అయ్యా ముఖ్యమంత్రి గారూ,
మొదట్లో నిర్బంధపు ఇంగ్లీషు మీడియం నిర్ణయాన్ని ప్రశ్నించేవారు ఎవరైనా సరే, వారందరినీ పేదవారికి శత్రువులుగా చిత్రీకరించారు.
ఇపుడు ప్రశ్నించేవారిని సాక్షాత్తు మీకు (ముఖ్యమంత్రికి) శత్రువులుగా కూడా ప్రకటించేశారా?
అయ్యా, అంతటి ఆగ్రహం ఎందుకు? మేము మీకు వోటు వేసిన వాళ్లము. ఆంధ్రప్రదేశ్ పౌరులము. మీ ప్రజలము. మేము ముఖ్యమంత్రి అభ్యర్థులము కాము. మీకు పోటీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని పార్టీ పెట్టుకుని కూర్చున్నవాళ్లము కాము.
తెలుగు మా మాతృభాష. మీరు మాకు పరిచయం కాకముందే ఈ భాషతో చక్కని పరిచయాన్ని మేము కలిగి ఉన్నాము. అందువలన, మా భాషకు తగిన స్థానం కోసం మేము అడుగుతాము. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. దేశద్రోహం కాదు, రాజద్రోహం కూడా కాదు కదా?
100% ప్రభుత్వ ఉద్యోగాలన్నిటినీ తెలుగులో నాలుగు ప్రావీణ్యాలను (1 వినడం, 2 మాట్లాడటం 3 చదవటం 4 వ్రాయడం) కలిగిన వారికే ఇస్తామని మొదట వాగ్దానం చేయండి. మేము మీ ప్రయోగానికి కొంతకాలం సహకరిస్తాము. అంగీకరిస్తాము.
మీ నిర్బంధపు ఇంగ్లీషు మీడియం ప్రయోగం 100% సఫలమౌతుంది అనే నమ్మకం మీకు ఉన్నదా? అది ఆవిధంగా సఫలమౌతుంది అని నిరూపించేందుకు మీకు ఎంతకాలం కావాలి?
తెలుగు ఒక సబ్జెక్టుగా కొనసాగుతుంది కాబట్టి తెలుగు అందరికీ వస్తుంది అంటున్నారు.
లెక్కలు కూడా ఒక సబ్జెక్టుగా కొనసాగుతుంది కదా? మరి అందరూ లెక్కలలో శ్రీనివాస రామానుజన్ లంతటివారైపోతున్నారా?
సోషల్ స్టడీస్ కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? మరి అందరూ తలపండిన రాజకీయవేత్తలు గాని, ఆర్థికవేత్తలుగాని అయిపోతున్నారా?
సైన్సు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? మరి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నారా?
ఇంగ్లీషు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? వారందరూ షేక్స్‌పియర్లు ఎందుకు కారు?
ఎవరికి ఏ సబ్జెక్టులో అభిరుచి కలుగుతుందో వారు ఆ సబ్జెక్టులో భాషాతీతంగా ఎదగగలరు. అది మీకు తెలియని విషయమా?
మీరు చిన్నతనం నుండి పాలిటిక్స్ అనే సబ్జెక్టు చదవడం వల్లనే ఈ రోజు ముఖ్యమంత్రి కాగలిగారా?
పోనీ, మీరు ఈ రాష్ట్రంలోని అత్యున్నతస్థానమైన ముఖ్యమంత్రి పదవిని అలంకరించారంటే అందుకు కారణం మీకు ఇంగ్లీషు రావడం మాత్రమేనా?
రావాలి జగన్ కావాలి జగన్ అనే పాటను జనాలు ఇంగ్లీషులో విన్నారా?
మీరు చేసిన సుదీర్ఘ పాదయాత్రలో మీరు ప్రజలతో ఇంగ్లీషులో మాట్లాడారా?
మీరు చేసిన ఉపన్యాసాలన్నీ ఇంగ్లీషులోనే చేశారా?
