కృత్ అంటే కలిగించేది, సంపాదించేది, పుట్టించేది, ఫలించేది అని నానార్థాలు ఉన్నాయి. ఇక శోభ అంటే తేజస్సు, వెలుగు, సంపద, సౌభాగ్యం, కీర్తి అని నానార్థాలు ఉన్నాయి. శుభం అనే అర్థం కూడా ఉన్నది. చైతన్యప్రదాయకమైన ప్రాణం కూడా శోభ. బుద్ధిప్రదాయకమైన విద్య కూడా శోభ.
Just Visit this blog if you feel bored with the world around you. Just leave away this blog if you feel bored with this. Feel free to come and go. A Vana Vihanga (A Wild Bird) does not mind to go anywhere in the forest. Cheer Up!
Tuesday, 21 March 2023
శోభకృత్
మరి శోభకృత్ అంటే - తేజస్సును కలిగించేది, వెలుగును ప్రసాదించేది, సంపదలను, వైభవాన్ని కలిగించేది అని.
తేజస్సు ప్రధానంగా మూడు రకాలు. పార్వతీదేవి వలన కలిగే తేజస్సు, సరస్వతీదేవి అనుగ్రహం వలన కలిగే తేజస్సు, లక్ష్మీదేవి అనుగ్రహం వలన కలిగే తేజస్సు, అవి క్రమంగా శక్తి-విద్యా-వైభవాలు. వాటిని పుష్కలంగా మనకు సంపాదించి పెడుతుంది కాబట్టి ఈ సంవత్సరం శోభకృత్ అయింది. ఈ మూడూ ఒక వ్యక్తికైనా ఒక దేశానికైనా కీర్తిని కలిగించేవే కాబట్టి మరలా అవి ఒకొక్కటిగా శోభకృత్తులే.
సాధారణంగా ఒకొక్క పదార్థానికి ఒకొక్కటి శోభను కలిగిస్తూ ఉంటాయి.
నాగో భాతి మదేన ఖం జలధరైః పూర్ణేన్దునా శర్వరీ
శీలేన ప్రమదా జవేన తురగో నిత్యోత్సవైర్మన్దిరమ్।
వాణీ వ్యాకరణేన హంసమిథునైర్నద్యః సభా పణ్ణితైః
సత్పుత్రేణ కులం నృపేణ వసుధా లోకత్రయం భానునా।।
ఏనుగుకు గండస్థలంనుంచి స్రవించే మదజలమే శోభ అట. (అలాగే, సింహానికి గర్జన శోభ అని, ఎత్తైన భుజం కలిగిన ఎద్దుకు రంకె శోభ అని, క్షీరదమైన ఆవుకు తన దూడ శోభ అని , కోకిలకు తన పాట శోభ అని, నెమలికి పురి విప్పి ఆడటం శోభ అని, చెట్టుకు కొమ్మలు నేలకు అంటేలా కాసే పండ్లు శోభ అని – ఇలా... అర్థం చేసుకోవచ్చు.)
ఆకాశానికి జలాన్ని వర్షించే నల్లని మేఘాలు శోభ అట. (అంచే మంచి వర్షాలు పడి భూమి సస్యసంపదతో అలరారుతూ ఉంటుంది అని అర్థం.)
రాత్రికి నిండుచంద్రుడే శోభ అట.
స్త్రీకి శీలమే శోభ అట. (మంచి విద్య, దానివలన చేకూరే మిత్రామిత్రవివేకము, తమ తమ కుటుంబపు విలువలకు కట్టుబడి ఉండటము, నేను తరతరాలకు ఆదర్శంగా నిలవాలనే ఆకాంక్ష, మంచి వ్యవహారము, చక్కని వస్త్రాభరణాలను ధరించడం మొదలైన వాటివలన స్త్రీకి శోభ కలుగుతుంది. ఇన్ని శోభలను ప్రసాదించే మంచి విద్యకు కూడా శీలమే శోభ అట. శీలేన శోభతే విద్యా)
గుఱ్ఱానికి వేగమే శోభ అట. (మనిషి బుద్ధికి కూడా వేగమే శోభ.)
నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉత్సవాలు జరగడమే దేవాలయానికి శోభ అట. (దేవాలయం చక్కగా ఉందంటే ఆయా గ్రామాలు, జనపదాలు, దేశాలలోని ప్రజలందరి యిండ్లూ కూడా శోభాయమానంగా ఉంటాయని అంతరార్థం. తగినంత భాగ్యం కలిగి ఆనందం కలిగిన ప్రజలే దేవాలయాలలోని ఉత్సవాలకు అవసరమైన సమస్తమైన సంబారాలన్నీ సంతోషంతో తెచ్చి ఇవ్వగలరు కదా.)
అలాగే మనిషి మాట వ్యాకరణబద్ధంగా ఉండటమే శోభ అట. (మాటకు కట్టుబడి ఉండటం కూడా)
నదులకు హంసలు జంటలు జంటలుగా విహరిస్తూ ఉండటమే శోభ అట. (మంచి వర్షాలతో నదులు నిండితేనే కదా, ఆ నీటిలో హంసలు విహరించేది!)
పండితులు ఉండటమే సభకు శోభ అట. (పండితులు అంటే శాస్త్రజ్ఞానులు, యుక్తాయుక్తవివేకం కలిగినవారు, దూరదర్శులు, దీర్ఘదర్శులు, సమానానాముత్తమశ్లోకులైనవారు, నాస్తికులు కానివారున్నూ. ఈ సంవత్సరం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా సభలు అటువంటి పండితులతో నిండిపోవాలని ఆశిద్దాం.)
వంశానికి చక్కని నడవడిక కలిగిన పుత్రుడు ఉండటం శోభ అట. (సూర్యవంశానికి దశరథపుత్రుల లాగా, చంద్రవంశానికి పాండునందనుల లాగా) (విద్య, పాండిత్యము, వినయము, కౌశలము, సేవాతత్పరత, కార్యనిర్భీతి, దుర్జనసాంగత్యవిదూరత, సజ్జనమైత్రి, మొదలైనవన్నీ చక్కని నడవడిక కలిగినవానికే సాధ్యం.)
