Friday 20 March 2020

పరిమళించిన దానవత్వం

1
కాళిదాసు నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినవచ్చింది. ఎవరై ఉంటారు ఈ రాత్రి పూట అనుకుంటూ అతడు వచ్చి తలుపు తెరిచాడు. బయట ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా ఉన్నాడు.

ఆ వచ్చిన వాడు అతిథి అయి ఉంటాడు అని గ్రహించిన కాళిదాసు, అతడికి అతడి కుటుంబానికి అంత రాత్రిపూట కూడా మంచి భోజనం ఏర్పాటు చేశాడు.
ఆ తరువాత అతడిని "ఎవరయ్యా మీరు? ఇంత రాత్రిపూట నగరంలో ప్రవేశించారు?" అని అడిగాడు.
ఆ బ్రాహ్మణుడు దాదాపు కాళిదాసు పాదాల మీద పడినంత పని చేసి, "అయ్యా, నేను పేరుకు బ్రాహ్మణుడినే గాని, సంస్కృతం చదువుకున్నవాడిని కాను. ఇంతవరకు ఈనాడు పేపర్ లో ప్రూఫ్ దిద్దుతూ ఉండేవాడిని. ఈనాడు పేపర్ ను అందరూ నమ్మడం మానివేశాక, నా ఉద్యోగం పోయింది. దాంతో బ్రతుకుతెరువుకోసం దేశం మీద పడ్డాను. ధారానగరంలో భోజమహారాజు గొప్ప దాత అని విన్నాను. ఆశతో వచ్చాను. కానీ కవిత్వం రానివారిని, పాండిత్యం లేనివారిని అతడు ఆదరించడని తెలిసి వచ్చింది. అతడి రాజ్యంలో ఒక నేతగాడు, ఒక కూలి పని వాడు కూడా కవిత్వం చెప్పగలరని విన్నాను. అటువంటిది, భాష మీద ఎటువంటి పట్టులేని దూరదేశస్థుడనైన నన్ను అతడు ఆదరిస్తాడనే నమ్మకం లేదు. అందువల్ల అందరూ రాజదర్శనం కావాలంటే రాజానుగ్రహం పొందాలంటే కాళిదాసును ఆశ్రయించమని చెప్పారు. అందువల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. కనికరించండి" అని ప్రాధేయపడ్డాడు.
"సరేనయ్యా, నీకు సంస్కృతం రాకపోవచ్చును, కనీసం రామాయణ భారతాలైనా తెలుసునా?"
"ఆ! తెలుసునండి! రామాయణం అంటే రాముడు, భారతం అంటే భీముడు! అంతే కదండీ?"
"అంతే! అంతే!" అన్నాడు కాళిదాసు. "నేను మిమ్మల్ని రేపు రాజసభకు తీసుకొనిపోతాను. అక్కడ మిమ్మల్ని మహాపండితుడిగా పరిచయం చేస్తాను. మీరేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి. రాజుగారు ఇచ్చింది పుచ్చుకుని వచ్చేయండి" అని చెప్పాడు.
సరేనన్నాడు ఆ బ్రాహ్మణుడు.
ఆ మరుసటి రోజు కాళిదాసు అతడిని సభలో మహాపండితుడుగా పరిచయం చేశాడు. కాళిదాసు మాట మీద ఉండే గౌరవం చేత అందరూ అతను నిజంగానే మహాపండితుడు అని భావించారు.
భోజరాజు వినయంగా ఆ పండితుని ఒక చిన్న ప్రశ్న వేశారు.
"పండితవర్యా! మా దేశంలో లంకాధిపతిని కొందరు "రావణుడు" అంటున్నారు కొంతమంది "రావనుడు" అంటున్నారు. ఏది సరైన పదమో చెప్పగలరా?" అని అడిగాడు.
కాళిదాసు ఆ దొంగపండితుని మౌనంగా ఉండమని సైగ చేశాడు. అయినా తన పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చేసరికి ఆ పండితుడు ఆగలేకపోయాడు. తన పాండిత్యాన్ని రాజుగారు గుర్తిస్తే తన స్థానం గల్లంతు అవుతుందేమోనని కాళిదాసు అసూయపడుతున్నాడని భావించాడు. అందువల్ల నోరుమూసుకొని ఉండలేక -
"రాభణుడు కదా?" అన్నాడు.
సభ అంతా అల్లకల్లోలం అయిపోయింది. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. "రావణ" అనేది సరైన పదమా లేక "రావన" అనేది సరైన పదమా అని తేల్చుకోలేక పోతుంటే, మధ్యలో ఈ కొత్త పండితుడు వచ్చి "రాభణ" అనే కొత్త పదాన్ని పరిచయం చేశాడు!
భోజరాజుగారు కంగారుపడుతూ కాళిదాసు కేసి చూశాడు. కాళిదాసు ఇరుకులో పడ్డాడు. అతడు మహాపండితుడు అని చెప్పింది తానే కదా? ఇప్పుడు అతడు ఏమి వాగినా తానే సమర్థించాలి!
అందువల్ల తప్పనిసరిగా అతడిని సమర్థిస్తూ కాళిదాసు ఈ క్రింది శ్లోకం చదివాడు -
"భకారః కుంభకర్ణేఽస్తి భకారోఽస్తి విభీషణే।
కులశ్రేష్ఠే కులజ్యేష్ఠే భకారః కిం న విద్యతే॥

