Sunday 13 June 2021

 


ఓమ్మోవ్!

రాళ్లు రప్పలకు , బొమ్మలకు స్నానం చేయించి , పట్టుబట్టలు కట్టి , బంగారు నగలు పెట్టి పాలు, పండ్లు, టిఫినీలు తినిపిస్తే అది అజ్ఞానం అంటున్నావు. మెంటల్ అంటున్నావు. అది తప్పు అని చెప్పినా వినలేనంత మతోన్మాదపు మత్తు అంటున్నావు. మానసికదౌర్బల్యం అంటున్నావు. వెఱ్ఱి భక్తిని వీధుల్లో ప్రదర్శిస్తున్నారు అంటున్నావు.

సరే గాని, మీరు చెబుతున్న అటువంటి అజ్ఞానం గాని, మెంటల్ గాని, తప్పు గాని, మతోన్మాదపు మత్తు గాని, మానసికదౌర్బల్యం గాని, వెఱ్ఱిభక్తి గాని సమాజంలో ఎవరికైనా అపకారం చేసిందా? ప్రాక్టికల్ గా మాట్లాడండి. మాట్లాడే ముందు ఆలోచించండి.

అజ్ఞానం కొద్దీ పాలు పండ్లు టిఫినీలు రాళ్లు రప్పలకు పెడుతున్నారు అంటున్నారే? ఆ రాళ్లూ రప్పలు రోజుకు ఎన్నేసి టన్నులు మెక్కుతున్నాయి? నైవేద్యం పెట్టి ఆ తరువాత అవన్నీ ప్రసాదం అని భావిస్తూ శ్రద్ధగా తినేది జనాలేగా? వ్యర్థం అయ్యే ప్రక్రియ అందులో ఏముంది? అందులో మెంటల్ ఏముంది? మీ పనేదో మీరు చూసుకోక మీ జోలికి రాకుండా వారు చేసే పనిని తప్పు అని మీరు ఎందుకనాలి? సమస్తప్రపంచానికీ ఆహారాన్ని సమకూరుస్తున్న అలౌకికశక్తిని సింబాలిక్ గా పూజ పేరిట వారికి నచ్చిన పద్ధతిలో వారు గౌరవించుకుంటారు. అది మీ దృష్టిలో మతోన్మాదపు మత్తు ఎందుకైంది? పోనీ, అది మీరన్నట్టే మత్తు అనుకుందాం. ఆ మత్తులో వారు తిన్న ఆ ప్రసాదం వల్ల వారికి గాని, ప్రపంచానికి గాని జరిగిన హాని ఏమైనా ఉందా? లేదు కదా? మరి మీకేమిటి బాధ?

ఏమ్మా? వంటింట్లో డైరెక్టుగా వండుకుని తింటే మీ దృష్టిలో అది ప్రగతికాముకత అవుతుందా? లేకపోతే హోటల్ కు వెళ్లి ఆర్డర్ ఇచ్చి తింటే అది అభ్యుదయవాదమౌతుందా? ఈరోజు ప్రసాదం తిని, రేపు ఇంట్లో తిని, ఎల్లుండి హోటల్లో తినే మనుషులు ఎంతమంది లేరు? వాళ్లు మొదటి రోజు మతోన్మాదులు, రెండో రోజు ప్రగతి కాముకులు, మూడోరోజు అభ్యుదయవాదులా?

అట్లయితే సర్టిఫికేట్ల షాపు పెట్టుకోవచ్చు మీరు.

వోమ్మా?

కోట్లమంది తిండికి లేక ఏడుస్తున్నారు అని వాపోతున్నావు.
అది ఎవరి తప్పు?

పుష్కలంగా పంట పండినా, సరైన ధర ఇచ్చి కొనేవారు లేరని పంటను రైతులు మార్కెట్ లోనే దించేసి వెళ్ళిపోయిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి.

పండిన పంటను జాగ్రత్త చేసి అవసరం అయిన ప్రజలకు చేర్చలేని ప్రభుత్వాన్ని కాదా నువ్వు ప్రశ్నించాల్సింది? అవసరమైనంత పంటలు పండుతున్నా అధికధరలు ఉండటం వల్ల పేదప్రజలకు తిండిగింజలు దొరకటం లేదు.

