Tuesday 23 July 2019

తపస్సు చేద్దాం రండి


పతంజలి యోగాన్ని అష్టాంగయోగంగా వ్యవహరిస్తారు. అందులో ఎనిమిది అంగాలు ఉంటాయి కాబట్టి, దానికి ఆ పేరు.  వాటిలో రెండవ అంగానికి నియమాలు అని పేరు. ఆ నియమాలు ఐదు. అందులో ఒకటి తపస్సు. తపస్సు అంటే ఒకదానిని సాధించడంకోసం తపించడం అని అర్థం చేసుకోవచ్చు.  

ఆ తపస్సు మూడు రకాలట.   
1 సాత్త్వికము,
2 రాజసికము,
3 తామసికము.

తామసికమైన తపస్సుకు ఉదాహరణ రాక్షసులది. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైనవారిది. వారు తమ అభివృద్ధి కోసం కంటే కూడా ఇతరులను ఏడిపించడం కోసమే తపస్సు చేశారు. నిజం చెప్పాలంటే అటువంటి తపస్సు చేశారు కాబట్టే, అటువంటి పీడను కొనసాగించారు కాబట్టే, వారు కశ్యపుడు, పులస్త్యుడు వంటి గొప్ప బ్రహ్మర్షుల వంశంలో పుట్టినప్పటికీ రాక్షసులు అనిపించుకున్నారు.

రాజసికమైన తపస్సుకు ఉదాహరణ ధ్రువుడిది. తనకు జరిగిన అన్యాయం సహించలేక ఉన్నత స్థానాన్ని ఆశించి గొప్ప తపస్సు చేసి చరితార్థుడైనాడు. రాజులైనప్పటికీ, అటువంటి గొప్ప తపస్సు చేసినవారు రాజర్షులుగా కూడా పిలువబడ్డారు.

సాత్త్వికమైన తపస్సు మహర్షులది. వారి కోరిక అంతా ''లోకాః సమస్తాః సుఖినో భవంతు'' అనేది మాత్రమే.  

న త్వహం కామయే రాజ్యం
న స్వర్గం నాపునర్భవమ్।
కామయే దుఃఖతప్తానాం
ప్రాణినామార్తినాశనమ్।।

నేను రాజ్యాన్ని కాని, స్వర్గాన్ని కాని, మోక్షాన్ని కాని కోరను, కేవలం ప్రాణుల దుఃఖం పోవాలని మాత్రమే కోరుకుంటాను అని తపించిన రంతి దేవుడు రాజైనప్పటికీ, ఆయన చేసినది సాత్త్వికమైన తపస్సు.
         
అయితే, తపస్సును చేయాలి అనిపించడం పూర్వజన్మపుణ్యఫలం. (తపస్సు అంటే ఒక దానిని సాధించడం కోసం తపించడం అని మునుపే చెప్పుకున్నాము.)  ఒక విద్యార్థికి విద్యార్జనమే తపస్సు కావచ్చు. ఒక వ్యాధికి మందు కనిపెట్టడమే ఒక శాస్త్రజ్ఞుడికి తపస్సు కావచ్చును. ఆవిధంగా అన్నమాట. అటువంటి తపస్సును మొదలు పెట్టగలగడం కూడా మహాభాగ్యఫలం.  

ఇక నిర్విఘ్నంగా తపస్సు చేయడం అంటే భగవంతుని అనుగ్రహం మనకు తపస్సు పూర్తికావడం కంటే ఎంతో ముందుగానే లభించినట్లు లెక్క.
         
తపోభంగం చేయడానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. కామాన్ని పురికొల్పుతాయి. క్రోధాన్ని కలిగిస్తాయి. లోభాన్ని ప్రేరేపిస్తాయి. మోహంలో ముంచెత్తుతాయి. మదంతో కండ్లు మూసుకుపోయేలా చేస్తాయి. మాత్సర్యానికి రెక్కలు తొడిగి ఎగిరింపజేస్తాయి.

ఉదాహరణకు, ఒక విద్యార్థి చదువుకుందామని కృతనిశ్చయుడై ఉన్నాడనుకోండి. అతడి మిత్రుడు ఒకడు మన ఇద్దరికోసం సినిమా టికెట్లు తెచ్చాను, రా అని అతడిని తీసుకుపోవచ్చు. ఈ విధంగా తన లక్ష్యమైన చదువును వదలి మరొక పని చేయాలి అని, అతని ఏకాగ్రతకు భంగం కలిగించే ఎటువంటి కోరిక అయినా, అది కామం.
         
అతడు చదువుకుంటున్న సమయంలో పెద్ద శబ్దంతో ఇతరులు పాటలు వింటూ అతడికి కోపం తెప్పించవచ్చు. వారితో తగవు పెట్టుకొనేలా ప్రేరేపించేది క్రోధం.
         
చదువు పూర్తి కాకముందే ఏదో ఒక ఉద్యోగం వస్తే చదువును వదలి ఉద్యోగం చేయాలి అనిపించవచ్చు. ఆ విధంగా చదువుకు అడ్డుకట్ట వేసేది లోభం.
         
