Friday, 17 March 2023

అవునా? నిజమా? ఎలాగో చెప్పు మరి?

 


పేద కార్మికుల సంపద అంతా అంబానీకి బదిలీ అయిపోతూ వుందా?
ఎందుకురా అబద్ధాలు?

ఎలా బదిలీ అవుతోంది?

అదేమైనా నగదు బదిలీనా?
అంటే పేద కార్మికుల జేబుల్లోంచి అంబానీ లాక్కుంటున్నాడా? లేదా అంబానీ బ్యాంకులతో లాలూచీ పడి పేదవాళ్ల అకౌంట్లలోని డబ్బును దొంగతనంగా తన అకౌంటులోనికి మార్పించుకుంటున్నాడా?

అదేం లేనపుడు, మరి పేదవారి సంపద అంబానీకి బదిలీ అయిపోతోందని ఎందుకు గగ్గోలు పెడుతున్నావు?

పోనీ అదేమైనా ఆస్తి బదిలీనా?
అంటే పేదవాళ్ల ఇండ్లు, పొలాలు, గొడ్డూ గోదా వంటి ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్లి తన పేరున దొంగతనంగా రాయించుకుంటున్నాడా అంబానీ?

అదేం లేనపుడు, మరి పేదవారి సంపద అంబానీకి బదిలీ అయిపోతోందని ఎందుకు గగ్గోలు పెడుతున్నావు?

ఒరే మూర్ఖుడా,

అంబానీ సంస్థల విలువ పెరుగుతోంది అంటే, అది అంబానీ ఒక్కడిదే కాదు. ఆ సంస్థలకు చెందిన వేలాది లక్షలాది షేర్ హోల్డర్ల సంపద కూడా పెరుగుతోంది అని అర్థం.

కనీసం ఆ సంపద కూడా భౌతికమైనది కూడా కాదు. అంబానీ తన తెలివితేటలతో చక్కగా వ్యాపారం చేస్తూ మంచి లాభాలను సంపాదిస్తూ వాటిని షేర్ హోల్డర్లందరికీ న్యాయంగా పంచుతూ ఉండటం వల్ల సహజంగానే ఆ సంస్థలకు చెందిన షేర్ల విలువ స్టాక్ మార్కెట్లో పెరుగుతుంది. అదీ ఇక్కడ సంపద విలువ పెరగడమంటే. ప్రపంచంలో ఎక్కడైనా అలాగే జరుగుతుంది.

అంతే కాదు, అంబానీ సంస్థలలో లక్షలాది భారతీయులు పని చేస్తూ చక్కగా సంపాదించుకుంటూ బ్రతుకుతున్నారు. మరిన్ని లక్షలమంది వారి ఉత్పత్తులను రవాణా చేస్తూ, అమ్ముతూ, పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. అంబానీ సంస్థల సేవలను దేశంలో కోట్లాది ప్రజలు ఉపయోగించుకుంటూ లాభపడుతున్నారు.

అసలు నీ సంగతే చెప్పు, నువ్వు ఈ ఫొటోలోని పనికి మాలిన సందేశాన్ని కూడా అందరికీ సోషల్ మీడియాలో పంచగలగటానికి కారణం అంబానీ నీకు చాల చవకగా ఇచ్చిన జియో డేటానే కదా?

అందువల్ల, అంబానీ సంపద ఎంత పెరిగినా అది దేశానికి, దేశంలోని ప్రజలకు ఉపయోగపడుతుంది. మరి నీ పనికిమాలిన రెచ్చగొట్టుడు మాటల వల్ల ఎవరికిరా ఉపయోగం, చెప్పు?

ఇది అర్థం చేసుకొనడం చేతగాని నువ్వు, అంబానీ పేదవారి కంచంలోని బువ్వను లాక్కు పోతున్నట్టు ఆ అరుపులు ఆ కేకలు ఆ దుష్ప్రచారం ఏమిటిరా? నీలాంటి అజ్ఞాని మాటలు విని నిజమే కాబోలు అనుకుని ఎంతమంది ఆవేశపరులైన యువకులు తప్పుదారిన పడతారో కదా? తమకు ఉపాధిని కల్పించగల సంస్థలనే వారు తిరస్కరిస్తే వారికి ఉపాధిని మీరు కల్పిస్తారా?

