Thursday, 28 April 2022

జీవితం (ఓ విషాదాంతకథ)

చేతికి ప్లాటినం వాచి, గోల్డ్ బ్రేస్ లెట్టు, ఖరీదైన నల్ల కళ్లద్దాలు, సూటు, భుజానికి చిన్న బ్యాగు వేసుకుని, విమానంలోనుంచి దర్జాగా దిగాడు ఒక పెద్ద మనిషి.

తన బ్యాగేజీని కలెక్ట్ చేసుకుని బయటకు రాగానే తన కోసం ఎదురు చూస్తున్న క్యాబ్ లో ఎక్కి, పాస్ వర్డ్ చెప్పి పొమ్మన్నాడు. క్యాబ్ బయలు దేరింది.

క్యాబ్ నడుపుతున్న యువకుని చూసేసరికి అతడికి తన గొప్పలు తాను చెప్పుకోవాలనిపించింది.

ఏమయ్యా, ఎంత వయసు నీది?

30 సర్.

సొంతకారేనా నీది?

కాదు సర్. లోన్ తీసుకున్నాను.

నీ జీవితంలో 10% వేస్టయింది పో.

అదేమిటి సర్?

30 ఏళ్లు వచ్చినా సొంత కారు సంపాదించలేకపోయావంటే అంతే. నన్ను చూడు, నేను 25 ఏళ్లకే సొంత కారు కొనుక్కున్నాను.

సంతోషం సర్.

సరే, ఏం చదువుకున్నావ్?

బీయస్సీ చేశాను సర్.

నీ జీవితంలో ఇంకో 10% వేస్టయింది పో.

అదేమిటి సర్?

ఇంజనీరింగో, మెడిసినో, సీయేనో, ఎంబీయేనో చదవాలయ్యా, నేను చూడు, సీయే పాసై పెద్ద కంపెనీలో పని చేస్తున్నాను.

సంతోషం సర్.

ఏమయ్యా, ఎంత సంపాదిస్తావేమిటి?

నెలకు పాతిక వేలదాకా సంపాదిస్తాను సర్.

అయితే నీ జీవితంలో ఇంకో 10% వేస్టయింది పో.

అదేమిటి సర్?

చూడు, నేను 25 ఏళ్లకే సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీ సంపాదించేవాడిని. ఇప్పుడు దానికి డబుల్ సంపాదిస్తున్నాను తెలుసా?

సంతోషం సర్.

ఏమయ్యా, ఇప్పటికి నువ్వు ఎంత వెనకేశావేమిటి?

రెండు మూడు లక్షలు ఉంటుంది సర్. పల్లెటూళ్లో మా అమ్మానాన్నకు పంపించాలి గద సర్.

పోవయ్యా, నీ జీవితంలో ఇంకో 10% వేస్టయింది పో.

అదేంటి సర్?

నన్ను చూడు, పాతికేళ్లకే పది లక్షలు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ క్యాష్ నా చేతిలో ఉండేది. ఇప్పుడైతే పది కోట్లు ఉన్న పళాన ఖర్చు పెట్టగలను తెలుసా?

సంతోషం సర్.

ఏమయ్యా, సొంతిల్లు కట్టుకున్నావా?

మా వూర్లో సొంతిల్లు ఉంది సర్.

నువు పనిచేసే ఊర్లో కట్టుకున్నావా?

ఇంకా లేదు సర్. కారు లోను తీర్చేసిన తరువాత ఇంటిలోనుకు అప్లై చేస్తాను.

అయితే నీ జీవితంలో ఇంకో 10% వేస్టయింది పో.

అదేమిటి సర్?

నన్ను చూడు, నేను ఉద్యోగంలో చేరిన తరువాత ఒక సంవత్సరానికే పోష్ లొకాలిటీలో పైవ్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాను. ఇప్పుడు మొత్తం నాకు ఇండియాలో మొత్తం దానికంటె పెద్దవి నాలుగు ఓన్ ఫ్లాట్సు ఉన్నాయి.

సంతోషం సర్.

ఏమయ్యా, నీకు పెళ్లైందా?

