28, సెప్టెంబరు, 2018 నాటి లేఖ -
పాపం ఆనాటి మనువుకు జాగ్రత్త మరీ ఎక్కువ. స్త్రీలను సంరక్షించే బాధ్యతను ఏకంగా ముగ్గురికి అప్పగించాడు.
పాపం ఆనాటి మనువుకు జాగ్రత్త మరీ ఎక్కువ. స్త్రీలను సంరక్షించే బాధ్యతను ఏకంగా ముగ్గురికి అప్పగించాడు.
1 పితా రక్షతికౌమారే
2 భర్తా రక్షతి యౌవనే
3 పుత్రో రక్షతి వార్ధక్యే
చిన్నతనంలో తండ్రి, యౌవనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు రక్షించాలి, వారు తమ తమ బాధ్యతలను తప్పించుకొనేందుకు వీలు లేదు అని గట్టిగా చెప్పాడు.
అయితే కొందరు అభ్యుదయవాదులకు ఆ మనువాదం నచ్చలేదు. ఎందుకంటే పై మూడు లైన్లు చెప్పిన తరువాత చివర మనువు ఒక మాట అన్నాడుట.
"న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి"
దాంతో వీరు వీరంగం వేశారు. వాడెవాడు అసలు ఆ మాట చెప్పడానికి? "ఆడది ఎప్పుడు బానిస కాదు, ఆమెకు ఇల్లొక ఖైదు కాదు" అంటూ నినాదాలు చేశారు.
పాపం మనువు ఉద్దేశమే వేరు,
"రక్షణవిషయంలో నువ్వే స్వతంత్రంగా ఉండమని స్త్రీని వదిలిపెట్టకండి, ఈ ముగ్గురూ (తండ్రి+భర్త+కొడుకు) ఆమెను కంటికి రెప్పలా కాచుకోవాలి" అని మనువు వారిని స్పష్టంగా ఆదేశించాడు.
కాని, విదేశీ చదువులు మరీ ఎక్కువ చదివేసుకుని, స్వదేశీ చదువులు బొత్తిగా అబ్బని ఘోర అభ్యుదయవాదులు ఆ మాటలను విడివిడిగా పొడిపొడిగా ముక్కముక్కలుగా వాయిదా పద్ధతుల్లో చదివి - {(రాముని+తోక+పివరుడు) అన్నట్టు} తమకు తోచిన బీభత్సమైన అర్థాన్ని అడ్డదిడ్డంగా వ్యాఖ్యానించి తమ అజ్ఞానంతో అల్లకల్లోలం సృష్టించివేశారు.
భారతదేశంలో మొదటనుండి స్త్రీకి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉండేవి అనేందుకు బోలెడన్ని ఆధారాలు ఉన్నాయి. వారు కూడా చదువుకున్నారు. వారు కూడా సభల్లో పాల్గొన్నారు. వారు కూడా శాసనాలు చేశారు. అయితే విదేశీదండయాత్రికులు భారతదేశంపై విచ్చలవిడిగా పడిన కాలంలో, దేశసంపదనే కాక స్త్రీలను కూడా అపహరించుకుపోతున్న భయానకపరిస్థితుల్లో స్త్రీల రక్షణకోసం ప్రతివారి ఇండ్లలోనూ కొన్ని కఠినమైన నిబంధనలు ఏర్పడి ఉండవచ్చు. దాన్నే కూర్మరక్షణన్యాయం అంటారు. అయితే, తాత్కాలికమనుకున్న ఆ నిబంధనలు శతాబ్దాలతరబడి విదేశీయుల పాలన కొనసాగడంతో శాశ్వత-ఆచారాలు అని భ్రమపడేంతగాా మారిపోయి ఉండవచ్చు.
కాని, విదేశీపాలన అంతం అయిన తరువాత, మరలా స్త్రీలు కరడుగట్టిన ఆచారాలనుండి క్రమక్రమంగా బయటకు రావడం, దానిని భారతీయసమాజం ఆమోదించడం సహజంగానే జరిగింది. ఇపుడు స్త్రీలు లేని రంగమంటూ లేనే లేదు.
శత్రువునుండి రక్షణకోసం తాబేలు తన తలను, కాళ్లను లోనికి లాగుకుని, దాక్కుని, శత్రువు దూరమైన తరువాత మళ్లీ ఆ తలను, కాళ్లను బయటకు తెచ్చుకుని మళ్లీ తన గమనం సాగిస్తుంది. భారతీయస్త్రీసమాజం విషయంలో కూడా అదే జరుగుతోంది.
అయితే శత్రువులు వెళ్లిపోయారు గానీ, శత్రువుల ఆదర్శాలు మాత్రం ఇంకా విశృంఖలంగానే కొనసాగుతున్నాయి. స్త్రీలకు రక్షణ మాత్రం ఇప్పటికీ సమస్యగానే మిగిలింది.
ఇప్పుడనే కాదు,
స్త్రీసంరక్షణ పూర్వకాలంలో కూడా ఒక సమస్యగానే ఉండేది.
ఒకసారి "నన్ను పెళ్లి చేసుకోండని" విశ్వామిత్రుని మేనత్తలను వాయుదేవుడు అడిగాడట. కాని, - "అబ్బో, ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని ఇష్టపడ్డాడు" అని వారు ఎగిరి గంతులేసి పెళ్లిచేసుకోలేదు. "మా తండ్రి గారు మమ్మల్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే వారినే చేసుకుంటాము" అని స్పష్టం చేశారు.
