Monday, 23 July 2018

రసికుడు - నీరసికుడు

“హనుమంతుడు రసికుడు” అన్నారు మిత్రుడు ఒకాయన తన ఫేస్ బుక్ గోడపై.

కొందరు మెచ్చుకున్నారు – కొందరు నొచ్చుకున్నారు – ఆ మిత్రుని మాటల్లో చెప్పాలంటే – కొందరు తిట్టిపోశారు.

వారి వారి ప్రతిస్పందనలు వారు “రసిక” అనే పదాన్ని అర్థం చేసుకున్న పద్ధతిని బట్టి ఉన్నాయి. 


“రసికుడు” అనే పదం తప్పుడు పదం ఏమీ కాదు. రసాస్వాదన చేయగలిగినవాడు అని అర్థం. కాని, తెలుగు సినిమాలు చాలా పదాలను దుర్వినియోగం చేసినట్టుగానే “రసికుడు” అనే పదాన్ని కూడా దుర్వినియోగం చేశాయి. శృంగారలోలుడు అనే అర్థాన్ని ప్రేక్షకుల మెదళ్లలో కూరి కూరి వదిలాయి.

శృంగారంలో మాత్రం తప్పు ఏముంది? 
నవరసాలను పేర్కొనే శ్లోకంలో శృంగారానికే మొదటి స్థానం ఇచ్చారు.

శృంగారహాస్యకరుణరౌద్రవీరభయానకాః.
బీభత్సాద్భుతశాంతాశ్చ నవ నాట్యే రసాః స్మృతాః. – అన్నారు.

మహాకావ్యాలలో అంగిరసాలుగా ఉండదగినవి - శృంగారము లేదా వీరము. మిగిలినవి అంగరసాలు మాత్రమే అనేశారు పెద్ద పెద్ద సాహిత్యశాస్త్రవేత్తలు కూడా. కాబట్టి, శృంగారపురుషుడై ఉండటం తప్పేమీ కాదు.

కాని, అదే సాహిత్యశాస్త్రవేత్తలు రసాభాసలను కూడా పేర్కొన్నారు. అంటే అవి రసం లాగా అనిపిస్తాయేమో కాని, నిజానికి రసాలు కావు అని అర్థం. 

వీరరసం ప్రధానమైనదే – కాని పడకగదిలో కూర్చుని “ఆ శత్రువును ఇలా ఎదుర్కోవాలి, ఈ శత్రువును ఇలా దునుమాడాలి” అని వీరాలాపాలు చేస్తే అది రసాభాస. 

అలాగే శృంగారరసం కూడా ప్రధానమైనదే – కాని, యుద్ధరంగంలో విజృంభించవలసిన వేళ ప్రియురాలి చెంతకు చేరి సరససల్లాపాలు ఆడాలనిపిస్తే మాత్రం అది రసాభాస.

శత్రువును పరాభవిస్తే – అది వీరరసం. కాని, గౌరవింపదగిన పెద్దలను పరాభవిస్తే అక్కడ వీరరసాభాస మాత్రమే. అక్కడ ఆ పని చేసినవాడిమీద జుగుప్స కలుగుతుంది. అంటే అది బీభత్సరసం ఔతుంది.

సీతారాముల మధ్యనో రాధాకృష్ణుల మధ్యనో ఉన్న అనురాగాన్ని వర్ణిస్తే అది శృంగారరసం అవుతుంది. ఆ శృంగారం కూడా రెండు రకాలు. విప్రలంభశృంగారం అని, సంయోగశృంగారం అని. ఎడబాటులో ఉన్నపుడు – విప్రలంభం, పరస్పరసముఖత ఉన్నపుడు సంయోగం అన్నమాట. 

భవభూతి వ్రాసిన ఉత్తరరామచరితంలో సీతారాముల నడుమ విప్రలంభశృంగారం దేదీప్యమానమైనది.

సంయోగశృంగారవర్ణనలు కలిగిన కావ్యాలకు కూడా కొదవ లేదు. 

ఇట్లా కేవలం శృంగారాన్ని మాత్రమే కాదు, నవరసాలను చక్కగా పండించిన కావ్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. 

రసాభాస కాకుండా వాటిని సర్వజనమనోరంజకంగా నడిపిన కవులను భర్తృహరి ప్రశంసించాడు కూడా.

“జయంతి తే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాః,
నాస్తి యేషాం యశఃకాయే
జరామరణజంభయమ్” - అన్నాడు. 

ఈ నవరసాలన్నీ యథాయోగ్యంగా భారతీయులచేత ఆదరింపబడ్డాయి. కాబట్టి, భారతీయులు రసహృదయులే (రసికులే) కాని నీరసహృదయులు కారు. అందులో సందేహం అక్కరలేదు, అసహ్యించుకొనదగినది కూడా ఏమీ లేదు.

కాని, 
రసికత్వం ఉండవలసింది కేవలం కవులలోనే కాదు, చదివే పాఠకులలో కూడా ఉండాలి. అప్పుడే ఆ కవిత్వానికి రాణింపు. అప్పుడే ఆ కవిత్వానికి మెప్పుకోలు. 

“ఓ చతురాననుడా! మిగిలిన కష్టాలను వందలకు వందలుగా, యథేష్టంగా, మా నుదుటన వ్రాసుకో, సహిస్తాము. కాని, సమయసంగతిసందర్భాలను పట్టించుకోకుండా మా కవిత్వాన్ని అపార్థం చేసుకొనేవారికి, లేదా ఏమాత్రం అర్థం చేసుకోలేని నీరసహృదయులకు మా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం మాత్రం మా నుదుటన వ్రాయబోకయ్యా" – అని కవులు బ్రహ్మను పరిపరివిధాల వేడుకున్నారట.

"ఇతరతాపశతాని యదృచ్ఛయా విలిఖ
తాని సహే చతురానన.
అరసికేషు కవిత్వనివేదనం శిరసి
మా లిఖ మా లిఖ మా లిఖ."

ఇలా ఎందుకు వేడుకొనడం అంటే – 
ఈ నీరసహృదయులు చక్కని కవిత్వానికి కూడా వంకలు పెడతారు. అపహాస్యం చేస్తారు. విపరీతార్థాలను కల్పిస్తారు. అలా చేసి, ఆయా కవుల పట్ల, కవిత్వం పట్ల విముఖత్వం కలిగించినా పరవాలేదు. 

కాని, 
ఈ అరసికులు ఆయా కావ్యాలలో ఉన్నతాదర్శాలకు ప్రతీకగా తాము నిలిపిన పాత్రల పట్ల కూడా వైముఖ్యం కలిగిస్తారు. అందుకని.

భారతీయకావ్యశాస్త్రసంప్రదాయంలో అందరి చేత ఎంతగానో గౌరవింపబడే అభినవగుప్తాచార్యులు అని ఒకానొక మహాపండితుడు (క్రీస్తుశకం 950 సం.) ఉన్నారు. ఆయన సహృదయుడు అనే పదం వాడారు. సహృదయుడు అంటే కవితో సమానమైన హృదయం కలిగినవాడు – అంటే – కవి హృదయాన్ని అర్థం చేసుకొనగలిగిన వాడు అని అర్థం. అతడే రసికుడు. అంటే - కవిహృదయాన్ని అర్థం చేసుకొనలేని వాడు నీరసికుడు అన్నమాట!

