Friday 6 August 2021

ఆర్యులు - దస్యువులు

 


అత్యంతప్రాచీనకాలంలోనే ఆర్యులు తమ జీవనవిధానంలో సాధించిన ప్రగతిని, వారి విజ్ఞానవైభవాన్ని ప్రపంచమంతా గుర్తించింది, వేనోళ్ల కొనియాడింది.

అంతే! యూరోపియన్ సమాజం ఉలిక్కిపడింది. తాము కాలనీగా మార్చుకున్న దేశం సాంస్కృతికంగా తమకంటె గొప్పదని, అక్కడి ప్రజలు తమకంటె గొప్పదైన ఉదారమైన వైభవోపేతమైన అతిప్రాచీనమైన మహానాగరికతకు వారసులు అని ఒప్పుకునేందుకు వారికి ఏమాత్రం మనసొప్పలేదు.
అందువల్ల ఒక దొంగ చరిత్రను సృష్టించి ప్రపంచానికి బోధించడం మొదలు పెట్టారు. మధ్య-ఆసియాలో ఆర్యజాతి ఒకటి ఉండేదని, ఆ జాతికి చెందిన జనాలు తూర్పున ఉన్న భారతదేశానికి పోయి అక్కడ స్థానికులైన దస్యులను జయించి రాజ్యాలు స్థాపించారని, ఆ ఆర్యులే వేదాలు వ్రాశారని, భారతీయనాగరికత అంతా ఆర్యనాగరికత అని భారతీయుల గొప్పదనం అంటూ ఏమీ లేదని పాఠ్యపుస్తకాలలో చేర్చి పాఠాలు నేర్పుతూ, భారతీయులలో తరతరాలకు సరిపడా ఆత్మన్యూనతభావాన్ని కూరి కూరి పెట్టారు.
అందువల్లనే ఈనాటికి కూడా మనవాళ్లు ఆ విదేశీయుల విజ్ఞానం లేకుంటే మనం పశుప్రాయులుగా బ్రతికేవారమని భ్రమపడుతూ మనసులోనే వారికి పాదాక్రాంతులై, వారు మన దేశాన్ని వదిలి ఏనాడో వెళ్లిపోయినా, వారికి మానసబానిసలై జీవిస్తూ, వారు చెప్పిన మాటే వేదవాక్కని, వారిలాగ బ్రతకాలని, వారు ముద్ర వేస్తేనే ఏదైనా సత్యమౌతుందని, వారి భాష నేర్చుకుంటేనే తమ బ్రతుకు ధన్యమైపోతుందని, వారి నడత నేర్చుకుని వారిని అనుకరిస్తేనే తమ బ్రతుకు సార్థకమౌతుందని కలలు గంటూ ఇతరులను కూడా తమలాగే నమ్మింపజూడడం మనం గమనిస్తూనే ఉన్నాం.
కాని, మన గ్రంథాలను చదువుతూ ఉంటే ఆర్య అనే పదాన్ని మనవారు గుణవాచకంగా ఉపయోగించారనే విషయం స్పష్టంగా అవగాహనకు వస్తుంది.
శ్రీకృష్ణుడు కౌరవపాండవుల మధ్యలో సంధికోసం హస్తినాపురం వచ్చినపుడు పాండవుల తల్లి, తన మేనత్త అయిన కుంతీదేవి ఆశీస్సులు కోరి ఆమెను కలిశాడు. అపుడు కుంతీదేవి తన కోడలైన ద్రౌపదికి, తన కుమారులకు కౌరవుల వలన కలిగిన అవమానాలను, కష్టాలను, దుఃఖాలను స్మరించింది. దుర్యోధనాదులను అనార్యులని నిందించింది.
అంతే కాదు, ద్రౌపదీవస్త్రాపరహణం జరుగుతుండగా అక్కడ అవాక్కులై నిలిచిన ధృతరాష్ట్ర-బాహ్లిక-కృపృ-సోమదత్త-భీష్మ-ద్రోణాదులందరినీ ఆమె అనార్యబుద్ధితో నిలిచినవారుగానే పరిగణించేసింది. ఆ సభలో అందుకు అభ్యంతరం తెలిపిన విదురుడు ఒక్కడే ఆర్యుడని భావిస్తున్నానని చెప్పింది.
"వృత్తేన హి భవత్యార్యః, న ధనేన న విద్యయా"
(ఉద్యోగపర్వం 90.53)
"ఓ కృష్ణా, పెద్ద ఎత్తున ధనాన్ని (రాజ్యాన్ని, అధికారాన్ని కూడా) సంపాదించినంత మాత్రాన, లేదా గొప్ప గొప్ప శాస్త్రాలు చదివి మహా మేధావి అనిపించుకున్నంత మాత్రాన ఒక మనిషిని మనం ఆర్యుడు అని పిలువలేము. కేవలం శీలం (మంచి నడవడిక) చేతనే ఏ మనిషి అయినా ఆర్యశబ్దవాచ్యుడు కాగలడు"
అని కుంతీదేవి ఆర్యశబ్దనిర్వచనం చేసింది. కృష్ణుడు అవునంటూ ఆమోదముద్ర వేశాడు.
కాబట్టి, ఆర్య అనేది గుణాన్ని తెలిపే పదం. ఒక జాతిని గూర్చి చెప్పేది కానే కాదు.
