Friday, 20 March 2020

సుగ్రీవుడు తెచ్చిన న్యూస్ పేపర్లు




అనగా అనగా రావణాసురుడు.

బ్రహ్మనుగూర్చి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోవయ్యా అంటే - దేవ, దానవ, గంధర్వ, యక్ష, రక్షః, సుర, అసుర, కిన్నర, కింపురుష, నాగ, పశు, పక్ష్యాదులు - వీరిలో నేను ఎవరిచేతిలోనూ చావకూడదు అని ఒక స్వతంత్రబలప్రతిపత్తిని కోరుకున్నాడు.

సరే, నీ చావు నువ్వే చావు అని బ్రహ్మ అతడు కోరుకున్న స్వతంత్రబలప్రతిపత్తిని వరంగా ఇచ్చేశాడు.

అపుడు అతడి పక్కన అతడి మేనమామ ప్రహస్తుడు చేరి స్వతంత్రబలప్రతిపత్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

ఆ సలహాను అనుసరించి, రావణాసురుడు లంకనుండి తన సోదరుడైన కుబేరుడిని అతని అనుచరులను తరిమి వేశాడు. లంక నాకు ఎలాగో నీకు కూడా అలాగే, మనం అందరమూ కలసి లంకలో హాయిగా జీవిద్దాం అని కుబేరుడు నచ్చజెప్పినా కూడా వినలేదు. తరిమేశాడు. వెళ్ళని వారిని చంపేశాడు.

ఆ తరువాత రావణాసురుడు తన మేనమామ అదుపు తప్పిపోయాడు.  కాని ఆ మేనమామ ఊహించిన దానికంటె ఎక్కువగా విజృంభించి అందరినీ చావగొట్టటం మొదలుపెట్టాడు. బ్రహ్మ అతడికి స్వతంత్రబలప్రతిపత్తిని ఇచ్చాడు అని అందరూ అతడిని ఏమీ చేయలేక ఊరుకున్నారు.

రావణాసురుడి దురాగతాలు మరీ ఎక్కువ అయ్యాయి. రాజకన్యలను ఎత్తుకొచ్చాడు. ఋషికన్యలను ఎత్తుకొచ్చాడు. గంధర్వ కన్యలను ఎత్తుకొచ్చాడు. దేవకన్యలను ఎత్తుకొచ్చాడు. నాగకన్యలను ఎత్తుకొచ్చాడు. యక్షకన్యలను ఎత్తుకొచ్చాడు. ఇలా కంటికి అందంగా కనిపించిన ప్రతివారినీ ఎత్తుకొచ్చాడు.

బ్రహ్మ ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తి ప్రభావంతో అతడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. లంకలో జనాలకు ఇది చాల గొప్ప విషయంలా అనిపించింది. అలా చేయడం లంకారాజ్యానికి ఒక హక్కు అని వారికి అనిపించే స్థాయికి వారిని రావణుడు తీసుకుపోయాడు. అలా చేయడం తప్పు అని చెప్పే విభీషణుడు లాంటి వారు ఉన్నా, వారి గొంతు వినబడకుండా నొక్కేశారు.

ఒకసారి రావణాసురుడు రాముని భార్య అయిన సీతను గూర్చి విన్నాడు. తన స్వతంత్రబలప్రతిపత్తి విషయం రాముడికి కూడా తెలిసే ఉంటుంది, నన్ను ఏమీ చేయలేడు అనుకుని, సీతమ్మను కూడా ఎత్తుకొచ్చేశాడు. సీతమ్మ "ఉరే ఇది తప్పురా వెధవా, రాముడికి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడురా" అన్నది.

"ఓ సీతా, రాజ్యం పోగొట్టుకున్న రాముడి గూర్చి ఇంకా ఆలోచన ఎందుకు? ప్రపంచంలోకెల్లా అందమైన నా లంకలో ప్రపంచంలోకెల్లా ఐశ్వర్యవంతుడనైన నా అండన నీవు బ్రతుకు" అన్నాడు రావణుడు. అసలు నిన్ను ఎత్తుకురావడం రాక్షసధర్మం. నా జన్మహక్కు పొమ్మన్నాడు.

అప్పుడు కూడా లంకాజనాలు రావణాసురుడు చేసిన పనిని మెచ్చుకున్నారు. లంక పరువునిలబెట్టాడు అని జేజేలు కొట్టే స్థాయిలో ఉన్నారు.