"సీతను వెదుకుతూ రావణుని అంతఃపురానికి వెళ్లిన హనుమంతుడు అక్కడ నిద్రావస్థలో ఉన్నటువంటి, చెదిరిన వస్త్రాభరణాలతో ఉన్నటువంటి యువతులను చూశాడు" అన్నంతవరకు ఏ ఇబ్బంది లేదు. అందులో అసహజం అయినది ఏమీ లేదు. 

కాని, 
అక్కడ హనుమంతుని కూడా అతి సామాన్యుడైన ఒక చంచలహృదయునిగా భావించి “ఆహా! ఎంతటి లక్కీ ఫెలో రా!” “ఆహా ఎంతటి రసికుడురా!” అని పాఠకులు కామెంట్లు చేస్తే మాత్రం నిస్సందేహంగా అది వారి నీరసికత్వమే.

ఆ సమయంలో రాముని కార్యం పూర్తి చేయాలి అనే సుస్థిరమైన ధ్యేయం తప్ప మరేమీ హనుమంతుని మనసులో లేదు. 

సీతకోసం బయలుదేరిన హనుమంతునికి దారిలో మైనాకుడు ఎదురై విశ్రాంతి తీసుకోమన్నాడు. హనుమంతుడు నిరాకరించాడు. నాగమాత సరమ తన నోటిలోనికి ప్రవేశించకుండా హనుమంతుడు ముందుకు పోలేడని సవాలు చేసింది. హనుమంతుడు చాకచక్యంగా ఆమె నోటిలోనికి ప్రవేశించి కూడా సురక్షితంగా బయటకు వచ్చాడు. తనను ఆహారంగా చేసుకోదలచిన సింహికను భుజబలంతో నిర్జించాడు. లంకిణిని ఒక్క పిడికిటిపోటుతో పడగొట్టాడు. లంకలో ఎవరి కంటనైనా పడితే పని చెడిపోతుందని భావించి అంగుష్ఠమాత్రుడై సంచరిస్తూ సీతను వెదుకుతున్నాడు. అదే ప్రయత్నంలో రావణుని అంతఃపురంలో కూడా వెదికాడు. అక్కడ పైన చెప్పినట్లు వివిధ అవస్థలలో నిద్రిస్తున్న స్త్రీలను చూశాడు. అయినా అతని మనస్సులో ఎటువంటి వికారమూ కలుగలేదు. వీరెవరూ సీత కాదు అని నిశ్చయించుకుని తన అన్వేషణను కొనసాగించాడు. ఇన్ని పనులు చేస్తూ కూడా అతడు తన అలసటను, ఆకలిదప్పులను ఏమాత్రం లెక్కచేయలేదు. 

ఇంతవరకు, ఈ విధంగా హనుమంతుని కార్యసాధకత్వాన్ని పాఠకుల మనసులో ముద్రవేయడానికి వాల్మీకిమహర్షి సుందరకాండలో 11 సర్గలను, 621 శ్లోకాలను వెచ్చించి, గొప్ప ప్రయత్నం చేశాడు.

కాని, ఆ మహాకవి ప్రయత్నాలకు చెదగొడుతూ, ఆ ప్రయత్నాలను చెడగొడుతూ, ఆయన ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా “రావణాంతఃపురంలో ఆ విధంగా ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుడు రసికుడే (శృంగారపురుషుడే) సుమా” అని వ్యాఖ్యానిస్తే మాత్రం వెగటు పుడుతుంది. 

మహోన్నతమైన హనుమంతుని వ్యక్తిత్వాన్ని విస్మరించి, అతనికి లేని దోషాన్ని ఆపాదించడంవల్ల హాస్యరసం పుట్టదు. జుగుప్స అనేది స్థాయిభావంగా కలిగిన బీభత్సరసం పుడుతుంది.

ఆహా, అలాగేం కాదు, కవి హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను, అక్కడ ప్రతిపాదింపబడింది శృంగారరసమే తప్ప వీరరసం కాదు అని దబాయించే అవకాశం కూడా ఉంది. 

కాని, ఏ రసాన్నైనా వ్యక్తపరిచే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని అనుభావాలు అంటారు. “అనుభావో వికారస్తు భావసంసూచనాత్మకః” – అని దశరూపకం అనే గ్రంథంలో ధనంజయాచార్యులు (క్రీస్తుశకం 975 సం.) చెప్పారు. 

తాత్కాలికమైన నిశ్చేష్టత, తాను ఉన్న పరిసరాలను విస్మరించడం, పులకింతలు, స్వేదం, ముఖకవళికలలో మార్పు, దొంగచూపులు, మాటల్లో తడబాటు – ఇటువంటివి అన్నమాట. 

సుందరకాండలో ఆ స్త్రీలను చూసిన హనుమంతుడిలో ఇటువంటి వికారభావాలు ఏమీ కలుగలేదు. అలాగే, శృంగారరసాన్ని సూచించే కొన్ని సంచారి భావాలు – హర్షము, ఈర్ష్య, మోహము – వంటివి కూడా హనుమంతునిలో ఈషణ్మాత్రం కలుగలేదు. అందువల్ల అక్కడ హనుమంతుడు శృంగారపురుషుడు అని చెప్పడం సమంజసం కాదు. 

వీరిలో సీత లేదు అని నిశ్చయించుకుని, మరెక్కడ ఉందో వెతకాలి అని భావిస్తూ తక్షణమే అక్కడనుండి వెడలిపోయాడు. కాబట్టి, ఇక్కడ కూడా హనుమంతుని కార్యసాధకత్వమే – ఎటువంటి ఆటంకాలకూ లొంగని ఉత్సాహమే – కవి చేత ప్రతిపాదించబడింది. అదే వీరరసం. 

ఇలా కవిహృదయాన్ని అర్థం చేసుకోకుండా, మాకు తెలిసిందే రసం అంటే - మా ఇంట్లో, కిటికీలు మూసిన గదిలో వెలుతురు లేకపోవడానికి కారణం ఆ సూర్యుడే అని నిందించినట్లు ఉంటుంది.

అందుకే ఇలాంటివారికి కవిత్వం వినిపించే దౌర్భాగ్యం మా నుదుటన వ్రాయకు దేవుడోయ్ అని ఆ కవులు మొత్తుకున్నది.

మనకుడబ్బు అవసరమే, అలాగే చెప్పులు కూడా అవసరమే. కాని, దేనిని ఎక్కడ పెట్టాలో దానిని అక్కడే పెట్టాలి. ఇంటి బయట చెప్పుల స్టాండులో డబ్బూ నగలూ పెట్టం. అలాగే, బ్యాంకులో లాకర్ తీసుకొని అందులో మన చెప్పులు దాచుకోం. నాకు ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అని వీధిలో ఎగ్జిబిషన్ పెట్టం. అలాగే చెప్పులను జేబులో పెట్టుకుని తిరగం. 

ఈ విధంగా ప్రతిదానికి నిర్దేశింపబడిన లోకరీతి ఒకటి ఉంటుంది. దానినే ఔచిత్యం అంటారు. దానినే మర్యాద (హద్దు) అంటారు. ఔచిత్యంపాటించకుంటే లోకంలో నవ్వులపాలు అవుతారు. మర్యాద పాటించకుంటే లోకం ఆ మనిషిని దూరంగా పెట్టే ప్రమాదం ఉంది.

