Showing posts with label ఋణం. Show all posts
Showing posts with label ఋణం. Show all posts

Thursday, 2 September 2021

విజృంభిస్తున్న చార్వాకులు!


 చర్వణం అంటే నమలడం. అంటే తినడం. కడుపునింపుకొనడం (అనుభవించడం) మాత్రమే జీవితలక్ష్యమని, మిగిలినవన్నీ మనిషికి అనవసరమనీ భావించేవారు చార్వాకులు.
చారు వాక్ అనే రెండు పదాలనుండి చార్వాక అనే పదం వచ్చిందని కొందరు పండితులు అంటారు. చారు అంటే అందమైనది లేదా మనసును ఆకర్షించేది అని అర్థం. వాక్కు అంటే మాట అని అర్థం.
చార్వాకుల మాటలు, వారి బోధనలు పామరుల మనస్సులను ఇట్టే ఆకర్షించేవట. ఎందుకు ఆకర్షించవు? ఇప్పట్లో మన రాజకీయనాయకులు చేసే వాగ్దానాలు కూడా ఆనాటి చార్వాకుల మాటల మాదిరిగానే ఉండ్ల్యా?
వారి జీవితవిధానానికి ఈ క్రింది ఉదాహరణ ఒక మచ్చు మాత్రమే.
ఋణం కృత్వా ఘృతం పిబేత్!
భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః?
అప్పు చేసి నెయ్యి త్రాగాలి.
(అప్పు చేసి పప్పుకూడు అని తెలుగులో)
శరీరం కాలిపోయాక మళ్లీ వచ్చేదెలా?
అంటే మనం కష్టపడి సంపాదించి అనుభవించాలి అనే కాన్సెప్టును వీరు అంగీకరించరు. పుట్టడమనేది వీరికి సంబంధించి ఒక ఆకస్మికపరిణామం. ఒక ఆక్సిడెంట్. అంతే. పుట్టిన తరువాత జీవితాన్ని అనుభవించి వదిలేయాలి అంటారు. కాని సంపాదన ఉంటే కాని జీవితాన్ని ఆనందించడం సాధ్యం కాదు. సంపాదన కోసం శ్రమిస్తే అందువల్ల ఆనందం ఏముంది, కష్టం తప్ప? అని వీరి అభిప్రాయం. అందువల్ల కష్టపడకుండా, అప్పులు చేయాలి, అనుభవించాలి అంటారు.
కాని, ఆనాడైనా ఈనాడైనా భారతీయులందరికీ అప్పు అంటే చచ్చేంత భయం. అప్పు చేయడం ఎంత సులువో తిరిగి ఆ అప్పును తీర్చడం అంత కష్టం కదా. అప్పును తీసుకున్న తరువాత ఎలాగైనా తీర్చివేయవలసిందే. ఋణం తీర్చుకొనడం అనేది భారతీయులకు ఒక పవిత్రమైన భావన. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా తాను ఋణపడ్డానని, వారిని సంతోషపెట్టడం ద్వారా ఆ ఋణం తీర్చుకోవాలని భావిస్తారు. అటువంటిది ఎవరో పరాయి వ్యక్తుల దగ్గరనుండి ఋణం తీసుకుంటే తిరిగి ఆ ఋణం తీర్చకపోవడమనేది మహాపాపమని భావిస్తారు. ఋణం తీర్చకుండా మరణిస్తే మరుసటి జన్మలో కూడా ఆ ఋణభారం తమ నెత్తిన కొండగా మారి పడుతుందని, కాబట్టి అప్పు తీసుకున్న జన్మలోనే ఆ అప్పును తిరిగి చెల్లించేయాలని తాపత్రయపడతారు. ఒక వ్యక్తి అప్పు తీర్చకుండానే మరణిస్తే, ఆ వ్యక్తి కుమారుడు తన తండ్రి చేసిన అప్పును తీర్చడం తన బాధ్యతగా భావించి తీర్చడానికే ప్రయత్నిస్తాడు.
సర్వేషామపి శౌచానామ్ అర్థశౌచం పరం స్మృతమ్ - అని పెద్దల మాట. శౌచమంటే కేవలం పళ్లు తోమడం స్నానం చేయడం మడి బట్టలు కట్టడం మాత్రమే కాదు, ఆర్థికవిషయాలలో కూడా పవిత్రంగా ఉండాలి. నిజానికి అదే అన్నిటిలోనూ నిజమైన, అతి గొప్పదైన శౌచం (పవిత్రత) అని నైతికశాసనం కూడా చేశారు.