यस्य नो दास्यति पिता स नो भर्ता भविष्यति।
(రామాయణం.1.32.22)
వాయుదేవుడికి కోపం వచ్చి వాళ్లను కురూపులుగా మార్చాడట. మరీ ఈరోజుల్లో ఆసిడ్ దాడులు చేసినట్టన్న మాట. తరువాత వారి తండ్రి కుశనాభుడు వారిని బ్రహ్మదత్తుడు అనే యోగ్యుడికి ఇచ్చి పెళ్లి చేశాక వారికి సహజస్వరూపం కలిగిందట.
అలాగే మరోసారి పాండవులు ఆహారం తెచ్చేందుకు పోగా అరణ్యంలోని ఆశ్రమంలో ద్రౌపది ఒంటరిగా ఉండటం చూసి కౌరవుల చెల్లెలి భర్త అయిన సైంధవుడు ఆమెను ఎత్తుకుపోయాడు. పాండవులు వాణ్ణి పట్టి, గుండు కొట్టి వదిలి పెట్టారు. ఇంకోసారి కీచకుడు వెంటపడితే భీముడు వాడిని ఉపాయంగా నర్తనశాలకు రప్పించి చంపి పడేశాడు.
ఇలా తండ్రిగా కుశనాభుడు తన కుమార్తెలను, భర్తలుగా పాండవులు తమ ధర్మపత్నిని కాపాడుకున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడుకున్న శ్రమణకుమారుడి కథ తెలియని వారు ఎవరూ ఉండరు. ఇటువంటి కథలు చెప్పాలంటే ఇంకా ఉన్నాయి.
అంతేకాదు, స్వాభావికంగానో, చాపల్యంతోనో కొందరు స్త్రీలు స్వతంత్రించి చేసిన పనులు వారికి చాల ఇబ్బందిని కలిగించిన కథలు కూడా ఉన్నాయి. శకుంతల, కుంతి మొదలైనవారు ఎదుర్కొన్న నిందలు, పడిన కష్టాలు, తెలిసినవే.
అందుకే మనువు చాదస్తం కొద్దీ "న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి" అని ప్రతిపాదించి, అభ్యుదయవాదులనుండి తిట్లు తిన్నాడు పాపం.
చాదస్తం అని ఎందుకు అంటున్నానంటే, ఆయన స్త్రీలను రక్షించడానికి నామినేట్ చేసినవారిలో ఎంతమంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు గనుక?
తనకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసిన తక్షణమే స్వయంగా అబార్షన్ కు రంగం సిద్ధం చేస్తున్న కొందరు తండ్రులు ఉన్నారు.
కట్నం అడిగినంత ఇవ్వలేదని, తన వ్యసనాలకు అడ్డు తగులుతోందని, కట్టుకున్న భార్యను నిలువునా కిరసనాయిలు పోసి తగలేసిన కొందరు భర్తల కథలు వింటూ ఉంటాం.
ఇక పుత్రుల సంగతి చెప్పనే అక్కరలేదు. తల్లి భారమని ఎక్కడో తెలియని ఊర్లో, బస్టాండులోనో లేదా ఏకంగా స్మశానంలోనో వదిలించుకుని వచ్చే కొందరు గొప్ప కొడుకుల ఘనకార్యాలను గూర్చి వింటూనే ఉన్నాం.
మనువు నియమించిన ఈ ముగ్గురూ సంపూర్ణంగా విఫలమైన సందర్భాలలో కోర్టే స్త్రీలకు రక్షణగా నిలిచింది.
అందువల్ల,
కోర్టాయ నమః।
కోర్టుదేవతాయై నమః।
కోర్టుజడ్జయే నమః।।
కాని, ఓ సామెత ఉంది.
"రాను రాను రాజుగుఱ్ఱం గాడిదయ్యింది."
అలా తయారైంది.
ఎప్పుడూ ఆడవాళ్లను కాపాడి కాపాడి బోరుకొట్టిందేమో. ఇప్పుడు మగవాళ్లను కాపాడేందుకు సిద్ధమైంది ఈ కోర్టు.
అంటే, కీచకుడికి శిక్ష పడదన్నమాట. ఎందుకంటే, ఆ కీచకుడు నన్ను ఆ ద్రౌపదే స్వయంగా నర్తనశాలకు రమ్మంది, ద్రౌపది సమ్మతితోనే నేను అక్కడకు వెళ్లాను అని కోర్టుకు చెప్పి తన నేరం లేదని నిరూపించుకుంటాడు. భీముడు పిచ్చి మొహం వేసుకుని నిలబడాలి!
అయోవ్, కోర్టూ,
నేరం వేరు. తప్పు వేరు.
నేరం - అంటే
కోర్టు శిక్ష వేయదగినది.
తప్పు - అంటే
కోర్టు వేసే శిక్షలతో సంబంధం లేకుండా తప్పు.
ఓ కోర్టూ,
ఇది నేరం కాదు అని చెప్పావు సరే,
కాని ఇది తప్పు కాదు అని మాత్రం ఎప్పుడూ చెప్పకు.
అలా చెబితే నీ ఉనికికే ముప్పు వస్తుంది జాగ్రత్త.
No comments:
Post a Comment