కాబట్టి, శృంగారరసాన్ని ఆస్వాదించేందుకు తగిన కావ్యాలు బోలెడున్నాయి. అక్కడ నిరభ్యంతరంగా ఆస్వాదించుకోవచ్చు.  కృష్ణుడు నాయకుడుగా కలిగిన ఒక శృంగారకావ్యాన్ని చూపి చూశారా కృష్ణుడు ఎంతటి రసికుడో? అంటే ఏ గొడవా ఉండదు. కాని, యుద్ధరంగంలో అర్జునునికి భగవద్గీతను బోధించే కృష్ణునిలో శృంగారపురుషత్వం చూస్తే అది రసాభాస.  అలా చూసేవాడు తింగరివాడు. 

అలాగే, సుందరకాండలో హనుమంతుని లోకోత్తర-ఉత్సాహాన్ని – అంటే వీరరసాన్ని – కవి ప్రతిపాదిస్తూ ఉండగా అక్కడ ఆ వీరరసాన్ని ఆస్వాదించకుండా హనుమంతుడిని శృంగారపురుషుడని కామెంటు చేయడం వల్ల రసాభాస జరగక మానదు. అదే జరిగింది కూడా.

కాబట్టి మనం కవిహృదయాన్ని తెలుసుకుని రసికులం అవుదాం – కవి హృదయాన్ని పెడదారి పట్టించి నీరసికులం కాకుండా ఉందాం. 

ఇదంతా మా మిత్రుని పోస్టులో, కామెంట్లలో పెట్టదగినంత చిన్న విషయం కాదు కాబట్టి, నా గోడ మీద ప్రత్యేకమైన పోస్టుగా వ్రాయవలసి వచ్చింది.

ఇతి శమ్.

No offending Comments Please...

రాజ్యబహిష్కారశిక్ష


జానపదుల కథ లెండి. ఎంతటివారినైనా ఎలాగైనా తమ కథలోనికి ఒక పాత్రగా లాగేస్తారు. ఎప్పటి కృష్ణరాయలు, మరెప్పటి రామలింగడు! పాత్రలు చాల ప్రాచీనమైనవే! పాఠం మాత్రమే నిత్యనూతనం!

ఓ సారి సభ జరిగింది.
సభలో ఎవరు గొప్పవారనే చర్చ వచ్చింది.

కొందరు అమ్మ గొప్పదన్నారు.
కొందరు తల్లిదండ్రులిరువురూ గొప్పవారన్నారు.
కొందరు గురువు గొప్పవాడన్నారు.
కొందరు రైతు గొప్పవాడన్నారు.
కొందరు భూదేవి గొప్పదన్నారు.
కొందరు సూర్యుడు గొప్పవాడన్నారు.
కొందరు దేవుడు గొప్పవాడన్నారు.

వాదోపవాదాలు జరిగాయి.
చివరకు దేవుడు గొప్పవాడనే పక్షం వాళ్లది పైచేయి అయింది. ఇంత జరుగుతున్నా తెనాలి రామలింగడు నోరు విప్పితే ఒట్టు! అందరికీ అది వింతల్లోకెల్లా వింతగా ఉంది. చేప నేలమీద బతికినంత, చీమ సముద్రాన్ని ఈదినంత వింతగానే ఉంది అందరికీ.

చివరకు కృష్ణరాయలే అడిగేశాడు - "ఏమంటావ్ రామలింగా, నిశ్శబ్దంగా ఉన్నావేం? అంటే దేవుడే అందరికంటె గొప్పవాడని నువు కూడా ఒప్పకున్నట్టే కదా?" అన్నాడు.

ఈ అవకాశంకోసమే ఎదురుచూస్తున్నాడేమో మనిషి, "ఒప్పుకోనుగాక ఒప్పుకోను మహారాజా!" అనేశాడు.

దేవుడిగొప్ప పక్షం వాళ్లు తక్షణమేవిరుచుకుపడ్డారు.
ఎవరు?
ఎవరది?
ఎక్కడున్నారు?
నువు చూసొచ్చావా?
అని ప్రశ్నలపరంపర మొదలైంది.

"అవును.
నేను చూశా.
చూస్తూనే ఉన్నా.
ఇక్కడే ఉన్నారు.
మీరు కూడా చూస్తూనే ఉన్నారు."
అన్నాడు రామలింగడు తాపీగా.

ఎవరో?
అదెవరో?
ఎవరికీ ఊహకు కూడా అందలేదు.

కాసేపయ్యాక,
మళ్లీ మాటలు మొదలు.
"ఎవరది?
చెప్పు.
పేరు చెప్పు.
చూపించు."

"ఇంకెవరనుకున్నారు?"
👀👀👀👀👀👀
అందరి కళ్లూ రామలింగడినే చూస్తున్నాయి.
👂👂👂👂👂👂👂
అందరి చెవులూ రామలింగడి మాటలనే వింటున్నాయి.

"అదెవరో కాదు,
సాక్షాత్తు మన మహారాజులవారే!
వారే దెవుడికంటె గొప్పవారు!"
అన్నాడు రామలింగడు.

😶 😶 😶
అంతే! కాసేపు భయంకరమైన నిశ్శబ్దం తాండవనృత్యం చేసింది. ఏ ఒక్కడూ కిక్కురుమనలేదు. లేదు, మహారాజు కంటె దేవుడే గొప్పవాడు అనేంత సాహసం ఏ ఒక్కడూ చేయలేకపోయాడు. రామలింగడు రాజుగారిని అందరిముందు ఇంతగా కాకా పట్టగలడని ఒక్కరంటే ఒక్కరు కూడా ఊహించలేకపోయారు. చివరకు ఏకంగా రాజుగారు కూడా. ఇలా విజయవంతంగా రామలింగడు అందరినోర్లూ మూయించేశాడు.

కాసేపయ్యాక కొందరు చప్పట్లు కొట్టారు. వారిని చూసి మరికొందరు కొట్టారు. చివరికి అందరూ కొట్టారు. దేవుడిగొప్పపక్షంవాళ్లు కూడా విధిలేక చప్పట్లు కొట్టవలసి వచ్చింది.

👏👏👏

ఇప్పుడు విజేతకు బహుమతినివ్వాలి!
రాజుగారు తన చేతులమీదుగానే ఇవ్వాలి!
రామలింగడు చిరునవ్వుతో రాజుగారిని చూస్తున్నాడు.

కాని,
కాని,

రాజుగారికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి!
తనను దేవుడికంటె గొప్పవాడని పొగిడించుకుని, అందుకు బహుమతిని ఇస్తున్నట్టుంది! తనకు ఇంతటి ఇబ్బందిని కలిగించిన రామలింగడిమీద రాజుగారికి పట్టలేనంత కోపం వచ్చింది.

"చూడు రామలింగా!" అన్నాడు.

"చూడు,
దేవుడి కంటే మహారాజే గొప్ప అని ఊరికే అనడం కాదు, ఏ విధంగా గొప్పో సహేతుకంగా చెప్పి అవునంటూ సభలో అందరినీ ఒప్పించాలి. లేెదంటే ముందు నీకు, ఆ తరువాత ఇపుడు చప్పట్లు కొట్టినవారందరికీ కొరడా దెబ్బలు తప్పవు"

అందరికీ భయమేసింది.
మళ్లీ అందరి కళ్లూ అందరి చెవులూ రామలింగడివైపు జాలిగా తిరిగాయి. రామలింగడే మమ్మల్ని కాపాడాలి! రామలింగడే గెలవాలి! అని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. చేయక చస్తారా? తమచేత కూడా చప్పట్లు కొట్టించి ఇరికించేశాడుగా మరి! రాలింగడిమీద పీకలదాకా కోపం ఉన్నవాళ్లు కూడా రామలింగడే గెలవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

"సహేతుకంగానే చెబుతాను మహారాజా!" అన్నాడు రామలింగడు. "నా అంతటి హేతువాది, మునుపు లేడు, ఇపుడు లేడు, ఇకమీదట రాబోడు" అన్నాడు.