అలాంటి భారతీయసామాజికభావన మీద చార్వాకులు తిరుగుబాటు చేశారు. అప్పు చేసి చచ్చేేంతవరకూ అనుభవించడమే జీవితపరమార్థమని, తిరిగి అప్పు తీర్చే బాధ్యతను నెత్తిమీద పెట్టుకోవద్దని, పునర్జన్మ అనేది, పునర్జన్మలో మరలా ఋణభారం అనేది వట్టి పనికిమాలిన అబద్ధపు మాటలని ప్రచారం చేశారు.
అదిగో - సరిగ్గా అక్కడే - పునర్జన్మ అనేది బూటకం అని, బాధ్యతారాహిత్యమే జీవితసారాంశమని చార్వాకులు అన్నారు కదా. అక్కడే పామరజనాలకు చార్వాకులు పిచ్చిపిచ్చిగా నచ్చేశారు. వేలం వెర్రిగా వారి బోధనలను అనుసరించారు.
సామాజికజీవనం వారి బాధ్యతారాహిత్యంతో అస్తవ్యస్తమైంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు బాధ్యత లేదు. పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యత లేదు. భార్యాభర్తల నడుమ అనుబంధం పరస్పరబాధ్యత అనే ప్రశ్న లేదు. యజమానినుండి జీతం తీసుకొనడమే తప్ప ఆ యజమాని చెప్పిన పనులు చేయవలసిన బాధ్యత తనకు లేదని ఉద్యోగులు భావించారు. వ్యవసాయం చేయవలసిన బాధ్యత లేదని, ఎవడో పండించిన పంటను ఎత్తుకుపోయి అనుభవించడంలో తప్పు లేదనే భావాలు ప్రబలిపోయాయి. అనేక తరాలుగా మలచబడ్డ ఒక సామాజికవ్యవస్థ వీరి ఆగడాలవలన ఛిన్నాభిన్నమైపోయింది.
స్వర్గమూ లేదు, నరకమూ, లేదు, పునర్జన్మ లేదు, సృష్టించే దేవుడూ లేడు, దండించే యముడూ లేడు, అసలు శరీరం కంటె వేరుగా ఆత్మ అనేది లేనే లేదు. కాబట్టి దేనికీ మనం భయపడవలసిన అవసరం లేదు, Boys, Let us just Enjoy ourselves అనే మూకలు తయారైనాయి. అదిగో - ఆ సమయంలోనే ఆ చార్వాకులకు ఆ చార్వాకుల అనుయాయులకు నాస్తికులు అని పేరు వచ్చింది.
అస్తి అంటే ఉన్నది అని అర్థం. ఆత్మ అనేది ఉన్నది, పునర్జన్మ ఉన్నది అనేవారు ఆస్తికులు.
నాస్తి (న + అస్తి) అంటే లేదు అని అర్థం. ఆత్మ అనేది లేదు, పునర్జన్మ అనేది లేదు అనేవారు నాస్తికులు.
వేదాలు ఆత్మ ఉన్నదని, కర్మానుసారం పునర్జన్మ ఉంటుందని చెబుతాయి కాబట్టి, పాణిని నాస్తికుడు అంటే వేదనిందకుడు (వేదాలను తిరస్కరించేవాడు నాస్తికుడు) అని నిర్వచనం చేశాడు.
కాని, క్రమంగా చాలమంది ఈ చార్వాకుల నాస్తికభావాల వలన సమాజానికి కలిగే నష్టమేమిటో స్వీయానుభవాల వలన తెలుసుకున్నారు. బాధ్యతారాహిత్యం వలన దుఃఖమే తప్ప సుఖం అనేది ఎండమావిలో నీటివంటిది అని గ్రహించారు. తాము మారారు. మారని వారిని దూరంగా ఉంచారు. (అది వెలివేయడం అనండి, బహిష్కరణ అనండి.) నాస్తికులు నిందాపాత్రులైనారు. అప్పటినుండే నాస్తిక అనే పదం వెక్కిరింతకు గురైంది. నాస్తికులను వారి చేష్టలను, వారి బాధ్యతారాహిత్యాన్ని అసహ్యించుకొనడం అప్పటినుండే ప్రారంభమైంది.
