Wednesday, 30 December 2020

ఒకరికి భాష రాకపోతే వేరొకరికి తిప్పలు

 


19వ శతాబ్దం నాటి కథ -

చెన్న పట్టణంలో ఒకానొక హూణప్రభువు ఉండేవాడు. అతడు ఇంగ్లీషుభాషను తప్ప వేరొక భాషను ఎరుగడు. అందువల్ల అతడు స్థానికభాష తెలిసిన ఒక దుబాసీని తన దగ్గర నియమించుకున్నాడు.
ఒకరోజు కొందరు సంప్రదాయ నృత్యకళాకారులు అతని చెంతకు వచ్చి, తమ వంశాదికం తెలుపుకుని, అతని సమక్షంలో సర్వాత్మనా నర్తించి తమ కౌశలాన్ని వ్యక్తపరిచారు.
దానితో ఆ ప్రభువు చాల సంతోషించి తన దుబాసీని పిలిచి, వీరికి పది రూపాయలను ఇవ్వమని ఆదేశించాడు. ఆ దుబాసీ సరేనని, వారిని తన ఇంటికి తీసుకుని పోయి, వారికి ఒక రూపాయిని ఇచ్చి ఇక పొమ్మన్నాడు.
తాము అంతగా శ్రమించి చేసిన నృత్యానికి ఇంతటి అల్పపారితోషికం దక్కిందే అని వారు చాల బాధపడ్డారు. ఈ దుబాసి తమను మోసం చేసి ఉండవచ్చునా అని అనుమానించారు.
అపుడు వారు తిరిగి ఆ ప్రభువు దగ్గరకు వెళ్లారు. దుబాసీ తమకు ఇచ్చిన రూపాయిని అతనికి చూపారు. మాకు దుబాసీ ఇంతమాత్రమే ఇచ్చాడని నివేదించారు.
ఆ ప్రభువుకు వారి భాష అర్థం కాలేదు. అందువలన దుబాసీని రప్పించి, వీరేం చెబుతున్నారో అడిగి తెలుసుకో అని అతడిని ఆదేశించాడు.
అపుడు దుబాసీ ప్రభువును ఉద్దేశించి "అయ్యా, మీరిచ్చిన పదిరూపాయలలో ఈ రూపాయినాణెం చెల్లనిది. దీని మీద దొంగముద్ర ఉన్నది. అందువల్ల, ఈ రూపాయిని తీసుకుని, మరొక రూపాయిని ఇప్పించవలసినది అని వీరు అడుగుతున్నారు" అని నివేదించాడు.
అది వినేసరికి ఆ ప్రభుపుకు చాల కోపం వచ్చింది. ఆ నృత్యకళాకారులను తన్ని తరిమేశాడు.
అందువలన, ఏ జనాలైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను తెలుసుకొనకపోతే ఇతరుల మాటలను నమ్మి, ఆ దేశప్రజలకు అన్యాయం చేస్తారు.
***)))(((***
శ్రీమాన్ వేంకటరామశాస్త్రిగారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థులు సంస్కృతం త్వరగా, చక్కగా నేర్చుకునేందుకు వీలుగా "కథాశతకమ్" అనే చిన్న పుస్తకాన్ని వ్రాశారు. అందులో 27 వ కథకు ఇది నా అనువాదం. సంస్కృతకథ ఫొటోలో ఉన్నది.
***)))(((***
పాలకులు ప్రభువులు ఎంతటివారైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను (స్థానికభాషను) నేర్చుకోవాలని, లేకుంటే ఆ ప్రాంతపు ప్రజలకు తీరని అన్యాయం కలుగుతుందనే ప్రబోధం ఇది.
అయితే ఈనాటి పాలకులు మాత్రం, తమ కోసం దేశప్రజలందరూ మాతృభాషను వదలిపెట్టి పరాయిభాషలను నేర్చుకోవాలని హుకం జారీ చేస్తున్నారు. పైగా, అలా పరాయి భాషను నేర్చుకోకపోతే రేపటికి మీకు కూటికి గుడ్డకు కరువౌతుందని, మీకు జీవనోపాధి లభించదు అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
మన అజ్ఞానం, మన దురాశ, మన దౌర్భాగ్యం, మన పిరికితనం, మన బానిస మనస్తత్త్వం మాత్రమే మన మాతృభాష అంతరించబోయేందుకు కారణాలు.



నిన్న ఈ ఫొటోలోని విషయాన్నిపట్టుకుని కొందరు నోటికొచ్చినట్టు తిట్టిపోశారని, అవహేళన చేశారని, ద్వేషాన్ని వెళ్లగక్కారని మీరు ఎందుకు బాధపడతారు Sesha Murthy P మహోదయా?

