Saturday, 20 March 2021

బాఘ్ మార్ హరిసింగ్ నల్వా (2)

 


పెషావర్ నివాసి అయిన సర్దార్ కమాల్ ఖాన్ కు అరవై యేండ్లు. నలుగురు బేగంలు. అందులో జరీనా అనే బేగంకి లేక లేక పుట్టిన కూతురు నూర్ భాను. చక్కటి చుక్క. కమాల్ ఖాన్ కు ఆమె తప్ప వేరే సంతానం లేదు. ఆమె నలుగురు తల్లుల ముద్దుల బిడ్డ. అందు చేత అల్లారుముద్దుగా పెరిగింది. పదహారేండ్ల యువతి. పెషావర్ లో ఎందరో అమీర్లు నూర్ ను తమకు ఇచ్చి చేయవలసిందిగా కమాల్ ఖాన్ ను కోరుతున్నారు. కాబూల్, కెట్టా, కాందహార్, సమర్ ఖండ్, హీరత్ మొదలైన దూరప్రాంతాలకు చెందినవారు కూడా ఆమెను తమకిచ్చి పెండ్లి చేయమని కమాల్ ఖాన్ ను అడుగుతూ కబుర్లు పంపుతున్నారు. అయినా, కమాల్ ఖాన్ ఆమెకు వారికంటె గొప్ప సంబంధం చేయాలని అందరినీ తిరస్కరిస్తూ వస్తున్నాడు. కాని, ఈరోజు దోస్త్ మహమ్మద్ ఖాన్ మాటలు వినగానే అతడికి తన కూతురు నూర్ ను ఉపయోగించి హరిసింగ్ నల్వాను కడతేర్చాలని భావించాడు. అందుకు అతడు కూడా సమ్మతించి నజరానాలు ఇవ్వడంతో అతడి సంతోషానికి మేర లేదు.

