిపోయేవారట. 
రాముణ్ణి చంపమని అన్నను అడగటానికి వచ్చిన శూర్పణఖ కూడా 
ఆ రాముని దర్శనం వలన తనలో కలిగిన ఆనందాన్ని రావణుడి ముందు దాచలేకపోయింది పాపం.

12 ఆత్మవంతుడు
విశ్వామిత్రుడి వెంట పో! - సరే నాన్నగారూ.
ఈ తాటకిని చంపవోయ్! - సరే గురువుగారూ. 
అడవులకు పో! - సరేనమ్మగారూ.
రావణాసురుడి పీడను వదిలించాలయ్యా! - అలాగే మహర్షిసత్తమా.
ఇలా అందరూ ఏమి చెబితే దానికి సరే సరేనంటూ తల ఊపిన రాముడు 

ఆ చెప్పినవారందరికంటె గొప్పవాడనిపించుకొనడం గొప్ప కాదూ? 
అలాంటివారినే మహాత్ముడంటాం.

13 జితక్రోధుడు 
కోపం ఎవరికి రాదు? 
తన కోపమె తన శత్రువు అన్నారు కదా? 
కాని కోపాన్ని తన అదుపులో ఉంచుకుని దానిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ మాత్రమే, అది కూడా తగినంత మోతాదులో ఉపయోగించడమే anger management. 
వారే నిగ్రహానుగ్రహసమర్థులు కాగలరు. 
లక్ష్మణుడికి తండ్రి మీద కోపం. 
భరతునికి తల్లి మీద కోపం. 
శత్రుఘ్నునికి మంథర మీద కోపం. 
కాని 

అందరూ ఆ కోపాన్ని చేతల్లోకి మారిస్తే 
రాముడు మమ్మల్ని దూరం పెట్టేస్తాడనే భయంతో వారి వారి కోపాలను అదుపులో పెట్టుకున్నారు. 
అదీ రాముడి గొప్పతనం.
"మరణాంతాని వైరాణి" అంటూ 

రావణుడు చేసిన వెధవపని మీదనే తన కోపం తప్ప 
రావణుడి మీద కాదంటూ నిరూపించుకున్న శ్రీరాముడు ఆదర్శమూర్తి.

14 తేజస్వి
ఏమిటి రాముని గొప్ప? 
ఏమిటి నాలో తక్కువ? 
అని రావణుడడిగితే 
నువు దేవతలను బలంతో జయించి వారిని భయపెట్టావు. 
కాని రాముడు ఆ దేవతలను ధర్మంతో జయించి వారినుండి ప్రశంసలనందుకుంటున్నాడు - 
అని ఒక్క మాటతో తేల్చిపడేసింది సీతమ్మ.

ఇద్దరూ మహాతేజోవంతులే! 
కాని, రాముని ముందు ఆ విధంగా రావణుడు దిగదుడుపే!

15 అసూయారహితుడు
గుణవంతునిలో కూడా తప్పు వెదకడం అసూయ. 
ఆడదాని దెబ్బకు రాజ్యం వదులుకుని వచ్చిన పిరికివాడు రాముడని 
రావణాసురుడు వెక్కిరించాడు.
కాని రావణుని యుద్ధరంగంలో చూసిన రాముడు మాత్రం 
"అహో దీప్తో మహాతేజా రావణో రాక్షసేశ్వరః" అంటూ ప్రశంసించాడు. 
అదీ - రాముని గొప్పతనం.

16 యుద్ధభీకరుడు
రావణుడు కూడా మహాపరాక్రమవంతుడు. 
కాని అతడు గెలిచి సర్వలోకాలనూ నానా హింసలకు గురి చేశాడు. 
అత్యంత ప్రతాపశాలి అయిన రాముడో? 
లోకాన్ని సంతోషపెట్టేందుకు తన తనదైన సర్వస్వాన్ని వదులుకొనగల త్యాగశీలి. 

అందువల్ల, 
అలాంటి రామరావణులు చండప్రచండమైన యుద్ధం చేస్తూ ఉంటే - 
"జయతాం రాఘవః సంఖ్యే రావణం రాక్షసేశ్వరమ్" 
అని గంధర్వసిద్ధోరగఋషికిన్నరాదిగణాలన్నీ శ్రీరాముని విజయాన్నే కోరుకున్నాయట. 

<><><><><><>

అలా అందరూ లోకవిజేత కావాలని కోరుకుంటారు కదా! 

1 ఒకసారి ఎంబీయే పుస్తకాలు తిరగవేయండి - మంచి మేనేజరు ఎలా ఉండాలి అంటే - ఆధునిక పద్ధతిలో రాముడికి ఉన్న లక్షణాల్లో కనీసం సగం లక్షణాలను అవి పేర్కొని ఉంటాయి. 