మీరు ముఖ్యమంత్రి అనే అత్యున్నత స్థానానికి ఎదగడానికి మీకు తోడ్పడింది మీ శ్రమ, మీ పట్టుదల, మీ ఓర్పు, మీ దీక్ష. మీ తపన.
మేము వీటిని చూసి మీకు వోట్లు వేశామే గాని, మీరు ఇంగ్లీషు భాషలో ఆయా ఛానెళ్లవారికి ఇచ్చిన ఇంటర్వ్యూలను చూసి కాదు.
అటువంటి శ్రమ, పట్టుదల, ఓర్పు, దీక్ష, తపన ఒక విద్యార్థికి నిజంగా ఉంటే అతడు ఒక గొప్ప డాక్టర్ కావడానికి గాని, ఒక గొప్ప ఇంజనీరు కావడానికి గాని, ఒక గొప్ప మేనేజర్ కావడానికి గాని, ఒక గొప్ప ఆఫీసర్ కావడానికి గాని, ఇంగ్లీషు భాష అనేది నిజంగా ఒక అడ్డంకి అవుతుందా? శ్రమించని వాడికి అసలు ఉన్నత స్థానం పొందే హక్కు ఉందా?
విద్యార్థుల వెనుకబాటుతనానికి చాలా కారణాలున్నాయి.
1.1 అలసత్వం.
సోమరితనం. రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అంటూ వాయిదాలు వేస్తూ పోవడం. ఇలాంటి విద్యార్థులు చదువులో రాణించకపోతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పా?
1.2 గర్వం.
నేను చాల తెలివైనవాడిని, ఒకటి రెండు క్లాసులకు హాజరు కాకపోయినా స్వంతంగా చదువుకోగలను, పరీక్షలకు నెలరోజుల ముందు చదివితే పికప్ చేయగలను వంటి అతివిశ్వాసం. ఇలాంటి విద్యార్థులు విఫలమైతే అది చిన్నప్పుడు చదివిన తెలుగు మీడియం తప్పా?
1.3 వ్యామోహం.
కొందరికి సినిమా వ్యామోహం. కొందరికి సినిమా నటులమీద వ్యామోహం. కొందరికి రాజకీయనాయకుల పట్ల వ్యామోహం. కొందరికి క్రికెట్ వ్యామోహం. కొందరికి ప్రేమ వ్యామోహం. కొందరికి సోషల్ మీడియా వ్యామోహం. ఇలాంటి విద్యార్థులు విఫలమైతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పా?
1.4 చపలత్వం.
కొందరు విద్యార్థులకు ఏకాగ్రత ఉండదు. కాసేపు చదువుకుంటారు. కాసేపు టీవీ చూస్తారు. కాసేపు రోడ్డు మీద పడి తిరుగుతారు. కాసేపు మిత్రులతో ముచ్చట్లు వేస్తారు. కాసేపు ఇంటి పనులు చేస్తారు. వీరు చదువులో రాణించకపోతే అది చిన్నప్పుడు చదివిన తెలుగు మీడియం తప్పా?
1.5 అనాసక్తి.
ప్రతి విద్యార్థి కేవలం సాంకేతికమైన చదువుల కోసమే పుట్టలేదు. కేవలం ఉద్యోగాలు చేయడానికి మాత్రమే పుట్టలేదు. అతడు మంచి సంగీతకారుడు కావచ్చు. గొప్ప ఆటగాడు కావచ్చు. గొప్ప కవి కావచ్చు. రచయిత కావచ్చు. గొప్ప చిత్రకారుడు కావచ్చు. వాళ్ల మనసు తమకు ఇష్టమైన రంగాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వారిని తీసుకొచ్చి డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేస్తామంటూ కాలేజీలలో పడేస్తే, వారికి ఉండే అనాసక్తి వల్ల చదువులో రాణించలేక పోవచ్చు. అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.
1.6 స్వార్థం.