ఇంకా సంబంధాలు చూస్తున్నారు సర్. వారం రోజుల క్రితం మా పక్క పల్లెటూర్లో పెళ్లిచూపులకు వెళ్లి వచ్చాను. అదృష్టముంటే సెట్టైపోవచ్చు అని మా అక్క నిన్ననే ఫోన్ చేసింది సర్..

అయ్యో, నీ జీవితంలో ఇంకో 10% వేస్టయింది పో.

అదేమిటి సర్?

నన్ను చూడు, నేను ఫై బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకున్నానా? ఆ తరువాత రెండు నెలలకే ఆ అపార్ట్ మెంట్ కట్టించిన కాంట్రాక్టరు నన్ను చూసి నాకు మూడుకోట్ల కట్నాన్ని, మరో ఫ్లాటును, వంద తులాల బంగారంతో పాటు మిస్ ఆంధ్రా పైనలిస్టు అయిన తన కూతురును నా కిచ్చి పెళ్లి చేశాడు తెలుసా? ఇప్పుడు మా ఏకైక కూతురు అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుతోంది.

చాల సంతోషం సర్.

ఇంతలో కారు మలుపు తిరగగానే దూరంగా కొందరు గుంపు కనబడ్డారు. వారిని చూడగానే డ్రైవరు కంగారు పడ్డాడు. వెంటనే కారును రివర్స్ గేరులో పోనిచ్చాడు. కాని, వెనుక కూడా కొందరు గుంపులు గుంపులుగా ఉన్నారు. అందరి చెేతుల్లోను కర్రలున్నాయి. కారు డ్రైవరుకు ఏం చేయాలో పాలుపోలేదు.

డ్రైవరు భయాన్ని గమనించి పెద్దమనిషి అడిగాడు - ఏమైంది?

సర్ నిన్న శ్రీరామనవమి కదా సర్?

అవును. అయితే ఏమిటి?

నిన్న ఈ ప్రాంతంలో హిందువులు ఊరేగింపులు జరిపారు. అది సహించలేని ఇతరులు ఊరేగింపు మీద రాళ్లతో దాడి చేశారు.

అయితే పోలీసు కంప్లైంటు ఇవ్వవలసింది.

ఇచ్చారు.

ఇంకేమిటి ప్రాబ్లం?

నిన్న ఊరేగింపులో హిందువులు చాల ఎక్కువసంఖ్యలో ఉన్నారు కాబట్టి కేవలం చిన్నా పెద్దా గాయాలతో బ్రతికిపోయారు. కాని, ఈరోజు....

ఆ, ఈరోజు? ఏమైంది?

ముందు ఈ విషయం చెప్పండి సర్. మీ దగ్గర గన్ ఉందా?

లేదు. ఎందుకు?

పోనీ మరేదైనా ఆయుధం ఉందా?

లేదు. ఎందుకు?

కనీసం కర్రసాము కాని, కరాటే ఫైటింగు కాని వచ్చా?

రాదు. ఎందుకు?

పోనీ, వేగంగా పరుగెత్తడమైనా వచ్చా?

రాదు. ఎందుకు?

ఏమయ్యా పెద్దమనిషీ, నువు పాతికేళ్లకే పెద్ద పెద్ద చదువులు చదివావ్. పెద్ద ప్యాకేజీతో పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం సంపాదించావ్, పెద్ద కారు కొన్నావ్. పెద్ద ఫ్లాటు కొన్నావ్, పెద్ద కాంట్రాక్టరు కూతురైన మిస్ ఆంధ్రాను పెళ్లి చేసుకున్నావ్, పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివిస్తున్నావ్. ఇన్ని అమర్చుకున్నవాడివి, నీ జీవితాన్ని కాపాడుకోగలిగిన ఒక్క చిన్న విద్యను కూడా నేర్చుకోలేదా?

ఏమయ్యా, నువు ఎల్లైసీ ఏజంటువి కూడానా? ఇంతకు ముందే లైఫ్ ఇన్స్యూరెన్సు చేశానయ్యా. చెప్పు, నీకు కూడా ఒక పాలసీ చేయమంటే చేస్తాను. ఐ డోంట్ మైండ్.

