Monday 26 December 2016

మహాభారతంలో కులవివక్ష - చిన్న సమీక్ష


।।జయ గణేశ।।

వ్యాసవిరచితా గణేశలిఖితా
మహాభారతే దివ్యకథా...

కౌరవపాండవసంగరమథితా 
నైవ క్లిష్టా న చ కఠినా...

అని సంస్కృతభారతి శిక్షకులు నేర్పిస్తూ ఉంటే పిల్లలు వారిని అనుకరిస్తూ మధురంగా పాడుతూ ఉండటాన్ని చూడడం, వినడం ఓ అద్భుతమైన అనుభవం. సంస్కృతం మాట్లాడటం కష్టమైన విషయమేమీ కాదని ప్రబోధిస్తూ, సంస్కృతవాఙ్మయాన్ని స్మరించుకొనే ఓ గీతంలో ఒక భాగమది.

మహాభారతాన్ని దివ్యకథగా భావించడం మహాభారతం ఆవిర్భవించిన కాలం నాటినుండి ఉన్న విషయమే. కాని భారతీయులు ఇతిహాసంగా పేర్కొన్న భారతాన్ని విదేశీయులు మతగ్రంథంగా గుర్తించడం - దానిలో కనిపించే ప్రతివిషయాన్ని అనుమానాస్పదంగా చూడటం - అవమానించటం - వారికి మానసికతత్త్వానికి వారసులుగా తయారైన కొందరు భారతీయులు కూడా మహాభారతాన్ని గూర్చి అలాగే మాట్లాడటం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది.

అందులో భాగంగా ఒక నింద ఇది -

కులం - వర్ణం అనేవి అసమానవిధానాలట.
కులవివక్షకు అవమానాలకు పునాదులు అక్కడే ఉన్నాయిట.
కులవివక్షకు పాండవులు ప్రతినిధులట.
ఆ కులవివక్షను ప్రతిఘటించిన వర్గానికి నాయకుడు సుయోధనుడుట.
ఇటువంటి కథలను కలిగిన మహాభారతం వంటి మతగ్రంథాల ప్రాశస్త్యం నశించాలిట.
ఈ నింద వేసినది శ్రీ మల్లెపల్లె లక్ష్మయ్యగారు.
(సాక్షి పత్రికలో - 1/9/2016 నాడు ప్రశ్నిస్తే ప్రతినాయకుడే కదా అనే శీర్షికతో ప్రచురింపబడింది.)

<><><><><><><>

నిజానికి కులవ్యవస్థ లేదా వర్ణవ్యవస్థ అనేది అతి ప్రాచీనకాలంలోనే భారతీయులు ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన Division of Labour Policy. అది సక్రమంగా ఉన్నంతకాలం భారతదేశం అద్భుతంగా వెలుగొందింది. అయితే కాలక్రమేణా ఈ వ్యవస్థ కొందరు అహంకారుల వల్ల దుర్వినియోగపరచబడి భారతదేశపు ఔన్నత్యం పతనం కావడానికి మూలమైంది అనడంలో సందేహం లేదు. కాని అందుకు మహాభారతాన్ని నిందించడం తగదు.

<><><><><><>

సూతపుత్రుడైనందువల్ల కర్ణునికి క్షత్రియునితో పోటీపడే అవకాశం లేదంటూ భీష్ముడు అడ్డుపడ్డాడని శ్రీ లక్ష్మయ్యగారు పేర్కొన్నారు.

కాని అడ్డుపడింది భీష్ముడు కాదు. కృపాచార్యుడు. సరే - అసలు ఆ సందర్భంలో జరిగింది పోటీలు కానే కావు - ధార్తరాష్ట్రులు పాండవులు తమ తమ యుద్ధవిద్యలలో తగినంత ప్రావీణ్యం సంపాదించారని వారు నేర్చిన విద్యలను ప్రదర్శించే అవకాశం ఇవ్వమని ద్రోణాచార్యులవారు కోరడం జరిగింది.

రాజన్ సంప్రాప్తవిద్యాస్తే కుమారాః కురుసత్తమ!
తే దర్శయేయుః స్వాం శిక్షాం రాజన్ననుమతే తవ!!
(మహాభారతం-ఆదిపర్వణి-సంభవపర్వం- 133.3)

అలా రాజకుమారుల విద్యాప్రదర్శనకోసం మాత్రమే ఏర్పాట్లు జరిగాయి. అర్జునుడు ప్రదర్శించిన విద్యలను చూసి దుర్యోధనాదులు తప్ప అంతా సంతోషించారు. మెచ్చుకున్నారు. ఈలోగా కర్ణుడు ప్రవేశించి "ఓయ్ అర్జునా! నువు జనాలముందు చేసినవన్నీ నేనూ చేయగలను, అంతకంటె ఇంకా ఎక్కువగానే చేయగలను. అందువల్ల నువు నేను గొప్పవాడినని గర్వపడకు" అన్నాడు.

