Sunday 13 June 2021

విద్య అవసరం



ఒకవేళ మనం పశువులుగా పుట్టామనుకోండి, పశువులుగా బ్రతకాల్సిందే. మరో అవకాశం లేదు. కాని, కొందరు మనుషులున్నారే, మనుషులుగా పుట్టినా సరే, వేరే కొందరికి మనుషుల్లా బ్రతికే అవకాశం ఎందుకివ్వరు?

ఆహారనిద్రాభయమైథునాలు పశువులకూ మనుష్యులకూ సమానమేనట. అయితే వారిని వేరు చేసేది ధర్మమట. కాబట్టి ధర్మం చేసేవాడు మనిషి అయ్యాడట. ధర్మం తెలియనివి పశువులయ్యాయట.

ధర్మమన్నాం గదాని ఇప్పుడు మతగ్రంథాలలోనికి ఆధ్యాత్మికరంగాలలోనికి దూరి అదేమిటోనని విచికిత్స చేయవలసిన అవసరం లేదు. ధర్మమంటే ప్రాథమికంగా విధి. Duty. బాధ్యత వహించడం. Taking responsibility.

ఎవరైనా సరే, ఏది చేయగలరు? తమకు తెలిసిందే చేయగలరు. అయిదు నిమిషాలు మాట్లాడవయ్యా అంటే, నాకు తెలిసిన విషయాన్ని గూర్చే మాట్లాడగలను తప్ప, తెలియని విషయాలను గూర్చి ఏం మాట్లాడగలను?

ఈవిధంగా తెలియని విషయాన్ని గూర్చి కనీసం మాట్లాడడం కూడా సాధ్యం కాదే? మరి తెలియని విధిని Dutyని ఎలా నిర్వర్తించగలం? తెలియని బాధ్యతలను ఎలా వహించగలం?

ఇంటిలో మన విధులేమిటో బాధ్యతలేమిటో, అమ్మానాన్నాలు నేర్పించేస్తారు. మనముండే వీథిలో, ఇరుగుపొరుగుతో సఖ్యంగా ఉంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ, అన్యోన్యసహకారంతో మనం ఎలా వ్యవహరించాలో కూడా చిన్నతనంనుండి నేర్చుకుంటూనే ఉంటాము. అయినా చిన్న చిన్న అపార్థాలు, తగవులు వస్తూనే ఉంటాయే?

ఇలాంటి పరిస్థితుల్లో, వీథులు దాటి, కాలనీలు దాటి, ఊర్లు, పట్టణాలు, నగరాలు, మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు, రాజ్యాలు దాటి ఖండఖండాంతరాలలో విశాలంగా విస్తరించిన సమాజమున్నది కదా, ఈరోజుల్లో?

మరి, ఇంతటి విస్తృతమైన సమాజంలో మన విధులేమిటో, మన వ్యవహారవిధానం ఎలా ఉండాలో ఎవరో తెలిసినవారు పూనుకొని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పాలి? పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వమే చెప్పాలి. మన విధులేమిటో మనకు చెప్పలేనిదానికి ప్రభుత్వమనే పేరెందుకు?

ప్రభుత్వం చెప్పలేక వేరెవరితోనో చెప్పించుకోండి పొండని చెప్పడం బాధ్యతారాహిత్యం.

చదువుయొక్క ప్రాథమికలక్ష్యం పౌరులకు తాము నిర్వర్తించవలసిన విధులను బాధ్యతలను తెలియజేయడం.

ఇక భాషాబోధన, లెక్కలు, సైన్సు, హిస్టరీ, ఇలాంటివన్నీ ఎందుకు నేర్పించాలి అంటే, ఆయా విధులను సక్రమంగా నిర్వర్తించడం కోసం అవసరమైన నైపుణ్యాలను అందించడం కోసం.

తమ పౌరులకు వారి విధులను బాధ్యతలను బాగా తెలియజేసి, వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు తగిన నైపుణ్యాలను పెంపొందింపజేసి ప్రశాంతమైన, ఆదర్శవంతమైన సమాజాలను నెలకొల్పడం ప్రభుత్వాల బాధ్యత. విద్యావ్యవస్థ ఉండవలసిన తీరు అది. (కాని, ఉన్నత వ్యక్తిత్వనిర్మాణబాధ్యతను గాలికొదిలి, నైతిక విలువలు లేని ఉద్యోగులను ఉత్పత్తి చేయడం మాత్రమే ప్రస్తుతవిద్యావ్యస్థ తన కర్తవ్యంగా భావిస్తోంది.)

అంతే కాదు, తమ (కాబోయే) పౌరులకు విద్యను అందించవలసిన ప్రాథమికబాధ్యతను ప్రభుత్వాలు నెమ్మది నెమ్మదిగా వదిలించుకుంటూ ఉన్నాయి.

ఈవిధంగా, ఒకవైపు ప్రభుత్వమే స్వయంగా తన ప్రధాన విధిని నిర్లక్ష్యం చేస్తూ తమ పౌరులు మాత్రం తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కోరుకొనడం అత్యాశ కదా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఒక సామెత ఉండనే ఉంది.

ప్రైవేటు వ్యక్తులకు ఆ బాధ్యత అప్పగించి చేతులు దులుపుకుంటే, వారు ప్రభుత్వానికో సమాజానికో ఆవసరమైన పౌరులను తయారు చేయరు. రకరకాల కార్పొరేట్ వ్యవస్థలకు అవసరమైన పౌరులను తయారు చేస్తారు. మీ విశ్వాసమూ మీ విధేయత ఆయా కార్పొరేట్ యజమానుల పట్లనే ఉండాలని, మీ జ్ఞానము, మీ నైపుణ్యము వారికే అంకితం చేయాలంటాయి.

