Saturday 7 August 2021

విశ్వామిత్రుడు యజ్ఞం ఎందుకు చేసినట్టు?

 విశ్వామిత్రమహర్షులవారు అయోధ్యకు వేంచేశారు. దశరథమహారాజు ఎదురేగి ఆయనకు స్వాగతం పలికాడు. “మహర్షీ, మీ రాక మాకు ఎడారిలో వర్షం కురిసినంత ఆనందం కలిగించింది. మీరు ఏమి కోరి వచ్చారో తెలుపవలసింది. మీ పని నెరవేరుతుందో లేదోనని బెంగ పెట్టుకొనవద్దు. కర్తా చాహమశేషేణ - మీ పనులు నేను సంపూర్ణంగా నెరవేర్చి పెడతాను”. అని వినమ్రుడై పలికాడు.

"దశరథమహారాజా, నేనొక యజ్ఞం చేస్తున్నానయ్యా. దానికి కామరూపులైన ఇద్దరు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని అడ్డుకుని శిక్షించాలి. నీ కుమారుడైన రాముని నాతో పంపవయ్యా" అని విశ్వామిత్రుడు అడిగాడు.

దశరథుడు భయపడ్డాడు. “ఉహుహు. నా రాముడు పసివాడు. రాజీవలోచనుడు. రాక్షసులతో యుద్ధం చేయలేడు. నా అక్షౌహిణీసైన్యంతో నేనే వచ్చి పోరాడుతాను. బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్త్రకమ్. రాముణ్ణి నేను పంపను.”

"ఏమయ్యా, పని చేసి పెడతానని మొదట వాగ్దానం ఇప్పుడు మాట తప్పుతున్నావ్? సరే, సుఖంగా ఉండు. వెళ్లి వస్తా" అంటూ విశ్వామిత్రుడు అలిగేసరికి అందరూ భయపడ్డారు.

వసిష్ఠమహర్షి కలుగజేసుకుని నచ్చజెప్పాడు. చివరకు దశరథుడు ఒప్పుకున్నాడు. విశ్వామిత్రునికి రామునితో పాటు లక్ష్మణుని కూడా అప్పజెప్పాడు. గురుశిష్యులు ప్రయాణమైనారు. విశ్వామిత్రుడు వారికి బల అతిబల మంత్రాలనిచ్చాడు. వాటి ప్రభావం వలన వారికి అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాక్షసులు వారిని దొంగదెబ్బ తీయలేరు.

దారిలో గంగానదీతీరాన వారు ఒకనాడు ధనధాన్యాలతో తులతూగి, తాటక అనే ఘోరరాక్షసి పీడవలన భయంకరారణ్యంగా మారిన మలదకరూశప్రాంతాలను చూశారు. ఆమెచేత చంపబడిన వారు చంపబడగా, మిగిలిన జనాలు ఆ దేశాన్ని వదిలి పారిపోయారు.

"రామా, అయ్యో స్త్రీ కదా అని జాలిపడకుండా క్రూరురాలైన ఆమెను నీవు సంహరించి, ప్రజలకు రక్షణ చేకూర్చాలయ్యా. రాజ్యభారనియుక్తానామ్ ఏష ధర్మః సనాతనః. రాజ్యభారాన్ని వహించేవారికి ఇది సనాతనమైన ధర్మం" అని విశ్వామిత్రుడు హితం చెప్పాడు.

రామలక్ష్మణులు తాటకను వధించారు. విశ్వామిత్రుడు సంతోషించి రామునికి అనేకమైన దివ్యాస్త్రాలను, వాటి ఉపసంహారమంత్రాలతో సహా ఉపదేశించాడు.
రాముడు వాటిని సంగ్రహించి, మహర్షులవారి ఆనతిపై వాటిని లక్ష్మణునికి తాను స్వయంగా ఉపదేశించాడు.

అన్నదమ్ముల రక్షణలో విశ్వామిత్రుని యాగం నిర్విఘ్నంగా జరిగింది. తాటక కుమారుడైన మారీచుని దూరంగా పడగొట్టారు. అతడి జతగాడైన సుబాహుని హతమార్చారు.