ఇంతలో రాముడికి సీత ఎక్కడ ఉందో తెలిసింది. దండెత్తి వచ్చాడు. లంకలో జనాలు గగ్గోలు పెట్టారు. రాముడు అలా రావడానికి వీల్లేదు అన్నారు.

మరి సీతను ఎందుకు ఎత్తుకొచ్చాడు రావణుడు? అని అడిగితే -

మరి హనుమంతుడు వచ్చి మా లంకను తగలబెట్టచ్చా? అని ఎదురు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు.

రాముడు లంకకు వంతెన కట్టడం తప్పని, అలా కడితే బ్రహ్మ ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తికి భంగం కలిగించినట్టే అని వాదించడం మొదలు పెట్టారు.

"హనుమంతుడు వచ్చి అశోకవనం ధ్వంసం చేశాడు. అది తప్పు" అన్నారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే హనుమంతుడు దాన్ని విడిపించుకుపోయి బ్రహ్మకు అవమానం చేశాడు, ఆ విధంగా లంక ప్రజల మనోభావాలను గాయపరిచాడు" అన్నారు.

ఈ లోపల లంక బయట ఉన్న రాక్షససమర్థకులు కొందరు నోరు విప్పి నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

రాముడు శూర్పణఖ ముక్కు కోయడం తప్పు అన్నారు. ఖరదూషణులను చంపడం తప్పు అన్నారు. అసలు రాముడు దండకారణ్యానికి రావడమే పెద్ద తప్పు అన్నారు.

రాముడు తాటకను చంపడం తప్పు అన్నారు. రాముడు బంగారు లేడిని చంపడం తప్పు అన్నారు. విశ్వామిత్రుడి యజ్ఞాన్ని కాపాడడానికి రాముడు రావడం తప్పున్నర తప్పు, అలా చేయడం లంక ప్రజలను రెచ్చగొట్టడమే అన్నారు.

ఈవిధంగా రాముడు ఇన్ని తప్పులు చేయడం వల్లనే రాక్షసులు మరింత మరింతగా రెచ్చిపోయారు అని, ఈవిధంగా రాముడి వల్లనే మనుషులకు రాక్షసులకు మధ్యలో సత్సంబంధాలు అన్నీ బెడిసి కొట్టాయని అన్నారు.

అందువల్ల, మనుషులకు రాక్షసులకు మరలా మంచి సంబంధాలను నెలకొల్పే సత్సంకల్పంతోనే రావణుడు సీతను ఎత్తుకు రావలసి వచ్చింది అని, అందులో తప్పేమీ లేదని వాదించడం మొదలుపెట్టారు.

రావణాసురుడు ఎత్తుకొచ్చింది ఒక్క సీతనే కాదు కదా?  అంతకు ముందు కూడా చాలా మంది స్త్రీలనే ఎత్తుకు వచ్చాడు కదా, మరి ఆ స్త్రీలకు సంబంధించిన వారందరూ నిశ్శబ్దంగా ఊరికినే ఉండగా ఒక్క రాముడే ఎందుకు దండెత్తి వచ్చాడు?  ఊరుకున్న వాళ్లందరికీ న్యాయం తెలియదా?  ధర్మం తెలియదా? నఈ రాముడు మాత్రమే పెద్ద న్యాయం ధర్మం తెలిసిన పోటుగాడా? అని దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు.

బ్రహ్మ గారు రావణాసురుడికి ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తిని భంగం చేయడానికి వీల్లేదు అని, అసలు రాముడిని సృష్టించినది కూడా బ్రహ్మేనని, సకలలోకాలనూ సృష్టించిన ఆ బ్రహ్మగారికంటే నిన్న గాక మొన్న పుట్టిన రాముడికి ఎక్కువ తెలుసా? అని ఏకి పారేయడం మొదలు పెట్టారు.

ఏ పరిస్థితులలో బ్రహ్మ అటువంటి ప్రతిపత్తిని రావణాసురుడికి ఇచ్చాడో కూడా తెలుసుకోలేక రాముడు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు.