అసలు వారి frustration ను మనం కూడా కాస్త అర్థం చేసుకోవాలి కదా?
వారంతా కూడా తమ పిల్లలు పుట్టిన దగ్గరనుంచి వారికి వేదం నేర్పించే గురువు ఎవరా ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని తీవ్రంగా అన్వేషిస్తున్నారు.
ఈ వేదవిద్య అనేది
కాంపిటీటివ్ పరీక్షలు వ్రాసి ఉద్యోగాలు సంపాదించడానికి గాని, కార్పొరేట్ సంస్థలలో ఆఫీసర్లుగా సీయీవోలుగా ఎదగడానికి గాని, ధనం బాగా సంపాదించడానికి గాని ఎంతమాత్రం ఉపయోగపడే విద్య కాదనే విషయంలో వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది.
అయినప్పటికీ తమ పిల్లలు చక్కగా గుండు కొట్టించుకుని, పిలక పెట్టుకుని, ఈ వేదవిద్యను అభ్యసించాలని, తమ తమ వంశాలను పావనం చేయాలని, ఉద్ధరించాలని వీరికి చిరకాలవాంఛ.
వీరంతా తమ పిల్లలకు చిన్నపుడే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అంటూ తమదైన మంత్రదీక్షను ఇచ్చారు.
చిన్నపుడే ఈ సద్గుణాలను వారికి నూరిపోశారు. గురువుల చెంత, తోటి బ్రహ్మచారుల చెంత మసలుకోవవసిన పద్ధతులను, తగిన వినయవిధేయతలను చక్కగా నేర్పారు.
తమ ఇంటిలో రాజసికమైన, తామసికమైన సమస్త ఆహారపదార్థాలను పరిత్యజించి కేవలం సాత్త్వికమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ తమ పిల్లలకు కూడా అదే అలవాటు చేశారు.
తమకు లేని అలవాట్లు తమ పిల్లలకు మాత్రం ఎలా అబ్బుతాయని ఇంటిలో సూర్యోదయాత్ పూర్వమే లేచి, స్నానాదులు, జపతపాదులు చేస్తున్నారు. నిత్యార్చనలు చేస్తున్నారు. అష్టోత్తరాలు, శతోత్తరాలు, సహస్రనామావళులు ఉభయసంధ్యలలోనూ వారి ఇండ్లలో పారాయణ చేయబడుతూ ఉంటాయి.
పండుగలలోను, పర్వదినాలలోను వారి ఇంట ఉపవాసాదివ్రతాలు నియమం తప్పక చేస్తుంటారు. దేవునికి నైవేద్యం జరుగనిదే వారు నీటిని కూడా పానేచ్ఛతో తమ నోట తాకరు.
వివిధవేదపండితులను, శాస్త్రపండితులను తమ ఇంటికి పిలిచి వివిధపురుషార్థదాయకాలైన విషయాలను, వివిధశాస్త్ర విషయాలను చర్చించి, తమ సందేహాలను తీర్చుకుని, వారిని తమకున్నదానితోనే సత్కరిస్తూ ఉన్నారు.
తాము మాట్లాడే మాటలే తమ పిల్లలు కూడా నేర్చుకుంటారనే ఇంగితజ్ఞానం కలిగినవారై తమ తమ ఇండ్లలో చక్కటి వాక్ సంయమాన్ని పాటిస్తున్నారు.
భవిష్యత్తులో తమ పిల్లలు నిరాశపడకుండా, వేదవిద్య యొక్క అంతిమలక్ష్యం మోక్షమే గాని, ధనసంపాదన కానే కాదని వారికి చక్కని అవగాహనను కలిగించారు.
గురుకులంలో కనీసం పన్నెండేళ్లపాటు నివసించడానికి తగిన శిక్షణను తమ పిల్లలకు ఇచ్చి వారిని భౌతికంగా మానసికంగా సంసిద్ధులను చేశారు.
గురుకులమంటే హాస్టల్ కాదని వారికి తెలుసు. తమ పిల్లలు ఎటువంటి గురుశుశ్రూష చేయడానికి అయినా వారు సమ్మతించి ఉన్నారు. గురుకులంనుండి సమావర్తనం జరిగిన తరువాత తమ పిల్లలు జీవితాంతం తమ గురువు నేర్పిన విద్యను స్వాధ్యాయంగా స్వీకరించి నిరంతరమైన అధ్యయనం చేయాలని, చేస్తారని కూడా వారు ఆశిస్తున్నారు.
నీ వేదవిద్యతో నీవు ఏమి సంపాదిస్తావు? మా బిడ్డను ఏమి పోషిస్తావు అంటూ భవిష్యత్తులో తమ సొంత బంధువులు కూడా ఆ వేదవిద్యను అభ్యసించేవారికి తమ పిల్లను ఇవ్వడానికి ఇష్టపడరని తెలిసి కూడా తమ పిల్లలకు వేదవిద్యను నేర్పేందుకే బద్ధకంకణులై ఉన్నారు. ఇలా వారు ఎంతటి త్యాగానికి సిద్దపడ్డారో తెలుసుకోండి.
అంతే కాదు, వంశపారంపర్యంగా, తరతరాలుగా వేదవిద్యను వీరే కర్రలు, కత్తులు కటారులు పట్టుకుని కాపలా కాస్తూ రక్షిస్తూ వస్తున్నారు కూడా. అందువల్ల వేదం ఎవరు నేర్చుకున్నా మా తరువాతనే నేర్చుకోవాలి అనే వీరి కోరిక సమంజసమైనదే కదా?
ఈవిధంగా తమ పిల్లలను వేదవిద్యాసంపన్నులుగా తీర్చిదిద్దడానికి వీరు ఇన్నేసి ఆశలను పెట్టుకుని ఉంటే, ఉన్నట్టుండి ఈయనెవరో బ్రాహ్మణ బ్రహ్మచారులు కావలెను అని, వారికి వేదం నేర్పుతాము అని అంటే వీరికి ఎంతటి నిరాశ, ఎంతటి ఫ్రస్ట్రేషన్ వస్తుందో ఊహించండి.
ఇక్కడ బ్రహ్మచారులు అంటే విద్యార్థులు అని, బ్రహ్మచర్యము అంటే విద్యార్థి దశ (student hood) అని వివరించినప్పటికీ వారు బోలెడన్ని వెకిలి కామెంట్లు గుమ్మరించారంటే వారి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి చేరుకుందో గమనించి మనం విచారించాలే గాని, తిరిగి కోప్పడరాదు.
పుట్టుకతో అర్హత అనేది రావడం కాదు, పెంపకంతో అర్హత వస్తుంది అన్నా సరే, అర్థం చేసుకోలేని ఒక ఆత్మానం మేధావీమన్యమానుడు అర్థం పర్థం లేని పిచ్చివాగుడు వాగాడంటే దానికి కూడా కారణం ఆ ఫ్రస్ట్రేషనే కదా మహోదయా?
ఆకలితో నకనకలాడూతూ కంచం పట్టుకుని చాల సేపటినుంచి ఓర్పుగా కాసుకుని కూర్చుని ఉండగా వారి కంచంలో పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించకపోతే వారికి కోపం రాదా మరి?
అందువల్ల వారి కోపంలో కూడా న్యాయముంది మహోదయా. మీరు కూడా కోపగించుకోకండి. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే వారు తమ వాక్సంయమాన్ని కోల్పోయి నోటికొచ్చినట్టు తిడుతున్నారు. సంవత్సరాలపాటు కష్టపడి అణచుకున్న వారి రాగద్వేషాలు ఒక్కసారిగా ఉప్పొంగడం వలన అంత దారుణంగా అవహేళన చేస్తున్నారు.
అందువల్ల, అంతటి నియమనిష్ఠాగరిష్ఠులను అంతగా నిరాశపరచిన తప్పు మనదే కావడం వల్ల, మనం కాస్త చూసీ చూడనట్టుండాలి.