కమాల్ ఖాన్ తెచ్చిన నజరానాలు చూడగానే అతడి భార్యలు ఎంతగానో సంతోషించారు. అయితే అవి ఎందుకు ఇవ్వబడ్డాయో తెలియగానే వారికి కమాల్ ఖాన్ మీద కోపం ముంచుకు వచ్చింది. అతడి మీద కేకలు వేశారు.
“దుర్మార్గుడా, అభం శుభం ఎరుగని అమాయికురాలైన కూతురును నీ నీచమైన రాజకీయాలకోసం బలిపశువును చేస్తావా? అన్నారు.
అటువంటి పనికోసం వినియోగించేందుకు నలుగురిలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. ఇలాంటి పని చేయడానికి మా కూతురే దొరికిందా? దోస్త్ మహమ్మద్ ఖానుకు ఇప్పటికే ఇరవై మంది బీవీలు ఉన్నారు. ఇప్పటికే పదహారుమంది కూతుర్లు ఉన్నారు. ఇంకా ఎంతమందిని చేసుకుంటాడో, ఇంకా ఎంతమందిని కంటాడో? వారిలో ఒకరిని హరిసింగ్ కు ఇచ్చి తన రాజకార్యం జరిపించుకోరాదా?” అని దుమ్మెత్తిపోశారు.
అయితే కమాల్ ఖాన్ మాత్రం పట్టు వదలలేదు. “నా మాట వినండి. హరిసింగ్ సామాన్యుడు కాదు. సిఖ్ సామ్రాజ్యానికి పాదుషా రంజిత్ సింగ్ అయితే అతడి కుడిభుజం హరిసింగ్. ప్రస్తుతం అతడు మన పెషావర్ గవర్నరు కూడా. అతడికి నిఖా చేసుకుంటే మన కూతురు నూర్ భాను పెషావర్ రాణి అవుతుంది. దాని వలన మనకు ఎంతో ప్రతిష్ఠ చేకూరుతుంది. హరిసింగ్ కు అత్తామామలుగా మన పేరు ప్రఖ్యాతులు పెషావర్ అంతా మారు మ్రోగుతాయి” అన్నాడు.
“హరిసింగ్ కు ఇప్పటికే పెండ్లి అయిందని తెలియదా నీకు?”
“అయితే మాత్రం ఏమిటి? మన నూర్ అందచందాలకు అతడు తప్పక బానిస అయిపోతాడు. మొదటి రాణిని పక్కకు తోసి మన కూతురే అసలైన రాణి అవుతుంది.”
“అయినా, నువు చెప్పిన పథకం ప్రకారం ఆ వైభోగం అదెంతకాలముంటుంది? ఏదో ఒకరోజు హరిసింగ్ ను కపటంతో చంపాలంటున్నావు. అలా చేశాక దాని బ్రతుకు ఏమి కావాలి?”
“ఏమౌతుంది? హరిసింగ్ చస్తే పెషావర్ మనదే. మనం హిందువులం కాదు. హిందూ స్త్రీలతో స్నేహం చేసీ చేసీ వారిలాగానే మీరు కూడా ఆలోచిస్తున్నారు. మన ఆచారంలో భర్త చనిపోతే ఆ స్త్రీ మరలా పెళ్లి చేసుకోవచ్చు. అతడు కూడా చస్తే మరలా పెళ్లి చేసుకోవచ్చు. అలా ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. మన నూర్ ను నిఖా చేసుకోవాలంటే ఎవరైనా ఎగిరి గంతేసి మరీ వస్తారు. ఆ విషయం గూర్చి అట్టే బాధ పడకండి” అన్నాడు కమాల్ ఖాన్.
“ఇలాంటి మాటలు పలకడానికి నీకు సిగ్గుగా లేదా?”
కమాల్ ఖాన్ వారి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయాడు.
“హరిసింగ్ కు ఇప్పుడు నలబై నాలుగేండ్లు. మన నూర్ భానుకు ఇప్పుడు పదహారేండ్లు మాత్రమే. తెలుసా? అటువంటి ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తారా?”
“అదో పెద్ద విషయమా? మా దోస్త్ మహమ్మద్ ఖాన్ కు నలబై రెండు ఏండ్లు. అతడి ఇరవయ్యో బేగం వయసు కేవలం పద్నాలుగు ఏండ్లు మాత్రమే తెలుసా? అంతే కాదు, అతడి బేగంలలో మరో ఐదుగురి వయసు ఇంకా పద్దెనిమిది కూడా నిండలేదు. అది కూడా తెలుసా?”
“ఒరే మూర్ఖుడా, వాడొక కామపిశాచి. ఆ పిల్లల ఖర్మ కొద్దీ దోస్త్ మహమ్మద్ ఖాన్ చూపు వారిమీద పడింది. అధికారమదంతో వారి తల్లిదండ్రులను బలాత్కారంగా ఒప్పించి వారిని నిఖా చేసుకున్నాడు. మన కూతురును కూడా ముసలాడికిచ్చి పెళ్లి చేయవలసిన ఖర్మ ఏమి పట్టింది?"
“హరిసింగ్ ను ఎప్పుడైనా మీరు చూశారా? ఎంతటి మహావీరుడు అతడు! అతడు బల్లెం గాని కత్తి కాని పట్టి యుద్ధానికి నిలిచాడంటే ఇరవైయేండ్ల పడుచు పోరగాళ్లు ఓ పాతికమంది అతని చుట్టుముట్టి యుద్ధానికి దిగినా అతడికి గోరును కూడా తాకలేరు. పైగా ఆ పాతికమంది బ్రతికి బట్టకట్టితే అది నిజంగా గొప్ప విషయం!” అన్నాడు కమాల్ ఖాన్.
ఇలా బేగంలు ఎంతగా కాదంటున్నా కమాల్ ఖాన్ మాత్రం తన పట్టు వీడలేదు. అంతా సక్రమంగా జరిగితే హరిసింగ్ తమకు అల్లుడౌతాడు. ఆ తరువాత అతడిని చంపగలిగితే పెషావర్ కు తననే పాలకునిగా చేస్తానని మహమ్మద్ ఖాన్ మాట ఇచ్చాడు. తన కూతురుకు కూడా మళ్లీ పెళ్లి చేయడం పెద్ద విషయమేమీ కాదు!
అయినా, బేగంలు ఎంతకూ ఒప్పుకోకుండా విసిగిస్తూ ఉండటంతో అతడు చివరకు తన కపటపు మాటలు మొదలు పెట్టాడు.
“సరే, విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి అసలు విషయం చెబుతాను వినండి! దోస్త్ మహమ్మద్ ఖాన్ కు ఇప్పటికే ఇరవై ముగ్గురు బేగంలు ఉన్నారు. అతడి కన్ను మన కూతురు మీద పడింది. ఆమెను తనకు ఇరవై నాలుగో బేగంగా ఇవ్వమని నన్ను అడిగాడు. అతడికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. కాని, అలా నేను తిరస్కరిస్తే నన్ను చంపేసి అయినా మన కూతురును తన స్వాధీనం చేసుకుంటాడు. అందువల్ల నేను తెలివిగా ఇలా హరిసింగ్ పేరు చెప్పి, నా కూతురు చేతనే హరిసింగును చంపిస్తానని చెప్పడం వల్ల ప్రస్తుతానికి ఊరుకున్నాడు. నేను మన కూతురును హరిసింగ్ కు ఇచ్చి నిఖా చేయకుంటే వాడే మన కూతురును ఎత్తుకుపోతాడు. హరిసింగ్ కు కాకుండా వేరెవరికి ఇచ్చి చేసినా సరే, అతడిని చంపి మరీ ఎత్తుకుపోతాడు. అర్థమైందా? నాకు మాత్రం నా కూతురు మీద ప్రేమ లేదనుకున్నారా?”
ఆ మాటలు బ్రహ్మాస్త్రంలా పని చేశాయి. కమాల్ ఖాన్ బేగంలందరూ నిశ్చేష్టులయ్యారు. దోస్త్ మహమ్మద్ ఖాన్ ఎంతటి క్రూరుడో దేశానికంతటికీ తెలుసు. వాడి జనానాకు పోవడం కన్నా చావడం మేలు. తమ ముద్దుల కూతురుకు అటువంటి గతి పట్టకూడదు. ఆమెను కాపాడుకోవాలంటే హరిసింగ్ కన్నా వేరొక సమర్థుడు ఎవరూ లేరు! కమాల్ ఖాన్ చెప్పిన దాంట్లో అతిశయోక్తులు ఏమీ లేవు.
“కానీ, మరి నిఖా జరిగిన తరువాత హరిసింగ్ ను కపటంతో చంపాలంటున్నావు? మరి అవేం మాటలు?”
“ఎందుకంటే, నాకు ఆడవారి మీద అసలు నమ్మకమే లేదు. నిజంగా ఇదీ అసలు విషయం అని చెప్పేస్తే ఆడవారైన మీ నోట ఈ రహస్యం దాగుతుందనే నమ్మకం నాకు లేదు. మీనుంచి మీ స్నేహితురాళ్లకు, వారినుంచి వారి స్నేహితురాళ్లకు వెడుతుంది. నెమ్మదిగా ఈ విషయం దోస్త్ మహమ్మద్ ఖాన్ వరకు చేరిపోతుంది. అప్పుడు మనలో ఎవరమూ బ్రతికి బట్టకట్టలేము. హరిసింగ్ తో మన కూతురు పెండ్లి అయ్యేంతవరకూ మాత్రమే మనం ప్రమాదంలో ఉంటాం. పెండ్లి జరిగిన తరువాత హరిసింగ్ అత్తమామలుగా మహారాణిగారి తల్లిదండ్రులుగా మనకు మంచి రక్షణ ఉంటుంది.”
అప్పటికి బేగంలందరికీ కమాల్ ఖాన్ మీద విశ్వాసం కుదిరింది. ప్రస్తుత పరిస్థితులలో వారికి వేరే గత్యంతరం కూడా లేదు కాబట్టి, నూర్ భానును హరిసింగ్ కు ఇవ్వవచ్చునని చివరకు అంగీకరించారు.
తన మాటలు అంత చక్కగా పనిచేసినందుకు కమాల్ ఖాన్ తనను తానే మనసులో అభినందించుకున్నాడు.
కమాల్ ఖాన్ ఒక పథకం ప్రకారం తన కూతురైన నూర్ భానుకు ఆమె స్నేహితుల ద్వారా హరిసింగ్ నల్వా వీరత్వం గూర్చి గొప్పతనం గూర్చి కథలు కథలుగా చెప్పించడం మొదలు పెట్టాడు. పెషావర్ లోనూ, ఇతరత్ర కూడా ప్రజలు అతనిని ఎంతగా అభిమానిస్తారో ముందే తెలిసి ఉన్న పదహారేండ్ల బాలిక నూర్ కు సహజంగానే హరిసింగ్ పట్ల ఆకర్షణ కలిగింది. పైగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా తనను అతడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారని తెలియగానే ఆ ఆకర్షణ ప్రేమగా ఆరాధనగా మారింది.
ఆ విషయాన్ని ఆమె స్నేహితుల ద్వారా తెలుసుకుని సంతోషించిన కమాల్ ఖాన్ ఒకరోజు హరిసింగ్ నల్వా దర్శనం కోరి అతని చెంతకు వెళ్లి తన కూతురు నూర్ ను వివాహం చేసుకొనవలసిందిగా కోరాడు.
అతడు మునుపు పఠాన్ల సైన్యంలో సర్దారుగా పని చేశాడని, అయితే ఇపుడు క్రూరమైన పనులు మానివేసి బుద్ధిగా బ్రతుకుతున్నాడని హరిసింగ్ కు తెలుసు. అందువలన అతడిని సాదరంగా ఆహ్వానించినప్పటికీ, అతడి పెండ్లి ప్రస్తావనను మృదువుగా తిరస్కరించాడు. అతడు కోరితే వారిలోనే ఒక గొప్ప సంబంధాన్ని తాను ఆమెకోసం చూసి పెడతానని చెప్పాడు.
తన పథకం నెరవేరనందుకు కమాల్ ఖాన్ కు ఆశాభంగం కలిగింది. తన కలలు కల్లలౌతాయేమో అని నిరాశతో క్రుంగిపోయాడు. అయితే అతడికి ఇంకా ఆశ చావలేదు. తన కూతురు జగదేకసుందరి. ఆమెను చూస్తే హరిసింగ్ తప్పక మనసు మార్చుకుంటాడని, ఆమెతో పెండ్లికి అంగీకరిస్తాడని అతడికి గట్టి నమ్మకం.
అందువల్ల అతడు ఒకరోజు అతడు ఆమె తల్లుల ద్వారానే తన కూతురును నేరుగా అడిగించాడు. “బేటీ, నీకు హరిసింగ్ అంటే ఇష్టమేనా? అతడిని పెండ్లి చేసుకుంటావా?”
ఆమె సిగ్గుతో తల దించుకుంది. అంతకంటె అంగీకారం ఏముంటుంది?
అపుడు కమాల్ ఖాన్ తాను హరిసింగ్ ను ఆ విషయమై అడిగినట్లు, కాని అతడు తిరస్కరించినట్లు ఆమెకు నిజం చెప్పేశాడు. నూర్ భానుకు ఆశాభంగమైంది. ఆమె ముఖం వెల వెల బోయింది. కళ తప్పిపోయింది. ఆమె హృదయం ముక్కలైంది. కన్నీళ్లను అదిమి పెట్టుకుంటూ, తల దించుకుని మరలా ఎత్తనే లేదు.
అపుడు కమాల్ ఖాన్ ఆమెను ఓదారుస్తూ చెప్పాడు – “బేటీ, మరేం దిగులు పడకు, హరిసింగ్ ప్రతిరోజూ ఉదయం షాహిభాగ్ ఉద్యానవనానికి వస్తాడు. ఆ సమయంలో నువ్వే నేరుగా వెళ్లి అడుగు. నిన్ను చూస్తే అతడు కాదనలేడని నా అభిప్రాయం” అని చెప్పాడు.
తండ్రీకూతుర్ల మధ్యలో జరగరాని సంభాషణ అది. కాని, కమాల్ ఖాన్ దురాశ అతడితో అలా పలికించింది. తల్లులందరూ కూడా దోస్త్ మహమ్మద్ ఖాన్ భయంతో అతడి మాటలను సమర్థించారు.
నూర్ భాను కూడా ఒక వైపు సంకోచిస్తూనే, హరిసింగ్ నల్వాపై తాను పెంచుకున్న ప్రేమ కొద్దీ సరేనంది.
తనకున్న పలుకుబడినంతా ఉపయోగించి, హరిసింగ్ ఉదయమే షాహిబాగ్ ఉద్యానవనానికి వచ్చే సమయంలో తన కూతురుకు కూడా అక్కడ ఎలా ప్రవేశం కల్పించాలా అని కమాల్ ఖాన్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
( ఇది కథలో రెండవ భాగం. మిగిలిన కథ మూడవభాగంలో)

Friday, 19 March 2021

బాఘ్ మార్ హరిసింగ్ నల్వా (1)



“హరిసింగ్ నల్వాను చంపిన జిహాదీకి పదివేల దీనారాలు బహుమతి ఇస్తాను” అని బిగ్గరగా గొంతెత్తి ప్రకటించాడు ఆఫ్ఘన్ పాదుషా దోస్త్ మహమ్మద్ ఖాన్.