కేరళను దశాబ్దాల తరబడి మీరు పాలిస్తున్నారే? అక్కడ పేదరికం లేదా? అక్కడ ధనవంతులు లేరా? అక్కడ అంబానీ సంస్థలవల్ల ఎవరికీ మేలు జరగడం లేదా? అంబానీ వల్ల కేరళీయులకు ఉపాధి కలగటం లేదా?

పోనీ, కేరళలో పేదవారి సొమ్మును మీరన్నట్టు అంబానీ నిజంగానే దారుణంగా దోచేస్తున్నాడనే అనుకుందాం. మరి మీరేం చేస్తున్నారు? అంబానీ ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారిని తన్ని తరిమేయవచ్చు కదా? అలా మీరు ఎందుకు చేయటం లేదు మరి?

ఎందుకంటే మీరు అలా చేస్తే అంబానీ ద్వారా ఉపాధి పొందుతున్న కేరళప్రజలే మీమీద తిరగబడతారు. జనాలకు మీ మాటలలోని అబద్ధాలు స్పష్టంగా తెలిసి పోతాయి. అదీ మీ భయం.

అసలు అంబానీ ఒక్కడే ఎందుకు వ్యాాపారం చేయాలి, మిగిలిన వారు వ్యాపారం చేయవద్దా అని మీరు అడగవచ్చు. చేయండి. అంబానీ అంత తెలివిగా సమర్థవంతంగా చేయండి. ఎవరు వద్దంటారు?

కాని, దురదృష్టవశాత్తు మన విద్యావ్యవస్థ అటువంటి తెలివైనవారిని తయారు చేయడానికి అనుగుణంగా రూపుదిద్దుకోలేదు. మాటలు కూడా సరిగా రాకముందే ఇంగ్లీషు మీడియంలో చదివి, ఇంకొకరి క్రింద ఉద్యోగాలనే పేరిట గులాం గిరీ చేసే ఆత్మగౌరవం లేని మనుషులను సృష్టించడానికి మాత్రమే అది ఉపయోగపడుతోంది. మీలాంటి వారి మాటలలోని నిజానిజాలను చక్కగా ఆలోచించి గ్రహించడానికి కూడా ఆ విద్యావ్యవస్థ తోడ్పడదు. బుర్రను పెంచే చదువు నీకు అబ్బి ఉంటే ఇలాంటి తెలివి తక్కువ మాటలను నువు అసలు మాట్లాడేవాడివేనా?

అందువల్ల సహజప్రతిభాసంపన్నుడైన అంబానీ వంటి వ్యాపారవేత్త, ఉపాధిసృష్టికర్త మన దేశంలో ఎక్కడో కోటికో వంద కోట్లకో ఒకడు అప్పుడప్పుడు పుడుతూ ఉంటాడు. వారి బుద్ధివైభవాన్ని, అభివృద్ధిని చూసి స్వయంగా బాగుపడటం చేతగాక ఈర్ష్యపడే మీలాంటి వాళ్లు మాత్రం అటువంటి వారిని మీ స్థాయికి దిగజార్చి ఆనందపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

సరే, మీకు పేద కార్మికుల మీద అంత ప్రేమే గనుక ఉంటే, వారికి అంబానీ సంస్థలలో షేర్లు కొని ఇవ్వండి. అంబానీ సంపద పెరిగితే వారి సంపద కూడా పెరుగుతుంది.