భూమికి మంచి రాజు ఉండటమే శోభ అట. (విగ్రహవాన్ ధర్మః అంటూ శత్రువైన మారీచుని చేతనే పొగడబడిన శ్రీరాముడు, కేవలం పేరులో మాత్రమే కాక, తన జీవితమంతా ధర్మపాలనకే అర్పించిన ధర్మరాజు వంటివారు మంచిరాజులు.) (అంతేగాని, ఆయా దేశంలో ఉండే సనాతన సంప్రదాయాలను నశింపజేసేవాడు, సమాజానికి ఎంతో అవసరమైన ప్రజల రకరకాల వృత్తులను నిర్వీర్యపరచేవాడు, ప్రజలను తమ మాతృభాషకు దూరం చేసేవాడు, వైదేశికమైన సంస్కృతులను ప్రోత్సహించేవాడు, ప్రజల పనితనాన్ని నిరుత్సాహపరచి తన స్వార్థం కోసం సోమరిపోతుల సైన్యాన్ని సృష్టించేవాడు, తన పనులను ఎందరు గర్హించినా మూర్ఖంగా మానుకోనివాడు మంచి రాజు ఎంతమాత్రం కాలేడు. ఇటువంటి వాడు చెట్టుకు పట్టిన చీడలాంటివాడు, పీడలాంటి వాడు. ఆ చెట్టు వేరుకు పట్టిన పురుగులాంటి వాడు. ఇటువంటి వాడు భూమికి భారం కాగలడే తప్ప శోభ ఎంతమాత్రం కాలేడు.)
ముల్లోకాలకూ సూర్యుడే శోభ అట. (సూర్యుడు అంటే ఆరోగ్యప్రదాత కాబట్టి, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులైన ప్రజలు ఉండటమే దేశానికి శోభ అన్నమాట.)
ఇలా ఇవన్నీ సంపదలే. ఇవన్నీ కూడా వైభవాలే. ఈ సంవత్సరం వీటన్నిటితోను నిండి ఉంటుంది కాబట్టి శోభకృత్ అవుతుంది.
ఈసంవత్సరం సార్థకనామధేయం కావాలని, మన దేశప్రజలందరూ ఈ శోభలన్నిటితోపాటు ఇంకా పేర్కొనబడని ఎన్నెన్నో శుభంకరాలైన అనేక శోభలను ఈ సంవత్సరం మొదలుకొని శాశ్వతంగా చూస్తూనే ఉండాలని, వాటి ఫలితాలను సంతోషంగా అనుభవించాలని కోరుకుందాం, సర్వేశ్వరుని ప్రార్థిద్దాం.
శుభమస్తు. సర్వం శోభావహమస్తు.
చైత్రశుక్లప్రతిపత్, యుగాదిః, శోభకృత్
Friday, 17 March 2023
సినిమా హాల్లో మనకు నచ్చిన నంబరు సీటును మనం బుక్ చేసుకోవచ్చును. కాని, IRCTC లో మనం టికెట్లు బుక్ చేసుకునేటపుడు అది మహా అయితే అప్పర్ బెర్త్ కావాలా, మిడిల్ బెర్త్ కావాలా లేక లోయర్ బెర్త్ కావాలా అని మాత్రమే అడుగుతుంది కాని, ఒక బోగీలో 72 బెర్త్ లు ఉంటాయి కదా, అందులో మీ లక్కీ నంబరు బెర్తు కావాలా అని మాత్రం అడుగదు. ఎందుకు?
దీని వెనుక భౌతికశాస్త్రపు ప్రాథమిక సాంకేతికాంశాలు ఉన్నాయి కాబట్టి.
సినిమాహాలులో సీటు బుకింగు వేరు, రైలుబండిలో సీటు బుకింగు వేరు. సినిమా హాలు నిశ్చలంగా ఉండే ఒక విశాలమైన గది మాత్రమే. కాని, రైలుబండి ఒక పరుగెత్తే గదుల సమూహం.
ఆ పరుగు ప్రయాణీకులకు ప్రమాదకరంగా ఉండరాదు, వారి ప్రయాణం క్షేమంగా జరగాలన్నది చాల ముఖ్యమైన విషయం.
అందువల్ల రైలుబండిలో ప్రయాణమయ్యే బరువు బండి అంతటా సమానంగా పంపకమయ్యే విధంగా భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ విధానపు సాఫ్ట్ వేర్ ను రూపుదిద్దారు.
ఉదాహరణకు – ఒక రైలుబండిలో S1 నుండి S10 వరకు స్లీపర్ క్లాసు బోగీలు ఉన్నాయనుకుందాం. ఒకొక్క బోగీలో 72 సీట్లు ఉంటాయి. అందువల్ల, మొట్టమొదట టికెట్ బుక్ చేసుకునేవారికి నడుమనున్న బోగీలో (S5 లేదా S6లో) టికెట్ కేటాయింపబడుతుంది. పైగా అందులో కూడా, 30 – 40 నంబరు సీటు కేటాయింపబడుతుంది. అందులోనూ, లోయర్ బెర్త్ కేటాయింపబడుతుంది. (ఎటువంటి బెర్త్ కావాలో మన ఎంపిక లేకపోతే) రైలుబండిలో గ్రావిటీ సెంటర్లు (గరిమనాభి కేంద్రాలు) సాధ్యమైనంత తక్కువగా ఉండేందుకు గాను, అప్పర్ బెర్త్ ల కంటే ముందుగా లోయర్ బెర్త్ లను కేటాయించడం జరుగుతుంది.
ఇలా మొదటగా మధ్యలో ఉండే బోగీలలో మధ్య సీట్లు, అలాగే క్రమంగా చివరి సీట్లు, (మొదట లోయర్ బెర్త్, ఆ తరువాతనే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్) కేటాయింపబడతాయి. ఆ తరువాత మధ్య బోగీలకు పక్కన ఉండే బోగీలలో (S4, S7) మరలా అదే విధంగా సీట్ల కేటాయింపు జరుగుతూ పోతుంది.
ఇలా బరువు అన్ని రైలు బోగీలలోనూ సమానంగా ఉండే విధంగా టికెట్ల కేటాయింపు జరుగుతుంది.
మనం చివరి నిమిషాలలో టికెట్ కోసం ప్రయత్నించినపుడు మనకు అప్పర్ బెర్త్ లు, 1-6 లేదా 66-72 నంబరు సీట్లు, కేటాయింపబడటానికి కారణం ఇదే. మనం వెయిటింగ్ లిస్టులో ఉన్నపుడు ఎప్పుడైనా ఎవరైనా తమ సీటు క్యాన్సిల్ చేసుకుంటే మనకు మధ్యలో కూడా సీటు దొరకవచ్చు.