పెద్ద తమ్ముడైన కుంభకర్ణుని పేరులో భ అనే అక్షరం ఉన్నది. చిన్న తమ్ముడు అయిన విభీషణుని పేరులో కూడా భ అనే అక్షరం ఉన్నది. మరి కులశ్రేష్ఠుడు కులజ్యేష్ఠుడు అయిన అన్నకు రాభణుడు అని, పేరులో భ అనే అక్షరం ఎందుకు ఉండదు?" అన్నాడు.
దాంతో అంతటా హర్షధ్వానాలు చెలరేగాయి. భోజరాజు సంతోషించాడు. ఆ దొంగపండితునికి గొప్ప గొప్ప కానుకలు సమర్పించాడు.
***

2
దాంతో అతడు సంతోషం పట్టలేకపోయాడు. "మహారాజా! మీలో "దానవత్వం" పరిమళిస్తోంది" అన్నాడు.

ఆ మాట వినగానే మహారాజు నివ్వెరపోయాడు. సభ దిగ్భ్రాంతి చెందింది. కాళిదాసు చిరునవ్వు నవ్వాడు.
కాళిదాసు నవ్వాడు అంటే అందులో ఏదో పరమార్థం ఉందని అందరూ భావించారు. కాళిదాసా! ఈ మహా పండితుని మాటకు అర్థం ఏమిటి? అని అందరూ అడిగారు.
అప్పుడు కాళిదాసు ఈ క్రింది శ్లోకం చదివాడు.
బలినా దానవేంద్రేణ త్రైలోక్యమర్పితం పురా।
దాతృత్వం దానవత్వం చ సమార్థమభవత్తదా॥

"మహారాజా! పూర్వం బలి అనే పేరు గలిగిన దానవ శ్రేష్ఠుడైన మహారాజు ఉండేవాడు కదా? అతడు గొప్ప దానశీలుడు కదా? అతడు తన వీరత్వంతో ముల్లోకాలను జయించాడు కదా? మళ్లీ ఆ ముల్లోకాలనూ శ్రీ మహావిష్ణువుకు ఒక్క మాటతో అలవోకగా దానం చేసిన మహాదానవీరుడు కదా?
పూర్వం వేరు వేరు అర్థాలు కలిగిన దాతృత్వము, దానవత్వము అనే రెండు మాటలు అతడి గొప్పదనం వలన సమానార్థకాలు అయినాయి. మీరు కూడా ఆ దానవవీరుడైన బలి చక్రవర్తి అంతటి వీరులు, మహాదానశీలురు అని ఆ పండితుడు మీకు నిగూఢంగా చెప్పదలిచాడు. అంతే!" అని వివరించాడు.

యావత్సభ కరతాడనధ్వనులతో మారుమ్రోగిపోయింది. పండితుడికి మరిన్ని విలువైన కానుకలు లభించాయి.
***

ఈ క్రింది పేపర్ కటింగ్ మిత్రులు Naresh Kandula వారి పోస్టులోనిది. ఆయన మిత్రులు శ్రీ Raja Rao Vadrevu గారు సంపాదించినది. ఇద్దరికీ ధన్యవాదాలు.

ఇందులో ఒకటవ కథ (రాభణుడు) భోజప్రబంధంలోనిది. రెండవ కథ (దానవత్వం పరిమళించిన కథ) నేను కల్పించినది.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...