Saturday 7 August 2021

విగ్రహారాధనద్వేషులు దేవాలయాలకు దూరంగా ఉండండి


 

అయ్యో, సాములూ, అరకొరజ్ఞానంతో పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం జపించడం మానండి.

నిజమే. అలౌకికంగా చూస్తే తన భక్తులను స్వామివారే రప్పించుకుంటారు, ఆయన వద్దనుకుంటే దర్శనం ఎంత ప్రయత్నించినా వీలుకాదు. మేము కాదనటం లేదు.

అందువల్ల, వద్దనడానికి వారెవరు వీరెవరు అంటూ మీరు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

మా సమాధానమేమిటంటే, స్వామివారు తిరుమలలో విగ్రహరూపంలో వెలిశారు. అక్కడ విగ్రహారాధనను వ్యతిరేకించేవారికి అధికారికంగా ఎందుకు ప్రవేశం ఇవ్వాలి?

“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” –

సమస్త ధర్మాలను విడిచిపెట్టి నామీద అచంచలమైన విశ్వాసంతో నన్ను శరణు కోరు – అని స్వామివారు స్పష్టంగా భగవద్గీతలో (18.66) చెప్పి ఉన్నారు. మరి అటువంటి అచంచలమైన విశ్వాసం లేకపోతే ఎందుకు దర్శనానికి పోవడం?

పైగా స్వయంగా స్వామివారే సెలవిచ్చారు -

“యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్” –

నన్ను ఎవరు ఏ విధంగా (విగ్రహరూపంలో కావచ్చు, రూపరహితంగా కావచ్చు) కొలిస్తే వారిని నేను అదే విధంగా అనుగ్రహిస్తాను (గీత 4.11) అని స్పష్టంగా చెప్పి ఉన్నారు.

కాబట్టి, అందరూ తమ తమ ఇష్టదేవతలలో కొలిచేది ఆ స్వామివారినే. విగ్రహారాధనలో నమ్మకం లేనివారు విగ్రహాలు ఉండని తమ తమ ప్రార్థనాస్థలాలకు వెళ్లి స్వామివారిని ప్రార్థించుకోవచ్చు. వారు అక్కడ ప్రార్థన చేసినప్పటికీ కూడా వారిని స్వామివారు అనుగ్రహిస్తారు.

సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి.
ఏ దేవుడికి ఎటువంటి నమస్కారం చేసినా, ఎటువంటి ప్రార్థన చేసినా, ఎక్కడ చేసినా, అవన్నీ చేరేది స్వామివారికే.

అందువల్ల, సంపూర్ణమైన విశ్వాసంతో దివ్యమంగళవిగ్రహరూపంలో స్వామివారిని చూడదలచిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలి.

అంతేగాని, నాకు విగ్రహారాధనమీద నమ్మకం లేదు, విగ్రహారాధన మా మతంలో పాపం అని ఒకపక్క మనసులో భావిస్తూ, అయినా సరే హిందువులందరూ గొప్పగా కొలిచే ఆ విగ్రహం ఎలా ఉందో చూసొద్దాం అని ఒక చార్మినార్ ను చూడటానికి, ఒక సాలార్ జంగ్ మ్యూజియంను చూడటానికి, ఒక తాజ్ మహల్ ను చూడటానికి వచ్చినట్టు తిరుమల స్వామిని కూడా చూడటానికి కూడా ఎవరైనా రావచ్చు అనే ఊహ కూడా మాకు కంపరం పుట్టిస్తోంది. అలా వచ్చేవారికి టికెట్లమ్మి సొమ్ము చేసుకోవడానికి మీకు తొందర ఉండవచ్చు. కాని, స్వామివారు జూలో జంతువు కాదు, కాసేపు వినోదంగా చూసి పోవడానికి.

తమరు మరింత దూరం పోయి వ్యర్థపాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

“త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః” – (నీలోనూ నాలోనూ వేరొకచోట కూడా ఉన్నది విష్ణువే కదా, నన్ను సహించలేక వ్యర్థంగా కోపిస్తున్నావు) – అని శంకరాచార్యులవారు అనలేదా అని “కోట్” చేస్తున్నారు.

నిజమే. మీ ప్రశ్నకు సమాధానం కూడా శంకరులవారు తమ మాటలలోనే ఇమిడ్చి ఉన్నారు గ్రహించండి.

అన్యత్ర – అంటే వేరొక చోట (అంటే విగ్రహరహితమైన వారి వారి ప్రార్థనాస్థలాలలో ఉన్నది కూడా) ఏకో విష్ణుః - అదే విష్ణువు ఉన్నాడని స్పష్టంగా చెప్పారు కదా?