Friday, 2 October 2020

ప్లాస్టిక్ ను తినే పురుగు

 


వ్యాక్స్ వామ్స్ అని పిలువబడే ఈ పురుగులు ప్లాస్టిక్ను తినేస్తాయి అని, దానిని ఒక ఉపయోగకరమైన రసాయనపదార్థంగా మార్చేస్తాయి అని అంటున్నారు.

ప్లాస్టిక్ త్వరగా నశించేది కాదని, మన ఇల్లైన భూగోళంపై భూమ్మీద, నీటిలోనూ గాలిలోనూ కూడా శతాబ్దాల తరబడి నిలిచిపోతుందని, అది పర్యావరణాన్ని దెబ్బ తీస్తుందని, మనుషులు, ఇతరజంతుజాలం దాని వలన క్రమంగా నశిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతూ వస్తున్నారు.  అయినప్పటికీ, వర్తమానమే తప్ప భవిష్యత్తు పట్ల బాధ్యత లేని మనుషులు ఆ మాటలను ఎంత మాత్రం పట్టించుకోకుండా ప్లాస్టిక్ ను వాడుతూనే ఉన్నారు.  అందువల్ల ప్లాస్టిక్ ను నిషేధించడమే సరైన చర్య అని ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రపంచమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. 

అయితే ప్లాస్టిక్ వ్యాపారులు మాత్రం ఇటువంటి ప్రచారాలు ఆందోళనలు తమ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి మాత్రమే జరుగుతున్నాయని పోటీగా ఎదురు ప్రచారం చేస్తున్నారు.  ప్లాస్టిక్ సంచుల బదులు కాగితం సంచులు వాడితే వాటి కోసం చెట్లను పెద్ద ఎత్తున నరకవలసి ఉంటుందని, దానివల్ల మాత్రం పర్యావరణం దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నారు.  ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా గాజును వాడితే ఆ గాజు కూడా పర్యావరణంలో అంత త్వరగా కలిసిపోయేది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు.  ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా రకరకాలో లోహాలను వాడితే వాటిని భూమినుండి బయటకు తీసుకురావడం కోసం గనులు తొలచవలసి ఉంటుందని, దానివలన పర్యావరణ హాని కలుగదా అని ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పుడు క్రొత్తగా ఈ వ్యాక్స్ వామ్స్ అనేవి ప్లాస్టిక్ ని తింటాయని, ప్లాస్టిక్ వ్యర్థాలను అవి అదుపుచేయగలవని,  అందువలన ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం కూడదని, మిగిలిన పదార్థాలలాగానే ప్లాస్టిక్ ను కూడా స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా ఇకమీదట ఉత్పత్తి చేయవచ్చునని వారు వాదిస్తున్నారు.

అసలు ఏమిటి ఈ వ్యాక్స్ వామ్స్?

ఇది చిమ్మట (moth) జాతికి చెందినది.  దీని జీవితచక్రం సీతాకోకచిలుక లాగానే, గుడ్డు - లార్వా - కకూన్ - రెక్కల పురుగు అనే దశలలో గడుస్తుంది. 

వీటిని మనం మైనం తినే పురుగులు అని వ్యవహరించవచ్చు.  తేనెటీగలు తన గూడును మైనంతో నిర్మించుకుంటాయి.  ఆ మైనం కూడా పాలిమర్ అని ప్లాస్టిక్ తరగతికి చెందినది.   ఈ వ్యాక్స్ వామ్స్ అని పిలువబడుతున్న పురుగులు ఆ మైనాన్ని తిని బ్రతుకుతాయి. 

అందువల్ల ఆ పురుగులు ప్లాస్టిక్ ను కూడా తినగలవా అని కోణంలో కొన్ని పరిశోధనలు జరిగాయి. 

 

ఫ్రెడరిక్ ఆ బెట్రోచ్చిని అనే శాస్త్రజ్ఞురాలి నాయకత్వంలో ఈ విధమైన పరిశోధనలు జరిగాయి.  ఆమె స్పెయిన్ దేశస్థురాలు.  యూనివర్సిటీ ఆఫ్ కాంటబ్రియాలో జీవశాస్త్రజ్ఞురాలు. 

అయితే ఈ పరిశోధనకు బీజభూతమైన సంఘటన ప్రయత్నపూర్వకంగా కాకుండా, ఆకస్మికంగా జరిగింది.  ఆమె తన తోటలో తేనె వ్యవసాయం చేస్తుంది.  ఒకసారి ఆమె తోటలోని తేనెగూడులలో ఉన్న కొన్ని మైనం పురుగులను తీసి ఒక ప్లాస్టిక్ సంచి మీద పెట్టడం జరిగింది.  ఒక గంట తరువాత చూస్తే ఆ ప్లాస్టిక్ సంచులకు రంధ్రాలు ఉన్నాయట. 

మనమైతే ఎందుకలా రంధ్రాలు పడ్డాయి అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోము.  ఎందువల్లనంటే మన దృష్టిలో ప్లాస్టిక్ ఒక వ్యర్థపదార్థం.  దానిని వాడుకోవడం పూర్తి అయిన తర్వాత దానిని మనం ఒక చెత్త బుట్టలో నిర్లక్ష్యంగా విసిరేస్తాం.  అంతే.  దానికి రంధ్రాలు పడినా, పడకపోయినా మనకు అనవసరం.  అసలు దానిని మనం పట్టించుకోం.  మన దృష్టి అంతవరకే. 