"సరే, చెప్పు మరి!"

"మీరు చేయగలిగిన ఒక పనిని దేవుడు కూడా చేయలేడని నిరూపిస్తా. ఆ లెక్కన మీరు దేవుడి కంటె గొప్పవారని నిరూపించబడినట్లేగా?"

శ్రీకృష్ణదేవరాయలతో సహా సభాసదులందరూ ఆశ్చర్యపోయారు.

ఏమిటది?
ఏమిటా పని?
రాజు చేయగలిగి, దేవుడు మాత్రం చేయలేని పని అంటూ ఒకటి ఉంటుందా?

కొందరు 😱😱😱 ఇలా చూస్తున్నారు.

కొందరు 😵😵😵 ఇలా చూస్తున్నారు.

ఇంకొందరు 🤔🤔🤔 ఇలా చూస్తున్నారు.

"అదేమిటో చెప్పవయ్యా, ఆలోచిద్దాం, దేవుడు చేయగలడో లేడో?" అన్నారు మహారాజావారు.

"ఏముంది మహారాజా?
మీకు ఎవరిమీదనైనా కోపం వస్తే దేశబహిష్కారశిక్ష వేయగలరు. చెప్పండి, దేవుడు ఆ శిక్షను వేయగలడా? వేసినా అమలు జరిపించుకోగలడా?"

సభ దద్దరిల్లిపోయింది.
👏👏👏👏👏👏👏
చప్పట్లే చప్పట్లు.

రాజుగారి రాజ్యానికి హద్దులున్నాయి. కాబట్టి రాజ్యబహిష్కారశిక్ష వేస్తే మెడబట్టి సరిహద్దుల బయటకు గెంటేస్తారు. మరి దేవుని రాజ్యానికి హద్దులేవీ? సమస్తవిశ్వమూ ఆయన రాజ్యమే కదా? మరి ఎక్కడకు గెంటివేయగలడు, పాపం?

రామలింగని యుక్తికి చప్పట్లు. రామలింగడు తమకు శిక్ష తప్పించినందుకు చప్పట్లు. దేవుడే గొప్ప పక్షంవాళ్లు తమ దేవుడిని రామలింగడు తక్కువ చేయనందుకు చప్పట్లు.

శ్రీకృష్ణదేవమహారాయల పెదవులమీద దరహాసం కనిపించింది. రామలింగడు మరీ మతిమీరి మితిమీరిన పొగడ్తలతో తనను ఇబ్బంది పెట్టనందుకు.

విజేతగా నిలిచిన రామలింగనికి మహారాజులవారే స్వయంగా బహుమతిని అందజేశారు.

💮శుభం💮

శ్రీరాముని వనవిహారం

ఆహా సీతా!
विचित्रपुलिनां रम्यां हंससारससेविताम्।
कमलैरुपसम्पन्नां पश्य मन्दाकिनीं नदीम्।।
రంగురంగుల ఇసుకతిన్నెలతోనూ రమ్యమైనది, హంసలు సారసపక్షులకు ఆశ్రయం ఇస్తున్నదీ, మిక్కిలి కమలాలతో శోభిస్తున్నదీ అయిన ఈ మందాకినీ నదిని చూడు!
ఈ నదీతీరంలో ఎన్నెన్ని చెట్లు పెరిగాయో చూడు! అవి పూవులతోనూ పండ్లతోనూ ఎలా కళకళలాడుతున్నాయో చూడు!
జింకలు గుంపులు గుంపులుగా వచ్చి నీటిని బురదరంగులోనికి ఎలా మార్చేస్తున్నాయో చూడు! ఆహా ఈ రమణీయతీర్థాలు నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి!
కొండమీద చెట్లు గాలికి ఎలా ఊగిపోతూ పూవులను ఆకులను ఎలా వెదజల్లుతున్నాయో చూడు! నదికి అటూ ఇటూ ఉన్న ఈ కొండలు తమ చేతులను ఊపుతూ నాట్యం చేస్తున్నట్లు లేవూ?
दर्शनं चित्रकूटस्य मन्दाकिन्याश्च शोभने।
अधिकं पुरवासाच्च मन्ये च तव दर्शनात्।।
ఓ సీతా!
నిన్ను, ఈ చిత్రకూటాన్ని, మందాకినీనదిని చూస్తుంటే అయోధ్యాపురంలో నివాసం దీనికంటె సుఖప్రదం కాదనిపిస్తోంది!
హాయిగా మూడుపూటలా స్నానం చేస్తూ, తేనెలను, దుంపలను, పండ్లను ఆరగిస్తూ ఉంటే అయోధ్య కాని, కోసలరాజ్యం కాని అసలు గుర్తుకే రావటం లేదు.
అంటూ చిత్రకూటం చెంత మందాకినీ తీరంలో -
ఓ లక్ష్మణా!
విన్నావా! నెమళ్ల క్రేంకారనాదాలు! ఆ కొండగుహలను చూడు, ఎన్నెన్ని ఉన్నాయో! ఎంతెంత పెద్దవో! చూడు!
ఆ కొండల మీద బంగారు, వెండి, రాగి రంగులలో మిల మిల మెరుస్తున్న ధాతువులను చూడు!
సాల వృక్షాలు, తాళవృక్షాలు, తమాలవృక్షాలు, ఖర్జూరాలు, పనసలు, ఆమ్రాలు, చంపకాలు, కేతకులు, చందనాలు, నీపాలు, లికుచాలు, ధవాశ్వాలు, శమీకింశుకపాటలాలు! ఆహా! ఎన్నెన్ని రకాలతో వృక్షసంపద ఇక్కడ నిండుగా వర్ధిల్లుతున్నదోో చూడు!
అంటూ గోదావరీతీరాన పంచవటిలో -
ఆహా లక్ష్మణా!
పంపానదీజలాలలో తేలాడుతూ వాటి అలలపై ఊగాడుతున్న వందలు వందల పక్షిసమూహాలను చూడు! నెమళ్లు, క్రౌన్చాల మధురధ్వానాలను విను!
లక్ష్మణా!
వర్షాకాలం వచ్చిందిగా! మేఘాలు మనం ఉంటున్న గుహకు ఎంత చేరువగా వచ్చాయో చూడు, ఈ మేఘాలను మెట్లుగా చేసుకుని, కొండపైకి పోయి, కొండమల్లెలు, గన్నేరులు కోసుకుని, మాలలల్లి, సూర్యునికి మనం సమర్పించుకోవచ్చును!
मेघोदरविनिर्मुक्ताः कल्हारसुखशीतलाः।
शक्यम् अञ्जलिभिः पातुं वाताः केतकिगन्धिनः।।
కలువల చల్లదనాన్ని, మొగలిపూల సువాసనలను మోసుకొస్తూ మేఘాలనే తెరల నడుమనుండి గాలి మనవైపే సూటిగా వీస్తున్నది చూడు! ఆహా! ఈ చల్లని పిల్లగాలులను దోసిళ్ళతో పట్టి తాగేయవచ్చుననిపిస్తోంది కదా లక్ష్మణా!
వర్షాకాలం ముగిసి శరదృతువు ఆరంభం కాబోతోంది. మేఘాలు కుంభవృష్టిని మానేసి ఉరుముతున్నాయి. సెలయేళ్ళ శబ్దం నెమళ్ళ అరుపులను తలపిస్తోంది. మేఘాలను శిఖరాలపై దాల్చిన పర్వతాలు మదపుటేనుగుల్లా ఉన్నాయి చూడు లక్ష్మణా!
అంటూ కిష్కింధ చెంత ప్రస్రవణగిరిపై -
ఇలా - వాల్మీకి మహర్షులవారి రాముడు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరచిపోయేవాడు.
కాని, రంగనాయకమ్మ గారు తన రాముడు అందాలను ఆస్వాదించలేని జడబుద్ధి మందబుద్ధి, అంటూ తిట్టి తిట్టి పోసుకుంది.
అందుకే,
వాల్మీకి రాముడితో రంగనాయకమ్మ గారి రాముడిని పోల్చకండి.
ఈ రాముళ్లు ఇద్దరూ పూర్తిగా వేరు వేరు.
వాల్మీకి రాముడిని ప్రపంచమంతా మెచ్చింది.
రంగనాయకమ్మ గారి రాముడు స్వయంగా కన్నతల్లి అయిన రంగనాయకమ్మకే నచ్చలేదు!
రంగనాయకమ్మగారు ఇద్దరు రాముళ్ళూ ఒకటేనని అందరికీ నచ్చజెప్పేందుకు విషవృక్షం ఎక్కి అరుస్తోంది. నమ్మకండి. తన నీళ్లను పాలలో పోసి కలిపేసి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యాపారి ఈవిడ!

