Tuesday 21 March 2023

శోభకృత్




కృత్ అంటే కలిగించేది, సంపాదించేది, పుట్టించేది, ఫలించేది అని నానార్థాలు ఉన్నాయి. ఇక శోభ అంటే తేజస్సు, వెలుగు, సంపద, సౌభాగ్యం, కీర్తి అని నానార్థాలు ఉన్నాయి. శుభం అనే అర్థం కూడా ఉన్నది. చైతన్యప్రదాయకమైన ప్రాణం కూడా శోభ. బుద్ధిప్రదాయకమైన విద్య కూడా శోభ.

మరి శోభకృత్ అంటే - తేజస్సును కలిగించేది, వెలుగును ప్రసాదించేది, సంపదలను, వైభవాన్ని కలిగించేది అని.
తేజస్సు ప్రధానంగా మూడు రకాలు. పార్వతీదేవి వలన కలిగే తేజస్సు, సరస్వతీదేవి అనుగ్రహం వలన కలిగే తేజస్సు, లక్ష్మీదేవి అనుగ్రహం వలన కలిగే తేజస్సు, అవి క్రమంగా శక్తి-విద్యా-వైభవాలు. వాటిని పుష్కలంగా మనకు సంపాదించి పెడుతుంది కాబట్టి ఈ సంవత్సరం శోభకృత్ అయింది. ఈ మూడూ ఒక వ్యక్తికైనా ఒక దేశానికైనా కీర్తిని కలిగించేవే కాబట్టి మరలా అవి ఒకొక్కటిగా శోభకృత్తులే.
సాధారణంగా ఒకొక్క పదార్థానికి ఒకొక్కటి శోభను కలిగిస్తూ ఉంటాయి.
నాగో భాతి మదేన ఖం జలధరైః పూర్ణేన్దునా శర్వరీ
శీలేన ప్రమదా జవేన తురగో నిత్యోత్సవైర్మన్దిరమ్।
వాణీ వ్యాకరణేన హంసమిథునైర్నద్యః సభా పణ్ణితైః
సత్పుత్రేణ కులం నృపేణ వసుధా లోకత్రయం భానునా।।
ఏనుగుకు గండస్థలంనుంచి స్రవించే మదజలమే శోభ అట. (అలాగే, సింహానికి గర్జన శోభ అని, ఎత్తైన భుజం కలిగిన ఎద్దుకు రంకె శోభ అని, క్షీరదమైన ఆవుకు తన దూడ శోభ అని , కోకిలకు తన పాట శోభ అని, నెమలికి పురి విప్పి ఆడటం శోభ అని, చెట్టుకు కొమ్మలు నేలకు అంటేలా కాసే పండ్లు శోభ అని – ఇలా... అర్థం చేసుకోవచ్చు.)
ఆకాశానికి జలాన్ని వర్షించే నల్లని మేఘాలు శోభ అట. (అంచే మంచి వర్షాలు పడి భూమి సస్యసంపదతో అలరారుతూ ఉంటుంది అని అర్థం.)
రాత్రికి నిండుచంద్రుడే శోభ అట.
స్త్రీకి శీలమే శోభ అట. (మంచి విద్య, దానివలన చేకూరే మిత్రామిత్రవివేకము, తమ తమ కుటుంబపు విలువలకు కట్టుబడి ఉండటము, నేను తరతరాలకు ఆదర్శంగా నిలవాలనే ఆకాంక్ష, మంచి వ్యవహారము, చక్కని వస్త్రాభరణాలను ధరించడం మొదలైన వాటివలన స్త్రీకి శోభ కలుగుతుంది. ఇన్ని శోభలను ప్రసాదించే మంచి విద్యకు కూడా శీలమే శోభ అట. శీలేన శోభతే విద్యా)
గుఱ్ఱానికి వేగమే శోభ అట. (మనిషి బుద్ధికి కూడా వేగమే శోభ.)
నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉత్సవాలు జరగడమే దేవాలయానికి శోభ అట. (దేవాలయం చక్కగా ఉందంటే ఆయా గ్రామాలు, జనపదాలు, దేశాలలోని ప్రజలందరి యిండ్లూ కూడా శోభాయమానంగా ఉంటాయని అంతరార్థం. తగినంత భాగ్యం కలిగి ఆనందం కలిగిన ప్రజలే దేవాలయాలలోని ఉత్సవాలకు అవసరమైన సమస్తమైన సంబారాలన్నీ సంతోషంతో తెచ్చి ఇవ్వగలరు కదా.)
