Tuesday 18 September 2018

పరువు ఎవడబ్బ సొమ్ము?

అనగనగా ధ్రువసంధి అనే రాజు ఉండేవాడు. మహా ధర్మాత్ముడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు.
దురదృష్టం కొద్దీ ధ్రువసంధి అడవిలో సింహం బారిన పడి చనిపోయాడు. అపుడు రాజు ఎవరు కావాలని సుదర్శనుడి మాతామహుడు అయిన వీరసేనుడు, శత్రుజిత్తు మాతామహుడు అయిన యుధాజిత్తు గొడవ పడ్డారు. వీరసేనుడిని యుధాజిత్తు చంపేశాడు. దాంతో, మనోరమ సుదర్శనుడిని తీసుకుని అడవికి పారిపోయి, భరద్వాజమహర్షిని శరణు కోరింది. యుధాజిత్తు శత్రుశేషం ఉంచరాదని సుదర్శనుడిని చంపేందుకు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్లాడు కాని, మహర్షి తపఃశక్తికి భయపడి ఏమీ చేయలేక ఊరుకున్నాడు.
తరువాత ఎప్పుడో కాశీరాజు తన కూతురైన శశికళకు స్వయంవరం ప్రకటించాడు. రాజులందరూ విచ్చేశారు. అన్నదమ్ములైన సుదర్శనుడు, శత్రుజిత్తు కూడా వచ్చారు. శశికళ సుదర్శనుడిని వరించింది.
దాంతో శివాలెత్తిపోయిన యుధాజిత్తు "శశికళ నా మనుమడిని కాకుండా అతడికి పోటీదారు అయిన అన్నను వరిస్తుందా? ఆమెకు ఎంత ధైర్యం? ఆ సుదర్శనుడిని చంపేసి ఆమెను శత్రుజిత్తుకు ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ యుద్ధానికి దిగాడు.

ఇలా ఒకే కులం, ఒకే తండ్రిబిడ్డలు అయిన అన్నదమ్ములలోనే ఒకరిని కాకుండా ఇంకొకరిని ఒక కన్య వరించింది కాబట్టి మా పరువు పోయింది అనుకునే తాతలు ఉండేవారు సుమా.
ఈ కథలో తరువాత ఏమైందని అడుగుతారా? శశికళ కోరుకున్న వరుడే దైవానుగ్రహంతో యుద్ధంలో గెలిచాడు లెండి.
ఇలాంటి కథలు, ఇంతకంటె రసవత్తరమైన కథలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు మనకు తెలిసినవే. అయినప్పటికీ సరదాగా మళ్లీ గుర్తు చేసుకునేందుకు చదవండి:

1 శ్రీకృష్ణుడు
విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి కృష్ణుని ప్రేమించింది.కృష్ణునికి ఇవ్వవచ్చునని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అనుకున్నారు.కాని, రుక్మిణి అన్న ఐన రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు.అతడు జరాసంధుని ముఠాకు చెందినవాడు.అతడి మాటపై తన దోస్తు ఐన శిశుపాలుడికి ఇచ్చి చేద్దామనుకున్నాడు.రుక్మిణి తల్లిదండ్రులు నిస్సహాయులయ్యారు.
రుక్మిణి ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసును కృష్ణునికి తెలియజేసింది.కృష్ణుడు వచ్చి ఆమెను అందరి సమక్షంలోనూ ఎత్తుకుపోయాడు.
రుక్మి శిశుపాలుడు, జరాసంధుడు కృష్ణుని చంపాలని వెంటబడ్డారు. కృష్ణుడు వారందరినీ ఓడించి తరిమేశాడు.చేసేదేమీ లేక, సింహానికి దక్కాల్సిన సొమ్మును జింకలు కాజేసినట్టు మన రాజకన్యను ఆ గోపాలుడు ఎత్తుకుపోయి ధనుర్దారులమైన మన కీర్తిని వాడు నవ్వులపాలు చేశాడే అని తిట్టుకుంటూ ఊరట చెందారు పాపం. అందరిలోనూ తమ పరువు పోయిందని బాధపడిపోయారు.
अहो धिगस्मान् यश आत्तधन्वनां गौपैर्हृतं केसरिणां मृगैरिव।
(భాగవతం 10.ఉత్తరార్ధం 54.57)
అయితే జరాసంధుని భీముడు, శిశుపాలుని కృష్ణుడు కాలాంతరంలో హతమార్చిన తరువాత రుక్మిణి అన్న రుక్మి దారికి వచ్చాడు. తన కూతురు అయిన రుక్మవతిని రుక్మిణీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుక్మిణీకృష్ణుల మనుమడైన అనిరుద్ధుడికి తన మనుమరాలైన రోచనను ఇచ్చాడు.