పార్థ యత్ తే కృతం కర్మ విశేషవదహం తతః!
కరిష్యే పశ్యతాం నౄణాం మాऽऽత్మనా విస్మయం గతః!!
(మ.భా.-ఆది-సంభవ- 135.9)

అది an unprovoked insult to Arjuna.

సరే, ద్రోణుని అనుమతి పొంది కర్ణుడు తన విద్యను ప్రదర్శించిన మీదట దుర్యోధనుడు అతనిని తెగ మెచ్చుకున్నాడు. అపుడు అతనిని కర్ణుడు కోరిన వరం ఇది:

ద్వంద్వయుద్ధం చ పార్థేన కర్తుమిచ్ఛామ్యహం ప్రభో!
("ఓ ప్రభూ! అర్జునునితో నేను ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకుంటున్నాను")
(మ.భా.-ఆది-సంభవ- 135.15)

అర్జునునితో ద్వంద్వయుద్ధానికి గురువైన ద్రోణుని అనుమతిని గాని, మహారాజైన ధృతరాష్ట్రుని అనుమతిని గాని కోరకుండా కనీసం తన ప్రత్యర్థి అయిన అర్జునుని ఓ మాట కూడా అడగకుండా, "ప్రభూ" అని సంబోధిస్తూ సాక్షాత్తు దుర్యోధనుని అనుమతిని కోరడంతోనే కర్ణుని కుటిలత్వం తెలుస్తుంది. సరే, దుర్యోధనుడేం తక్కువ తినలేదు.

దుర్హృదాం కురు సర్వేషాం మూర్ధ్ని పాదమరిందమ!
("ఓ కర్ణా! నా శత్రువులందరి తలపై కాలు పెట్టి తొక్కేసెయ్")
(మ.భా.-ఆది-సంభవ.135.16)
అన్నాడు.

దుర్యోధనుని అండ చూసుకుని రెచ్చిపోయాడు కర్ణుడు.
"అర్జునా! నీ గురువు సమక్షంలోనే నేను నా బాణాలతో నీ తలను తెగేస్తాను" అన్నాడు.

గురోః సమక్షం యావత్ తే హరామ్యద్య శిరః శరైః!
(మ.భా.-ఆది-సంభవ- 135.20)

అపుడు ద్రోణుడు అనుమతినివ్వగా అర్జునుడు తన సోదరుల సమాశ్లేషలతో అభినందనలందుకుని ద్వంద్వయుద్ధానికి సిద్ధమయ్యాడు.

తతో ద్రోణాభ్యనుజ్ఞాతః పార్థః పరపురంజయః!
భ్రాతృభిస్త్వరయాऽऽశ్లిష్టో రణాయోపజగామ తమ్!!
(మ.భా.-ఆది-సంభవ- 135.21)

ధృతరాష్ట్రపుత్రులు కర్ణుని వెనుక నిలబడ్డారు.
ద్రోణభీష్మాదులు అర్జునుని వెనుక నిలబడ్డారు.
ప్రజలందరూ రెండు పక్షాలుగా చీలిపోయారు.

ద్విధా రంగః సమభవత్.
(మ.భా.-ఆది-సంభవ- 135.27)

అంతా ఉద్రిక్తంగా మారిపోయింది.
విద్యాప్రదర్శనవేదిక కాస్త భీకరరణరంగంగా మారే పరిస్ధితి దాపురించింది.

అపుడు కృపాచార్యుడు ద్వంద్వయుద్ధంలో పాటించే ఆచారం ప్రకారం, యోధులు తమ తమ పితృవంశాలను ప్రకటించమని కోరాడు.

దానితో తాను సూతపుత్రుడనని చెప్పుకొనేందుకు కర్ణుడు సిగ్గుపడితే, అపుడు దుర్యోధనుడు చొరవ తీసుకుని గొప్పరాజవంశంలో పుట్టిన వాడు, శూరుడు, సేనాపతి క్షత్రియులు కావడానికి శాస్త్రప్రకారం అర్హులని తెలిపాడు. శభాష్! నిజంగా గొప్ప మాటే కదా!

