Saturday 16 May 2020

ప్రపంచం చూపు ఇండియా వైపు అంటున్న చైనా


జనరిక్ ఔషధాలను వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. కోవిద్ 19 వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్‌ను కనిపెట్టడంలో కూడా భారతదేశం కీలకమైన పాత్రను పోషించగలదని ప్రపంచ దేశాలన్నీ గట్టిగా నమ్ముతున్నాయి.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో గట్టి సంబంధాలు కలిగిన ఒక ప్రముఖ చైనా న్యూస్ పేపరు ఇండియా ఫార్మాసూటికల్ శక్తిని గూర్చి ఈ మధ్యనే ఇలా వ్రాసింది -
"భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిరంగాన్ని పరిశీలిస్తే ఆ దేశం యొక్క ప్రగతిశీలత అర్థమవుతుంది. ఔషధాలను అభివృద్ధి చేసేందుకుగాను భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలు చాల బలంగా జరుగుతున్నాయి. జనరిక్ ఔషధాలు మరియు వ్యాక్సిన్ల తయారీలోను, ఉత్పత్తిలోను ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో భారత్ ఒకటి. ఈ విధంగా వ్యాక్సిన్ ను స్వయంగా అభివృద్ధి చేసుకుని ఉత్పత్తి చేసే శక్తి గలిగిన భారతదేశం, ఇతరుల సహాయం లేకుండా తనకు తానుగానే కోవిద్ 19 పై పోరాటం చేయగలదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ, వ్యాక్సిన్ కు తమ దేశంలోనే చాలా డిమాండ్ ఉన్నప్పటికీ, అతి తక్కువ కాలంలోనే వ్యాక్సీన్ సాధించగల సామర్థ్యం భారతదేశం సొంతం. అటువంటి సామర్థ్యం ప్రపంచంలో మరే దేశానికీ లేదు. ఈ సందర్భంలో అంతర్జాతీయ గ్లోబల్ వ్యాక్సిన్ ఇండస్ట్రియల్ గొలుసుకు తన సహకారాన్ని అందించడంలో భారతదేశం ప్రముఖమైన పాత్రలను పోషించగలదని మేము హృదయపూర్వకంగా నమ్ముతున్నాము."
ఈవిధంగా, ఇంతగా ఒక చైనా పత్రిక భారత దేశాన్ని ప్రశంసించడమా? ఏమిటి కారణం?
దాని జిత్తులు దానికి ఉన్నాయి.
కరోనా రోగంపై పోరాటంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆర్థికంగా లాభ పడుతున్నది కేవలం చైనా మాత్రమే కాదని, వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు అమ్మడం ద్వారా భారతదేశం కూడా విపరీతంగా లాభపడుతుందని ప్రపంచానికి చాటి చెప్పడమే దాని ఉద్దేశం.
నిజానికి అనేక శతాబ్దాలుగా భారతదేశం యొక్క ఔషధాల తయారీ మరియు ఉత్పత్తి సామర్థ్యం చైనాకు తెలిసినంతగా బహుశః మరే ఇతర దేశానికీ తెలియదు.
తమ చైనా దేశంలో కంటె మెరుగైన ఆరోగ్యాన్నిభారతదేశంలో చవకగా పొందవచ్చుననే ఆశతో తమ దేశానికి వైద్యం కోసం వచ్చిన అనేక మంది చైనీయుల ప్రాణాలను భారతదేశం కాపాడింది.
ఈ నిజాన్ని అదే చైనా న్యూస్ పేపర్ ఒప్పుకుంది కూడా. కాలేయానికి సంబంధించిన జబ్బులను, క్యాన్సర్ జబ్బును నయం చేసుకొనేందుకు తగిన చికిత్స కోసం, ఔషధాల కోసం భారతదేశానికి వెడుతున్న చైనీయుల సంఖ్య రాను రాను మరింతగా పెరుగుతూ ఉన్నదని ఒప్పుకుంది.
ఈ విధంగా చైనీయులు భారతదేశం వైపు ఆకర్షింపబడడానికి కారణం కేవలం భారతదేశంలో వైద్య సేవలు తక్కువ ధరలకు లభించడం మాత్రమే కాదని, అవి చాల ఉన్నత స్థాయికి చెందినవై ఉండటం కూడా కారణమేనని ఒప్పుకున్నారు.
