Thursday, 2 January 2020

గర్వకారణం 1

వనవాసం ముగిసింది.
అజ్ఞాతవాసం ముగిసింది.
సంధిప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అయినా దుర్యోధనుడికి యుద్ధం తప్పదని ముందే తెలుసును. పాండవులు ఎట్టి పరిస్థితులలోనూ సుఖపడరాదని, పాండవుల రాజ్యాన్ని పాండవులకు తిరిగి ఇవ్వాలనే సద్బుద్ధి తనకు లేదని అతడికి ముందే తెలుసు కదా? పాండవులు తన చేతిలో ఓడిపోతారని అతనికి గట్టి నమ్మకం.
అయినప్పటికీ సంజయుడు చెప్పిన ఒక్క మాట ధృతరాష్ట్రుడిని బాగా కలవరపెట్టింది.
एकतो वा जगत् कृत्स्नम्
एकतो वा जनार्दनः।
सारतो जगतः कृत्स्नाद्
अतिरिक्तो जनार्दनः।।
ఒకవైపు సమస్తప్రపంచాన్ని పెట్టి, మరొకవైపున శ్రీకృష్ణుని ఒక్కని మాత్రం పెడితే, సమస్తప్రపంచం కంటే సారభూతుడైన శ్రీకృష్ణుడే ఎక్కువ.
సమస్తప్రపంచం = జన్మ+కులము+ధనము+సంపద+భూమి+విద్య+లోకజ్ఞానము+పుస్తకజ్ఞానము+సంబంధాలు+పరిచయాలు+స్నేహితులు+అభిమానాలు+అహంకారాలు+మమకారాలు+రాగాలు+ద్వేషాలు+సమస్తచరాచరాఖిలబ్రహ్మాండము
శ్రీకృష్ణుడు > సమస్తప్రపంచం
దాంతో ధృతరాష్ట్రుడు భయపడిపోయి,
दुर्योधन हृषीकेशं शरणं गच्छ केशवम्।
"నాయనా దుర్యోధనా, శ్రీకృష్ణుని శరణు కోరవయ్యా" అని చెప్పాడు.
శ్రీకృష్ణుని గొప్పతనం దుర్యోధనుడికి కూడా తెలుసు. అయినప్పటికీ,
भगवान् देवकीपुत्रः लोकांश्चेन्निहतिष्यति।
प्रवदन्नर्जुने सख्यं नाहं गच्छेऽद्य केशवम्।।
"ఆ దేవకీపుత్రుడు భగవంతుడే కావచ్చును. సమస్తలోకాలను సంహరించగలిగినవాడే కావచ్చును. అయినప్పటికీ, అతడు అర్జునుడితో స్నేహం చేసినంతకాలం నేను అతడి దగ్గరకు వెళ్లను" అన్నాడు.
కానీ దుర్యోధనుడికి తప్పలేదు.
సహాయం కోరి వెళ్లక తప్పలేదు.
ఈ శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు?
ఎక్కడ ఆయనను పట్టుకోవాలి?
ద్వారకలో ఉంటాడని దుర్యోధనుడికి తెలుసు. అందువల్ల द्वारकामभ्ययात् पुरीम् - ద్వారకా నగరానికి వెళ్ళాడు.
అర్జునుడికి కూడా శ్రీకృష్ణుని సహాయం కావాలి. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఆయనను ఎలా పట్టుకోవాలి? ఈ విషయం దుర్యోధనుడి కంటే అర్జునుడికే బాగా తెలుసు. 😊
దుర్యోధనుడు అర్జునుడు తన దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు. 
(నటిస్తున్నాడా? 😊). 
ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప నిద్రించే వారిని లేపడం ధర్మం కాదు. అందువల్ల వారిద్దరూ శ్రీకృష్ణుడు నిద్రలేచేంతవరకు ఎదురుచూడదలిచారు.
దుర్యోధనుడు శ్రీకృష్ణుని తల చెంత ఉన్న గొప్ప ఆసనంపై కూర్చున్నాడు. అర్జునుడు కృష్ణుని పాదాలచెంత చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు.
నిద్ర లేచిన వెంటనే కృష్ణుడు చూసింది ఎదురుగా ఉన్న అర్జునుని. 😊
प्रतिबुद्धः स वार्ष्णेयो ददर्शाग्रे किरीटिनम्।
తరువాత దుర్యోధనుని కూడా చూశాడు.
వారు వచ్చిన పని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇద్దరికీ సహాయం చేస్తానని చెప్పాడు.
साहाय्यमुभयोरेव करिष्यामि सुयोधन।
