Friday 17 March 2023


ప్రామాణికం అనే మాటను మనం చాలసార్లు వినివుంటాం. ఆ మాటను మనం ఉపయోగించి కూడా ఉంటాం. ప్రమాణంతో కూడినవి ప్రామాణికం అన్నమాట.


ప్రమాణం అంటే?
ప్రకృష్టం మానం ప్రమాణం అని వ్యవహారం.
అంటే ఖచ్చితమైన తూనిక లేదా ఖచ్చితమైన కొలత.

దుకాణం యజమాని మనకు ఒక గుప్పెడు బియ్యం ఇచ్చి, ఇవి ఒక కిలోగ్రాము అంటే మనం ఒప్పుకుంటామా? కాదు, కిలోగ్రాము రాయి పెట్టి తూచవలసిందే అంటాము. అమ్మకందారుకు ఒప్పుకోక తప్పదు. లేదంటే మనం తూనికలు కొలతలు శాఖవారికి మొర పెట్టుకుంటాం కదా? అంటే అసలైన తూనిక ఇదే అని తేల్చగలిగిన అధికారం కలిగిన పెద్దలు కొందరుంటారన్నమాటే కదా?

అలాగే, మనం ఒక ఐదారు పెద్ద మామిడి పండ్లు ఏరుకుని, ఇవి అర్ధ కేజీ అంటే అమ్మకందారు ఒప్పుకుంటాడా? లేదు. తూకం వేసి ఇస్తాను తీసుకోండి అంటాడు. కాదని మనం మొండికేస్తే మామిడిపండ్లను మనం కొనలేం. అందువల్ల అతడి తూనికకు మనం ఒప్పుకోవలసిందే. అంతగా కావాలంటే ధర దగ్గర బేరమాడుకోవచ్చు.

ఇలా ఉభయులకూ అంగీకారయోగ్యమైనదానినే ప్రమాణం అంటారు. ఒక కిలోగ్రాము, ఒక లీటరు, ఒక మీటరు... ఇలా...అందరికీ ఆమోదయోగ్యమైన వస్తువు లేదా విషయం ఏదైనా ఉంటే అది ప్రమాణం అన్న మాట. ప్రమాణానికి లోబడింది ప్రామాణికం.

అంటే కిలోగ్రాము రాయి ప్రమాణం. అంతే బరువు కలిగిన బియ్యం లేదా మామిడిపండ్లు ప్రామాణికాలు.

అయితే ఇవి కేవలం భౌతికవస్తువులను కొలతవేసేందుకు తగిన ప్రమాణాలు మాత్రమే. మరి, ఒక విషయంలోని సత్యాసత్యాలను కొలత వేసేందుకు తగిన ప్రమాణాలు ఉన్నాయా?

ఇప్పుడైతే Fact Check లాంటి కొన్ని పక్షపాతపూరితమైన శక్తులు కొన్ని ఆవిర్భవించి, కొన్ని వర్గాలవారికి అనుకూలమైన వాటిలో ఎంతటి అసత్యపూరితమైన, అసంబద్ధమైన విషయాలు ఉన్నా మౌనం వహించడం చూస్తున్నాం. మరికొన్ని వర్గాల విషయంలో - ప్రత్యేకించి భారతజాతీయవాదులు, హిందువుల విషయంలో, వారు తమ పట్ల జరుగుతున్న అన్యాయాలను గూర్చి నోరెత్తినా, ఇలా మమ్మల్ని హింసించారు అని ఫొటోలు విడియోల సాక్ష్యాలతో సహా తెలియజేసినా, తమ Community Standards కు తగినట్టు లేవని, వాటిని తొలగించడం, లేదా వాటికి ముసుగువేయడం, ఆ తరువాత ఇటా తమ standards కు తగని విషయాలను గూర్చి మాట్లాడినందుకు వారి మాటలను మిత్రులందరికీ చేరనివ్వకుండా అణచివేయడం, లేదా బ్లాక్ చేయడం, లేదా పూర్తిగా అకౌంటునే తొలగించడం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు.

మనం ఇప్పుడు ప్రమాణం అంటున్న మాటను వారు Standards అనే పదంతో వ్యవహరిస్తున్నారన్న మాట. ప్రమాణం లేదా Standards అనేవి ఉభయులకూ - ఆ మాటకు వస్తే - అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి అనుకున్నాం కదా? మరి ఒక వర్గం వారికి అనుకూలంగా ఉంటూ మరొక వర్గం వారికి ప్రతికూలంగా ఉంటే అది ప్రమాణం లేదా ప్రామాణికం ఎలా అవుతుంది?

మన పూర్వులు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలంటే అది ప్రామాణికమైనదై ఉండాలన్నారు. వివిధశాస్త్రాలు వివిధప్రమాణాలను అంగీకరించాయి. అందులో ప్రధానమైనవి.