ఆచార్య త్రివిధా యోనీ రాజ్ఞాం శాస్త్రవినిశ్చయే!
సత్కులీనశ్చ శూరశ్చ యశ్చ సేనాం ప్రకర్షతి!!
(మ.భా.-ఆది-సంభవ- 135.35)

అదే చొరవతో
"రాజు కానివాడితో అర్జునుడు పోరాడనన్న పక్షంలో కర్ణుని అంగదేశానికి రాజుగా అభిషేకిస్తున్నాను" అన్నాడు.

యద్యయం ఫాల్గుణో యుద్ధే నారాజ్ఞా యోద్ధుమిచ్ఛతి!
తస్మాదేషోऽఙ్గవిషయే మయా రాజ్యేऽభిషిచ్యతే!!
(మ.భా.ఆది-సంభవ- 135.36)

<><><><><><>

క్షత్రియుడు క్షత్రియునితోనే యుద్ధం చేయాలన్నది ఆరోజుల్లో నియమం. ఎందుకంటే యుద్ధవిద్యలలో సుశిక్షితుడైన క్షత్రియునితో ఒక మామూలు వ్యక్తి తలపడితే అతడు అన్యాయంగా ఖర్చైపోతాడని, అలా జరగరాదని ముందు జాగ్రత్తచర్యగా అటువంటి నియమాలను ఏర్పరిచారు.

కాని, కర్ణుడు తాను కూడా మహావీరుడినని అంతకు ముందే నిరూపించుకున్నాడు కదా - ఇంకా వంశమూ కులమూ అంటూ నియమాలు మాట్లాడాలా అంటే - నియమాలను నియమాలుగానే చూడాలని సమాధానం.

మన ఇండియన్ క్రికెట్ టీము, అమెరికా క్రికెట్ టీము ఆహ్వానించింది కదా అని అమెరికాకు వెళ్లి ఐదు టెస్టుమ్యాచుల సిరీస్ ఆడిందే అనుకోండి. ఇండియా మొత్తం ఐదు మ్యాచులనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ. పోనీ అలా గెలిచాక గెలిచేశాం చూశారా అని ఇండియా గొప్పలు చెప్పుకోబోతే ప్రపంచంలో టెస్ట్ మ్యాచులాడే ప్రతి దేశంలోనూ ఇండియా నవ్వులపాలౌతుంది. ఎందుకంటే అమెరికా టీముకు ఒక టెస్ట్ మ్యాచ్ ను ఆడగల స్థాయి ఉన్న టీముగా ICC గుర్తింపు లేదు. ఆ గుర్తింపు అంత సులువుగా వచ్చేది కాదు. మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్ కూడా అలాంటి గుర్తింపు కోసం చాల కష్టపడింది. గుర్తింపు పొందిన చాలాకాలం వరకు బంగ్లాదేశ్ తో మ్యాచ్ అంటే అందరికీ నవ్వులాటగానే ఉండేది.

కాబట్టి, గుర్తింపు లేని టీములతో ఆడి గెలిచిన గెలుపును ఎవరూ గెలుపుగా భావించరు. అలాంటి టీములతో ఆడి వంద కాదు కదా, రెండువందల సెంచరీలు చేసినా ఎవరూ పట్టించుకోరు. వెయ్యి కాదు, రెండువేల వికెట్లు పడగొట్టినా ఆ లెక్క రికార్డులకెక్కదు. కాబట్టి అటువంటి టీములతో సరదాగా ఎగ్జిబిషన్ మ్యాచులాడడం వేరు, సీరియస్ గా టెస్ట్ మ్యాచులాడడం వేరు. ఎవడో అమెరికన్ బౌలరొకడు ఓడ ఎగ్జిబిషన్ మ్యాచులో ఐదు వికెట్లు పడగొట్టినంత మాత్రానికే అతడు టెస్ట్ మ్యాచ్ లో అదే స్థాయి ఆటను ప్రదర్శించి తన టీమ్ గెలిపిస్తాడని భావించలేము. ఒకవేళ అనధికారికంగా అమెరికా టీముతో టెస్ట్ మ్యాచ్ జరిగిందే అనుకుందాం. ఇండియా గెలిస్తే అది అసలొక వార్త అని అనుకునేవారు కూడా ఉండరు. అమెరికాకు పరాభవం పొందిన బాధ కూడా ఉండదు. కాని, పొరపాటున అమెరికా గనుక గెలిస్తే అదో సంచలనవార్త. ఇండియాకు తలవంపులు. కాబట్టి గెలిచినా ఓడినా అమెరికన్ క్రికెట్ టీముకు ఎటువంటి నష్టమూ లేదు. అందుకే పోటీ ఎప్పుడైనా సమవుజ్జీల నడుమ జరగాలి అనేది. ఇండియన్ ఫుట్ బాల్ టీము జర్మనీ టీమ్ తో ఆడి ఓడిపోయిందంటే మనం ఏమాత్రం బాధపడం కదా!