"నాతో సమానులై సహస్రసహస్రసంఖ్యాకులైన నా వీరసైనికులొకవైపు ఉంటారు, ఆయుధాన్ని పట్టకుండా, యుద్ధం చేయకుండా నేను ఒకవైపు ఉంటాను. మీరు చెరొక దానిని ఎంచుకోండి. అర్జునుడు చిన్నవాడు కాబట్టి మొదట ఎంచుకుంటాడు" అన్నాడు.
టాస్ ఓడి పోయిన క్రికెట్ జట్టు కెప్టెన్‌లా దుర్యోధనుడు డీలా పడిపోయాడు.
శ్రీకృష్ణుని గొప్పతనం తెలిసినప్పటికీ దుర్యోధనుడు మోహంలో పడిపోయాడు. "ఆయుధాలు పట్టకుండా యుద్ధం చేయకుండా తనవైపు శ్రీకృష్ణుడు ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి అనుకున్నాడు. మొదట కోరుకునే అవకాశం చిన్నవాడు అనే పేరిట అర్జునుడికి ఇచ్చాడు. వాడేమైనా తెలివితక్కువవాడా? ఖచ్చితంగా సహస్రసహస్ర సైనికులనే కోరుకుంటాడు" అని భావిస్తూ నిస్సహాయంగా పళ్ళు నూరుతున్నాడు.
కానీ దుర్యోధనుడికి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ, అర్జునుడు తనకు శ్రీకృష్ణుడు ఒక్కడే కావాలన్నాడు.
अयुध्यमानं संग्रामे वरयामास केशवम्।
దుర్యోధనుడి ఆనందానికి అంతే లేదు.
संप्राप्य परमां मुदम्...
ఈ దెబ్బతో నాదే విజయం అని భావించాడు.
युद्धान्मेने जितं जयम्।
శ్రీకృష్ణుడు తాను తవ్వుకొన్న గోతిలో తానే పడ్డాడు అని ఆనందించాడు. టాస్ ఓడిపోయినప్పటికీ మ్యాచ్‌లో విజయం నాదే అనుకున్నాడు.
కానీ, అర్జునుడు ఏమిటి, అంతటి తిక్కోడు?
సహస్రసహస్రమహాయోధులను వదిలిపెట్టి, ఆయుధం పట్టుకొని యుద్ధం చేయను అన్న కృష్ణుని మాత్రమే ఎందుకు కోరుకున్నాడు?
ముందే అనుకున్నట్టుగా, ఈ విషయం దుర్యోధనుని కంటే అర్జునుడికే బాగా తెలుసు. 😊
यतः सत्यं यतो धर्मः
यतो ह्रीरार्जवं यतः।
ततो भवति गोविन्दः
यतः कृष्णस्ततो जयः।।
ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ హ్రీ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ఆర్జవం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది.
1 సత్యం = సత్యం
2 ధర్మం = ధర్మం
3 హ్రీ = ఎటువంటి పనుల వలన సత్యధర్మపరులైనవారికి క్షోభ కలుగుతుందో అటువంటి పనులను చేసేందుకు సిగ్గుపడటం, వెనుకాడటం.
4 ఆర్జవం = ఋజుత్వం. త్రికరణశుద్ధి. మనోవాక్కాయకర్మల సామాన్యము (సమానంగా ఉండేలా ప్రవర్తించటము)
ఈ నాలుగు గుణాలు ఎవరి దగ్గర ఉంటే శ్రీకృష్ణుడు వారి దగ్గర ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎవరి చెంత ఉంటే వారిదే జయం. 🙏
ఆ నాలుగు గుణాలు దుర్యోధనుని చెంత లేవు కాబట్టే అతడు కృష్ణుని సంతోషంగా వదులుకున్నాడు.
కానీ ఈ నాలుగు గుణాలు అర్జునునిలో పుష్కలంగా ఉండడం వల్ల అతడు శ్రీకృష్ణుని ఎంచుకున్నాడు.
ఈవిషయం తెలియక అందరూ పాండవపక్షపాతి అంటారు గాని, నిజానికి అతడు ధర్మపక్షపాతి.
అంతిమఫలితం అందరికీ తెలిసిందే.
దుర్యోధనుడు ఓడిపోయాడు.
పాండవులు విజయం సాధించారు.
యతో ధర్మః తతః కృష్ణః.
యతః కృష్ణః తతో జయః.
🌼🌼🌼
దేవుడంటే తనను వేలంపాటలో ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారి టీముకు సేవలందించే IPL క్రికెటర్ లాంటివాడు కాదు.
తన చెంతకు వచ్చినవారి ఐశ్వర్యాన్ని, స్తోత్రాలను, హోదాను, ఆడంబరపూజలను కాక, వారి గుణాలను మెచ్చి ఆదరించే దేవదేవుడు మావాడై ఉండటం మా మతానికి నిస్సందేహంగా గర్వకారణం.