మరి అక్కడ వారు స్వామివారిని నిర్గుణంగా నిరాకారునిగా మనసులో భావించి ప్రార్థనలు చేసుకోమనండి, ఎవరు వద్దన్నారు? అంతేగాని, విగ్రహరూపాలను విశ్వసించని ఆ అన్యమతస్థులకు తిరుమలలో విగ్రహరూపంలో ఉన్న స్వామివారిని చూపించాలని మీ పట్టుదల ఏమిటి? ఎందుకు మీరు అసహిష్ణుతతో ప్రవర్తిస్తున్నారు?

అన్యమతస్థులలో కూడా కొందరికి విగ్రహరూపంలో ఉన్న స్వామివారి పట్ల అచంచల భక్తి ఉండవచ్చు. వారు ఎప్పట్నుంచో స్వేచ్ఛగా వచ్చి దర్శించుకొని పోతూ ఉన్నారు. సంతోషమే, వారిని ఇప్పటివరకూ ఎవరు అడ్డగించారు? ఎవరు పోపొమ్మన్నారు? అంతా సవ్యంగా జరుగుతోంది కదా? మరెందుకు ఇప్పుడూ ఈ అవాకులు చవాకులు?

ఇంతవరకూ హిందువులకు మతాంతరసహిష్ణుత లేనట్లు గాను, ఆ లేనిదేదో మీరు హిందువులకు బోధిస్తున్నట్లుగాను, హిందూమతంలో ఏవో సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్టుగాను, హిందువులను ఉద్ధరిస్తున్నట్టుగాను ఒక ఇష్యూ ఎందుకు సృష్టించారు?

)))(((
పాపం మరికొందరు ఉన్నారు.
ముస్లిం రాజులు, బ్రిటిష్ రాజులూ హిందుత్వాన్ని ఏమీ చేయలేకపోయారు. ఇప్పటి వాళ్లు ఏదో చేసేస్తారని భయపడటం అనవసరం అని భావిస్తున్నారు.

అయ్యా సామీ, చరిత్ర అంటే మొగల్ రాజదర్బారులు, వారి వైభవమూ మాత్రమే కాదు. పాఠ్యపుస్తకాలలో ఉన్నది మాత్రమే పరీక్షలకోసం బట్టీ పట్టి చదివి, నాకు చరిత్ర కొట్టినపిండి అని భావించకండి.

అప్పట్లో కూడా హిందుత్వంపై దాడులను అడ్డుకొనేందుకు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడిన వీరులు ఉన్నారు. అసంఖ్యాకులైన హిందువులు అసువులు వీడారు. వారి త్యాగాల ఫలితంగానే ఇప్పుడు మీరైనా నేనైనా ఇంకా హిందువులుగానే మిగిలివున్నాం. అది ముందుగా గుర్తించండి. వారిని కూడా మహాలయపక్షంలో తలచుకోండి. అది మన ధర్మం.

)))(((
హిందుత్వం అనేది నేను కాపాడటానికి పూనుకోనంత మాత్రాన నిలబడదా? అంత చేవ చచ్చిందా? నీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఆ దేవుడే తనను తాను కాపాడుకుంటాడు. అయినా, నన్ను దేవుడు కాపాడాలి కాని, నేను దేవుడిని కాపాడటమేమిటి? అని మరికొందరు పాపం, చాల చాల “అమాయికంగా” అడుగుతున్నారు.

ముందుగా - నేను దేవుడిని కాపాడలేను మీరు అని నిజాయితీగా ఒప్పుకున్నందుకు అభినందనలు. అది నిజం. దేవుడిని కాపాడటానికి మీరే కాదు, మేము కూడా అశక్తులమే. స్వయంగా దేవుడే ఎంతవరకు అవసరమో, ఏ విధంగా కోరుకుంటాడో అంతవరకు తనను తాను కాపాడుకుంటాడు. మాలాంటివారం కేవలం పరికరాలం మాత్రమే. మా దేవుడిని మా ధర్మాన్ని కాపాడుకోవాలనే బుద్ధిని మాకు పుట్టించి మా ద్వారా దేవుడే తనను తాను కాపాడుకుంటాడు.

అది కేవలం మా విశ్వాసం కాదు, స్వయంగా మహాభారతకర్త అయిన వ్యాసమహర్షులవారి మాట. ఉద్యోగపర్వంలోని ప్రజాగరపర్వాన్ని వెదకండి. ఈ శ్లోకం కనిపిస్తుంది.

న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్।
యం తు రక్షితుమిచ్ఛంతి, బుద్ధ్యా సంవిభజంతి తమ్।।

(దేవతలు ఎవరినైనా కాపాడాలి అనుకుంటే గోపాలకుడిలాగా కర్ర పట్టుకుని కాపలా కాయరు. వారికి కాస్త బుద్ధిని ప్రసాదిస్తారు.)

