Friday 15 May 2020

వామనగుంటలు



సుదీర్ఘమైన కరోనా సెలవుల్లో నిత్యం ఒకే రకం ఆటలతో విసిగిపోయి క్రొత్త ఆటలు నేర్పించాలని తనను ఆశ్రయించిన మనుమరాళ్లు లతిక ప్రేరణలకు ఒక పాతకాలం ఆటను పరిచయం చేస్తున్న తాత చిదానందరెడ్డి గారు.

అనంతపురం జిల్లాలో రాయదుర్గం దగ్గర గుమ్మఘట్ట గ్రామంలోని దృశ్యం.  

ఆట పేరు #వామనగుంటలు

చింతపిక్కలను గాని, ఆముదం గింజలను గాని, గుళిగింజలను గాని, వేప విత్తనాలను గాని ఉపయోగించి మేము కూడా మా వూరిలో ఆడేవాళ్లం చిన్నప్పుడు.  మా ఆటను మీరాడుతున్నారే అని ఆడపిల్లలు గేలి చేస్తే ఉడుకుమోత్తనంతో మగపిల్లలం ఆడడం మానేశాం.  😕

అందుకే మగపిల్లలకంటే ఆడపిల్లలకు పంపకం లెక్కలు బాగా తెలుస్తాయని పెద్దలు మిమ్మల్ని చూసి నవ్వేవారు.  (కడుపు నిండా) పెట్టేది వాళ్లే కాబట్టి పంపకాలు వారు నేర్చుకోవలసిందేనని తీర్మానించేవారు.  

భిక్షాన్నాన్ని భీముడికొకరకంగా, తనతో పాటు మిగిలిన నలుగురు పాండవులకు ఒక రకంగా పంచిన కుంతీదేవమ్మ కూడా చక్కగా వామనగుంటలాట నేర్చిన తల్లి అయ్యుండవచ్చునేమో.

ఆయుధం పట్టనన్న శ్రీకృష్ణుడు ఒక్కడే కదాని అతడిని పాండవపక్షానికి వదులుకుని, అతడి సైన్యాన్ని పరమానందంగా తన పక్షానికి తీసుకుని  దుర్యోధనుడు వేసిన ఒక్క తప్పటడుగు ఘోరమైన ఫలితాన్ని ఇవ్వడానికి కారణం అతడు వామనగుంటలాట నేర్వకపోవడమే అయ్యుంటుంది.  అతడు నేర్చుకొనే సమయంలో దుశ్శల చీ చీ, ఆడపిల్లలాట నువ్వాడుతున్నావే అనుంటుంది.  ఈ అభిమానధనుడు ఆట నేర్చుకొనడం మానేసి ఉంటాడు!

అసలు ఈ పంపకం ఆటను మన ఆర్థికవేత్తలు నేర్చుకుంటే మోడీ గారు ప్రకటించిన ₹20 లక్షల కోట్లను ఏ రంగాన్ని ఏ వరుసలో ఎన్నో స్థానంలో ఉంచాలో, ఎక్కడినుంచి పంపకాలు ప్రారంభిస్తే ఆయా రంగాలకు సరైన న్యాయం చేకూరుతుందో తెలిసేది.  

ఏతత్సందర్భానుసారంగా ఓ క్రొత్త సామెతను సృష్టిద్దామా?

"వామన గుంటలు ఆడడం రానివారు కూడా మహా ఆర్థికవేత్తలై విమర్శించినట్టు!"
😊

ఆట ఆడే విధానం వికీపీడియాకు కూడా ఎక్కింది‌.  ఈ లింకును క్లిక్కి చూడండి మరి.

మా లతికమ్మ ప్రేరణమ్మ తమ తాతగారి శిక్షణలో మంచి నేర్పరులౌదురు గాక!

https://te.m.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A8_%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...