తమరి బొంద సర్. ఇన్ని చెప్పినా మీకు అర్థం కాలేదంటే మీది మట్టి బుర్ర సార్. మీరు పరీక్షలన్నీ కాపీ కొట్టి పాసైయ్యుంటారని అనుమానం వస్తోంది సార్. విషయమేమిటంటే నిన్నటి అల్లరి మూక ఇప్పుడు మళ్లీ ఇప్పుడు కర్రలు తీసుకుని మనమీద దాడి చేయబోతోంది సర్. నేను కారు వదిలేసి పారిపోతున్నాను సర్. మీకు చేతనైతే మీరు కూడా పారిపోండి సర్. లేకపోతే తమరి జీవితం ఏ 10 పర్సెంటో 20 పర్సెంటో కాదు. కాసేపట్లో ఏకంగా నూటికి నూరు పర్సెంటు మొత్తం వేస్ట్ అయిపోతుంది. బ్రతికుంటే మళ్లీ కలుద్దాం సర్..

డ్రైవరు పారిపోయాడు.
తరువాత...



(ఇలా వ్రాయవలసి వచ్చినందుకు ఈ వీడియోలో సోదరుని బాధాతప్తాశ్రువులతో క్షమాపణలు కోరుకుంటూ... ఇంకెవరి పట్లా, ఇంకెన్నడూ ఇటువంటి హృదయవిదారకమైన దారుణం జరుగరాదని మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలా జరుగకుండా ఉండేందుకు హిందువులందరిలోను సత్వరచైతన్యం, సమైక్యభావం పెల్లుబికి రావాలని ఆశిస్తున్నాను.)
చైత్రకృష్ణత్రయోదశీ, శుభకృత్

Saturday, 19 February 2022

ఉత్తరదక్షిణాలుగా భారతవర్షం



ఉత్తరదక్షిణాలుగా భారతవర్షవిస్తీర్ణం మత్స్యపురాణంలో చెప్పబడింది.
"ఆయతస్తు కుమారీతో గంగాయాః ప్రవాహావధి"
(మత్స్య.114.10)
కుమారీతో = కుమారీతః = కన్యాకుమారి నుండి
గంగాయాః ప్రవాాహావధి = గంగాపరీవాహకప్రాంతం (Water basin) మొత్తం.
కన్యాకుమారి భారతదేశపు దక్షిణాగ్రంలో ఉందని మనకు స్పష్టంగా తెలుసు.
కాని, గంగ అంటే నేటి పాఠ్యపుస్తకాలు చెబుతున్నట్లు గంగోత్రిలో పుట్టి బంగాళాఖాతం వరకు ప్రవహించే పుణ్యనది ఒక్కటే కాదు.
గంగకు సప్తస్రోతస్సులు (ఏడు ప్రవాహాలు) ఉన్నాయి.
పరమశివుడు తన శిరస్సునుండి గంగను బిందుసరస్సు వైపు విడిచాడు.
(విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి - అని రామాయణవచనం ప్రమాణం. బాలకాండం, 43.11)
ప్రస్తుతం బిందుసరోవరం అనే పేరిట భారతదేశంలో చాల క్షేత్రాలలో దేవాలయపుష్కరిణులు ఉన్నాయి. కాని, అవేవీ రామాయణంలో చెప్పబడిన బిందుసరస్సు కావు. బిందుసరస్సు అంటే హిమాలయాలలోని మానససరోవరమే. లేదా నేడు మానససరోవరం ఉన్న అప్పటి ప్రాంతం బిందుసరస్సు అనే పేరింట వ్యవహరింపబడుతూ ఉండవచ్చు.
ఒక దేశం పేరిట ఒక జలాశయం ఉండటం, లేదా ఒక జలాశయం పేరిట ఒక దేశం ఉండటం ఈరోజున కూడా మనం గమనించగలం, బెంగాల్ పేరిట ఒక సముద్రాన్ని మనం బే ఆఫ్ బెంగాల్ గా వ్యవహరిస్తున్నాం. అరేబియా దేశం పేరిట అరేబియా సముద్రం ఉన్నది. భారతదేశం పేరిట Indian Ocean ఉన్నది. అలాగే బిందుసరోవరం ఉన్న విశాలభూభాగాన్ని ఆ రోజున బిందుసరోవరంగా వ్యవహరించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
అక్కడనుండి గంగ ఏడు పాయలుగా విడిపోయిందట.
తస్యాం విసృజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే (రా.బా.43.12)
బిందుసరస్సు ప్రాంతం నుండి తూర్పుదిశగా -
1 హ్లాదిని, 2 పావని, 3 నళిని
అనే మూడు పాయలు ప్రవహించాయి. (రా.బా.43.12)
{ఇవన్నీ ప్రాచీనమైన పేర్లు. ఇందులో ఒకదానిని మనం ఇపుడు బ్రహ్మపుత్రగా పిలుస్తున్నాం. మిగిలిన రెండూ నేటి సాల్వీన్ (Salween) మెకాంగ్ (Mekong) నదులు కావచ్చు.}