Friday, 20 July 2018

రాముడు నిజంగా పితృవాక్యపాలకుడేనా?

అదెప్పుడో - త్రేతాయుగం. 
వసంతకాలం ఆరంభమైంది. చైత్రమాసం. శుక్లపక్షం. పునర్వసునక్షత్రయుక్తమైన దినం.

శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణునితోను, ఇతర మిత్రులతోనూ కలిసి ఉల్లాసంగా మాటలాడుతున్నాడు. ఇంతలో దశరథమహారాజుకు ఎంతో విశ్వాసపాత్రుడైన సుమంత్రుడు అక్కడకు విచ్చేశాడు. "రామా! మీ తండ్రిగారు వెంటనే నిన్ను తన చెంతకు రమ్మని ఆదేశించారు" అని పలికాడు. రాముడు తక్షణమే అతని వెంట బయలు దేరి వెళ్ళాడు.

నాలుగు దిక్కుల నుండి విచ్చేసిన రాజుల నడుమ దశరథ మహారాజు కొలువు దీరి ఉండగా రాముడు ఆ సభలో ప్రవేశించాడు. రాముని చూడగానే సభలో ఉన్న పౌరజానపదులు, రాజులు అందరూ జయజయధ్వానాలు చేశారు. అప్పటికే దశరథుడు రాముని పట్టాభిషేకవిషయంలో ఏకగ్రీవంగా ప్రజామోదాన్ని పొంది ఉన్నాడనే విషయం రామునికి ఇంకా తెలియదు. తనకు పాదాభివందనం చేసిన రాముని దశరథుడు తనివి తీరనట్టు చూస్తూ, "నాయనా, నీవు పుష్యమీ నక్షత్రయుక్తమైన రేపటి రోజున యువరాజపట్టాభిషిక్తుడవు కావాలి. ప్రజలను రంజింపజేస్తూ భూమిని పాలించాలి." అని పలికాడు. శ్రీరాముడు తండ్రి మాటను అంగీకరించి, ఆయనకు నమస్కరించి, తన నివాసభవనానికి వెళ్ళాడు.

దశరథునికి తన అంతః పురానికి చేరగానే మరలా ఒకసారి రాముని చూడాలనిపించింది. మరలా సుమంత్రునితో కబురు పంపగా రాముడు మరలా వచ్చాడు. "నాయనా! ప్రజలందరూ నిన్నే తమ రాజుగా కోరుకుంటున్నారు. అందువల్ల నిన్ను యువరాజుగా అభిషేకిస్తాను. నాయనా! నా మనసు మారక ముందే, రేపే ఆ శుభకార్యం జరగాలి. "చలా హి ప్రాణినాం మతిః" - ప్రాణుల బుద్ధి చంచలమైనది అని అంటారు కదా!" అన్నాడు. రాముడు సరేనన్నాడు.

అక్కడనుండి బయలు దేరి తల్లి ఆశీస్సులను అందుకున్నాడు. వశిష్ఠమహర్షి చెప్పిన ప్రకారంగా సీతాసమేతుడై వ్రతదీక్షితుడు అయ్యాడు. మరుసటి రోజు ఉదయమే చక్కని వస్త్రాభరణాలను ధరించి రాముడు సిద్ధంగా ఉండగా మరలా సుమంత్రుడు వచ్చాడు. "కైకేయీసమేతుడై ఉన్న మీ తండ్రి మిమ్మల్ని చూడగోరుతున్నాడు. ఆలస్యం చేయక వెంటనే వెళ్ళవయ్యా రామయ్యా" అన్నాడు.

రాముడు మహానందభరితుడై బయలుదేరాడు. అక్కడ కైకేయీ మందిరంలో దీనముఖంతో ఉన్న తండ్రిని రాముడు చూశాడు. పినతల్లికి, తండ్రికి నమస్కరించాడు. తండ్రి "రామా!" అని మాత్రమే తండ్రి పలికాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. రాముని సూటిగా చూడలేకపోయాడు. అతనితో నోరు విప్పి మాటలాడలేకపోయాడు. అతని మనసులో ఏదో అపరాధభావం.

తండ్రి పరిస్థితి రామునికి కంగారును కలిగించింది. "అమ్మా! ఎందుకు నాన్నగారు నాతో మాట్లాడటం లేదు? నావల్ల ఏదైనా తప్పు జరిగిందా?"

అతోషయన్ మహారాజమ్ అకుర్వన్ వా పితుర్వచః।
ముహూర్తమపి నేచ్చేయం జీవితుం కుపితే నృపే।।
(రామాయణం 2.18.15)

"మహారాజైన నాన్నగారిని సంతోషపెట్టకుండా, ఆయన చెప్పిన మాటను పాటించకుండా ఆయన కోపానికి గురై ఒక్క ముహూర్తకాలం కూడా బ్రతకడానికి నేను ఇష్టపడను" అని ప్రక్కనే ఉన్న పినతల్లి కైకేయిని తండ్రి దీనస్థితికి కారణం అడిగాడు.

"నాయనా! మీ తండ్రి మునుపు నాకొక వరం ఇచ్చి ఉన్నాడు. నేను దానిని తీర్చమని ఇప్పుడు అడిగాను. దానిని నెరవేర్చితే నీవు ఏమనుకుంటావో అనే భయంతో నీతో మాట్లాడటం లేదు. రాజు నీకు చెప్పదలచుకున్నది నీకు ఇష్టమనిపించినా కష్టమనిపించినా తప్పక చేస్తానని మాట ఇస్తే నేనే నీకు చెబుతాను" అన్నది కైకేయి.