ఆఫ్ఘన్ సర్దార్లందరికీ ఆశ పుట్టింది. కాని, అది దాదాపు అసాధ్యం! కాబట్టి ఎవ్వరూ కూడా మేము ఆ పని చేస్తాము అని అంగీకరించేందుకు కూడా సాహసించలేదు.
ఎండుటాకులను అగ్ని దహించినట్టుగా మాన్ షేరా లోయలో వేలాది ముజాహిదీన్ల సైన్యాన్ని మట్టుబెట్టినప్పటి అతడి అరివీరభయంకరరూపం ఇంకా వారి కండ్లలో కదలాడుతూనే ఉంది.
మెటికోట్ పర్వతసానువుల్లో తమ నాయకుడైన సయ్యద్ అహమ్మద్ తో తలపడి తమ కండ్లముందే అతడి తలను తెగవేసిన దృశ్యం వారిలో ఇంకా ఎవ్వరూ మరచిపోలేదు.
పెషావర్ లో తమ సైన్యాలను ఊచకోత కోసిన అతడి కత్తి గుర్తుకువస్తుంటే వారికి గుండెలు గుబగుబలాడుతున్నాయి.
ఇంతకూ వారందరి గుండెల్లోనూ అంతగా గుబులు పుట్టించిన హరిసింగ్ నల్వా ఎవరు?
)))(((
"బిచిత్ర నాటక్" అనేది సిక్ఖు గురు గోవింద సింహులవారి ఆత్మకథ.
అందులో ఆయన పంజాబులో ఖత్రీలు అని పిలువబడే హైందవక్షత్రియజాతిని గూర్చి ప్రస్తావించారు. వారందరూ గోవిందసింహులవారి కాలానికి వర్తకులుగాను, లేఖకులుగాను, గణకులుగాను, పట్టువస్త్రాలు నేసేవారిగాను స్థిరపడి ఉన్నారు.
ఖత్రీలలోనే ఒక తెగ బేడీలు. (బిషన్ సింగ్ బేడీ గుర్తున్నాడా?) వారు తమ పూర్వీకుడు రాముని కుమారుడైన కుశుడని చెప్పుకుంటారు. వారు క్షత్రియులైనప్పటికీ, కేవలం ఆయుధవిద్యలతో సంతృప్తి చెందకుండా బ్రాహ్మణులతో పోటీ పడి వారణాసికి పోయి చక్కగా వేదాలు నేర్చుకున్నారని, అందుకే వారిని వేది (వేదాభ్యాసం చేసినవారు) అని పిలిచేవారని, ఆ వేది అనే పదమే కాలక్రమేణ బేడి అయిందని అంటారు.
అలాగే పంజాబు హైందవక్షత్రియులలో మరొక తెగవారైన శోధిలు తమ పూర్వికుడు సీతారాముల కుమారుడైన లవుడని అంటారు. వారు గొప్ప ఆత్మశోధన (తపస్సు) చేశారు కాబట్టి శోధి అని పిలువబడ్డారట. సిక్ఖు గురు రామదాస సింహునినుంచి ఏడుగురు గురువులు అందరూ ఈ శోధిలే.
)))(((
1791వ సంవత్సరంలో, అప్పటి పంజాబు రాజధాని అయిన గుజ్రన్ వాలా పట్టణంలో, ఖత్రికుటుంబంలో ధరమ్ కౌర్, గురుదయాళ్ సింగ్ ఉప్పల్ అనే దంపతులకు హరి అనే పుత్రుడు కలిగాడు. ఏడవ ఏటనే అతడి తండ్రి చనిపోయాడు. తన అతడిని తల్లి గొప్ప వీరునిగా చేయాలని సంకల్పించి అలాగే పెంచింది.
హరి తన పదవ యేటనే అమృత్ సంచార్ అనే సిక్కు సంస్కారాన్ని పొందాడు. అప్పటినుండి హరిసింగ్ అయ్యాడు. పన్నెండవ యేటకే ఆయుధవిద్యలలోను, గుఱ్ఱపుస్వారీలోనూ సాటిలేని మేటిగా పేరుగాంచాడు.
1804లో, పద్నాల్గవయేట అతడు అప్పటి పంజాబ్ రాజధాని అయిన లాహోర్ కు వెళ్లి మహారాజా రంజిత్ సింగును కలవడం తటస్థించింది. ఆ బాలుని తేజస్సుకు, వినయానికి రంజిత్ సింగ్ ముగ్ధుడైపోయాడు.
మహారాజుగారి పూర్వికులైన మహాసింగ్ చరత్ సింగ్ లో చెంత తన తండ్రితాతలు పని చేశారని ఆ బాలుడు విన్నవించుకున్న తరువాత రంజిత్ సింగ్ అభిమానం రెట్టింపైంది.
ఆ బాలుని యుద్ధవిద్యాప్రదర్శన చూసిన తరువాత అతడిని తన పుత్రసమానుడిగా భావించి వాత్సల్యం చూపకుండా ఉండలేకపోయాడు. ఆ బాలుడిని తన అంగరక్షకునిగా నియమించుకున్నాడు.
అతడు చేసిన పని ఎంతో మంచిదయింది. అదే సంవత్సరంలో (1804) ఒకనాడు రంజిత్ సింగ్ అడవిలో వేటాడుతూ ఉండగా ఒక పెద్ద పులి అతడిపై దాడి చేసింది. కాని రెప్పపాటులో హరిసింగ్ ఆ పులిమీద పడ్డాడు. రంజిత్ సింగ్ క్షేమంగా బయటపడ్డాడు. కాని, పులి హరిసింగ్ ను తన నోట ఇరికించుకుంది. అతడి ఆయుధం పెనుగులాటలో ఎక్కడో జారిపోయింది. కాని, హరిసింగ్ నిర్భయంగా తన పోరాటం సాగించాడు. పులి కోరలనుండి తాను తప్పించుకొనడమే కాక, ఆ పులి నోటిని చీల్చి చంపేశాడు.
అతడి అసమానబలశౌర్యాలను ప్రత్యక్షంగా చూసిన రంజిత్ సింగ్ ఆనందాశ్చర్యాలతో అతడిని నల్వా అని పిలిచాడట. (అంటే పంజాలవంటి చేతులు కలిగిన మనిషి అని అర్థమట) అప్పటినుండి అతడిని అందరూ బాఘ్ మార్ హరిసింగ్ నల్వా అని ఎంతో అభిమానంతో పిలిచేవారు.
ఈ ధైర్యసాహసాలను మెచ్చి రంజిత్ సింగ్ అతడిని 800 మంది అశ్వికులు, 800 మంది సైనికులు కలిగిన సైన్యదళానికి సర్దారుగా నియమించాడు. అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన ఎందోమంది సర్దారులు కూడా ఒక బాలుడు సర్దారు కావడమా అని ఎంతమాత్రం అసూయ పడకుండా హర్షించి, తమతో సమానుడని మనఃస్ఫూర్తిగా భావించి అతడిని చేరదీశారు. వారి ఆదరానికి పాత్రుడైన హరిసింగ్ క్రమంగా కాకలు తీరిన యోధునిగా తయారైనాడు.
క్రమంగా వయసుతోపాటు అతని శౌర్యపరాక్రమాలు వర్ధిల్లాయి. గురుగోవిందసింహుని ఆశయసాధనకు కట్టుబడిన రాజా రంజిత్ సింగ్ దేశంలో ప్రజలు ఎక్కడ పీడనకు గురైనా వారిని రక్షించేందుకు గాను తన సైన్యాన్ని అక్కడకు పంపేవాడు. అరివీరభయంకరులైన అతని సర్దారులు అక్కడకు వెళ్లి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, శాంతిభద్రతలను నెలకొల్పేవారు. సుస్థిరమైన పరిపాలనా వ్యవస్థను పాదు కొలిపేవారు.
అటువంటి రాజా రంజిత్ సింగ్ తరపున హరిసింగ్ నల్వా గెలిచిన యుధ్ధాలకు లెక్కే లేదు. వాయవ్యభారతంలో అతడి వీరవిహారానికి ఎదురు లేకుండా పోయింది. బర్నాలా యుద్ధం, కసూర్ యుద్ధం, సియాల్ కోట్ యుద్ధం, జమ్మూ యుద్ధం, అతోక్ యుద్ధం, మహమూద్ కోట్ యుద్ధం, ముల్తాన్ యుద్ధం, సోపియన్ యుద్ధం, మంగళ్ యుద్ధం, మంకేరా యుద్ధం, నౌషేరా యుద్ధం, సిరికోట్ యుద్ధం, సైదూ యుద్ధం, బాలాకోట్ యుద్ధం... ఇలా...
ఆ సమయంలో ఆఫ్ఘనిస్థాన్ లో ఇస్లామేతరధర్మవ్యతిరేకి అయిన దోస్త్ మహమ్మద్ ఖాన్ తక్కిన పోటీదారులందరినీ హతమార్చి తనను తాను పాదుషాగా ప్రకటించుకున్నాడు. అతడికి రంజిత్ సింగ్ విజయపరంపర నచ్చలేదు. అయితే రంజిత్ సింగ్ మీదకు దండెత్తి అతనిని ఓడించగలననే ధైర్యం కూడా అతడికి లేదు. అతడే తనపై యుద్ధానికి వచ్చేలా చేసి, జిహాద్ పేరుతో మిగిలిన ఇస్లాం రాజ్యాలనుండి సానుభూతిని, సైన్యసహకారాన్ని పొంది అతడిని ఓడించాలని పన్నాగం పన్నాడు.
అయితే రంజిత్ సింగ్ నిష్కారణంగా అతడిమీదకు ఎందుకు దండయాత్ర చేస్తాడు? అందుకని అతడికి ఆగ్రహం కలిగించాలని అతడు పెషావర్ లోని ఇస్లామేతరధర్మీయులను చిత్రహింసలకు గురి చేయసాగాడు. వారి ఆక్రందనలు, రక్షించండి అనే విన్నపాలు రంజిత్ సింగ్ కు చేరాయి.
వెంటనే పెషావర్ ను దోస్త్ మహమ్మద్ ఖాన్ నుండి స్వాధీనం చేసుకొమ్మని అతడు హరిసింగ్ నల్వాను ఆదేశించాడు. హరిసింగ్ అంతు చూడాలనుకున్న దోస్త్ మహమ్మద్ ఖాన్ చివరకు అతడి పరాక్రమానికి వ్యూహాలకు దిగ్భ్రమ చెంది పెషావర్ ను విడిచి కాబూల్ కు పారిపోయాడు. హరిసింగ్ సునాయాసంగా పెషావర్ ను స్వాధీనం చేసుకున్నాడు.
అంతకు మునుపు తన తరపున కాశ్మీర్ కు, తరువాత హజారాకు గవర్నరుగా చక్కని పరిపాలన అందిచిన హరిసింగ్ ను రాజా రంజిత్ సింగ్ పెషావర్ కు గవర్నరుగా నియమించాడు.
)))(((
ఇదీ జరిగిన కథ. దోస్త్ మహమ్మద్ ఖాన్ కు ఈ పరాభవం కంటిమీద కునుకు పట్టనివ్వలేదు. హరిసింగ్ నల్వా పరాక్రమం గురించి అతడు అంతకు ముందు కేవలం విని ఉన్నాడు. పెషావర్ యుద్ధంలో ప్రత్యక్షంగా చవి చూశాడు. తాను విన్నదాని కంటె అతడు మరింత చండప్రచండుడని అతడికి అర్థమైంది. అతడిని నేరుగా యుద్ధంలో గెలవడం అసాధ్యమని భావించాడు. అందుకే, హరిసింగ్ ను చంపిన జిహాదీకి పదివేల దినారాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. అయితే ఏ ఒక్కరూ ధైర్యం చేసి, ముందుకు రాలేదు. ఏం చేయాలో తెలియని మహమ్మద్ ఖాన్ నీరుగారిపోయాడు.
అయితే ఆ రోజు రాత్రి ఒక సర్దార్ మహమ్మద్ ఖాన్ ను రహస్యంగా కలుసుకున్నాడు.
“హుజూర్, యుద్ధంలో హరిసింగ్ ను గెలవడం సాధ్యం కాదు. అందువలన మరొక ఉపాయం ఆలోచించాను" అన్నాడు.
“ఏమిటది?”
“హుజూర్, మహబ్బత్ జిహాద్ ద్వారా హరిసింగ్ ను చంపవచ్చు.”
“మహబ్బత్ జిహాదా? అదేమిటి?”
“హుజూర్, ప్రేమ వల విసురుదాం. దానికి లొంగనివాడు ఎవడూ ఉండడు. ఒక హూక్ సూరత్ నవ్ జవానీ లడికీని అతని మీదకు ఉసిగొలుపుదాం. అతడు ఆమెను వివాహమైనా ఆడతాడు లేదా చేరదీస్తాడు. అతడు ఆదమరచి ఉన్న సమయంలో ఆమె అతడిని ఖతం చేస్తుంది.”
“సెహబ్బాస్ సెహబ్బాస్, అలాగే చేద్దాం. కానీ, అటువంటి హూక్ సూరత్ నవ్ జవానీ లడికీ ఎక్కడ ఉంది?”
“హుజూర్, ఎవరో కాదు, స్వయంగా నా కూతురే ఉంది. పేరు నూర్.”
దోస్త్ మహమ్మద్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. “సర్దార్, ఇస్లాంకు నువు చేస్తున్న మేలు వల్ల నీకు తప్పకుండా జన్నత్ లభిస్తుంది అంటూ అతడిని పొగిడేశాడు.. అతడికి భారీగా నజరానాలు ఇప్పించి, పని మొదలు పెట్టమన్నాడు.
కనీవినీ ఎరుగనంత మొత్తంలో లభించిన నజరానాలకు మురిసిపోయిన సర్దార్ తన పని మొదలు పెట్టాడు.