బిందుసరస్సు ప్రాంతం నుండి పడమటిదిశగా -
1 సుచక్షువు 2 సీత 3 సింధు
అనే మూడు పాయలు ప్రవహించాయి. (రా.బా.43.13-14)
{వీటిలో సింధునది ఇప్పటికీ అదే పేరుతో ప్రసిద్ధమే.}

సింధు పరీవాహకప్రాంతం

సింధునది - నేటి భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో


బిందుసరస్సు ప్రాంతం నుండి మొదట దక్షిణదిశగా, అక్కడనుండి మరలా తూర్పు దిశగా భాగీరథి పేరిట మరొక పాయ ప్రవహించింది. (రా.బా.43.14)

భాగీరథి


మొదట చెప్పినట్టుగా ఈ సప్త గంగా స్రోతస్సుల ప్రవాహావధి – (అంటే సమస్తపరీవాహకప్రాంతం) అంతా భారతవర్షమే. అంటే నేటి మానససరోవరప్రాంతం, అలాగే నేడు టిబెట్ అని పిలవబడుతున్న ప్రాంతం మొత్తం భారతవర్షమే. అలాగే టిబెట్ లో పుట్టిన సాల్వీన్ (Salween) నది ప్రవహిస్తున్న బర్మా, థాయిలండ్ ప్రాంతాలు, టిబెట్ లో పుట్టిన మెకాంగ్ (Mekong) ప్రవహిస్తున్న లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాల ప్రాంతాలు ఇవన్నీ ఒకనాడు భారతవర్షంగానే పిలువబడిందని భావించవచ్చు. ఈ నదులు ఆ ప్రాంతాలలో ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రవహించినట్లుగా కనబడినప్పటికీ, కన్యాకుమారి ప్రాంతం నుండి చూస్తే ఆ విశాలమైన పరిధిలో అవి తూర్పుకు ప్రవహించినట్లుగానే గోచరిస్తాయి. అవన్నీ చివరకు కలిసేది కన్యాకుమారికి తూర్పున ఉన్న సముద్రంలోనే.

బ్రహ్మపుత్ర పరీవాహకప్రాంతం


సాల్వీన్ పరీవాహకప్రాంతం


మెకాంగ్ పరీవాహకప్రాంతం

ఈనాటికి కూడా ఆ ప్రాంతాలలో రామాయణభారతాల కథలు ప్రచారంలో ఉండటం, అక్కడి రంగస్థలాలపై ఇప్పటికీ ఆ కథలు నాటకాల రూపంలోనూ నృత్యాల రూపంలోనూ ప్రదర్శింపబడుతూ ఉండటం, ఇప్పటికీ పురాణపురుషుల పేర్లను తమ సంతానానికి ఆక్కడి ప్రజలు పెట్టుకుంటూ ఉండటం, అతి ప్రాచీనమైన హిందూ దేవాలయాలు అక్కడ ఉండటం అందుకు సజీవసాక్ష్యాలుగా మనం పరిగణించవచ్చు.
ఇంతటి విశాలమైన ప్రాంతాన్ని అంతటి ప్రాచీనకాలంలోనే భారతవర్షమనే పేరిట వ్యవహరించారు. కాని కొందరు అజ్ఞానులు మాత్రం బ్రిటిషువాళ్లు వచ్చి కలిపేదాకా భారతదేశంలో సాంస్కృతికసమైక్యత లేదన్నట్లు మాట్లాడటం ఎంతటి తెలివితక్కువతనం!
మాఘకృష్ణచతుర్థీ, ప్లవః
శ్రీనివాసకృష్ణః

#Mekong 

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/4816802028440439


Tuesday, 4 January 2022

బుడంకాయ


 

బుడంకాయ అనే పేరు చాల ప్రసిద్ధం కదా.