ఈ విధానంలో కాకుండా IRCTC తనకు నచ్చిన బోగీలో నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటూ పోతే ఏం జరుగుతుంది?
S1 S2 S3 బోగీలు ప్రయాణికులతో నిండుగా కిటకిటలాడుతున్నాయి, S5 S6 బోగీలు ఖాళీగా ఉన్నాయి, మిగిలిన బోగీలలో ప్రయాణికులు అరకొరగా ఉన్నాయనుకుందాం. ఎక్స్ ప్రెస్ రైలుబండ్లు ఒకొక్కసారి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో పరుగెడుతుంటాయి. అంతటి వేగం వలన చాల బలమైన గమనశక్తి పుడుతూ ఉంటుంది. అంతటి వేగంలో రైలుబండి మలుపు తిరగవలసి వచ్చిందనుకోండి. ఆ సమయంలో అసమభారం కలిగిన (అనీవెన్లీ లోడెడ్) బోగీలన్నిటిమీద కేంద్రపరాఙ్ముఖబలం (సెంట్రి-ఫ్యూగల్ ఫోర్స్) సమానంగా ఉండటం సాధ్యం కాదు. అందువల్ల అంతటి వేగంలో బరువు కలిగిన బోగీలు ఒకవైపు ఈడ్వబడితే బరువు లేని బోగీలు మరొకవైపు బలంగా విసిరివేయబడతాయి. అప్పుడు రైలుబండి పట్టాలు తప్పే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
అంతే కాదు, అసమానమైన బరువు కలిగిన బోగీలు రైలుబండిలో ఉన్నపుడు బ్రేకులు వేస్తే అన్ని బోగీలమీదా సమానమైన వత్తిడి పడదు. అప్పుడు కూడా రైలుబండి చలనం మీద డ్రైవరుకు అదుపు తప్పవచ్చు.
మాకు అనుకూలమైన సౌకర్యవంతమైన సీట్లు బెర్తులు కేటాయించలేదని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను నిందించే వారికి అసలు విషయాన్ని కారణాలను వివరించేందుకు ఇది ఒక ప్రయత్నం.
(ఎలైట్ ఫిజిక్స్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ అయిన శ్రీ అఖిలేశ్ మిశ్రా గారి వ్యాసానికి నా స్వేచ్ఛానువాదం.)
కర్మసిద్ధాంతం - దండసిద్ధాంతం
హిందువుల కర్మసిద్ధాంతం ప్రకారం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు వచ్చే జన్మలో మాత్రమే ఫలితం చూపిస్తాయని భావించటం పొరపాటు.
ఆయా కర్మలు అదే జీవితంలో కూడా తగుమాత్రపు ఫలితాలను ప్రసాదిస్తాయని హైందవనీతిశాస్త్రాలు చాల స్పష్టంగా చెబుతాయి.
"అత్యుత్కటైః పాపపుణ్యైః ఇహైవ ఫలమశ్నుతే" - పాపాలు గాని పుణ్యాలు గాని మరీ ఎక్కువ చేస్తే ఈలోకంలోనే ఫలితం అనుభవిస్తారు.
అందుకే రావణాసురుడు తాను చేసిన మహోగ్రతపస్సుకు ఫలితంగా అదే జన్మలో లంకారాజ్యాన్ని మహావైభవంగా ఏలగలిగాడు. తాను చేసిన పాపఫలితంగా అదే జన్మలో రాముని చేతిలో మట్టికరిచాడు.
అందుకే దుర్యోధనుడు తాను చేసిన పాపాల ఫలితంగా అదే జన్మలో భీముని చేత ఊరుభంగం జరిపించుకున్నాడు.
పాపపుణ్యాలు ఎక్కువగా చేసినపుడు మాత్రమే అదే జన్మలో ఫలితమా? చిన్న చిన్న పనులకు అదే జన్మలో ఫలితం ఉండదా అని సందేహం అక్కరలేదు. చిన్న చిన్న కర్మలకు అదే జన్మలో సద్యఃఫలితం రావడం మనం చూస్తూనే ఉంటాం.
1 ఎక్కువగా తిన్నాం - అంటే ఇతరుల వాటాను కొట్టేశాం అనుకోండి - ఈ జన్మలోనే కడుపునొప్పి, అజీర్తి మొదలైన ఫలితాలు వస్తాయి.
2 ఎవరినైనా ఆశ్రయించి ఒక విద్యనో ఒక పనినో నేర్చుకున్నామనుకోండి - ఈ జన్మలోనే ఒక బ్రతుకు తెరువు ఏర్పడడమనే ఫలితం లభిస్తుంది.
ఇలా.
ధర్మశాస్త్రాలు రాజుకు దండించే/సన్మానించే అధికారాన్ని ఇచ్చాయి. అంటే ఆయా జనాలు చేసే పాపపుణ్యాలకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్నిచ్చే అధికారమన్న మాట.
రాజు చేత తగిన దండన పొందితే మనుషులు పాపవిముక్తులౌతారని, ఆ తరువాత వారికి స్వర్గమే తప్ప నరకభయం ఉండదని, (మరుసటి జన్మలో ఇపుడు చేసిన పాపకర్మల ఫలితం ఉండదని) రాముడే స్పష్టంగా చెప్పాడు.
రాజభిర్ధృతదణ్డాస్తు
కృత్వా పాపాని మానవాఃl
నిర్మలాః స్వర్గమాయాన్తి
సన్తః సుకృతినో యథాll
(రా.4.18.33)
ఒక పనికి ఫలితాన్ని ఒకటి కంటె ఎక్కువ జన్మలలో - అంటే వాయిదాల పద్ధతిలో అనుభవించడం కూడా ఉంది. అందుకు సుప్రసిద్ధమైన కథ - సనకసనందనాది ఋషులచేత శపించబడ్డ జయవిజయుల వృత్తాంతం ఉదాహరణగా ఉంది.
ఒకొక్కసారి ఒక దుర్మార్గుడు చేసిన భయంకరమైన పాపాలను విని చలించిపోయిన న్యాయమూర్తులు వీడికి ఇరవై ఆజన్మకారాగారశిక్షలు వేస్తున్నానని, వీడిని నూరుసార్లు ఉరితీయాలని భావోద్వేగంతో తీర్పులిచ్చారనే వార్తలను విన్నాం కదా?