లంక చుట్టూ తన సైన్యాన్ని నిలిపి, లంకానగరం మీద బాణాలు ఎక్కుపెట్టి, సీతను తిరిగి ఇమ్మని అడగడం ఏరకం ప్రజాస్వామ్యమని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విధంగా రాముడు దౌర్జన్యం చేస్తే, లంకకు ఒక రావణాసురుడు కాదు, ఇంటింటా ఒక రావణాసురుడు వెలుస్తాడు జాగ్రత్త అన్నారు.  ఆ రావణాసురుల పుట్టుకకు రాముడే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదంతా రాక్షసజాతి మీద రాముడు నిష్కారణంగా పగబట్టి చేస్తున్న దౌర్జన్యమే తప్ప మరొకటి కాదన్నారు.

రాముడికి రాజ్యవ్యామోహం ఎక్కువని, అందువల్లనే వాలిని చంపాడని ఆరోపించారు. మూర్ఖులైన వానరులు దాన్ని అర్థం చేసుకోలేక అతడిని ఫాలో అవుతున్నారని అన్నారు. రాముడితో చేతులు కలిపి వాలికి ద్రోహం చేసిన సుగ్రీవుడు, చివరకు తాను కూడా అదే గతిని పొందుతాడని అన్నారు.

రాముడిని దగ్గరగా చూసిన కైకేయికి రాముడి స్వభావం బాగానే తెలుసునని, అందువల్లనే అడవికి పంపించేసిందని అన్నారు. ఒక ఆడది గెంటించి వేస్తే దిక్కులేక అడవిలో పడ్డ రాముడు, లంక జోలికి పోతే రాక్షసులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

భరతుడు వచ్చి బ్రతిమాలినా రాముడు అయోధ్యకు వెనుతిరిగి పోకుండా ఉండటం రాక్షసులను రెచ్చగొట్టడం కోసమే తప్ప వేరు కాదన్నారు. నిజానికి అది దశరథుడి కొడుకులందరూ కలిసి ఆడిన నాటకమన్నారు.

విభీషణుడు లంకాద్రోహి అని, అతడివల్ల లంక సర్వనాశనం అవుతుందని, యుద్ధం ముగిసిన తరువాత రాముడు విభీషణుడిని, సుగ్రీవుడిని కూడా చంపేసి, ఇద్దరి రాజ్యాన్ని తానే ఆక్రమిస్తాడని, అయితే అప్పటికి తమకు జరిగిన మోసం తెలుసుకొనేందుకు రాక్షసులు, వానరులు ఎవరూ మిగిలి ఉండరని జోస్యాలు చెప్పడం మొదలు పెట్టారు. ఇలా నానా శాపనార్థాలు పెట్టారు.

బ్రహ్మగారు ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తికి వీరందరూ వ్యతిరేకులని, రాక్షసజాతి ఔన్నత్యాన్ని తట్టుకోలేక అందరూ ఇలా కుమ్మక్కు అయి, లంక మీదకు దండెత్తి వచ్చారని అన్నారు.

ఆయా న్యూస్ పేపర్లలో పడిన ఈ వార్తలను సుగ్రీవుడు తీసుకొచ్చి రాముడికి చూపించాడు. అన్నీ చదివిన రాముడు చిన్న చిరునవ్వు నవ్వి, వాటిని పక్కన పడేసి, సుగ్రీవా, నువ్వు టైం ట్రావెల్ చేసి, రెండు యుగాలు ముందుకు పోయి ఈ పేపర్లు పట్టుకొచ్చినట్టున్నావు. అప్పుడు ఎంత ధర్మమైన విషయానికి కూడా కొందరు ఆలోచనాశూన్యులు, కార్యశూన్యులు ఇలాగే గొడవలు చేస్తారు. జస్ట్ ఇగ్నోర్ ఇట్. లెట్స్’ డూ వాట్ వీ హావ్ టు డూ’ అన్నాడు.

తరువాత జరగాల్సిందేదో జరిగింది. ఏమి జరిగిందో అందరికీ తెలుసు. సుగ్రీవుడు, విభీషణుడు, రాముడు హాయిగా ధర్మబద్ధంగా ఎవరి రాజ్యాలువాళ్లు పరిపాలించుకున్నారని ఎవరికి తెలియదో వారు చేతులు ఎత్తవచ్చు. లంక మాత్రం స్వతంత్రబలప్రతిపత్తి పీడను వదిలించుకుని స్వేచ్చగా బ్రతికింది.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...