Friday, 17 March 2023

యోగి - భోగి


మూడు రోజుల క్రితం తెచ్చిన పన్‌రూటీ పనస గమ గమా వాసన వస్తుంటే బాగా మాగినట్టుందని చేతులకు చాకుకూ బాగా నూనె రాసుకుని పొద్దున్న కోశాము. ఆహా. తేనె పనస! కోస్తూ ఉంటే తేనె కారడం మొదలు పెట్టింది.

దేవుడికి నైవేద్యం పెట్టేంతవరకూ ఎట్లాగో ఓపిక పట్టిన పిల్లోడు ఒకవైపు మేము తొనలు తీస్తూ ఉంటే మరోవైపు వాటి రుచిని మెచ్చుకుంటూ ఒకొక్కటీ గుటకాయ స్వాహా చేయడం మొదలు పెట్టాడు. ఇలా లాభం లేదని మొత్తం మూడు పెద్ద పళ్లేలు తెచ్చి ఒకటి వాడికి కేటాయించి మిగిలినవాటిలో ఒకటి ఇంటికి, మరొకటి ఇరుగు పొరుగుకు కేటాయించి మొత్తం తొనలు తీయడానికి గంటకు పైగా సమయం పట్టింది.
తీస్తూ ఉండగా మాటల సందర్భంలో ఈ రోజు యోగ డే అనే ప్రసక్తి వచ్చింది.
"యోగ చేస్తే ఏమౌతుంది?" అని అడిగారు పిల్లలు.
"యోగం వల్ల యోగి అవుతారు".
"యోగి అయితే లాభమేమిటి?"
"యోగీ భవార్జున" అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు తెలుసా? అలా భగవద్గీత విని అర్జునుడు యోగి అయ్యాడు. దాంతో అందరికంటె బాగా యుద్ధం చేశాడు. గెలిచాడు."
"యోగులు యుద్ధం కూడా చేస్తారా? యోగులు యుద్ధం చెయ్యొచ్చా?"
"ఎందుకు చెయ్యకూడదు? ఎవరి పనిని వారు చక్కగా చేయడం కూడా యోగమే. యోగః కర్మసు కౌశలమ్" అని శ్రీకృష్ణుడు డెఫినిషన్ చెప్పాడు."
"అప్పన్నా అయితే నువు యోగివి కావు. నీకంటె అక్కయ్యే బాగా తొనలు తీస్తోంది. తెగిపోకుండా" అని పక పకా నవ్వాడు పిల్లోడు.
"మేము ఒక్కటి నోట్లో పెట్టుకునే లోగా నువ్వు మొత్తం ఖాళీ చేసేట్లున్నావురా. తినడమనే పనిలో నువ్వు యోగివి" అంటూ అక్కలిద్దరూ పక పక నవ్వారు.
ఇంతలో వాళ్లమ్మ కలుగ జేసుకుంది. "ఏకభుక్తే మహాయోగీ - ద్విభుక్తే మహాభోగీ - త్రిభుక్తే మహారోగీ" అన్నది.
"అంటే?"
"రోజుకు ఒక పూట తింటే గొప్ప యోగి. రెండు పూట్ల తింటే గొప్ప భోగి. మూడు పూట్ల తింటే గొప్ప రోగి అవుతాడు మనిషి."
"అమ్మో, ఇవన్నీ నేను ఒక్క పూటలో తినలేను. ఇప్పుడు కొన్ని, మధ్యాహ్నం కొన్ని, రాత్రి కొన్ని తిందామనుకున్నా" అన్నాడు పిల్లోడు.
"అయితే ఇంకేం? నువ్వు రోగివైపోతావ్" అంటూ వెక్కిరించారు అక్కయ్యలు.
ఉడుక్కున్నాడు పిల్లోడు. "చూడప్పన్నా" అని ఫిర్యాదు చేశాడు. "సరే. నేను ఇప్పుడు సగం, సాయంత్రం మిగిలిన సగం తింటాను. యోగి కాకపోయినా భోగి అవుతాను."
"భోగి అంటే?"
"భోగి అంటే మహారాజు."
"కాదు. పాము" అంటూ మళ్లీ పకపకలాడారు అక్కయ్యలు. నవ్వు పామైపోతావా? అయ్యయ్యో. హ హ హ."
"పామెట్లా?"
"అప్పన్ననడుగు కావాలంటే"
"అవునా అప్పన్నా?"
"అవును"
"అదెట్లా?"
"భోగమంటే పడగ. భోగం కలిగింది భోగి. కాబట్టి పాము. భోగీంద్రశాయినం, పురుకుశలదాయినం అనే పాట విన్నావు కదా? భోగీంద్రశాయి అంటే పాములరాజును పడకగా చేసుకుని శయనించేవాడన్న మాట. అంటే మహావిష్ణువు."
పిల్లోడు బుంగమూతి పెట్టేశాడు. "ఇవన్నీ నేను ఒక్క పూటలో తిన్నా కడుపు నొప్పి రోగమొచ్చేస్తుంది. అప్పుడు యోగి ఎట్లా అవుతాను? ఒక్క పూట తిన్నా రోగే, మూడు పూటలా తిన్నా రోగే. ఇంకేముంది తేడా?"
అపుడు అప్పన్న తీర్పు చెప్పాడు.
"నువ్వు భోగివైతే తప్పేమీ లేదు. విష్ణువు పడక ఆదిశేషుడు పామే కదా? యోగసూత్రాలు రాసింది పతంజలి. ఆయప్ప ఆదిశేషుడి అవతారం. అంటే సమస్త భూభారాన్ని మోసే పెద్ద పాము. యోగ డే నాడు నువు ఆదిశేషుడంతటి వాడివైతే తప్పేమీ లేదు".
ఈసారి అక్కయ్యలు బుంగమూతి పెట్టారు. అప్పన్న పిల్లోడి పార్టీ అయినందుకు.
))((
సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి తారుమారైపోయింది. పిల్లోడు రెండో పూట పనస తొనలు తిందామని గిన్నె తీసేసరికి...
...
...
తీసేసరికి... ఖాళీ. మొత్తం గిన్నె ఖాళీ.
అక్కయ్యలు మొత్తం తొనలు వీడికి తెలియకుండా ఎప్పుడో స్వాహా చేసేశారు.
విత్తనాలే తప్ప తొనలు లేవు.



పాపం, పిల్లోడి బిక్క మొహం చూసి అక్కలిద్దరూ పకపకా నవ్వారు.
జరిగిన ఆ ఘోరమైన అన్యాయం గూర్చి అప్పన్నకు ఫిర్యాదు చేయబడింది.
"పోనీలే, ఈ విత్తనాలున్నాయి కదా? వీటిని తోటల్లోను, అడవుల్లోను నాటుదాం. ఆ పని బాగా మంచిగా చేద్దాం. అలా మనం ఇద్దరం గొప్ప యోగులమైపోదాం." అని అప్పన్న పిల్లోడిని ఓదార్చాడు.
"మేము వీడిని మూడు పూటలా తినే రోగి కాకుండా కాపాడాము. రెండు పూటలా తినే భోగి కాకుండా కాపాడాము. ఒంటి పూట తిన్న యోగిని చేశాం. అది కూడా తప్పేనా?" అని అక్కలు తమ వాదం వినిపిస్తున్నారు.
((పిల్లవాడి తొనలు వేరే గిన్నెలో భద్రంగా ఉన్నాయి. తమ్ముడి మీద అక్కల ప్రేమ సందేహింపరానిది.
😊
))

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...