సాక్షిగాడు మీకంటె ఘోరం. అంబానీ సంస్థలను అమ్మేసి ఆ డబ్బును దేశప్రజలకు పంచేస్తే తలసరి మొత్తం ఎంత వస్తుంది అంటూ ఆ మధ్య లెక్కలేసి మరీ వ్యాసం రాశాడు. మరి సాక్షి తనను తన యజమాని అమ్మేసి ఆ సొమ్మును తనకోసం పని చేస్తున్న జర్నలిస్టులు, ఎడిటర్లు, ప్రింటర్లు, హాకర్లకు పంచేస్తే ఎంత వస్తుందని లెక్కలు ఎందుకు వేయటం లేదో మరి ?

అందువల్ల, పనిలో పని, నెల నెలా ఉచితపంపకాలు మాని అంబానీ కంపెనీల షేర్లు ఒకే ఒక్కసారికి పేద ప్రజలకు కేటాయించమని మన ముఖ్యమంత్రికి సలహా ఇవ్వండి. నెమ్మదిగా వారు కూడా బాగుపడతారు. ఆయనకు ఉచితపంపకాల సరదా ఎక్కువౌతున్నకొద్దీ ఇక్కడ మా జేబులు గుల్లైపోతున్నాయి. 

ధీమంతుడు



అబ్బో ఆ మనిషి గొప్ప ధీమంతుడురా అంటూ ఉంటాం. లేదా వింటూ ఉంటాం. మనకున్న అభిమానాన్ని బట్టో కలిగిన ఆశ్చర్యాన్ని బట్టో ఎవరినైనా అలా ప్రశంసిస్తాం గాని...

...అందరూ ధీమంతులు కాగలరాా? ధీగుణాలు కలిగినవారు మాత్రమే ధీమంతులు కాగలరు. మరి ధీగుణాలు ఏమిటి?

ఎనిమిది ధీగుణాలు కామందకీయరాజనీతిశాస్త్రంలో చెప్పబడ్డాయి. (వాటిని శంకరార్యులు తన జయమంగళవ్యాఖ్యలో నిర్వచించారు. శంకరార్యులు వేరు, శంకరాచార్యులు వేరు)

వాటిని క్రింద పట్టికలో పొందుపరచాను.

చాణక్యులవారు తమ అర్థశాస్త్రంలో కూడా ఈ ఎనిమిది ధీగుణాలను చెప్పారు. ఈ క్రింద చెప్పిన క్రమంలో కాక, ధారణకు ఊహకు నడుమ 'విజ్ఞానం' అనే ధీగుణాన్ని పేర్కొన్నారు.

విజ్ఞానం అంటే నిర్వచనం - వివిధసాధ్యసాధనస్వరూపవివేకజ్ఞానమ్ - అని. అంటే అర్థం చేసుకున్న విషయాలలో నేను సాధింపదగినది ఇది అని, సాధించేందుకు ఉపయోగపడే సాధనం ఇది అని వాటి నడుమ తేడాను తెలుసుకొనగలగటం. సాధనం అంటే పరికరం - instrument.

బుద్ధి, నైపుణ్యం, తెలివితేటలు సాధ్యాలు. అంటే సాధింపదగినవి. వాటిని సాధించాలంటే పుస్తకాలు కేవలం సాధనాలు. సాధించవలసినది పుస్తకాలను కాదు కదా?

{{ అలాగే, మనిషి సుఖపడాలంటే ధర్మం చేయాలి. కాబట్టి ధర్మం అనేది సాధ్యం. (సాధింపదగినది.) తల్లిదండ్రులను గురువులను సేవించడం, అతిథులను ఆదరించటం, పేదలను ఆదుకొనటం, ప్రాణుల పట్ల దయతో వ్యవహరించటం, చెట్లు నాటటం, చెఱువులు బావులు తవ్వించటం మొదలైనవి ధర్మకార్యాలు అనుకుందాం.

అయితే ఇవన్నీ చేయటం అంత సులువు కాదు. అందుకు తగినంత ధనం కావాలి. కాబట్టి ధనం అనేది ధర్మం సాధించడానికి ఒక సాధనం (instrument) మాత్రమే.

((ఒకప్పుడు సాధ్యమైన వస్తువు మరొకప్పుడు అంటే సాధింపబడిన తరువాత వేరొక దానిని సాధించేందుకు సాధనం కావచ్చు.))