అందుకు రాముడు -
"కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్ణాభిభాషతే" (2.18.30)
అమ్మా! తప్పక చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు రెండువిధాల మాటలాడడు. రాజు, తండ్రి అయిన ఆయన మాటపై నిప్పులో దూకడానికైనా, విషం త్రాగడానికైనా, సముద్రంలో మునిగిపోవడానికైనా నేను సిద్ధమే. మహారాజు మనసులోని మాట నాకు చెప్పండి." అన్నాడు.

"రామా! భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు వెంటనే దండకారణ్యానికి వెళ్లి అక్కడ పద్నాల్గు సంవత్సరాలు గడపాలని నేను రాజుగారిని కోరాను.

ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।।
(రామాయణం 2.18.40)

మీ నాన్నగారి మాటను నిలబెట్టాలనుకుంటే నువ్వు వెంటనే బయలుదేరు" అన్నది కైకేయి.

వెంటనే రాముడు -
"ఏవమస్తు గమిష్యామి వనం వస్తుం అహంత్వితః।
జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్।।
(రామాయణం 2.19.2)

"సరే, ఇదిగో రాజుగారి ప్రతిజ్ఞ (వరమిస్తానని నీకిచ్చిన మాట) మేరకు జటలను, జింకచర్మాన్ని ధరించి అడవిలో నివసించడానికి బయలుదేరుతున్నాను" అంటూ పెద్దగా కాలహరణం చేయకుండా బయలుదేరాడు.
***********
ఇదీ జరిగిన కథ - కానీ,

"ఓ రామా! నువ్వు పట్టాభిషేకం చేసుకో" అని దశరథుడు రామునితో నేరుగా చెప్పిన మాట నిజం. కానీ, ఆయన అదే నోటితో "ఓ రామా! నీవు అడవికి పో" అంటూ నేరుగా చెప్పలేదుగా?" కైకేయి దుర్బుద్ధితో తన మనసులో ఉన్న మాటను చెప్పేసి, అదే నీ తండ్రి మనసులోని మాట. దాన్ని పాటించు అన్నంత మాత్రాన సరే అంటూ పౌరుషంతో రాముడు రాజ్యాభిషేకం వదులుకొని అడవికి అలా వెళ్లిపోవడం సమంజసమేనా?"

ఆవిధంగా తండ్రి తనతో చెప్పని మాటను పట్టుకుని రాముడు అడవికి పోతే అతనికి "పితృవాక్యపరిపాలకుడు" అనే బిరుదు ఎందుకు వచ్చింది? అసలా బిరుదును అతనికి తగిలించిందెవరు? అని కొందరు సోదరులకు పెద్ద సందేహమే వచ్చింది.

వారి సందేహానికి నాకు తోచిన సమాధానం ఇది -



"ఓ రామా! నువ్వు పట్టాభిషేకం చేసుకో" అని దశరథుడు రామునితో నేరుగా చెప్పిన మాట నిజం. కానీఆయన అదే నోటితో "ఓ రామా! నీవు అడవికి పో" అంటూ నేరుగా చెప్పలేదుగా?"

"కైకేయి దుర్బుద్ధితో తన మనసులో ఉన్న మాటను చెప్పేసిఅదే నీ తండ్రి మనసులోని మాట. దాన్ని పాటించు అన్నంత మాత్రాన సరే అంటూ పౌరుషంతో రాముడు రాజ్యాభిషేకం వదులుకొని అడవికి అలా వెళ్లిపోవడం సమంజసమేనా?"

"దశరథుడు నోరెత్తి అడవికి పోవయ్యా అని రాముడికి చెప్పనే లేదు కదా?  మరి అలా చెప్పించుకోకుండానే బయలుదేరి అడవికి వెళ్లిపోయిన రాముడికి  "పితృవాక్యపరిపాలకుడు" అనే బిరుదు ఎందుకు వచ్చింది?  అసలా బిరుదును అతనికి తగిలించిందెవరు?" అని కొందరు సోదరులకు పెద్ద సందేహమే వచ్చింది
**********
**********
తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షిని చూసేసరికి వాల్మీకికి పరమానందం కలిగింది.    నారదుడు గొప్ప తపస్సంపన్నుడు.  స్వాధ్యాయతత్పరుడు.  మహావాగ్మి.  తన సందేహాలను అలవోకగా తీర్చగలిగిన దిట్ట. 

వచ్చిన నారదునికి అతిథి పూజ చేసిన తరువాతవాల్మీకి పదహారు గొప్ప గుణాలను పేర్కొని,  తన సమకాలికులలో ఆ గుణాలన్నింటిని కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు.  "లేకనేమయ్యా?  ఉన్నాడుగా రాముడు?" అంటూ నారదుడు రాముని గూర్చి సంక్షిప్తంగా చెప్పాడు. 

ఆ సందర్భంలో వాల్మీకి అడిగిన గుణాలలో ఒకటి - "చారిత్రేణ యుక్తత్వం " - (చారిత్రతను కలిగి ఉండటం)  అంటే - తన వంశానికి చెందిన వారు మునుపు పాటించిన సదాచారాలు తానూ కూడా పాటించడం అని అర్థం.  రాముడికి అటువంటి గుణం ఉన్నది అని నారదుడు వాల్మీకికి నొక్కి చెప్పాడు.  రాముని పూర్వీకుల సదాచారాలలో ఒకటి ఏమంటే - ఆడిన మాటను తప్పకపోవటం (వాగ్దానభంగం చేయకపోవటం) అనేది.      

రాముని తండ్రి అయిన దశరథుడు కూడా ఇదే విధంగా తన పూర్వీకుల పద్ధతిని అనుసరించి, ఆడిన మాటను ఎన్నడూ తప్పకుండా హుందాగా జీవితాన్ని గడిపిన వాడే.  కానీవయసులో బాగా పెద్దవాడయ్యాక వాగ్దానభంగానికి పాల్పడవలసిన దురవస్థ రెండుసార్లు పట్టింది.   వింత ఏమిటంటే - అతని ఆ బలహీనతకు కారణం అతని పెద్ద కుమారుడు రాముడే!  
**********
**********

(1)
ఒకనాడు దశరథుడు తన గురువులతోనుబంధువులతోనుకూర్చుని ముచ్చటలాడుతున్నాడు.  రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు పెళ్లి చేయవలసిన వయసు వచ్చింది కదావారికి తగిన కన్యలు ఎక్కడున్నారు అని చర్చలు జరుగుతున్నాయి.  ఆ సమయంలో విశ్వామిత్రమహర్షి అక్కడకు వేంచేశారు.  దశరథుడు ఆ మహర్షి పాదాలమీద వాలిస్వాగతం పలికి, -

"బ్రూహి యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి।
కార్యస్య న విమర్శం చ గన్తుమర్హసి కౌశిక।।  (రామాయణం  1.18.54&56)

స్వామీమీరు వచ్చిన పని ఏమిటి?  నేను తప్పక ఆ పనిని నెరవేరుస్తాను.  ఆ పని నెరవేరుతుందో లేదో అని సందేహం పెట్టుకోకుండా అడగండి."  అని ధారాళంగా మాట ఇచ్చేశాడు.  విశ్వామిత్రుడు "ఓ రాజా!  రాక్షసులబారినుండి నా యజ్ఞాన్ని రక్షించేందుకు గాను నీ కుమారుడైన శ్రీరాముని నాతో పంపవయ్యా" అని అడిగాడు.