2 భీముడు
హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలు హిడింబ.ఆమె అడవిలో భీముని చూడగానే ప్రేమించింది.తన అన్న క్రూరుడని మీ కుటుంబసభ్యులతో కలసి ఎక్కడకైనా దూరం పొమ్మని భీమునిహెచ్చరించింది.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పింది.
ఇంతలో హిడింబుడు రానే వచ్చాడు. తన చెల్లెలి మనోభావాన్ని గ్రహించి, "వొసే హిడింబా! మన వంశానికి కళంకం తెస్తున్నావు. ఛీ ఛీ.
पूर्वेषां राक्षसेन्द्राणां सर्वेषामपयशस्विनी।“ (భారతం.1.152.18)
అన్నాడు.
ఆ హిడింబుడికి కూడా తన చెల్లెలు ఒక మానవమాత్రుణ్ణి వరించడం ఒక పరువుతక్కువ పనిగా అనిపించింది!
“ఉండు, మీ ఇద్దరినీ చంపి పారేస్తా చూడు" అంటూ భీముడి మీద పడ్డాడు. అయితే భీమసేనుడే అతడిని చంపిపారేశాడు.
ఆ తరువాత, హిడింబ ప్రేమను భీముడు తిరస్కరించాడు.“నీ అన్నను చంపిన పగతో మమ్మల్ని ఏమైనా చేయగలవు పో పో” అన్నాడు.అపుడు హిడింబ కుంతిని ధర్మరాజును శరణు వేడి, వారి ద్వారా భీముని ఒప్పించి పెండ్లి చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు అని అందరికీ తెలిసిన విషయమే కదా!

3 ద్రౌపది
పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు.కాని, వారు తప్పించుకున్నారు. బ్రాహ్మణవేషం ధరించి పాంచాలరాజ్యంలో. ద్రౌపదీస్వయంవరసభను చేరుకున్నారు.
ఆ సభలో అందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో విఫలమైన తరువాత బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు ఆ పని చేశాడు. ద్రౌపది అతనిని వరించింది. ఇది చూసి అక్కడ ఉన్న రాజులు సహించలేకపోయారు. రాజులందరికీ ఇది తమ పరువుప్రతిష్ఠలకు ఒక సవాలుగా అనిపించింది.
“వీరుడైనవాడు ఏ కులానికి చెందినప్పటికీ వాడికి అందరూ సలాము చేయవలసినదే” అని ఒకప్పుడు గర్జించి చెప్పిన దుర్యోధనుడు కూడా ఉక్రోషంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తానే విస్మరించాడు.
“ఈ కన్య (ద్రౌపది) ఒక క్షత్రియుని కాకుండా ఒక బ్రాహ్మణుని వరించినందుకు ఈమెను నిప్పుల్లో పడేసి మన దేశాలకు మనం పోదాం. ”अग्नावेनां परिक्षिप्य याम राष्ट्राणि पार्थिवाः। (భారతం 1.188.8) అని మిగిలిన రాజులతో పాటు మీదకు ఎగబడ్డాడు.
వారిని బ్రాహ్మణవేషాల్లోనే భీమార్జునులు అడ్డుకున్నారు. పెద్ద దొమ్మీ జరిగింది. యుద్ధంగా కూడా మారింది. వారిద్దరూ కలిసి ద్రౌపదిమీదకు పోబోయిన రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. మహా మహా కర్ణుడు కూడా అర్జునుని చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక అందరూ నోరు మూసుకుని ఇంటికి పోయారు.
ద్రౌపది రక్షింపబడింది.

