Monday 18 May 2020

ఉపదేశం



ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేముందు అక్కడ ఎలా మసలుకోవాలో తల్లి హితబోధ చేస్తుందంటూ మనం కథలను వినుంటాం.
తల్లి లేని పిల్ల అయిన శకుంతలను భర్త ఇంటికి పంపుతూ కణ్వమహర్షి చేసిన ఉపదేశమే అభిజ్ఞానశాకుంతలంలోని అత్యుత్తమసన్నివేశమని మహా మహా పండితులు కూడా కొనియాడుతారు.
మరి మగపిల్లలకు ఒక సందర్భాన్ని అనుసరించి ఉపదేశం పొందే అర్హత లేదా?
లేకేం?
రామునికి రేపు పట్టాభిషేకమనగా దశరథమహారాజు అతనిని పిలిచి ప్రజారంజకంగా పాలించడమే పాలకునికి పరమధర్మం అని ఉపదేశించాడు.
రాజు ఎలా పరిపాలన చేయాలో రాముడు భరతునికి, నారదమహర్షి యుధిష్ఠిరునికి ఉపదేశం చేశారు.
అజ్ఞాతవాసకాలంలో ఎలా ప్రవర్తించాలో ధౌమ్యుడు పాండవులకు ఉపదేశించాడు.
కర్తవ్యం ఏ విధంగా నిర్వర్తించాలో కృష్ణుడు అర్జునునికి యుద్ధరంగంలో ఉపదేశించాడు.
రాజు చుట్టూ చేరే భజనపరులు ఎలా రాజును తప్పుదోవ పట్టిస్తారో, రాజు తన యౌవనమదాన్ని, ఐశ్వర్యమదాన్ని, అధికారమదాన్ని, వదిలి వివేకంతో ఎలా ప్రవర్తించాలో శుకనాసుడు చంద్రాపీడునికి ఉపదేశిస్తాడు.
మందబుద్థులైన అమరశక్తిమహారాజు కుమారులకు చిన్నచిన్న కథల రూపంలో విష్ణుశర్మ ఉపదేశించిన రాజనీతి పంచతంత్రమని మనకు తెలుసు.
మరికొద్దిసేపట్లో విజయనగరసార్వభౌమునిగా పట్టాభిషిక్తుడు కాబోతున్న శ్రీకృష్ణదేవరాయల చెంపను తిమ్మరుసు ఛెళ్లుమనిపించి మరీ కర్తవ్యాన్ని ఉపదేశించాడని జనశ్రుతి.
అయితే ఇక్కడ ఉదాహరించిన సందర్భాలలో ఉపదేశకులు మహాత్ములు. ఉపదేశం పొందినవారు కూడా వినీతులు. తాము పొందిన ఉపదేశాలను చక్కగా పాటించి కృతార్థులైనారు.
కాని, ఎంతటి మహాత్ములు తమకు ఉపదేశం చేసినా, అందరూ వాటిని శ్రద్ధగా విని పాటిస్తారని అనుకోలేము.
విభీషణుడు కూడా లంకాపురశ్రేయస్సును, రాక్షసజాతిక్షేమాన్ని కోరి తన అన్న రావణునికి మంచిని ఉపదేశించాడు. రావణుడు వినలేదు. ఫలితం? సపుత్రబంధుమిత్రపరివారంగా నశించాడు.
విదురుని వంటి మహాత్ముడు ఎంతగా ఉపదేశించినా ధృతరాష్ట్రుడు వినడం వరకే సరిపెట్టాడు. పుత్రవ్యామోహంతో అతని ఉపదేశాన్ని పాటించలేకపోయాడు. ఫలితం? వార్ధక్యంలో దుర్భరమైన పుత్రశోకాన్ని అనుభవించవలసి వచ్చింది.
అయితే మహాత్ముల ఉపదేశాలను పెడచెవిన పెట్టినా, దుష్టాత్ముల ఉపదేశాలను ఔదలదాల్చినా ఫలితం మాత్రం సమానమే.
శకుని కూడా దుర్యోధనాదులకు అనేకానేకమైన ఉపదేశాలు చేశాడు. వారు కూడా వాటిని తు.చ. తప్పకుండా పాటించారు. ఫలితం? సర్వనాశనం.
ప్రస్తుతానికి వస్తే, అసలు ఎవరైనా మనకు ఉపదేశం చేయబోతే (అంటే సలహా ఇవ్వబోతే) వీడు మనకు చెప్పేంతటి వాడా అని భావించే కాలంలో మనం బ్రతుకుతున్నాం.

Apv Prasad
మహోదయా,
గత కొద్దిరోజులుగా మీరు మీకు నచ్చిన చిత్రం ఫోటో పెట్టండి అని మీ మిత్రులను కోరుతున్నారు. అందువల్ల ఈ రెండు ఫోటోలను పెడుతున్నాను. అయితే అవి ఏ సినిమాలోవో చెప్పకండి అన్నారు. అందువల్ల చెప్పటం లేదు. అయితే పూర్తిగా ఆ సినిమా గురించి చెప్పకుండా ఉండటం సాధ్యం కాదు.
ఉపదేశాలను గూర్చి ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఎందుకంటే ఈ రెండు ఫోటోలు ఆ సినిమాలో తండ్రులు తమ తమ కుమారులకు ఉపదేశం చేసినప్పటి ఫోటోలు.
ఆ ఉపదేశాలేమిటో, వాటిని పాటించిన ఆ కుమారులేమయ్యారో ఆ సంగతులు వేరే పోస్టులో వ్రాస్తాను.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...