ఇది వ్యాపారప్రపంచపు తప్పా లేక హిందూభక్తుల తప్పా?

ప్రతిదానికి ఇలా హిందూ భక్తులను ఎందుకమ్మా ఆడిపోసుకుంటావు? అట్లా రేట్లు పెరగడానికి వారా కారణం? వారిని తిట్టే మీది కాదా హిందూ-వ్యతిరేక-ఉన్మాదం?

ఇంకా ఏమన్నారు? - పక్కింట్లో అనారోగ్యంతో మనుషులు చచ్చినా పట్టించుకోరు అంటున్నారా?

ఎవరు పట్టించుకోవటం లేదమ్మా? దేవుడి భక్తులు పట్టించుకోవటం లేదు అని మీ ఉద్దేశమా? ఓ సారి తిరుపతికి రండి. అలిపిరి నుండి ఓసారి అలా దక్షిణం దిక్కుగా ఓ కిలోమీటరు దూరం పొండి. భక్తులు ఇచ్చిన ధనంతోనే నిర్మింపబడి ప్రతిరోజూ వేలాది రోగులకు స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఉన్న స్వామివారి వైద్యశాలలు మీకు కనిపిస్తాయి. వారి అనారోగ్యాన్ని నయం చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న డాక్టర్లు కనిపిస్తారు. వారు కూడా భక్తశిఖామణులే మరి!

అలాగే, మీరు మీ కండ్లను డాక్టర్ దగ్గరకు పోయి చెకప్ చేయించుకుంటే మంచిది.

ఎందుకు అని అడగరేం? లక్షలు పెట్టి లడ్లను కొనడం ఒక్కటే మీకు కనిపిస్తోంది. ఆ పక్కనే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ జరుగుతూ ఉంటే మీకు కనబడటం లేదు కదా? అందుకు.

హిందువులు తాము సంపాదించుకున్న డబ్బును పండుగల కోసం ఖర్చు పెడతారు, దానధర్మాలు చేస్తారు కాబట్టే వారి డబ్బులు బ్యాంకులలో మూలగకుండా బయటకు వచ్చి, మట్టిని బొమ్మ చేసేవారి చేతుల్లోను, ఆకులు గడ్డీ అమ్మేవారి చేతిలోనూ, కాగితాలతో గొడుగులు చేసి అమ్మేవారి చేతిలోనూ (వీరందరూ పేదవారే సుమా) పడుతుంది.

ఈ పండుగలు లేకుంటే సంపాదన ఉండే ప్రతి హిందువూ ఈ పాటికి కోటీశ్వరుడై ఉండేవాడు తెలుసా? హిందువంటే పండుగల పేరిట తన సంపదను అందరితో పంచుకునేవాడు సుమా.

అయినా, ఎందుకమ్మా మీకు హిందువుల మీద, హిందువుల దేవుళ్ల మీద, హిందువుల పండుగలు, ఆచారాల మీద ఇంత ద్వేషం?

భారతీయ సమాజంలో ఎక్కడ ఎటువంటి లోటు కనబడినా వెంటనే హిందూదేవుళ్ల మీద, హిందూ భక్తుల మీద తిట్ల దండకాలు అందుకోవాలని మీకు ఎవరు నేర్పించారమ్మా? ఎక్కడ మీ ట్రైనింగ్ సెంటర్?

ఒకవేళ నిజంగా తప్పు జరిగిందే అనుకోండి.
ఇది తప్పు అని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా?
మీరు స్కూల్లో టీచర్ అయ్యుంటే మీ స్టూడెంట్లు చదువు నేర్చుకొనడం అటుంచి వాళ్ళ మెదళ్ళు పూర్తిగా మొద్దుబారిపోయి ఉండేవి.

మీ సోదరులకు చెప్పినట్టు మృదువుగా ఇందువల్ల ఇది తప్పు అని చెప్పవచ్చు కదా? అంతే గాని మీరు మొదలు పెట్టీ పెట్టడమే మెంటల్ గాళ్లు అని అందుకుంటే మీది ఉన్మాదం కాకుండా పోతుందా?

ఆ విధంగా రెచ్చగొట్టి రాళ్లేయించుకుని చూశారా ఈ హిందువులు నిజంగా మతోన్మాదులే అని నిరూపిద్దామనా మీ తాపత్రయం?

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...