4 అర్జునుడు
తీర్థయాత్రలు చేస్తూ ద్వారకానగరానికి వచ్చిన అర్జునుడు, యాదవకన్య, శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను చూసి ఇష్టపడ్డాడు.
సుభద్ర తనను వరిస్తుందో లేదో, యాదవులు ఆమెను తనకు ఇస్తారో లేదో అని అతడికి సందేహం కలిగింది. శ్రీకృష్ణునితో ఆ విషయం చర్చించి, అతడి ప్రోత్సాహం మీదట, అన్న అయిన ధర్మరాజు అనుమతిని కూడా పొందిన మీదట, సుభద్ర రేవతకపర్వతానికి వచ్చిన సందర్భం చూసుకుని ఎత్తుకుపోయాడు.
భోజులు, వృష్ణీయులు, అంధకులు అనే మూడు తెగల యాదవులకు అది చాల అవమానకరంగా తోచింది.
అన్నపానాలు కూడా మానివేసి అందరూ సమావేశమయ్యారు. “రథాలను సిద్దం చేయండిరా. ప్రాసాలను తీసుకురండిరా”
योजयध्वं रथानाशु प्रासानाहरतेति च। (భారతం 1.219.17)
అంటూ అర్జునుని దండించి సుభద్రను తిరిగి తీసుకుని వచ్చేందుకు సంసిద్ధులయ్యారు.
బలరాముని మండిపాటుకైతే హద్దులే లేవు. “భోజనం చేసిన కంచాన్నే విరగ్గొట్టే కులకళంకుడని తెలియక ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడి మిత్రుడు కదా అని ఎంతగా గౌరవించాం!
न च सोऽर्हति पूजां तां दुर्बुद्धिः कुलपांसनः।
को हि तत्रैव भूक्त्वान्नं भाजनं भेत्तुमर्हति। (భారతం 1.219.26,27)
అసలు అర్జునుడు అపహరించింది సుభద్రను కాదు, తన మృత్యువునే సుమా! ఇటువంటి పని చేయడం ద్వారా నా తలమీద అర్జునుడు తన పాదం పెట్టినట్టు కాదా? ఆ అర్జునుడు జన్మించిన కౌరవవంశాన్ని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను.
अद्य निष्कौरवमेकः करिष्यामि वसुन्धराम्। (భారతం 1.219.31)”
అంటూ అవమానంతో కుతకుతలాడిపోయాడు. యాదవులందరూ బలరాముని సమర్థిస్తూ “పదండి పదండి” అంటూ రణనినాదాలు చేశారు.
వారికి ఇదొక పరువు సమస్య అయింది!
కాని, శ్రీకృష్ణుడు సుభద్రకు అర్జునుడు తగిన జోడీ అని, స్వయంవరంలో సుభద్ర తనను వరిస్తుందో లేదో అనే సంశయంతో అర్జునుడు ఆమెను ఎత్తుకువెళ్లి ఉంటాడని, అది క్షత్రియులకు అనుచితమైన పనేమీ కాదని నచ్చజెప్పి బలరాముని, మిగిలిన యాదవులను చల్లబరచాడు.
శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో యాదవులు సగౌరవంగా సుభద్రార్జునులను ద్వారకకు తిరిగి తీసుకుని వచ్చి, వారికి వివాహం చేశారు. కాలక్రమేణ వారిరువురికీ జన్మించిన అభిమన్యుడు యాదవులందరికీ ముద్దుల మేనల్లుడు కావడం తెలిసిందే.

5 సాంబుడు
జాంబవతీశ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కూతురైన లక్ష్మణను ఇష్టపడ్డాడు. ఆమెను స్వయంవరసభనుండి ఎత్తుకుపోయాడు.
సాంబుడు చేసిన పనికి కౌరవులు ఆగ్రహంతో ఊగిపోయారు. “పట్టండిరా ఈ దుర్మార్గుడిని. మనం దయదలచి ఇచ్చిన భూమిని ఏలుకుంటున్న ఈ వృష్ణీయులు (యాదవులు) ఏమి చేస్తారో చూద్దాం.
बध्नीतेमं दुर्विनीतं किं करिष्यन्ति वृष्णयः।
येस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीम्।“ (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)
అని మీదపడి బంధించారు.
యాదవులంటే వారికి చిన్నచూపు. వారు తమ పిల్లను చేసుకొనడం తమకు పరువు తక్కువగా కౌరవులు భావించారు!
ఈ విషయం తెలిసిన యాదవులు సాంబుడిని విడిపించుకునేందుకు యుద్ధసన్నద్ధులయ్యారు. కాని, బలరాముడు యాదవకౌరవవంశాలవారికి నడుమ కలహం వద్దని, శాంతిని కోరి ఉద్ధవుని రాయబారిగా పంపాడు. భీష్మాదివృద్ధులు ఎంత నచ్చజెప్పినా వినకుండా దుర్యోధనాదికౌరవులు మాత్రం అహంకారంతో మిడిసిపడ్డారు.
“ఆహా! కాలమహిమ కాకుంటే కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన చెప్పులు కిరీటం ఉండవలసిన తలమీద ఉండగోరుతున్నాయి కదా?
अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया।
आरुरुक्षत्युपानद्वै शिरो मुकुटसेवितम्।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.24)
మన పాండురాజు వారి కుంతిని చేసుకున్నాడు. మన అర్జునుడు వారి సుభద్రను చేసుకున్నాడు. ఇలా కాస్త బంధుత్వం కలిసింది కదా అని మన ప్రక్కనే కూర్చునేందుకు సాహసిస్తున్నారు. వీరు మాకు చెప్పవచ్చారా?” అంటూ అహంకరించి బలరాముని మాటలను తిరస్కరించారు.
బలరాముడికి వొళ్లు మండింది. “ఏమిటేమిటీ? మేము చెప్పులమూ, వారేమో తలకాయలూనా?
उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.38)
ఈ రోజు భూమిమీద కౌరవులు లేకుండా చేస్తాను
अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामि। (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)”
అంటూ హస్తినాపురాన్ని తన హలంతో లాగి గంగలోనికి నూకేందుకు ఉద్యమించాడు. ఆ దెబ్బకు హస్తినాపురం ఊగిపోయింది. కౌరవులందరూ హడలిపోయి, సాంబుడిని, లక్ష్మణను బలరామునికి అప్పగించి, క్షమాపణలు కోరి, రక్షించమన్నారు. దయాళువైన బలరాముడు సరేనని, వారు సమర్పించిన కానుకలను, వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు చేరుకున్నాడు.
గొడవ చల్లబడింది.

