The Hindu (అక్టోబర్ 26, 2020) లో ఒక వార్త వచ్చింది.
ముంబై యూనివర్శిటీలో (ఎమ్మెస్సీ బోటనీ) చదువుతున్న ఒక విద్యార్థి సహ్యాద్రి పర్వతాలలో Echinops జాతికి చెందిన ఒక క్రొత్త రకం మొక్కను కనిపెట్టాడని, దానికి Echinops Sahyadricus అని పేరు పెట్టారని.
అరెరె. అదే మొక్కను నేను నిన్న మా చేని కంచెలో కనుగొన్నానే. Echinops Kalyanadurgicus అనే పేరు పెట్టే అవకాశం కోల్పోయాను కదా అనిపించింది.
కాని, తీరా చూస్తే Indian Medicinal Plants గూర్చి మంచి పరిశోధన చేసినవారందరూ ఇది భారత-ఉపఖండమంతటా సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులోపల తరచు కనిపిస్తూ ఉంటుందని స్పష్టం చేశారు.
మా చేని కంచెలో ఈ అందమైన పూల చెండు కనిపించింది. ఇదేమై ఉంటుంది అని వెతికితే దీనిని గురించి కొన్ని విశేషాలు తెలిశాయి. దానిని ఇంగ్లీషులో Echinops Echinatus అని, సంస్కృతంలో ఉష్ణకంటక లేదా కంటఫల అని అంటారట.
ఈ గుల్మానికి బాగా ముండ్లు ఉండటం వల్ల కంటకఅనే పేరు వచ్చినట్టుంది. ఎంతగా ఎండ ఉంటే అంతగా ఇది పెరుగుతుందట. అందువల్ల ఉష్ణ అనే పేరు తగిలించారు కావచ్చు. రెండూ కలసి ఉష్ణకంటక అనే పేరు పెట్టారేమో. (ఏమో – నా ఊహ మాత్రమే)
ఇంగ్లీషులో Indian Globe Thistle అని వ్యవహారం కూడా ఉందట. గుండ్రంగా ఉన్నది కాబట్టి Globe అని, ముండ్లతో కూడి ఉన్నది కాబట్టి Thistle అని అలా అంటారు కాబోలు.
కన్నడభాషలో బ్రహ్మదండి అంటారు అన్నారు కాని, ఇది బ్రహ్మదండి కాదు. ఇది, బ్రహ్మదండి సజాతీయమైనవి కావచ్చును. అంతవరకే.
ఇది నూరు సెంటీమీటర్ల ఎత్తు పెరిగే వార్షికపు మొక్క అన్నారు కాని, నేను చూసినది నాకంటె ఎత్తైన మొక్క.
ఇది డిసెంబరు - జనవరి మాసాలలో పుష్పిస్తుందట. అందువల్లనే జూలై నుండి నవంబరు వరకు ఎప్పుడూ ఇది నా కంటబడలేదు. డిసెంబరులో కూడా కనబడలేదు. చివరకు జనవరిలో మాత్రం నా కంటబడకుండా తప్పించుకోలేకపోయింది.
మన భారతీయఆయుర్వేదులు కనుగొన్న ప్రకారం, ఇది Anti flammatory అట. అంట కాలిన గాయాలను, వాపులను తగ్గించే గుణం కలిగినదన్నమాట. ఇది Tonic కూడా అట. అంటే బాగా ఆకలిని పుట్టించి తద్ద్వారా బలాన్ని కలిగించేదన్న మాట. ఇది Diuretic అట. అంటే మూత్రవర్ధకం, రక్తంలో నీరు చేరుకొంటే దానిని తొలగిస్తుంది. రక్తనాళాలలో ప్రవహించే ద్రవాన్ని తగ్గించి, తద్ద్వారా రక్తపు పోటును (BP) నివారిస్తుంది. Antipyretic అట. అంటే జ్వరనివారిణి. Analgesic అట. అంటే నొప్పులు తగ్గించేది. Aphrodisiac అట. అంటే ధాతువృద్ధిని కలుగజేసేది. ఇంకా, కాలేయాన్ని చురుకుగా పని చేయిస్తుందట. కీళ్ల నొప్పులను పోగొడుతుందట.
పొడిదగ్గుకు (Hoarse cough), అపస్మారానికి (Hysteria), అజీర్ణానికి (Dyspepsia,) గండమాల అనే కుష్టుకు (Scrofula), కండ్లకలకకు (Opthalmia), ఇది మంచి ఔషధం.
కేవలం కొమ్మలకు ఆకులకు మాత్రమే ఈ విధమైన ఔషధగుణాలు ఉన్నాయనుకోకండి, వీటి వేళ్లు కూడా వైద్యప్రయోజనాలు కలిగినవే అంటున్నారు. వీటి వేర్లను పొడి చేసి తలకు రాసుకుంటే పేలు తొలగిపోతాయట. రాజస్థానంలోని భిల్లులు వీటి వేర్లను నీటిలో వేసుకుని, దగ్గుకు జలుబుకు మందుగా త్రాగుతారట. గుజరాత్, భావనగర్ ప్రాంతపు జనాలు వీటి వేళ్లను పొడి చేసి, దానిలో నీటిచుక్కలు కలిపి, తేలుకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారట. అది నీటిలో కలుపుకుని త్రాగితే బేదులకు కూడా మంచి మందని ఆంధ్రప్రదేశ్ లోని కోలాములు కనిపెట్టారట. సంతానం లేని వారికి సంతానం కూడా కలిగిస్తుందని ఆయుర్వేదవైద్యులు అంటారట.
ఓహో, ఇంత గొప్ప మొక్క మా చేను కంచెలో సహజంగా ఆవిర్భవించడం చాల గొప్ప విషయం కదా? కాని, దాని గొప్పతనమేమిటో ఈరోజే నాకు తెలిసింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే సామెత నాలాంటి వారు ఉండటం వల్లనే పుట్టిందేమో.
ఈ క్రింది లింకులలో మరింత బాగా ఈ మొక్కను గూర్చి తెలుసుకోవచ్చును.
రైతులు ఇటువంటి పొదలు తీగలతో కూడిన సహజమైన కంచెలను అనాలోచితంగా, వేలం వెర్రిగా తొలగించి, కృత్రిమమైన ఇనుపతీగల కంచెలను వేసుకొనడమనే పనిని మానుకోవాలి.
రైతులతో పాటు జీవవైవిధ్యం వర్ధిల్లాలి.
పుష్యశుక్లద్వితీయా, ప్లవః