అయితే బెట్రోచ్చిని జీవశాస్త్రజ్ఞురాలు.  ఆమెది పరిశోధనాదృష్టి.  హఠాత్తుగా ప్లాస్టిక్ కు ఎందువల్ల కన్నాలు పడ్డాయి అనే కోణంలో ఆమె ఆలోచన చేసింది.  మైనం పురుగు లార్వా ప్లాస్టిక్ ను తినడం వల్ల ఈ విధమైన రంధ్రాలు ఏర్పడ్డాయి అని ఆమె తెలుసుకున్నది.  ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ప్లాస్టిక్ ను తినే పురుగులు ఉన్నాయి అని ఆమె ఆ విధంగా కనుగొన్నది.

అప్పుడు ఆమె తన తోటి శాస్త్రజ్ఞులు అయిన బొంబెల్లి, క్రిస్టఫర్ హొయెలతో కలసి మరింత జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించడం మొదలు పెట్టింది. 

వారు నూరు మైనం పురుగులను వారు ఒక పాలితిన్ ప్లాస్టిక్ బ్యాగు మీద వదిలిపెట్టారు.  తెల్లవారేలోగా ఆ పురుగులన్నీ కలసి 92 మిల్లీగ్రాముల ప్లాస్టిక్ ను తినేశాయి.  పరిశోధన మరింత ముందుకు సాగింది.

కేవలం బ్రతికి ఉన్న పురుగులు మాత్రమే ప్లాస్టిక్ ను తినడం ద్వారా ప్లాస్టిక్ ను నాశనం చేయగలవా లేక ఆ పురుగుల శరీరగతకణాలు కూడా ప్లాస్టిక్ ను నాశనం చేయగలవా అనే కోణంలో కూడా వారు పరిశోధనలు చేశారు.  వారి పరిశోధన విజయవంతమైంది.  చనిపోయిన పురుగుల అవశేషాలను కూడా ప్లాస్టిక్ మీద ఉంచితే ఆ ప్లాస్టిక్ నశిస్తుంది అని వారు తెలుసుకున్నారు.  కాలుష్యంతో కునారిల్లిపోతున్న ప్రపంచానికి ఇది ఎంతో శుభవార్త. 

ఆ మైనం పురుగులలోని ఎంజైములు ప్లాస్టిక్ పదార్థమైన polyethylene ను ethylene glycol అనే రసాయనపదార్థంగా మారుస్తున్నాయి అట.  ఆ రసాయనపదార్థాన్ని ఒక వస్తువు గడ్డకట్టకుండా వాడుతుంటారు.    (హిమాలయాలలో ఉండే మన సైనికులకు ఈ రసాయన పదార్థం చక్కగా ఉపయోగపడుతుంది కదా?)

ఆ ఎంజైములు ఏమిటో, వాటి స్వభావం ఎటువంటిదో తెలుసుకుంటే ఆ ఎంజైములు కేవలం మైనం పురుగులలో మాత్రమే లభిస్తాయా లేక ఇతరత్రా కూడా లభిస్తాయా అనే విషయం అర్థం చేసుకోవచ్చు.  తద్వారా వాటిని తగిన మొత్తంలో ఉత్పత్తి చేయడం ద్వారా త్వరగా పర్యావరణంలో కలిసిపోయే విధంగా ప్లాస్టిక్ ను తయారు చేయవచ్చు అని ఆశిస్తున్నారు.

స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు కూడా వేరొక రకమయిన బ్యాక్టీరియా  ethylene terepthalate  అనే ప్లాస్టిక్ ను నాశనం చేయగలవని కనుగొన్నారట.

ఈ విధంగా ప్లాస్టిక్ ను నాశనం చేయగలిగిన అటువంటి పురుగులు కీటకాలు మనకు తెలియనివి ఇంకా చాలా ఉండవచ్చునని, ఇంకా చాలా పరిశోధనలు జరగవలసి ఉంది అని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

అయితే ఒక పదార్థం నాశనం కావడం అనేది నిజానికి జరగదు.  అది వేరొక పదార్థంగా మార్చబడుతుంది.  అంతే.  అందువలన, ప్లాస్టిక్ నాశనమై వేరొక పదార్థంగా మారినప్పుడు అది మానవాళికి, అనేక జీవరాసులతో కూడిన పర్యావరణానికి ఎంతవరకు హాని కలగకుండా ఉంటుంది అనే దానిని బట్టి ఈ పరిశోధనలు ముందుకు సాగుతాయి.   మనకు ఒక పరిష్కారమార్గాన్ని సూచిస్తాయి.  ఆయా బ్యాక్టీరియా ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ కంటే మరింత ప్రమాదకరమైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తే మనం పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టే.  అటువంటప్పుడు ఆ పరిశోధనలు ఇక ముందుకు సాగవు.  పైపెచ్చు ఆ బ్యాక్టీరియా ప్లాస్టిక్ జోలికి పోకుండా కాపాడుకోవలసిన ఎటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. 

అంతే కాదు, ఈ మైనం పురుగులు ప్లాస్టిక్ ను నాశనం చేస్తాయి ఆ విధంగా మనకు ఉపకారం చేస్తాయి అనే దృష్టితో మనం ఈ పురుగులను ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి చేయడానికి పూనుకుంటే, కాలక్రమేణ అవి ప్రపంచంలో ఉండే ప్లాస్టిక్ మొత్తాన్ని తినేసి సంఖ్యాపరంగా చివరకు మనుషులకు ప్రమాదాన్ని కలిగించే స్థాయికి చేరుకుంటాయి అని భయం కూడా కలగవచ్చు. 

అయితే ఆ భయం అవసరం లేదు.  ఎందువల్లనంటే ఈ పురుగులకు లెక్కలేనన్ని పక్షులు సహజశత్రువులు.  (అంటే రకరకాల పక్షులకు ఇవి సహజమైన ఆహారం.)  ఈ పురుగులను చేపలు పట్టే గేలానికి ఎరగా  వాడుతూ ఉంటారు.  పైగా ఇవి మంచి ప్రోటీన్లు కలిగి ఉంటాయట. అందువల్ల కొన్ని దేశాలలో వీటిని వేయించి బొరుగులు తిన్నట్టు తింటూ ఉంటారట. 

ప్రస్తుతం ప్రపంచంలో సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థంగా భూమిని ఆక్రమించుకుంటూ ఉంది.  8 మిలియన్ టన్నుల వ్యర్థమైన ప్లాస్టిక్ సముద్రాలలో కలుస్తూ ఉంది. 