అందువల్ల, ఏ జన్మలో చేసిన కర్మలకు తగిన ఫలితాలు ఆ జన్మలో మాత్రమే లభిస్తాయి అనే కాన్సెప్టు బుద్ధుడు కనిపెట్టిందని, ఆ క్రెడిట్ వారికే దక్కాలని, ఆ రకంగా బౌద్ధసిద్ధాంతం సనాతనధర్మసిద్ధాంతం కంటె భిన్నమైనదని అంటున్నవారు తగినంత శ్రద్ధగా భారతీయగ్రంథాలను పరిశీలించలేదని అనుమితం.
ఇతి శమ్.
ప్రామాణికం అనే మాటను మనం చాలసార్లు వినివుంటాం. ఆ మాటను మనం ఉపయోగించి కూడా ఉంటాం. ప్రమాణంతో కూడినవి ప్రామాణికం అన్నమాట.
ప్రమాణం అంటే?
ప్రకృష్టం మానం ప్రమాణం అని వ్యవహారం.
అంటే ఖచ్చితమైన తూనిక లేదా ఖచ్చితమైన కొలత.
దుకాణం యజమాని మనకు ఒక గుప్పెడు బియ్యం ఇచ్చి, ఇవి ఒక కిలోగ్రాము అంటే మనం ఒప్పుకుంటామా? కాదు, కిలోగ్రాము రాయి పెట్టి తూచవలసిందే అంటాము. అమ్మకందారుకు ఒప్పుకోక తప్పదు. లేదంటే మనం తూనికలు కొలతలు శాఖవారికి మొర పెట్టుకుంటాం కదా? అంటే అసలైన తూనిక ఇదే అని తేల్చగలిగిన అధికారం కలిగిన పెద్దలు కొందరుంటారన్నమాటే కదా?
అలాగే, మనం ఒక ఐదారు పెద్ద మామిడి పండ్లు ఏరుకుని, ఇవి అర్ధ కేజీ అంటే అమ్మకందారు ఒప్పుకుంటాడా? లేదు. తూకం వేసి ఇస్తాను తీసుకోండి అంటాడు. కాదని మనం మొండికేస్తే మామిడిపండ్లను మనం కొనలేం. అందువల్ల అతడి తూనికకు మనం ఒప్పుకోవలసిందే. అంతగా కావాలంటే ధర దగ్గర బేరమాడుకోవచ్చు.
ఇలా ఉభయులకూ అంగీకారయోగ్యమైనదానినే ప్రమాణం అంటారు. ఒక కిలోగ్రాము, ఒక లీటరు, ఒక మీటరు... ఇలా...అందరికీ ఆమోదయోగ్యమైన వస్తువు లేదా విషయం ఏదైనా ఉంటే అది ప్రమాణం అన్న మాట. ప్రమాణానికి లోబడింది ప్రామాణికం.
అంటే కిలోగ్రాము రాయి ప్రమాణం. అంతే బరువు కలిగిన బియ్యం లేదా మామిడిపండ్లు ప్రామాణికాలు.
అయితే ఇవి కేవలం భౌతికవస్తువులను కొలతవేసేందుకు తగిన ప్రమాణాలు మాత్రమే. మరి, ఒక విషయంలోని సత్యాసత్యాలను కొలత వేసేందుకు తగిన ప్రమాణాలు ఉన్నాయా?
ఇప్పుడైతే Fact Check లాంటి కొన్ని పక్షపాతపూరితమైన శక్తులు కొన్ని ఆవిర్భవించి, కొన్ని వర్గాలవారికి అనుకూలమైన వాటిలో ఎంతటి అసత్యపూరితమైన, అసంబద్ధమైన విషయాలు ఉన్నా మౌనం వహించడం చూస్తున్నాం. మరికొన్ని వర్గాల విషయంలో - ప్రత్యేకించి భారతజాతీయవాదులు, హిందువుల విషయంలో, వారు తమ పట్ల జరుగుతున్న అన్యాయాలను గూర్చి నోరెత్తినా, ఇలా మమ్మల్ని హింసించారు అని ఫొటోలు విడియోల సాక్ష్యాలతో సహా తెలియజేసినా, తమ Community Standards కు తగినట్టు లేవని, వాటిని తొలగించడం, లేదా వాటికి ముసుగువేయడం, ఆ తరువాత ఇటా తమ standards కు తగని విషయాలను గూర్చి మాట్లాడినందుకు వారి మాటలను మిత్రులందరికీ చేరనివ్వకుండా అణచివేయడం, లేదా బ్లాక్ చేయడం, లేదా పూర్తిగా అకౌంటునే తొలగించడం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు.
మనం ఇప్పుడు ప్రమాణం అంటున్న మాటను వారు Standards అనే పదంతో వ్యవహరిస్తున్నారన్న మాట. ప్రమాణం లేదా Standards అనేవి ఉభయులకూ - ఆ మాటకు వస్తే - అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి అనుకున్నాం కదా? మరి ఒక వర్గం వారికి అనుకూలంగా ఉంటూ మరొక వర్గం వారికి ప్రతికూలంగా ఉంటే అది ప్రమాణం లేదా ప్రామాణికం ఎలా అవుతుంది?
మన పూర్వులు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలంటే అది ప్రామాణికమైనదై ఉండాలన్నారు. వివిధశాస్త్రాలు వివిధప్రమాణాలను అంగీకరించాయి. అందులో ప్రధానమైనవి.
1 ప్రత్యక్ష ప్రమాణం
2 అనుమాన ప్రమాణం
3 శబ్ద ప్రమాణం
ఇంకా
4 ఉపమానప్రమాణం
5 అర్థాపత్తి ప్రమాణం
6 అనుపలబ్ధి ప్రమాణం
అయితే ఇవన్నీ కూడా లౌకికమైన ప్రమాణాలే.
అందువల్ల కొన్ని అలౌకికమైన విషయాలు ఈ ప్రమాణాలకు అందకపోవచ్చును. వేదంలో అలౌకికమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. మనకు అర్థం కానంతమాత్రాన వాటిని అసత్యాలు అనుకోరాదు. అవి వేదవాక్కులు. తరువాత ఆ విషయాలను కూడా శబ్దప్రమాణం (లేదా ఆగమప్రమాణం) లోనికి చేర్చారు.
అటు పిమ్మట శబ్దప్రమాణాన్ని రెండు భాగాలుగా విభజించారు.
1 లౌకికం 2 వైదికం అని.
ఆప్తులు (అంటే లోకహితైషులు) పలికే మాటలను లౌకికశబ్దప్రమాణాలుగా, వేదంలో ఉన్న మాటలను వైదికశబ్దప్రమాణాలుగా అంగీకరించారు.