అదే ఇది.
మేము బుడిమే కాయి అంటాము. మజ్జిగమిరపకాయల్లాగ మజ్జిగ బుడిమే కాయిలు చేసుకుని చారన్నంతో పాటు కొరుక్కుని తింటూ ఉంటే, (సొండిగలు లేదా వడియాలు లాగ) ఆహా, ఆ రుచే వేరు.
ఇంగ్లీషులో రకరకాల పేర్లు చెబుతున్నారు. కాని Citron Melon పేరిట కనబడిన చిత్రానికి, ఈ చిత్రంలో మీకు కనిపిస్తున్న దానికి చాల దగ్గరి పోలికలు ఉన్నాయి. https://en.wikipedia.org/wiki/Citron_melon
గ్లోవ్స్ గాని, ప్యాడ్స్ కాని వేసుకోకుండా మంచి జోరుగా క్రికెట్ ఆడుతూ ఫాస్ట్ బౌలర్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడబోతే, అది కాస్త బ్యాట్ కు తగలకుండా మన బొటనవ్రేలిని ముద్దాడితే ఆ సమయంలో బ్యాట్ హ్యాండిల్ కు గట్టి కార్క్ బంతికి నడుమ చితికిపోయిన ఆ బొటనవ్రేలు ఎంతగా పొంగిపోతుందో - ఆ పొంగంత పరిమాణంలో ఉంటుంది ఈ బుడిమే కాయి.

ఉష్ణకంటక లేదా కంటఫల

 


The Hindu (అక్టోబర్ 26, 2020) లో ఒక వార్త వచ్చింది.

