Friday, 20 March 2020

నారదుని భూలోకయాత్ర




స్వర్గలోకంలో కూడా అందరూ జగనన్న పరిపాలన జగనన్న పరిపాలన అని మాట్లాడుకుంటే విని నారద మహర్షి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకోవాలని భూలోకానికి వచ్చాడు.

తిరుపతి దగ్గర ఓ పల్లెటూర్లో ఆవులు మేపు కుంటున్న ఒక పల్లెటూరి తల్లి కనిపించింది. ఆమెను ఆప్యాయంగా పలకరించాడు.

తల్లీ, బాగున్నావమ్మా?

బాగున్నానన్నా.

నారాయణ, నారాయణ, అమ్మా, ఎలా ఉందమ్మా మీ జగనన్న పరిపాలన?

జగన్ అన్నకి మా మీద ఎంతో ప్రేమన్నా. మా పిల్లోళ్లని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తాడంట. మా పిల్లోడు టై కట్టుకోని కార్లో పోయి డాక్టరు ఇంజనీరు కలెక్టరు ఉద్యోగం చేసేలా చేస్తాడు మా జగనన్న.

అప్పుడు మీరేం చేస్తారమ్మా?

అప్పుడు ఈడ నేనేం చేయాల? మా కొడుకుతో పాటు నేను కూడా సిటీకి పోతా.

నారాయణ, నారాయణ!  అట్లైతే ఆవుల్ని సాకేది ఇడిసిపెట్టి పోతారామ్మా?

పోవాల్సిందే. ఏముంది ఈ పల్లెల్లోన?

నారాయణ, నారాయణ!  సిటీల్లో పాలు అవసరం లేదమ్మా?

అవసరం గాకుండా ఎట్లుంటాయి?  మా పిల్లోడికి పొద్దున రెండు గ్లాసులు పచ్చి పాలు, రాత్రి రెండు గ్లాసులు కాచిన పాలు తాగితే గాని తనివి తీరదే?

మరెట్లా పాలొస్తాయి సిటీలో?

యేముందిలే.  మా రాములమ్మ పాలంపిస్తాది.  లేదా యెంగటమ్మ పాలంపిస్తాది.  లేకుంటే లచ్చుమ్మ సుబ్బమ్మ, తిమ్మమ్మ ఎవరో ఒగురు పాలంపిస్తారు.

అదెట్టా? మీ పిల్లోడితో పాటు మీ రాములమ్మ, మీ యెంగటమ్మ, మీ లచ్చుమ్మ, మీ సుబ్బమ్మ, మీ తిమ్మమ్మ - వీళ్ల కొడుకులు కూడా అందురూ ఇంగ్లీషు సదివి టై కట్టుకొని కార్లెక్కి ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు ఐతారు. వాళ్లు కూడా సిటీ చేరుతారు. వాళ్లు గూడా ఆవుల్ని సాకేది యిడిసిపెడతారు. ఇంకెవురంపిస్తారమ్మా పాలని?

నిజమే కదా. అట్లైతే ఇంకేముంది?  పాల ఫ్యాక్టరీలు ఉంటాయి కదా?  ఆడ తయారు చేసి అంపిస్తారే, ఆ ప్యాకెట్ల పాలే కొనుక్కోవల్ల.

వాటిగ్గాని పాలెవురు పోస్తారు? మీరే గదా పోసేది? మీరందురూ సిటీకి పోతే ఆ ఫ్యాక్టరీలకు పాలు ఎవరు పోస్తారు?

మా ఊరిలోనేనా ఆవులు సాకేది? మాయాకట్లే ఆవుల్ని సాకే వేరే వూరోళ్లు పోస్తారులే.

అమ్మా, వచ్చే వచ్చే - మళ్లీ ఇంకో సందేహం వచ్చే. జగనన్న రాష్ట్రంలో అన్ని ఊర్లల్లో పిల్లోళ్లను కూడా ఇంగ్లీషు సదివిస్తాడు కదా? వారు కూడా టై కట్టుకొని కార్లలో పోయి డాక్టరు ఇంజనీరు కలెక్టరు ఉద్యోగాలు చేస్తారు కదా?  ఇంక అన్ని ఊర్లల్లో వాళ్ళ తల్లులు కూడా ఆవుల్ని సాకేది యిడిచిపెట్టి సిటీలకి చేరతారు కదా? ఇంకా ఆవుల్ని సాకేది ఎవురు?  పాలు ఇడిపిచ్చేది ఎవరు?  ఫ్యాక్టరీలకి పోసేది ఎవురు?  ఎవరో ఒకరు లేకుంటే పాలు ఎట్లా వస్తాయి?

మా జగనన్నకు ఆమాత్రం తెలివి లేదా ఏమిటి?  పక్క రాష్ట్రం నుంచి తెప్పిస్తాడు. లేదంటే పై దేశం నుండి తెప్పిస్తాడు. ప్రతి అమ్మకి ప్రతి రోజూ కనీసం రెండు లీటర్ల ఉచిత పాల పథకం ప్రవేశపెడతాడు.