6 మధువు
రావణాసురుని పినతల్లి అనల. ఆమెకు కుంభీనసి అనే కూతురు ఉండేది. ఆమెను మధువు అనే ఒక రాక్షసుడు ఇష్టపడ్డాడు. పేరుకు రాక్షసుడే అయినా దేవతలకు మంచి మిత్రుడు.కాని,రావణాసురుని పట్ల భయంతో ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాడు.
ఇలా ఉండగా ఒకసారి రావణాసురుడు జైత్రయాత్రకు వెళ్లాడు. యుద్ధోన్మాదంలో తన చెల్లెలైన శూర్పణఖకు భర్త అయిన విద్యుజ్జిహ్వుని కూడా గుర్తించలేక స్వయంగా నరికి చంపివేశాడు. శూర్పణఖ వచ్చి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆమెను పోయి దండకారణ్యంలో సుఖంగా ఉండమని పంపించేశాడు రావణుడు.
వారు ఈ గొడవల్లో ఉండగా సమయం చూసుకుని మధువు కుంభీనసిని ఎత్తుకుపోయాడు.
రావణుడు విజయం సాధించి, వెనక్కు వస్తూ దారిలో కంటికి అందంగా కనబడిన రాజస్త్రీలను, ఋషిస్త్రీలను, గంధర్వస్త్రీలను,పన్నగస్త్రీలను, రాక్షసస్త్రీలను, అసురస్త్రీలను, మానుషస్త్రీలను, యక్షస్త్రీలను, దానవస్త్రీలను ఎవరి పట్లా ప్రత్యేకపక్షపాతం చూపకుండా అపహరించాడు. వారు వివాహితలా లేక అవివాహితులా అన్నది కూడా గమనించలేదు. తనకు అడ్డుపడిన వారి వారి బంధువులను యథేష్టంగా సంహరించాడు.
दर्शनीयां हि रक्षः कन्यां स्त्रीं वाऽथ पश्यति।
हत्वा बन्धुजनं तस्या विमाने तां रुरोध ह।। (రామాయణం7.24.2)
ఆ స్త్రీల విలాపంతో లంక ప్రతిధ్వనించిపోయింది. “ఒరే దుర్బుద్ధీ! నువు స్త్రీమూలంగానే నశిస్తావురా” स्त्रीकृतेनैव प्राप्स्यते दुर्मतिर्वधम्। (రామాయణం7.24.2)
అంటూ వారు శపించేశారు.
ఇంతలో మధువు తన చెల్లెలైన కుంభీనసిని ఎత్తుకుపోయాడన్న వార్త తెలిసింది. దానితో ఆ రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. లోకవిజేత అయిన తన చెల్లెలినే ఎవడో ఎత్తుకుపోతాడా? ఎంత ధైర్యం? మళ్లీ ఇక్కడ రావణాసురుడికి కూడా పరువు సమస్యే!
అతడి కళ్లు ఎర్రగా మారిపోయాయి. “వెంటనే రథం సిద్ధం చేయండిరా. రాక్షసవీరులు సిద్ధం కండిరా. మారణాయుధాలు పట్టుకుని బయల్దేరండిరా” అని గర్జిస్తూ మధుపురానికి దండయాత్ర చేశాడు.
అయితే అతడి చెల్లెలు కుంభీనసి వచ్చి అన్న కాళ్ల మీద పడి, “అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు నా భర్తను చంపి, నన్ను విధవను చేయవద్దు” అని వేడుకుంది.
రావణుడు కాసేపు ఆలోచించి, “సరే, నీమీద దయతో అతడిని నేను చంపబోవటం లేదు. నీ భర్త ఎక్కడ? త్వరగా రమ్మను. అతడితో కలసి, స్వర్గలోకాన్ని జయించేందుకు బయల్దేరుతాను” అన్నాడు.
क्व चासौ तव भर्ता वै मम शीघ्रं निवेद्यताम्।
सह तेन गमिष्यामि सुरलोकं जयावहे।। (రామాయణం 7.25.44,45)
మొత్తానికి అలా రాజీ కుదిరింది. తరువాత రావణుడు ఎత్తుకువచ్చిన స్త్రీల శాపం ఫలించి సీత కారణంగా రాముడి చేతిలో చనిపోయాడు.
అయితే రావణుడి బావ అయిన మధువుమహాశివభక్తుడు. మహా ధర్మాత్ముడు. జనరంజకంగా పరిపాలన చేశాడు.కాని, ఆ కుంభీనసీమధువుల కుమారుడైన లవణాసురుడికి మాత్రం మేనమామ అయిన రావణాసురుడి బుద్ధులు వచ్చాయి. వాడు పెట్టే బాధలను సహించలేక మునులు రాముడికి మొర పెట్టుకున్నారు. శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞను పొంది ఆ లవణాసురుడిని సంహరించాడు.
***