ఒకప్పుడు చక్కగా చదువుకునే ఒక విద్యార్థి, అంత గొప్పగా చదవలేని తన తోటి విద్యార్థులకు ఒక సబ్జెక్టును గురించి వివరించి చెప్పడం, వాటిని గూర్చి చర్చించడం, వారి సందేహాలకు సమాధానం చెప్పడం చేసేవాడు. ఇటువంటివన్నీ మునుపు జరిగేవి. కానీ, ప్రస్తుతం అనారోగ్యకరమైన పోటీ ఉంది. ర్యాంకుల పేరిట రూపొందించబడిన విద్యావిధానం, విద్యార్థులలో వేలం వెర్రిని పెంచడం వలన, ఆ విద్యార్థులు తమ జ్ఞానాన్ని తోటి విద్యార్థులతో పంచుకొనలేకపోతున్నారు. ఇది కూడా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.
1.7 తప్పుడు మార్గదర్శనం
"ఫలానా సబ్జెక్టు చాలా సులువు, ఒక్కరోజులో, ఓవర్ నైట్ దానిని చదివేసి పరీక్ష పాస్ అయిపోవచ్చు అని కొందరు సీనియర్లు చెబుతుంటారు. మరొక సబ్జెక్టు భూతం. దానిని రాత్రింబగళ్లు ఎంత చదివినా అది అర్థం అయి చావదు. దాంట్లో యావరేజ్ మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోతే చాలు". ఇటువంటి మాటల వల్ల జూనియర్ విద్యార్థి ప్రభావితం అవుతూ ఉంటాడు. ఒక్కసారి ఆమాటలు మనసులోకి ఎక్కితే అవి ఒక పట్టాన వదలవు. ఇది కూడా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం వలన వచ్చే సమస్య కాదు.
పైన చెప్పినవన్నీ విద్యార్థుల యొక్క దోషాలు. ఇప్పుడు అధ్యాపకుల దోషాలను చూడండి.
2.1 ప్రిపరేషన్ లేకపోవడం.
ఒక విషయం ఒక అధ్యాపకునికి చాలా అలా అభిమానపాత్రమైన విషయమై ఉంటుంది. ఈ సబ్జెక్టును మా సారు కళ్ళు మూసుకుని చెప్పగలరు అని విద్యార్థులలో పేరు ఉంటుంది అటువంటి మాటలకు పొంగిపోయి అధ్యాపకుడు ఆ విషయంపై మరింత పరిశోధన చేయడం గాని మరిన్ని కొత్త విషయాలు చెబుదామని గాని ప్రయత్నం చేయడు. ఇది కూడా విద్యార్థి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం దోషం కాదు.
2.2 విషయం దాటవేయడం
కొందరు మంచి తెలివైన విద్యార్థులు ఉంటారు. వారు ప్రశ్నించడం మొదలు పెడితే కొందరు అధ్యాపకులు భయపడతారు కూడా. అందువల్ల వారు అటువంటి విద్యార్థులకు తమ క్లాసులో మాట్లాడే అవకాశం ఇవ్వరు. "ఈ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు పాఠం కొనసాగనివ్వు" అని అని సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తారు. ఆ తర్వాత అంటే ఏ తర్వాత? ఆ సందర్భం మళ్లీ రాకపోవచ్చు. ఇది కూడా విద్యార్థి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.
2.3 పాఠానికి సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం.
కొందరు అధ్యాపకులకు కేవలం విద్యార్హత ఉంటుంది. కాని, వారికి సబ్జెక్టుపై అవగాహన ఉండదు. క్లాసుకు వచ్చి పాఠానికి అవసరమైన విషయాలు చెప్పడం మాని విద్యార్థులతో పోసుకోలు కబుర్లు చెబుతూ వారిని కవ్విస్తూ నవ్విస్తూ ఆ రోజు క్లాసు అయిపోయింది అనిపిస్తారు. ఇటువంటి వారికి విద్యార్థులలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. మేనేజ్‌మెంటుకు ఆ విషయం తెలిసి కూడా, అటువంటి వారు మరుసటి సంవత్సరం తమ సంస్థలోనికి అడ్మిషన్లు తీసుకురాగలిగిన సమర్థులుగా భావించి వారిని కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి వారి క్లాసులలో విద్యార్థులకు సబ్జెక్టు రాకపోతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.