మంచిదేగా, అవన్నీ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సమాజానికి ఉపయోగపడతాయి కదా అనుకోవచ్చు.

చక్కని విద్య, అమోఘమైన నైపుణ్యాలు కలిగిన పౌరులను కార్పొరేటు వ్యవస్థలు తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. సమాజం పట్ల, దేశం పట్ల వారికేమీ బాధ్యతలు లేవనిపిస్తాయి. కనీసం తమ ఇంటి బాధ్యతలు కూడా ప్రధానం కాదనిపిస్తాయి. ఇవన్నీ అతిశయోక్తులనిపిస్తున్నాయా?

ఉద్యోగనిర్వహణ ధర్మం పేరిట మన అనుంగుమిత్రుని పెళ్లికి మనం హాజరుకాలేక, వీడియో చాట్‌లో శుభాకాంక్షలు మాత్రం చెప్పి ఊరుకొనడం, మన చెల్లెలి పెళ్లి వ్యవహారాలను కూడా మనం దగ్గరుండి మొత్తం చూసుకోలేకపోవడం, పేరెంట్స్ మీటింగుకు రండి నాన్నా అని పిల్లలు పదే పదే చెప్పినా హాజరు కాలేకపోవడం, అనారోగ్యం పాలైన తల్లిదండ్రులను ఫోన్లలో పలకరించి, ఇప్పుడు రాలేను, ఆదివారం వస్తాను అని చెప్పడం, మన passion అయిన ఫొటోగ్రఫీ కళను పోషించుకొనేందుకు అతి ఖరీదైన కెమెరాను కొన్నప్పటికీ, దానిని ఉపయోగించుకునే తీరిక లేక మూలన పెట్టేసి, ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమౌతూ అది మన కంటబడినపుడు నిరాశతో మనసు మూలగడం - ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కార్పొరేటు బానిసల లక్షణాలు కావా?

తన ఇంటినే పట్టించుకొనే తీరిక లేనివాడు, ఇక సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతను వహించగలడు? ఏ వరదలో ఏ భూకంపాలో వచ్చినపుడు ఏవో ముక్కూ మొహం తెలియని స్వచ్ఛందసంస్థలను మనఃస్ఫూర్తిగా నమ్మి, ఆన్‌లైన్‌లో తన వంతుగా కొంత సొమ్మును పంపి కొంత ఆశ్వాసన పొందడం తప్ప ఏమి చేయగలడు?

ఇలా బానిసలుగా మారేందుకు తగిన విద్య(?)ను మనం డబ్బులిచ్చి మరీ కొనుక్కొనవలసి రావడం దౌర్భాగ్యం కాక మరేమిటి?

ఓ ప్రభుత్వమా!

ఒక అందమైన బిల్డింగు, కొన్ని అందమైన గదులు, వాటిలో సౌకర్యవంతమైన కుర్చీలు, బల్లలు, మంచి వెంటిలేషను, (వీలైతే ఏసీ) ఒక గ్రౌండు, హడావుడిగా సిలబస్సు పూర్తి చేసి, రివిజన్ చేసి, పరీక్షలు పెట్టే కొన్ని యంత్రాలు, పరిశుభ్రమైన టాయిలెట్లు, ఇవన్నీ ఎంచక్కగా ఉంటే దానిని ఆదర్శ విద్యాలయమని అంటారా? విద్యార్జనమంటే నిజంగా మార్కులు, ర్యాంకులు మాత్రమేనా? ఈ ప్రైవేటు విద్యావ్యవస్థ విద్యార్థులను, తల్లిదండ్రులను, మేధావులను కూడా సమ్మోహపరచి, తప్పుదోవ పట్టిస్తూ ఉంటే కళ్లు మూసుకుని పాలు త్రాగుతూ ఉండడం నీకు సమంజసమేనా?

ప్రభుత్వవిద్యావ్యవస్థను ప్రజలు ఏనాడో నమ్మడం మానేశారు. సిగ్గనిపించడం లేదా?

(ఈ క్రింది ఫోటోలో ఈ మీడియావాడు కేవలం సగం నిజం మాత్రమే చెప్పి ఊరుకున్నాడు అనిపిస్తోంది. ఫీజు కట్టకపోతే దళితుల పిల్లలను మాత్రమే బహిష్కరిస్తారా? ఫీజు కట్టడం లేటయితే కులమతాలప్రసక్తి లేకుండా కార్పొరేట్ "విద్యాసంస్థలలో" జరిగే వేధింపులు ఈ మీడియా వాడికి తెలియవా? వీడికి కూడా తన విధులను గూర్చి సరైన ఎడ్యుకేషన్ లభించి ఉండదు.)

{ఎవడి మీద కోపమొస్తే వాణ్ణి పట్టుకొని మర్యాద లేకుండా వాడు, వీడు అనటం, వాణ్ణి వీణ్ణి అనే పదాలు ఉపయోగించడం కూడా, నాకు సరైన ఎడ్యుకేషన్ దొరకలేదు అనడానికి సూచన.}

క్లుప్తంగా -

బలహీనతలను తొలగించి, లోపాలను పరిష్కరించి, వీధిలోని పశువులకంటె మనలను ఉన్నతులుగా నిలిపేదే విద్య.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...