చైనాలో ఒకానొక శస్త్రచికిత్స జరుగుతున్నపుడు రక్తాన్ని ఎక్కిస్తున్న సమయంలో ఒక చైనా రోగి హెపటైటిస్-సి రోగానికి గురికావడాన్ని ఆ పత్రిక ప్రస్తావించింది. ఇక చైనాలో లాభం లేదని ఆమె మంచి వైద్యం కోసం భారతదేశం పోవడానికి నిశ్చయించుకొన్నది.
అలా భారతదేశానికి రావడానికి ముందే ఆమెకు లివర్ ఫైబ్రోసిస్ వ్యాధి మధ్యమస్థాయిలో ఉన్నది. అది సిర్రోసిస్ కు లేదా లివర్ క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయినప్పటికి స్వదేశమైన చైనా దేశంలో చికిత్స చాలా ఖరీదైనది మాత్రమే కాక కనీసం సత్ఫలితాలను కూడా ఇవ్వకపోవడంతో ఆమె మెరుగైన వైద్యంకోసం భారతదేశానికి పోవాలని నిశ్చయించుకుంది.
అటువంటి స్థితిలోనే చివరకు ఆమె భారతదేశానికి వచ్చింది. భారతదేశపు వైద్యుల అంకితభావం, ప్రైవేటు వైద్యశాలల్లోని పరిశుభ్రత ఆమెకు ఎంతగానో నచ్చాయి. చైనాలో క్రిిక్కిరిసి పోయి ఉండే వైద్యశాల మాదిరిగా కాకుండా, భారతదేశపు ప్రైవేటు వైద్యశాలలు పరిశుభ్రమైన హోటళ్లలా ఉన్నాయి.
చవకైన భారతదేశపు ఔషధాలను చైనాకు స్మగుల్ చేసేందుకు చైనీయులు గతంలో ఏ విధంగా ప్రయత్నించారో కూడా ఆ పత్రిక వెల్లడించింది.
నిజమే.
గత అనేక సంవత్సరాలుగా భారత దేశం ఉన్నతస్థాయి ఔషధాలను అభివృద్ధి పరచి అందించడం ద్వారా, ప్రైవేటు రంగంలో అద్భుతమైన వైద్య వ్యవస్థను సృష్టించడం ద్వారా ప్రపంచానికి తన సేవలను నిశ్శబ్దంగా అందిస్తూ వస్తోంది.
BCG, మంప్స్, పోలియో, న్యూమోనియా, రూబెల్లా, మెనింజైటిస్, మీజిల్స్, ఇంకా అటువంటి అనేకవిధాలైన రోగాలకు తగిన మోతాదులో వ్యాక్సిన్లను తయారు చేయగల వివిధ సంస్థలకు భారతదేశం నిలయంగా మారింది.
ప్రస్తుతం కోవిడ్ 19 కు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు ఒక అరడజను భారతదేశవైద్యసంస్థలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
Serum ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ సంస్థలలో ఒకటి.
తయారు చేసిన డోసుల సంఖ్య పరంగా చూసినా, లేదా అవి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయిన సంఖ్య పరంగా చూసినా ప్రపంచంలోకెల్లా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన అతి పెద్ద సంస్థ ఇదే.
ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 165 వివిధ దేశాలకు దాదాపు 20 రకాల వ్యాక్సిన్లను అందిస్తోంది.
ఈ విధంగా భారతదేశపు ఘనతను గుర్తించిన ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు యావత్ప్రపంచం ఒక్కటై పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో కూడా భారతదేశం తమకు తగిన ఔషధాన్ని తయారుచేసి అందించగలదని ఆశిస్తున్నాయి.
వ్యాక్సీన్ ను ఎవరు కనిపెట్టినప్పటికీ, ఎక్కడ కనిపెట్టినప్పటికీ అది త్వరగా జరగాలని, సమస్తప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆశిద్దాం.
వీడియో - కరోలినా గోస్వామి

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...