అపారమైన మన వాఙ్మయంలో వేదాలు కాకుండా మిగిలినవన్నీ లౌకికశబ్దప్రమాణాలు. అంటే ఆప్తవాక్యాలు అన్నమాట.
ప్రతి గ్రంథానికీ అనుబంధచతుష్టయం ఉంటుంది.
1 విషయం -
అంటే గ్రంథంలో ప్రతిపాదింపబడిన విషయం
2 అధికారి -
అంటే ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసేందుకు అర్హత కలిగిన వ్యక్తి. ఇక్కడ అర్హత అనే పదాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. ఈ రోజుల్లో ఒక సినిమాను చూసేందుకు ఈ వయసు వారు అర్హులు ఈ వయసు వారు అర్హులు కారు అని సర్టిఫికేట్లు ఇస్తారు కదా. అలాగే, బైపీసి చదివి మెడిసిన్ ఎమ్ సెట్ లో ర్యాంకు తెచ్చుకున్నవారు మాత్రమే వైద్యవిద్య చదవడానికి అర్హులు, కేవలం టెన్త్ పాసయినవారు అర్హులు కారు అని నిర్ణయిస్తారు కదా? ఈ సందర్భంలో కూడా అర్హత అంటే అటువంటిదే అని అర్థం చేసుకోవాలి.
3 సంబంధం -
గ్రంథంలో ప్రతిపాదింపబడిన విషయానికి అధికారికి సంబంధం ఏమిటి అనేది.
4 ప్రయోజనం -
ఏ గ్రంథానికైనా ఒక ప్రయోజనం ఉండాలి. లేకుంటే దానిని అధ్యయనం చేయడం వ్యర్థం కదా?
ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో టైపింగు యంత్రాలు లేవు. ఈ రోజు వ్రాస్తే రేపటికల్లా ముందూ వెనుకా చూడకుండా సత్యాసత్యాలను నిర్ధారించుకోకుండా అచ్చు గుద్ది జనాలలో విసిరేసే వెసులుబాట్లు లేవు.
ఆనాటి ప్రతి భారతీయశాస్త్రగ్రంథం ఎంతో గొప్ప పరిశోధన జరిగిన పిమ్మట, ఆయా శాస్త్రపండితులతో విస్తృతమైన చర్చలు జరిపిన పిమ్మట, వారికి అమోదయోగ్యమైన పిమ్మట ఎన్నెన్నో కష్టనష్టాలకు శ్రమలకు ఓర్చి వ్రాయబడినవే.
ఇటువంటి భారతీయశాస్త్రగ్రంథాలు ఎన్నెన్నో! నీతిశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, రాజనీతిశాస్త్రాలు, దర్శనశాస్త్రాలు, ఖగోళశాస్త్రాలు, వైద్యశాస్త్రాలు, వాస్తుశాస్త్రాలు (architecture) సంగీతశాస్త్రాలు, యంత్రనిర్మాణశాస్త్రాలు, భౌతికశాస్త్రాలు, గణితశాస్త్రాలు, రసాయనశాస్త్రాలు, జీవశాస్త్రాలు, వ్యవసాయశాస్త్రాలు, పర్యావరణశాస్త్రాలు - ఇలా లెక్క లేనన్ని రంగాలలో ఎన్నెన్నో అమూల్యమైన గ్రంథాలు వ్రాయబడ్డాయి.
ఇలా - ఇవన్నీ కూడా ప్రామాణికమైనవే, అనుబంధచతుష్టయంతో కూడినవే.
ఇందులో పాశ్చాత్యదండయాత్రలకు గురై నాశనమైన గ్రంథాలకు లెక్క లేదు. దానికి తోడు సుదీర్ఘమైన పాశ్చాత్యపరిపాలన ప్రభావం వలన విదేశీభాషలు నేర్చుకుంటే గాని పొట్టగడవదు అనే స్థితికి భారతీయులు దిగజారారు. అలా అధ్యయన-అధ్యాపనాలు కరువై చేజారిన శాస్త్రగ్రంథాలు ఎన్నో మనం ఎరుగం.
అయినప్పటికీ జనాలు పూర్వం పొట్టకూటికి పగలంతా శ్రమించిన తరువాత చల్లని సాయంత్రం వేళల్లో దేవాలయప్రాంగణంలో కూర్చుని ఆయా శాస్త్రవచనాలను ఏ శాస్త్రిగారో చెబుతూ ఉండగా వినేవారు. (శాస్త్రం చక్కగా నేర్చినవాడు ఇక్కడ శాస్త్రి అని మనం అర్థం చేసుకోవాలి.) దురదృష్టవశాత్తు లౌకికప్రభుత్వాలు అనేవి ఏర్పడి, దేవాలయాలను తమకు ఆదాయం చేకూర్చి పెట్టే వ్యవస్థగాను, శాస్త్రులను కేవలం దేవుడికి అర్చన చేసి, హారతి ఇచ్చి, భక్తులకు శఠగోపం పెట్టి, తీర్థం ఇచ్చే ఒక ఉద్యోగిమాత్రుడుగా మాత్రమే వాడుకొనడం మొదలు పెట్టారు. అలా దేవాలయదురాక్రమణలు చేసిన లౌకిక ప్రభుత్వాలు క్రమంగా జనాలకు శాస్త్రాలను దూరం చేశారు. శాస్త్రాలను జనాలు వినటం లేదని అనేకశాస్త్రులు కూడా పొట్టకూటి విద్యలకు పరిమితమయ్యారు. క్రమంగా దేవాలయాలకు కూడా దూరమౌతున్నారు.
ఏదేమైనప్పటికీ, మన పూర్వుల శాస్త్రగ్రంథాలమీద మనలో చాలమందికి ఇప్పటికీ చెప్పలేనంత గౌరవం ఉంది. కాని వాటిని ఎలా నేర్చుకోవాలో తెలియక అయోమయంలో ఉంటారు.
నిజం చెప్పాలంటే భారతీయసంస్కృతిశత్రువులు లెక్కకు మిక్కిలిగా తయారు కావడానికి మన అజ్ఞానమే కారణం. మనం నేరుగా చదవలేదు కాబట్టి, భారతీయశాస్త్రాలమీద బురదజల్లే వారి మాటలను మనం నిజమే కాబోలునని నమ్ముతాం. మన శాస్త్రాలను సక్రమంగా చదివి అర్థం చేసుకుంటే వారి బురదజల్లుడుకు మనమే సరైన సమాధానం ఇవ్వగలం. కాని, అలా సమాధానం ఇచ్చేవారు తక్కువయ్యారు కాబట్టే బురదజల్లుడు మరింతగా మరింతగా ఎక్కువౌతోంది.