1 ప్రత్యక్ష ప్రమాణం
2 అనుమాన ప్రమాణం
3 శబ్ద ప్రమాణం
ఇంకా
4 ఉపమానప్రమాణం
5 అర్థాపత్తి ప్రమాణం
6 అనుపలబ్ధి ప్రమాణం

అయితే ఇవన్నీ కూడా లౌకికమైన ప్రమాణాలే.

అందువల్ల కొన్ని అలౌకికమైన విషయాలు ఈ ప్రమాణాలకు అందకపోవచ్చును. వేదంలో అలౌకికమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. మనకు అర్థం కానంతమాత్రాన వాటిని అసత్యాలు అనుకోరాదు. అవి వేదవాక్కులు. తరువాత ఆ విషయాలను కూడా శబ్దప్రమాణం (లేదా ఆగమప్రమాణం) లోనికి చేర్చారు.

అటు పిమ్మట శబ్దప్రమాణాన్ని రెండు భాగాలుగా విభజించారు.
1 లౌకికం 2 వైదికం అని.

ఆప్తులు (అంటే లోకహితైషులు) పలికే మాటలను లౌకికశబ్దప్రమాణాలుగా, వేదంలో ఉన్న మాటలను వైదికశబ్దప్రమాణాలుగా అంగీకరించారు.

అపారమైన మన వాఙ్మయంలో వేదాలు కాకుండా మిగిలినవన్నీ లౌకికశబ్దప్రమాణాలు. అంటే ఆప్తవాక్యాలు అన్నమాట.

ప్రతి గ్రంథానికీ అనుబంధచతుష్టయం ఉంటుంది.

1 విషయం -
అంటే గ్రంథంలో ప్రతిపాదింపబడిన విషయం

2 అధికారి -
అంటే ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసేందుకు అర్హత కలిగిన వ్యక్తి. ఇక్కడ అర్హత అనే పదాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. ఈ రోజుల్లో ఒక సినిమాను చూసేందుకు ఈ వయసు వారు అర్హులు ఈ వయసు వారు అర్హులు కారు అని సర్టిఫికేట్లు ఇస్తారు కదా. అలాగే, బైపీసి చదివి మెడిసిన్ ఎమ్ సెట్ లో ర్యాంకు తెచ్చుకున్నవారు మాత్రమే వైద్యవిద్య చదవడానికి అర్హులు, కేవలం టెన్త్ పాసయినవారు అర్హులు కారు అని నిర్ణయిస్తారు కదా? ఈ సందర్భంలో కూడా అర్హత అంటే అటువంటిదే అని అర్థం చేసుకోవాలి.

3 సంబంధం -
గ్రంథంలో ప్రతిపాదింపబడిన విషయానికి అధికారికి సంబంధం ఏమిటి అనేది.

4 ప్రయోజనం -
ఏ గ్రంథానికైనా ఒక ప్రయోజనం ఉండాలి. లేకుంటే దానిని అధ్యయనం చేయడం వ్యర్థం కదా?

ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో టైపింగు యంత్రాలు లేవు. ఈ రోజు వ్రాస్తే రేపటికల్లా ముందూ వెనుకా చూడకుండా సత్యాసత్యాలను నిర్ధారించుకోకుండా అచ్చు గుద్ది జనాలలో విసిరేసే వెసులుబాట్లు లేవు.

ఆనాటి ప్రతి భారతీయశాస్త్రగ్రంథం ఎంతో గొప్ప పరిశోధన జరిగిన పిమ్మట, ఆయా శాస్త్రపండితులతో విస్తృతమైన చర్చలు జరిపిన పిమ్మట, వారికి అమోదయోగ్యమైన పిమ్మట ఎన్నెన్నో కష్టనష్టాలకు శ్రమలకు ఓర్చి వ్రాయబడినవే.

ఇటువంటి భారతీయశాస్త్రగ్రంథాలు ఎన్నెన్నో! నీతిశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, రాజనీతిశాస్త్రాలు, దర్శనశాస్త్రాలు, ఖగోళశాస్త్రాలు, వైద్యశాస్త్రాలు, వాస్తుశాస్త్రాలు (architecture) సంగీతశాస్త్రాలు, యంత్రనిర్మాణశాస్త్రాలు, భౌతికశాస్త్రాలు, గణితశాస్త్రాలు, రసాయనశాస్త్రాలు, జీవశాస్త్రాలు, వ్యవసాయశాస్త్రాలు, పర్యావరణశాస్త్రాలు - ఇలా లెక్క లేనన్ని రంగాలలో ఎన్నెన్నో అమూల్యమైన గ్రంథాలు వ్రాయబడ్డాయి.

ఇలా - ఇవన్నీ కూడా ప్రామాణికమైనవే, అనుబంధచతుష్టయంతో కూడినవే.