ఈ విధంగా తమ కుటుంబానికి చెందిన స్త్రీని ఎవడో తమ అనుమతి లేకుండా పెండ్లాడడం అనేది ఎంతటివారికైనా ఇజ్జత్ కా సవాల్. అది ఒక మానసికమైన పీడ.
కురువంశంవారు తమ కన్యను ఎత్తుకుపోయారని యాదవులు మండిపడ్డారు. యాదవులు తమ కన్యను ఎత్తుకుపోయారని కురువంశంవారు కుతకుతలాడిపోయారు. రాక్షసులు తమ స్త్రీని ఎత్తుకుపోయారని మానవులు వగచారు. మనిషి మా కన్యను వరిస్తాడా అని రాక్షసులు కోపగించుకున్నారు. ఎవరూ తక్కువ తినలేదు.

పరువు ఎవడబ్బ సొమ్ము? ఎవరికి ఆ పరువు బరువు?

అయితే ఈ కథలన్నిటిలోనూ గమనించవలసింది ఏమిటంటే –

ప్రతిచోటా బలవంతులే గెలిచారు.
ఓడినవారు చాలావరకు రాజీకొచ్చారు.
అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే.

కాబట్టి, ఇప్పటి ఆశావహులు ఎవరైనా సరే, స్వయంగా తమకు తగినంత బలం లేకుండా, బలవంతుల ఇష్టం లేనిదే బలవంతుల కన్యల జోలికి పోరాదు. బలం అంటే ఆరోజుల్లో పరాక్రమం అయ్యుండవచ్చు. ఈరోజుల్లో ధనం, పలుకుబడి కూడా.

బలవంతుడు మరొక బలవంతుడినే ఇష్టపడతాడు, అతడితోనే రాజీ పడతాడు. ప్రపంచమంతటా ఇదే సహజం.

అంతే కాదు, బలవంతుడు అర్హత కలిగిన వినయవంతుడిని కూడా ఇష్టపడతాడు. శుక్రాచార్యులవారు తన కూతురును క్షత్రియుడైనప్పటికీ వినయవంతుడైన యయాతిరాజుకు సంతోషంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

అంతేగాని, చెత్త చెత్త సినిమాలలో చూపినట్టు పోకిరీతనంతో బలవంతుల జోలికి పోయి భంగపడకండి, సమాజంలో అందరినీ మాకు న్యాయం చేయండి అంటూ దేబిరించకండి.

బలమా? అర్హతతో కూడిన వినయమా?
ఏదో ఒకటి ఎంచుకోండి.

కాబట్టి, ఓ ఆశావహులారా! ఈ రెండిటిలో ఏదో ఒకటి లేకుండా పనికిమాలిన సాహసాలు చేసి, దానికి తగిన ప్రతిఫలం అనుభవించి, మీ సమస్య తప్ప మరో సమస్య సమాజంలో మరేమీ లేనట్టు ఊరికే గగ్గోలు పుట్టించడాలు మానుకోండి.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...