అలాగే, వసిష్ఠస్మృతి కూడా ఆర్యపదాన్ని నిర్వచించింది.
కర్తవ్యమాచరన్ కామమ్, అకర్తవ్యమనాచరన్।
తిష్ఠతి ప్రకృతాచారే స వా ఆర్య ఇతి స్మృతః।।
ఏ మనిషి తనకు అప్పజెప్పిన కర్తవ్యాన్ని లేదా సమాజం చేత శాస్త్రాల చేత మంచివని అంగీకరించబడిన పనులను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడో, అలాగే ఆ సమాజం, ఆ శాస్త్రాల చేత చేయరానివని చెప్పబడిన పనుల జోలికి పోకుండా ఉంటాడో, తాను ఉన్న సమాజంలోని ఆచారాలకు కట్టుబడి ఉంటాడో అతడు ఆర్యుడు. (కామమ్ అనే పదానికి ఇక్కడ ఇష్టపూర్వకంగా, మనఃస్ఫూర్తిగా, చక్కగా, సంపూర్ణంగా అని అర్థం)
అంటే, సమాజానికి హితం కలిగించేవాడు, సమాజానికి ఎంత మాత్రం హాని కలిగించనివాడు, అనూచానంగా పరంపరగా వస్తున్న సదాచారాలను గౌరవించేవాడు ఆర్యుడు అని వసిష్ఠస్మృతి అభిప్రాయం.
ఈ నిర్వచనాల ప్రకారం ఆర్యశబ్దం ఒక జాతిని సూచించటం లేదని, కేవలం మనిషిలోని సద్గుణాలను మాత్రం సూచిస్తోందని తెలుస్తోంది.
ఆ ఆర్యులకు దస్యులకు యుద్ధం జరిగిన మాట వాస్తవమే. అయితే దస్యులు అంటే స్థానికులు అని అర్థం కాదు.
దస్యులు అంటే - దస్యంతి ఇతి దస్యవః - నాశనం చేసే స్వభావం కలవారు కాబట్టి వారిని దస్యులు అన్నారు.
అంటే పురాణకాలంలో మునుల యజ్ఞయాగాదులను ధ్వంసం చేసి, వారిని చంపివేసిన హిరణ్యకశిపుడు, రావణుడు వంటి వారు దస్యులు. అలాగే చరిత్రలో మన దేశం పైకి దండెత్తి, మన దేవాలయాలను కూలగొట్టి అపారమైన సంపదను దోచినవారు, మన గ్రంథాలయాలను తగులబెట్టినవారు, మన స్త్రీలను అపహరించినవారు వీరందరూ కూడా దస్యులే.
ఆ దస్యువులే అసురులు. దేవాసురులు ఒకే తండ్రి కన్నబిడ్డలన్న మాట నిజమే. కాని, మేము మాత్రమే ఉండాలి, మేము చెప్పినదే జరగాలి, మేము చెప్పినట్లే అందరూ నడచుకోవాలి, అని అందరినీ బెదిరించడం, అందుకు అంగీకరించకపోతే వారిని అన్ని విధాలుగా హింసించడం, సంహరించడం, తరిమివేయడం, వారి సంపదను స్వాధీనం చేసుకొనడం, ఇవన్నీ అసురుల పనులు.
ఈ దేవాసురసంగ్రామం భారతదేశంలో నిత్యం జరుగుతూనే ఉంది. నిన్న గాక మొన్న పాకిస్థానంలో గణపతిమందిరాన్ని వారు దగ్ధం చేసిన విషయం స్మరించండి.
కాబట్టి. భారతదేశంలో మొదటినుండి ఉన్నది ఆర్యులే. అనార్యులు మాత్రమే ఈ దేశం మీదకు దండెత్తి వచ్చారు. ఇక్కడి సదాచారాలను నాశనం చేశారు. చేస్తూనే ఉన్నారు. మరలా ఓ భయంకరమైన యుద్ధం అనివార్యంగా జరిగి తీరుతుంది. అజ్ఞానం కొద్దీ అటువంటి అనార్యబుద్ధులను మన అన్నదమ్ములలో కూడా కొందరు సమర్థిస్తున్నారు.
కాని, అనివార్యమైన కొత్త తరం దేవాసురయుద్ధం మొదలయ్యేసరికి ఏ పక్షంలో ఉండాలో వారు స్పష్టంగా ముందే తేల్చుకుంటే మంచిది. చివరకు గెలిచేది ధర్మమే గాని. బలం, ధనం కాదు. దుర్యోధనుడి 11 అక్షౌహిణీల సైన్యం ధర్మరాజు 7 అక్షౌహిణీల చేతిలో చిత్తైనాయి. శతాధికులైన కౌరవులు పంచపాండవుల చెేతిలో మన్ను గరచారు.
యతో ధర్మః తతో జయః।
ధర్మం ఏ పక్షాన ఉంటుందో ఆ పక్షమే గెలుస్తుంది.
ధర్మో రక్షతి రక్షితః।
ధర్మం ఎవరి చేత కాపాడబడుతుందో వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...