1902 వ సంవత్సరం.
ఖచ్చితంగా చెప్పాలంటే 06/08/1902 తేదీ.
మద్రాసు రైల్వే స్టేషన్.
ఉదయం 5:20 సమయం.
ఒకటవ నంబరు ప్లాట్‌ఫాం మీద బొంబాయి మెయిల్ ఉంది. అరక్కోణం, పుత్తూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్లుల మీదుగా బొబాయికి బయలు దేరడానికి ఇంకా అర్ధగంటకుపైగా సమయముంది. స్టీమ్ ఇంజన్ పక్కనుండి తెల్లని ఆవిరిపొగలు కక్కుతోంది.
జనాలు తండోపతండాలుగా ప్లాట్‌ఫాం మీద ఉన్నారు. వారెవరూ ప్రయాణీకులు కారు. అందరూ తమిళంలోనూ తెలుగులోనూ రెండుభాషలను మిశ్రం చేసి మాటాడేసుకుంటున్నారు. స్టేషన్‌మాస్టర్ అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జనాల చేతుల్లో పూలదండలున్నాయి. పండ్లున్నాయి. ఎవరో ప్రముఖులు ఈరోజు ఈరైల్లో ప్రయాణం చేయబోతున్నారని అతనికి అర్థమైంది. ఎవరైయుంటారు? ఎవరికి వీడ్కోలు పలకటానికి వచ్చారు ఇంతమంది నేటివ్సు?
రైలు గార్డుకు టెన్షన్ వచ్చింది. ఆ ప్రముఖుడెవరో త్వరగా వచ్చేస్తే సమయానికి బయలుదేరొచ్చు. ఆయన సమయానికి రాకుండా, రైలు ఎక్కకుండా, రైలును బయలుదేరదీస్తే ఆ ప్రముఖుని ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుంది! అలా చేస్తే పై అధికారులు తనను చీవాట్లు పెడతారు. ఆ ప్రముఖుని స్థాయి ఎంత గొప్పదైతే తనకు అంత దండన తప్పదు. ఆయన ఆంగ్లేయ అధికారి ఐతే ఉద్యోగం ఊడినా ఊడవచ్చు. ఆలస్యమైతే ఆయన వచ్చేంతవరకు రైలును ఇక్కడే నిలపవలసిందేనా?.... తన ఉద్యోగం మీద తనకే చిరాకు వేసింది గార్డుకు. ఇంజన్ డ్రైవర్ ఉద్యోగం చాల నయం! సిగ్నల్ ఇచ్చి, ఈల వేసి, పచ్చ జెండా ఊపితే నడుపుకు పోవడమే అతని వంతు. ఎందుకు నిలపలేదయ్యా అంటే గార్డ్ పొమ్మన్నాక బండి నడపాల్సిందే కదా అని నెపం అతడి మీద వేసి తప్పుకోవచ్చు. మరి గార్డు? ఇంతలో గార్డుకు తటాలున ఇంకొక ఆలోచన వచ్చింది. రైలు స్టేషన్‌లో ఉన్నంతకాలం స్టేషన్‌మాస్టర్‌దే బాధ్యత! ఆయన పొమ్మన్న తక్షణం నేను డ్రైవరును పొమ్మంటాను. నాదేం తప్పు ఉండదు అనుకున్నాడు.
స్టేషన్‌మాస్టరు కూడా ఆందోళనలోనే ఉన్నాడు. డ్రైవరు ఉద్యోగం గార్డు ఉద్యోగం ఎంతో నయమనుకుంటున్నాడు. కాకపోతే అతడి ఆందోళన కాస్త విభిన్నమైనది. అతడు జాతిరీత్యా తెల్లవాడు. అధికారులకోసం రైలును ఆపవచ్చునని అతడికి సూచనలున్నాయి. భారతీయుల్లో ఎంతటి ప్రముఖుడైనా రైలును ఒక్క క్షణం కూడా ఆపనవసరం లేదు... అందువల్ల ఆ విషయంలో భయం లేదు. కాని, అటువంటి అధికారి ఎవరూ ఆరోజు వస్తున్నట్టు తనకు ముందస్తు సమాచారం లేదు. అయినా, అతడొస్తాడని తెలిస్తే తన విచక్షణాధికారంతో ఆపేయవచ్చు. కాని తీరా ఆ వచ్చేది ఎవడో నల్లజాతి ప్రముఖుడైతే మాత్రం తాను తమవారందరిలోనూ నగుబాట్లపాలు కావడం తథ్యం. ఆ మాట అటుంచితే, తన పై అధికారులు తనను డిస్మిస్ చేసిపారేస్తారు!