యజ్ఞపరిసమాప్తితో దిక్కులన్నిటా ఈతిబాధలు తొలగిపోయాయి. అథ యజ్ఞసమాప్తే తు విశ్వామిత్రో మహామునిః నిరీతికా దిశో దృష్ట్వా... అని వాల్మీకి వర్ణించాడు.

అంటే, విశ్వామిత్రుడు స్వార్థం కోసమో స్వర్గమో మరొకటో కోరి యజ్ఞం చేయలేదు. ఈతిబాధలను తొలగించటానికి యజ్ఞం చేశాడు. ఏమిటా ఈతిబాధలు?

శ్లో “అతివృష్టి రనావృష్టి ర్మూషకా శ్శలభాః ఖగాః.
అత్యాసన్నాశ్చరాజానః షడేతా ఈతయ స్స్మృతాః"

ఈతిబాధలు ఆరు రకాలు. 1అతివృష్టి 2అనావృష్టి 3మూషకాలు, 4శలభాలు, 5పక్షులు, 6రాజుగారికి అతి అభిమానులు. వీటివలన ప్రజలు పడే బాధలు ఇంతింతనరానివి. అందువలన వాటిని తొలగించదలచి విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు.

1 అతివృష్టి అంటే అవసరమైనదానికన్న ఎక్కువ వర్షం కురియడం.

2 అనావృష్టి అంటే అవసరమైనదానికన్న తక్కువ వర్షం కురియడం.

3 పంటలను సర్వనాశనం చేసేంతగా ఎలుకల సంతతి పెరగడం.

4 పంటలను సర్వనాశనం చేసేంతగా మిడతలదండ్లు దాడి చేయడం.

5 పంటలను సర్వనాశనం చేసేంతగా పక్షులసంతతి పెరగడం.

6 అతి సమీపంలో ఉన్న పాలకులు (మా రాజుదే రాజ్యమని సామాన్యప్రజలను పీడించే ఆ రాజుగారి అనుచరుల ఆగడాలు అని అర్థం చేసుకొనవచ్చు.)




ఈ ఆరింటిని ఈతిబాధలంటారు. వాటిని అరికట్టడం కోసమే విశ్వామిత్రుని యజ్ఞం జరిగింది. అయితే విశ్వామిత్రుని ప్రవర్తనలో ఈనాటి సమాజానికి సరిపోయే మరికొన్ని అంశాలను మనం గమనించవలసి ఉంది.

పాతతరం మనుషులు (దశరథుని వంటివారు) ఎప్పుడూ ధర్మసంరక్షణకు ముందుకు వస్తారు. కాని, తమ సంతానాన్ని ధర్మరక్షణకు పంపేందుకు జంకుతున్నారు. అటువంటి జంకుగొంకులు మాని, క్రొత్తతరానికి ధర్మరక్షణబాధ్యతను అప్పగించవలసిన బాధ్యత వారికుంది.

ధర్మరక్షణబాధ్యతను మునులు స్వయంగా చేపట్టగలరు. కాని, యుద్ధం చేయటం మునుల ధర్మం కాదు. వారు యుద్ధం చేస్తుంటే భోగభాగ్యాలను అనుభవిస్తూ తింటూ కూర్చొనడం సమాజానికి సిగ్గుచేటు. అందువల్ల, మీ యుద్ధం మీరే చేయండి అని వారి కర్మకు వారిని వదిలిపెట్టకూడదు. వారిని రక్షించే బాధ్యతను క్షత్రియులు చేపట్టాలి.

అలాగని, మునులు అన్నిటినీ విడిచి ముక్కుమూసుకుని తపస్సును చేస్తూ కూర్చోరాదు. శక్తిమంతులైన క్షత్రియులను తయారుచేసి, వారికి తగిన అస్త్రశస్త్రసంపత్తిని చేకూర్చే బాధ్యత వారిదే.

