Thursday, 19 March 2020

దండం దశగుణం భవేత్




దండం దశగుణం భవేత్ అట. అంటే దండం పది రకాలుగా ఉపయోగపడుతుంది అని సాందర్భికమైన అర్థం.
ఇక్కడ దండం అంటే తెలుగులో దణ్ణం - నమస్కారం - వందనం కాదు. దండం అంటే కఱ్ఱ అని అర్థం.
వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో సహా నమస్కారం చేయడం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో మరెప్పుడైనా చూద్దాం.
#దండం వల్ల కలిగే పది ఉపయోగాలు ఇవి -
విశ్వామిత్రాహిపశుషు
కర్దమేషు జలేషు చ।
అంధే తామసి వార్ధక్యే
దండం దశగుణం భవేత్॥
సాధారణంగా కర్ర రైతు చేతిలో ఉంటుంది. అది అతనికి పది విధాలుగా ఉపయోగపడుతుంది.
విశ్వామిత్రాహిపశుషు అనేది సప్తమీవిభక్త్యంతమైన సమాసం. వి/శ్వా/అమిత్ర/అహి/పశుషు అని విడదీసుకోవాలి. విడిగా ఉన్నా మిగిలిన పదాలన్నీ కూడా సప్తమ్యంతాలే.
1 వి = అంటే విహంగమము. పక్షి. పక్షులను తరిమేందుకు కర్ర ఉపయోగపడుతుంది.
2 శ్వా = శ్వానము. కుక్క. కుక్కలను అదిలించేందుకు కర్ర ఉపయోగపడుతుంది.
3 అమిత్ర = శత్రువు. దొంగ. రైతుకు తన పంటను అనుసరించే దొంగే శత్రువు కదా? ఆ దొంగలతో పోరాటానికి కర్ర ఉపయోగపడుతుంది.
4 అహి = పాము. పంట ఇంటికి చేరే వరకు రాత్రనక పగలనక కాపలా కాయాలి. హఠాత్తుగా ఏ రాత్రి పూటో ఏ పామో మీదకు వస్తే ఆత్మరక్షణకు కర్ర ఉపయోగపడుతుంది.
5 పశు = పశువులు. మేకలు గొఱ్ఱెలు ఆవులు దూడలు పంట మేయవస్తే తోలేందుకు కర్ర ఉపయోగపడుతుంది.
6 కర్దమ = బురదనేల. బురదనేలల్లో జారిపోకుండా నిలదొక్కుకుని నడిచేందుకు కర్ర ఉపయోగపడుతుంది. వరి పండించేటపుడు రైతు పొలమంతా బురదనేలే కదా?
7 జల = నీరు. నీటితో నిండిన సెలయేళ్లను దాటేటపుడు నీరు ఎంత లోతు ఉందో, నీటి అడుగున ఎక్కడ రాళ్లు ఉన్నాయో, ఎక్కడ ఇసుక ఉందో తెలుసుకుని ముందడుగు వేసేందుకు కర్ర ఉపయోగపడుతుంది.
8 అంధ = గుడ్డివాడు. గుడ్డివానికి కర్ర దాదాపు కన్నుల్లాగే ఉపయోగపడుతుంది.
9 తమస్ = అంధకారం. కళ్లు కనబడని చీకటిలో కళ్లున్నవానికి గుడ్డివానికి తేడా ఉండదు. అలాంటి సమయాలలో కర్ర కొండంత ధైర్యం ఇవ్వడంతో పాటు చక్కగా ఉపయోగపడుతుంది.
10 వార్ధక్య = ముసలితనం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు క్షీణించడమే ముసలితనం. ఆ సమయంలో కర్ర అదనపు సంచారశక్తిని కలిగించడంలో ఉపయోగపడుతుంది.
ఈ విధంగా దండం దశగుణమన్న మాట. ఈ శ్లోకం ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైనది. Naresh Kandula మహోదయా, ఉత్తరాదిలో ఈ శ్లోకానికి పాఠాంతరముంది.
విశ్వామిత్రే చ వార్ధక్యే
రాత్రావప్సు చ కర్దమే।
అంధే సర్పే చ క్రీడాయాం
దండం దశగుణం భవేత్॥
ఇందులో కూడా సప్తమ్యంతపదాలే ఉన్నాయి.
1 వి
2 శ్వా
3 అమిత్ర
4 వార్ధక్య
5 రాత్రి
6 అప్సు = నీళ్లయందు
7 కర్దమ
8 అంధ
9 సర్ప
10 క్రీడా
తెలుగువారి దశగుణాల జాబితాను, ఉత్తరాదివారి దశగుణాల జాబితాను పోల్చి చూడండి. దాదాపు అంతా సమానంగా ఉన్నప్పటికీ చిన్న తేడా ఉంది. ఆ తేడాను కనిపెట్టిన వారికి దండాన్ని సక్రమంగా ఉపయోగించినంత ఫలం లభిస్తుంది.
Chenna Kesava Reddy Madduri మహోదయా, మీరు దండం దశగుణం అని సంతోషపడడమే గాని, ఈ రెండు జాబితాలలో ఏ ఒక్కదానిలోనూ అధ్యాపకుని చేతికి దండం ఇవ్వబడలేదు చూశారా? మన Radha Manduva మేడం గారైతే ఎంత సంతోషపడతారో!
దశకంఠః అంటే రావణాసురుడు.
దశ కంఠాః యస్య సః - దశ కంఠములు ఎవరికి కలవో అతడు అని విగ్రహవాక్యం. బహువ్రీహిసమాసం.
అలాగే, ఈ సందర్భంలో దశగుణం అంటే దండం (కర్ర). దశ గుణాః యస్మిన్ తత్ - దశ గుణములు (ఉపయోగములు) దేనియందు కలవో అది అని విగ్రహవాక్యం. లేదా దశ గుణాః యస్మాత్ తత్ - దశ గుణములు దేనివలన కలుగునో అది అని కూడా చెప్పవచ్చును.
విగ్రహం ఎలా చెప్పినా ఇది బహువ్రీహిసమాసమే.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...