Friday, 17 March 2023

కర్మసిద్ధాంతం - దండసిద్ధాంతం




హిందువుల కర్మసిద్ధాంతం ప్రకారం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు వచ్చే జన్మలో మాత్రమే ఫలితం చూపిస్తాయని భావించటం పొరపాటు.

ఆయా కర్మలు అదే జీవితంలో కూడా తగుమాత్రపు ఫలితాలను ప్రసాదిస్తాయని హైందవనీతిశాస్త్రాలు చాల స్పష్టంగా చెబుతాయి.
"అత్యుత్కటైః పాపపుణ్యైః ఇహైవ ఫలమశ్నుతే" - పాపాలు గాని పుణ్యాలు గాని మరీ ఎక్కువ చేస్తే ఈలోకంలోనే ఫలితం అనుభవిస్తారు.
అందుకే రావణాసురుడు తాను చేసిన మహోగ్రతపస్సుకు ఫలితంగా అదే జన్మలో లంకారాజ్యాన్ని మహావైభవంగా ఏలగలిగాడు. తాను చేసిన పాపఫలితంగా అదే జన్మలో రాముని చేతిలో మట్టికరిచాడు.
అందుకే దుర్యోధనుడు తాను చేసిన పాపాల ఫలితంగా అదే జన్మలో భీముని చేత ఊరుభంగం జరిపించుకున్నాడు.
పాపపుణ్యాలు ఎక్కువగా చేసినపుడు మాత్రమే అదే జన్మలో ఫలితమా? చిన్న చిన్న పనులకు అదే జన్మలో ఫలితం ఉండదా అని సందేహం అక్కరలేదు. చిన్న చిన్న కర్మలకు అదే జన్మలో సద్యఃఫలితం రావడం మనం చూస్తూనే ఉంటాం.
1 ఎక్కువగా తిన్నాం - అంటే ఇతరుల వాటాను కొట్టేశాం అనుకోండి - ఈ జన్మలోనే కడుపునొప్పి, అజీర్తి మొదలైన ఫలితాలు వస్తాయి.
2 ఎవరినైనా ఆశ్రయించి ఒక విద్యనో ఒక పనినో నేర్చుకున్నామనుకోండి - ఈ జన్మలోనే ఒక బ్రతుకు తెరువు ఏర్పడడమనే ఫలితం లభిస్తుంది.
ఇలా.
ధర్మశాస్త్రాలు రాజుకు దండించే/సన్మానించే అధికారాన్ని ఇచ్చాయి. అంటే ఆయా జనాలు చేసే పాపపుణ్యాలకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్నిచ్చే అధికారమన్న మాట.
రాజు చేత తగిన దండన పొందితే మనుషులు పాపవిముక్తులౌతారని, ఆ తరువాత వారికి స్వర్గమే తప్ప నరకభయం ఉండదని, (మరుసటి జన్మలో ఇపుడు చేసిన పాపకర్మల ఫలితం ఉండదని) రాముడే స్పష్టంగా చెప్పాడు.
రాజభిర్ధృతదణ్డాస్తు
కృత్వా పాపాని మానవాఃl
నిర్మలాః స్వర్గమాయాన్తి
సన్తః సుకృతినో యథాll
(రా.4.18.33)
ఒక పనికి ఫలితాన్ని ఒకటి కంటె ఎక్కువ జన్మలలో - అంటే వాయిదాల పద్ధతిలో అనుభవించడం కూడా ఉంది. అందుకు సుప్రసిద్ధమైన కథ - సనకసనందనాది ఋషులచేత శపించబడ్డ జయవిజయుల వృత్తాంతం ఉదాహరణగా ఉంది.
ఒకొక్కసారి ఒక దుర్మార్గుడు చేసిన భయంకరమైన పాపాలను విని చలించిపోయిన న్యాయమూర్తులు వీడికి ఇరవై ఆజన్మకారాగారశిక్షలు వేస్తున్నానని, వీడిని నూరుసార్లు ఉరితీయాలని భావోద్వేగంతో తీర్పులిచ్చారనే వార్తలను విన్నాం కదా?
అందువల్ల, ఏ జన్మలో చేసిన కర్మలకు తగిన ఫలితాలు ఆ జన్మలో మాత్రమే లభిస్తాయి అనే కాన్సెప్టు బుద్ధుడు కనిపెట్టిందని, ఆ క్రెడిట్ వారికే దక్కాలని, ఆ రకంగా బౌద్ధసిద్ధాంతం సనాతనధర్మసిద్ధాంతం కంటె భిన్నమైనదని అంటున్నవారు తగినంత శ్రద్ధగా భారతీయగ్రంథాలను పరిశీలించలేదని అనుమితం.
ఇతి శమ్.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...