Showing posts with label అశ్వినీ దేవతలు. Show all posts
Showing posts with label అశ్వినీ దేవతలు. Show all posts

Monday, 27 April 2020

కోఽరుక్?




అనగా అనగా కేరళదేశం.  ఆయుర్వేదవైద్యానికి ప్రసిద్ధిగన్న దేశం.  అటువంటి దేశంలో ప్రఖ్యాతి చెందిన ఎనిమిది వైద్యకుటుంబాలు ఉండేవి.  అందులో ఒకానొక కుటుంబానికి చెందినవాడే ఆలత్తియూర్ నంపి.  (నంబి)

నంబి మహాభక్తుడు.  ఆయన ప్రతి రోజూ తమ కులదైవమైన శివుని మందిరానికి పోయి దర్శనం చేసుకుని, ధ్యానం చేసుకొనేవాడు.  ఒకరోజు అతడు దేవాలయానికి పోయినపుడు అక్కడ ఉన్న చెట్టుపై రెండు పక్షులు కూర్చుని కోరుక్ కోరుక్ అని అరవడం విన్నాడు.  ఆ పక్షుల మధురశబ్దాలను విని నంబి చాల ఆనందించాడు.  అవి ఏవో క్రొత్తరకం పక్షులు అనుకున్నాడే గాని, అంతగా వాటి శబ్దాలను పట్టించుకోలేదు.  అయితే అవి ప్రతి రోజూ ఆ చెట్టు మీద అదే స్థానంలో అదే సమయంలో కూర్చుని అరవడం అతడు గమనించాడు.

అలా వింటూ వింటూ ఉండగా, కోరుక్ - కోరుక్ అనే శబ్దాలతో ఆ పక్షులు తనను “కోఽరుక్? - కోఽరుక్?” అని తనను ప్రశ్నిస్తున్నట్టుగా నంబికి అనిపించింది.  

(సంస్కృతంలో కః + అరుక్ అనే రెండు పదాలు కలసి కోఽరుక్ అనే సంధిరూపంగా మారుతాయి.  ధన్యః + అస్మి = ధన్యోఽస్మి, దాసః + అహమ్ = దాసోఽహమ్ అనే సంధిరూపాలను మనం తెలుగుభాషాపదాలైనట్లుగా యథేచ్చగా వాడుతూ ఉంటాం కదా, అటువంటిదే ఈ కోఽరుక్ రూపం కూడా.)  ‘కః’ అంటే ‘ఎవడు?’ అని.  అది ఒక ప్రశ్నార్థకపదం.  ‘రుక్’ (రుజ్) అంటే రోగం.  ‘రోగం కలిగినవాడు’ అనే అర్థం కూడా వస్తుంది.  ‘అరుక్’ అంటే ‘రోగం లేనివాడు’.  (అంటే, ‘ఆరోగ్యవంతుడు’) కాబట్టి, కః + అరుక్ = కోఽరుక్ అంటే “ఎవడు ఆరోగ్యవంతుడు?” అని ఆ పక్షులు తనను అడుగుతున్నట్టు అన్న మాట. 

అలా అనిపించగానే నంబి వెంటనే సమాధానం చెప్పాడు.

కాలే హితమితభోజీ కృతచఙ్క్రమణః  క్రమేణ వామశయీ।
అవిరుద్ధమూత్రపురీషః స్త్రీషు యతాత్మా చ యో నరః సోఽరుక్।।

(ఏ మనిషి సమయం ప్రకారం హితంగాను, మితంగాను భుజిస్తాడో, తగినంత కాలం సంచరిస్తాడో, ఎడమవైపుకు తిరిగి నిద్రిస్తాడో, మూత్రపురీషాలను ప్రతిదినం సమయానికి విసర్జిస్తాడో, స్త్రీవ్యామోహం లేనివాడై ఉంటాడో, ఆ మనిషే ఆరోగ్యవంతుడు అని అర్థం.)

ఆ సమాధానం వినగానే ఆ రెండు పక్షులూ ఎగిరిపోయాయి.  మరలా అవి కనబడలేదు.  "ఓహో అవి దేవతాపక్షులై ఉంటాయి.  నా సమాధానం సరైనదే అని గ్రహించి మరలా నన్ను ఆ ప్రశ్నను అడిగేందుకు రాలేదు కాబోలు” అని నంబి భావించాడు.

కొన్ని రోజులు గడిచాక నంబి దగ్గరకు ఇద్దరు బాలురు వచ్చారు.  “మహోదయా, మేము మీ చెంత ఆయుర్వేదవిద్యను నేర్చుకొనగోరి వచ్చాము” అని అర్థించారు.  వారి తేజస్సును చూసి ముచ్చటపడిన నంబి వారిని తన శిష్యులుగా అంగీకరించాడు.

రాను రాను, తన శిష్యుల తెలివితేటలు నంబికి చాల ఆశ్చర్యం కలిగించడం మొదలుపెట్టాయి.  వారు ఏకసంథాగ్రాహులైన శిష్యులు మాత్రమే కారు, ప్రతి శ్లోకాన్ని వారు వ్యాఖ్యానిస్తున్న తీరు అసాధారణంగా ఉండేది.  “నేను వారికి బోధిస్తున్నానా, లేక వారే నాకు తెలియని అనేకవిషయాలను చాల వివరణపూర్వకంగా చెబుతున్నారా?” అని అతడికి సందేహం కలిగేది.  వారు చెప్పిన ప్రకారం వైద్యం చేస్తే అది తాను పూర్వం అవలంబిస్తున్న విధానం కంటె ఎంతో ఫలితం ఎంతో మెరుగ్గా ఉండేది.