చదువు లేక పోయినప్పటికీ ఏ క్రీడాకారులో లేక ఏ సినిమానటులో చదువుకున్న వాడి కంటే బాగా సంపాదించి సుఖపడున్నారు అనిపించి మనసు అటువైపు మొగ్గు చూపవచ్చు. ఆ ఆలోచన చదువుకు ఆటంకం కలిగించితే అది మోహం.
         
నేను ఫస్ట్ ర్యాంకు విద్యార్థిని, ఒక్క సారి చదివితే మొత్తం అర్థం చేసుకోగలను అనే గర్వం తలెత్తి అతడు చదువుకోసం కేటాయించే సమయం తగ్గవచ్చు. అదుగో, అందుకు కారణం మదం.
         
తనకు పోటీగా మరొక విద్యార్థి చక్కగా చదువుతూ ఉంటే, అతడితో స్నేహం చేసి, వివిధవిషయాలను గూర్చి చర్చిస్తూ జ్ఞానసముపార్జన చేయడం మంచి పద్ధతి. అలా కాకుండా ఆ పోటీని గూర్చి చింతిస్తూ, తనను ఆ పోటీదారు మించితే బాధపడుతూ, తానే అతడిని మించితే ఆనందపడుతూ, ఈ విధంగా చదువును గూర్చి కంటే ఆ పోటీదారుని గూర్చి ఎక్కువగా ఆలోచించడం అనేది మాత్సర్యం.

క్షత్రియుడైన విశ్వామిత్రుడు మొదట వసిష్ఠమహర్షి పట్ల మాత్సర్యభావంతోనే తపస్సు మొదలు పెట్టినప్పటికీ, చివరకు ఆ తపఃప్రభావంతో పైన పేర్కొన్న కామాది అరిషడ్వర్గాలను జయించి, రాజర్షి స్థాయిని మించి బ్రహ్మర్షి అయిన కథ మనకుతెలుసు.
         
ఈ కాలంలో కూడా తపస్సు చేయవచ్చు. అది లోకానికి హాని చేసేది అయితే తామసికతపస్సు. అది కేవలం తనకు లేదా తనవారికి మాత్రమే ఉపయోగపడేది అయితే రాజసికతపస్సు. తమతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడేది అయితే సాత్త్వికతపస్సు.

శ్రద్ధయా పరయా తప్తం
తపస్తత్ త్రివిధం నరైః
ఆఫలాకాంక్షిభిర్యుక్తైః
సాత్త్వికం పరిచక్షతే।।
         
“గొప్ప శ్రద్ధతో, తనకోసం ఏమీ కోరకుండా, (లోకసంక్షేమాన్ని కోరుతూ) నిత్యం చేయబడే సత్కర్మలే సాత్త్వికతపస్సు” అని సాక్షాత్తు భగవంతుడే గీతలో (17-17) మనకు మార్గదర్శనం చేశాడు.
         
భగవంతుని నిత్యం స్మరిస్తూ, మనం చేసే సమస్తకర్మలను భగవదర్పితం చేస్తూ ఉంటే, మనం తప్పక సాత్త్వికులం కాగలం.  అపుడు మన సంకల్పాలు, తద్వారా మనం చేసే అన్ని పనులు సాత్త్వికమే కాగలవు.  అది చెట్లు నాటడం కావచ్చు.  ఎండాకాలంలో చలివేంద్రాలు నిర్వహించడం కావచ్చు.  పదిమంది పిల్లలను పోగు చేసి వారికి చదువు చెప్పడం కావచ్చు.  మురికివాడలను శుభ్రం చేయడం కావచ్చు.  పరిసరాల పరిశుభ్రతను గూర్చి ప్రజలందరికీ అవగాహన కలిగించి, వారిలో ఆరోగ్యస్పృహను కలిగించడం కావచ్చు.  నీటిని సంరక్షించుకొనడం, పొదుపుగా వాడుకొనడం ప్రజలకు అలవాటు చేయడం కావచ్చు. 
         
ఇలా, పేరును, ధనాన్ని, పలుకుబడిని మరొక మరొక లాభాన్ని ఆశించకుండా నిష్కామంతో చేసే పనులు లోకానికి ఎంతో మేలును చేకూరుస్తాయి.  ఇతరులు కూడా అటువంటి పనులు చేసేందుకు  ప్రేరణ కలిగిస్తూ, మన తరువాత కూడా లోకానికి శుభపరంపరను కలిగిస్తూ ఉంటాయి. 
         
అందువల్ల, లోకానికి శుభం కోరుతూ ఒక మంచి పనిని చేద్దాం అని సంకల్పించుకుని, దానిని నెరవేర్చే బాధ్యతను భారాన్ని భగవంతునిపై మోపి, మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దాం.  అదే సాధారణమనుషులమైన మనం చేయగలిగిన తపస్సు. 

లోకాః సమస్తాః సుఖినో భవంతు.

(2019 జూలై నెల, యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడిన నా వ్యాసము)

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...