Tuesday, 16 March 2021

"అమృత సంచార్"


ద్విజులకు ఉపనయనం అనే సంస్కారం ఒకటి ఉన్నట్లుగానే అమృతసంచార్ అనేది సిక్ఖులకు చెందిన ఒక సంస్కారం. ఆ సంస్కారం రావడానికి వెనుక ఒక వ్యథాభరితమూ గొప్ప ప్రేరణదాయకమూ అయిన చరిత్ర ఉంది.
మొదటినుండీ కూడా మొగల్ పాలకులు స్థానిక భారతీయుల పట్ల క్రూరమైన వైఖరిని అవలంబించారు. ఇస్లాం మతంలోనికి మారాలని తీవ్రంగా వత్తిడి చేసేవారు. వారు మారకుంటే తీవ్రమైన పన్నులను విధించేవారు. వారు తమ ప్రార్థనా మందిరాలకు పోవాలంటే వారు అధికంగా పన్నులు కట్టవలసి ఉండేది.
హిందువులు బలహీనమైన ప్రాంతాలలో హిందూ స్త్రీలను అపహరించి తమ దాసీలుగా మార్చుకునేవారు. హిందూ యువకులను బలవంతంగా నపుంసకులుగా మార్చి, బానిసలుగా దూరదేశాలలో అమ్మేసేవారు.
ఈ అత్యాచారాలను అరికట్టే మార్గం చూపమని భారతీయులు గురునానక్ శిష్యులను (శిష్య అనే పదమే సిక్ఖు అని పలుకబడింది) ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన మొగల్ దర్బారు సిక్ఖుగురువుల పట్ల వైరం వహించింది. తరతరాలపాటు వారిని చిత్రహింసలపాలు చేసింది. (సిక్ఖుగురువుల చరిత్రను చదివితే మనకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి.)
ఇలా శతాబ్దాల పాటు అహింస శాంతి అనుకుంటూ అన్ని రకాల చిత్రహింసలనూ అనుభవించిన హిందూ సమాజం, దెబ్బకు దెబ్బ తీయకుంటే మనం మనుగడ కొనసాగించడం కష్టం అని భావించింది.
మొగలులు హిందువులపై చేస్తున్న అత్యాచారాలను అరికట్టడానికి ఒక సైన్యాన్ని తయారు చేయవలసిందేనని గురు గోవిందుడు సంకల్పించాడు. 1699వ సంవత్సరంలో, వైశాఖి పండుగనాడు, ఆనందపూర్ సాహిబ్ లో ఖల్సా పంథ్ ను ప్రకటించాడు.
గురుగోవిందుడు వేలాది హిందువుల ముందు కత్తి దూసి, మొగలుల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు మొదటగా రక్తతర్పణం చేయగోరుతున్నాను. నరబలి ఇవ్వాలి. అందుకు సిద్ధపడే ఒక వ్యక్తి ముందుకు రండి అని ఎలుగెత్తి పిలిచాడు.
ఎవరూ సాహసించారు కారు. కాని, మూడుసార్లు అలా పిలిచేసరికి దయారామ్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. గురు గోవిందుడు, సంతోషించి అతడి భుజాలమీద చేతులు వేసి డేరా లోనికి తీసుకుపోయాడు. కాసేపటి తరువాత రక్తం కారుతున్న కత్తితో బయటకు వచ్చి, ఒకరి రక్తతర్పణం చాలలేదు, మరొకరు కావాలి అన్నాడు. అప్పుడు మరొక యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. గురు గోవిందుడు అతనిని కూడా డేరా లోనికి తీసుకుపోయి, మరలా బయటకు వచ్చి, ఇతడు రక్తతర్పణం చేసినా చాలలేదు. మరొకరు కావాలి అన్నాడు. అప్పుడు మరొక యువకుడు వచ్చాడు. అలా మొత్తం గురు గోవిందుడు ఐదు సార్లు పిలిచి ఐదుగురు యువకులను డేరా లోనికి తీసుకుపోయాడు. చివరకు గురు గోవిందునితో పాటు ఆ ఐదుగురు యువకులు కూడా డేరానుండి క్షేమంగా బయటకు వచ్చారు. వారిని డేరాలో గురుగోవిందుడు కత్తితో నరికి బలి ఇచ్చి ఉంటాడు అని భావిస్తూ ఉన్న ప్రజలందరూ వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు.
అపుడు గురు గోవిందుడు చిరునవ్వు నవ్వి, హిందువులలో నిస్స్వార్థంగా ఆత్మార్పణ చేయగలిగినవారుంటేనే హిందూసమాజానికి నిజంగా విముక్తి లభిస్తుంది. లేకుంటే కసాయివాని ఎదుట తలవంచి నిలబడే గొఱ్ఱెలలాగా యావత్ హిందూసమాజం నశించిపోవలసిందే. అందువల్ల, అటువంటి వీరులు అసలెవరైనా మనలో ఉన్నారా అని తెలులుకొనేందుకు ఇలా పరీక్షించాను.
ఇదుగో, సింహాలవంటి ఈ ఐదుగురు వీరయువకులు ముందుకు వచ్చారు. నేటినుండి వీరు సింహాలుగా (సింగ్ అనే పేరిట) పిలువబడతారు అని ప్రకటించాడు.
ఆ యువకుల పేర్లు (సింగ్ అనే బిరుదాన్ని చివర తగిలించుకున్న తరువాత) –
1 భాయి దయా సింగ్,
2 భాయి ముఖం సింగ్,
3 భాయి సాహిబ్ సింగ్,
4 భాయి ధరమ్ సింగ్,
5 భాయి హిమ్మత్ సింగ్
(వీరు గురు గోవిందునికి చాల ప్రియమైన వారు కాబట్టి, వారికి పాంచ్ ప్యారే అని వ్యవహారం.)



