Thursday, 19 March 2020

పితృసేవ


కాశ్యపకులోద్భవుడైన పిప్పలుడనే ముని హిమాలయాలలో ఘోరమైన తపస్సు మొదలు పెట్టాడు. అతడు ఆహారంపై అన్ని రకాల కోర్కెలను వదులుకున్నాడు. ఇతరులపై ఈర్ష్యాసూయలు వదులుకున్నాడు. సమస్త ఇంద్రియాలపై సంపూర్ణమైన అదుపును సాధించాడు.

అతని తపస్సును మెచ్చి దేవతలు అతనిపై పుష్పవృష్టిని కురిపించారు. "ఓ పిప్పలా! తపస్సును చాలించి ఏమి వరం కావాలో కోరుకో" అని అడిగారు.

"నాకు ఈ సమస్తవిశ్వమూ వశం కావాలి. నేను విద్యాధరుడను (మహావిద్యావంతుడను) కావాలి" అని పిప్పలుడు కోరాడు.

దేవతలు తథాస్తు అన్నారు. సమస్త ప్రపంచము, సమస్త విద్యలు పిప్పలుని స్వాధీనంలోకి వచ్చాయి. వాటితో పాటు లోకంలో నా అంతటి వాడు లేడు అనే గర్వం కూడా అతనికి వచ్చింది.

ఒకనాడు అతడు సంధ్యావందనం కోసం సరస్వతీ తీరానికి చేరుకోగా, అక్కడ ఉన్న ఒక కొంగ అతనిని చూసి నవ్వింది.

"ఏమయ్యా పిప్పలా! కేవలం అర్వాచీనవిద్యలను (Modern Education) సంపాదించి ఇంతగా గర్వపడుతున్నావే? అయ్యో! పరాచీనవిద్యలను కూడా సంపాదించాలనే స్పృహ నీకు ఉన్నట్టే లేదే? అన్నది.

అంతటి మహావిద్యావంతుడైన పిప్పలునికి ఆ మాటలతో సిగ్గు వేసింది. "అయ్యా కొంగ గారూ, మీరు బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో ఎవరో ఒకరు అయి ఉంటారు. దయచేసి నాకు ఆ పరాచీనవిద్యలను కూడా బోధించండి" అని వినయంగా అడిగాడు.

అప్పుడు ఆ కొంగ, "నాయనా, కురుక్షేత్రంలో కుండలుడు అనే మహాత్ముడు ఉన్నాడు. అతని పుత్రుడైన సుకర్ముని వద్దకు పో. అతడు నీకు కావలసినదంతా బోధించగలడు" అని చెప్పింది.

పిప్పలుడు సుకర్ముని చెంతకు వెళ్ళాడు. సుకర్ముడు అతని ప్రార్థనను మన్నించి, అతనికి అర్వాచీన,పరాచీన,సనాతనవిద్యలను బోధించాడు.

అతడి జ్ఞానానికి అబ్బురం చెందిన పిప్పలుడు, "మహాత్మా మీరు ఏ తపస్సును చేసి ఇంత జ్ఞానం సంపాదించారు?" అని అడిగాడు.

"నేను ఎటువంటి తపస్సునూ చేయలేదు. కేవలం నా తల్లిదండ్రులను భక్తితో సేవించుకొనడం వల్లనే నాకు ఈ జ్ఞానం అబ్బింది" అని సుకర్ముడు స్పష్టం చేశాడు.

"సర్వవేదేషు యత్పుణ్యం
సర్వయజ్ఞేషు యత్ఫలమ్।
తత్ఫలం సమవాప్నోతి
మాతాపిత్రోశ్చ సేవయా॥"

"సర్వవేదాలను అధ్యయనం చేసినంత పుణ్యం, సర్వయజ్ఞాలను చేసినంత ఫలం, కేవలం తల్లిదండ్రులను సేవించినంత మాత్రాన కలుగుతాయి" అని చెప్పాడు.

తల్లిదండ్రులకు పుష్టికరమైన ఆహారాన్ని పెట్టి అటు పిమ్మటనే నేను భుజిస్తాను. అందువల్ల నాకు సమస్త తీర్థయాత్రల ఫలం లభించింది. మహా తపస్సును చేసినంత ఫలం లభించింది. తల్లిదండ్రులు ఏ సంతానం వలన ఆనందాన్ని పొందుతారో, ఆ సంతానం సకలధర్మాలను నిర్వర్తించినట్టే. తల్లిదండ్రుల సేవ మాత్రమే ప్రధానధర్మం. మిగిలినవన్నీ కేవలం ఉపధర్మాలు మాత్రమే.

ద్వౌ గురూ పురుషస్యేహ
పితా మాతా చ ధర్మతః।

ఒక మనిషికి తల్లిదండ్రులే గురువులు అని ధర్మశాస్త్రం చెబుతోంది. నేను నేర్చిన సమస్తజ్ఞానము వారి అనుగ్రహం వల్లనే నాకు లభించింది."
అని వివరించాడు.

పిప్పలుడు మహానందభరితుడై, సుకర్మునికి సాష్టాంగ నమస్కారం చేసి, సమస్తప్రపంచంపై తన అధికారాన్ని వదులుకొని, తన తల్లిదండ్రులను సేవించుకునేందుకు వెళ్లిపోయాడు.
)))(((

ఈ కథ పద్మపురాణంలోనిది. విశ్వరాజ్యాధికారం కన్నా తల్లిదండ్రుల సేవ గొప్పది అని బోధించడం ఈ కథ యొక్క గొప్పతనం. ఎంతటి మహా విద్యావంతుడైనా, తల్లిదండ్రులకు సేవ చేసుకొనడం ధర్మం అని బోధించిన కథ ఇది.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...