ఈ నెల (జూన్) 21వ తేదీన యోగదినం.
యోగం ఎంత గొప్ప విషయమో ప్రపంచమంతా అర్థం చేసుకుని ప్రశంసిస్తూ, దానిని నేర్చుకునేందుకు శ్రమిస్తూ ఉంటే మనలోనే కొందరు మాత్రం దానిని వెక్కిరించడం, వేళాకోళం చేయడం చేస్తుంటారు. దానికి కారణం వారి అజ్ఞానం మాత్రమే. మనం దానిని గూర్చి మొదట కొంత తెలుసుకుంటే క్రమంగా మరింత మరింతగా తెలుసుకునేేందుకు దారి దొరుకుతుంది. ఆ వెక్కిరించే వారి మాటలకు సమాధానం చెప్పగలం. ప్రయత్నం లేకుండా నిరాశతో కూర్చుంటే మాత్రం ఏ మార్గమూ లభించదు.
ప్రతిఘటన లేకపోతే లొంగిపోయినట్లే. ఓడిపోయినట్లే.
అందువల్ల ఈ నెల 20వ తేదీన, మధ్యాహ్నం గూగుల్ మీట్ ప్లాట్ ఫాం మీద యోగాన్ని గూర్చి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో నేరుగా పంచుకుందామనుకుంటున్నాను.
((పాతంజలయోగం - సంక్షిప్తపరిచయం - సమావేశం దాదాపు గంటన్నర ఉండవచ్చును.))
లింక్ త్వరలో అందజేస్తాను. ఆసక్తి ఉన్న మిత్రులం ఆ రోజు, అక్కడ కలుసుకుందాం. మిత్రుల ప్రతిస్పందనను బట్టి ఇతరసందర్భాలలో అప్పుడప్పుడు అనుకూలతను బట్టి నాకు తెలిసిన ఇతరవిషయాలను కూడా పంచుకుంటాను.
ధన్యవాదాలు
డా. శ్రీనివాసకృష్ణ
యోగి - భోగి
మూడు రోజుల క్రితం తెచ్చిన పన్‌రూటీ పనస గమ గమా వాసన వస్తుంటే బాగా మాగినట్టుందని చేతులకు చాకుకూ బాగా నూనె రాసుకుని పొద్దున్న కోశాము. ఆహా. తేనె పనస! కోస్తూ ఉంటే తేనె కారడం మొదలు పెట్టింది.
దేవుడికి నైవేద్యం పెట్టేంతవరకూ ఎట్లాగో ఓపిక పట్టిన పిల్లోడు ఒకవైపు మేము తొనలు తీస్తూ ఉంటే మరోవైపు వాటి రుచిని మెచ్చుకుంటూ ఒకొక్కటీ గుటకాయ స్వాహా చేయడం మొదలు పెట్టాడు. ఇలా లాభం లేదని మొత్తం మూడు పెద్ద పళ్లేలు తెచ్చి ఒకటి వాడికి కేటాయించి మిగిలినవాటిలో ఒకటి ఇంటికి, మరొకటి ఇరుగు పొరుగుకు కేటాయించి మొత్తం తొనలు తీయడానికి గంటకు పైగా సమయం పట్టింది.
తీస్తూ ఉండగా మాటల సందర్భంలో ఈ రోజు యోగ డే అనే ప్రసక్తి వచ్చింది.
"యోగ చేస్తే ఏమౌతుంది?" అని అడిగారు పిల్లలు.
"యోగం వల్ల యోగి అవుతారు".
"యోగి అయితే లాభమేమిటి?"
"యోగీ భవార్జున" అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు తెలుసా? అలా భగవద్గీత విని అర్జునుడు యోగి అయ్యాడు. దాంతో అందరికంటె బాగా యుద్ధం చేశాడు. గెలిచాడు."
"యోగులు యుద్ధం కూడా చేస్తారా? యోగులు యుద్ధం చెయ్యొచ్చా?"
"ఎందుకు చెయ్యకూడదు? ఎవరి పనిని వారు చక్కగా చేయడం కూడా యోగమే. యోగః కర్మసు కౌశలమ్" అని శ్రీకృష్ణుడు డెఫినిషన్ చెప్పాడు."
"అప్పన్నా అయితే నువు యోగివి కావు. నీకంటె అక్కయ్యే బాగా తొనలు తీస్తోంది. తెగిపోకుండా" అని పక పకా నవ్వాడు పిల్లోడు.
"మేము ఒక్కటి నోట్లో పెట్టుకునే లోగా నువ్వు మొత్తం ఖాళీ చేసేట్లున్నావురా. తినడమనే పనిలో నువ్వు యోగివి" అంటూ అక్కలిద్దరూ పక పక నవ్వారు.
ఇంతలో వాళ్లమ్మ కలుగ జేసుకుంది. "ఏకభుక్తే మహాయోగీ - ద్విభుక్తే మహాభోగీ - త్రిభుక్తే మహారోగీ" అన్నది.
"అంటే?"
"రోజుకు ఒక పూట తింటే గొప్ప యోగి. రెండు పూట్ల తింటే గొప్ప భోగి. మూడు పూట్ల తింటే గొప్ప రోగి అవుతాడు మనిషి."
"అమ్మో, ఇవన్నీ నేను ఒక్క పూటలో తినలేను. ఇప్పుడు కొన్ని, మధ్యాహ్నం కొన్ని, రాత్రి కొన్ని తిందామనుకున్నా" అన్నాడు పిల్లోడు.
"అయితే ఇంకేం? నువ్వు రోగివైపోతావ్" అంటూ వెక్కిరించారు అక్కయ్యలు.
ఉడుక్కున్నాడు పిల్లోడు. "చూడప్పన్నా" అని ఫిర్యాదు చేశాడు. "సరే. నేను ఇప్పుడు సగం, సాయంత్రం మిగిలిన సగం తింటాను. యోగి కాకపోయినా భోగి అవుతాను."
"భోగి అంటే?"
"భోగి అంటే మహారాజు."
"కాదు. పాము" అంటూ మళ్లీ పకపకలాడారు అక్కయ్యలు. నవ్వు పామైపోతావా? అయ్యయ్యో. హ హ హ."
