Saturday 7 August 2021

"తమ్ముడి కంటె అన్నే నయం!"


 

"తమ్ముడి కంటె అన్నే నయం!" అన్నారు ఊరందరూ. అది విని తమ్ముడు గర్వంతో మీసం మెలేశాడు.

ఆ అన్నదమ్ములను ఊరిలో అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అన్యోన్యత ఎలా ఉండాలో వారిని చూసి నేర్చుకోండ్రా అంటూ ఊరిలో తగవులాడే కుర్రకారుకు బోధనలు చేస్తూ ఉంటారు.

అయితే వారి పొరుగింటాయనకు వారంటే గిట్టేది కాదు.
"ఏం, వీరు తప్ప ప్రపంచంలో వేరే అన్నదమ్ములంటూ ఎవరూ లేరా? వీరిలో పెద్ద ప్రత్యేకత ఏముంది?" అని అసూయతో గింజుకు చచ్చేవాడు.

వారి మధ్య ఎప్పటికైనా గొడవ రాకపోతుందా నేను చూసి ఆనందించకపోతానా అని ఎదురు చూసేవాడు. వారి మధ్యలో గొడవలు రావాలని వారంలో ప్రతి మొదటి రోజూ ప్రత్యేక ప్రార్థనలు చేసి దీవెనలు పొందేవాడు. వారంలో ప్రతి ఆరో రోజూ వంగి వంగి దండాలు పెట్టేవాడు.

మొత్తానికి అతగాడి ప్రార్థనలు ఫలించాయో ఏమో,
ఆ అన్నదమ్ములిద్దరికీ గొడవ వచ్చింది. అన్న తన యజమానిని విమర్శించినందుకు తమ్ముడికి కోపం వచ్చింది. ఆ విషయం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇద్దరూ ఆ యజమాని విషయం విస్మరించి ఒకరినొకరు తిట్టుకున్నారు. విడిపోయి వేరే వేరే ఇండ్లలో కాపురం పెట్టారు.

ఆ పొరుగింటాయన సంతోషానికి మేర లేదు.
కాని మళ్లీ కాస్త సందేహం కూడా వచ్చింది. గొడవలు తాత్కాలికమేమో. వీళ్లు మళ్లీ కలసిపోతే? ఆ సందేహం రాగానే వీల్లేదు, వీళ్లెప్పటికీ కలవడానికి వీల్లేదు, మళ్లీ కలవకుండా ఒకరికి తెలియకుండా మరొకరి పట్ల సానుభూతిని కనబరుస్తూ, వారిని రహస్యంగా రెచ్చగొట్టి, ఇద్దరికీ మధ్యన ఉండే సంబంధాన్ని శాశ్వతంగా తెంచేయాలి అనుకున్నాడు.

నెమ్మదిగా అన్న ఇంటికి పోయాడు.
"అన్నా, అన్నా, ఎంతటి ఘోరమన్నా, ధర్మరాజులాంటి తమరిని మీ తమ్ముడు ఎంతేసి మాటలన్నాడన్నా? అసలు వాడికి బుద్ధి లేదన్నా, ఊర్లో వాడంతటి కృతఘ్నుడు లేడన్నా" అంటూ మొదలు పెట్టాడు. తన మాటలతో అన్నకు సంతోషం కలుగుతుందనుకున్నాడు పాపం.

కాని, అతడి మాటలకు అన్నకు వొళ్లు మండింది.
"నోర్ముయ్యరా గాడిదా" అని తిట్టాడు. "నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు తెలుసును. నువ్వెవడ్రా మధ్యలో నా తమ్ముడి గూర్చి నోరెత్తడానికి, మళ్లీ ఇలాంటి కూతలు ఇంకెక్కడైనా కూశావని తెలిసిందో?" అంటూ చేయి చాపి అటువైపు చూడమని సైగ చేశాడు.

పొరుగింటాయన అటువైపు చూశాడు. అక్కడ కొత్త చెప్పుల జంట, నవనవలాడుతూ కనిపించింది.

"చూశావు కదా, వాటితో కొడతాను. నోర్మూసుకుని పోరా ఇక్కడ్నుంచి" అని అన్న ఈసడించుకున్నాడు.

పొరుగింటాయన గప్పుచుప్పున లేచి వెళ్లిపోయాడు.

ఆ వెళ్లినవాడు ఊరికినే పోలేదు.
"ఉరేయ్ అన్నా, భడవా, నీ పని పడతాను చూడరా, నీ తమ్ముడిని నీ మీదకు ఉసిగొలిపి మీరిద్దరూ కొట్టుకుంటూ ఉంటే ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి ఊరందరిలోను మీ ఇద్దరి పరువు తీస్తాను చూడండ్రా" అని మనసులో శపథాలు చేసుకుంటూ మరీ వెళ్లాడు.

తరువాత తమ్ముడి ఇంటికి వెళ్లాడు.
"తమ్ముడూ తమ్ముడూ, మీ అన్న ఎంతటి మూర్ఖమైన పని చేశాడురా, అలనాడు లక్ష్మణుడు రాముని సేవించినదాని కన్న, నీవు మరింత ఎక్కువగానే మీ అన్న దగ్గర మసలుకున్నావు. కాని, మీ అన్న మాత్రం రావణాసురుడు విభీషణున్ని గెంటేసినట్టు నిన్ను నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. వాడంతటి మూర్ఖుడు క్రూరుడు ఈ లోకంలో ఇంకెవడైైనా ఉంటాడాా? అసలు..." అంటూ ధారాప్రవాహంగా మాటాడుతూ ఉండగా...

ఆ పొరుగింటాయనకు చెంపమీద ఏమిటో కాలినట్లనిపించింది. చెంప తడుముకున్నాడు. ఈ లోపుల మరో చెంప కూడా కాలింది. ఆ చెంప తడుముకున్నాడు. రెండు చేతుల మండలూ కాలడం మొదలు పెట్టాయి.

"ఏమిటిది, ఏమి జరుగుతోంది?" అని అతడు తలెత్తి ఆలోచించేలోపలే ఆ తమ్ముడు రౌద్రాకారం ధరించి తనను కొత్త చెప్పుల జతతో ఎడా పెడా వాయిస్తున్నట్టు తెలిసింది. ఆ వాయింపుడు ఎలా ఉందంటే తగిలిన చోటల్లా నిప్పు కొరివి పెట్టి గుచ్చినట్లు కాలిపోతోంది. తాను చేయి అడ్డు పెట్టినప్పుడు చేతులు కూాడా మండిపోయేంత కసిగా కొడుతున్నాడు ఆ తమ్ముడు.

"ఏరా దున్నపోతా, ఏరా కుక్కా, మా అన్నను గూర్చి మాటలు తూలేంతటి మొగోడైనావేమిరా నువ్వు?" అంటూ మొదలైన తిట్లు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ పొరుగింటాయన పారిపోతుంటే వెంటబడి మరీ కొడుతున్నాడు ఆ తమ్ముడు. ఊరందరూ అతడికి జరిగిన సన్మానం చూశారు. జరిగిన విషయమేమిటో నెమ్మదిగా ఊరందరికీ తెలిసిపోయింది. పగలబడి నవ్వుకున్నారు.

"తమ్ముడి కంటె అన్నే నయం!" అన్నారు ఊరందరూ. అది విని తమ్ముడు గర్వంతో మీసం మెలేశాడు.

(మా చిన్నప్పుడు మా అవ్వాతాతోళ్లు చెబుతూ ఉండిన కథ ఇది. నేటి పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా మార్చి వ్రాశాను.)


Previously posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3276036629183661

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...