అలాగే మనిషి మాట వ్యాకరణబద్ధంగా ఉండటమే శోభ అట. (మాటకు కట్టుబడి ఉండటం కూడా)
నదులకు హంసలు జంటలు జంటలుగా విహరిస్తూ ఉండటమే శోభ అట. (మంచి వర్షాలతో నదులు నిండితేనే కదా, ఆ నీటిలో హంసలు విహరించేది!)
పండితులు ఉండటమే సభకు శోభ అట. (పండితులు అంటే శాస్త్రజ్ఞానులు, యుక్తాయుక్తవివేకం కలిగినవారు, దూరదర్శులు, దీర్ఘదర్శులు, సమానానాముత్తమశ్లోకులైనవారు, నాస్తికులు కానివారున్నూ. ఈ సంవత్సరం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా సభలు అటువంటి పండితులతో నిండిపోవాలని ఆశిద్దాం.)
వంశానికి చక్కని నడవడిక కలిగిన పుత్రుడు ఉండటం శోభ అట. (సూర్యవంశానికి దశరథపుత్రుల లాగా, చంద్రవంశానికి పాండునందనుల లాగా) (విద్య, పాండిత్యము, వినయము, కౌశలము, సేవాతత్పరత, కార్యనిర్భీతి, దుర్జనసాంగత్యవిదూరత, సజ్జనమైత్రి, మొదలైనవన్నీ చక్కని నడవడిక కలిగినవానికే సాధ్యం.)
భూమికి మంచి రాజు ఉండటమే శోభ అట. (విగ్రహవాన్ ధర్మః అంటూ శత్రువైన మారీచుని చేతనే పొగడబడిన శ్రీరాముడు, కేవలం పేరులో మాత్రమే కాక, తన జీవితమంతా ధర్మపాలనకే అర్పించిన ధర్మరాజు వంటివారు మంచిరాజులు.) (అంతేగాని, ఆయా దేశంలో ఉండే సనాతన సంప్రదాయాలను నశింపజేసేవాడు, సమాజానికి ఎంతో అవసరమైన ప్రజల రకరకాల వృత్తులను నిర్వీర్యపరచేవాడు, ప్రజలను తమ మాతృభాషకు దూరం చేసేవాడు, వైదేశికమైన సంస్కృతులను ప్రోత్సహించేవాడు, ప్రజల పనితనాన్ని నిరుత్సాహపరచి తన స్వార్థం కోసం సోమరిపోతుల సైన్యాన్ని సృష్టించేవాడు, తన పనులను ఎందరు గర్హించినా మూర్ఖంగా మానుకోనివాడు మంచి రాజు ఎంతమాత్రం కాలేడు. ఇటువంటి వాడు చెట్టుకు పట్టిన చీడలాంటివాడు, పీడలాంటి వాడు. ఆ చెట్టు వేరుకు పట్టిన పురుగులాంటి వాడు. ఇటువంటి వాడు భూమికి భారం కాగలడే తప్ప శోభ ఎంతమాత్రం కాలేడు.)
ముల్లోకాలకూ సూర్యుడే శోభ అట. (సూర్యుడు అంటే ఆరోగ్యప్రదాత కాబట్టి, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులైన ప్రజలు ఉండటమే దేశానికి శోభ అన్నమాట.)
ఇలా ఇవన్నీ సంపదలే. ఇవన్నీ కూడా వైభవాలే. ఈ సంవత్సరం వీటన్నిటితోను నిండి ఉంటుంది కాబట్టి శోభకృత్ అవుతుంది.
ఈసంవత్సరం సార్థకనామధేయం కావాలని, మన దేశప్రజలందరూ ఈ శోభలన్నిటితోపాటు ఇంకా పేర్కొనబడని ఎన్నెన్నో శుభంకరాలైన అనేక శోభలను ఈ సంవత్సరం మొదలుకొని శాశ్వతంగా చూస్తూనే ఉండాలని, వాటి ఫలితాలను సంతోషంగా అనుభవించాలని కోరుకుందాం, సర్వేశ్వరుని ప్రార్థిద్దాం.
శుభమస్తు. సర్వం శోభావహమస్తు.
చైత్రశుక్లప్రతిపత్, యుగాదిః, శోభకృత్

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...