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2600595423394455


మైక్రో/నానో ప్లాస్టిక్


 03/10/2019
ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ప్లాస్టిక్ హెల్త్ సమ్మిట్ జరిగింది. ఇటువంటి కాన్ఫరెన్సు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరిగిందట.
మైక్రో/నానో ప్లాస్టిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాణికోట్లకు తీవ్రమైన హానిని కలిగిస్తున్న పరిణామాలు ఈ కాన్ఫరెన్సు ద్వారా వెలుగు చూశాయి.
మైక్రో/నానో ప్లాస్టిక్స్ అంటే చాల చిన్న ప్లాస్టిక్ కణాలు. సాధారణంగా 5 మిమీ కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. సముద్రంలోను, మంచినీటిలోను భూమిలోను చేరి, వాటిని కలుషితం చేసే మైక్రో/నానో ప్లాస్టిక్స్ గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. మనుషులు జంతువులు కూడా మైక్రో/నానో ప్లాస్టిక్‌లను తింటున్నారు అని పరిశోధనలో తేలింది.
మనం వాడుతున్న పెద్ద ప్లాస్టిక్ వస్తువులు కాలక్రమేణ చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమౌతాయి. ఈ చిన్న చిన్న ముక్కలు పర్యావరణంలో కలుస్తాయి.
జలతరంగాలు, వాయుతరంగాలు, సూర్యరశ్మి, భౌతికమైన ఒత్తిడి వంటివి ప్లాస్టిక్‌ను క్రమంగా చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ప్లాస్టిక్ సంచులు, వాటర్ బాటిళ్లు, కుర్చీలు, టీ పొడి ప్యాకెట్లు - ఇలా ప్రతి ఒక్క ప్లాస్టిక్ పదార్థమూ విచ్ఛిన్నమై మైక్రో/నానో ప్లాస్టిక్‌గా మారి, పర్యావరణంలో కలిసి సమస్తప్రాణులకు చేటు కలిగిస్తోంది.
మైక్రో/నానో ప్లాస్టిక్‌లు వివిధమార్గాలలో మనుషుల శరీరాల్లో ప్రవేశిస్తాయి.
1 నీళ్లలో కలిసిన మై/నా ప్లా.లను ప్లాంక్‌టన్ ▶️ చేపల వంటి జలచరాలు తింటాయి. వాటిని మనుషులు తింటారు. ఆహారంలో కలిసిన మై/నా ప్లా.లను కోళ్లు మేకలవంటివి తింటాయి. వాటిని మనుషులు తింటారు. ఇలా...
2 ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు అరిగిపోతూ మై/నా ప్లా.లను నీటిలోకి విడుదల చేస్తుంటాయి. వాటిని మనం తాగుతాము.
3 గాలిలో స్వేచ్ఛగా తిరుగుతున్న మై/నా ప్లా.లను మనం పీల్చుకుంటాము.
ఇలా మనం ప్లాస్టిక్‌నే తింటున్నాము, త్రాగుతున్నాము, ఊపిరి తీసుకుంటున్నాము.
ఇలా మన శరీరంలో ప్రవేశిస్తున్న మై/నా ప్లాస్టిక్, BPA, PFAS, phthalates వంటి చాలా ప్రమాదకరమైన విషరసాయనాలను మన జీవకణాలలోనికి విడుదల చేస్తోంది.
ప్లాస్టిక్ తేలికగా, పారదర్శకంగా, ఉంటూ చాలా కాలం మన్నటానికి ప్రత్యేకించి వాడే రసాయనం phthalate. ఇది ఆటోమొబైల్, కాస్మటిక్ రంగాలలో కూడా విపరీతంగా వినియోగింపబడుతుందట. ఇవి మనుషుల కాలేయాన్ని, మూత్రపిండాలను, శ్వాసకోశాలను, పునరుత్పత్తి (సంతానోత్పత్తి) వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి.
ఆహారపదార్థాలను, పానీయాలను ప్యాక్ చేసే ప్లాస్టిక్‌లో BPA పుష్కలంగా ఉంటుంది. ద్రవపదార్థాలలో అది నెమ్మదిగా కరిగి కలిసిపోతుంది కూడా.
PFAS అనే రసాయనం తల్లి పాలలో కూడా కనిపించేంతంటి ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నదట.
ఇవన్నీ మన శరీరంలో చేరుతూ మన రోగనిరోధకవ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. తత్ఫలితంగా, మనం సులువుగా అనేకరోగాలకు గురి అవుతాం. మన జీవకణాలు ఔషధాలకు ప్రతిస్పందించడం మానేస్తాయి. రోగకారకాలైన విషాలకు ఆపై తిరుగు ఉండదు. చిన్న వయసులోనే వృద్ధాప్యం ఆవహిస్తుంది. కీళ్లు పట్లు తప్పుతాయి. కంటి చూపు మందగిస్తుంది. వినికిడి శక్తి తగ్గుతుంది. ఎంతటి ఖరీదైన వైద్యమైనా ఈ లక్షణాలను నయం చేయలేదు. అందువల్ల ఆయుఃప్రమాణం తగ్గిపోతుంది. బ్రతికినంత కాలం కూడా సుఖంగా బ్రతికే అవకాశం ఉండదు.
పూర్తిగా వాటర్ బాటిల్ మీదనే నేరారోపణ చేయడానికి వీలు లేదు. మనం ధరించే సింథటిక్ దుస్తులు కూడా ఇందుకు తమ వంతు నేరాన్ని తాము కూడా చేస్తున్నాయి. నూలు వస్త్రాల మీద మనుషులకు మోజు పోయింది. ఆక్రిలిక్, నైలాన్, పాలిస్టర్ వస్త్రాలు ఎక్కువైనాయి. వాటిని ఉతుకుతున్న ప్రతిసారీ బిలియన్ల కొద్దీ మై/నా సింథటిక్ కణాలు దుస్తులనుండి విడిపోయి, నీటిలోనికి  కాలువలలోనికి  జలాశయాలలోనికి  సముద్రంలోనికి ⬆️ వాతావరణంలోనికి చేరుకుంటున్నాయి.
ఒక టీ బ్యాగ్ కూడా ఒక కప్పు టీ లోనికి 11 బిలియన్ల మైక్రో ప్లాస్టిక్‌లను విడుదల చేస్తుందట.