సరిగ్గా కర్ణుడి పరిస్థితి కూడా అదే. గెలిచాడంటే అర్జునుని ఓడించిన కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. తానే ఓడితే - అవతల ఉన్నది మహావీరుడు అర్జునుడు కదా - గెలుపు అంత సులువు కాదులే - అన్న ఓదార్పు దక్కుతుంది. కనీసం అర్జునుని ధైర్యంగా ఎదిరించిన మొనగాడన్న పేరు మిగులుతుంది. కాని అర్జునునికి అలా కాదు - గెలిస్తే ఆ సూతపుత్రుని ఓ సుక్షత్రియుడు గెలవడం పెద్ద గొప్పా అనేస్తారందరూ. ఓడితే మాత్రం అతడు చాల తలవంపులు ఎదుర్కొనవలసి వస్తుంది.

<><><><><><>

మొత్తానికి దుర్యోధనుడు కర్ణునికి "రాజు" అనే గౌరవాన్ని కల్పించగలిగాడు కాని bad light కారణంగా కర్ణార్జునయుద్ధం జరగలేదు.

పాండవులందరిలోనూ భీముడొక్కడే వాచాలుడు. "ఒరే సూతపుత్రా! నీకు అర్జునుని చేతిలో యుద్ధంలో చచ్చే అర్హత కూడా లేదురా!" అని కర్ణుడిని ఉద్దేశించి అన్న మాట నిజం. దాంతో దుర్యోధనుడు మహా ఆవేశంగా భీమునికి నిజంగా గొప్ప సమాధానమే చెప్పాడు. కాని అది పరోక్షంగా దుర్యోధనుని దుష్టచేష్టను నిరసిస్తూ భీముడు పలికిన మాట. అబ్బే - అది కర్ణుని రాజును చేయటం కాదు. అంతకు ముందు భీమునికి అత్యంతప్రియమైన సూతుడిని (రథసారథిని) దుర్యోధనుడు తన బాల్యంలోనే గొంతు పిసికి చంపేసి ఉన్నాడు. అదీ అతని భయంకరదుష్టచేష్ట!

సారథిం చాస్య దయితమపహస్తేన జఘ్నివాన్!
(మ.భా.-ఆది-సంభవ- 28.36)

అందువల్ల దుర్యోధనుడు కర్ణుని పక్షాన నిలిచాడంటే అందుకు కారణం తాను శత్రువులుగా భావిస్తున్న పాండవులను చంపేసేటందుకు అతడు తనకు తోడ్పడతాడనే స్వార్థం తప్ప అతడు మల్లెపల్లె లక్ష్మయ్యగారో లేక అంబేద్కర్ గారో భావిస్తున్నట్టు 'కులరహితసమాజాన్ని కాంక్షించిన ఓ స్వాప్నికుడు' కానే కాదు.

పైగా పాండవులకే ఈ కులమనే పట్టింపులు ఏమీ లేనట్లు మహాభారతం చెబుతుంది. వారు ఏకచక్రపురంనుండి ద్రౌపదీస్వయంవరానికి బ్రాహ్మణవేషంలో వచ్చారు. పాంచాలరాజధానికి చేరి, అక్కడ ఒక కుమ్మరి ఇంట బస చేశారు. బ్రాహ్మణవృత్తిని అవలంబించి అక్కడ భిక్షాటన చేసేవారు.