ధనాత్ ధర్మం - తతః సుఖమ్ అనేది క్రమం. సంపాదించిన ధనంతో ధర్మం చేయాలి. ఆ ధర్మం వలన సుఖం కలుగుతుంది అనేది క్రమం. అలా కాకుండా నేరుగా ధనంతో సుఖాన్ని పొందగోరటమే అక్రమం.

కాని, మనుషులు ధనమే సాధ్యమనుకుని, ధర్మాన్ని మరచిపోయి ధనాన్ని సాధించడంలోనే తమ యావజ్జీవితాన్ని గడిపేస్తున్నారు. అంటే దేవుడి పటాన్ని దానికి చేయవలసి పూజను విడిచిపెట్టి ఆ పటాన్ని గోడకు వేలాడదీయటానికి ఉపయోగపడే మేకులను పోగుచేసుకుంటున్నాడన్నమాట.

ధనం సంపాదిస్తే చాలు సుఖపడతాం కదా, మరలా ధర్మం దేనికి అనుకోవచ్చు. అలాగని, ధర్మం విడిచి, అక్రమార్జన చేస్తే, దొంగతనాలు, దోపిడీలు మోసాలు చేసి ధనం సంపాదిస్తే ఆ మనిషికి భౌతికంగానో లేదా మానసికంగానో పీడ తప్పదు. అతడు ధనం సంపాదించిన తీరు తెలిస్తే అతడికి భౌతికంగా దండన తప్పదు. ఒక వేళ అధికారులకు తెలియకున్నా, మానసికంగా నేను ఎప్పుడు పట్టుబడతానో అనే భయం అతన్ని వేధిస్తూ సుఖపడనివ్వకుండా చేస్తుంది కదా.

అటువంటి అధర్మపరుడు బయటకు చాల అందంగా కనిపిస్తున్నా లోపల చెదలు కొట్టేసిన చెట్టులాంటివాడు. }}

సరే,, తాను రాజు కావాలని కోరుకున్నవాడికి ఈ ధీగుణాలు తప్పక ఉండాలని రాజనీతిశాస్త్రజ్ఞుల తాత్పర్యం.

కాని, మన దురదృష్టవశాత్తు కాస్త డబ్బుండి, కాస్త మాటకారితనం ఉండి, కాస్త జనాలను పోగేయగలగటం చేతనైనవారందరూ ఈ రోజుల్లో నాయకులు రాజులు ఐపోతున్నారు.

అయితే వారందరూ గొప్ప రాజులు కాలేరు. మిణుగురుపురుగు స్వయంప్రకాశకం కాబట్టి దానిని సూర్యుడు అనగలమా? 