మనం తినే తిండిలోను, మనం పీల్చేగాలిలోను కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని, అవి క్రమక్రమంగా మన శరీరంలో ప్రవేశిస్తున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  అందువలన మనుషులలో పునరుత్పత్తిసామర్థ్యం తగ్గిపోతుందని, స్థూలకాయం పెరిగిపోతుందని, గుండె జబ్బులు అధికమవుతాయని, పిల్లల్లో ఎదుగుదల సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు.

అందువల్ల, ప్లాస్టిక్ ను నాశనం చేసే ఇటువంటి మైనం పురుగులు, వాటిలో ఉండే ఎంజైములు, అటువంటి బ్యాక్టీరియా మనిషికి మిత్రులు.  మనం మిత్రులను కాపాడితే ఆ మిత్రులు మనలను కాపాడగలవు.

ధర్మో రక్షతి రక్షితః.

Tuesday, 15 September 2020

మోత - మోత - మోత


కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కాని, కాకి తన పిల్లను మోయడం ఎప్పుడైనా ఎవరైనా చూశారా?
సమస్తప్రాణికోటులకు చెందిన తల్లులు తమ తమ సంతానాన్ని ఎంతో కొంత కాలం గర్భంలో మోస్తారు. ఆ తరువాత కూడా, అంటే గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాణులు తమ సంతానం స్వయంగా సంచరిస్తూ ఆహారాన్ని సంపాదించుకునే శక్తి వచ్చేవరకు వాటిని మోస్తూనే ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, తమ సంతానం తమ శత్రువుల నుండి తమంతట తాముగా కాపాడుకొనే స్థాయికి చేరుకునేంతవరకు స్వయంగా మోస్తూ కాపాడుతూ ఉంటాయి.
పాపం జింకలు, దున్నలు, గుఱ్ఱాలు, గోవులు, మేకలు, గొఱ్ఖెలు వంటి జంతువులు, చిలుకలు, పావురాలు, కోళ్లు వంటి పక్షులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయగలవు కాని, వాటిని ఎత్తుకొని దూరంగా పరుగెత్తడం వాటికి సాధ్యం కాదు. అందువల్లనే అవి అధికంగా వేటాడబడుతూ ఉంటాయి.
కోతి జాతికి చెందిన చింపాంజీలు, గొరిల్లాలు, ఉరాంగుటానులు, బబూనులు, మాండ్రిళ్లు, కొండముచ్చులు మొదలైన ప్రాణులన్నీ తమ పిల్లలను వీపుమీద మోస్తాయి.
మార్సూపియల్ జాతికి చెందిన కంగారూలు, వల్లబీలు తమ పిల్లలను తమ పొట్టలోని సంచిలో మోసుకొని తిరుగుతుంటాయి. ఇటువంటి జంతువులు దాదాపు 250 రకాలు ఉన్నాయి అంటారు.
పిల్లి జాతికి చెందిన పిల్లి, పులి, సింహం, చిరుత అన్నీ తమ పిల్లలను నోటితో మోస్తాయి.
నీటిలో ఈదే పక్షులు ఈదేటపుడు తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
చీమలను చెదలను ఆహారంగా తీసుకునే అలుగులు కూడా తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
కొన్ని రకాల కప్పలు కూడా తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
సాలీడు పురుగులు, తేళ్లు కూడా తమ పిల్లలను వీపుమీద మోస్తూ ఉంటాయి.
పిల్లి వేరు ఎలుక వేరు అని భావిస్తామేమో కాని, పిల్లలకు తల్లులుగా ప్రేమనందించే విషయంలో రెండూ సమానమే. ఎలుకలు కూడా తమ పిల్లలను నోటకరచుకొని మోస్తాయి.
ఈ విధంగా తమ తమ పిల్లలను ప్రేమతో మోసే ప్రాణులు ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నాయి.
అయితే,
ఇవన్నీ ఒక ఎత్తు, మనిషి వేరొక ఎత్తు.
సాధారణంగా మిగిలిన ప్రాణులను మోసేవి వాటివాటి తల్లులే కాని తండ్రులు కాదు. కాని, మానవజాతిలో తండ్రులు కూడా తమ సంతానాన్ని ఎత్తుకుంటారు. కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లల్ని ముద్దు చేస్తూ బంధువులు స్నేహితులు కూడా ఎత్తుకుంటారు. ఇలా ఎత్తు కొనడాన్ని మోత అనరు. ఆ పదాన్ని ఆ సందర్భంలో ఉపయోగిస్తే అవమానకరంగా కూడా భావిస్తారు. ఎత్తు కొనడం అనే పదాన్ని మాత్రం ప్రేమకు ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు.
అయితే మనిషి ప్రేమ హద్దులు లేనిది. అతడు ప్రేమ కొద్దీ కేవలం తన సంతానాన్ని మాత్రమే కాదు, ఇతర జాతుల సంతానాన్ని కూడా ఎత్తుకుంటాడు. చిన్న పిల్లలు కూడా ఎంతో ప్రేమతో పిల్లి పిల్లలను, కుక్క పిల్లలను, మేక పిల్లలను, పక్షి పిల్లలను, ఎత్తుకుంటారు.
ఆవుదూడలకు పందిపిల్లలకు మధ్యలో తేడాను పెద్దవారు గ్రహించగలరేమో గానీ పిల్లలు మాత్రం ఆ రెండింటినీ సమానంగానే ముద్దు చేస్తారు.
అది మనిషి ప్రత్యేకత.
అయితే, తల్లిదండ్రులు అయినా స్నేహితులైనా, చుట్టాలైనా తమరి పిల్లలనైైనా, ఇంకెవరి పిల్లలనైనా కొంత వయసు వరకు మాత్రమే వారిని ఎత్తుకుంటారు. ఆ తరువాత కూడా వారిని ఎత్తుకుంటే చూసేవారికి కూడా వింతగానే ఉంటుంది. ఒక ఇరవై యేండ్ల పిల్లవాడిని తల్లిదండ్రులు ఎత్తుకొనడం మనం ఊహించగలమా? ఎప్పుడైనా ఎక్కడైనా ఆ విధమైన దృశ్యం చూస్తే, మనం ఆ పిల్లవాడికి కాళ్లు సరిగా లేవు కాబోలు, అందువల్లనే అతడిని తల్లిదండ్రులు మోస్తున్నారు అని జాలి పడతాం.
( ఈ సందర్భంలో ఎత్తుకున్నారు అనుకోం. ఎత్తుకొనడం ప్రేమకు చిహ్నమైతే మోయడం అనే పదం అనివార్యమైన భారానికి చిహ్నంగా మనం భావిస్తాం.)
అలా కాదు, కాళ్లు సక్రమంగానే ఉన్నాయి, ఆ ఇరవైయేండ్ల పిల్లవాడు నడవ గలడు, అయినప్పటికీ కూడా వాళ్లు ప్రేమ కొద్దీ ఎత్తుకుంటున్నారు అని తెలిస్తే, మనకు సంబంధం లేకపోయినా, ఆ అతి ముద్దును మనం భరించలేం. వారు ఎత్తుకుంటున్నారు అని కూడా అనుకోం. వారు ఆ పిల్లవాడిని మోస్తున్నారు అనే పదమే ఉపయోగిస్తాం.
అయితే నాగరికత పెరుగుతున్న కొద్దీ కొందరు మనుషులు కూడా మోయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు. అయితే వారు కూడా అందరినీ మోయటం లేదు. (అందరినీ పక్షపాతం లేకుండా మోయాలి అని చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు.) వారు కొన్ని కొన్ని వర్గాల వారిని మాత్రమే ప్రత్యేకించి మోస్తున్నారు. అందులో చాలమందికి నడక వచ్చు. నడక ఏమిటి? పరుగెత్తగలరు. యుద్ధాలు కూడా చేయగలరు. ఇతరులను వేటాడి చంపనూ గలరు. అయినా సరే, అటువంటివారిని కూడా రాజకీయనాయకులు తల్లిదండ్రులు కంటె మిన్నగా వారిని మోస్తున్నారు.
నిజం చెప్పాలంటే, వారు వారిని స్వయంగా మోయటం లేదు. ఇతరుల చేత బలవంతంగా మోయిస్తున్నారు. వారు స్వయంగా మోయాలి అంటే తమ సొంత జేబులోంచి ఖర్చు పెట్టాలి. కాని, ఇతరులు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే సొమ్మును యథేష్టంగా తీసుకుంటూ వారిని తరతరాలుగా మోస్తున్నారు.
మోయండయ్యా, మోయండి. ముందే చెప్పినట్లుగా, ప్రపంచంలో ప్రతి ప్రాణీ మోస్తుంది. కాని, అవసరమైనంత కాలమే మోస్తుంది. ఆ తరువాత ఆ మోతను దించుకుంటుంది. ఇక మీరే స్వయంగా బ్రతకవలసిన సమయం వచ్చిందంటుంది. కాని, మీరు వారిని ఒక పట్టాన దించేలా లేరే?
మహానగరాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్నపిల్లలను మోస్తూ, వారిని చూపిస్తూ, వారికి ఆకలేస్తుంది బాబూ అని దీనంగా మాట్లాడుతూ చేయి చాపి అడుక్కునే వారికి, మీకు కాస్త తేడా ఉండాలి కదా? నిజానికి అదొక పెద్ద మాఫియా అని కూడా అంటారు.
ఈవిధంగా చేస్తూ, మీరే స్వయంగా అందరినీ మోస్తున్నట్లుగా కీర్తిని పొందుతున్నారు. కాని, నిజంగా మోస్తున్న జనాలకు మాత్రం చచ్చే చావుగా ఉంది.