(అసహ్యించుకొనడం అనే పదానికి hate అనే ఇంగ్లీషు పదాన్ని ఉపయోగించి అనువాదం చేస్తుంటారు. కాని అసహ్యము అంటే ద్వేషించడం కాదు. సహింపరానిది అని అర్ధం. ఎండాకాలంలో ఎండ కూడా మనకు అసహ్యమే. అంటే మనం సహించలేనిదే. అంటే మనం ఎండ ధాటికి తాళలేమని, ఎండకు తట్టుకోలేమని అర్థం. అంతే కాని ఎండను ద్వేషిస్తున్నామని అర్థం కాదు. సంస్కృతాన్ని నిష్కారణంగా ద్వేషించే కొందరు మిడిమిడి జ్ఞానపు తెలుగు పండితులు (!!!) అసహ్యమంటే ద్వేషించడమే అని భావిస్తూ, తాము పెంచుకున్న భావదారిద్ర్యాన్నంతా తమ జీవితచరిత్రల రూపంలో కూడా వెలిగ్రక్కుతూ ఉంటారు.)

సరే, మొత్తానికి అప్పట్లోనే ప్రజలు వారి ప్రభావంనుండి బయటపడడానికి, సభ్యసమాజంగా మరలా రూపు దిద్దుకొనడానికి చాల కాలం పట్టింది. అలా చార్వాకులు లేదా నాస్తికులు ఒకప్పుడు భారతీయసమాజంలో ఒక వెలుగు వెలిగారు. (తమ స్వార్థం కోసం సమాజాన్ని ఆటవికసమాజంగా మార్చేశారు.)
ఇదిగో, మరలా ఈ రోజుల్లో ఆ చార్వాకులు లేదా నాస్తికులు మరలా విజృంభించేందుకు, సమాజాన్ని మరలా అల్లకల్లోలం చేసేందుకు ఈవిధంగా సంసిద్ధులౌతున్నారు.
ఇప్పటికే నాయకులనే ముసుగులో కొందరు చార్వాకులు అప్పులు చేసిన వారు మరలా కట్టనవసరం లేదని ఋణమాఫీ పేరిట జనాలను ఆకట్టుకొనడం మొదలు పెట్టారు. శ్రమించకుండా అప్పనంగా వచ్చే సొమ్మును పామరజనాలకు బాగా రుచి చూపించారు. సోమరిపోతుల సైన్యాలను సృష్టించారు. క్రొత్త క్రొత్త పన్నులను కనిపెడుతున్నారు. కష్టించి పని చేసేవారి కష్టార్జితాన్ని యథేష్టంగా దోచేస్తున్నారు. తమ సోమరిసైన్యాలకు పంచి పెట్టి పోషిస్తున్నారు.
భారతీయసమాజవ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకలించి నాశనం చేయడమే వారి లక్ష్యం.
ఆ నాయకకుటుంబమంతా ఇదే తమ ఏకైకలక్ష్యంగా అధికారాన్ని కూడా సంపాదించి ఇప్పటికే సగం సమాజాన్ని చెడగొట్టింది. వారి అజెండా అమలు కావాలంటే వారికి ఐదేళ్ల వ్యవధి సరిపోదు. మళ్లీ మళ్లీ అధికారానికి రావలసిన అవసరం ఉంది. అందుకే ఇరవైయేళ్ల అధికారం, ముప్పైయేళ్ల అధికారం అంటూ కలవరిస్తుంటాడా నాయకుడు. వారికి మనం ఆ అవకాశం ఎంతమాత్రం ఇవ్వరాదు.
వారి నుండి ఉచితంగా అందుతున్న తాయిలాలకు ఆశపడి, వారి ఆశయాలకు అనుగుణంగా ఇదుగో ఈ ప్రొఫెట్ జీయం మోజెస్ లాంటివారు బహిరంగంగానే అప్పులను రద్దు చేయించేస్తానంటూ ఆరాధనలంటూ వెర్రి మొర్రి ఆరాధనలు కూడా మొదలు పెట్టారు.
వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు
చీడపురుగు చేరి చెట్టు చెరచు.
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా
విశ్వదాభిరామ వినుర వేమ
అని వేమన చెప్పిన మాటలు మనం స్మరించుకుని, ఇలాంటి నాస్తికుల గోముఖవ్యాఘ్రపు బోధనలనుండి మనవారు అనుకున్నవారిని జాగ్రత్తగా కాపాడుకుందాం.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...