ఆ మాటతో దశరథుడు కలవరపడిపోయాడు.  అంతవరకు రాముడికి పెళ్లీడు వచ్చిందని బంధువులతో మాట్లాడిన ఆయన హఠాత్తుగా అదంతా మరచి పోయి - "నా రాముడు బాలుడు స్వామీవాడు ఇంకా ఏ విద్యలను పూర్తి చేసింది కూడా లేదురాక్షసులు ఎంతటి బలవంతులో కూడా ఎరుగని వాడురాముడు వద్దులెండినేనే స్వయంగా మీ యజ్ఞాన్ని రక్షించడానికి వస్తాను. ఎన్నెన్నో కష్టాలు పడిన తరువాత నేను బాగా ముసలివాడిని అయ్యాక పుట్టక పుట్టక పుట్టిన నలుసు వాడు.  దాచేసి వాడిని తీసుకు వెళ్ళకండి."

బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్।
అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి।।
షష్ఠిర్వర్షసహస్రాణి మమ  జాతస్య కౌశిక।
దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి।। (రామాయణం  1.20.6-10)

అంటూ ముందు దీనంగా బ్రతిమాలాడుకున్నాడు.  అయినప్పటికీ విశ్వామిత్రుడు సరేనని మాట్లాడకపోయేసరికి - "బాలం మే తనయం బ్రహ్మన్నైవ దాస్యామి పుత్రకమ్  (1.20.24) స్వామీనా పిల్లవాణ్ణినా కొడుకునునా పుత్రుడిని నీతో పంపను పోవయ్యా" అంటూ మొండికేశాడు. 

దానితో విశ్వామిత్రునికి  కోపం వచ్చింది. 
"పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి।
రాఘవాణామయుక్తోSయం కులస్యాస్య విపర్యయః।।" (రామాయణం 1.21.2)

"ఏమయ్యా  దశరథా?  మొదట నేను అడిగినది ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు కాదంటున్నావే?  మీ రాఘవవంశానికి ఇది ఎంతమాత్రం తగని పని కదా?" అన్నాడు.  "సరేలేఅలాగే కానీ!" అంటూ వెళ్ళిపోబోయాడు.  కానీఇంతలో రాజగురువైన వసిష్ఠుడు కలగజేసుకుని, "రాజా!  ముల్లోకాల్లోనూ ధర్మాత్ముడవని మంచి పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇలా ఆడిన మాట తప్పి అధర్మం చేసి వంశానికి మచ్చ తెచ్చే పని చేయవద్దు" అంటూ దశరథునికి ఎలాగో నచ్చజెప్పి  విశ్వామిత్రుడి వెంట రాముని పంపించగలిగాడు.

దాంతో ఆడిన మాటను నిలబెట్టుకోలేని పరిస్థితినుండి దశరథుడు బయటపడ్డాడు.  మొదటిసారి ఎలాగో గండం గట్టెక్కేసింది.  కానీ రెండోసారి మళ్ళీ అటువంటి పరిస్థితి దాపురించింది.  ఈసారి అంత సులువైన పరిష్కారం లభించే అవకాశం కాదు.  ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఏమి చేయదలచుకున్నా ఇచ్చిన మాట తప్పినట్టయ్యే వింత పరిస్థితులలో చిక్కుకున్నాడు. 
**********
**********

(2)
ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకున్నారు.  దశరథుడు రాముని పిలిపించి "రామా! రేపు నీకు యువరాజపట్టాభిషేకం జరుపబోతున్నాను.  నీవు గురువులు చెప్పిన విధంగా సిద్ధమైపో" అని చెప్పాడు. (అలా రామునికి మాట ఇచ్చేశాడు)

ఈ శుభవార్తను విని కైకేయి సంతోషపడుతుందేమో అని దశరథుడు అనుకున్నాడు.  కానీఆమె మాత్రం రాముని పద్నాల్గు సంవత్సరాలపాటు అడవికి పంపితన కొడుకైన భరతునికి పట్టాభిషేకం జరపమని కోరింది.  శంబరమహాసురునితో యుద్ధం చేస్తూ దశరథుడు గాయపడినపుడు కైకేయి అతనిని కాపాడింది.  ఆ సందర్భంలో దశరథుడు సంతోషించి కైకేయికి రెండు వరాలను ఇస్తానన్నాడు.  ఆమె తనకు అవసరమైనపుడు ఆ వరాలను కోరుకుంటానని అన్నది.  దశరథుడు సరేనన్నాడు.  కైకేయి ఆ సందర్భాన్ని గుర్తు చేసిఅపుడు ఇచ్చిన మాటను ఇపుడు నిలబెట్టుకొమ్మని అడిగింది.  ఆ విధంగా నీ వంశమర్యాదనునీ శీలాన్నినిలబెట్టుకొనినీ జన్మకు సార్థకత చేకూర్చుకొమ్మని అన్నది.

కులం చ శీలం చ హి రక్ష జన్మ చ। (2.11.30)

 ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించని దశరథుడు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు.  ఇరుకులో పడ్డాడు.  కైకేయి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు గాను రాముని అడవికి పొమ్మంటే రాముడు మారు మాటాడక అడవికి నిశ్చయంగా పోతాడు.  ఆ నమ్మకం అతనికి ఉంది. 

నాలం ద్వితీయో వచనం పుత్రో మాం ప్రతిభాషితుమ్।
స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి।। (రామాయణం - 2.12.86)

కానీపొమ్మంటే పోతాడు కదా సమస్య ఏముంది అని, "పోవయ్యా రామా" అనే రెండు పదాలు పలికితే "నిన్ను యువరాజును చేస్తాను" అని రామునికి తాను ఇచ్చిన మాట తప్పినట్టవుతుంది.  అలాగని కైకేయి కోరినట్టు రాముని పంపకపోతే కైకేయికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది.  ఆవిధంగా దశరథుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చిక్కులో పడ్డాడు.   రాముడు కానీకైకేయి కానీ ఎవరో ఒకరు వెనుకకు తగ్గితే తనకు ఆడిన మాట తప్పిన పాపం తప్పుతుంది.

నిజానికి రాముని అడవికి పంపడం అతనికి మనసులో ఎంత మాత్రం సమ్మతం కూడా కాదు.  అందువల్ల అతడు అటువంటి కోరికను కోరవద్దని కైకేయిని బ్రతిమాలాడాడు.  కోపగించుకున్నాడు.  శపించాడు.  రాముడు అడవికి వెళ్ళిపోతే తాను బ్రతకబోనని నిజం చెప్పాడు.  చివరకు ఆమె  కాళ్ళు పట్టుకుంటానని కూడా అన్నాడు.
స్పృశామి పాదావపి తే ప్రసీద మే। (2.12.114) 

అయినప్పటికీ ఆమె ఎంత మాత్రం వెనుకకు తగ్గకుండాఅతి కఠినంగా, "నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం రాముని అడవికి పంపకపోతే నీ ముందే నేను ప్రాణాలను వదిలేస్తాను" అని బెదిరించింది.
సమయం చ మమాద్యేమం యది త్వం న కరిష్యసి।
అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి జీవితమ్।। (2.14.10)

ఇక దశరథునికి గత్యంతరం లేకపోయింది.  తన మాటను నిలబెట్టేందుకు రాముడొక్కడే సమర్థుడు.  అతనికి కబురు పంపించాడు.  వెంటనే రాముడు వచ్చాడు.  కానీనిర్దోషి అయిన అతనిని తన కారణంగా అడవులకు పంపించేందుకు మనసొప్పని దశరథుడు "రామా" అని ఒక్క మాట పలికి  మరేమీ  మాటాడలేకచివరకు అతనిని సూటిగా కూడా చూడలేకకళ్లనీళ్లు పెట్టుకొని ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు.