ఫలకాలు చెప్పే పాఠాలు - 6


క్షరం తు అవిద్యా - అమృతం తు విద్యా
''అవిద్య నశించిపోయేది. విద్య మాత్రము అమరం."
"కోటి విద్యలు కూటి కొరకే" అంటారు కదా? మరి ఆ కోటి విద్యలూ అమరమేనా?
కాదు. ఎందుకంటే అవి నిజానికి అవిద్యలు. మనం ఎంతో ప్రేమగా కూడు పెట్టి పోషించుకునే ఈ శరీరమే పెద్ద అశాశ్వతమైన వస్తువు. అశాశ్వతమైన దాన్ని పోషించుకునే విద్య శాశ్వతం అమరం ఎలా అవుతుంది? కానే కాదు. ఇవన్నీ నిజానికి మనం విద్యలని భ్రమిస్తున్న అవిద్యలు.
మరి విద్య ఏమిటి?
"సా విద్యా యా విముక్తయే". విముక్తిని కలిగించేదే అసలైన విద్య. విముక్తి అంటే బంధనం నుండి బయటపడటం.
అంటే? ఉద్యోగం రాగానే తన వాళ్లనుండి విముక్తిని పొంది వేరే వూరికో వేరే దేశానికో పరుగులెత్తేందుకు ఉపయోగపడేదేనా విద్య అంటే?
కాదు. అది బంధువులతో వచ్చిన బంధాన్ని తెగదెంపి కొత్త బంధాన్ని కల్పించేది మాత్రమే. తల్లిదండ్రుల బాధ్యతను వదులుకుని ఆఫీసు పనుల బాధ్యతను స్వీకరిస్తే అది విముక్తి ఎలా అవుతుంది?
మరి?
"ద్వే విద్యే వేదితవ్యే పరా చైవాపరా చేతి" అని ముండకోపనిషద్బోధ. (1.4)
అపరా విద్య అంటే వేదవేదాంగాలు. (వీటి వలన కూడా విముక్తి లేదు.
ఇవి అసలైన విద్యను సాధించేందుకు తోడ్పడే సాధనాలు మాత్రమే.)
"అథ పరా యయా తదక్షరమధిగమ్యతే" - ఏ విద్య వలన అమృతత్వం, అమరత్వం (విముక్తి) లభిస్తాయో అదే పరా విద్య.
నిజానికి బంధనమంటే జననమరణాలే. ఈ జన్మలో పడినన్ని బాధలు పడి మరణించినా బంధనం నుంచి తప్పించుకోలేము. మళ్లీ పుట్టవలసిందే. మళ్లీ మరణించవలసిందే. ఈ జననమరణాలు అనంతచక్రంలా పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఈ మహాబంధనం నుండి విముక్తిని కలిగించేదే విద్య. నిజమైన విద్య. పరా విద్య.
అదే ఆత్మవిద్య. (తాను ఎవరో తాను తెలుసుకునే విద్య.) అదే బ్రహ్మవిద్య కూడా.
కస్త్వమ్? కోఽహమ్? కుత ఆయతః? తత్త్వం చింతయ తదిహ భ్రాతః! (తమ్ముడూ, నువ్వెవడవో? నేనెవడనో? నువు ఎక్కడనుంచి వచ్చావో? ఆ తత్త్వాన్ని గురించి చింతన చేయవయ్యా) అంటారు శంకరులు తమ మోహముద్గరంలో. ఆత్మవిద్యను నేర్చుకున్నవారు మాత్రమే ఆ క్వశ్చన్ పేపరును ఆన్సర్ చేయగలరు.
సరే. ఆవిద్యను నేర్చుకొనడం ఎలా?
అద్భుతం. అసలు ఇలా ఆత్మవిద్యను నేర్చుకుందామనే సంకల్పం కలగడమే కోటానుకోట్ల జన్మల పుణ్యఫలం.
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమ్
ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః।
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శృత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్।।
(గీత2.29)
ఈ ఆత్మవిద్యను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు. మరొకడు ఆశ్చర్యంగా చెబుతాడు. వేరొకడు ఆశ్చర్యంగా వింటాడు. కాని ఈ చూసినా, చెప్పినా, విన్నా దానిని తెలుసుకోగలిగినవాళ్లే ఎవరూ లేరు. ఎందుకంటే అది బ్రహ్మవిద్య మరి!
కాని, ఆ విద్యను నేర్చుకుందామనే సంకల్పం అందరికీ కలగదనుకున్నాం కదా? వేలాది మనుషులలో ఎవడో ఒక్కడికి సంకల్పం కలిగి ప్రయత్నిస్తాడు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. అలా ప్రయత్నించే వారిలో నూటికో కోటికో ఒకరికి సిద్ధి కలుగుతుందట. (గీత 7.3)
వారు ముక్తులంటే. అదీ విద్య అంటే.
విద్యాపీఠంలో నడుస్తుంటే ఇటువంటి ఫలకాలు దారి పక్కనే నిలబడి పలకరిస్తూ మనకు చిన్న చిన్న వాక్యాలతో పెద్ద పెద్ద పాఠాలను బోధిస్తూ ఉంటాయి.

