మన పూర్వుల స్మృతులు మనకు ఎంతో అమూల్యమైనవి. వాటిని రక్షించుకొనడం మన బాధ్యత కూడా.
అరగొండ గ్రామంలో, శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి అనతి దూరంలో ఈ ప్రాచీననిర్మాణం ఉన్నది.
చక్కని దేవతామూర్తులు చెక్కి ఉన్న గట్టి రాతి స్తంభాలతో, ఇప్పటికీ బాగానే ఉన్నది. గోడలు కట్టిన ఇటుకలు కూడా చాలా పాత కాలానికి చెందినవి. అయితే చంద్రగిరి నిర్మాణంలో వాడిన ఇటుకల కంటె కొంత లావుపాటి ఇటుకలు ఇవి. అవి మాత్రం కొంతవరకు శిథిలమై కనిపిస్తున్నాయి.
ఇది ఏదో పురాతన కాలపు దేవాలయం కాబోలు అనిపించింది. కానీ ఆ గ్రామస్థులను అడిగితే ఇది ఒకనాటి బాటసారుల సత్రం అని చెప్పారు. సత్రాన్ని కూడా ఇంత అందంగా ఇంత గొప్పగా కళాత్మకహృదయంతో కట్టిన అజ్ఞాతపూర్వీకులకు మనసులోనే నమస్కారాలు సమర్పించాము.
అయితే సత్రం అని చెప్పబడుతున్న ఈ నిర్మాణంలో శిథిలమైన పాతకాలపు దారురథం కూడా కనిపించింది. పూర్వకాలంలో గ్రామవీధులలో దేవతామూర్తుల ఊరేగింపుకు ఆ రథం ఉపయోగపడి ఉండవచ్చును. అందువల్ల ఇది సత్రం కాకపోవచ్చును అని మరల అనుమానం కలిగింది.
ఇది ఏ కాలానికి చెందినది? ఎవరు కట్టించారు? అనే ప్రశ్నలకు గ్రామస్థుల వద్ద సరైన సమాధానం లేదు.
ఎవరో పండ్ల దుకాణాదారులు తమకు అవసరం లేని అట్టపెట్టెలను పడవేసే ఒక చెత్త బుట్టలా అది ప్రస్తుతం ఉపయోగపడుతున్నది.
అది పాతకాలపు సత్రం కావచ్చును, లేదా పురాతన దేవాలయం కావచ్చు, అది మన చరిత్రకు మన సంస్కృతికి ఆనవాలు. దానిని సంరక్షించవలసిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉన్నది. లేదా పురావస్తుశాఖ దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.
కొంతకాలం దానిని పట్టించుకోకుండా ఆగితే, దానిని పడగొట్టి అక్కడ ఒక దుకాణం వెలిసే అవకాశం లేకపోలేదు.
ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని నీతులు చెప్పినా బలవంతుడిదే రాజ్యం. పాత దానిని నిర్మూలిస్తే గాని కొత్తది పైకి రాలేదు అనే పోకడలు ఈ ఆధునిక యుగంలో మన కండ్ల ముందు చోటు చేసుకుంటూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాము.
No comments:
Post a Comment