కానీ, ఉచిత పాల పథకం ఒకటే సరిపోతుందా అమ్మా?  మీ పిల్లాడు కలెక్టర్ అయ్యాక ప్రయాణించే కారులో ఉచిత పెట్రోలు పథకం కావాలని అడగండి. పల్లెటూరు లో ఉంటే మీ సొంత ఇల్లు ఉండేది. సిటీలో మీ సొంత ఇల్లు లేదు కాబట్టి, ఉచిత బంగ్లా పథకం కావాలని అడగండి, మీరు ఉండబోయే ఇంట్లో ఉచిత కరెంటు పథకం కావాలని అడగండి. పల్లెటూరులో ఉంటే మీ భోజనం మీరే పండించుకునే వారు. సిటీలో ఆ సదుపాయం లేదు కాబట్టి ఉచిత నిత్యభోజన పథకం కావాలని అడగండి.

మంచి ఆలోచన చెప్పారన్నా. మనం నోరు తెరిచి అడగాలే గాని జగనన్న ఏమైనా ఉచితంగా ఇచ్చేస్తాడు.

అవునామ్మా? ఇంకా ఏమేమి అడుగుదాం అనుకుంటున్నావ్ తల్లీ?

ఉచిత చీరల పథకం, ఉచిత సినిమా పథకం, ఉచిత టీవీ ఫ్రిజ్జుల పథకం, ఉచిత బంగారు నగల పథకం, అమ్మాయి పెళ్ళికి ఉచిత కట్నం పథకం, ఉచిత పెళ్లి భోజనాల పథకం, ఉచిత సీమంతం పథకం, ఉచిత పురుడు పథకం, ఉచిత బారసాల పథకం, ఉచిత నామకరణం పథకం, గుండు కొట్టించేందుకు ఉచిత తిరుపతి ప్రయాణం పథకం, ఉచిత స్కూలు పథకం ఎలాగూ ఉంది కాబట్టి, ఉచిత ట్యూషన్ పథకం, స్కూలుకు ట్యూషనుకు వెళ్లి రావడానికి ఉచిత ఆటో పథకం...

నారాయణ, నారాయణ! అన్నీ ఉచిత పథకాలు అయితే ఎలా అమ్మా? అన్నీ ఉచితంగా ఇవ్వడానికి జగనన్నకి డబ్బులు ఎలా వస్తాయి?

చాల్లేవయ్యా, చెప్పొచ్చావు. మా పిల్లోళ్లు అందురూ పల్లెటూర్లో ఉన్నప్పుడే ఉచితపథకాలు ఇచ్చాడు. మొత్తం రాష్ట్రంలో ఉండే పిల్లోళ్లంతా డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అయినప్పుడు దేశం ఇంకా అభివృద్ధి చెందినట్లే కదా? అంటే, ఇంకా బాగా డబ్బు వస్తాది కదా? అప్పుడు మరి కొన్ని ఉచిత పథకాలు పెడతాడు మా జగనన్న.

అద్భుతమైన ఆలోచన అమ్మా. కాని, మీ ఆలోచనలు ఆయనకు తెలియాలి కదా?  ఆయన మళ్లీ పాదయాత్ర చేయడు, మీ మాటలు వినడానికి రాడు.

ఎందుకు రాడు?

ముఖ్యమంత్రి అయినాడు కదామ్మా?  తాను పెట్టిన పథకాలన్నిటికీ డబ్బులు ఎలా తేవాలా అని బిజీ బిజీగా ఆలోచిస్తూ ఉంటాడు.

నేనంత తెలివితక్కువదాన్ననుకుంటున్నావాన్నా? గ్రామ సచివాలయాలు ఉంటాయి కదా? గ్రామవలంటీర్లు కూడా ఉంటారు కదా? వాళ్లని పట్టుకుంటా. పనులు ఎందుక్కావో చూస్తా.

నారాయణ, నారాయణ! (కడుపు నిమురుకుంటూ) అద్భుతం అమ్మా. మీరు పల్లెటూర్లో ఉన్నారన్న మాటేగాని బాగా చదువుకున్న ఏ మేధావులూ మీకు సాటి రారు. అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే, నాయకులు సక్రమంగా పద్ధతిగా అదుపులో ఉంటారు. మీలాంటివారు లేకుంటే ఉచిత పథకాలు పెట్టకుండా ఎగ్గొట్టేస్తారు. మీ లాంటి వారి వల్లే వారి పేరు స్వర్గలోకంలో కూడా మార్మోగిపోతోంది. సరేనమ్మా, నేను వెళ్లొస్తాను మరి.

కాస్త తిని పోదురు గాని, మా ఇంటికి రండి అన్నా.

వద్దమ్మా, నేను వచ్చిన పని పూర్తయింది. దాంతో నా కడుపు నిండిపోయింది. ఆకలేసినప్పుడు మళ్లీ ఎప్పుడైనా వస్తా.

సరేనా. బద్రంగా పొయిరాన్నా.

నారాయణ! నారాయణ!

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...