ఆందోళనలో ఉన్న స్టేషన్‌మాస్టరుకు క్రమంగా బుర్ర చురుకుగా మారింది. ఈరోజుకు అంత ప్రమాదం జరగకపోవచ్చు... వచ్చిన జనమందరూ నల్లవాళ్లు. నేటివ్సు. అందులో ధనవంతులే కాక చాలమంది సామాన్యజనం కూడా ఉన్నారు. ఇలాంటి వారెవరూ తెల్ల అధికారులకు వీడ్కోలు పలకడానికి రారు. కాబట్టి, రైలును సరైన సమయానికే బయలుదేరమనవచ్చు. గట్టిగా మాట్లాడితే ఐదు నిమిషాలు ముందుగా పంపేసినా అడిగేవారెవరూ ఉండరు. థాంక్ గాడ్! అతనిలో ఆందోళన కాస్త తగ్గింది. ఆసక్తి పెరిగింది.
మరి, ఇప్పుడెవరి కోసం వచ్చినట్టు ఇందరు జనాలు? కాస్త చిరాకు కూడా కలిగింది. ఆఫ్టరాల్, ఓ నల్లోడి కోసం ఇందరు జనాలా? మహారాష్ట్రంలో బాలగంగాధర తిలక్ లాంటి బ్లాక్ లీడర్ వస్తే ఇలా అపుడపుడు ఇలా జరుగుతూ ఉంటుందని విన్నాడు. అయినా రైల్వే అధికారులు ఆయనగూర్చి పట్టించుకోకుండా సిగ్నల్ ఇస్తారని, రైలును సరైన సమయానికి పంపి తమ డిగ్నిటీని కాపాడుకుంటారని వారి వీరోచితకృత్యాలు విన్నాడు. తనకు కూడా ఈరోజు అటువంటి వీరుల లిస్టులో చేరే సువర్ణావకాశం వచ్చినట్టుంది! అతడికి కాస్త ఆశ కలిగింది. అటువంటి డిగ్నిఫైడ్ మెరిట్ లిస్టులో ఉండేవారికి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చిన దాఖలాలున్నాయి. కాస్త హుషారు కూడా పెరిగింది.
"హూ'జ్ కమింగ్? హూ ఆర్ దె వెయిటింగ్ ఫా?' అని తన అసిస్టెంట్‌లను దర్పంగా అడిగాడు. "స్వామి వస్తున్నాడని ఆ జనాలు మాటాడుకుంటున్నారు" అని చెప్పారు వారు.
"ష్వామీ? ఈజ్ ఇట్ వివేకానందష్వామీ? నో. నో. హీ ఈజ్ నో మో. దిస్ మస్ట్ బీ సమదా ష్వామీ. హూ కుడిట్ బీ?"
స్టేషన్ మాస్టర్‌కు అంతకు ముందుండిన భయమంతా క్షణంలో పోయింది. అంతే కాదు, కాస్త నిరాశ కూడా కలిగింది. నల్ల రాజకీయనాయకులను ఎదిరించి, తిరస్కరించి, అవమానిస్తే తమ వర్గంలో వచ్చేంతటి కీర్తిప్రతిష్ఠలు ఎవరో ఓ నల్లస్వామిని అవమానిస్తే రాదు. ఇలాంటి స్వాములను ఏం చేసినా తనకు ప్రమోషన్ రాదు! తన నోటి ముందరి కూడును ఎవరో తటాలున లాక్కున్నంత కోపం వచ్చింది అతనికి.
ఇంతలో - "స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు" అనే కలకలం వినిపించింది. ప్లాట్‌ఫాం మీద చెదురుమదురుగా ఉన్న జనాలందరూ ఆ స్వామి స్టేషన్‌లో అడుగుపెట్టినవైపు పరుగుతీశారు.