"పామెట్లా?"
"అప్పన్ననడుగు కావాలంటే"
"అవునా అప్పన్నా?"
"అవును"
"అదెట్లా?"
"భోగమంటే పడగ. భోగం కలిగింది భోగి. కాబట్టి పాము. భోగీంద్రశాయినం, పురుకుశలదాయినం అనే పాట విన్నావు కదా? భోగీంద్రశాయి అంటే పాములరాజును పడకగా చేసుకుని శయనించేవాడన్న మాట. అంటే మహావిష్ణువు."
పిల్లోడు బుంగమూతి పెట్టేశాడు. "ఇవన్నీ నేను ఒక్క పూటలో తిన్నా కడుపు నొప్పి రోగమొచ్చేస్తుంది. అప్పుడు యోగి ఎట్లా అవుతాను? ఒక్క పూట తిన్నా రోగే, మూడు పూటలా తిన్నా రోగే. ఇంకేముంది తేడా?"
అపుడు అప్పన్న తీర్పు చెప్పాడు.
"నువ్వు భోగివైతే తప్పేమీ లేదు. విష్ణువు పడక ఆదిశేషుడు పామే కదా? యోగసూత్రాలు రాసింది పతంజలి. ఆయప్ప ఆదిశేషుడి అవతారం. అంటే సమస్త భూభారాన్ని మోసే పెద్ద పాము. యోగ డే నాడు నువు ఆదిశేషుడంతటి వాడివైతే తప్పేమీ లేదు".
ఈసారి అక్కయ్యలు బుంగమూతి పెట్టారు. అప్పన్న పిల్లోడి పార్టీ అయినందుకు.
))((
సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి తారుమారైపోయింది. పిల్లోడు రెండో పూట పనస తొనలు తిందామని గిన్నె తీసేసరికి...
...
...
తీసేసరికి... ఖాళీ. మొత్తం గిన్నె ఖాళీ.
అక్కయ్యలు మొత్తం తొనలు వీడికి తెలియకుండా ఎప్పుడో స్వాహా చేసేశారు.
విత్తనాలే తప్ప తొనలు లేవు.
పాపం, పిల్లోడి బిక్క మొహం చూసి అక్కలిద్దరూ పకపకా నవ్వారు.
జరిగిన ఆ ఘోరమైన అన్యాయం గూర్చి అప్పన్నకు ఫిర్యాదు చేయబడింది.
"పోనీలే, ఈ విత్తనాలున్నాయి కదా? వీటిని తోటల్లోను, అడవుల్లోను నాటుదాం. ఆ పని బాగా మంచిగా చేద్దాం. అలా మనం ఇద్దరం గొప్ప యోగులమైపోదాం." అని అప్పన్న పిల్లోడిని ఓదార్చాడు.
"మేము వీడిని మూడు పూటలా తినే రోగి కాకుండా కాపాడాము. రెండు పూటలా తినే భోగి కాకుండా కాపాడాము. ఒంటి పూట తిన్న యోగిని చేశాం. అది కూడా తప్పేనా?" అని అక్కలు తమ వాదం వినిపిస్తున్నారు.
((పిల్లవాడి తొనలు వేరే గిన్నెలో భద్రంగా ఉన్నాయి. తమ్ముడి మీద అక్కల ప్రేమ సందేహింపరానిది.
))
#YogaDay 2021
అవునా? నిజమా? ఎలాగో చెప్పు మరి?
పేద కార్మికుల సంపద అంతా అంబానీకి బదిలీ అయిపోతూ వుందా?
ఎందుకురా అబద్ధాలు?
ఎలా బదిలీ అవుతోంది?
అదేమైనా నగదు బదిలీనా?
అంటే పేద కార్మికుల జేబుల్లోంచి అంబానీ లాక్కుంటున్నాడా? లేదా అంబానీ బ్యాంకులతో లాలూచీ పడి పేదవాళ్ల అకౌంట్లలోని డబ్బును దొంగతనంగా తన అకౌంటులోనికి మార్పించుకుంటున్నాడా?
అదేం లేనపుడు, మరి పేదవారి సంపద అంబానీకి బదిలీ అయిపోతోందని ఎందుకు గగ్గోలు పెడుతున్నావు?
పోనీ అదేమైనా ఆస్తి బదిలీనా?
అంటే పేదవాళ్ల ఇండ్లు, పొలాలు, గొడ్డూ గోదా వంటి ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్లి తన పేరున దొంగతనంగా రాయించుకుంటున్నాడా అంబానీ?
అదేం లేనపుడు, మరి పేదవారి సంపద అంబానీకి బదిలీ అయిపోతోందని ఎందుకు గగ్గోలు పెడుతున్నావు?
ఒరే మూర్ఖుడా,
అంబానీ సంస్థల విలువ పెరుగుతోంది అంటే, అది అంబానీ ఒక్కడిదే కాదు. ఆ సంస్థలకు చెందిన వేలాది లక్షలాది షేర్ హోల్డర్ల సంపద కూడా పెరుగుతోంది అని అర్థం.
కనీసం ఆ సంపద కూడా భౌతికమైనది కూడా కాదు. అంబానీ తన తెలివితేటలతో చక్కగా వ్యాపారం చేస్తూ మంచి లాభాలను సంపాదిస్తూ వాటిని షేర్ హోల్డర్లందరికీ న్యాయంగా పంచుతూ ఉండటం వల్ల సహజంగానే ఆ సంస్థలకు చెందిన షేర్ల విలువ స్టాక్ మార్కెట్లో పెరుగుతుంది. అదీ ఇక్కడ సంపద విలువ పెరగడమంటే. ప్రపంచంలో ఎక్కడైనా అలాగే జరుగుతుంది.
అంతే కాదు, అంబానీ సంస్థలలో లక్షలాది భారతీయులు పని చేస్తూ చక్కగా సంపాదించుకుంటూ బ్రతుకుతున్నారు. మరిన్ని లక్షలమంది వారి ఉత్పత్తులను రవాణా చేస్తూ, అమ్ముతూ, పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. అంబానీ సంస్థల సేవలను దేశంలో కోట్లాది ప్రజలు ఉపయోగించుకుంటూ లాభపడుతున్నారు.