 

Saturday, 12 September 2020

కుమారశతకం




పూర్వకాలంలో బడికి వెళ్లే పిల్లలకు మంచి ప్రవర్తనను నేర్పే కుమారశతకం ఇది.  ఎన్నో మంచి విషయాలను ఇది ప్రబోధిస్తుంది.  మచ్చుకు కొన్ని.

 

1 బడికి పొమ్మని ప్రబోధం

 

తెల తెల వారగ లేచియు

పలు దోమియు మురికి లేని పంచలతో నీ

పలకయు బలపము బుస్తక

ములు జేకొని బడికి జనుము ముద్దు కుమారా. (8)

 

2 కలిగిన దానిని ఆనందంగా స్వీకరించాలనే ప్రబోధం

 

కొఱ్ఱన్నమైన గానీ

గొఱ్ఱెల చల్లన్నమైన గాని కోపపడకమీ

కుఱ్ఱలతో జుఱుజుఱ్ఱని

జుఱ్ఖుకొనియు  లేచిపొమ్ము సొగసు కుమారా. (20)

 

సొమ్ములు సొగసులు గోరకు

కమ్మని పచ్చళ్లు గూరగాయలెపుడు తే

తెమ్మని మారము సేయక

తమ్ములతో గూడి చదువ దగును కుమారా. (23)

 

3 తోటి బాలురతో సఖ్యంగా ఉండాలనే ప్రబోధం

 

ఆట్లాడబోయి పెద్దలు

పోట్లాడగ జేయకయ్య బుద్ధి గలిగియే

తిట్లాడక బాలురతో

గొట్లాడక కూడి యాడుకొనుము కుమారా. (34)

 

4 ఓర్పు వహించాలనే ప్రబోధం

 

ఉడికియు నుడకని యన్నము

కడుపున దినబోకు నొప్పి గలుగును రుచిగా

నుడికిన యన్నము గూరలు

గుడుచుట సౌఖ్యంబు మంచి గుణము కుమారా. (63)

 

5 ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ప్రబోధం

 

చలికాలము నీ యింటను

గల బట్టలు గప్పికొనుము కాసేపయినన్

మొల బట్ట తోడ దిరుగకు

చలి బుట్టును జలుబు సేయ సాగు కుమారా.  (66)

 

నెల కొకనాడయినను నీ

తలకాయను నూనె చేత దట్టించుమురా

కలలెపుడు రావు నిద్దుర

గలుగును జదువుటకు దెలివి గలుగు కుమారా.  (88)