స్టేషన్‌మాస్టర్‌కు ఇదంతా మరింత చిరాకును తెప్పించింది. "దీజ్ బ్లడీ ష్వామీజా స్పాయిలింగ్ ద క్రౌడ్స్. దీజ్ బెగ్గర్సారాఫ్ నో యూజ్. దెయారెండార్సింగే డర్టీ రెలీజియన్ అండ్ మేకింగ్ ఆలాఫ్ యు షేమ్‌లెస్ బెగ్గార్స్" అంటూ తన అసిస్టెంట్లమీద గట్టిగా అరిచేశాడు. వారు నివ్వెరపోయారు. ఏమిటి ఈయనకు ఇంత అసహనం అనుకున్నారు. పాపం, వారికేం తెలుసు ఆయనలో జరిగిన అంతర్మథనం?
వారందరూ తనను తేరిపారచూస్తూండగా, "లెట్ ద ట్రైన్ స్టార్ట్ ఇమ్మీడియేట్లీ. లెట్ ద సిగ్నల్ బీ గివెన్. వైయార్యూ డిలేయింగ్? టైమీజ్ టైమ్. ఇట్ డజన్ట్ వెయిట్ ఫా ఎనిబడీ, హూ ఎవా ఎట్ మే బీ" అని గట్టిగా అరిచాడు స్టే. మా.
"సర్, షెడ్యూల్ ప్రకారం ఇంకా ఇరవైనిమిషాలుంది" అని చెప్పారు వారు విస్తుపోయి. స్టే. మా. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, " ఇట్సోకే, ఫాలో ద టైమ్" అన్నాడు.
"యెస్ సర్".
స్టేషన్ మాస్టర్ తన గదిలోనికి వెళ్లిపోయాడు. తన కుర్చీలో కూర్చున్నాడు. తన మానసికస్థితికి అతడికి భయం వేసింది. ఎందుకు తన నల్ల అనుచరులముందు తాను ఇలా అదుపు తప్పి ప్రవర్తించాడు? తన మాతృదేశమైన ఇంగ్లండుకు దూరంగా, ఈ నల్లదరిద్రుల దేశంలో బ్రతకడం తనకు ఇష్టంలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఇలా బయటపడిందా? ఈదేశంలో మంచి జీతం వస్తుంది. అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఉంది. తన పిల్లలకు మంచి విద్యనందించే బ్రిటిష్ స్కూళ్లు కూడా ఉన్నాయి. ఎదురు తిరగకుండా నమ్మకంగా పనిచేసిపెట్టే సేవకులున్నారు. రాజాలాంటి జీవితం. అయినా తనకెందుకు ఈ అసంతృప్తి? తాను తెల్లవాడినన్న అహంకారమే తన మానసికస్థితికి మూలబీజమా?
అతని గది తలుపులు మూసివున్నా, ప్లాట్‌ఫాం మీద జనాల కోలాహలం వినిపిస్తోంది. ఇంతలో రైలు కూత గట్టిగా వినిపించింది. గడియారం చూశాడు. సరిగ్గా ఆరు గంటలు. అతడు తనను చూసిన మరుక్షణం ఆ గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. నిట్టూర్చాడు.
పది నిమిషాలు గడిచింది. అతని అసిస్టెంట్ తలుపు తట్టి లోనికి వచ్చాడు. "సర్! ఇంజన్ పాడయింది. రైలు కదలటం లేదు." అని చెప్పాడు.
"వాట్?" అని లేచాడు స్టే.మా. గబ గబా ఇంజన్ దగ్గరకు పోయాడు. "వాట్స్ ద ప్రాబ్లం?" అని డ్రైవర్లను అడిగాడు. తెలియటం లేదన్నారు వారు.
"ట్రయగైన్. టేకవే ద ట్రైన్ వాటెవా మే బీ ద కండిషనాఫ్ ద ఇంజన్"
ఆ మాట చెప్పాల్సివస్తే చెప్పాల్సింది ఇంజనీరే కాని, అతడు కాదు. ఆ మాట అన్నందుకు స్టే. మా.ని అరెస్టు చేసి కోర్టులో విచారించవచ్చు.
"నో నో" అన్నాడు ఇంజనీర్. "ఆఫీసర్! ఇంజన్ మారుద్దాం. ట్రైన్ హాజ్ టు రన్ ఎ వెరీ లాంంగ్ డిస్టెన్స్. ఇ'ట్ల్ బీ డేంజరస్ ఇఫ్ ఇట్స్ రాంగ్ విద్దిసింజన్".
"ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్"
మరొక ఇంజన్ వచ్చింది. పాత ఇంజన్‌ను పక్కకు లాగేశారు. కొత్త ఇంజన్‌ను తగిలించారు. అప్పటికే అర్ధగంట ఆలస్యమైంది. స్టేషన్ మాస్టర్ పచ్చ జెండా ఊపాడు. గార్డ్ కూడా విజిలేసి జెండా ఊపాడు. ప్లాట్‌ఫాం మీద జనాలు వెనక్కు జరిగి నిలుచున్నారు. రైలు కూత వేసింది. ఇంజన్ తెల్లని ఆవిర్లు చిమ్మింది. కాని, మళ్లీ అదే సమస్య వచ్చింది! ఇంజన్ కదలలేదు. డ్రైవర్లు గట్టి ప్రయత్నం చేశారు. ఇంజన్ ఒక్క లిప్తకాలం పైకి లేచి మళ్లీ పట్టాల మీద కూర్చుంది. ఆ క్షణకాలంలో పిస్టన్ కు అనుసంధానించబడివున్న చక్రాలు గిరగిరగిర తిరిగాయి. కాని, మొత్తానికి రైలు మాత్రం కదలలేదు.
"వాట్ ద హెల్లీజ్ హ్యాపెనింగ్?" స్టేషన్ మాస్టర్ కోపంగా అరిచాడు.
"డో'న్నో ఆఫీసర్!" అన్నాడు ఇంజనీర్. రైలు పెట్టెలకు అనుసంధానించేంతవరకు చక్కగా నడిచివచ్చిన ఇంజన్ హఠాత్తుగా ఇప్పుడెందుకు మొరాయిస్తోందో అతడికి అర్థం కావటంలేదు.
రైలుకు దూరం జరిగిన జనాలు మళ్లీ దగ్గరకు వచ్చారు. "దీజా ద మోస్ట్ ఇన్‌డిసిప్లిన్డ్ క్రౌడ్జాంద అర్త్! ఆస్క్ దెమ్ ఫస్ట్ టూ మూవవే ఫ్రం ద స్టేజ్షన్!" అని పెద్దగా గొంతెత్తి మళ్లీ అరిచాడు స్టే.మా.
జనాలెవరికీ అతడి అరుపులు పట్టలేదు. తమ ధోరణిలో తామున్నారు. ఇంతలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ తన పై ఆఫీసరు దగ్గరకు వచ్చాడు. "సర్! ట్రైన్‌లో సొరకాయల స్వామి ఉన్నారు. ఆయన శిష్యుడెవరో ఇంకా రాలేదట. అతడొచ్చేవరకు రైలు కదలదని శాసనం చేసి, తన చేతికర్రను రైలుకు నిలువుగా ఆనించి నొక్కిపట్టాడట! అందువల్ల రైలు కదలటం లేదని జనాలు అనుకుంటున్నారు" అని చెప్పాడు.
"యూ డర్టీ మైండ్! హవీజిట్ పాజిబుల్? డోం'టాక్ రబ్బిష్" అని కసురుకున్నాడు స్టే. మా.
ఇంజనీరు మరికాసేపు ప్రయత్నం చేసి చేతులెత్తేశాడు. " ఆఫీసర్! ఇంజన్‌లో ఎక్కడా ఏలోపమూ కనబడటం లేదు. చక్రాలు చక్కగా తిరగడం మీరు కూడా చూశారు. అయినా ఇంజన్ కదలటం లేదు. ఇంజన్ లాగలేనంత భారం వెనుకనున్న పెట్టెల్లో ఉండి ఉండాలి. అదే నిజమైన పక్షంలో ఎన్ని ఇంజన్లు మార్చినా ఇదే సమస్య మళ్లీ మళ్లీ వస్తుంది" అని చెప్పాడు.
స్టేషన్ మాస్టర్ నమ్మలేకపోయాడు. నాలుగువేల హార్స్‌పవర్‌తో కూడిన ఇంజన్ కేవలం మనుషులు మాత్రమే ఎక్కిన పది పెట్టెలను లాగలేకపోవటమా? పెట్టెలనుండి విడదీసి ఇంజన్ మాత్రం నడుస్తుందో లేదో నడిపిచూడమన్నాడు. అలాగే చేశారు. ఇంజన్ చక్కగా నడిచింది. స్టే. మా. దిగ్భ్రాంతి చెందాడు. ఒక్కసారి తన అసిస్టెంట్‌వైపు తేరిపారచూశాడు.