😫
ప్రపంచమంతటా ఈ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోంది. అది మానవాళికి ఎలా శత్రువో వారందరూ ఉద్ఘోషిస్తున్నా మన భారతీయసమాజంలో మనం ఇంకా వినీ విననట్టు నటిస్తున్నాము.
సమావేశాలలో మన రాజకీయనాయకులు ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎదురుగా పెట్టుకొని, మాట్లాడి మాట్లాడి అలసిపోయినప్పుడల్లా వాటి మూత విప్పి త్రాగుతూ ఉంటే చూడటం మనకు అలవాటైపోయింది. మన క్రీడాకారులు తమకు శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చే పదార్థాలు ప్లాస్టిక్ డబ్బాలలో ఉంటాయని చెబుతుంటే అవునా అని అమ్మానాన్నలం వాటిని వెంటనే తెచ్చి మన పిల్లలకు తినిపించే స్థాయిలోనే ఉన్నాం.
గతానుగతికో లోకః।
న లోకః పారమార్థికః॥
సాధారణంగా ఈ లోకంలో ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా ప్రవర్తిస్తూనే ఉంటారు. పరమార్థమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయరు.
సమాజం సమాజమంతా స్తబ్ధంగా నిస్తేజంగా మారిపోయింది. ప్రమాదం ముంచుకొచ్చినా తప్పించుకొనే ప్రయత్నం చేయలేని తమోగుణమగ్నమైన ఒక చెట్టుకూ మనకూ పెద్ద తేడా లేకుండా పోయింది.

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2626356474151683

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...