ఆ పిల్లలు మేధావులు మాత్రమే కారు.  చాల అల్లరి చేసేవారు.  వారి అల్లరిని నంబి ఎంతో ప్రేమతో సహించేవాడు.  నంబి మాత్రమే కాదు, అతని కుటుంబసభ్యులకు, ఆ ఊరిలో ప్రజలకు కూడా వారు ఎంతో ప్రీతిపాత్రులైనారు.

ఒకనాడు నంబి ఇంటిలో లేని సమయంలో ఒక రోగి వచ్చాడు.  అతడు దుర్భరమైన శిరోవేదనను అనుభవిస్తున్నాడు.  నంబి ఇస్తున్న ఔషధం అతనికి ప్రతిసారీ తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తోందే కాని, పూర్తిగా తగ్గించలేకపోతోంది.

ఈసారి అతడు వచ్చేసరికి నంబి ఇంటిలో లేడు.  కాని, అతని బాలశిష్యులిద్దరూ అతనిని చికిత్స చేసే గదిలోనికి తీసుకుపోయారు.  ఆ రోగి నుదుటిపై ఒక ఔషధాన్ని పూశారు.  ఆ తరువాత, అతడి నుదుటిమీదనున్న చర్మాన్ని పైకి లాగారు.  వెంటనే అది తడికి అంటుకున్న తమలపాకులాగ కపాలంనుండి ఊడిపోయి పైకి వచ్చేసింది.  అప్పుడు ఆ రోగి నుదుటిచర్మం క్రిందనున్న కపాలము, కండరాలు స్పష్టంగా కనబడసాగాయి.  ఆ బాలురు ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని విషక్రిములను పైకి లాగి పడేసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు.  తరువాత, నుదుటి చర్మాన్ని యథాప్రకారం కప్పివేసి, మరొక ఔషధం పూశారు. వెంటనే అది మచ్చకూడా లేకుండా యథాపూర్వం అతుక్కుపోయింది.  ఆ రోగికి శిరోవేదన శాశ్వతంగా మటుమాయమై పోయింది.

ఈ సంఘటనను నంబి కుమారులు చూసి దిగ్భ్రాంతి చెందారు.  తండ్రి ఇంటికి తిరిగి రాగానే జరిగిన విషయమంతా చెప్పారు.  వారు చెప్పినది నిజమేనని తెలుసుకున్న నంబి పరమానందభరితుడై ఆ బాలురు దేవవైద్యులైన అశ్వినీకుమారులే తప్ప వేరొకరు కారని నిశ్చయించుకున్నాడు.

ఇంత జరిగిన తరువాత, ఆ బాలురు ఇక తమకు సెలవు ఇప్పించమని నంబిని కోరారు.  మీరెవ్వరో చెప్పకుంటే మీరు వెళ్లిపోయేందుకు నేను అనుమతినివ్వను అని నంబి వారిని అడిగిన మీదట, వారు తాము దేవవైద్యులమైన అశ్వినీదేవతలమేనని, ఆయుర్వేదవైద్యాన్ని భూలోకంలో ప్రచారం చేసేందుకు వచ్చామని, మునుపు అతని వైద్యసామర్థ్యాన్ని పరీక్షించేందుకు గాను ఆలయప్రాంగణంలో పక్షులరూపంలో కోఽరుక్ అంటూ అతనిని ప్రశ్నించినది కూడా తామేనని చెప్పారు.  

ఆ సంగతి తెలిసిన తరువాత, నంబి వారు వెళ్లిపోయేందుకు అనుమతినిచ్చాడు కాడు.  అయితే వారు గురుదక్షిణగా నంబికి అపూర్వమైన ఒక ఆయుర్వేదవైద్యగ్రంథాన్ని బహూకరించి, అందులో ఉన్నట్టుగా వైద్యం చేయమని, అపుడు తాము లేని లోటు ఉండదని మాట ఇచ్చిన తరువాత, వారికి అనుమతి లభించింది.

ఆలయిత్తూర్ నంబి కేరళపాలిటి దేవునిగా, మహావైద్యునిగా ప్రఖ్యాతి చెందాడు.  ఆయన వంశంవారు ఈనాటికీ కేరళలో ప్రఖ్యాతులైన ఆయుర్వేదవైద్యులుగా ఉన్నారు.

ఉత్తరాదిలో వాగ్భటుడు అనే ఒక మహా-ఆయుర్వేదపండితుడు ఉండేవాడట.  దేవవైద్యుడైన ధన్వంతరి పక్షిరూపంలో వచ్చి కోఽరుక్ అని ఆయనను ప్రశ్నించగా, వాగ్భటుడు హితభుక్ మితభుక్, ఋతుభుక్ సోఽరుక్ (హితమైన ఆహారాన్ని, మితంగా షడృతువుల వాతావరణాన్ని అనుసరించి భుజించేవాడు, ఆయా ఋతువులలో సహజంగా ప్రకృతి ప్రసాదించే ఫలాదులను భుజించేవాడు ఆరోగ్యవంతుడై ఉంటాడు.) అనిసమాధానం చెప్పాడట.  ఇది రోగాన్ని తగ్గించడం కోసం కాదు.  అసలు రోగమే రాకుండా చేసుకునే ఉపాయం.  Prevention is better than Cure అని ఇంగ్లీషు వాళ్లు కూడా అభిప్రాయపడతారు కదా?

।।సర్వే భవంతు సుఖినః।।


హంసోదకం

స్థలం - తిరుపతి, తత్పరిసరాలు.   ఇద్దరు మిత్రులు సంభాషించుకుంటూ ఉన్నారు.   ఒకడు -  అయ్యో, దుర్దినాలు సంప్రాప్తించాయి గదరా.   రెండవవాడు -   ...