వీరందరూ తమ తమ అనుచరులతో పాటు పంచ కకారాలను ధరించి హిందువుల మీద అత్యాచారాలకు పూనుకునే మొగలాయీసైన్యాలను ఎదిరిస్తారు. వారి దౌర్జన్యాలను అరి కడతారు.
పంచ కకారాలంటే –
1 కేశ్ (కత్తిరింపబడని పొడుగాటి జుట్టు)
2 కంకత్ (జుట్టును పరిశుభ్రం చేసుకొనేందుకు తగిన చెక్క దువ్వెన)
3 కర లేదా కంకన్ (కంకణం)
4 కచెరా (నూలువస్త్రం)
5 కృపాన్ (కృపాణము అంటే రెండువైపులా పదును కలిగిన కత్తి)
ఈ సంఘటన తరువాత ప్రతి హిందు కుటుంబం తమ సంతానంలో జ్యేష్ఠపుత్రునికి అమృతసంచార్ సంస్కారాన్ని కలుగజేసి, ఖల్సాకు (సంరక్షకసైన్యానికి) పంపసాగారు. ఆ సంస్కారం పొందిన ప్రతి వ్యక్తీ సింగ్ అని పిలువబడతారు.
అమృతసంచారసంస్కారం పొందిన ప్రతివ్యక్తీ గురువిధేయుడై భగవంతుని పట్ల, గురు గ్రంథ్ సాహిబ్ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి తన జీవితాన్ని ధర్మసంరక్షణకు, ప్రజాసంరక్షణకు, ఆత్మవిముక్తికి అంకితం చేస్తాననే ప్రతిజ్ఞను స్వీకరిస్తాడు. క్షత్రియధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయటమే కాక, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని గడపటం కూడా వారి ఆశయాలు.
అటువంటి సింగులను వివాహం చేసుకున్న యువతికి కౌర్ అనే బిరుదం వస్తుంది. కౌర్ అంటే యువరాణి.
)))(((
ఈ రోజులలో మరలా గోవిందునివంటి గురువులు మరలా అవసరమనిపిస్తున్నారు. గురుగోవిందులు వస్తే వారి మాటలకు మరలా హిందువులలో సింహాలు జూలు విదిల్చి బయటకు వస్తాయి.

Monday, 15 March 2021

ఋణవిముక్తి


1907 వ సంవత్సరం. కలకత్తానగరం. రెవెన్యూ ఆఫీసు.

ఆ రెవెన్యూ ఆఫీసులోోనికి కలకత్తానగరంలో పేరుమోసిన వకీలు చిత్తరంజన్ దాస్ ప్రవేశించారు.
)))(((
నమస్తే రెవెన్యూ ఆఫీసరు గారూ, ముప్పై ఏండ్ల క్రితం ఈ జాబితాలో ఉన్న మనుషులు గాని, వారి వారసులు గాని ఇపుడు ఎక్కడ ఉన్నారో దయచేసి వివరాలు ఇవ్వగలరా?
నమస్తే చిత్తరంజన్ దాస్ గారూ, తప్పకుండా. మీరు కూర్చోండి. ఏమయ్యా దీనదాసూ, ఇలా రా, ఈ జాబితా తీసుకుని, వీరడిగిన వివరాలు ఇవ్వండి.
ధన్యవాదాలు రెవెన్యూ ఆఫీసరుగారూ. ఎంతసేపు పడుతుంది?
వెదికి ఇవ్వడానికి ఒకరోజైనా పడుతుంది. రేపు ఇదే సమయానికి రాగలరా?
తప్పకుండా. ధన్యవాదాలు.
)))(((
రండి చిత్తరంజన్ దాస్ గారూ, మీరడిగిన వివరాలు దొరికాయి. ఇవిగోండి.
ఆహా, ధన్యవాదాలు ఆఫీసర్ గారూ, మీ ఋణం తీర్చుకోలేనిది.
సరే, చిత్తరంజన్ గారూ, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడుగవచ్చా?
అయ్యో, ఎంతమాట! తప్పకుండా అడగండి.
మీరు ఇచ్చిన ఈ జాబితాలోోని మనుషులందరూ ఎవరండీ? ఎందుకు వారి వివరాలను మీరు కోరారు?
ఆఫీసర్ గారూ, వీరందరూ మా తండ్రిగారి ఋణదాతలు. మా నాన్నగారు అప్పట్లో బ్రహ్మో పబ్లిక్ ఒపీనియన్ అనే పత్రికను నడిపేవారు. దానిని నడిపేందుకు గాను వీరి దగ్గర ఋణం తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ పత్రికకు నష్టాలు వచ్చాయి. మా నాన్నగారు మా ఆస్తినంతటినీ అమ్మినప్పటికీ వీరి దగ్గర తీసుకున్న అప్పులను పూర్తిగా తీర్చలేకపోయారు. దివాలా తీశారు. నేను అప్పట్లో చిన్నవాడిని. అయితే ఇప్పుడు నేను హైకోర్టు లాయరును. కావలసినంత ధనం సంపాదించాను. అందువల్ల అప్పట్లో మా నాన్నగారి మీద నమ్మకంతో అప్పు ఇచ్చిన వారి ఋణం వడ్డీతో సహా కలిపి, అప్పట్లోనే ఇవ్వలేకపోయినందుకు నష్టపరిహారంగా రెండు రెట్లుగా ఇద్దామని సంకల్పించాను. లెక్క చూస్తే దాదాపు పదిలక్షలైంది. ఆ మొత్తాన్ని వారికి గాని, వారి వారసులకు గాని అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే వారి వివరాలనడిగాను.
చిత్తరంజన్ దాస్ గారూ, మీవంటివారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. మీ పూర్వికులందరికీ మీరు శాశ్వతపుణ్యలోకాలను సంపాదించబోతున్నారు.
కుమారునిగా అది నా బాధ్యత కదా ఆఫీసర్ గారూ. లేకుంటే ఆ వంశంలో పుట్టాను అని నేను చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనమేమిటి?
అవును దాస్ గారూ, మీవంటి వ్యక్తులకు సమకాలికుడను కావడం నా భాగ్యం.
ఎంతమాట ఆఫీసర్ గారూ, నేను అడిగిన వెంటనే వివరాలను వెదికించి ఇప్పించారు. మీ సహకారం లేకుంటే నేను కూడా వారి ఋణం తీర్చలేకపోయానే అన్న బాధతోనే జీవితం చాలించి ఉండేవాడిని. వారి వివరాలు ఇచ్చి నన్ను ఎంతో సంతోషపెట్టారు. ధన్యవాదాలు మహోదయా. సెలవు ఇప్పించండి. మరలా పని ఉన్నపుడు వచ్చి కలుస్తాను.
అలాగే వెళ్లిరండి దాస్ గారూ, మీలాంటి సత్పురుషులు ఈ దేశంలో మళ్లీ మళ్లీ పుట్టాలి.
)))(((
)))(((
నేతాజీ సుభాాస్ చంద్రబోసుకు రాజకీయగురువైన దేశబంధు చిత్తరంజన్ దాస్ గారి జీవితకథలో ఒక సంఘటనను చిన్న సంభాషణరూపంలో తెలియజేసేందుకు ఇలా ప్రయత్నం చేశాను.
ఈ సంఘటనను ప్రేరణగా తీసుకుని తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది. కాని, ప్రేరణగా నిలిచిన చిత్తరంజన్ దాసు పేరును కూడా ఆ దర్శకుడు తలచినట్టు లేదు. చిత్తరంజన్ గారికి శాశ్వతంగా అతడు ఋణపడే ఉంటాడు!