2.4 అధ్యాపకవృత్తిపై ప్రేమ లేకపోవడం.
కొందరు అధ్యాపకులు తాము తమ తోటి విద్యార్థుల వలె ఇంజనీర్లుగా డాక్టర్లుగా జీవితంలో "సెటిల్" కాలేక పోయామని నిత్యం చింతిస్తూనే ఉంటారు. వారు కేవలం మొక్కుబడిగా మాత్రమే పాఠాలు చెబుతారు. అది అర్థం అయిన వారికి అర్థమైనంత. అర్థం కాకపోతే విద్యార్థులు తమ చిన్నతనంలో చదివిన తెలుగు మీడియం తప్పు కాదు.
2.5 విద్యార్థులకు ఆదర్శంగా నిలబడలేక పోవడం.
ఒక అధ్యాపకుడు తన ప్రవర్తనలో గాని చదువుపై ప్రేమలో గాని తన విద్యార్థులకు ఆదర్శంగా ఉండవలసిన అవసరం ఉన్నది. అతడు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడైతే విద్యార్థులు అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. అతడికి సబ్జెక్టుపై ఎంత అవగాహన, ఎంత ప్రేమ ఉంటుందో, అదంతా అతడి పాఠాలలో ప్రతిఫలిస్తుంది. అప్పుడు విద్యార్థులకు కూడా ఆ సబ్జెక్టుపై అంతటి ప్రేమాభిమానాలు, అంతటి ఆసక్తి కలుగుతాయి. అధ్యాపకుడు ఆ విధంగా లేకపోతే, విద్యార్థికి నిజంగా నష్టమే. అది చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకొనడం వల్ల జరిగిన తప్పు కాదు.
ఇంకా, దోషాలు కేవలం విద్యార్థులలో అధ్యాపకులలో మాత్రమే కాదు, ఆయా విద్యాసంస్థల యొక్క యజమానులలో కూడా ఉంటాయి.
3.1 తల్లిదండ్రుల మెప్పు కోసం ప్రయత్నించడం.
సంస్థల యొక్క మనుగడ విద్యార్థుల చేరికపై ఉంటుంది. అది తల్లిదండ్రుల యొక్క చేతిలో ఉంటుంది. ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందటం ఆ సంస్థలకు చాలా అవసరం. అందువల్ల తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికలు అన్నిటినీ వారు చేతనైనంత వరకు ఆమోదించవలసి ఉంటుంది. వారి కోరికలను సంతృప్తి పరిచేందుకు వీరు అధికప్రాధాన్యతను ఇస్తూ, విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పాలి అనేదానిపై స్వతంత్ర నిర్ణయాలను తీసుకొనలేకపోతున్నారు. చివరగా నష్టం కలిగేది విద్యార్థులకే. ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.
3.2 అధ్యాపకులను నియంత్రించడం.
మేము మీ పిల్లలను "ఇంత" చక్కగా చూసుకుంటాము అని తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన తరువాత ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అధ్యాపకులకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి. ఆలస్యంగా వచ్చినా వారిని ఏమీ అనకండి. హోంవర్క్ చేయకపోయినా రేపు చేసి తీసుకురమ్మని చెప్పండి కానీ కోపపడవద్దు. క్లాసులో ఎవరైనా అల్లరి చేసినా మాట్లాడిన మాకు చెప్పండి గాని, వారిని క్లాసులో నిలబెట్టడం వంటి చిన్న చిన్న శిక్షలు కూడా వేయకండి - ఇలా. ఇలా ఐతే ఎలా? ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.
3.3 అధ్యాపకులను ఇతర పనులకు వినియోగించుకోవడం.