సారతమం



అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభమైంది. మథనం చేస్తున్నవారందరికీ ఒకటే పట్టుదల. మేము అమరులం కావాలి అని.


కవ్వపుతాడు కరువైతే భుజంగపతి వాసుకి అక్కరకు వచ్చాడు. హాలాహలం విజృంభిస్తే శంకరుడు దానిని వెన్నముద్దలా పట్టి గొంతులో దాచాడు. కవ్వమైన మందరాచలం మునిగిపోతుంటే శ్రీహరి శ్రీకూర్ముడై ఉద్ధరించాడు.

క్రమంగా క్షీరసాగరంనుండి అప్సరసలు ఉద్భవించారు. అయినా మథనం ఆగలేదు.

ఆ తరువాత ఉచ్చైఃశ్రవం, ఐరావతం, కౌస్తుభం, కల్పద్రుమం, కామధేనువు చంద్రుడు మొదలైనవన్నీ పుట్టుకొచ్చాయి. అయినా మథనం ఆగలేదు.

ఆ తరువాత లక్ష్మీదేవి పుట్టింది. అయినా మథనం ఆగలేదు.

చివరకు అమృతం పుట్టింది. అప్పుడు మథనం ఆగింది.

)))(((

రత్నాకరమంటే ఇక్కడ క్షీరసాగరం. రత్నాలకు నిలయమైనది అని. రత్నము అంటే చాల విలువైనది అని.

రత్నాకరంలో అసారం (సారహీనమైనది - ప్రమాదకరమైనది) ఉంటుంది. ఈ సందర్భంలో అది హాలాహలమన్నమాట.

రత్నాకరంలో అల్పసారం ఉంటుంది. (పెద్దగా సారం లేనిది) ఈ సందర్భంలో అప్సరసలవంటివారు అన్న మాట.

రత్నాకరంలో సారం ఉంటుంది. ఈ సందర్భంలో ఉచ్చైఃశ్రవం, ఐరావతం, కౌస్తుభం, కల్పద్రుమం, కామధేనువు వంటివి అన్న మాట.

రత్నాకరంలో సారతరం ఉంటుంది. (మునుపు చెప్పిన వాటన్నిటికన్న మరింత సారవంతమైనది) ఈ సందర్భంలో లక్ష్మీదేవి అన్న మాట.

రత్నాకరంలోనే సారతమం ఉంటుంది. (అన్నిటిని మించి సారవంతమైనది) ఈ సందర్భంలో అది అమృతమన్నమాట.

(అమృతం అనే పదానికి మోక్షం అనే అర్థమున్నదని గ్రహిస్తే ఇది లక్ష్మీదేవి కంటె గొప్పదా అనే మోహం గాని , భ్రాంతి గాని పుట్టవు.)

)))(((

అసారమల్పసారం చ
సారం సారతరం త్యజేత్।
భజేత్ సారతమం శాస్త్రే
రత్నాకర ఇవామృతమ్।।

అని ప్రస్తుతశ్లోకం.

ఈ విధంగా. శాస్త్రమనే క్షీరసాగరంలో అసారాన్ని, అల్పసారాన్ని మాత్రమే కాక, చివరకు సారాన్ని, సారతరాన్ని కూడా వదలి సారతమాన్ని మాత్రమే పరిగ్రహించాలి అని మన పెద్దలు చాల స్పష్టంగా వివరించి చెప్పారు. (దానినే పరమార్థమన్నారు)

)))(((

రత్నైర్మహాబ్ధేః తుతుషుర్న దేవాః
న భేజిరే భీమవిషేణ భీతిమ్।
సుధాం వినా న ప్రయయుర్విరామం
న నిశ్చితార్థాత్ విరమన్తి ధీరాః।।

అని భర్తృహరిసుభాషితం. దేవతలు క్షీరసాగరంనుండి మహారత్నాలు లభించాయనే ఆకర్షణకు లోనై మథనం ఆపలేదు. భయంకరమైన విషానికి భయపడి మథనం ఆపలేదు. అమృతం లభించేంతవరకు విశ్రమించలేదు. ధీరులు తాము నిశ్చయించిన ప్రయోజనాన్ని పొందేంతవరకు విరమించరు అని దాని అర్థం.