Thursday, 4 March 2021

ఎవరి తప్పుకు ఎవరిని నిందిస్తారు?

 


ఎవరి భక్తి గొప్ప?  

ధూర్జటిమహాకవి శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్యంలో ఈ గొడవను చక్కగా వర్ణించారు -

ఒక్క కాలఫణి భక్తిన్ దివ్యమాణిక్యముల్ పాతాళంబుననుండి తెచ్చి దినముం బాలేందుచూడార్చనల్ ప్రాతర్వేళలజేయు... (2.108)

త్రేతాంతంలో శివునికి మహాభక్తుడైన ఒక నల్లటి నాగుపాము పాతాళలోకంనుండి దివ్యమైన రత్నాలను తెచ్చి శివునికి కానుక పెట్టి పూజచేసేదట.

ఆ శివునికి ఒక ఏనుగుకూడా పరమభక్తుడు. అది పాము సమర్పించిన దివ్యమణులను చూసి, తామసగుణంతో భ్రాంతులైనవారెవరో ఇటువంటి పని చేశారనుకుంది.

"పెక్కు వర్ణముల ఱాలు కపర్దికి పెట్టజూతురే?" (2.112) అనుకుంది.

ఆ రత్నాలను తోసి పారేసి, తొండంతో తెచ్చిన నీటితో శివునికి అభిషేకం చేసి, తాను కానలు గొలకులు కలయతిరిగి, శివుని కోసం కోసిన మాలూరశాఖలు, నాళీకకహ్లారములు, కుముదపుష్పంబులు సమర్పించింది.

ఆ తరువాత వచ్చిన పాముకు తాను సమర్పించిన రత్నాలు నేల దుమ్ములో ఉండటం, ఏనుగు సమర్పించినవన్నీ శివలింగం చుట్టూ ఉండటం చూసి ఒళ్లు మండింది.

"డగ్గరి యెవ్వడో కటకటా శివలింగముమీది రత్నముల్ గగ్గుల కాట గప్పి, ములుకంపలు, తీవెలు వెట్టె నేడు నా కెగ్గొనరించి పోయె" అనుకున్నది.

అది కూడా ఏనుగు సమర్పించిన వాటిని పడద్రోసి, మళ్లీ రత్నాలతో అలంకరించి పోయింది.

తరువాత ఏనుగు వచ్చింది. మరలా ఆ రంగురాళ్లను చూసి కోపగించి, వాటిని దిక్కులం పాఱ జల్లేసింది. మరలా తన పూజను తాను చేసి పోయింది.

తరువాత పాము వచ్చింది. మళ్లీ పెక్కులైన జగతీరుహశాఖలను, తమ్మికాడలను చూసింది.

ఎవరో ఇలాంటి దుండగపు పని చేస్తుంటే "ఊరకె యుండె శంకరుండక్కట యేమి సెప్ప నహహా పగవారిని కూడె దైవమున్" (2.115) అని విషాదంలో మునిగిపోయింది.

చూడండి మరి, ఆ పాము, ఈ ఏనుగు ఇరువురూ శివభక్తులే. కాని, తాము చేసే పూజ మాత్రమే శ్రేష్ఠమైనదని ఇరువురూ అనుకుంటున్నారు.

పాముచెంత రత్నరాసులు మణిమాణిక్యాలు దండిగా ఉన్నాయి కాబట్టి, బాగా ధనవంతుడు (Rich by money) అనుకుందాము. ఏనుగు చెంత అవేమీ లేవు, తాము తినేవే శివునికి కూడా ఇష్టమనుకుని వాటినే తెచ్చి యిచ్చి పూజించుకునే పేదజనం అన్నమాట. కాని, ఇది పాము కంటె బాగా బలమైనది ( Physically strong).

ఇలా ధనవంతులకు, పేదలకు మధ్య కలహబీజం ఏర్పడి క్రమంగా వైరంగా మారిపోయింది. ఏనుగు పామును గూర్చి, అజ్ఞాని, తామసగుణుడు (2.112) అనుకుంది. పాము ఏనుగును గూర్చి మదాంధుడు (2.110) దుర్మదుడు (2.115) (పొగరుబోతుతనంతో కళ్లు మూసుకుపోయినవాడు) అనుకుంది.
అయితే రాజసగుణమెక్కుడైన పాము తన పూజను పాడుజేస్తున్న వ్యక్తిమీద పగ బూనింది. తన రాణులతో కలసి జలక్రీడలాడటంలో ఉన్న సంతోషం తనకు ఉడిగిపోయిందట. తన పూబోణులతో కలసి మధురసుధలతో కూడిన ఆహారం రుచించడం లేదట. బహువిధ సంగీత నృత్య గానాలను ఆనందించే నేర్పు పోయిందట. నిద్రాసుఖం కూడా కరువైందట. ఏనుగు చేస్తున్న పనికి గాను ఆ పాముకు ప్రతిరాత్రి శివరాత్రి జాగరమైపోయిందట.

(అలా చేస్తున్నది ఏనుగు అనే విషయం తెలియకముందే పాము దానిమీద కోపం తెచ్చుకుంది. అంటే దాని కోపం నిజానికి ఆ పని మీదనే తప్ప ఒక వ్యక్తిమీద కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.)

ఏనుగు కూడా తక్కువ తినలేదు. రాళ్లపూజను స్వీకరిస్తున్నందుకు గాను ఏకంగా శివుని తప్పు బట్టింది.

ఏమయ్యా శివా, నీలం రాళ్లు నల్లని కలువలతో సమానం కాగలిగేనా? ఆ పచ్చ రాళ్లు (అవి మరకతమణులని ఏనుగుకు తెలియదు) బిల్వపత్రాలు కాగలవా? ఆ ఎఱుపు రాళ్లకు ఎఱ్ఱదామరల సౌభాగ్యం ఉన్నదా? అసలు ఈ రాళ్లు నీకెట్లా నచ్చాయయ్యా, వీటిలో వాసన ఉన్నదా, మెత్తదనం ఉన్నదా, చల్లదనం ఉన్నదా? అని అడిగింది. (2.120)

శివా, నువ్వుండేది పెద్ద రాళ్ల కొండ (హిమాలయం). నీ భార్య కొండకూతురు (హిమవత్పర్వతరాజపుత్రిక పార్వతి). నీ ధనుస్సు కూడా ఒక కొండ (త్రిపురాసురసంహారకాలంలో ఆయనకు మేరు పర్వతమే ధనుస్సు). నీ రథం రత్నగర్భ అయిన భూమి. (త్రిపురాసురసంహారకాలంలోనే). ఇన్నేసి రాళ్లమధ్యలో ఉంటున్నా నీకు ఇంకా ఈ రాళ్లను (మణులను) అలంకారంగా ధరించాలనే కోరిక ఎట్లా ఉందయ్యా? అని అమాయికంగా అడిగింది.

ఇలా ఇన్నేసి మాటలన్నా, చివరకు ఆ ఏనుగు కోపం పాము మీదకు మళ్లింది. అయినా నిన్నని ఏమి లాభం? ఏమనగలవాడ నిన్ను, వ్రతహాని యొనర్చు దురాత్ముడుండగన్? (2.121) అనుకుంది.

(ఇక్కడ ఏనుగు కూడా అంతే, తన పూజను పాడు చేయడమనే పనిమీదనే దానికి కోపం తప్ప, పాము అనే ఒక వ్యక్తి మీద వ్యక్తిగతమైన పగ లేదా ద్వేషం లేదు.)

చివరకు, ఆ పగబట్టిన పాము ఏనుగు తొండంలో దూరి కుంభస్థలాన చేరి దానిని చంపదలచింది. ఏనుగు ఆ బాధ భరించలేక గగ్గోలు పెట్టింది. ఏనుగు బాధ వర్ణనాతీతమైనా ధూర్జటి దానిని హృదయవిదారకంగా తన కావ్యంలో చెప్పగలిగాడు. చివరకు ఆ పోరులో కాళము (పాము) హస్తి (ఏనుగు) రెండూ మరణించాయి. (ద్వితీయాశ్వాసం 138 నుండి 150 వ శ్లోకం వరకు)

రెండిటికీ శివసాన్నిధ్యం కలిగింది.