2 మాకియవెల్లి రాజనీతి పుస్తకాలు తిరగవేయండి - రాముడి లక్షణాలనే కొన్నింటిని ఆయన పేర్కొన్నాడు.

3 ఓ గొప్ప సైంటిస్టు ఆత్మకథను ఒక సారి చదవండి - వైదుష్యం, కార్యసాధకత్వం, అసూయారాహిత్యం వంటి రాముని గుణాలు ఉంటాయి.

4 ఓ గొప్ప కమ్యూనిస్టు యోధుడి ఆత్మకథను చదవండి - పోరాటాలకు వెరవని నిర్భయవీరత్వం, దృఢసంకల్పం, లోకాన్ని ప్రేమించే తత్త్వం ఉంటాయి. 

కాబట్టి, రాముడంటే ఎవరో కాదు, మీరు కావాలనుకుంటున్న వ్యక్తిత్వం ఎలా ఉండాలో ప్రాక్టికల్ పాఠాలు చెప్పగల ఒక పర్సనల్ గైడ్. గురువు. 

<><><><><><> 

ఇంపార్టెంట్:
రాముడిలో లోపాలు లేవా?


ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్ గా చాలా కాలం శ్రద్ధగా పనిచేసి, చాలామంది తిరుగులేని అనుభవం సంపాదించిన ఒకాయన స్వంతంగా క్లినిక్ తెరిచి వైద్యం చేయడం మొదలు పెడితే, పోనీలే అనుభవం ఉంది అని చట్టం ఊరుకోదు. అతనికి తప్పక దండన విధించి తీరుతుంది. ఆకాలంలో రాజుగా ఉన్న రాముడు చేసిన పని కూడా అదే. 

సాయంత్రం సినిమాకు వెడదామని నాన్నగారు ప్రామిస్ చేశారు. కాని, నాన్నగారు ఆ సమయంలో అర్జెంటుగా ఏదో క్రైసిస్ వస్తే, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలని బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరితోనూ మీటింగులో ఉన్నారు. మీరు ఫోన్ చేస్తే ఎత్తలేదు. 

అది నాన్నగారి లోపమా? ఆ మాత్రానికి మీమీద ప్రేమ లేనట్టా? ఒకొక్క పొజిషన్ లో ఒకొక్క దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ సమయంలో, ఆ స్థానంలో ఆయనకు మీకంటే మీటింగే ముఖ్యం. ఎందుకంటే, మీరు ఆయన ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తూ కూర్చుంటే అవతల కంపెనీని నమ్ముకున్న షేర్ హోల్డర్స్ నష్టపోవలసి వస్తుంది. కాబట్టి, మీకు ద్వితీయ ప్రాధాన్యత, కంపెనీకి ప్రాథమిక ప్రాధాన్యత ఇచ్చి తీరవలసిందే. 

అదే విధంగా, రాముడికి భర్తగా ఉన్న ధర్మం కంటే, రాజుగా ఉన్న ధర్మమే ముఖ్యం. విమర్శలు చేసిన వారు ఎన్ని రకాలుగా అయినా చేస్తారు. ఆయన తన రాజపదవికి రాజీనామా చేసి, సీతతో సహా అడవులకు మళ్ళీ వెళ్ళిపోయి ఉంటే 

""ఆహా రాముడు ఎంత కామాంధుడు? ప్రజలు ఎంతో ప్రేమతో ఆయనను రాజసింహాసనం మీద కూర్చోబెడితే అలాంటి ప్రజలను వదులుకుని తన పెళ్ళాం కోసం వెళ్ళిపోయాడు"" అని విమర్శించే వారు. 

అలాంటి విమర్శలు చేసే వారికి, రామునికి ఉన్న ఈ కొన్ని గుణాలలో ఒక్కటి అయినా సంపూర్ణంగా ఉందా? కాబట్టి, అలాంటి వారు చేసే విమర్శను పట్టించుకొనవలసిన అవసరం లేదు. మీరు అద్భుతమైన వాహనం కొందామనుకున్నారు. కాని ఆక్సిడెంటు అవుతుందేమో అని ఎవడైనా భయపెడితే కొనడం మానేస్తారా? ఇదీ అంతే. 

Just don't care such useless criticism. 
Indeed, it is called as అసూయ, as it is defined above.
Use your own discretion once after reading the entire Ramayana.

<><><><><><>

కాబట్టి, రామాయణం చదవండి, రామాయణాన్ని చదివించండి. 
శ్రీరామార్పణమస్తు.


శ్రీనివాసకృష్ణ   


No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...