"వేరీజ్ ద ష్వామీ?"
తలకు రెండింతలున్న తలపాగా. తెల్లటి గడ్డం, మీసాలు. నుదుటన, గుండెల మీద, చేతులమీద వెడల్పాటి వైష్ణవనామాలు. భుజం మీద పాత బొంత, మొలకు ఓ గోచి గుడ్డ, చంకలో ఒక సొరకాయ డొప్ప, కన్నుల్లోనూ పెదవుల్లోనూ చల్లని మందహాసం. ప్రశాంతమైన వదనం. బక్కచిక్కి ఉన్నప్పటికీ, అమితమైన తేజస్సుతో వెలిగిపోతూ, రైలులో కూర్చుని, చేతిలో కఱ్ఱను నిలువుగా ఆనించి పట్టుకుని, జనాలతో మాట్లాడుతున్నాడు సొరకాయల స్వామి.
స్టేషన్‌మాస్టర్ రాగానే జనాలు ఆయనకు దారి ఇచ్చారు. స్వామికి అతడు భారతీయుల పద్ధతిలో నమస్కారం చేశాడు.
స్వామి చిరునవ్వు నవ్వాడు. "రా! రా! నీ కోసమే ఎదురు చూస్తున్నా" అన్నాడు. స్వామితో కోపంగా ఏమేమో మాట్లాడాలనుకున్న అతడు మళ్లీ నమస్కారం మాత్రం పెట్టి ఊరుకున్నాడు. "మరేం భయం లేదు, నీ చింతలన్నీ తీరిపోతాయి" అన్నాడు స్వామి. ఆ మాటలను ఎవరో అనువదించి చెప్పారు అతనికి. అతడు తలాడించి మళ్లీ నమస్కారం చేశాడు.
"ఏదో అడగాలని వచ్చావు. ఏమిటది?"
"ష్వామిజీ, ఆలార్ సేయింగ్ దట్ యు హావ్ స్టాప్డ్ ద ట్రైన్ ఫ్రం మూవింగ్. ప్లీజ్ రిలీవిట్ ష్వామిజీ".
"రైలును నేనే ఆపానని నిజంగా నువ్వనుకుంటున్నావా?"
"యెస్, ష్వామిజీ!"
సొరకాయలస్వామి చిరునవ్వు నవ్వాడు. నిలువుగా పట్టుకున్న కఱ్ఱను అడ్డంగా తిప్పి, సీటు మీద పెట్టాడు. "ఇప్పుడు కదులుతుంది పో!" అన్నాడు.
"థాంక్యూ ష్వామిజీ! పెర్మిట్ మి టు డు మై డ్యూటీ!" అని స్టేషన్‌మాస్టర్ మరొకసారి నమస్కారం చేసి గబ గబ రైలు దిగి ఇంజన్ దగ్గరకు వెళ్లాడు. జండా వూపి రైలును తీసుకుపొమ్మని డ్రైవర్లతో చెప్పాడు. గార్డ్ కూడా జండా వూపాడు. రైలు కదిలింది. అందరూ ఆశ్చర్యపోయారు. రైల్లో వెళ్లిపోతున్న స్వామికి మరోమారు నమస్కరించాడు స్టేషన్‌మాస్టర్.
రైలు ప్లాట్‌ఫాం వీడేదాకా ఆగి, తన అసిస్టెంటుతో, "హౌ అండ్ వై ద ష్వామీజీ ఫైనలీ అలౌడ్ ద ట్రైన్ టు మూవ్ వితౌట్ హిజ్ డిజైపుల్? "మరి ష్వామి తన శిష్యుడు రాకుండానే రైలును ఎలా, ఎందుకు కదలనిచ్చాడు?" అని అడిగాడు స్టే.మా.
"మీరే ఆ అజ్ఞాత శిష్యుడై ఉంటారు సర్. మీరు వచ్చిన తరువాతనేగా స్వామీజీ కఱ్ఱను తీసి పక్కన పెట్టారు?" అన్నాడు అసిస్టెంట్.
స్టేషన్‌మాస్టర్ దిగ్భ్రాంతి చెందాడు. తల తిప్పి చూశాడు. రైలు దూరంగా కూతవేస్తూ, పొగను ఎగజిమ్ముతూ పోతూవుంది. మరోసారి భక్తితో ఆ రైలువైపు తలవంచి నమస్కరించాడు.