ఇలా నా పూజ గొప్పదంటే నా పూజ గొప్పదనే అహంకారం వ్యక్తులకు ఉండటం సహజమే. సరే, అవి రెండూ జంతువులే కదా అనుకుందాం. కాని, అదే ధూర్జటి, అదే కావ్యంలో తృతీయాశ్వాసంలో మనుషులకు కూడా ఇటువంటి బుద్ధి ఉంటుందని నిరూపించాడు.

తరువాత కాలంలో కణ్ణప్ప అని పేరుగాంచిన బోయ తిన్నడు ఉన్నాడే, అతడు కూడా ఏనుగు లాంటి భక్తుడే. తాను తినేదే శివునికి ఇష్టమైన తిండి అనుకున్నాడు. ఆ తిండిని సమర్పించడమే శివునికి ఆనందం కలిగించే పూజ అనుకున్నాడు.

ఒక వరాహాన్ని గెడిపాడు. కాల్చి, వ్రేల్చి, ప్రేల్చాడు. ఆకు దొప్పలలో మాంసఖండాలను తెచ్చి తినమని నట్టడవిలో కొలువైన శివునికి ఇచ్చాడు. శివుడు తినకుండా ఊరకున్నంత మాత్రాన తిన్నడు ఊరుకోలేదు.

కాలవో? క్రొవ్వవో? మాడంగాలెనో? చవి గావో? కమ్మగావో? నీకున్
జాలవో? యలవడవో? తినవేలా కఱుకుట్లు, పార్వతీశ్వర చెపుమా.
(3.88)

అని అడిగాడు. (కఱుకుట్లు అంటే చువ్వకు గుచ్చి కాల్చిన మాంసపు ముక్కలు.) అయితే శివుడు పలుకలేదు. అయినా తిన్నడు ప్రశ్నించడం మానలేదు.

ఆకలి గాదో? భక్తిం దేకువ గలవాడ గానో? తినవేల కృపన్?
సాకగదే నన్నిపుడఱ్ఱాకల బెట్టక ఫలాశనాసక్తుడవై.
(3.89)

అన్నాడు. నువు తినకుంటే నేను కూడా ఇట్లే అఱ్ఱాకలితో ఉండవలసి వస్తుంది అని black mail చేయడానికి కూడా ప్రయత్నించాడు. నన్ను ఆకలితో చంపక నువ్వు తిని నన్ను సాక్కోవయ్యా అని బ్రతిమలాడాడు. తాను తినకుండా మారాం చేస్తే అమ్మ తనను ఎలా బుజ్జగిస్తుందో గుర్తొచ్చినట్లుంది.

నెపమొకటి గలదె నాపై, నుపవాసము తోడ బడలియుండగ, నీకే
యపరాధము సేయంగదె, కృపతో గఱుకుట్టు లారగింపంగదవే.
(3.90)

అని తన తప్పేమైన ఉందా అని విచారించి, తప్పులు చేయనని వాగ్దానం చేశాడు. తినమన్నాడు. అయినా శివుడు తినేట్లు కనిపించలేదు. దాంతో తిన్నడికి ఏం చేయాలో తోచలేదు.

"నీవారగింపకుండిన జీవనమేమిటికి శివ? నీ పదరాజీవముల మీద ప్రాణములే విడుతు" అని ఏడ్చాడు.

అప్పటికి శివుడు కనికరించి సరే ఇటు తే అని తిన్నడు ఇచ్చినవన్నీ తిన్నాడు. తిన్నడు పరమానందభరితుడైనాడు.

తరువాత ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. శివలింగం పరిసరాలు చూసేసరికి అతనికి కంపరం పుట్టుకొచ్చింది.

ఏమిటి శివలింగంపై ఈ చారికలు? ఈ ఎంగిలి పుల్లియలేమిటి? ఈ ఎంగిలిమంగలంబులైన దొప్పలేమిటి? ఈ కసుమాలము ఏమిటి? ఈ రోత ఏమిటి? ఈ దుందుడుకుతనం ఎవరిదై ఉంటుంది? అనుకున్నాడు. ఈయనకు కూడా శివునితో చనవు ఎక్కువే.

ఏమయ్యా శివా, పాత బట్టలు మీద కప్పినా ఓర్చుకుంటావు, నీచులైన రాక్షసాధములతో ప్రేమగా పొత్తులు కడతావు. నీ భక్తుడు తన ప్రియురాలి చెంతకు తన తరపున రాయబారం పొమ్మంటే కిమ్మనకుండా పోతావు. శవాల బూడిదను ఒంటిమీద ధరిస్తావు, కపాలాన్ని భోజనపాత్రగా స్వీకరించావు, ఇన్ని రోతలు చాలక, ఇపుడీ కొత్త రోత ఏమిటయ్యా అని దబాయించేశాడు. ఈ రోత నీకిష్టమైతే అట్లే కానీ, ఆ దుర్మార్గుడెవడో నాకు చెప్పు. (ఏం చేద్దామనో?) లేకుంటే కూడుగ్గబట్టి ప్రాణం విడిచేస్తా అన్నాడు.

ఆగవయ్యా ఆగు అంటూ శివుడు అతడిని ఆపి, తిన్నడి భక్తిని అతడికి కళ్లారా చూపాడు. (అదే ఈనాటికి కూడా సుప్రసిద్ధమైన కథ - శివునికి తిన్నడు తన కండ్లను తృణప్రాయంగా భావించి అర్పించిన కథ)

ఇలా, పోటీ వస్తే, ఎవరి భక్తి గొప్పదని చెప్పగలం?

)))(((
ఈ మధ్యనే ఒక మిత్రుడు అన్నారు - హిందూమతాన్ని సంస్కరించాలి, దానిలోని ఆధిపత్యభావజాలాన్ని సంస్కరించాలి - అని.

వారికోసం, వారిలా భావించే వారికోసమే ఈ పోస్టు.

మహోదయా, చూశారు కదా, ఇటువంటి ఆధిపత్యభావజాలాలు సమాజంలో మొదటినుండీ ఉన్నాయి. అయితే ఇతడి ఆధిపత్యం లేదా వీరి ఆధిపత్యం కరెక్టు అని హిందూమతగ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా ఆధిపత్యం చెలాయించబోతే అది ఆయా కాలాలలో, ఆయా వ్యక్తుల అజ్ఞానం వల్లనో లేదా గర్వం వల్లనో జరిగిందే తప్ప దానికి హిందూమతం ఎటువంటి ఆమోదముద్ర వేయలేదు.

దేవాలయాలలో గర్భగుడిలోనికి అర్చకులకు తప్ప వేరొకరికి ప్రవేశం లేదు. నిజమే. ప్రధానమంత్రి కార్యాలయంలోనికి కూడా అందరికీ ప్రవేశం లేదు కదా? అందుకుగాను అక్కడున్న సెక్యూరిటీ గార్డులను ద్వేషిస్తామా? రక్షణవ్యవస్థను నిందిస్తామా?

మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ కేవలం బ్రాహ్మణులు మాత్రమే అర్చకులుగా లేరు. బ్రాహ్మణేతరులు కూడా అర్చకులుగా ఉన్న ఆలయాలను నేను చూశాను. అక్కడకు కూడా భక్తులు వెడుతున్నారు. అక్కడ కూడా కానుకలను సమర్పిస్తున్నారు. ఎవరూ బ్రాహ్మణేతర అర్చకులను ఆక్షేపించడం లేదు. బ్రాహ్మణార్చకులను గౌరవించినట్లే వారిని కూడా గౌరవిస్తున్నారు. అక్కడ కూడా మేమే ఉండాలి వారిని తొలగించాలి అని బ్రాహ్మణులెవరూ అడగటం లేదు కదా?

బ్రాహ్మణులు అర్చకులుగా ఉన్న గుడులు పెద్దవి, బ్రాహ్మణేతరులు అర్చకులుగా ఉన్న గుడులు చిన్నవి అంటారా? సరే. కాని చూడండి, ఆ పెద్ద పెద్ద గుడులు మహారాజులు కట్టించినవి. వాటిలో శాస్త్రోక్తవిధానంలో అర్చనలు జరిపించేందుకు బ్రాహ్మణులను అర్చకులుగా నియమించింది కూడా ఆ మహారాజులే.