నిజానికి రావణాసురుడిని చంపడానికి విష్ణువు రామావతారం ఎత్తవలసిన పని లేదు. తాను ఉన్న వైకుంఠంనుండే సంకల్పమాత్రంతో చంపగలడు.

కాని, ఆయన ప్రజలకు అధర్మం మీద పోరాటం చేసే విధానాన్ని నేర్పదలచుకున్నాడు. అందువల్లనే రామునిగా అవతారం దాల్చాడు.

నిష్కారణవైరం ఉండరాదని చెప్పదలచుకున్నాడు కాబట్టి అయోధ్యనుండి నేరుగా రావణాసురుడిమీదకు దండయాత్రకు పోలేదు. సీతాపహరణం చేసి తనకు అపకారం చేశాడు కాబట్టే రావణాసురుడితో శత్రుత్వం కలిగింది. అయినా సరే, రాముడు చాల సహనంతో మన మధ్య శత్రుత్వం వద్దు అని రావణాసురుడితో ఎన్నో రాయబారాలు కూడా చేశాడు. అయినా రావణాసురుడు మూర్ఖంగా మొండికేశాడు. అందువల్లనే అతడిని వధించడం తప్పనిసరి అయింది. ఇందులో రాముని తప్పేమీ లేదు.

రామావతారంలో కూడా, సీతను అపహరించింది రావణుడు అని జటాయువు చెప్పగానే రాముడు అదే ప్రాంతంనుండి ఒక్క బాణం విడిచి రావణాసురుడి పది తలకాయలను తెంచగల శక్తి ఉన్నవాడే.

అయినప్పటికీ, అధర్మాన్ని ఎదిరించేందుకు ఎటువంటి సంఘటితశక్తి కావాలో తరతరాల ప్రజలకు ఆయన పాఠం చెప్పదలచుకున్నాడు కాబట్టే వానరుల సాయం కోరాడు. ధర్మాన్ని కాపాడడం ఒక్కని బాధ్యత కాదని, అందరి బాధ్యత అని ఆయన నిరూపించదలచుకున్నాడు. ఉడుత చేసిన సాయాన్ని కూడా ఎంతో ఆదరంగా స్వీకరించాడు. ధర్మాన్ని కాపాడుకునే కర్తవ్యంలో అందరికీ భాగస్వామ్యం పొందే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని స్వీకరించిన వానరాలు ధన్యులయ్యారు. రాముని నాయకత్వంలో విజయాన్ని పొందారు.

వానరులు లేకపోతే రాముడు నిస్సహాయుడు అని భావిస్తే అది సంపూర్ణంగా మన అజ్ఞానం.

ఆ విధంగా ధర్మాన్ని కాపాడుకునేందుకు దేవుడు ప్రతిసారీ, తన భక్తులు కూడా భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ప్రసాదిస్తాడు. (ప్రసాదమంటే కేవలం లడ్డు పులిహోరలు మాత్రమే కాదని మనవి.) 

ఆ సమయంలో మనం భాగస్వాములు కావడానికి నిరాకరించి, దేవుడు తనను తాను కాపాడుకోలేడా అని వెక్కిరింపులు ఈసడింపులు చేయడం చాల సులువైన, సౌకర్యవంతమైన పని.

కాని, మమ్మల్ని పరికరాలుగా చేసుకుని దేవుడు ధర్మరక్షణకార్యం నిర్వర్తిస్తాడు అనేది మా విశ్వాసం.

అర్జునుడు కూడా, నన్ను చంపవచ్చిన కౌరవులు అధర్మపరులైనప్పటికీ నేను మాత్రం వీరిని చంపను అని కృష్ణుడితో అన్నాడు.

“ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన” (గీత 1.35)

అందుకు కృష్ణుడు నవ్వి, చాల్లేవయ్యా, పెద్ద పండితుడిలాగా చెప్పొచ్చావ్. ఎవరిని గూర్చి ఏడవనవసరం లేదో, వారిని గూర్చి ఏడుస్తున్నావ్.

“అశోచ్యానన్వశోచస్త్వం, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే” (గీత.2.11) అన్నాడు.

ఈ ధర్మవిరోధులను నేను చంపబోతాను అనుకొనడం నీ భ్రమ. కాలస్వరూపుడనైన నేనే ఈ ధర్మవిరోధులను సంహరించడానికి పూనుకుని ఉన్నాను. యుద్ధం ద్వారా ధర్మరక్షణ చేయడానికి నీకు అవకాశం ఇచ్చాను. ఆ అవకాశాన్ని వినియోగించుకుని కీర్తిని పొందు. కేవలం నాకు పరికరంగా ఉండు. నువ్వు లేనంతమాత్రాన నా సంకల్పం నెరవేరదని భావించకు.