 

6 మేలు కోరి మంచిని చెప్పే పెద్దల మాటను వినమని ప్రబోధం

 

పెద్దలు వలదని చెప్పిన

దెద్దయినను జేయబోకు మెఱిగిన నిను గం

గెద్దని మొద్దని పిలుతురు

బుద్ధి కలిగి మంచిపనికి బొమ్ము కుమారా.  (70)

 

7 ఇతరులను హేళన చేయవద్దనే ప్రబోధం

 

రోగుల బిచ్చి బికారుల

జోగుల జంగముల పిల్ల జట్టులవారిన్

మూగల ముక్కిడివారిని

నాగడంపు బల్కు బల్కకయ్య కుమారా.  (75)

 

8 స్త్రీల పట్ల మర్యాద కలిగియుండాలనే ప్రబోధం

 

అసె వసె యని యాడంగుల

పసితనమున బిలువబోకు పరువు తొలగురా

పసివాడవనుచు జూడరు

గసరుచు కొట్టిదరు చెంపకాయ కుమారా.  (77)

 

9 జాగ్రత్తగా సంచరించాలనే ప్రబోధం

 

కాలికి జెప్పులు దొడుగక

కాలవకును బోకు మచట గల ముండులు నీ

కాలిని విరుగును జీకటి

కాలములో దేలు పాము కరచు కుమారా.  (80)

 

10 దురభ్యాసాలకు దూరంగా ఉండుమనే ప్రబోధం

 

పొగ చుట్టలు బీడీలును

సిగరెట్టులు త్రాగబోకు చిన్నతనమయా

పొగ చేతను రొమ్మెండును

సొగసగు నీ పెదవి నలుపు సోకు కుమారా.  (89)

 

చీట్లాటలు నేర్చికొనకుము

పోట్లాటలు వచ్చు జదువు పోవును పాడై

తిట్లాట లేని చదువుల

పోట్లాటలు నేర్చికొనగ పొమ్ము కుమారా.  (92)

నవ్వులకైన నబద్ధం

బవ్వలతోనైన నెప్పుడాడకు గీడౌ

ని వ్వసుదలోన తంగెడు

పువ్వయినను దొంగిలంగబోకు కుమారా.  (99)

 

11 దొంగతనము కూడని పని అని ప్రబోధం

 

బడిలోని బలపమైనను

గుడి లోపలి తులసి తోటకూరాకైనన్

దడి కందిపుల్లలైనను

తడబడకను దొంగిలించ దగదు కుమారా. (93)

 

 

ఇందులో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పబడ్డాయి.  అయితే అందులో కొన్ని ఈ రోజుకు అతిగా అనిపిస్తాయి.  పిల్లల మీద అతి నియంత్రణ కూడదనిపించేలా ఉంటాయి.  అయితే అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి మాటలు యథాలాపంగా అంటూ వుంటాం.  అయితే పిల్లల భద్రత కోరి చెప్పిన మాటలే అవన్నీ.  వాటిని పిల్లల సాహసకృత్యాలను నిషేధించడంగా వారి బాల్యపు ఉత్సాహాన్ని అణచివేయడంగా భావించకూడదు. మచ్చుకు కొన్ని.

 

బావులను దొంగి చూడకు

మావుల దొడ్లోకి బోయి యాటాడకుమీ

త్రోవను నెగురుచు బోవకు

మావల మోసంబు వచ్చు నయ్య కుమారా.  (29)

 

ఎండల  వానలలోపల

కొండల వాగులకు జెరువు కోనేళ్లకు బో

కుండుము కాల్జారిన నొ

క్కండయినను లేవదియ్య గలడె కుమారా.  (32)

 

అయ్యలు వలదని చెప్పిన

గొయ్యలు వ్రేలాడు చెట్టు గొమ్మలతోనే

యుయ్యాలలూగ బ్రోకుము

చెయ్యో కాలో విరుగంజేయు కుమారా.  (71) 

 

ఇంకా,

ఇతరుల యెంగిలి యన్నము

గతుకంగా బోకు వారిగల రోగము నీ

కతుకును మూతికి గావున

సతతము బండైన జీక జనదు కుమారా (16)

 

అని ఆరోగ్యపరంగా చేసిన నాటి ప్రబోధాన్ని నేటి అత్యాధునిక సోషలిస్టులు పిల్లల నడుమ పంచుకుని తినడమనే సద్గుణాన్ని నిషేధించడంగా నిందిస్తూ రచ్చ చేసి ఈ పుస్తకాన్ని నిషేధించాలన్నా నేను ఆశ్చర్యపోను.

 

చంద్రునిలో చిన్న చిన్న మచ్చలున్నంత మాత్రాన చందమామను ఇష్టపడని వారుంటారా?  అలాగే ఈ కుమారశతకము కూడా.  కుండినసీమలో ఫిరంగిపురవాసి అయిన కరణం బొల్లయ్యామాత్యుని కొడుకునైన చిల్కా వేంకటకృష్ణుడనే పేరు కలిగిన నేను ఈ కుమారశతకాన్ని వ్రాశాను అని రచయిత చెప్పుకున్నాడు.  గుంటూరు నరసరావు పేటల మధ్యలో ఉండే ఫిరంగిపురమే అయ్యుండవచ్చు.  ఆ ప్రాంతాన్ని పూర్వం కుండినసీమ అనే పేరుతో పిలిచేవారా?  తెలుగు నేలలో ఫిరంగిపురమనే ఊరు ఇంకెక్కడైనా ఉన్నట్టు నాకు తెలియదు.  మరొకటి ఉంటే చెప్పగలరు. క్రీస్తుశకం 20వ శతాబ్దంలో శార్వరీనామసంవత్సరంలో ఈ కుమారశతకం వ్రాయబడిందని రచయిత స్వయంగా తెలియజేశాడు.  ఇప్పుడు (2020-21) నడుస్తున్నది కూడా శార్వరీనామ  సంవత్సరమే.  అంటే  ఇప్పటికి 60 యేండ్ల ముందుగాని, 120 యేండ్ల ముందుగాని ఇది వ్రాయబడి ఉండాలి.  అంటే 1960-61 ప్రాంతంలో కాని, 1900-01 ప్రాంతంలోగాని ఇది వ్రాయబడి ఉండాలి.  కాని, 1934 నాటికే ఇది తెలుగుప్రాంతపు పాఠశాల పిల్లలకు ఒక అప్రూవ్డ్ పాఠ్యపుస్తకంగా ఉన్నది.  అంటే, ఇది 1900-01 సంవత్సరాలలో వ్రాయబడింది అని చెప్పవచ్చు.  (ఇరువదవశతాదిని – అనే పదం రచయిత ఉపయోగించాడు.)