అప్పటినుండి అది అలా కొనసాగుతోంది. ఆ మహారాజులు పోయారు. హైందవేతరమతాల రాజులు వచ్చారు. వారి కాలంలో దేవాలయాలు దాడికి గురైనాయి. కొన్ని నామరూపాలు లేకుండా ధ్వంసమైనాయి. కొన్ని రూపు మార్చుకుని మసీదులుగా ఆవిర్భవించాయి. అనేకం శిథిలం అయినాయి. వాటిని రక్షించుకునే క్రమంలో భారతీయసైనికులతో పాటు అనేకులైన బ్రాహ్మణార్చకులు కూడా తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఆ తరువాత భక్తులు సందర్శించకపోయినా, ఆదాయం లేకపోయినా, శతాబ్దాల తరబడి పేదరికంలో మగ్గుతున్నా, నిత్యం భగవంతుని ఆరాధనలో బ్రతుకుతున్నవారు లక్షలాది అర్చకులు ఉన్నారు. వారు తమ వృత్తికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నారు. అందువల్లనే ఇప్పటికీ అర్చకులుగా ఉన్నారు. ఈనాడు కొన్ని దేవాలయాల స్థితి మెరుగుపడి, అర్చకులలో కొందరు మంచి స్థితిలో ఉండవచ్చును. కాని, లక్షలాది అర్చకులు ఇప్పటికీ పేదవారుగానే ఉన్నారు. కాని, అర్చకవృత్తిని విడువలేదు. వారి అంకితభావాన్ని తప్పుగా భావించడం సమంజసం కాదు. వారు గుడులను విడవనంతమాత్రాన గుడులపై వారు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అనలేము.

సరే. ఇక అంటరానితనం హిందూమతంలో ఉన్న తప్పు అన్నారు మరో పెద్దాయన. అది పక్కాగా తప్పు. హిందూమతగ్రంథాలలో అటువంటి అంటరానితనాన్ని ఆమోదించిన వాక్యాలను ఎక్కడా లేవు.

ఒకానొక కాలంలో కొందరు వ్యక్తులు తమకు సంక్రమించిన అధికారాన్ని, ధనబలాన్ని చూసుకుని గర్వించి అవి లేని కొందరిపై పెత్తనం చెలాయించిన మాట నిజం. అయితే అది హిందూమతానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి పరిస్థితులలో కొందరు వ్యక్తులు చేసిన దురాగతాలను మతానికి అంటగట్టి ఇది హిందూమతస్వభావం అనడం కేవలం మిషనరీల కుట్ర మాత్రమే.

మహాశివభక్తుడైన రావణుడు పరమలోకకంటకుడైనాడు. లోకాలన్నిటినీ తన బలగర్వంతో పీడించాడు. వేలాది కన్యలను అపహరించాడు. సీతను అపహరించాడు. చివరకు రాక్షసవంశమే నిర్మూలమైపోయేంతటి ఉపద్రవం తెచ్చిపెట్టాడు. అందుకు శివుడు బాధ్యుడు కాదు. రాముడు కూడా శివుడిమీద అలుగలేదు. శివపూజను మానుకోలేదు. పైగా రామేశ్వరంలో శివప్రతిష్ఠ కూడా చేశాడు కదా? రాముడే కాదు, రావణపీడితులైన ఎవరూ కూడా శివద్వేషులు కాలేదు. ఎందుకంటే అలా లోకాలను పీడించమని, అంత దుర్మార్గంగా ప్రవర్తించమని రావణుడికి శివుడు చెప్పలేదు కదా? ఆ రావణుడు జన్మతః బ్రాహ్మణుడైనాడు. అతనిని సంహరించమని బ్రాహ్మణులే స్వయంగా రాముని వేడుకున్నారు. విశ్వామిత్రుడు, అగస్త్యుడు మొదలైన బ్రాహ్మణులే రావణాసురవధకు ఉపయోగపడగల దివ్యాస్త్రాలను రామునికి ఉపదేశించారు, ప్రసాదించారు. రాముడు కూడా వెనుకాడకుండా అతని పీచమణచాడు. బ్రాహ్మణుడైన రావణుడు తన భార్యను అపహరించాడు కాబట్టి రాముడు సమస్తబ్రాహ్మణసమాజం మీద ద్వేషం పెంచుకోలేదే?

అలాగే, కొందరు క్షత్రియులు తన కుటుంబానికి చేసిన అన్యాయానికి ప్రతికారంగా దేశదేశాల క్షత్రియులందరినీ పగబట్టి వెంటాడి మరీ వధించిన పరశురాముడి పట్ల గాని, అతడి సంతానం పట్ల గాని, అతడి కులం పట్లగాని ఆ రాముడు ద్వేషం పెంచుకోలేదే? ఇలా అనేక కారణాలవల్లనే శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్యదైవమైనాడు.

#జైశ్రీరామ్

సరే, అంటరానితనం అనేది ఇప్పుడు లేదు. అది తప్పు అని హిందువులందరూ హార్దికంగా అంగీకరిస్తున్నారు. శివుని ఆలయాన్ని ఎంగిలిమంగలంగా మార్చిన తిన్నడినే కణ్ణప్పనాయనారుగా చేసి, శివాలయంలో శాశ్వతస్థానం కల్పించిన సంస్కృతి కదా మనది. అటువంటి మన సంస్కృతి అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుంది అనడానికి ఎవరికైనా నోరు ఎలా వస్తుంది? ఎక్కడో దేనినో చూసి, అనాలోచితంగా దానిని హిందూమతానికి అంటగట్టి తూలనాడడం సమంజసమేనా?

ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని హిందూమతసారం తెలుసుకొనలేని హిందువు అంటూ దూషించడం, నేను మాత్రమే నిజమైన హిందువును అంటూ ఆత్మస్తుతి చేసుకొనడం - ఏమిటిదంతా? ఇది కేవలం చిన్నతనం!

కాని, కొన్ని గ్రామాలలో ఇది ఇంకా ఉంది అని ఇదే మిత్రుడు అంటున్నారు. అక్కడ కొన్ని వర్గాల ఆధిపత్యం ఉంది అంటున్నారు. ఆ వర్గాల వారు ఎవరు? ఆ వర్గాలవారు ధనవంతులు అయ్యుంటారు. లేదా ఆ గ్రామంలో సంఖ్యలో అధికులై ఉండవచ్చు. (మెజారిటీ వర్గం) లేదా భూములు అధికంగా ఉన్నవారై ఉండవచ్చు. లేదా అధికారవర్గానికి చెందినవారై ఉండవచ్చు. ఇటువంటి ఆధిక్యత వలన వారు ఇతరులను చులకనగా చూడటం చేస్తూ ఉండవచ్చు.

వారి చేష్టలకు హిందూమతం ఎలా బాధ్యత వహిస్తుంది? వారు తమ పొగరుబోతుతనం కొద్దీ చేస్తున్న దురాగతాలకు హిందూమతాన్ని క్రొత్తగా సంస్కరించడమేమిటి? ఎవరు చేస్తున్న తప్పుకు ఎవరిని నిందిస్తారు?

హిట్లర్ చేసిన మారణకాండకు క్రైస్తవం బాధ్యత వహించిందా? జలియన్ వాలాబాఘ్ లో డయ్యర్ చేసిన సామూహికహత్యలకు క్రైస్తవం బాధ్యత వహించిందా? అల్లూరి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, బటుకేశ్వర దత్, సుఖదేవ్, రాజ్ గురు వంటి భారతీయవీరులపై బ్రటిషు ప్రభుత్వం అధికారమదంతో బుద్ధిపూర్వకంగా చేసిన అత్యాచారాలకు క్రైస్తవం బాధ్యత వహించిందా?

జిహాద్ అంటూ మతం పేరు చెప్పి మరీ ప్రపంచమంతటా విచ్చలవిడిగా నరమేధం సాగిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న క్రూరాతిక్రూరులైన మూకల చర్యలకు, మనసులో వారి పనులకు మద్దతు పలుకుతూ, సంతోషిస్తూ, పైకి మాత్రం పరమశాంతిపరులైన మిత్రులుగా నటనకనబరుస్తున్నవారికి మీ మతం బాధ్యత వహించాలి అని ఏనాడైనా బోధించారా? బుద్ధి చెప్పే సాహసం చేశారా?

అణచివేతకు గురైన వారు మాత్రమే హిందూమతం వదలి మతాంతరం స్వీకరిస్తున్నారు అనే భ్రమను కొందరు మిత్రులు వదులుకోవాలి. ఆ లెక్కన రెడ్లు, కమ్మలు, కాపులు, బ్రాహ్మణులు కూడా క్రైస్తవులుగా ఎందుకు మారారు? విదేశాలనుండి వస్తున్న నిధులకు ఆశపడి కాదా?

అంటరానితనానికో లేదా కొందరు వ్యక్తుల అనుచితమైన ఆధిక్యానికో హిందూమతం ఎన్నడూ ఆమోదముద్ర వేయలేదని చాల స్పష్టంగా చెబుతున్నాను. ప్రభుత్వం కూడా దీనిని నిషేధించింది. అమలు చేయడం, బాధ్యులైన వారిని శిక్షించడం ప్రభుత్వం బాధ్యత.

(అట్లని అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని హిందువులు నిష్క్రియాపరులై ఉండటం ఆత్మహత్యతో సమానం అని హిందువులంతా తక్షణం గుర్తించాలి.)

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...