కొన్ని యాజమాన్యాలు తమ అధ్యాపకులను అడ్మిషన్లు తీసుకువచ్చేందుకు పంపిస్తూ ఉంటారు. మరికొందరు అధ్యాపకులను మీడియాతో మాట్లాడేందుకు వినియోగిస్తూ ఉంటారు. మరికొందరు అధ్యాపకులను తమ వాణిజ్య ప్రకటనలను రూపొందించవలసినదిగా కోరుతుంటారు. ఇటువంటి పనులు నిత్యం చేస్తూ ఉంటే చివరకు తమ అసలు పని అయిన విద్యాబోధన కంటే ఈ పనులే ముఖ్యమని వారు భావించేలా చేస్తారు. అందువలన విద్యార్థులకే నష్టం. ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.
3.4 కొందరు అధ్యాపకులను వదులుకోలేకపోవడం.
ముందు చెప్పినట్లుగా కొందరు అధ్యాపకులు క్లాసులో పిల్లలను నవ్వించడం కవ్వించడం చేస్తే వారికి చాల అభిమానపాత్రులైన అధ్యాపకులుగా మారుతారు. (!). వారి వలన మన సంస్థకు ఆకర్షణ పెరిగే మాట నిజమే. అయినప్పటికీ వారు సక్రమంగా పాఠాలు చెప్పలేక పోవడం వలన విద్యలో నాణ్యత లోపిస్తుంది. కానీ అటువంటివారికి విద్యార్థులను ఆకర్షించే శక్తి ఉండటం వలన విద్యాసంస్థలు వారిని వదులుకోలేవు. అందువల్ల విద్యార్థులకు నష్టం. ఇది తెలుగు మీడియం వల్ల జరిగే తప్పు కాదు.
ఈ విధంగా విద్యావ్యవస్థలలో ఎన్నెన్నో లోపాలు ఉన్నాయి. ఎందరెందరిలోనూ ఉన్నాయి. వాటినన్నింటినీ పక్కన పడేసి, వారందరూ నిర్దోషులని, అమాయికులని భావిస్తూ, విద్యార్థులు చదువులో రాణించలేక పోవడానికి ఏకైక కారణం తెలుగు మీడియం మాత్రమే అని, దానిని బలిపశువుగా మార్చి, దానిని గిలెటిన్ యంత్రంలో పెట్టి తల నరికే శిక్ష వేయడం దారుణం.
అయ్యా ముఖ్యమంత్రివర్యా,
విద్యార్థులందరూ తమ తప్పులను తెలుసుకొని, వాటిని సరిదిద్దుకొని, నాలా శ్రమించండి, నాలా ఉన్నత స్థానాన్ని పొందండి అని మీరు విద్యార్థులకు సందేశం ఇవ్వండి.
ఆ విధంగా శ్రమించే విద్యార్థులకు తగిన సమస్త సౌకర్యాలను ఇవ్వండి. అధ్యాపకుల కోసం తరచు సెమినార్లనునిర్వహించండి. సక్రమంగా పాఠాలను చెప్పమని వారికి ప్రబోధించండి. వారి సమస్యలను తీర్చండి. యాజమాన్యాలకు ఏమైనా చిక్కులు ఉంటే వాటిని పరిష్కరించండి. అపుడు అందరూ హర్షిస్తారు. అందరూ సహకరిస్తారు.
అంతే గాని, తప్పులన్నిటినీ కేవలం తెలుగు మీడియం వల్ల జరుగుతున్న తప్పులుగా చిత్రీకరించడం మీ స్థాయిలో ఉన్నవారికి తగదు.
మీరు తెలుగు మీడియాన్ని రద్దు చేయడంపై ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని మీకు శత్రువులుగా భావించడం మీకు మీ ప్రజలకు కూడా శ్రేయస్కరం కాదు.
21 నవంబరునెల, 2019 సంవత్సరం నాటి లేఖ
No comments:
Post a Comment