ముంబై యూనివర్శిటీలో (ఎమ్మెస్సీ బోటనీ) చదువుతున్న ఒక విద్యార్థి సహ్యాద్రి పర్వతాలలో Echinops జాతికి చెందిన ఒక క్రొత్త రకం మొక్కను కనిపెట్టాడని, దానికి Echinops Sahyadricus అని పేరు పెట్టారని.
అరెరె. అదే మొక్కను నేను నిన్న మా చేని కంచెలో కనుగొన్నానే. Echinops Kalyanadurgicus అనే పేరు పెట్టే అవకాశం కోల్పోయాను కదా అనిపించింది.
కాని, తీరా చూస్తే Indian Medicinal Plants గూర్చి మంచి పరిశోధన చేసినవారందరూ ఇది భారత-ఉపఖండమంతటా సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులోపల తరచు కనిపిస్తూ ఉంటుందని స్పష్టం చేశారు.
)))ఉష్ణకంటక (కంటఫల)(((
మా చేని కంచెలో ఈ అందమైన పూల చెండు కనిపించింది. ఇదేమై ఉంటుంది అని వెతికితే దీనిని గురించి కొన్ని విశేషాలు తెలిశాయి. దానిని ఇంగ్లీషులో Echinops Echinatus అని, సంస్కృతంలో ఉష్ణకంటక లేదా కంటఫల అని అంటారట.
ఈ గుల్మానికి బాగా ముండ్లు ఉండటం వల్ల కంటకఅనే పేరు వచ్చినట్టుంది. ఎంతగా ఎండ ఉంటే అంతగా ఇది పెరుగుతుందట. అందువల్ల ఉష్ణ అనే పేరు తగిలించారు కావచ్చు. రెండూ కలసి ఉష్ణకంటక అనే పేరు పెట్టారేమో. (ఏమో – నా ఊహ మాత్రమే)
ఇంగ్లీషులో Indian Globe Thistle అని వ్యవహారం కూడా ఉందట. గుండ్రంగా ఉన్నది కాబట్టి Globe అని, ముండ్లతో కూడి ఉన్నది కాబట్టి Thistle అని అలా అంటారు కాబోలు.
కన్నడభాషలో బ్రహ్మదండి అంటారు అన్నారు కాని, ఇది బ్రహ్మదండి కాదు. ఇది, బ్రహ్మదండి సజాతీయమైనవి కావచ్చును. అంతవరకే.
ఇది నూరు సెంటీమీటర్ల ఎత్తు పెరిగే వార్షికపు మొక్క అన్నారు కాని, నేను చూసినది నాకంటె ఎత్తైన మొక్క.
ఇది డిసెంబరు - జనవరి మాసాలలో పుష్పిస్తుందట. అందువల్లనే జూలై నుండి నవంబరు వరకు ఎప్పుడూ ఇది నా కంటబడలేదు. డిసెంబరులో కూడా కనబడలేదు. చివరకు జనవరిలో మాత్రం నా కంటబడకుండా తప్పించుకోలేకపోయింది.
మన భారతీయఆయుర్వేదులు కనుగొన్న ప్రకారం, ఇది Anti flammatory అట. అంట కాలిన గాయాలను, వాపులను తగ్గించే గుణం కలిగినదన్నమాట. ఇది Tonic కూడా అట. అంటే బాగా ఆకలిని పుట్టించి తద్ద్వారా బలాన్ని కలిగించేదన్న మాట. ఇది Diuretic అట. అంటే మూత్రవర్ధకం, రక్తంలో నీరు చేరుకొంటే దానిని తొలగిస్తుంది. రక్తనాళాలలో ప్రవహించే ద్రవాన్ని తగ్గించి, తద్ద్వారా రక్తపు పోటును (BP) నివారిస్తుంది. Antipyretic అట. అంటే జ్వరనివారిణి. Analgesic అట. అంటే నొప్పులు తగ్గించేది. Aphrodisiac అట. అంటే ధాతువృద్ధిని కలుగజేసేది. ఇంకా, కాలేయాన్ని చురుకుగా పని చేయిస్తుందట. కీళ్ల నొప్పులను పోగొడుతుందట.
పొడిదగ్గుకు (Hoarse cough), అపస్మారానికి (Hysteria), అజీర్ణానికి (Dyspepsia,) గండమాల అనే కుష్టుకు (Scrofula), కండ్లకలకకు (Opthalmia), ఇది మంచి ఔషధం.
కేవలం కొమ్మలకు ఆకులకు మాత్రమే ఈ విధమైన ఔషధగుణాలు ఉన్నాయనుకోకండి, వీటి వేళ్లు కూడా వైద్యప్రయోజనాలు కలిగినవే అంటున్నారు. వీటి వేర్లను పొడి చేసి తలకు రాసుకుంటే పేలు తొలగిపోతాయట. రాజస్థానంలోని భిల్లులు వీటి వేర్లను నీటిలో వేసుకుని, దగ్గుకు జలుబుకు మందుగా త్రాగుతారట. గుజరాత్, భావనగర్ ప్రాంతపు జనాలు వీటి వేళ్లను పొడి చేసి, దానిలో నీటిచుక్కలు కలిపి, తేలుకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారట. అది నీటిలో కలుపుకుని త్రాగితే బేదులకు కూడా మంచి మందని ఆంధ్రప్రదేశ్ లోని కోలాములు కనిపెట్టారట. సంతానం లేని వారికి సంతానం కూడా కలిగిస్తుందని ఆయుర్వేదవైద్యులు అంటారట.
ఓహో, ఇంత గొప్ప మొక్క మా చేను కంచెలో సహజంగా ఆవిర్భవించడం చాల గొప్ప విషయం కదా? కాని, దాని గొప్పతనమేమిటో ఈరోజే నాకు తెలిసింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే సామెత నాలాంటి వారు ఉండటం వల్లనే పుట్టిందేమో.
ఈ క్రింది లింకులలో మరింత బాగా ఈ మొక్కను గూర్చి తెలుసుకోవచ్చును.
రైతులు ఇటువంటి పొదలు తీగలతో కూడిన సహజమైన కంచెలను అనాలోచితంగా, వేలం వెర్రిగా తొలగించి, కృత్రిమమైన ఇనుపతీగల కంచెలను వేసుకొనడమనే పనిని మానుకోవాలి.
రైతులతో పాటు జీవవైవిధ్యం వర్ధిల్లాలి.
పుష్యశుక్లద్వితీయా, ప్లవః

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...