చూడండి, ఈ శ్లోకంలో భర్తృహరి కేవలం దేవతలను మాత్రమే పేర్కొన్నాడు కాని, వారితో పాటు మథనం చేసిన రాక్షసులను పేర్కొనలేదే అని ఎవరైనా అనవచ్చు.

కాని, లక్ష్యం నెరవేరేవరకూ నిర్విరామంగా శ్రమించిన రాక్షసులు కూడా దేవతలతో సమానులుగానే భర్తృహరి ఇక్కడ భావించడం వలన వారిని వేరుగా పేర్కొనలేదు.

కాని ఉమ్మడి లక్ష్యమైన అమృతం లభించేసరికి, ఇది మాకు మాత్రమే చెందాలి అని వారిలో కొందరు దానిని బలాత్కారపూర్వకంగా అపహరించేసరికి దేవదానవభేదం వచ్చేసింది.

మా మతంలో ఉంటేనే దేవుడు అనుగ్రహిస్తాడు, వాళ్లకు మాత్రమే స్వర్గం, లేకపోతే నరకం తప్పదు అని దబాయించేవారే దానవులన్న మాట. వారు తమ మతానికి (అభిప్రాయానికి) విరుద్ధంగా సర్వత్ర భగవద్దర్శనం చేసుకునే సాధువులను కూడా తమకు పరమవిరోధులుగా భావించి బ్రతుకనీయరు. క్రూరంగా చంపేస్తారు. అందుకు పురాణంలోనూ నిదర్శనాలున్నాయి, నిన్న గాక మొన్న మన ఎరుకలోనే, భారతదేశమంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సరే, ఆ పైన ఇక చెప్పేదేముంది? అటువంటి దానవులను రాక్షసులను ఒకొక్కసారి పరాక్రమంతో, ఒకొక్కసారి వంచనతో ఎలా అణచాలో శ్రీహరి మనకందరకూ చక్కగా గుణపాఠాలు నేర్పించాడు.

కాని, మనమే నేర్చుకునేందుకు నిరాకరిస్తూ ఇంకా సెక్యులరిజమూ సమానత్వమూ అంటూ పనికిరాని పిచ్చి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాము.

)))(((

భారతసంస్కృతిని మనసారా ద్వేషించే కొందరు అనంతగంభీరక్షీరసాగరాల వంటి మన శాస్త్రాలలోను, పురాణాలలోను వేదాలలోను అసారాలను, అల్పసారాలను మాత్రమే వెతికి వెతికి మరీ గ్రహిస్తూ ఉంటారు.

శ్వానాలకు ఎండిపోయిన ఎముక ముక్క దొరికితే చాలు, అదే అమృతంగా తలచి నమిలి నమిలి నమలుతూ స్వర్గసుఖం ఇంతకంటె వేరే ఏమీ లేదని ఆనందిస్తూ ఉంటాయి.

శూకరాలకు బురదగుంట దొరికితే చాలు. అందులోనే సుఖంగా దొర్లుతూ అదే స్వర్గమని, ఆ బురదే అమృతమని భావిస్తాయి.

యుగయుగాలుగా కాలపరీక్షకు నిలిచిన మన శాస్త్రసంపదలో వారికి సారవంతమైనవి గాని, సారతరమైనవి గాని, సారతమమైనవి గాని ఎంతమాత్రం గోచరించవు. అది వారు తమ పూర్వజన్మలలో చేసుకున్న దురదృష్టఫలం. అంతే.

తమకు సారాన్ని గాని, సారతరాన్ని గాని, సారతమాన్ని గాని గ్రహించే నైపుణ్యం గాని శక్తిగాని లేక పుక్కిటి పురాణాలు అంటూ నిందిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.

నక్క కూడా తనకు అందని ద్రాక్షను పుల్లన అని నిందిస్తుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...