(ఋతే త్వాం న భవిష్యన్తి సర్వే – తస్మాత్ త్వముత్తిష్ఠ, యశో లభస్వ – నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్) – (గీత – విశ్వరూపసందర్శనయోగం – 32,33)

అయ్యా సామీ, ఆ విధంగా,
మేమే చేస్తున్నాం, మేమే దేవుడిని కాపాడగలం, మేమే హిందుత్వాన్ని కాపాడగలం అనే అజ్ఞానంలో మేము లేము. మేము ఆ భగవంతుని పరికరాలం అనే విశ్వాసం మాత్రమే మాది. భగవంతుడు ఆదేశించినట్టుగా మేము నిమిత్తమాత్రంగా ఉంటాము. మాకు కీర్తి రావచ్చు, లేదా మేము అపకీర్తి పాలు కావచ్చు.

మీకు అటువంటి విశ్వాసం లేదనుకుంటే అది మీ యిష్టం. మీకు, మీలాంటి వారికి శుభమస్తు.

)))(((
ఇంకా చెప్పడం పూర్తి కాలేదు. వ్యాసం పేరు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. మరి ఆ విషయం చెప్పకుండా పూర్తి చేస్తే ఎలా?

ప్రతివిషయానికీ ఒక అధికారి అనేవాడు ఉంటాడు. ఈ సందర్భంలో అధికారి అంటే పెత్తనం చలాయించేవాడు అని కాదు అర్థం. ఇక్కడ అధికారి అంటే అర్హుడు, యోగ్యుడు, తగినవాడు అని అర్ధం. ఇప్పట్లో అయోగ్యులు అధికారులౌతూ ఉండటం వల్ల ఆ పదానికి అసలైన అర్థం మనం మరచిపోయాం.

ఒకటవ తరగతి పిల్లవాడికి క్వాంటం థియరీ బోధిస్తారా?
ఆ విషయానికి ఆ పిల్లవాడు అధికారి కాదు.

అలాగే
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒకటి నుండి వంద వరకు అంకెలు మాత్రమే సిలబస్ అని చెబుతారా? ఇతడు కూడా ఆ సిలబస్ కు అధికారి కాడు.

అదేవిధంగా,
సత్త్వరజస్తమోగుణాలు కలిగినవారికోసం బట్టి ఆయా గుణాలకు అనుగుణంగా విడివిడిగా కర్తవ్యధర్మోపదేశాలు చేయబడ్డాయి. అలాగే వివిధ ఆశ్రమాలలో (బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్థ-సన్న్యాస ఆశ్రమాలు) ఉండేవారికోసం వివిధధర్మాలు ఉపదేశింపబడ్డాయి. ఆయా ధర్మాలకు వారే అధికారులు.

సన్న్యాసాశ్రమంలో ఉండే వారు పాటించవలసిన నిష్కర్మ (భగవద్ధ్యానం తప్ప ఏ పనిమీద ఆసక్తి చూపవద్దు. అంతా భగవంతుడే చూసుకుంటాడు) అనే ధర్మాన్ని పట్టుకు వచ్చి మిగిలిన ఆశ్రమాలలో ఉండే ప్రజలకు (ఉదాహరణకు - విద్యార్థులకు, గృహస్థులకు, ఉద్యోగులకు, సైనికులకు) బోధించి, మీరు భగవద్ధ్యానం చేసుకోండి, అంతా భగవంతుడే చూసుకుంటాడు అని అసందర్భంగా “కోట్” చేసి, వారిలో అయోమయం సృష్టించడం సంపూర్ణమూర్ఖలక్షణమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

పోనీ, మీరే కరెక్టు అనుకుందాం. మరి భగవంతుడిమీద అంతటి నమ్మకం ఉన్న మీరు భగవద్ధ్యానం చేసుకొనడం మానేసి, మీ నాయకుడి నిర్ణయాలు మంచివైనా చెడ్డవైనా అవి మీ నాయకుడి అభీష్టాలు కాబట్టి, గుడ్డిగా వెనకేసుకుని రావడం, మామీద మాటల యుద్ధం చేయడం ఇవన్నీ ఏమిటి?

మీరు కోట్ చేసిన శ్లోకసారాంశం మీద మీకే నమ్మకం లేదు. మీరే పాటించటం లేదు. మరి మాకెందుకు బోధిస్తున్నారు? మీకు మీ నాయకుడు ఎంతో కావచ్చు., మాకు మా ధర్మం అంతకంటె ముఖ్యం.

కొంగ ఎంత తెల్లగా ఉన్నా, ధ్యానం చేస్తున్నట్టు ఎంత నిశ్చలంగా కనిపించినా, దాని ధ్యేయం మాత్రం చేపలు పట్టడమే. కాదని మీరు ఎంత దబాయించినా లోకం తెలుసుకోలేదా యేం? 

Earlier, posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3267410146712976


No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...