 

వికీపీడియాలో కుమారశతకాన్ని గూర్చి వేరే విధమైన వివరాలు ఉన్నాయి.  కుమారశతకం సంస్కృతంలో భాస్కరరావు చేత వ్రాయబడిందని, దేవులపల్లి సుబ్బరాయశాస్త్రిచేత తెనిగింపబడిందని వ్రాసుకొచ్చారు.  మచ్చు తునకలు అంటూ అందులో రెండు పద్యాలు కూడా ఇచ్చారు.  అవి నేను చెప్పిన కుమారశతకంలో లేవు. ఈ కారణాల వల్ల, వికీపీడియాలో వ్రాయబడ్డ కుమారశతకం వేరు, నేను పేర్కొన్నటువంటి కుమారశతకం వేరు అని స్పష్టంగా చెప్పవచ్చు.

 

ఈ రెండూ కాకుండా గుంటూరు జిల్లా సాతులూరు గ్రామవాసి అయిన మునగపాటి చినహనుమయ్య చేత రచింపబడి, 1925లో ముద్రింపబడిన కుమారశతకం మరొకటి ఉన్నది.  ఇది తెలుగులో వ్రాయబడినప్పటికీ, ఇందులో సంస్కృతశబ్దావళి ఎక్కువగా ఉన్నది.

 

ఈ మూడూ కాకుండా, ప్రక్కి కులోద్భవుడైన అప్పల నరసింహుని చేత 1860, రౌద్రినామసంవత్సరంలో వ్రాయబడి, భాగవతుల దక్షిణాముర్తిగారిచేత టీకాతాత్పర్యాలు వ్రాయబడి, యం.యస్ శర్మ అండ్ కో (గుంటూరు-తెనాలి) వారి చేత  1935లో ముద్రింపబడిన కుమారశతకం వేరొకటున్నది.  ఇందులో కూడా సంస్కృతశబ్దగుంఫనం ఎక్కువే.

 

మరి, ఈ విధంగా నాలుగు కుమారశతకాలుండగా చిల్కా వేంకటకృష్ణుడు వ్రాసినదే పాఠశాల పిల్లలకు అప్రూవ్డ్ కాబడిందని ఎలా చెప్పావు అని అడుగుతారా?   ఖచ్చితంగా ఆ నాలుగింటిలో ఇదే అప్రూవుడు అని నేను చెప్పలేను గాని, ఇందులో పసి బిడ్డల కోసం, పెద్దగా చదువుకోని పెద్దలకోసం నేను తేలికైన తెలుగును వాడాను, అందువల్ల సభలలోగాని, బాగా చదువుకున్నవారు గాని, తేలికగా తీసిపారవేయవద్దు అని వేంకటకృష్ణుడు చెప్పిన మాటలు నచ్చాయి. 

చదివిన పెద్దలు సభవా

రిది తేలిక తెలుగటంచు నెంచగవలదీ

చదివెడి పసిబిడ్డలకును

జదువని పెద్దలకు దెలియు సరళి కుమారా.  (4)

 

సామాన్యబాలురకోసం వ్రాయబడినా, అతడు వారిని రాజకుమారా అని సంబోధించడం ఇంకా బాగా నచ్చింది.  అటువంటి వేంకటకృష్ణుని పట్ల నాది పూర్తిగా పక్షపాతం.  100% నిజం.  అందువల్ల, నేను ఇప్పుడు విద్యాశాఖామంత్రినై యుంటే గనుక, ఈ వేంకటకృష్ణుని శతకాన్నే ఒకటవ తరగతి నుండి పిల్లలకు కంఠస్థం చేయించాలని ఆదేశాలు జారీచేసి ఉండేవాడిని. 

 

సరే, తిరుపతికి వచ్చినపుడు గోవిందరాజస్వామి గుడిదగ్గర గాని, శ్రీకాళహస్తీశ్వరుని గుడికి దక్షిణగోపురం దగ్గర గాని కనిపించే చిన్న పుస్తకాల అంగళ్లలో ఈ కుమారశతకాలు దొరికే అవకాశాలు ఉన్నాయి.  ప్రయత్నించండి.  నేను కొన్న వేంకటకృష్ణుని పుస్తకం శ్రీకాళహస్తిలో దొరికింది.

 

ఏదేమైనా, అన్నిటికంటె ఇందులో నాకు నచ్చిన ప్రబోధం మాత్రం ఈ క్రిందిది.  ఇదుగో ఆ పద్యం.

 

అదలించిన బెదరించిన

పద పద యని నిన్ను క్రింద బడ ద్రోసిన నీ

వదరక బెదరక నిజమును

వదలకురా నీకు మేలు వచ్చు గుమారా.  (97)

 

నేటి పరిస్థితులలో భారతీయులు ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అలవరచుకొనవలసిన సద్గుణం ఇది.  ఈ ప్రబోధాన్ని మనసుకెక్కించుకుని ఆ విధంగా ప్రవర్తించగలిగితేనే భారతీయులు మనుగడను కొనసాగిస్తారు.  లేదా  అంతరించిపోవలసిందే. 

 

ఇది కుమారశతకం కాబట్టి, బాలురకే ఎక్కువ ప్రబోధం జరిగింది.  బాలికలకు ప్రత్యేకంగా వేంకటనరసింహకవీంద్రుడు వ్రాసిన కుమారీశతకం వేరే ఉన్నది.  దానిలో విషయాలను మరెప్పుడైనా చూద్దాం.

 

 


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...