కుంభకారస్య శాలాయాం నివాసం చక్రిరే తదా!
తత్ర భైక్ష్యం సమాజహ్రుర్బ్రాహ్మణీం వృత్తిమాశ్రితాః!!
(మ.భా.-ఆదిపర్వం-స్వయంవరపర్వం- 184.6,7)

అంటే బ్రాహ్మణులు ఎటువంటి inhibitions లేకుండా శూద్రుల ఇండ్లలో అతిథులుగా ఉండేవారని స్పష్టంగా అర్థమౌతోంది కదా? అది ఎవరికీ అభ్యంతరకరంగా తోచలేదు. ద్రౌపదిని అర్జునుడు స్వయంవరంలో గెలుచుకున్నాక ఆమెను నేరుగా తీసుకువెళ్లింది ఆ కుమ్మరి ఇంటికే. వారు పాండవులే అని గ్రహించిన బలరామకృష్ణులు వారిని వెతుకుతూ చేరుకున్నది కూడా ఆ కుమ్మరి ఇంటికే. (ఆదిపర్వం - స్వయంవరపర్వం - 190 అధ్యాయం) చెల్లెలిని బావలను కలుసుకొనేందుకు ధృష్టద్యుమ్నుడు వెళ్లింది ఆ కుమ్మరి ఇంటికే. ద్రౌపది వివాహవిషయం గూర్చి మాటలాడేందుకు ద్రుపదుని పురోహితుడు వెళ్లింది ఆ కుమ్మరి ఇంటికే.

దీనిని బట్టి మహాభారతకాలంలో శూద్రులంటే ఇతరకులాలకో లేదా వర్ణాలకో ఎలాంటి చిన్నచూపు లేదని బల్ల గుద్ది గట్టిగా చెప్పవచ్చు. కొండొకచో అది కనిపించిన చోట ఆయా వ్యక్తుల వైయక్తిక దోషాలే తప్ప లోకాచారం కానే కాదు.

దాసీపుత్రుడైన విదురుని భీష్ముడు ధృతరాష్ట్రపాండురాజులతో సమానంగా విద్యాబుద్ధులు నేర్పించి కన్నకొడుకులా ప్రేమతో సాకాడు.

ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ విదురశ్చ మహామతిః!
జన్మప్రభృతి భీష్మేణ పుత్రవత్ పరిపాలితాః!!
(మ.భా.-ఆది-సంభవ- 108.17)

ఆ విదురుడంటే దుర్యోధనునికి నిత్యం ద్వేషం. కాని పాండవులు అతనిని ధృతరాష్ట్రుని తమ తండ్రిని గౌరవించినట్టు గౌరవించేవారు. శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్లినపుడు రాజరాజైన దుర్యోధనుని ఆతిథ్యాన్ని నిరాకరించి శూద్రుడైన విదురుని ఇంట బస చేసి అతని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. (ఉద్యోగపర్వం - భగవద్యానపర్వం - 91 అధ్యాయం)

ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
అసలు గట్టిగా చెప్పాలంటే ఇన్నేసి ఉదాహరణలు అనవసరం -

నైమిశారణ్యంలో శౌనకమహర్షి పన్నెండు సంవత్సరాల సత్రయాగం చేస్తూ ఉండగా అక్కడకు రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవుడు వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న బ్రహ్మర్షులందరూ (సాధారణ ఋషులు, మహర్షులు మాత్రమే కాదు, ఏకంగా బ్రహ్మర్షులే) - ఆయన చుట్టూ చేరి, అతడు చెప్పగా మహాభారతకథను శ్రద్ధగా విన్నారు. (ఆదిపర్వం - అనుక్రమణిక పర్వం)

ఆ రోమహర్షణుడు, ఉగ్రశ్రవుడూ సూతవంశానికి చెందినవారు. అంటే శూద్రులు. ఆనాడు బ్రహ్మర్షులే ఒక శూద్రుని ఆదరించి అతని ద్వారా వ్యాసుని భారతం విన్నారని మహాభారతం మొట్టమొదటి పర్వం మొట్టమొదటి అధ్యాయంలోనే స్పష్టంగా ఉంది.

అలాంటి మహాభారతాన్ని ఏమాత్రం చదవకుండా నిందించడం మీకు తగునా ఓ మల్లెపల్లె లక్ష్మయ్యగారూ? మీరు చేసిన నిందలు ఇంకా ఉన్నాయి. సమయాన్ని బట్టి మీకు సమాధానం ఇవ్వగలవాడను.
ధన్యవాదాలు.

ॐ సర్వం శ్రీగణేశార్పణమస్తు 卐



2 comments:

  1. Had original text of Lakshmaiah been attached, it would have been an added advantage. Any way, the comments were just apt and deserve an appreciation.

    ReplyDelete
  2. Sir, I agree with your article. When Bhima entered the court of Virata, he told his caste as NALAVA JATI. It means 4th caste (Sudra). Sudra used be the cook in Kshatriya houses. In Apastambha Sutra, we have references of Sudra cooks in Brahmin houses also. Caste system as we understand today was not there in Maha Bharata times. - Karanam Nagaraja Rao

    ReplyDelete

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...