అసలు నీ సంగతే చెప్పు, నువ్వు ఈ ఫొటోలోని పనికి మాలిన సందేశాన్ని కూడా అందరికీ సోషల్ మీడియాలో పంచగలగటానికి కారణం అంబానీ నీకు చాల చవకగా ఇచ్చిన జియో డేటానే కదా?
అందువల్ల, అంబానీ సంపద ఎంత పెరిగినా అది దేశానికి, దేశంలోని ప్రజలకు ఉపయోగపడుతుంది. మరి నీ పనికిమాలిన రెచ్చగొట్టుడు మాటల వల్ల ఎవరికిరా ఉపయోగం, చెప్పు?
ఇది అర్థం చేసుకొనడం చేతగాని నువ్వు, అంబానీ పేదవారి కంచంలోని బువ్వను లాక్కు పోతున్నట్టు ఆ అరుపులు ఆ కేకలు ఆ దుష్ప్రచారం ఏమిటిరా? నీలాంటి అజ్ఞాని మాటలు విని నిజమే కాబోలు అనుకుని ఎంతమంది ఆవేశపరులైన యువకులు తప్పుదారిన పడతారో కదా? తమకు ఉపాధిని కల్పించగల సంస్థలనే వారు తిరస్కరిస్తే వారికి ఉపాధిని మీరు కల్పిస్తారా?
కేరళను దశాబ్దాల తరబడి మీరు పాలిస్తున్నారే? అక్కడ పేదరికం లేదా? అక్కడ ధనవంతులు లేరా? అక్కడ అంబానీ సంస్థలవల్ల ఎవరికీ మేలు జరగడం లేదా? అంబానీ వల్ల కేరళీయులకు ఉపాధి కలగటం లేదా?
పోనీ, కేరళలో పేదవారి సొమ్మును మీరన్నట్టు అంబానీ నిజంగానే దారుణంగా దోచేస్తున్నాడనే అనుకుందాం. మరి మీరేం చేస్తున్నారు? అంబానీ ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారిని తన్ని తరిమేయవచ్చు కదా? అలా మీరు ఎందుకు చేయటం లేదు మరి?
ఎందుకంటే మీరు అలా చేస్తే అంబానీ ద్వారా ఉపాధి పొందుతున్న కేరళప్రజలే మీమీద తిరగబడతారు. జనాలకు మీ మాటలలోని అబద్ధాలు స్పష్టంగా తెలిసి పోతాయి. అదీ మీ భయం.
అసలు అంబానీ ఒక్కడే ఎందుకు వ్యాాపారం చేయాలి, మిగిలిన వారు వ్యాపారం చేయవద్దా అని మీరు అడగవచ్చు. చేయండి. అంబానీ అంత తెలివిగా సమర్థవంతంగా చేయండి. ఎవరు వద్దంటారు?
కాని, దురదృష్టవశాత్తు మన విద్యావ్యవస్థ అటువంటి తెలివైనవారిని తయారు చేయడానికి అనుగుణంగా రూపుదిద్దుకోలేదు. మాటలు కూడా సరిగా రాకముందే ఇంగ్లీషు మీడియంలో చదివి, ఇంకొకరి క్రింద ఉద్యోగాలనే పేరిట గులాం గిరీ చేసే ఆత్మగౌరవం లేని మనుషులను సృష్టించడానికి మాత్రమే అది ఉపయోగపడుతోంది. మీలాంటి వారి మాటలలోని నిజానిజాలను చక్కగా ఆలోచించి గ్రహించడానికి కూడా ఆ విద్యావ్యవస్థ తోడ్పడదు. బుర్రను పెంచే చదువు నీకు అబ్బి ఉంటే ఇలాంటి తెలివి తక్కువ మాటలను నువు అసలు మాట్లాడేవాడివేనా?
అందువల్ల సహజప్రతిభాసంపన్నుడైన అంబానీ వంటి వ్యాపారవేత్త, ఉపాధిసృష్టికర్త మన దేశంలో ఎక్కడో కోటికో వంద కోట్లకో ఒకడు అప్పుడప్పుడు పుడుతూ ఉంటాడు. వారి బుద్ధివైభవాన్ని, అభివృద్ధిని చూసి స్వయంగా బాగుపడటం చేతగాక ఈర్ష్యపడే మీలాంటి వాళ్లు మాత్రం అటువంటి వారిని మీ స్థాయికి దిగజార్చి ఆనందపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
సరే, మీకు పేద కార్మికుల మీద అంత ప్రేమే గనుక ఉంటే, వారికి అంబానీ సంస్థలలో షేర్లు కొని ఇవ్వండి. అంబానీ సంపద పెరిగితే వారి సంపద కూడా పెరుగుతుంది.
సాక్షిగాడు మీకంటె ఘోరం. అంబానీ సంస్థలను అమ్మేసి ఆ డబ్బును దేశప్రజలకు పంచేస్తే తలసరి మొత్తం ఎంత వస్తుంది అంటూ ఆ మధ్య లెక్కలేసి మరీ వ్యాసం రాశాడు. మరి సాక్షి తనను తన యజమాని అమ్మేసి ఆ సొమ్మును తనకోసం పని చేస్తున్న జర్నలిస్టులు, ఎడిటర్లు, ప్రింటర్లు, హాకర్లకు పంచేస్తే ఎంత వస్తుందని లెక్కలు ఎందుకు వేయటం లేదో మరి ?
అందువల్ల, పనిలో పని, నెల నెలా ఉచితపంపకాలు మాని అంబానీ కంపెనీల షేర్లు ఒకే ఒక్కసారికి పేద ప్రజలకు కేటాయించమని మన ముఖ్యమంత్రికి సలహా ఇవ్వండి. నెమ్మదిగా వారు కూడా బాగుపడతారు. ఆయనకు ఉచితపంపకాల సరదా ఎక్కువౌతున్నకొద్దీ ఇక్కడ మా జేబులు గుల్లైపోతున్నాయి.
Subscribe to:
Posts (Atom)
సురక్షాసూక్తమ్
ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...
-
అవ్యాజమైన ప్రేమ? అదేమిటి? అలాంటిది ఎక్కడైనా ఉంటుందా? వ్యాజము అంటే కారణం లేదా సాకు. నిష్కారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తామా? అనగా అనగా య...
-
आसीदिदं तमोभूतम् अप्रज्ञातमलक्षणम्। अप्रतर्क्यमविज्ञेयं प्रसुप्तमिव सर्वतः।। (1.5) What was there before the Creation...
-
What is Personality? The Collins Dictionary defines the word Personality as – 1. The distinctive characteristics which make an indivi...