ఇందులో పాశ్చాత్యదండయాత్రలకు గురై నాశనమైన గ్రంథాలకు లెక్క లేదు. దానికి తోడు సుదీర్ఘమైన పాశ్చాత్యపరిపాలన ప్రభావం వలన విదేశీభాషలు నేర్చుకుంటే గాని పొట్టగడవదు అనే స్థితికి భారతీయులు దిగజారారు. అలా అధ్యయన-అధ్యాపనాలు కరువై చేజారిన శాస్త్రగ్రంథాలు ఎన్నో మనం ఎరుగం.

అయినప్పటికీ జనాలు పూర్వం పొట్టకూటికి పగలంతా శ్రమించిన తరువాత చల్లని సాయంత్రం వేళల్లో దేవాలయప్రాంగణంలో కూర్చుని ఆయా శాస్త్రవచనాలను ఏ శాస్త్రిగారో చెబుతూ ఉండగా వినేవారు. (శాస్త్రం చక్కగా నేర్చినవాడు ఇక్కడ శాస్త్రి అని మనం అర్థం చేసుకోవాలి.) దురదృష్టవశాత్తు లౌకికప్రభుత్వాలు అనేవి ఏర్పడి, దేవాలయాలను తమకు ఆదాయం చేకూర్చి పెట్టే వ్యవస్థగాను, శాస్త్రులను కేవలం దేవుడికి అర్చన చేసి, హారతి ఇచ్చి, భక్తులకు శఠగోపం పెట్టి, తీర్థం ఇచ్చే ఒక ఉద్యోగిమాత్రుడుగా మాత్రమే వాడుకొనడం మొదలు పెట్టారు. అలా దేవాలయదురాక్రమణలు చేసిన లౌకిక ప్రభుత్వాలు క్రమంగా జనాలకు శాస్త్రాలను దూరం చేశారు. శాస్త్రాలను జనాలు వినటం లేదని అనేకశాస్త్రులు కూడా పొట్టకూటి విద్యలకు పరిమితమయ్యారు. క్రమంగా దేవాలయాలకు కూడా దూరమౌతున్నారు.

ఏదేమైనప్పటికీ, మన పూర్వుల శాస్త్రగ్రంథాలమీద మనలో చాలమందికి ఇప్పటికీ చెప్పలేనంత గౌరవం ఉంది. కాని వాటిని ఎలా నేర్చుకోవాలో తెలియక అయోమయంలో ఉంటారు.

నిజం చెప్పాలంటే భారతీయసంస్కృతిశత్రువులు లెక్కకు మిక్కిలిగా తయారు కావడానికి మన అజ్ఞానమే కారణం. మనం నేరుగా చదవలేదు కాబట్టి, భారతీయశాస్త్రాలమీద బురదజల్లే వారి మాటలను మనం నిజమే కాబోలునని నమ్ముతాం. మన శాస్త్రాలను సక్రమంగా చదివి అర్థం చేసుకుంటే వారి బురదజల్లుడుకు మనమే సరైన సమాధానం ఇవ్వగలం. కాని, అలా సమాధానం ఇచ్చేవారు తక్కువయ్యారు కాబట్టే బురదజల్లుడు మరింతగా మరింతగా ఎక్కువౌతోంది.

ఈ నెల (జూన్) 21వ తేదీన యోగదినం.

యోగం ఎంత గొప్ప విషయమో ప్రపంచమంతా అర్థం చేసుకుని ప్రశంసిస్తూ, దానిని నేర్చుకునేందుకు శ్రమిస్తూ ఉంటే మనలోనే కొందరు మాత్రం దానిని వెక్కిరించడం, వేళాకోళం చేయడం చేస్తుంటారు. దానికి కారణం వారి అజ్ఞానం మాత్రమే. మనం దానిని గూర్చి మొదట కొంత తెలుసుకుంటే క్రమంగా మరింత మరింతగా తెలుసుకునేేందుకు దారి దొరుకుతుంది. ఆ వెక్కిరించే వారి మాటలకు సమాధానం చెప్పగలం. ప్రయత్నం లేకుండా నిరాశతో కూర్చుంటే మాత్రం ఏ మార్గమూ లభించదు.

ప్రతిఘటన లేకపోతే లొంగిపోయినట్లే. ఓడిపోయినట్లే.

అందువల్ల ఈ నెల 20వ తేదీన, మధ్యాహ్నం గూగుల్ మీట్ ప్లాట్ ఫాం మీద యోగాన్ని గూర్చి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో నేరుగా పంచుకుందామనుకుంటున్నాను.

((పాతంజలయోగం - సంక్షిప్తపరిచయం - సమావేశం దాదాపు గంటన్నర ఉండవచ్చును.))

లింక్ త్వరలో అందజేస్తాను. ఆసక్తి ఉన్న మిత్రులం ఆ రోజు, అక్కడ కలుసుకుందాం. మిత్రుల ప్రతిస్పందనను బట్టి ఇతరసందర్భాలలో అప్పుడప్పుడు అనుకూలతను బట్టి నాకు తెలిసిన ఇతరవిషయాలను కూడా పంచుకుంటాను.

ధన్యవాదాలు

డా. శ్రీనివాసకృష్ణ 

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...