తాను తండ్రిపట్ల ఏమైనా తప్పు చేశానేమో అని మథనపడిన రామునితో కైకేయి దశరథుడు తనకు ఇచ్చిన వరాలను పేర్కొని,  అలా ఇచ్చేందుకు గల కారణాలను కూడా వివరించితండ్రిమాటను నిలబెట్టేందుకు గాను నువ్వు ఆవిధంగా ఆచరించవలసి ఉన్నది" అని చెప్పింది.
ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।। (రామాయణం 2.18.40)

తండ్రికి తనపై గల ప్రేమ శ్రీరామునికి సంపూర్ణంగా తెలుసు.  ఆ ప్రేమతోనే తనను వెళ్ళమని చెప్పలేకపోతున్నాడని గ్రహించాడు.  మునుపు విశ్వామిత్రుడు అడిగినపుడు కూడా తనమీద ప్రేమకొద్దీ తనను అతనితో పంపలేక వంశాచారాన్ని భగ్నపరచే సాహసం చేసిన విషయం రాముడు ఇంకా మరచిపోలేదు.  ఎలాగో గురువైన వసిష్ఠుని వల్ల ఆ ఆపద గడిచింది.  తాను ఆనాడు బాలుడు.  కానిఈనాడు సమర్థుడైన యువకుడు.  తండ్రి మాటను నిలబెట్టవలసిన బాధ్యత తనమీద ఉన్నది.  అది గ్రహించుకున్న స్థితప్రజ్ఞుడు రాముడు అడవులకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు.

దండకారణ్యమేషోSహమితో గచ్చామి సత్వరః।
అనుక్తోప్యత్ర భవతా భవత్యా వచనాదహమ్।
వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ।। (రామాయణం 2.19.11&23)

"అమ్మాఇదిగో,  నేను వెంటనే దండకారణ్యానికి బయలుదేరుతున్నాను.  తండ్రి గారు నేరుగా చెప్పకపోయినా మీ మాట మేరకు (మీకిచ్చిన మాట మేరకు)  అక్కడ పద్నాలుగు సంవత్సరాలు నివసిస్తాను."  అని తండ్రి ముందే చెప్పి బయలుదేరాడు. 
**********
**********
ఈ విధంగా తండ్రి తనను స్వయంగా అడవికి పొమ్మని ఆజ్ఞాపించకున్నా - పినతల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు రాముడు అడవికి బయలుదేరడం ఖచ్చితంగా  పితృవాక్యపరిపాలనమే!  ఈ మాటను అన్నది నేను కాదుమరెవరో ఒక మానవమాత్రుడు కూడా కాదువారు కూడా ఒకరిద్దరు కాదు.  ఎవరెవరు ఏయే సందర్భాలలో  అలా అన్నారో ఈ క్రిందన రామాయణశ్లోకాల సంఖ్యతో సహా చూడండి.  పేర్కొనబడిన ప్రతి శ్లోకానికి అర్థం లేదా భావం రాముడు పితృవాక్యపరిపాలకుడు అనే. 

1) మొదటగా నారదుడు వాల్మీకితో అన్నాడు:
స జగామ వనం వీరః ప్రతిజ్ఞామానుపాలయన్।
పితుర్వచననిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్।।  (రామాయణం 1.1.24)

2) బ్రహ్మ వాల్మీకితో ఈవిధంగా అన్నాడు:
వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాత్ శ్రుతమ్।
న తే వాగనృతా కావ్యే  కాచిదత్ర భవిష్యతి।।  (రామాయణం 1.2.32&35)

"ఓ వాల్మీకీనారదుడు నీకు ఎలా చెప్పాడో అలాగే ధీరుడైన రాముని కథను వ్రాయవయ్యా.  నీవు వ్రాసిన ఒక్క మాటకూడా అసత్యం కాజాలదు" అని బ్రహ్మ వరం ఇచ్చాడు.  కాబట్టి రాముడు పితృవాక్యపరిపాలకుడు అని నారదుడు అన్న మాట సత్యమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వాల్మీకితో చెప్పినట్టే కదా?

3) లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు:
పితుర్నిర్దేశపారగః ....
రాజ్యాద్భ్రష్టో  వనే వస్తుం మయా సార్థమిహాగతః।। (రామాయణం 4.4.8-10)

4) అంగదుడు జటాయువు సోదరుడైన సంపాతితో ఈవిధంగా అన్నాడు:
రామో దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టో దండకావనమ్।
పితుర్నిర్దేశనిరతో  ధర్మ్యం పన్థానమాశ్రితః।।  (రామాయణం 4.57-58)

5) హనుమంతుడు అశోకవనంలో సీతమ్మకు తన ఉనికిని తెలియజేసేందుకు ముందు ఈ విధంగా శ్రీరాముని కీర్తించాడు:
తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః।
సభార్యః  సహా చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్।।  (రామాయణం 5.32.8)

6) హనుమంతుడు రావణుడితో కూడా అదే విషయం చెప్పాడు:
పితుర్నిర్దేశాన్నిష్క్రాంతః ప్రవిష్టో దండకావనమ్।।   (రామాయణం 5.51.5)

7) "పద్నాలుగేళ్ళు అడవిలో ఉంటాను"  అన్న మాటను రాముడు కూడా అంతే పట్టుదలతో నిలబెట్టుకున్నాడు.  తండ్రి చనిపోయిన తరువాతరాముని వెతుక్కుంటూ చిత్రకూటానికి వచ్చిన భరతుడుజాబాలివసిష్ఠుడు తదితరులు వనవాసం మానిఅయోధ్యకు తిరిగి వచ్చిపట్టాభిషేకం చేసుకొమ్మని రాముని ఎంతగా వత్తిడి చేసి చెప్పినప్పటికీ,
తేన పిత్రాssహమప్యత్ర నియుక్తః పురుషర్షభ।
చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికమ్।। (రామాయణం 2.107.7)
అంటూ నిర్ద్వంద్వంగా తండ్రి మాటను తాను నిలబెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు.

8చివరకు స్వర్గస్థుడైన దశరథుడు కూడా అంగీకరించాడు!  అష్టావక్రుడు తన తండ్రిని తరింపజేసినట్లు నువ్వు నన్ను తరింపజేశావు నాయనా! అన్నాడట.  (6.119.17)  ఆ సందర్భంలో కైకేయి మిమ్మల్ని నిర్బంధించినందుకు మనసులో ఎటువంటి కోపం పెట్టుకోవద్దువారిని క్షమించమని రాముడు తండ్రిని కోరడంఆయన అంగీకరించడం కూడా జరిగింది. 
**********
**********

ఈ విధంగా కథ సుఖాంతం అయింది.
"పితృవాక్యపాలన" అనే ఒక ఆదర్శాన్ని గొప్ప గుణంగా శ్రీరాముని పాత్ర ద్వారా బ్రహ్మనారదుడువాల్మీకి కలసి ప్రజలకు ఆ విధంగా పరిచయం చేయదలచుకున్నారు.  కాబట్టివారి సంకల్పం తిరుగులేకుండా ప్రచారంలోనికి వచ్చేసింది. 

 ।।ఇతి శమ్।।

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...