ఈతిబాధలను తొలగించగల శాస్త్రపరిజ్ఞానాన్ని పెంపొందించుకొనే బాధ్యత మునులదే. వారి శాస్త్రపరిశోధనలకు, పరిశోధనాఫలితాలను సమాజానికి ఉపయోగపడేలా చూసే బాధ్యత క్షత్రియులది.

స్త్రీలు సమాజంలో రక్షార్హులు. నిజమే. కాని, ఆడవారిలో కూడా కొందరు పరమక్రూరురాళ్లుండే అవకాశముంది. కాని, వారు బలగర్వితులై ప్రజలను పీడిస్తూ ఉంటే అటువంటివారు కూడా తప్పక దండనార్హులే.

సుందుడు, తాటకాసుందుల కుమారుడైన మారీచుడు, వారితో బాటు సుబాహుడు రాక్షసరాజైన రావణాసురుని అనుచరులు. ప్రజలను పీడించడమే వారి పని. బహుశః ప్రజలను పీడించే ఈతిబాధలను సృష్టించడం కూడా వీరు పని గట్టుకుని చేస్తుంటారు. (నేటి బయో వార్ లా) సుందుని అగస్త్యముని సంహరించాడనే కోపంతో అతని భార్య అయిన తాటక కూడా జనాల మీద పగబట్టి పీడించడం మొదలుపెట్టింది. రాజుగారి అండ చూసుకుని పేట్రేగిపోయే ఈ విధమైన క్రూరులు కూడా ఈతులలోనికే వస్తారు.

విశ్వామిత్రుడు వారిని కూడా అణచేందుకు తగిన శిక్షణను రామలక్ష్మణులకు ఇచ్చాడు.

స్వచక్రం పరచక్రం చ సప్తైతా ఈతయః స్మృతాః అని కొందరంటారు.  స్వదేశంలో కలిగే బాధలు స్వచక్రం, బయటదేశపు పాలకులవలన కలిగేవి పరచక్రం అన్నమాట. అంటే పాకిస్థాన్, చైనా వంటి దేశాల దుందుడుకు చేష్టలు, ఉగ్రవాదచర్యలు వంటివి.

స్వచక్రాలను సాధ్యమైనంత త్వరగా అణచివేయాలి. పరచక్రాలను సరైన సమయం వచ్చేదాకా ఎదురు చూసి, సరైన మిత్రులను సమకూర్చుకుని చావుదెబ్బ కొట్టాలి.

అరణ్యవాసకాలంలోనే మునులు రామునికి రావణాసురుని అనుచరులవల్ల తమకు కలుగుతున్న బాధలను గూర్చి మొరపెట్టుకున్నారు. రాముడు తొందరపడలేదు. వారికి రక్షణ కల్పిస్తూ వచ్చాడే తప్ప వెంటనే రావణుని మీదకు దండెత్తి పోలేదు. దండెత్తటానికి సరైన కారణం దొరకగానే మొదట రావణాసురుని మిత్రుడైన వాలిని అణచివేసి, తనకు సంపూర్ణంగా సహకరించగల సుగ్రీవునితో స్నేహం చేసి అటుపిమ్మట దండయాత్ర చేసి రావణుని పూర్తిగా అణచివేశాడు.

అదీ రామునికి విశ్వామిత్రుడు నేర్పిన యుద్ధనీతి. ఆనాడు దశరథుడు చిన్నపిల్లవాడని రాముడిని పంపకుంటే, విశ్వామిత్రునికి తగిన శిష్యుడు దొరకకుంటే ఇప్పటికీ రావణరాజ్యం నడుస్తూ ఉండేదేమో.

ఇప్పుడు కూడా మన దేశానికి విశ్వామిత్రుల అవసరం ఉంది. తమ పుత్రులను విశ్వామిత్రుని శిష్యరికానికి పంపే దశరథమహారాజుల అవసరం ఉంది. విశ్వామిత్రయజ్ఞం అవసరమైనపుడల్లా జరిగితే గాని, ప్రపంచం సురక్షితంగా ఉండే అవకాశం లేదు. 

Previously posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2953553781431949

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...